1, ఆగస్టు 2021, ఆదివారం

ఎవరు స్నేహితులు?

 ఎవరు స్నేహితులు?

స్నేహితుల దినోత్సవ శుభకామనలు.

అసలు స్నేహితులెవరు? ఈ ప్రశ్న నన్ను చాలా కాలం నుంచీ వేధిస్తోంది. స్నేహితుడు అనే మాటకి అర్ధం చెప్పమంటే ఫ్రెండ్ అని చెబితే కాని తెలియని రోజులొచ్చాయి. అసలు స్నేహితుడు/స్నేహితురాలు అనేవారెవరు? ఇప్పుడు ఫేస్ బుక్ లో లైక్ కొట్టేవాళ్ళూ, ట్వీట్ చేసేవాళ్ళూ అంతా స్నేహితులేనా? స్నేహితునికి/స్నేహితురాలికి ఉండవలసిన లక్షణాలేమిటి? అన్ ఫ్రెండ్ అనే మాటకి అర్ధం ఏమిటి? శత్రువనుకోవాలా? అని చూస్తే,

ఇదిగో ఈ శ్లోకం కనపడింది, అవధరించండి.

పాపాన్నివార్యతి,యోజయతే హితాయ,
గుహ్యం నిగూహతి,గుణాన్ ప్రకటీకరోతి,
ఆపద్గతం చ న జహాతి,దదాతి కాలేః
సన్మిత్రలక్షణం మిదం ప్రపదన్తిసన్తః……భర్తృహరి.

అఘమువలన మరల్చు హితార్ధకలితు
జేయు, గోప్యంబు దాచు బోషించు గుణము
విడువడాపన్ను, లేవడివేళ నిచ్చు
మిత్త్రు డీలక్షణంబుల మెలగుచుండు…..లక్ష్మణ కవి.

చెడుపనులనుంచి రక్షించుట,మంచిపనులకు ప్రోత్సహించడం, రహస్యాన్ని దాచిపెట్టడం, కష్టంలో వదలిపెట్టకపోవడం,లేని సమయంలో సొమ్ము ఇచ్చి ఆదుకోవడం, ఇవి సన్మిత్ర లక్షణాలు అన్నారు కవిగారు.

పాపాన్నివార్యతి అంటే పాపం చేయడం నుంచి వారించాలి. పాపం, తప్పుచేస్తే కలుగుతుంది. తప్పునుంచి మళ్ళించడం సాధ్యమా? ఎవరైనా చెప్పగలరుకాని చేయించలేరు కదా! ఒంటరిగా ఉన్నప్పుడు తప్పులు తక్కువ జరుగుతాయి, మందలో ఉంటే….”పబ్బుకెళదాం రావే!” ”అమ్మో! రాను”, ”వాడిదేం కరిగిపోదు, నీదేం అరిగిపోదులే! ఒక్కరోజు పబ్బుకెళ్ళినంతలోనే పాతివ్రత్యం పోదులే”, ఇదెవరిమాట? నీతి మీద అసలు నియమం లేనివారిది. దీనికి తోడెక్కువుంటుంది, మిగతావారు భజన చేస్తారు. మంచిమాట వినరు గాని చెడ్డమాటకి ఊపెక్కువ. రాను అని చెప్పగలిగినవారెంతమంది ఉంటారు. ”ఒకసారికే కదా!” మానవ బలహీనత, ”ఆ( ఎవరు చూసారు లెద్దూ, ఎవరిగోలవారిది”, ఇది సమర్ధింపు.. తప్పు, ఒక సారి మొదలు, తరవాత అలవాటు, ఆ తరవాత వ్యసనం. దీనినుంచి రక్షించేవారుండరు. అసలెవరు చూశారు? మనల్ని ఎవరు పట్టించుకుంటారు! ఇది మనల్ని మనం మోసం చేసుకోడం. మనకెందుకుపోనిద్దూ ఎవరిష్టంవారిది అనుకుంటారంతే, ఎవరూ తప్పని చెప్ప సాహసించరు.. మారీచుడు కూడా సులభా పురుషా రాజన్ అని ఎప్పుడు చెప్పేడు? నిన్ను చంపుతా వెళ్ళకపోతే అన్నపుడు కదా! బాగున్నంతకాలం హాయి, హాయ్ అనేసుకుంటే పోలా! ఉన్నమాట చెప్పి విరోధమెందుకు తెచ్చుకోడం అనుకునేవారే హెచ్చు. ఇదీ మానవ బలహీనతే. వేమనతాత ఏమన్నారు

వేరు పురుగుజేరి వృక్షంబు జెరచును
చీడ పురుగు చేరి చెట్టు జెరచు
కుత్సితుండు జేరి గుణవంతు జెరచురా
విశ్వదాభిరామ వినురవేమ.

వేరుపురుగు చేరితే ఎంత పెద్ద వృక్షమైనా చచ్చిపోతుంది. చాలాపెద్దదాన్ని వృక్షం అని చిన్నదాన్ని చెట్టు అని అంటారు. ఎంత పెద్దదయిన వృక్షాన్నయినా చిన్న వేరుపురుగు చంపేస్తుంది,తల్లి వేరు కొరికేసి జీవనాడి లేకుండా చేస్తుంది..దానితో వృక్షమైనా చస్తుంది. చీడ పురుగుచేరితే చెట్టు చెడుతుంది, చచ్చిపోదు, చీడపురుగు చెట్టుని పాడు చేస్తుంది.. చెడ్డవాడు మంచివాడిని పాడుచెయ్యడానికే చూస్తాడు, అదివాడి నైజం, నైజ గుణానికి లొట్టకంటికీ మందులేదని సామెత కదా! అందుచేత పాపాన్నుంచి రక్షించే స్నేహితుడు కావాలి.

యోజయతే హితాయ స్నేహితుని మంచిగురించి ఆలోచిచాలంటారు, జరిగేమాటా? ఎవరి స్వార్ధం వారిదే! మరొకరిగురించి ఆలోచనే కనపట్టంలేదు. పొరబాటు జరిగిందేమోనని, అది ముందు జీవితానికి మంచిది కాదేమోనని, ఒకరికి ఒకమాట చెప్పేను, వారికామాట నచ్చినట్టులేదు, మాటాడటమే మానేశారు. ఇప్పుడు ఎవరు ఎవరిగురించి ఆలోచిస్తారు? ఇక ముందు నేనెవరైకైనా చెబుతానా, ఈ అనుభవంతో?

గుహ్యం నిగూహతి, రహస్యాన్ని కాపాడాలన్నారు, ప్రతిజీవితంలోనూ కొన్ని రహస్యాలుంటాయి, తెలిసినవారు వాటిని పదిమందిలో చెప్పకూడదు, కాని నేడు జరుగుతున్నది దానికి వ్యతిరేకమే. ఇంతకుమించి చెప్పుకోడం బాగోదు. కావాలని తప్పులు చేయించి వేధించేవారే కనపడుతున్నారు. రహస్యాన్ని కాపాడే స్నేహితులు కావాలి.

గుణాన్ ప్రకటికరోతి, మిత్రునిలో ఉన్న సుగుణాన్ని పదిమందిలో చెప్పాలన్నారు, ఇప్పుడు జరుగుతున్నదేంటీ? అందరిలో ”మావాడుట్టి వెధవాయండీ” అన్నట్టు మాటాడి, ఒకరూ ఉన్నపుడు, నిజంగా నువ్వు చాలా గొప్పవాడివి, నీకు తగిన గుర్తింపురాలేదనేవారే కనపడుతున్నారు. దీన్నే ముడ్డి కాల్చి ఉప్పు పెట్టడం అంటారు. ఎవరిడబ్బా వారు కొట్టుకోడానికే సమయం చాలటం లేదు, మరొకరి గొప్ప చెప్పే పెద్దమనసున్నవారు కావాలి.

ఆపద్గతం చ న జహాతి, ఆపదలో ఉన్నప్పుడు వదలిపెట్టకూడదు. దీని గురించిన టపాలే రాశాను. ఒకప్పుడు ఒక ఆఫీసర్ గారితో గొడవొచ్చింది, నాకు. అది తెలిసినది మొదలు నా స్నేహితులంతా నాతో మాటాడటమే మానేశారు. అంతా బాగున్న కాలంలో హాయ్ హాయ్ అన్నవారే నావల్ల ఉపకారం పొందినవారే.. ఒక స్నేహితుడు మాత్రం ”ఒరే బాధపడకు, రోజులిలాగే ఉండవు, నువ్వు ధైర్యవంతుడివి, నువ్వు చేస్తున్నపని తప్పుకాద”నేవాడు, నిన్న మొన్న మాటాడి, జ్ఞాకానికొచ్చావు, రాత్రి పదిగంటలవేళ, పడుకుని ఉంటావని పిలవలేదని, ఉదయమే మాటాడేడు.

దదాతి కాలేః, ప్రపంచంలో గొడవలన్నిటికి మూలకారణం కాంతా కనకాలే, సొమ్ముకావలసివచ్చి అడుగుతాడేమోనని పారిపోయేవారే ఎక్కువ. ధనమూలమిదం జగత్. ఇదే సత్యం…డబ్బుంటే అందరూ స్నేహితులే, చుట్టాలే…లేకపోతే ఒక్కడు కనపడడు.

ఎప్పుడు సంపద కలిగిన
నప్పుడె బంధువులు వత్తురది యెట్లన్నన్
దెప్పలుగ జెరువునిండిన
గప్పలు పదివేలు చేరు గదరా సుమతీ…
సొమ్ములున్నపుడు అందరూ చుట్టాలే, అందరూ స్నేహితులే, ఎలా వస్తారటా? కవి చమత్కారంగా చెప్పేరు, నిండా నీరున్న చెరువులోకి కప్పలు చేరినట్టనీ, బలే ఉపమానం, నీరుతగ్గిపోతే కప్ప ఒక్కటీ కనపడదు, అలాగే సొమ్ము తగ్గిపోతే ఒక్క బంధువూ, స్నేహితుడూ కనపడడు.

ఇలా కవిగారు చెప్పిన మంచిగుణాలున్న వారు స్నేహితులుగా దొరుకుతారా? అసలు ఆ స్నేహితులు, మన చుట్టూ అలా ఎందుకు తిరగాలి, ఇన్ని ఉపకారాలు చేస్తూ? ఇన్ని సుగుణాలూ ఒకరిలో ఉంటాయా? అసలు ఇటువంటి స్నేహితులు కావాలనుకుంటే, మనలో ఈ మంచి గుణాల్లో ఎన్నుండాలి? మనలో మంచి గుణాలు లేక మంచివారు స్నేహితులుగా ఎలాదొరుకుతారు? అంటే ముందు మనలో మంచిగుణాలు, కవిగారు చెప్పినవి కొన్నయినా ఉండాలి కదా! అబ్బా! కవిగారెంత డొంకతిరుగుడుగా చెప్పేరో చూడండి, ఇటువంటి గుణాలుండాలిరా అబ్బీ అంటే ఎవరు వింటారు? 🙂

ఇటువంటి స్నేహం ఎలా ఉండాలి, మొదలవాలి?

ఆరమ్భగుర్వీ క్షయిణీ క్రమేణ లఘ్వీ పురావృద్ధిముపైతి పశ్చాత్
దినస్య పూర్వార్ధ పరార్ధభిన్నా ఛాయేవ మైత్రీ ఖల సజ్జనానామ్……..భర్తృహరి.

మొదలు చూచిన కడుగొప్ప పిదప గుఱుచ
యాది కొంచము తర్వాత నధికమగుచు
దనరు దినపూర్వపరభాగ జనితమైన
చాయపోలిక గుజన సజ్జనులమైత్రి…..లక్ష్మణ కవి.

మొదట ఎక్కువగానూ తర్వాత చిన్నదైపోయే, మొదట చిన్నదిగానూ ఆ తరవాత పెద్దదయే,ఉదయ, మధ్యాహ్న కాలాలలో ఉండే మన నీడలా, దుర్జనుల, సుజనులతో మైత్రి ఉంటుంది.

ఉదయపునీడ పెద్దదిగా ఉండి మధ్యాహ్నానికి మనమీదనే పడుతుంది, అంటే పొడవు తగ్గి, తొందరగా మొదలయే స్నేహాలు, అలాగే వదలి ఉండలేనట్టుగా మొదలయి, తొందరగానే ముగుస్తాయి,అదే మంచివారితో స్నేహం మధ్యాహ్నపు నీడలా చిన్నదిగా మొదలయి సాయంత్రపు నీడలా పెరుగుతుంది. సూర్యుడు అస్తమించినపుడు నీడ అస్తమించినట్లు, ఆ వ్యక్తులు అస్తమించిన తరవాతనే ఆ స్నేహమూ అస్తమిస్తుంది. అదీ అలా ఉండాలి స్నేహమంటే. లేకపోతే

కూరిమిగలదినములలో
నేరములెన్నడును గలుగనేరవు, మఱి యా
కూరిమి విరసంబైనను
నేరములే తోచుచుండు నిక్కము సుమతీ…

స్నేహం ఉన్నకాలంలో వారే వీరు, వీరేవారు చెప్పడమే కష్టం,ఎవరెవరో. ఆ స్నేహం కాస్తా విరిగింది, కారణం ఏదయినాకావచ్చు, చిన్నదే అయిన కారణం కూడా పెద్ద భూతం లా పెద్దదిగానూ కనపడచ్చు, అప్పుడు ఎవరు మాటాడినా రెండవవారికది తప్పుగానే తోస్తుంది, ”వెధవ! వాడిపాపాన వాడేపోతాడు” అని తిట్టుకుంటూ

30, జులై 2021, శుక్రవారం

పరుగెట్టి పాలు తాగేకంటే

 పరుగెట్టి పాలు తాగేకంటే నిలబడి నీళ్ళు తాగడం మంచిది.....కాదు.


సాధారణంగా పరుగెత్తి పాలు తాగేకంటే నిలబడి నీళ్ళు తాగడం మంచిది అని చెబుతారు, కాని దీనిని పరుగెట్టి పాలు తాగేకంటే నిలబడి నీళ్ళు తాగడం మంచిది కాదు అని కూడా చెప్పచ్చు.


పరుగెత్తి పాలు తాగేకంటే నిలబడి నీళ్ళు తాగడం మంచిది.

దీనితో పాటు ఈ నానుడులు కూడా చెప్పుకోవచ్చు. మబ్బుల్లో నీరుచూసి ముంత ఒలకబోసుకున్నట్టు అని,ఒక ఆంగ్ల సామెత A bird in hand is better than two in bush

ఒక ఉదాహరణ: ఊళ్ళో ఉద్యోగం, స్వంతీంటిలో కాపరం, కడుపులో చల్ల కదలకుండా రోజు నడుస్తోంది,ఎలా కర్చు పెట్టుకున్నా పాతిక మిగులుతోంది, నెలకి.  విదేశీ సావకాశం వచ్చింది, అక్కడికెళితే, వచ్చేది, ''వేసిన వత్తికి పోసిన చమురు హాని హానిగా సరిపోతుందన్నట్టు'' ఉంటుంది.అంత దానికి విదేశం పోవడం మేలా? అప్పుడు ఈ నానుడి చెప్పచ్చు. ఆతృతతో నిర్ణయం తీసుకోకు,

 ఆనందంలో మాటివ్వకు, కోపంలో మాటాడకు. ఇచ్చిన మాట తిరిగిపోకు అన్నది ఇదేనేమో!




పరుగెట్టి పాలు తాగేకంటే నిలబడి నీళ్ళు తాగడం మంచిది.....కాదు.

పరుగెత్తిన తరవాత ఏమీ తాగడం మంచిది కాదని ఆరోగ్య శాస్త్రం చెబుతోంది. అలాగే నిలబడి నీళ్ళు తాగడమూ మంచిది కాదంటోంది, ఆయుర్వేదం. అలా నీళ్ళు తాగితే అనారోగ్యం చేస్తుందిట. పరుగెత్తి పాలు తాగడమూ మంచిది కాదు నిలబడి నీళ్ళు తాగడమూ మంచిది కాదు. అదేం కాదంటున్నారు అలోపతీ వైద్యులు, శిఖపట్ల గోత్రం నడుస్తున్నట్టుంది.


26, జులై 2021, సోమవారం

ఆకు కూరల్లో కల్తీ


 courtesy:what's app

ఒక ఆకు కూర పేరు చెప్పి మరొకటి అమ్మెయ్యడమూ, కాయ పెరగడానికి ఇంజక్షన్లు చెయ్యడమూ,నిలవ ఉండడానికి మందులు కొట్టడమూ, ముగ్గించడానికి బేటరీ పెట్టడమూ ఎరుగుదుం, అరటిగెల వేగంగా పెరగడానికి పువ్వు కోసిన తరవాత గుప్పెడు యూరియా ఒక పోలిథిన్ కవర్లో పోసి పువ్వు కోసిన చోట కట్టేస్తే గెల వేగంగా పెరుగుతుంది, ఇటువంటివి ఎరుగుదుంకాని,  ఆకు కూర తాజాగా కనపడ్డానికి ఇలా చేయడం తెలీదు.వినాశకాలే విపరీత బుద్ధిః 

24, జులై 2021, శనివారం

అంబలి తాగేవానికి మీసాలెత్తేవాడు మరొకడు.

 అంబలి తాగేవానికి మీసాలెత్తేవాడు మరొకడు.


ఇదొక నానుడి. గంజి,కలి,అంబలి,తరవాణి,లచ్చించారు ఇవన్నీ గంజి నుంచి వచ్చినవో దాని అనుబంధాలో. గత నూట ఏభై సంవత్సరాల కితం వరకు జనులు వరి అన్నం తిన్నది తక్కువ, గోజిలలో కూడా. కలిగినవారే వరి అన్నం తినే వారు. సామాన్యులు జొన్నలు,రాగులు ,చామలు,కొర్రలు ఇలా చిరు ధాన్యాలే తినేవారు. వరి అన్నం తిన్న రోజు పండగే. దరిద్రులకి గంజే గతి. దీనికో నానుడీ ఉంది. కలిగినవారి బట్టకీ లేని వారి పొట్టకీ గంజే దిక్కు. కలో గంజో తాగి బతుకుతాం లేదా కలో అంబలో తాగి బతుకుతాం అనే మాటలు జనం వాడేవే. వరి అన్నం తిన్నవారు మహరాజులే.కుక్కర్లోచ్చే దాకా గంజి వార్చేవారు. ఆ తరవాత అన్నం వండటం మరచినట్టే, అంచేత గంజి గురించి తెలిసినవారే తక్కువనుకుంటా. నేడు అమెరికన్ ఫుడ్ సొసైటీ 

వారో మరెవరో ఇవన్నీ బలవర్ధక ఆహారాలనీ, రోగ నిరోధక శక్తి కలిగిస్తాయనీ చెబుతున్నారు, ఆ మాటైనా చెవినేసుకునే రోజు కనపడటం లేదు. 


నాటి రోజుల్లో అంబలి,కలి,తరవాణి వగైరాలను నీచంగానే చూశారు. దానికి శ్రీనాథుడే సాక్షి, చల్లా అంబలి తావితిన్, వెల్లుల్లిన్ దిలపిష్టమున్ మెసవితిన్ అని తన దరిద్ర స్థితిని వెళ్ళబోసుకునాడు.


గంజి అంబలి తాగేవారంటే దరిద్రులనే మాట నాడు స్థిరపడిపోయింది.నాటి కాలంలో దరిద్రులైనా మీసాలకి లోటుండేది కాదు, మీసాలంటే నేటిలాగా కత్తెర మీసాలు,సీతాకోక చిలుక మీసాలు కాదు బొద్దు మీసాలేకాదు, బారు మీసాలే ఉండేవి. మరి అంబలి,గంజి తాగినపుడు ఈ మీసాలు అడ్డు పడేవి, తడిసేవి. ఎవరి మీసాలు వారే సవరించుకుని అంబలి తాగే రోజులనమాట. ఈ అంబలి తాగే దరిద్రుని మీసాలు సవరించడానికి మరొకరా? అనేది ఎద్దేవా. అనగా వాడే ఒకరికి తొత్తు ఆ తొత్తుకింద మరొకతొత్తా అదే బడితొత్తు అన్నమాట.


తత్తు కొడక అని తిడతారు తప్పు అది తొత్తు కొడక, తిట్టుకూడా తిన్నగా తెనుగులో చెప్పలేని రోజులైపోయాయి.    




8, జులై 2021, గురువారం

దండం దశగుణం భవేత్.

 విశ్వామిత్రాహి పశుషు - కర్దమేషు జలేషుచ

అంధే తమసి వార్థక్యే - దండం దశగుణం భవేత్.
 
 
పక్షి, కుక్క, శత్రు, పాము, పశులఁ ద్రోల,
చేతి కర్ర మిగుల చేవఁ జూపు.
బురద, నీరు, రేయి, ముసలి, గ్రుడ్డియుఁ గల్గ
చేతికర్ర దాటఁ జేయు మనల?
  
 భావము:-పక్షులు, కుక్కలు, అమిత్రులు, పాములు, పశువులు, వీటిని పారద్రోలుటకున్ను, బురదలో, నీళ్ళలో, చీకటిలో, గ్రుడ్డితనంలో, ముసలితనంలో అవలంబనంగానున్ను, చేతి కర్ర పనికివస్తుంది. అందుచేతనే దండం దశ గుణం భవేత్ అంటారు.

Courtesy: andhraamrutham.blogspot.com/.../blog-post_08.html


దండం అంటే కఱ్ఱ అని అర్ధమట. తెనుగులో దీనిని నమస్కారంగా వాడేస్తాం. కఱ్ఱ ఎందుకు పనికొస్తుందిటా? దండం దశగుణం భవేత్ అంటే  కఱ్ఱ పది రకాలుగా ఉపయోగపడుతుందన్నది మాట.


పక్షులు కుక్కల్ని తోలుకోడానికి,పాములు పశువులనుంచి రక్షించుకోడానికి, అమిత్రులను ఎదుర్కోడానికి, బురద,నీరు ఉన్నచోట చూసుకుని నడవడానికి, చివరగా గుడ్డివారికి ముసలివారికి పనికొస్తుందీ అన్నారు, పెద్దలు. 


 నేటి కాలంలో కఱ్ఱ ఉపయోగించేవారే కనపడటం లేదు. ఇక పశువులు, పక్షులు,పాములు,కుక్కలు చూద్దామన్నా కనపడటంలేదు. కొన్ని చోట్ల మాత్రం వీధి కుక్కలు విచ్చలవిడిగా చిన్న పిల్లల మీద కూడా దాడి చేస్తున్నాయి. వీటిని పడతాం, వాటికి సంతానం కలగకుండా చేస్తాం అంటారు, చేస్తూనే ఉంటారు కాని ఈ కుక్కల జనాభా ఎందుకు పెరుగుతోందో తెలీదు. వీటిని పట్టుకుంటే బ్లూ క్రాస్ వారొస్తారు, అదో పెద్ద కత. ఇప్పుడు పెటా వారు అముల్ మీద దాడి చేస్తున్నట్టు.


అన్ ఫ్రెండ్ అన్నమాట ఫేస్ బుక్కువాడు పుట్టించినదనుకున్నా ఇంతకాలం కాదని ఇప్పుడే తెలిసింది. అమిత్ర పదాన్ని అన్ ఫ్రెండ్ గా తర్జుమా చేసుకున్నారనమాట. అస్తు...అమిత్రుడు అంటే శత్రువే అనుమానం లేదు. 

 నేటి కాలంలో అమిత్రులనుంచి కఱ్ఱతో రక్షించుకోలేం. దీనికి మరి ఇతర సాధనాలే కావాలి. 


ఇక బురద నీరు ఉన్నచోట లోతు చూసుకోడానికి వాడచ్చు అంటారు. వర్షా కాలమొస్తే హైదరాబాదు ముంబాయిల్లో కఱ్ఱ పట్టుకుని నడచిపోవడం మంచిదన్నారు మా మిత్రులొకరు. ఎందుకంటే నదుల్లా ఉన్న రోడ్లమీద 

ఎక్కద తెరిచి ఉన్న మేన్ హోల్ ఉన్నదీ తెలియాలంటే కఱ్ఱ అవసరమే. లేకపోతే మోటార్ సైకిల్ తో సహా తీసి ఉన్న మేన్ హోల్ లో పడి చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. 


నిజం చెప్పాలంటే నేటి రోజుల్లో కఱ్ఱ ఒక్క గుడ్డివారు మాత్రమే వాడుతున్నారు. ఇచ్చిన ఆర్డర్ లో విషయం వివరంగా క్లారిఫికేషన్ కి వ్రాశాం వచ్చేకా అమలు చేసాతమనేవారికీ కఱ్ఱ అవసరమేమో! అధికారం రాగానే కళ్ళు చీకట్లు కమ్ముతాయనుకుంటా!


  ఇక ముసలివారు కఱ్ఱ వాడటం నేటి కాలంలో చిత్రమే. నడుస్తూ డిపోవడం పెద్ద వయసులో సహజం.పడిపోకుండా రక్షణకి కఱ్ఱ వాడాలి. నేను కఱ్ఱ వాడుతాను అదికూడా చిన్న వాకింక్ స్టిక్ కాదు, పెద్ద కఱ్ఱే.నన్ను చూచి నవ్వుతారు,ఎగతాళిగా.  పోనీలే వాళ్ళ పళ్ళే బయటపడ్డాయనుకుంటా.   


   చతుర్విధ ఉపాయాలన్నారు. అవి సామ,దాన,భేధ,దండో పాయాలు. సామం, మంచిమాట చెప్పి పని చేయించుకోడం. దానం పని చేయించుకోడానికి మూల్యం చెల్లించడం. కాని దీనికి పెడర్ధం తీసి ఆమ్యామ్యా ఇచ్చి పని  చేయించుకోడంగా చెబుతున్నారు. భేదం అన్నది శత్రుదేశం పట్ల ఉపయోగించవలసినది. శత్రువులపట్ల ఉపయోగిస్తున్నారు. అంటే మన శత్రువుతో ఉన్న వారి మిత్రుల మధ్య భేదో పాయం ఉపయోగించడం. ఇదంత తేలికైన విద్య కాదు. ఇక ఏవీ పని చెయ్యనప్పుడు తప్పక ఉపయోగించవలసినదే దండో పాయం.ఇది నేటికి చాలా రకాలు, కంప్లయింటు నుంచి మొదలు.......కేస్ ఎప్పటికి తేలేను? అది కోర్ట్ కెళితే తేలేటప్పటికి బతికుంటామా అనుమానమే. అందుకే తక్షణ న్యాయం....దండోపాయం. 


5, జులై 2021, సోమవారం

అనుమానం పెను భూతం

      అనుమానం పెను భూతం పెద్ద సంకటం


ఏ కఱ్ఱని నిప్పుంటే ఆ కఱ్ఱే కాలుతుంది.


నిజం నిలకడమీద గాని తెలియదు.


తనకోపమె తన శత్రువు 

తన శాంతమె తనకు రక్ష 

దయ చుట్టంబౌ


ఆత్మ స్తుతి పరనింద ఆత్మహత్యా సదృశాలు.


అకారణ వైరం అకారణ ద్వేషం ఆత్మ వినాశకాలు.


శత్రువు కూడా క్షేమంగా ఉండాలి.


ఊరుకున్నంత ఉత్తమం బోడి గుండంత సుఖం లేదు.


ఐనవారికి ఆకుల్లోనూ కాని వారికి కంచాల్లోనూ.......లోక తీరు.


అసత్యం రుచించినంతగా సత్యం రుచించదు.


సంతోషము సగము బలము.


ఎంత చెట్టుకు అంత గాలి.

 

చేరి మూర్ఖుల మనసు రంజింప రాదు.










30, జూన్ 2021, బుధవారం

ఇంటి దగ్గర సుగరు/బి.పి చూసుకోవడం

 ఇంటి దగ్గర సుగరు/బి.పి చూసుకోవడం

ఒకప్పుడు సుగర్ చూడాలంటే ఉదయమే లేవగానే మూత్రం పట్టి దానిని డాక్టర్ దగ్గరకి పట్టుకెళితే పరిక్ష నాళికలో పోసి వెచ్చచేసి బెనిడిక్ట్ సొల్యూషన్ వేస్తే ఆ మూత్రం రంగు మారేది, ఆ రంగు నీలంగా ఉంటే సుగర్ లేనట్టూ, ఇటుక రంగు వస్తే ఎక్కువున్నట్టూ, ఇలా రంగులనిబట్టి ఎంత సుగర్ ఉన్నదీ చెప్పేవారు. ఇది ఆ తరవాత కాలంలో అవసరాన్ని బట్టి ఇంటి దగ్గరే చేసేవాళ్ళం. రోజులు మారేయి, ఒక రక్తపు చుక్కతో సుగర్ చెప్పేరోజులొచ్చాయి. ఇందులో కూడా తేడాలు. ఒకప్పుడు ఒక సి.సి రక్తం తీసుకుని టెస్టు చేసేవారు, ఇప్పుడు ఒక చుక్కచాలు.ఆ రోజుల్లో లేబ్ లు లేవు, నేడు లేబ్ లు చాలా ఉన్నాయి. కరోనా కాలంలో సుగరూ బిపి లు చూసుకోవడానికి లేబ్ వారిని రమ్మన్నా,వెళ్ళినా ఒకటే :) అందుచేత ఇంటి దగ్గరే సుగర్ టెస్టు చేసుకునే విధానం ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. ఈ సాధనాలు చాలాకాలం కితమే ఉన్నా వీటి అవసరం ఇప్పుడు బయట పడింది, ఎందుకూ, కరోనా తో మనిషిని చూస్తే భయం మూలంగా


సుగర్ చూసుకునే మిషన్ని గ్లూకో మీటర్ అంటారు. చాలా కంపెనీలు తయారు చేస్తున్నాయి, కొన్ని ఉచితంగా కూడా ఇస్తున్నాయి.లాభం లేందే సెట్టి వరదని పోడని సామెత. ఈ మీటర్ ఊరికే వచ్చినా ఇందులో టెస్టుకోసం ఉపయోగించే స్టిక్కులు కొనుక్కోవాలి, అదీ అసలు సంగతి.ఈ meter ఖరీదు తక్కువే పదేను వందలలోపు, స్టిక్కులు మాత్రం ఒక్కోటి పన్నెండు రూపాయలపై మాట. 


ఇక బి.పి ఇది పది నిమిషాల వ్యవధిలోపలే రీడింగ్ మారిపోతూ ఉంటుంది.ఐతే సిస్టోలిక్ మారుతున్నా డైస్టోలిక్ అంత వేగంగా మారదు. దీనికీ మీటర్ దొరుకుతున్నాయి. ఇప్పుడు డాక్టర్లు బి,పి చూడటం లేదు, ఆటొమేటిక్ డిజిటల్ బి.పి మీటర్ తో నర్సులే చూస్తున్నారు, ఫలితం నోట్ చేస్తారు, డాక్టర్ చూస్తారు. దీనిని ఇంటీ దగ్గరె చూడచ్చు. మీటర్ ఉన్నదని అస్తమానమూ చూస్తే గాభరా పుడుతుంది.ఇది కూడా ఐదు వేలలోపే ఖరీదు. అనుమానం తీర్చుకోడానికి పనికొస్తుంది, అంతే. రీడింగులు చూసి గాభరా పడద్దు.


ఇక అసలు విషయానికొస్తే ఏ రెండు మీటర్లూ ఒకలా చూపవు.ఇక ఈ సుగర్ మీటర్ సంగతి, మన దగ్గర మీటర్ ఎక్కువ రీడింగ్ చూపుతుంది, లేబ్లో మీటర్ తక్కువ చూపుతుంది. మోసంకాదా అనిపిస్తుంది,ఆవేశపడ్డాకూడా. తెలిసినవారు విషయం వివరించినది చెబుతా. మనం తీసుకునే రక్తపు చుక్క ధమనులనుంచి వచ్చే రక్తం. లేబ్లో టెస్ట్ కోసం మన దగ్గర తీసే రక్తం సిరల నుంచి.ధమనుల్లో రక్తంలో గ్లూకోస్ శరీర చివరి భాగాల దాకా అందిస్తుంది కదా! దానిలో గ్లూకోస్ ఎక్కువ ఉంటుంది, సిరలలో రక్తంలో అది తక్కువ ఉంటుంది. సిరలలో రక్తం ఎందుకు టెస్ట్ చేస్తారు? చెప్పలేను. ఇలా ఈ తేడా ఎంతా అన్నది తెలియాలంటే లేబ్ కి రక్తం ఇచ్చిన వెంటనే మనమూ మన దగ్గర మీటర్ తో చూసుకుంటే తేడా తెలుస్తుంది. ఇది సాధరణంగా 20'% ఉంటుందంటారు. కాని నా అనుభవం 38% తేడా ఉంది, మరి రెండు మూడు సార్లు తేడా గమనించాలి. 


ఇక బిపి మీటర్లో ఈ తేడాలు గమనించలేం.కాని బిపి తీసుకునే ముందు జాగ్రతలూ తెలిసినవే చెబుతా. నడచిన వెంటనే, సైకిల్ తొక్కిన వెంటనే, భోజనం, టిఫిన్ చేసిన వెంటనే బిపి ఎక్కువ ఉంటుంది.ఇక మాట్లాడుతూ బిపి చూసుకుంటే ఎక్కువ ఉంటుంది. కుర్చీలో కూచుని కాళ్ళు కత్తెరేసి కూచుంటే బిపి ఎక్కువ చూపుతుంది. అంతెందుకు మీ చేతికి కట్టే బేండు వదులుగా కడితే బీపీ పరిగెడుతుంది. అందుచేత మీ శరీర పరిస్థితి గమనించుకోవాలి. అవసరాన్ని బట్టి డాక్టర్ని సంప్రదించాలి. కంగారు పడిపోకూడదు సుమా!ఈ రీడింగులు చూసుకుని మందులు మానెయ్యడం డోసులు మార్చేసుకోడం చేయకూడదు, ప్రమాదం తెచ్చి పెడతాయి. తస్మాత్ జాగ్రత.


28, జూన్ 2021, సోమవారం

వరదలో

 


Courtesy:Quora.com

వరదలో చిక్కుకున్న ఈ భవంతి ఎక్కడిదో తెలియదు. కోనసీమ లంకలలో ఇళ్ళు గోదారి వరదకాలంలో ఇలాగే ఉంటాయిగాని ఈ బందోబస్తు ఉండదు.

25, జూన్ 2021, శుక్రవారం

కరోనా కాలం-కష్ట కాలం.

  కరోనా కాలం-కష్ట కాలం.

కితం సంవత్సరం ఫిబ్రవరిలో మొదలైన కరోనాతో కాలు బయట పెట్టేది లేక లాక్ డవున్ లో లాకప్ లో ఉండిపోయాం. అప్పటినుంచి ఇల్లు వదిలిందే లేదు. బయటికొస్తే చంపుతానంటోంది కరోనా, లోపలుంటే మా మాటేంటీ అని నస పెడుతున్నాయి ఆస్థాన విద్వాంసులు,సుగరు,బి.పి లు.. కొన్నాళ్ళు జోకొట్టినా తరవాత కాలంలో డాక్టర్ ని కలవక తప్పటం లేదు. అక్కడా గుంపులే ఎవరి బాధ వారిది,తప్పదు కదా! టెస్టుకి వెళ్ళిన ప్రతిసారి భయం,బ్లడ్ తీసేవాడినుంచే సోకుతుందేమోనని భయం.  భయమే చంపేస్తుందేమో చెప్పలేనిది.

ఎంత నిబ్బరంగా ఉందామన్నా పరిస్థితులు చూస్తుంతే నీరుగారిపోతున్నాం.ఇక మేధావుల మాటలకి అంతే లేదు. మూడో పొర  వస్తుంది పిల్లలని చంపుతుంది...ఇది జాగరత చెప్పినట్టు లేదు, భయపెడుతున్నట్టే ఉంది..ఇక మందులు జాగరతలు చెప్పే వారికి అంతులేదు, పాపం వీరంతా మందికి మంచి జరగాలని చెప్పేదే! ఆనందయ్య మందు ఎక్కడికక్కడ తయారు చేసి పంచిన వారున్నారు.కరోనాకి చిక్కి బయటపడిన వారు సర్వం దానం చేసినవారున్నారు, ప్రాణావసరమైన మందులు ఇతరాలు దాచి విపరీత ధరలకి అమ్ముకున్నవారున్నారు.కరోనా ఎదురింటికి వచ్చి ఆగింది.


 ఇక ఎండ కష్టాలు చెప్పేదేంటి, పాత పాటే కదా! వద్దనుకుంటూనే ఏ.సిలో వాసం,ప్రతి నిమిషం భయం, కరోనా ఎదురింటి దాకా రావడంతో.....ఆగిపోయింది మా జీవన స్రవంతి, గేటు తాళం తీసి బయట కాలు పెట్టలేదెవరమూ...ఇక నెట్ లోకి కూడా రాలేదు కీ బోర్డ్ చెడిపోడంతో. 


ఏప్రిల్ మే, జూన్ నెలల్లో చాలా మంది మిత్రులు/అమ్మలు  వాట్సాప్ లోనూ మైల్ లోనూ పలకరించి ధైర్యం చెప్పినందుకు ధన్యవాదాలు,నమస్కారం. నా ఫొన్ నంబర్ దొరక్క వెతికి వెతికి అబ్బాయితో మాటాడి నా కుశలం కనుక్కున్న ప్రియ శత్రువుకి నమస్కారం.టపా రాదామనుకుంటే కీ బోర్డ్ చెడిపోయింది. బ్లాగు మొదలెట్టిన తరవాత మార్చిన ఆరో కీ బోర్డిది. 


ఏప్రిల్ నెల తరవాత కరంటు రీడింగ్ తీయలేదు. అసలే వేసవి, మా దగ్గరైతే వేడి 41 పై  మాటె. ఎంతకాదనుకున్నా ఏ.సి తప్పలేదు.. మొన్న రెండు నెలల బిల్లూ ఒక సారి చేతిలో పెట్టేటప్పటికి కళ్ళు తిరిగాయి. 

 వాడుకున్నదే కాని ఒక్కాసారిగా కట్టాలంటేనే  బాధ.బంగారు పళ్ళేనికి కూడా గోడ చేరుపు కావాలి కదా! డబ్బులకోసం అప్పుకెళ్ళేలా కూడా లేదు, ధాన్యం అమ్మి నెలపైగా ఐనా ప్రభుత్వం నుంచి సొమ్ములూ రాలేదు.కరంటు బిల్లు కట్టడం ఆలస్యమయ్యేలా ఉంది..


జూన్ పదేనుకి కూడా ఇంకా కాలవ రాలేదన్నాడు అబ్బాయి.నిన్ననొచ్చిందని చెప్పేడు, ఇక హడావుడి, పెట్టుబడికి సొమ్ములు అవసరం...కరోనా ఉండగా ఇది మూడో పంట పూర్తిగా మాసూలు కావడం. నాలుగో పంట వేయబోతాం. కరోనా మొదలయ్యేనాటికి కూలిపనికి ఐదొందలు. ఆ తరవాతది నెమ్మదిగా పైకి పాకి ఇప్పుడు రోజుకి వెయ్యికి చేరుకుంది.పంట దిగుబడి పెరగలేదు, పెట్టుబడిలు పెరిగిపోయాయి.వ్యవసాయం లో మిగిలినది ఏమీ లేకపోయినా గింజలు పండించి ఇచ్చామనే తృప్తి మిగిలింది. ఏమీ మిగలకపోతే ఎందుకు వ్యవసాయం చేయడం అడగచ్చు, ఇదొక వ్యసనం, మరే పనీ చేతకాదు, మరొకరికి తిండికి గింజలిచ్చిన తృప్తే మాకు మిగిలుతోంది.


కరోనా తో కలిగినవారికి బాధ లేదు, లేనివారికీ బాధ లేదు, మధ్య తరగతి వారే మాడిపోతున్నారు. కొంతమంది రోజు కూలికి వెళుతున్నారు. అలవాటు లేని పని కావడంతో బాధ పడుతున్నారు. ఇందులో ముఖ్యంగా ప్రయివేటు స్కూళ్ళ టీచర్లున్నారు.కరోనా టికాలు జోరుగా వేస్తున్నారు, పల్లెలలో వెతికి మరీ వేస్తున్నారు.


బడికెళ్ళే పిల్లల స్థితి అధ్వాన్నంగా ఉంది. శారీరకంగా పోల్చుకోలేనంతగ మారిపోయారు, బయటికి వెళ్ళినది లేదు, ఆట లేదు పాట లేదు ఆన్ లైన్ చదువు నడుస్తోందంతే. బడులు తీస్తామంటారొకపక్క,కరోనా మూడో పొర పిల్లల పాలిట గండమంటారు మరో మేధావి, పిల్ల ని మానసికంగా హింసించేస్తున్నారు. బడులు తీసినా పిల్లలు వెళ్ళేందుకు భయపడుతున్నారు, తల్లితండ్రులూ బడికి పంపేందుకు భయపడుతున్నారు, పిల్లలు బతికుంటే అంతే చాలనుకుంటున్నారు.  ఆడపిల్లలు మగపిల్లలకి పెళ్ళిల్లు వెనకబడిపోయాయి.


15, జూన్ 2021, మంగళవారం

కోటి విద్యలూ కూటి కోసమే

 

Coutesy:What's app

కోటి విద్యలూ కూటి కోసమే
  
https://youtu.be/wd1Aijoki50

ధర్మమ్ చై బాబు కానీ
ధర్మమ్ చై బాబు
ధర్మమ్ చేస్తే పుణ్యమొస్తది ఖర్మ నసిస్తది బాబూ ధర్మమ్ చై బాబు
కోటి విద్యలూ కూటి కోసమే పూటే గడవని ముష్ఠి జీవితం
అరణా ఒరణా రెండణా కాలణా 
నీ చై పైన నా చై కింద ఇచ్చి పుచ్చుకును రుణమే బాబు
కవిగారు ఏం చెప్పేడండీ
కోటి విద్యలు కూటి కోసమన్నాడు,ధర్మానికి లిమిటూ లేదు అర్ధణా, ఒకణా,రెండణాలు, ఫొనీ లేవయ్యా అంత ధర్మం చై లేకపోతే ఓ కాణీ. ఇప్పుడు నువ్విస్తున్నావేమో నేను తీసుకుంటున్నా కాని ఇదంతా నువ్వు చేసుకున్న రుణం తీర్చుకోడమే సుమ్మా...వారెవా ఏం జబర్దస్తీ  
రేలంగి (Self) పాడిన పాట వినండి


14, జూన్ 2021, సోమవారం

సామాన్య పొరపాట్లు

  https://tappoppulu.irusu.in/

link courtesy:whats app

అంతా తెనుగులో చదువుకున్న(న్నా)వారమే కాని రాసేటప్పుడు కొన్ని (పొరబాట్లు)పొరపాట్లు (దొల్లు)దొర్లుతాయి. అ(వే)వేంటో చూదాం.పై లింక్ లో చూడండి.

12, జూన్ 2021, శనివారం

మెదడుకి మేత

 Solve this puzzle:it is tough one.Take your time

Here is a list showing the month and a number to each month.

January 71313

February 82382

March 53113

April 54203

May 35113

June 46203

July 47113

August 68313

Decipher the logic and find the number for September=?

Challenge O P E N  for  all

Brilliant brain scratching exercise.

Courtesy :Whats app.


10, జూన్ 2021, గురువారం

మృత్యుర్మృత్యుమ్ నమామ్యహమ్

  ఉగ్రం వీరం మహావిష్ణుం

జ్వలంతం సర్వతో ముఖమ్

నృసింహం భీషణం భద్రం

మృత్యుర్మృత్యుమ్ నమామ్యహమ్


శ్రీమనృసింహ విభవే గరుడధ్వజాయ,

తాపత్రయోపశమనాయ, భవఔషధాయ,

తృష్ణాది, వృశ్చిక, జలాగ్ని, భుజంగ, రోగ,

క్లేశవ్యయాయ హరయే గురవే నమస్తే 







15, ఏప్రిల్ 2021, గురువారం

నీకూ తప్పలేదా మహదేవా?

Coutesy:What's app



  ముఖం మీద అలక కనపడుతుండగా కుడి చేత పైట కొంగు బిగించి కనులువాల్చి నిలచిన అంబను, తన కుడి చేయి అంబ గెడ్డం కింద ఉంచి బ్రతిమాలుతున్నశంకరుడు. అంబా శంకరులకు మ్రొక్కెద.. 

 

అలుక మానవే చిలుకల కొలికిరో....నీకూ తప్పలేదా మహదేవా?

13, ఏప్రిల్ 2021, మంగళవారం

2, ఏప్రిల్ 2021, శుక్రవారం

29, మార్చి 2021, సోమవారం

లాలలు పోసుకుని...


 courtesy:Whats app


 ఒంటికి నువ్వులనూనెరాసి మర్దించి,సున్నిపిండి నలుగుబెట్టి, కుంకుడు కాయతో తల ఒళ్ళు రుద్ది, తల తుడిచి, ముక్కులలో చెవులలో తిరిబెట్టి,సాంబ్రాణి పొగవేసి, తల్లి చేతికిస్తే, కడుపు నిండా పాలుతాగిన బిడ్డడు, ఆదమరచి ఉయ్యలలో నిదురించే రోజు రానుందా? 

20, మార్చి 2021, శనివారం

90/140......140/90

 90/140.........140/90

 రోజుకు 10,000 అడుగులు.



 అంకెల చుట్టూ ఆరోగ్యం తిరుగుతోందా?

ఆరోగ్యం చుట్టూ అంకెలు తిరుగుతున్నాయా?

ఆరోగ్యం చుట్టూ వ్యాపారం తిరుగుతోందా?

వ్యాపారం చుట్టూ ఆరోగ్యం తిరుగుతోందా?

========

Diabetes and hypertension are the ailments of the world. 

1 set. 90/140

90:: is the the glucose level to be maintained in fasting blood I. e 90mg/dL

140:: is the glucose level to be maintained in blood after taking tiffin but after 90 to 120 minutes after taking tiffin. 140mg/dL.

=====

2 ND  set of 140/90

140 is the systolic pressure or the pressure which is maintained in arteries while the heart is pumping blood. 

90 is the dystolic pressure or the pressure of blood to be maintained in the nerves during the time between lab and dub of the heart. 

===

10,000 steps recommended per day to keep health.

====


15, మార్చి 2021, సోమవారం

వేసవి-దాహం-చిట్కా.

 వేసవి-దాహం-చిట్కా.


వేసవి పరిగెత్తుకొస్తోంది, దాహం సహజం, ఎక్కడపడితే అక్కడ వాటర్ పేకట్లు అమ్ముతూనే ఉన్నారు, కూల్ డ్రింక్ ల సంగతి చెప్పేదే లేదు. వాటర్ పేకట్లు కూల్ డ్రింకులు తాగితే రోగం కొనుక్కు తెచ్చుకున్నట్టే.ఐతే దాహానికో చిట్కా, ఒక బళ్ళారి నీరుల్లిపాయని జేబులో పడేసుకోండి. దాహంగా ఉంది, ఉల్లిపాయ కొరికి నమిలి మింగండి, ఇంకా అనిపిస్తే మళ్ళీ తినండి. దాహం కడుతుంది, దగ్గరలో ఎవరింటికైనా వెళ్ళి కాసిని మంచినీళ్ళియ్య తల్లీ అని అడగండి. దొరకవా? అందుకే నీ మొహానికి నిప్పూ నీళ్ళూ కూడా పుట్టవని తిట్టేవారు, పెద్దాళ్ళు. 


 మరో చిన్న చిట్కా! ఉసిరి పప్పు అని అమ్ముతారు. అదేమంటే ఉసిరి కాయలోని లోపలిగింజల పై దళసరిగా ఉన్న పెంకు. దీనిని ఉప్పులో పోసి ఎండబెడతారు. ఎండిన తరవాత దానితో ఉండే ఉప్పు బహు కొద్ది కొన్ని మైక్రోగ్రాములు, ఈ పప్పు చిన్న ముక్కని నోట్లో వేసుకోండి, మింగెయ్యద్దు, మెత్తబడిపోతుంది,బుగ్గన పెట్టుకోండి, లాలాజలం ఊరుతూనే ఉంటుంది, దాహమే వెయ్యదు. 



ఈ సావకాశం కూడా లేదు, నోరు ఆర్చుకుపోతోంది, ఏం చెయ్యాలి? నోరు తెరవండి, నాలిక బయటికి చాపి రెండు పెదవుల మధ్యనా సున్నాలా చేయండి, ఆ సున్నాలా ఉన్న నాలుకలోంచి నోటితో గాలి పీల్చండి, గుండెల నిండా, నోరు మూయండి, ముక్కుతో గాలి వదలి పెట్టండి, ఇలా రెండు మూడు సార్లు చేయండి, నోటిలో లాలాజలం నూతిలో పడ్డ జలలా ఊరుతుంది, ఏంటి చూసుకున్నారా? వెంటనే దగ్గరలో మంచి నీరు తాగండి, మంచి నీటికి ప్రత్యామ్నాయం లేదు. ఇలా నాలుకను సున్నాలా చేసి గాలి పీల్చి ముక్కుతో వదలి పెట్టడాన్ని శీతలీ ప్రాణాయామం అంటారు. బయట వేడిగా ఉన్న గాలి సున్నాలా ఉన్న నాలుక గుండా పీల్చినపుడు చల్లబడుతుంది, ముక్కు ద్వారా వదలే గాలి వేడిగా ఉంటుంది. నోటితో పీల్చినగాలెందుకు చల్ల బడుతోంది? దీనిలో సైన్స్ ఉందా? చెప్పండి. అత్యవసరంలో తప్పించి ఇదిచెయ్యద్దూ! ఊపిరి తిత్తుల వ్యాధి ఉన్నప్పుడు, రొంపతో ఉన్నప్పుడు అసలు చెయ్యదు, జాగ్రత!

ఫ్రిజ్ లో నీళ్ళెన్ని తాగినా దాహం తీరదు, దానికి తోడు అనారోగ్యం కూడా! ఇలా చేసుకుని చల్లటి నీళ్ళు తాగండి.ఆ తరవాత మీ ఇష్టం. 


 https://kastephale.wordpress.com/2013/05/25/

శర్మ కాలక్షేపంకబుర్లు-మండు వేసవిలో ప్రకృతి సిద్ధమయిన చల్లటి మంచినీళ్ళు.NATURAL FRIDGE.

11, మార్చి 2021, గురువారం

నమః శంభవేచ

 

Courtesy:Whats app

హిమాచల ప్రదేశ్ లోని సోలాన్ లో ఉన్న జటోలి శివాలయం. 



నమః శంభవేచ మయోభవేచ 

నమః శంకరాయచ మయస్కరాయచ 

నమశ్శివాయచ శివతరాయచ. 



5, మార్చి 2021, శుక్రవారం

నిండా ములిగితే

 నిండా ములిగితే


నిండా ములిగినవానికి చలేంటి? అనిగాని నిండా ములిగితే చలేంటీ అనిగాని చెబుతుంటారీ నానుడిని. దీనికి రెండు అర్ధాలూ చెబుతారు. నీళ్ళలో శరీరం సగం ములిగితే చలనిపిస్తుంది, నిండా ములిగితే చలి ఉండదు అనేది ఒక అర్ధం. మరో మాట ఏదో విషయంలో పరిస్థితి పూర్తిగా విషమించి పోయినపుడూ, పూర్తిగా చెయిదాటిపోయినపుడూ, నష్టం తప్పదన్నపుడూ బయట పడి తెగించడమూ చెబుతారు. 


సగం ములిగితే చలేస్తుంది. ఎందుకు? శీతకాలమైనా వేసవి కాలమైనా శరీర ఉహ్ణోగ్రత స్థిరంగా ఉంటుంది 37 C, కాని బయటి ఉహ్ణోగ్రత శీతకాలంలో శరీర ఉహ్ణోగ్రత కంటే తక్కువగానూ వేసవిలో ఎక్కువగానూ ఉంటుంది. నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు అన్నది ఒక నానుడి. నీరు పల్లానికి ఎలా ప్రవహిస్తుందో అలాగే ఉష్ణం కూడా ఎక్కువనుంచి తక్కువ కి ప్రవహిస్తుంది. శీతకాలంలో శరీర ఉహ్ణోగ్రత కంటే బయట ఉహ్ణోగ్రత తక్కువ ఉన్నపుడు శరీరం వేడిని కోల్పోతూ ఉంటుంది, అందుకే చలేస్తుంది. అలాటి కాలంలో  నీటిలో దిగితే ఎలా ఉంటుంది?  శరీర ఉహ్ణోగ్రత ఎక్కువగానూ బయటి ఉహ్ణోగ్రత తక్కువగానూ ఉంటుంది, అలాటప్పుడు నీటిలో దిగితే నీటి పైపొరలలో ఉహ్ణోగ్రత క్కువగానూ  లోపలి పొరలలో ఎక్కువగానూ ఉంటుంది. అసలే శరీరం ఉహ్ణోగ్రత కోల్పోతున్నపుడు సగం శరీరం నీటిలోనూ సగం బయట ఉంటే చలి ఉంటుంది, కాని అదే పూర్తిగా శరీరం నీటిలో ములిగితే చలి ఉండదు.కారణం బయటి ఉష్ణోగ్రత కంటే లోపలి నీటి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం.   

అదే నిండా ములిగినవాడికి చలేంటీ అన్నది.  

Matter will be in three states. Solid,liquid,vapor. Water will be at liquid state at normal temperatures, it becomes solid at the 0 C and  and vaporizes after 100 C. Special feature of water is that, it will become solid at 0 C but remains as liquid at -4 C. By becoming solid, water looses its latent heat. (Latent heat of fusion of water is 80 cal for gram) Please correct if I am wrong. 

 

మరోమాట కూడా నీరు  నున్నా ఉష్ణోగ్రతలో గడ్డకడుతుంది, కాని -4 C డిగ్రీల దగ్గర నీరుగానే ఉంటుంది. అందుకే మంచు పలకలకింద నీరుంటుంది అది -4 C ఉష్ణోగ్రతలో ఉంటుంది.


ఇక రెండవదాని గురించి ఏం చెప్పేది? కొల్లలు ఉదాహరణలు అందుకు చెప్పను :)   


1, మార్చి 2021, సోమవారం

ఓం మిత్రాయనమః


 ఓం మిత్రాయనమః

ఓం రవయేనమః

ఓం సూర్యాయనమః

ఓం భానవేనమః

ఓం ఖగాయనమః

ఓం పూష్ణేనమః

ఓం హిరణ్య గర్భాయనమః

ఓం మరీచయేనమః

ఓం ఆదిత్యాయనమః

ఓం సవిత్రేనమః

ఓం   అర్కాయనమః

ఓం భాస్కరాయనమః


భాస్కరుడు ఫిబ్రవరి నెల ముగియ కుండానే ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయమే దట్టమైన మంచు తొమ్మిదికి గాని భాస్కర దర్శనం లేదు. మధ్యాహ్నానికే 38 కి వేడి జేరిపోతోంది.సాయంత్రానికి కూడా చల్లబడటం లేదు, రాత్రి చలి. ఇలా ఉన్న వాతావరణం లో అనారోగ్యం పెరగటం ఖాయం. నిరుడు ఇదే రోజుల్లో అంటు కున్న కరోనా సడలింది అనుకునే లోగా మళ్ళీ పుంజుకుంటోందనే వార్త. ఇదివరలో పద్నాలుగు రోజులు కాలం ఉండేది ఇప్పుడు మూడు రోజుల్లో అంతా తేలిపోతుందని భయపెట్టే వార్తలు, లక్షణాలు ఇవి అని చెప్పేందుకు లేదు. వస్తే ఈడ్చెయ్యడమేనని సోషల్ మీడియా వార్తలు భయపెడుతున్నాయి. నేటి కరోనా విషయంలో ప్రభుత్వం కొద్దిగా వార్తలిస్తే ఈ బెదిరింపులు తగ్గుతాయేమో! పిల్లలు బడికి వెడుతున్నారు, ఇంతలో ఒక సోషల్ మీడియా వార్త కరోనా పెరిగిపోడంతో బడి, కాలేజిలకి రెండు నెలలు శలవులని. ప్రజలు బేజారెత్తి పోయారు. ఇలాటి వార్తలు ప్రచురించేవారిని కఠినంగా ప్రభుత  శిక్షించాలని కొరిక. వార్త ఉత్తిదేనని ప్రభుత వివరణ ఇచ్చేలోగా జరగ వలసినది జరిగిపోయింది. ఇటువంటి నీలి వార్తలు ప్రచారం చేసేవారు పొందే ఆనందం ఏమిటో!

22, ఫిబ్రవరి 2021, సోమవారం

పొట్ట తగ్గాలంటే?

 పొట్ట తగ్గాలంటే?


మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచిందీ

పదండి ముందుకు పదండి తోసుకు

పదండి పోదాం పై పైకీ

మరో ప్రపంచం మరో ప్రపంచం  పిలిచిందీ


అన్నారట మహాకవి శ్రీశ్రీ. కవిగారూహించిన మరో ప్రపంచం కనబడిందో లేదో గాని తోసుకునే అలవాటు మాత్రం మిగిలిపోయింది,జనాలకి, ఎక్కడి దాకా? రిజర్వ్ కంపార్టుమెంటులోకి ఎక్కడానికి నలుగురే ఉండి, రైలు పావుగంట ఆగుతుందని తెలిసి, రైలు ఆగగానే దిగే వాళ్ళని కూడా దిగనివ్వకుండా తోసుకుని ఎక్కే అలవాటు దాకా, పిల్ల చచ్చినా పురిటి కంపు పోనట్టు ఈ అలవాటు మాత్రం మిగిలిపోయింది.. అనుకోని విపత్తు అంటే ఆకాశం విరిగి మీద పడటం అని అంటారు. ఆకాశం విరుగుతుందా?అక్కడేం లేదు కదా! అదే మరి విచిత్రం అలాటిదే నిరుడు ప్రపంచంమీద విరుచుకుపడ్డ కరోనా మహమ్మారి. ఈ కరోనా మహమ్మారిని చూస్తూ కూడా జనం దూరం పాటించక పొట్టలతో తోసుకోడం మానలేదు, ఎక్కడా! అదీ అసలు విచిత్రం.ఐపోయిన పెళ్ళికి బాజాలెందుకుగాని, 


సరే నేటి పరిస్థితి కరోనా కొంత వెనకబట్టిందనగానే గుంపులు,గుంపులు జనాలు ఎక్కడబడితే అక్కడ తోసుకుంటూనే ఉన్నారు, హాస్పిటళ్ళలో, డాక్టర్ల దగ్గర, హోటళ్ళలో, సినిమా హాళ్ళలో,బస్సుల్లో, రైళ్ళలో ఇదేస్థితి రాబోతోంది.


మా దగ్గర కొద్దికాలం తప్పించి నడక సాగించాం అందరం, మా వాకర్స్ క్లబ్ వారం. ఇప్పుడూ కొనసాగిస్తూనే ఉన్నాం. తొమ్మిది మంది దాకా ఒక గుంపు, మూడడుగుల దూరంలో ముగ్గురో వరసకి ఉంటూ అన్ని విషయాలూ, నేటి రాజకీయం మొదలు,నాటి సాంఘిక స్థితి నుంచి, కాళిదాసునుంచి విప్లవ కవిత్వం దాకా ఎవరో ఒకరు నాటి ప్రవచకులుగా నడక సాగిపోతూనే ఉంది. ఉదయం పూట నాలుగొందల మీటర్ల ట్రాక్ మీద నడక, మూడు నాలుగు గుంపులు, మరో పక్క యోగాసనాలు వేసేవారు, మరో పక్క బేస్కెట్ బాలు ఆడేవారు, మరో పక్క ఫిజికల్ ఫీట్నెస్ కోచింగూ, సాయంత్రం పూట క్రికెట్టూ, నడకా, వాలీబాల్,బేస్కెట్ బాలూ, మరో పక్క ఇండొర్ స్టేడియంలో,టేబుల్ టెన్నిస్ షటిల్ ఇలా మా గ్రౌండ్ పెళ్ళివారిల్లులా ఉంటుంది,రెండు పూటలా. చూడ రెండు కళ్ళు చాలవు.ఇక్కడికొచ్చేవారెవరఎవరుంటారూ అని కదా అనుమానం, వ్యాపార వేత్తలు, టీచర్లు,లెక్చరర్లు,పోలీస్,ఇతర ఆఫీసుల వారు, లాయర్లు,డాక్టర్లు, ఇంజనీర్లు, నాలాటి వయసుడిగినవారు, ఏమని చెప్పను? ఎన్నని చెప్పను.. ..ఈ మధ్యనే నవ్వుల క్లబ్ కూడా మొదలెట్టాలనుకుంటున్నారు.  


నేను వీరితో కలవలేను కవిని కనక, ఒంటరిగా నడక సాగిస్తా. అలా ఒంటిగా నడచి ఒకరోజు దగ్గరే ఉన్న స్కూల్ అరుగు మీద కూచున్నా. మరో మిత్రుడు తన నడక ముగించి వచ్చి పక్కనే కూచున్నారు. చాలా తొందరగా వ్యాయామం ముగిస్తున్నారు, మరి కొంచం సేపు చెయ్యాలి అన్నారు. చేయలేకపోతున్నానన్నా! ఒక పని చెయ్యండి, వెనక్కి నడవండి అని చెప్పి వెళ్ళిపోయారు. ఏంటీయనా? ఎగతాళీ చేస్తున్నారా అనిపించింది, ఇంటి కొచ్చాకా గుర్తొచ్చి గూగులమ్మని అడిగా! వామ్మో! పెద్ద లిస్టు చూపింది. వెనక్కి నడిస్తే లాభాలూ అని చెప్పుకొచ్చేరు అందరూ. మర్నాటినుంచి వెనక్కి నడవడం ప్రారంభించా, నవ్వేరు, నాకేం మీపళ్ళే బయట పడ్డాయని ఊరుకున్నా! సలహా చెప్పిన స్నేహితుడూ జత కూడారు. పొట్ట తగ్గుతుందన్నారు కొందరు, కొలిచి చూసుకుందామనుకుని అలాచేశేం. ఒక నెల రోజులు విడవకుండా అందరూ నవ్వినా కొనసాగించాం. నెల తరవాత చూసుకుంటే రెండంగుళాలు పొట్ట లోపలికి పోయింది, ఇద్దరికీ. ఇప్పుడు ఆడా మగా అందరూ వెనక్కి నడుస్తున్నారు.  ఇతర లాభాలు చెప్పను గూగుల్లో వెతుక్కోండి.


చైనావాళ్ళకి వెనక్కి నడవడం బాగా అలవాటట. మంచి గుణం శత్రువు నుంచైనా నేర్చుకోవలసిందే! వెనక్కి నడవండి, పొట్ట తగ్గించుకోండి.




18, ఫిబ్రవరి 2021, గురువారం

పొట్టెందుకు పెరుగుతుంది?

 

పొట్టెందుకు పెరుగుతుంది?


భోజనాగ్రే సదా పథ్యం 

లవణార్ద్రక భక్షణం

రోచనం దీపనం వహ్ని 

జిహ్వాకంఠ విశోధనమ్


భోజనానికి ముందు సైంధవలవణం అల్లం కలిపి నమిలితే జీర్ణ శక్తి పెరుగుతుంది,గొంతు నాలుక పరిశుద్ధమై రుచి కలుగుతుంది.


 భుక్త్వా శతపదం గచ్ఛేత్, శనై స్తేన తు జాయతే,

అన్నసంఘాతశైథిల్యం, గ్రీవాజానుకటీసుఖమ్.

భుక్తోపవిశత స్తుందం, శయానస్య తు పుష్టతా,

ఆయు శ్చంక్రమమాణస్య, మృత్యు ర్ధావతి ధావతః


భోజనానంతరం నూరడుగులేస్తే అన్నము యుక్త స్థానము చేరి శరీరానికి బలం కలిగిస్తుంది. భోజనం చేసిన వెంటనే కూచుంటే పొట్టొస్తుంది,వెంటనే పడుకుంటే శరీరంలో కొవ్వు చేరుతుంది, మెల్లగా నడచిన ఆయుర్వృద్ధి,పరుగెత్తినచో ఆయుక్షీణము.


మరో మాట భోజనానంతరము మెల్లగా నూరడుగులు నడచి వజ్రాసనంలో ఐదు నిమిషాలు కూచుంటే ఆరోగ్యం మీసొత్తే అంటారు పెద్దలు. చిత్రమైన మాటేమంటే భోజనం తరవాత యోగాసనాలు వేయ కూడదు కాని ఈ ఒక్క వజ్రాసనం మాత్రమే భోజనం తరవాత కూడా వేయచ్చు. యోగాసనాలు వేయడం తేలికైన పనికాదు, తెలిసి తెలియక ఆసనాలు వేయడానికి ప్రయత్నం చేస్తే కాళ్ళూ చేతులు నొప్పులు పుడతాయి, విరగచ్చు కూడా జాగర్త.


ఈ రోజుల్లో అందరికి పొట్టలెందుకొస్తున్నాయో తెలిసిందోచ్! భోజనం చేసిన వెంఠనే కంప్యూటర్ దగ్గర కూచోడం అలవాయిపోయింది జనాలికి చాలా కాలంగా అందుకే పొట్టలొస్తున్నాయి. పొట్ట తగ్గే మార్గం........?

15, ఫిబ్రవరి 2021, సోమవారం

యతో భ్రష్టః తతో భ్రష్టః

 


భుక్త్వా శతపదం గఛ్ఛేత్

తాంబూలమ్ తదనంతరమ్

వామపార్శ్వేతు శయనమ్

ఔషధైః కిం ప్రయోజనమ్ ?.


భొజనానంతరము నూరడుగులు నడచి తాంబూలము సేవించి, ఎడమవైపు పడుకుంటే ఔషధములెందుకు?


After dinner sleep awhile. After supper walk a mile.


దేశీయమైనదేదీ నమ్మం, విదేశీయమైనది అర్ధం చేసుకోం. 

యతో భ్రష్టః తతో భ్రష్టః


16, జనవరి 2021, శనివారం

మా ఊళ్ళో సంక్రాంతి సంబరం

 


మా ఊరు గ్రామదేవత వీరుళ్ళమ్మ అమ్మవారి జాతర.


పోరుకు తయారైన బరి



గంగలకుఱ్ఱు గ్రామంలో భారీ భోగి పిడకలదండ.

ప్రభల తీర్థం (విడియో పాతదే)


మరువని సంప్రదాయం

All videos courtesy:Whats app. 

పండగ గురించి తెలియని వారుండరు, మూడు ముక్కలతో ముగించేస్తా. . భోగి రోజు నలుగురితో పంచుకుని తినడం అనేదే భోగం, అదే ఆనందం. రెండవరోజు పెద్ద పండగ, పెద్దల పండగ, పెద్దల పేరు చెప్పి తిలతర్పణం, దానం. మూడవరోజు కనుమ పశువులపండగ.నాలగవరోజు బొమ్మల కొలువు, బొమ్మల నోము ప్రధానం అదే సావిత్రి గౌరి దేవి నోము,''ఇస్తినమ్మా వాయనం పుచ్చుకుంటినమ్మా వాయనం'' ఇందులోదే

 ఇప్పుడు పట్టేవారు లేరు, పదమూడు సంవత్సరాల నోము. మరచిపోయిన ఒక ఆచారం.

శలవు.

15, జనవరి 2021, శుక్రవారం

రకరకాల పందెం కోడి పుంజులు

 
















courtesy:Whats app



విజయమో వీర స్వర్గమో పుంజులదే అగ్ర స్థానం. గెలిస్తే సన్మానం, ఓడితే వీర స్వర్గం మర్నాడు దాకలో కోసగా కూరకే . ఏదైనా దొరుకుతుందేమో గాని ''కోస'' దొరకదట, కొనడానికైనా! పుంజులదే రాజ్యంగాని పెట్టలకి చోటు లేదు :)