Tuesday 28 May 2024

కడుపుతో ఉన్నమ్మ

 కడుపుతో ఉన్నమ్మ


కడుపుతో ఉన్నమ్మ కనక మానదు.

ఒండుకున్నమ్మ తినక మానదు. 


ఇదొక నానుడి కడుపుతో ఉన్న ఆవిడ సమయానికి ప్రసవిస్తుంది. అలాగే వంట చేసుకోడమెందుకు? తినడానికే! దానికీ సమయం ఉంటుంది. అది ఆకలేసిన సమయం. అప్పుడే తింటుంది, వద్దన్నా మానదు. పల్లెటూరివాళ్ళు ఈ మాటని జరగవలసిన పని జరగవలసిన  సమయం లో జరిగి తీరుతుంది, వద్దంటే మానదని చెప్పడానికి చెబుతారు. ఒక్కొకపుడు సమయం నడుస్తున్నట్టే కనపడదు, ఒక్కొకప్పుడు సమయం పరిగెడుతున్నట్టే ఉంటుంది. మనం చెప్పినట్టూ, మనకి కావలసినట్టూ సమయం నడవదు. ఎన్నికలవుతున్నాయి. పూర్తైన తరవాత లెక్కింపూ,ఆపై ఫలితాల ప్రకటనా ఉంటుంది. మనం కంగారు పడినంతలో సమయం పరుగెడుతుందా? 


కుంచమంత కూతురుంటే మంచం మీదే కూడు.


   కూతురుంటే తల్లికి చేదోడని ఈ నానుడి భావం. కూతురు 

పెద్దదై తల్లికి తోడవుతుంది. కొడుకు పెద్దవాడై తండ్రికి శత్రువవుతాడు. ఇది లోకరీతి. 


చిన్న పామైనా పెద్ద కఱ్ఱతో కొట్టాలి

 

 విషమున్న పాము చిన్నదైనా వదలకూడదని భావం. అంటే సమస్య చిన్నదే కదా అని ఉపేక్ష చేయకూడదు. అగ్ని కణం చిన్నదే అని ఊరుకుంటే కొంపలు కాల్చేస్తుంది, అలాగే శత్రువు బలహీనపడైపోయాడనుకుని వదిలేయకు. ప్రయత్నం పెద్దది చేసైనా దండించాల్సిందే! మరో మాట పిల్లపాముకే విషమెక్కువుంటుంది, ముదిరిన పాముకి విషం తగ్గిపోతుంది, కక్కి,కక్కి ఉంటుందిగా! 

No comments:

Post a Comment