Wednesday, 7 February 2024

రాజకీయం- ధీరత్వముచితజ్ఞతా

రాజకీయం- ధీరత్వముచితజ్ఞతా 


మా సత్తిబాబు, సుబ్బరాజు వచ్చారో సాయంత్రం. 'అమ్మా! కాఫీ' అనరిచేలోగానే కాఫీ తెచ్చేసింది కోడలమ్మాయి. 'అమ్మా! చిన్నదానివి ఎక్కువగా పొగడకూడదు గాని ఒక మాట చెబుతా!

దాతృత్వం ప్రియవక్తృత్వం ధీరత్వ ముచితజ్ఞతా

అభ్యాసేన న లభతే చత్వార సహజా గుణాః

దాతృత్వం,ధీరత్వం,సమయానికి తగినట్టుమాటాడటం,ప్రియంగా మాటాడటం అన్నవి నేర్చుకుంటే రావు పుట్టుకతో రావాలంటారు ఆచార్య చణకులు.  ఇవి  నీలో పుష్కలంగా ఉన్నాయి.  జీవితంలో అభివృద్ధిలోకొస్తావు, దీర్ఘసుమంగళీభవ' అన్నాడు. దానికి సుబ్బరాజు 'మీ అమ్మాయిగా పొగుడుకో ఎవరూ కాదనరులే!' అన్నాడు. దానికి  సత్తిబాబు 'నీదంతా యతికుతం' అని నవ్వేసేడు.  మాటలు చివరికి రాజకీయం దగ్గరాగాయి.


''ఏంటో! మమతమ్మ కాంగ్రెస్ కి దేశం మొత్తం మీద నలభై సీట్లు కూడా రావంటదే! ఏటీ చోద్యం'' అడిగాడు, సుబ్బరాజు.  సత్తిబాబు మాటాడలేదు,నేనూ మాటాడలేదు. సుబ్బరాజే ఒక మెట్టు దిగి 'సత్తిబాబు!, ఇదేంటో చెప్పవా?' అడిగాడు. 'సరిలే   చెబుతా, చెప్పేకా ఇల్లా అన్నావు అల్లా అన్నావు  అని కోపగించుకోకు,నా మాట నేను చెబుతాను, నువ్వు చెప్పేది నువ్వు చెప్పు. వద్దన్నవారు లేరంటే,'   'చెప్పు సత్తిబాబూ అన్నా!' మరీ అన్యాయంగా ఊరుకుంటే సుబ్బరాజు చిన్నబుచ్చుకుంటాడని.సత్తిబాబు మొదలెట్టేడిలా..


ఎవరేమన్నా,అనుకున్నా కాంగ్రెస్ రాజకీయాలు రాహుల్ బాబు మాట మీద నడుస్తున్నాయన్నది సత్యం. భారత్ జోడో యాత్ర చెయ్యాలనుకున్నాడు రాహుల్ బాబు. మొదలయింది, చెప్పుకుంటే చాలా ఉందిగాని, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు,బి.జె.పి పాలిత రాష్ట్రాలగుండా యాత్ర నడచి శ్రీనగర్ చేరింది, తల్లీ బిడ్డా న్యాయంగా విమర్శలు ప్రతి విమర్శలతో. ఫలితంగా ఆ తరవాత జరిగిన ఎన్నికల్లో రాజస్తాన్,చత్తీస్ గడ్ లలో అధికారం పోగొట్టుకుని, తెలంగాణాలో నెగ్గి, చావుతప్పి కన్నులొట్టబోయినట్టు పరువు కాస్త దక్కించుకున్నాడు. దక్షణాది నుంచి ఉత్తరాదికి నడచిన ఊపుతో తూర్పునుంచి పడమరకి నడిచెయ్యాలనుకున్నాడు. ఈ లోగా పరువునష్టం కేసు, చాలా గందరగోళం తరవాత పదవి నిలబెట్టుకున్నాడు. ఆ తరవాత రాబోయే ఎన్నికల గురించి దేశం మొత్తం మీద ప్రతిపక్షాలని ఏకం చెయ్యాలని INDI అలయన్స్ చేసి,సీట్లు పంచుకోవాలనుకున్నారు, ఎవరెక్కడ పోటీ చేయాలో తేల్చుకోవాలనుకున్నారు.. ఇంత దాకా బాగానే జరిగింది. ఎవరికితోచిందో మరి రాహుల్ బాబా తూర్పునుంచి పడమటి నడక ఎన్నికలు రెండు నెలలుండగా మొదలెట్టేడు, అదిన్నీ మణిపూర్ నుంచి, అక్కడ జరిగిన గొడవల్ని ఆధారంగా చేసుకుని గద్దెనెక్కెయ్యాలని.  తప్పు కాదనుకో! 


నడకమొదలయింది. అసోం చేరేతలికి విమర్శలు ప్రతి విమర్శలు సరే!, కుర్రగాళ్ళు మోడీ! మోడీ!! అనరచినారని కోపగిస్తే ఎట్టా? ఈ లోగా అయోధ్యలో ప్రాణప్రతిష్టకి పిలుపొచ్చింది. రామని చెప్పేసేరు.   కుక్కజట్టీలకి సమయమా చెప్పు! దేశమంతా రాముని చుట్టూ తిరుగుతోంది, రాహుల్ బాబు కాదన్నాడు. ఆయనిష్టమనుకో! బెంగాల్ దగ్గరకొచ్చేటప్పటికి మమతమ్మ పర్మిషన్లు ఇవ్వలేదు,నడకకీ,మీటింగులకీ. నా ఇలాకాలో నడుస్తూ నాకు చెప్పాలనే ఇంగితజ్ఞానంలేదా? అడిగింది మమతమ్మ.  అక్కడ పర్మిసన్ల కోసం రెండు రోజులు  ఖాళీగా కూచుని సమయం  వృధా చేసేడు. ఇది ఖాళీగా కూచునీ సమయమా? చెప్పు! మరురోజు నీకు రెండు సీట్లిస్తా అన్నది. ఇండీఅలయన్స్ లో ఉన్నోళ్ళంతా సీట్లు మాటడుకుందామంటే పలకలేదు. ఆ మర్నాడు మార్క్సిస్టుల్ని వదిలేసిరా! సీట్లు మాటాడుకుందామంది. పలుకు లేదు.ఆ తర్వాత రోజు నీకొక్క సీటూ ఇవ్వను అనిజెప్పేసింది. ఈలోగా బీహార్ లో నితీష్  INDI అలయన్స్ లో సీట్ల గురించి కాంగ్రెస్ మాటాడదు, నేను బయటికి పోతన్నా, అని పోయి బి.జి.పి తో చేరేడు. సీట్ల గురించి మాటాడకపోడంతో అఖిలేష్ నీకు11 సీట్లిస్తా,పోటీ చెయ్యి అని తనపని తను చేసుకోడం మొదలెట్టేడు. ముందుకెల్తే కేజ్రీవాల్ డిల్లీ పంజాబుల్లో తనపని చేసుకుంటావున్నాడు. మహారాష్ట్రలో కాంగ్రెస్ కుడి భుజం మురళీ దేవరా పార్టీ వదిలేసిపోయాడు,కాంగ్రెస్లో పట్టించుకునేవారు లేరంటూ. ఇదంతా చూసిన మమతమ్మ నీకు దేశం మొత్తం మీద నలభై సీట్లు కూడా రావని దీవించింది.  కాంగ్రెస్  నుంచి జనాలు  బయటికిపోతన్నారు ఏమని?  అడిగాడొక విలేకరి. నితీష్,దేవరా ఇలా ఎంతమంది బయటికిపోయినా లెక్క చేసేది లేదన్నట్టు  చెప్పడం అందంగా ఉందా? , ఈ సమయంలో   అలామాటాడటం మనుషుల్ని కూడదీసుకునీ లక్షణమా చెప్పు? చిలిపి కయ్యాలకి సమయమా? ఓపక్క ఎన్నికలు తరుముకొస్తుంటే, చెప్పు!


 రాజకీయాల్లోనైనా జీవితంలో నైనా ఎప్పుడు ఏపని చెయ్యాలో అదేచెయ్యాలి. ఎక్కడ,ఎప్పుడు ఎలా, మాటాడాలో అలాగే మాటాడాలి. ఇది తెలిసినవాళ్ళే రాణిస్తారు.  ఇరవై, పాతికిల్లో పెళ్ళి చేసుకోవాలి, సంపాదన మొదలెట్టాలి. పాతిక ముఫైల్లొ బిడ్డల్ని కనాలి. ఆ తరవాత బిడ్డల్ని పెంచాలి. వాళ్ళని ప్రయోజకుల్ని చెయ్యాలి.
 అలాగే ఈ టైములో రాహుల్ బాబా ఒక చోటకూచుని INDI అలయన్సులో, కూడా ఉన్నవాళ్ళతో మాటాడుకుంటూ సీట్లు సద్దుబాటు చేసుకుంటూ రాజకీయం నడపాలిగాని ఇప్పుడు నడుస్తానంటే ఎలా? మమతమ్మ అలా అన్నదంటే ''ఆతడనేక యుద్దముల నారియుతేరిన  వృద్ధమూర్తి'' అన్న మాటలా లేదా? మమతమ్మ మార్సిస్టులతో గొండాడి కదా పవర్లోకొచ్చింది. ఎంత అనుభవం ఉంటదీ. అందుకే అలా ఆశీర్వదించింది, తప్పేంటి చెప్పు! అని ముగించాడు మా సత్తిబాబు.

5 comments:

  1. శర్మ గారు,
    మీ వేరే పోస్ట్ (“వినతి” dt.05-02-2024) క్రింద “జిలేబి” గారికి జవాబుగా మీరీ మాటన్నారు 👇

    // “ టాటా వీడుకోలూ గుడ్ బై” //

    నిజంగానేనా? ఎందుకలాగ? హఠాత్తుగా ఈ నిర్ణయం ఏమిటి?

    కొంతమంది వ్యాఖ్యాతల కారణాన “శ్యామలీయం” గారు మొన్ననే తన బ్లాగులో కామెంట్ బాక్స్ ని మూసేశారు.

    ఇప్పుడు మీరు ఏకంగా మీ బ్లాగులో ఇకపై టపాలనే ఆపేస్తానంటున్నారు. మీలాంటి సీనియర్ బ్లాగర్లు, జ్ఞానవృద్ధులు కూడా ఇక వ్రాయను అంటే ఎలాగండీ?

    ఒకప్పుడు vibrant గా వెలిగిన తెలుగు బ్లాగులోకం మెల్లిగా ఇలాంటి స్ధితికి జేరుకోవడం విచారకరం.

    ReplyDelete
    Replies

    1. విన్నకోట నరసింహా రావు8 February 2024 at 10:31
      జరలో రుజ బాధిస్తోంది.ఆ బాధలను కొద్దిసేపైనా మరవాలని చేసే ప్రయత్నమే బ్లాగురాయడం, కాని నిన్న రాత్రి ఒకరితో మాటాడుతుండగా కలిగిన అభిప్రాయంతో తీసుకున్న నిర్ణయమండి.నిజమే!

      ఎవరు వృద్ధులు? :) ఏండ్లు మీరినవారా వృద్ధులు? :) చిన్నప్పటినుంచి వింటున్నమాటేనండి.

      నా ముందు బ్లాగులున్నాయి, నా తరవాతా బ్లాగులుంటాయి. రాగద్వేషాలను జయించలేకున్నాముకదా!
      ధన్యవాదాలు.

      Delete
  2. బ్లాగులోకం బాగుండాలంటే
    1. బ్లాగర్లు మంచిటపాలు పుంఖానుపుంఖాలుగా వ్రాయాలి.
    2. వ్యాఖ్యాతలు హుందాగా వ్రాయాలి.
    3. మనబ్లాగుకు పదిమందీ రావటమే కాదు మనమూ పదిమంది మంచిటపాలనూ ప్రోత్సహించాలి.
    4. బ్లాగులు రచ్చబండల్లా కాక సాహితీ వేదికలుగా ఎదగాలి.
    ధన్యవాదాలు.
    శ్యామలీయం.

    ReplyDelete
    Replies

    1. శ్యామలీయం8 February 2024 at 10:55
      చెప్పడానికి వినడానికి అన్నీ బాగుంటాయి. ఆచరించేవారే అరుదు.
      మనం అనుకున్నట్టు లోకం ఉండదు. రకరకాల మనుషులు, మనస్తత్వాలు.మనం ఉండమన్నట్టు, ఉండాలనుకున్నట్టు లోకం ఉండదు. రకరకాల మనుషులతో సద్దుకుపోక తప్పదు. కొందరికి దగ్గరవుతాం, కొందరికి దూరమవుతాం, కొందరిని చేతి దూరంలో ఉంచుతాం. ఇదంతా మీకు తెలియనిదికాదు, ఇదే చాదస్తం. వయసు పెరిగింది కదండీ :)
      ఒక చిన్న ఉదాహరణ చెబుతా.. నీచ ఉదాహరణే...
      బురదలో దొర్లిన పంది రోజుకుంటూ పరిగెట్టుకొస్తోంది,నేను తెల్లటి బట్టలేసుకున్నా! పంది మీదబడుతుందనిపించింది, లేదా బురదేనా మీద చిందచ్చు. ఎవడ్రా ఈ పందిని ఇలా వదిలేసినవాడని రంకెలేసి ఉపయోగం లేదా క్షణంలో. ఆ తర్వాత రంకెలేసినా ఉపయోగం శూన్యం కారణం ఆ పంది ఒక రాజకీయనాయకుడిది :) పక్క నున్న అరుగెక్కేసేను. పంది పోయాకా నా పని నేను చూసుకున్నా! ఇది నాకు జీవితం నేర్పిన పాఠం. ఎక్కువ చెబితే మన్నించండి. నాకీ సావకాశం కలగజేసినందుకు నమస్కారాలు

      టాటా, బై,
      శలవు,
      నమస్కారాలు
      ధన్యవాదాలు.

      Delete