Tuesday, 6 February 2024

బడ్జట్

 చాలా రోజుల తరవాత మా సత్తిబాబు, సుబ్బరాజు వచ్చారు. వస్తూనే మా సత్తిబాబు ''చెల్లెమ్మా! కాఫీ'' 

 అనరచి నాలిక కరుచుకున్నాడు, ఈలోగా లోపలనుంచి కోడలమ్మాయి ''తెస్తున్నా! బాబాయ్!!'' అంది. కూచునోలోగానే కాఫీ తెచ్చిచ్చింది, ముగ్గురుకీ! చాలా రోజుల తరవాత కదా పుచ్చేసుకున్నా! సత్తిబాబు కాఫీ కప్పు పుచ్చుకుని ''అమ్మా! కాఫీ అద్భుతం'' అన్నాడు. దానికి సుబ్బరాజు ''తాగకుండానే ఎలా చెప్పేవేంటీ?'' అని నిలదీశాడు. సత్తిబాబు, ''కాఫీ వాసనే ఘుమఘుమలాడిపోతోంటే తాగి మరే చెప్పాలా?''  అనడంతో కబుర్లు మరో దోవపట్టేయి. కబుర్లు దొల్లిపోతున్నాయి, అలా అవి బడ్జట్ దగ్గరకొచ్చి ఆగాయి. 

మా సుబ్బరాజు ''బడ్జట్ లో ఏముందిలే? పయోళ్ళకి కిందోళ్ళని చూసేరు, మద్దెలో ఓళ్ళనొదిలేసేరు అంతేగా'' అన్నాడు. దానికి మా సత్తిబాబు 'అనుకో' అని ఊరుకున్నాడు. ''అదేమన్నమాట సత్తిబాబూ! అదేదో చెప్పరాదా'' అన్నా, కలగజేసుకుని. ''ఈయనడుగుతాడు, నేను నిజాలు చెబితే, ఈయనకి కోపాలొస్తాయి, మద్దెలో నాకెందుకొచ్చిన తంటా చెప్పండి'' అన్నాడు, భీష్మునిలా! ''నీ అభిప్రాయం నువు చెబుతున్నావు దానికి కోపమెందుకు చేసుకుంటాం! చెప్పు'' అని బ్రతిమాలాను. సత్తిబాబు అందుకున్నాడిలా! 


 మన దేశంలో ప్రజలు నాలుగు రకాలు 

కలిగినవారు,లేనివారు,మధ్య తరగతివారు. నాలుగో రకమే రాజకీయనాయకులు. కలిగినవారు నూటికి పదిమంది.లేనివారు నూటికి ఏభై.మధ్య తరగతివారు నూటికి ముఫై ఐదు. రాజకీయనాయకులు నూటికి ఐదుగురు.

కలిగినవారు నూటికి పది మంది,వీరు పెద్ద వ్యాపారవేత్తలు,పారిశ్రామికులు,ధనవంతులు.వీరికి బడ్జట్లు గొడవలు,పెంచడాలు,తుంచడాలు అక్కరలేదు. వారికి కావలసిన పని ఏ ప్రభుత్వం ఉన్నా అవుతుంది. బయట వీరిని తిట్టిపోసేవారంతా, లోపల వీరి కాళ్ళ దగ్గర కూచునేవారే! ఎందుకంటే, వీరే వారికి పోషణ కర్తలు. వీరూ ఈ మధ్యన ఓట్లు వేస్తున్నారు. వారు ఎవరికి వేస్తారన్నది బహిరంగ రహస్యమే! వారినెప్పుడూ రాజకీయనాయకులు ఈగ వాలకుండా చూసుకుంటారు. వీరు అన్ని పార్టీలకి విరాళాలిస్తారు.వీళ్ళు ఓటెయ్యడానికి రావడమే గొప్పనుకుని లైన్ లో ఉన్నవారంతా తప్పుకుని లోపలికి పంపించేస్తారు. అప్పుడప్పుడు వీళ్ళు కూడా లైన్ లో నిలబడినట్టూ, లైన్ లో రమ్మని చెప్పినట్టూ డ్రామాలు కూడా కనపడుతూ ఉంటాయి.

   

 లేనివారు నూటికి ఏభై మంది.వీరు ఏమీ లేనివారు. రెక్కాడితే డొక్కాడేవారు, లేదా ఏదో కొద్దిగా ఉన్నవారు అంతే!ఎవరి ప్రభుత్వమైనా వీళ్ళనే  చూసుకుంటుంది . లైన్ లో నిలబడి ఓట్లేసేవాళ్ళు వీళ్ళే! వీళ్ళు అల్ప సంతోషులు.శ్రామికవర్గ పచ్చపాతులమని చెప్పుకునేవాళ్ళకి,చొక్కాలు చింపుకునేవాళ్ళకి ఓట్లెయ్యరెందుకో!  వీళ్ళు, డబ్బుకి మందుకి లోబడిపోతున్నారంటూ ఉంటారు,  

కొందరు   పైవాళ్ళు. ఎదుటి పార్టీవాళ్ళ దగ్గర డబ్బులుచ్చుకుని, ఓట్లు మాకెయ్యండంటూ ఉంటారు, రాజకీయనాయకులు. వీళ్ళంత తెలివైనవాళ్ళు మరొకరు లేరు. డబ్బులుచ్చుకుంటారు,మందూ పుచ్చుకుంటారు. కావలసినోళ్ళకే ఓట్లు నొక్కుతారు. వీళ్ళకి కావల్సింది రక్షణ,నిత్యావసరాలు,అంతే!


రాజకీయ నాయకులు,వీరు నూటికి ఐదుగురు.వీరు ఏపార్టీ వారైనా అధికారమే ప్రధాన లక్ష్యం.   

పోలసీలు వగైరాలంతా ఉత్తిమాటే. అధికారమున్నచోటకి చేరిపోడమే ధ్యేయంగా ఉంటుంది. సాధారణంగా వీరంతా మధ్యతరగతి మేధావులే! అక్కడక్కడ కలిగినవారుంటారు.వీళ్ళంతా నోరున్నవాళ్ళు :) ఎక్కడా మొదటి ఓట్లు వీళ్ళవే!వాళ్ళకి వాళ్ళే ఓట్లేసుకుంటారు :) 


ఇక మధ్య తరగతివారు,వీరు నూటికి ముఫైఐదనుకున్నాంగా! వీళ్ళంతా ఏకరూపుగాదు. వీళ్ళలో మూడు రకాలు.అప్పర్ మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్. 


అప్పర్ మిడిక్లాస్ వాళ్ళు నూటికి ఐదుగురు. వీళ్ళు రాజకీయనాయకులతో రాసుకుపూసుకు తిరుగుతారు.పెద్ద ఉద్యోగస్తులు. పాలసీ మేకర్లు.చట్టాలు,రూల్స్ తయారు చేసేవాళ్ళు.బడ్జట్లు తయారు చేసేవాళ్ళు, వీళ్ళే! వీళ్ళంతా మహా మేధావులు,గుంట చిక్కులు పెట్టగలిగిన,విప్పగలిగినవాళ్ళు. చట్టాలకి భాష్యాలూ,వక్రభాష్యాలూ,వ్యాఖ్యానాలూ చెప్పగలవాళ్ళు నోరున్నవాళ్ళు ,  వీళ్ళ లో కొంతమంది  నోరు పైకి వినపడదు,తొడపాశాలు పెట్టగలిగిన రకాలు. అంతెందుకు రెండు మీటర్ల చొక్కాగుడ్డ టైలర్ దగ్గరికి పట్టుకెళితే మనకి కావల్సిన ఫేషన్ లో కొలతలు తీసుకుని కుట్టే దర్జీలాటివాళ్ళు. ఏటైలరుకిచ్చినా గుడ్డ రెండు మీటర్లే, అందులోనే పొడుగుచేతులు,పొట్టి చేత్లులు,కాలర్ లెస్ ఇలా రకరకాలుగా చొక్కా కుట్టగల దర్జీలాటివారు.  ఏపార్టీ వాళ్ళు అధికారంలో కొస్తే ఆ పార్టీ రాజకీయనాయకులు చెప్పినట్టు బడ్జట్లు, పరిపాలన అల్లగలవారు. 

 వీళ్ళూ ఓట్లేస్తారుగాని తెలీదు,ఎక్కడేసేరన్నది, వీళ్ళగురించి వార్తలే తెలియవు. కన్నగాడు కత్తిమరవడని, వీళ్ళబాగు ఒప్పు వీళ్ళు బాగానే చూసుకుంటారు. బడ్జట్ బాధలుండవు.

ఇక మిడిల్ క్లాసు వాళ్ళు. వీరికీ బడ్జట్ గోలుండదు, పట్టించుకోరు. పైవారంతా పోలసీ మేకర్లైతే వీరు పాలసీ ప్రోపగేటర్లు,కొత్తకొత్త,వింతవింత భాష్యాలూ చెప్పగలవారు, ఒపీనియన్ మేకర్లు.వీరు ఏ రంగంలోనైనా ఒకటే, అది పబ్లిక్ కావచ్చు లేదా ప్రైవేట్ కావచ్చు. వీరతి మేధావులు. నూటికి పది మంది. వీరిలో వ్యాపారస్తులు,మధ్య మేనేజిమెంటువారు, పన్నులు వసూలు చేసేవాళ్ళు ఇలా ఉంటారు. ఇంకా చెప్పుకోవాలంటే పత్రికా ఎడిటర్లు,కొండొకచో విలేకరులు. వీరందరి ధ్యేయం సొమ్ములు చేసుకోడమే,ఎలాగైనాగానీ! అల్లప్పుడు అలా జరిగింది,ఇల్లిప్పుడిలా జరిగిందంటూ పుస్తకాలు రాసుకునీవోళ్ళు, అమ్ముకుని సొమ్ము చేసుకునీటోళ్ళు.వీరంతా రాజకీయనాయకుల కళ్ళలో పడాలని అనుకుంటూ ఉంటారు,ఎప్పుడూ. అతిమేధావులుగా గుర్తింపు పొందాలని తహతహలాడిపోతుంటారు. ప్రాజాస్వామ్యం,వ్యక్తిస్వాతంత్ర్యం,వాక్స్వాతంత్ర్యం,కాన్సిట్యూషన్, రాజ్యాంగం ఇలా గొప్పగా మాటాడగలవారు.తిమ్మిని బెమ్మిని, బెమ్మిని తిమ్మిని చేయగలవారు. వీరూ ఓట్లేస్తారు,వీలుబట్టి.వీళ్ళు పైవాళ్ళలో చేరిపోవాలనుకుంటూ ఉంటారు,పైవాళ్ళు వీళ్ళని అవసరానికి ఉపయోగించుకుంటారు. అవసరం తీరేకా బయటికి గెంటుతూ ఉంటారు. 


ఇక చివరివాళ్ళు లోయర్ మిడిల్ క్లాస్. వీళ్ళు నూటికి ఇరవైమంది. వీరికి సోకులెక్కవ, వచ్చేది తక్కువ.  వీరంతా మేధావులు. వీళ్ళకి ఏమిచ్చినా తృప్తి లేనివాళ్ళు. నిత్య అసంతృప్తులు. ఏదో ఒకటి ధర తగ్గిందంటే రెండోది పెరగలేదా అంటారు. వీళ్ళకి పట్టింపులెక్కువ,ఆచారాలు,వ్యవహారాలు అన్నిటా.వ్యక్తి ఆరాకులు, అలా అరాధించే నమ్మినవానికైనా ఓటేయరు.   వీరు తీవ్రంగా ద్వేషిస్తారు,తీవ్రంగా ప్రేమిస్తారు. ఎన్నికల రోజు తప్పకపోతే, ఎవరేనా వచ్చి తీసుకెళితే, అక్కడ లైన్ లో జనం లేకపోతే ఓటేస్తారు, లేదూ శలవు రోజుకదా! ముడిచిపెట్టుకు పడుకుంటారు. అబ్బో వీరే పెద్ద పెద్ద ఉపన్యాసాలు రాస్తారు,కీ బోర్డ్ వారియర్లూ వీరే! మమ్మల్నెవరూ పట్టించుకోటంలేదంటారు. వీళ్ళకి భయమెక్కువ.ఉన్నమాట చెప్పలేరు. అలాగే చస్తూ బతుకుతూ బతుకీడ్చేస్తారు. నిజంగానే వీళ్ళనెవరూ పట్టించుకోరు.కింద తరగతిలోకి జేరలేరు,పైతరగతికి జేరలేరు. వీళ్ళింతే! నిత్య అసంతృప్తులు!. 

 ఇక చాల్లే! చెప్పుకుంటే ఎంతైనా ఉంది, నడు అంటూ లేచాడు మా సత్తిబాబు.


4 comments:

  1. Replies
    1. బుచికి6 February 2024 at 09:51
      ధన్యవాదాలు.
      లోయర్ మిడిల్ క్లాస్ మేధావులు మారరు. మారేందుకు ప్రయత్నం కూడా చెయ్యరని బాధండి.

      Delete
  2. బడ్జెట్ అంటే BUD GET.
    అంటే అందులోని ప్రాజెక్టులన్నీ మొగ్గ దశలోనే ఉంటాయి ఎప్పటికీ, మా నరసాపురం కోటిపల్లి రైల్వే లైనులా.. అవి పువ్వు, కాయ, పండు అవడం మనం చూడం.

    ReplyDelete
    Replies
    1. bonagiri6 February 2024 at 17:47
      నిజమండి. గత నలభై ఏళ్ళుగా నత్తనడక నడుస్తున్నట్టే ఉంది.

      Delete