Sunday, 3 December 2023

ఇలా జరిగింది.

 ఇలా జరిగింది.

 వివిధ ఇంగ్లీషు పత్రికలలో ( ఏడుపుగొట్టు పత్రికలతో సహా)  వచ్చిన వార్తలు చదివిన మీదట ఏర్పరచుకున్న అవగాహనతో రాసినది.


సొరంగం కూలినదాని గురించి  తెలుసుకోడానికి,  కొన్ని ముందు మాటలు.సొరoగం పొడవు నాలుగు కిలో మీటర్ల పైమాట. ఎత్తు పదేను మీటర్లు. చుట్టుకొలత నలభై ఐదు మీటర్లవుతుంది. సొరంగం రెండు కిలోమీటర్ల పైగా తవ్వేసేరు. స్టీలు గర్డర్లు అమర్చుకుంటూ కాంక్రీట్ చేసుకుంటూ ముందుకు కదులుతున్నారని అవగాహన. ఈపని కొంత దూరం జరిగింది. ఈ కూలినచోటు ముఖద్వారానికి కొద్ది  దూరంలోనే జరిగినట్టు అనిపిస్తుంది. కొద్దిగా కాంక్రీటు రాలితే చర్యలు తీసుకునేలోగానే కూలిపోయింది. కూలిన డెబ్రిస్ లో మట్టి,రాళ్ళు, కాంక్రీటు, ఇనుము కూడా ఉన్నాయి. సొరంగం కూలిన దూరం అరవై మీటర్లని అంచనా! డెబ్రిస్ దూరం అరవై మీటర్లు. సొరంగం తవ్వినంత మేరా కరంటు ఏర్పాటుంది. లోపల ఒక నీటి ఊట ఉన్నది. దానినుంచి వచ్చేనీటిని బయటికి పంపేందుకు ఒక పైపు వేయబడింది.


సొరంగం కూలే సమయానికి లోపల పనివారున్నారు. వెంటనే వారిని రక్షించే చర్యలు మొదలయ్యాయి. ఎంతమందున్నారో ( వెంటనేతెలీదు ), ఎలా ఉన్నారో తెలీదు. లోపలివారికి బయటివారికి మధ్య సంభాషణకి మార్గం,మాధ్యమంలేదు. ఈ పరిస్థితులలో కూలిన డెబ్రిస్ ని తొలగించడానికి పూనుకుంటే, మరికొంత కూలడం మొదలైతే, దాన్ని అపేసేరు. ఇతర విధాలగా రక్షణ చర్యలు ప్రారంభించారు.


 ఇక  లోపలివారు,  ఉన్నవారెంతమందో, లోపలున్నవారెలా ఉన్నారో, ప్రమాదంలో గాయపడ్డారో చూసుకున్నారు, బయటపడే మార్గానికి ఎదురు చూస్తూ. లోపల నలభై ఒక్కమంది ఉన్నట్టూ అంతా బాగున్నట్టూ,లోపల కరంట్ ఉన్నట్టూ, పోలేదని వివరంగా ఒక చీటి మీదరాసి నీటి పైప్ లో వదలిపెట్టేరు. దీని బయటివారు చూసి అమ్మయ్య! అంతా బతికున్నారని సంబరపడి రక్షణ చర్యలు ముమ్మరం చేస్తూ, లోపలివారికి ఆహారం, మిగిలిన వసరాలూ కోసం ఒక ఆరంగుళాల పైప్ ని లోపలికి చొప్పించారు.   ఆరంగుళాల పైప్ లకి మరలుంటాయి, ఆ పై సైౙ్ వాటికుండవు. పైప్ పొడవు ఆరుమీటర్లుంటుంది. ఆరంగుళాల హోల్ డ్రిల్ చేసి అందులో పైప్ ని దూర్చేసేరు, కపులర్ బిగించి తరవాత పైప్ ని దూర్చచ్చు. కాని మూడడుగుల పైప్ కి అలా కుదరదు. వెల్డింగ్ చెయ్యాలి అదికూడా అన్నీ ఒక్క సారి చేసేస్తే కుదరదు. ఒక పైప్ దూర్చిన తరవాత దానిలోంచి ముందుకు డ్రిల్ చేసి ఈ కొత్త పైప్ ని లోపలున్నదానికి వెల్డ్ చేయ్యాలి, అదికూడా జాగ్రత్తగా చెయ్యాలి ఖాళీలు లేకుండా! ఇవన్నీ సమయం తీసుకునే పనులే! మరికొంతమంది వెల్డర్లని డిల్లీ నుంచి పంపేరు. ఇలా సమయం గడుస్తూంది. అంతేకాదు ఈ డ్రిల్ మిషనలకి కూడా విరామం కావలిసొచ్చేది రెండు గంటల పని తరవాత. ఇలా ఆశ నిరాశల మధ్య ఊగులాడుతూ పని కొనసాగింది, మొండికి పడిపోలేదు.    ఇదంతా నేను చెప్పినంత తేలిగా జరగలేదు. 


లోపలున్నవారి దగ్గర పెన్నూ పేపరూ ఉండటం అదృష్టం. పేపర్ మీద రాసి నీటి పైప్ లో వదలాలనే ఆలోచన రావడం అదృష్టం. ఇటువంటి గత రెండు సంఘటనల్లో చిక్కుకుని బతికి బయటపడ్డ సీనియర్, గబ్బర్ సింగ్ నేగీ లోప  చిక్కుబడటం మరో అదృష్టం. బయటివారు ఆరంగుళాల  పైప్  లోపలి చొప్పిస్తే దానికి అడ్డులేం తగలకపోవడం మరో అదృష్టం. ఇదంతా జరగడానికే రెండు రోజుల పైగా సమయం పట్టినట్టుంది. ప్రతి క్షణం ఏం జరగబోతుందో తెలీదు.  ఈ నేగి అనే ఆయన లోపల వారికి ధైర్యం చెప్పడమే కాక అందరూ ఒకరితో ఒకరు మాటాడుకునే మాట చెప్పేరు. యోగా చేసేరు,చేయించేరు. కొంతమందికి నేర్పేరు కూడా. ఇది లోపలి వారికి కలిసొచ్చిన అదృష్టం. 


అంతా ఉత్కంఠ, నిజానికి కొన్ని రోజులు వార్తలు చదువుతూ నేను కొంత ఉద్విగ్నతకులోనై నిద్రలేక ఆరోగ్యం చెడగొట్టుకున్నానన్నది నిజం. ఆరంగుళాల పైప్ లోంచి కెమేరా పంపించారు, లోపలికి. వీడియో  తీశారు. కావలసిన వన్నీ ఆహారంతో సహా పైపు లోంచి లోపలకి పంపించారు.  

లోపలివారి క్షేమసమాచారం బంధువులకి చేరేసేరు. ఆ తరవాత సెల్ ఫోన్ లు లోపలికి పంపేరు,లోపలివారు వారికి కావలసినవారితో మాటాడటానికి. ఇక  బయటికి తీసుకు రావడానికి మూడడుగుల పైప్ లోపలికి చొప్పించే పని మొదలెట్టేరు. యంత్రం హుటాహుటిన అక్కడికి చేరుకుంది.కొంత పనయింది.  పనయింపోతుంది, దీనితో అనుకునేలోగా యంత్రం చెడింది, బాగుచెయ్యడానికి సమయం పట్టింది.మళ్ళీ మొదలెట్టి కొంతపనయ్యేటప్పటికి మళ్ళీ చెడింది, మరి బాగుకాలేదు. ఈలోగా చాలా సార్లు స్టీలు అడ్డుపడటం దానిని తొలగించడానికి చర్యలు తీసుకోడం జరిగింది.   అడ్డుపడిన స్టీలు గర్డర్లని కొయ్యడానికి కట్టర్ యంత్రాలని హైదరాబాద్ నుంచి వాయుమార్గంలో పంపేరు. చాలా యంత్రాలు డిల్లీనుంచి వచ్చాయి. ఇక రెండవ అమెరికన్ డ్రిల్ యంత్రం మారుమూల ఉన్నదానిని ప్రత్యేక మార్గంలో,  రైల్వే చేరేసింది, హుటహుటిన.   ఈ యంత్రం కొంతపని పూర్తి చేసింది. దీన్ని  నిలబెట్టడానికి   కాంక్రీట్ వెయ్యల్సివచ్చింది. కొంత పనయ్యాకా కాంక్రీట్ నిమళ్ళీ పటిష్టం చేయాల్సివచ్చింది. ఈలోగా ఇటువంటి విషయాలమీద అవగాహన కలిగిన థాయ్ నిపుణులను సంప్రదించారు. ఆ తరవాత ఒక అమెరికన్ నిపుణుడు చివరిదాకా ఇక్కడే మకాం చేసేరు. ఇదొకటే రక్షణ మార్గం కాకపోవచ్చని పైనుంచి తొలిచే డ్రిల్ ఒ.ఎన్ జి.సి వారు ఏర్పాటు చేసి కొంతపని చేసేరు. కొన్ని అవసరమైన కొత్త రోడ్లు వేసేరు,హుటాహుటిన. ఇక లోపలివారి ఆరోగ్యానికి చర్యలు తీసుకున్నారు, మానసిక ఆరోగ్య నిపుణులు సలహాలిచ్చారు. పక్కనుంచి మరో సొరంగం చిన్నది తవ్వాలనుకున్నారు. ఇలా చాలా ఆలోచనలు చర్యలూ సాగాయి.అందరిది ఒకటే లక్ష్యం లోపలివారిని క్షేమంగా బయటకు తీసుకురావాలి. ఈ అమెరికన్ యంత్రం చాలా పనిచేసి చివరగా లోపలివారికి పన్నెండు మీటర్ల దూరంలో ఉండగా చెడిపోయింది. దీన్ని తొలగించడానికే సమయం పట్టింది. చిక్కుపోయిన యంత్ర భాగాలు తొలగించడం పెద్ద పనైపోయింది.ఇలా ఎప్పటికప్పుడు ఆశ నిరాశల మధ్య ఊగులాడింది.    చెప్పినంత సులువుగానేం జరగలేదు.  . ఈ పనులు హుటహుటిన జరగడానికి అన్ని శాఖలూ వెంటవెంటనే పనిజేసాయి.


ఇలా మూడదుగుల పైప్ చొప్పించే పని చివరికి చేరడానికి పన్నెండు మీటర్ల దూరంలో ఆగిపోయింది. ఇప్పుడు నిరాశ కమ్ముకుపోయింది. ఈ పరిస్థితులలో ఎలుకబొరియ విధానం అక్కరకొచ్చింది. ఏమది?


ఎలుక తనులోపలికి వెళ్ళడానికి తనుపట్టేపాటి రంధ్రం చేస్తుంది, మట్టి వెన్నకి తోస్తూ తనులోపలికి ప్రవేశిస్తుంది. ఇలా మైనింగ్ చేయడం అనాదిగా ఉన్నదే. ఈ పనికి ముగ్గురుంటారు. ఒకరు తవ్వేవారు, ఒకరు మట్టి పోగుచేసి తట్టలలో నింపేవారు, మూడో వారు దానిని బయటికి చేరేసేవారు. ఈ విద్య ఇంకా అక్కడక్కడ అవసరపడి అమలు లోనే ఉన్నది. నవయుగ అనే కంపెనీ నీటి గొట్టాల్లో పేరుకుపోయిన మట్టిని ఈ విధానంలో తొలగిస్తూ ఉంటుంది. విషయం తెలిసిన కంపెనీ ఆరుగురిని ఒక చోటనుంచి, మరో ఆరుగురుని మరో చోటనుంచి ఎంపిక చేసింది. వారిని సిల్క్ యారా పంపింది. వీరు ముగ్గురు ఒక జట్టుగా ఆరేసిగంటలు  పనిచేసేరు. మొత్త పన్నెండు మీటర్ల దూరాన్ని 22 నుంచి 26 గంటలలో తవ్వి పైప్ అమర్చేందుకు సిద్ధం చేస్తే పైప్ ని దూర్చి వెల్డ్ చేసి దారి ఏర్పాటు చేసేరు.


ఇంతజరిగిన తరవాతగాని లోపలివారిని బయటకు తీసుకురావడం సాధ్య పడలేదు. నేను కొన్ని విషయాలని ముందు వెనుకలూ చెప్పి ఉండచ్చు. మొత్తానికి ఇది ఇలా సాధ్యమయింది.    

 

 నిజానికీ టపా రాయగలిగి రాయలేదు. బోనగిరిగారి మాట "ఆ పైప్ ని ముందే వేసుకునుండచ్చుగా?" అన్న ప్రశ్న నాచే ఈ టపా రాయించింది, చాలా కష్టపడ్డాను. ఈ రోజు మొత్తం నాలుగు గంటలు పైగా కంప్యూటర్ దగ్గర కూచున్నా!. 


ఇక ఇటువంటి భారీ పనులు జరిగే చోట ప్రమాదం జరక్కుండా తీసుకోవలసిన జాగ్రత్తలేంటి? ఏవి తీసుకున్నారు? ప్రమాదం జరిగితే తప్పించుకునే మార్గాలేంటి? వాటిని తీసుకున్నారా? ప్రశ్నలుండిపోయాయి. జరగబోయే ఎంక్వైరీలో బయటకు రావచ్చేమో!    


4 comments:

  1. ఈ వయసులో మిమ్మల్ని ఇంత కష్టపెట్టినందుకు క్షమించండి.
    నేనేదో క్లుప్తంగా ఆ పైపు ముందే వేసుకుని ఉంటే బాగుండేది అని వ్రాసాను. అంటే నా ఉద్దేశ్యం సొరంగం నిర్మిస్తున్నపుడు వెనువెంటనే ఆ పైపు కూడ వేసుకుని ఉంటే ఇంత రాద్ధాంతం జరిగేది కాదు అని. నిజానికి ఇలాంటి ముందు జాగ్రత్త చర్యలు లేకుండా నిర్మాణాలు జరగవు. ఎక్కడో పొరపాటు జరిగింది.

    ReplyDelete
    Replies
    1. bonagiri3 December 2023 at 16:48
      మీరన్న మాట అందరికి తోచీదేనండి. క్షమించవలసిందేంలేదు. కొద్ది జవాబుతో సరిపెడదామనుకున్నాకాని జరిగింది చెప్పాలనిపించింది, మీ మాట ఊత ఇచ్చింది! మీమాట నిజం, ఎక్కడో పొరపాటు జరిగింది.

      Delete
  2. అవును బోనగిరి గారు, Disaster Recovery కి మార్గం ముందే చూసుకుని ఏర్పాటు చేసుకుని ఉండాలిగా. ఇక్కడ అలా జరగకపోవడం ఆశ్చర్యంగానే ఉంది.
    అందరూ బతికి బయటపడ్డారు కాబట్టి సరిపోయింది గానీండి లేకపోతే చాలా ప్రాణనష్టం జరిగేది.

    శర్మ గారూ, ఇంత సమాచారం ఎక్కడ దొరికిందండీ? చాలా వివరంగా వ్రాశారు. 👏👏

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు3 December 2023 at 18:36

      మొదటి సారిగా 41 మంది చిక్కుకుపోయారనే వార్త నిలేసింది. ఆపైన దీని గురించిన వార్తలకోసం పత్రికలు తిరగేస్తూ వచ్చాను. చాలా వాటికి తమ ఎజండాలే కదా! పూర్తి వార్త ఎక్కడా దొరకలేదు, ఏరోజూ. అనేక పత్రికలని , రెండు పూటలా చదివి ఒక అవగాహన కొచ్చానండి, ఏరోజుకా రోజు.దానితో ఉత్కంఠ పెరిగి కొంత నిద్ర కూడా చెడగొట్టుకున్నాను. ఇంతమంది చిక్కుకుపోయినందుకు చాలా బాధనిపించింది, వార్తలకోసం వెతక్క ఉండలేకపోయాను.పూర్తి వార్త దొరికే సావకాశం ఉండదనిపించి ఈ టపా రాసాను, దానికి బోనగిరిగారి మాట దోహదం చేసింది.

      Delete