Thursday 28 December 2023

తుమ్ముకి తమ్ముడున్నాడు ఆవులింతకి అన్న లేడు.

  తుమ్ముకి తమ్ముడున్నాడు ఆవులింతకి అన్న లేడు.

ఇదొకనానుడి జనసామాన్యం చెప్పుకునీదిన్నీ! ఏమి దీని కత?


     తుమ్ము సాధారణంగా ఒంటరిగా ఉండదు. కనీసం రెండు సార్లు తుమ్ముతారు. కొంతమంది మూడు,నాలుగు,ఐదు సార్లు వరసగా తుమ్మడం అలవాటు ఉంటుంది. అందుకే తమ్ముకి తమ్ముడున్నాడంటారు, అంటే ఒక్కసారి తుమ్మడంతో కాదు, మరోసారి కూడా  తుమ్ముతారు  సుమా! అని చెప్పడమే.

ఇక ఆవులింతకి అన్నలేడు. నిజం :) అన్నలేడన్నారుగాని తమ్ముడు  లేడనలేదు. అంటే ఆవులింత కూడా వస్తే ఒక్కసారితో కాదు. వరసగా వస్తాయని చెప్పడం. కొంతమందైతే అలా అవులిస్తోనే ఉంటారు.  కొంతమంది ఆవులింతతో పెద్ద పెద్ద, వింత వింత శబ్దాలు కూడా చేస్తారు.


అసలు తుమ్మెందుకొస్తుంది? అదీ తెలుసుకోవలసింది. ముక్కులోకి ధూళి కణాలు చేరినా, ఘాటైనా వాసన పీల్చుకున్నా వాటిని అసంకల్పితంగా బయటకు పంపే చర్యనే తుమ్ము. ధూళి కణాలను అడ్డేందుకు ముక్కులో వ్యవస్థ ఉంది.వెంట్రుకలుంటాయి,  ముక్కు తడిగా ఉంటుంది.. ఇవి ఫిల్టర్ లా పనిచేస్తాయి. వాటిని అందంకోసం తొలగించేస్తున్నారు. ఆలిఫేక్టరీ నాడులకొసలు ప్రతిస్పందించి, లోపలికి ఊపిరి తిత్తులలోకి పీల్చుకున్న ఘాటైన వాసనల్ని బయటికి పంపించేస్తాయి.


ఇక ఆవులింత శరీరం అలసినపుడు నిద్ర ముంచుకొస్తున్నవేళ ఆవులింతలొస్తాయి,ఎక్కువగా.!


తుమ్ముకుని చిరంజీవ అనుకోడం.

తుమ్మినపుడు గుండె లిప్తకాలం లయతప్పి మరలా లయ అందుకుంటుందట. దానికిగాను, తుమ్మితే పెద్దలు చిరంజీవ అని  ఆశీర్వదించడం  అనూచానంగా వస్తున్న అలవాటు. గుండె లయతప్పడమన్నది మనవారికి తెలుసునా? ఏమో చెప్పలేను. కాని చిరంజీవ! అని ఆశీర్వదించడం మాత్రం అనూచానంగా జరుగున్నదే!

రాత్రులు భోజనసమయంలో తుమ్మితే నెత్తిన నీళ్ళు జల్లి చిరంజీవ అని ఆశీర్వదించడం అలవాటు. అలా పెద్దలు ఆశీర్వదించేదాకా మరోముద్దనోట పెట్టకూడదంటారు. కారణమేమై ఉండచ్చని ఆలోచిస్తే మరో తుమ్ము రావచ్చనీ అందుకుగాను కొద్ది సమయం వేచి చూడడం మంచిదని అనుకుంటా!  ఇలా తుమ్మిన తరవాత ఆశీర్వదించేవారు లేక,తమమటుకు తమరే ఆశీర్వదించుకోడాన్ని తుమ్ముకుని ఆశీర్వదించుకోవడమంటారు.


దీన్ని తర్జుమాచేసి  తప్పుచేసి (మరొకరు తప్పుపట్టేలోపు)తమనుతామే నిందించుకోవడాన్ని ఈ నానుడితో చెబుతారు.


తుమ్ముపై లోకoలో మాటలు

తుమ్మును ఎక్కువగా అపశకునంగానే భావిస్తారు.

తుమ్ముకుంటూ నిదరకి ఉపక్రమించచ్చంటారు.

తుమ్ముకుంటూ నిద్ర లేవకూడదంటారు.

తుమ్ముకుంటూ ప్రయాణానికి బయలుదేరకూడదంటారు.

ప్రయాణానికి బయలుదేరి ఒకడుగేసిన తరవాత,వెనకనుంచి తుమ్ము వినపడితే, వెనకతుమ్ము ముందుకు మంచిదంటారు. ప్రయాణం సాగిస్తారు.


15 comments:

  1. ఆలిఫేక్టరీ నాడులకొసలు .

    ఏ ఆలి , ఫేక్టరీ యిది ?


    ReplyDelete
  2. ఇప్పుడు చిరంజీవ అనడం ఇంకా ఎక్కడుంది సారూ? నాగరీకులమై పోతున్నాం కదా, అందువల్ల Bless you అని విదేశీ భాషా పలుకులు పలుకుతున్నారు. దాన్నే మన పద్ధతిలో చిరంజీవ అంటామనే సంగతి కూడా తెలియనంత విదేశీ వ్యామోహం.

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు28 December 2023 at 10:38
      బానిసత్వపు అలవాటు కదండీ :)

      Delete
    2. దీనిమీద ఒక ఎప్పుడో ఒక జోక్ విన్నాను. ఒకడు "ఎవరైనా తుమ్మితే తెలుగులో మనం చిరంజీవి అంటాం కదా, మరి ఇతర భాషలవాళ్ళు ఏమంటారు. వారికి చిరంజీవి గురించి అంత పెద్దగా తెలీదు కదా" అని అడిగితే, ఇంకోడు "హిందీవాళ్ళైతే బహుశా అమితాబ్ బచ్చన్ అని అంటారేమో" అని అంటాడు.

      Delete
    3. కాంత్28 December 2023 at 20:14
      చిరంజీవ అంటే ’చిరకాలమూ జీవించు’ అని ఆశీర్వచనం అనుకుంటున్నానండి :) చిరంజీవి అంటున్నారేమో చెప్పలేను. అదేనా అంటున్నారా అని సందేహమేనండి చాలా మందికి, అసలిది తెలుసునా అన్నదీ సందేహమే సుమా!

      ఇతరభాషలవాళ్ళేమంటారో తెలియదు. బహుశః మీరుచెప్పినట్టే కావచ్చు :)

      Delete
    4. శర్మ గారు,
      “చిరంజీవ” అనే పదం నిఘంటువులో కనబడలేదండి. కానీ పలకడానికి (ఆశీర్వదించడానికి) తేలికగా ఉంటుందని చిరంజీవ అంటారేమో? చిరంజీవి అనాలంటే పలికేందుకు సరిగ్దా రాదు, దాని ద్వితీయభాగంలో “వై వర్థిల్లు” లాంటి దేదన్నా ఉంటే తప్ప, అప్పుడు గానీ సంపూర్ణం అవదు కదా.

      Delete

    5. విన్నకోట నరసింహా రావు29 December 2023 at 14:51


      చిరంజీవ పదం నిఘంటువులో కనపడలేదండి. ఇది సంస్కృత శబ్దమట. చిరంజీవి అన్నమాటే కనపడుతోంది. అర్ధం బహుకాలం జీవించినవాడు అని చెబుతోంది. చిరంజీవ,చిరంజీవి రెండు పదాలకీ ఒకటే సమాధానం కనపడుతోందండి, ఆంధ్రభారతిలో. అది జరిగిపోయినకాలాన్ని సూచిస్తోందేమో అనుకుని చిరంజీవ సరిపోతుందేమో అనుకున్నా! బహుకాలము జీవించు అన్నట్టుగా!

      Delete
    6. చిరం- జీవ అన్నది రెండు పదాలు. చిరం అంటే చిరకాలం (త్వం) జీవ అంటే జీవించు అని సంస్కృత భాషలో చెప్పడం అవుతుంది.

      Delete
    7. బుచికి29 December 2023 at 22:33
      ఇవి రెండు పదాలన్నమాటే గుర్తు రాలేదు సుమండీ! త్వం చిరంజీవ అన్నదానిలో మీరన్నట్టు త్వం లోపించిందంతే!

      ఇక నేను ఇద్దరమ్మల నుంచి విన్నదీ చిరంజీవ పదమే, కాని ఏభై ఏళ్ళ పైమాటవడంతో మరుపునపడిపోయింది. కన్నమ్మపలికిన సంఘటన.
      నేను లంఖణాలు చేస్తూ, ఈవేళా రేపా అన్నట్టు ఉన్న సమయాన, చావుబతుకులలో ఉన్నపుడు, 55 లంఖణాల తరవాత హటాత్తుగా లేచి మంచంమీద కూచుని తుమ్మేను. అమ్మ పరుగునవచ్చి చిరంజీవ అని ఆశీర్వదించి,మంచం మీద నుంచి లేపి ఆ పక్కన ఉన్న ఎత్తు పీట మీద కూచోబెట్టింది. మళ్ళీ మరోసారి తుమ్మేను. మళ్ళీ చిరంజీవ అని ఆశీర్వదించింది. తుమ్మినందుకు ఆనందపడింది. ఆరోజు ఇంట్లో వారంతా పండగ చేసుకున్నారు. కారణం లంఘనాలు చేస్తున్నవారు అకారణంగా తుమ్మితే జ్వరం దిగిపోయి నట్టేనని నమ్మకం, నాటిరోజుల్లో. నిజంగానే జ్వరం తగ్గిపోయింది. ఐదు రోజులు చూచి పద్యం పెట్టేరు, కొర్రజావతో. అప్పుడు అమ్మ ఆశీర్వదించినది చిరంజీవ అనే! ఈ పదం మీద చర్చతో సంఘటన గుర్తుకొచ్చింది. ఇలా బతికి బట్టకట్టేను.
      ధన్యవాదాలు.

      Delete
  3. నేను విన్నది "తుమ్ముకి తమ్ముడున్నాడు కానీ ఆవులింతకి అప్పగారు లేరు" అని. అయినా ఆవులింతకి సొంత అన్నగారు లేకపోవచ్చుగానీ, వేలువిడిచిన అన్నలు, తమ్ముళ్ళు ఉన్నారు. ఎందుకంటే, ఒకరు ఆవులిస్తే, వెంటనే ఇంకొంతమందికి ఆవులింత వస్తుంది. ఇది ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు కూడా అప్పుడప్పుడు జరుగుతుంది

    ReplyDelete
    Replies

    1. కాంత్28 December 2023 at 20:10
      ప్రాంతాలని బట్టి చిన్న చిన్న తేడాలుంటాయి. అప్ప అన్నదానికి అరవంలో తండ్రి అని అర్ధమనుకుంటా, తెనుగుగువారైతే అక్కగారు అని అర్ధం చెబుతారు. ఇక మలయాలీలు,కర్ణాటవారు అప్పకి అర్ధం ఏం చెబుతారో చెప్పలేను. కర్ణాటకలో మగవారి పేరు చివరకూడా అప్ప శబ్దం కనవస్తుంది.

      మీరన్నది నిజమే ఆవులింత అంటువ్యాధిలాటిది, ఒకరికొస్తే ఆ తరవాత మరొకరు ఇలా అవులిస్తూనే ఉంటారు.

      Delete
  4. తుమ్మిన బిడ్డను వట్టుక
    నెమ్మి ' చిరంజీవ ' యనుట , నెఱి దీవనయే ,
    ఎమ్మెయి ఈ జనవ్యవహా
    రమ్ములు ఘన డిష్నరీల రాయుదురు ? బుధా !

    ReplyDelete
    Replies
    1. - జాల్రా

      జనుల వ్యావహారికముల శర్మగారు
      ప్రాజ్ఞులకటా నిఘంటువు పరిసరముల
      రా ననుమతి నిత్తురకో పరాకు నైన
      కొంత చింతించి చూడుడి కోవలుపడు!


      జిలేబుల్స్ చైంచిక్

      Delete
    2. వెంకట రాజారావు . లక్కాకుల29 December 2023 at 19:15
      చిరంజీవ నాపదం ఒక్కటే అనుకున్నానండి. వెతికితే అర్ధమూ దొరకలేదు. చిరంజీవి కే అర్ధమిచ్చింది. ఇలా చాలా పదాలు నిఘంటువులకు చేరనివున్నాయి,జన సామాన్యంలో.
      నమస్కారాలు.

      Delete
  5. చిరంజీవ అన్నపదం విభక్తి ప్రత్యయంతో ఏర్పడిన రూపమనీ,ఇది సంబోధన అనీ, సంస్కృత శబ్దమనీ చాలా చెప్పేరొక మిత్రులు. నాకే పూర్తిగా అర్ధం కాలేదు.

    ReplyDelete