Thursday, 26 August 2021

కన్యా వరయతే రూపం…

 కన్యా వరయతే రూపం…

కన్యా వరయతే రూపం
మాతా విత్తం, పితా ధనం
బాంధవా కులమిఛ్ఛంతి
మృష్టాన్నమితరే జనాః.

ఇది పూర్వ కాలంలో చెప్పిన మాట. ఏంటిటా? కన్యా వరయతే రూపం, ఇది తెలుస్తూనే ఉంది, నేటి కాలానికి కూడా అమ్మాయి ముందు చూస్తున్నది, కాబోయే వాడు అందగాడేనా? అని. ఇది అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికి మారని సత్యం. ఆత్మ సౌందర్యమే అసలు సౌందర్యమన్న మాట తెలిసేటప్పటికి చేతులు కాలుతున్నాయి. ఆ వయసులో ఆలోచన అలాగే ఉంటుంది, అది ప్రకృతి సిద్ధమైన ఆకర్షణ కనక. తరవాతది మాతా విత్తం, ఇది మాత్రం నూటికి నూరు పాళ్ళు నిజం, అప్పుడూ, ఇప్పుడూ కూడా. తల్లి అనగా కన్యా ప్రదాత భార్య, కాబోయే అత్తగారు, తన అల్లుడికి ఉన్న సంపాదనా మార్గాలు, రాబోయే, లేక ఉన్న ఆస్థిపాస్థులు, అల్లుడు అమ్మాయికి పెట్టబోయే నగలు, నాణ్యాలు, ఇంటి వస్తువులు, తన కూతురు అనుభవించబోయే సుఖ, భోగ, సంతోషాలగురించి ఆలోచిస్తుందట, అందుకే మాతా విత్తం అన్నారు.  ఇప్పటికి ఇందులో మార్పు రాలేదు, ఇక ముందుకూడా రాదు. “పెళ్ళి సంబంధం చూసొచ్చానోయ్! మనమ్మాయికి, కలిగినవారు, బలగం ఉన్నవారు, సరసులు” అంటే. ” అది సరేగాని అబ్బాయి ఏం సంపాదిస్తున్నాడు, ఇతని వాటా కొచ్చే ఆస్థి ఎంత? ఇతని సంపాదన పెరుగుతుందా? జీతమేనా పైన గీతం కూడా ముడుతుందా” ఇదీ ప్రశ్న, తల్లినుంచి వచ్చేది. ఆ తరవాతది పితా ధనం, ఇదేంటీ, తల్లి విత్తం చూస్తోందిగా అని అనుమానం రావచ్చు, విత్తానికి ధనానికి తేడా ఉంది. తండ్రి చూసేది ధనం కదా! అది అభిమానధనం, పౌరుషధనం, మరి ఇతరమైన ధనాలు అనగా విద్య వగైరా చూస్తాడు. ఇది కూడా నేటి కాలానికీ నిజమే, అబ్బాయి చిన్న ఉద్యోగం లో ఉన్నాడని అనుకోవద్దు, అతనికి పెద్ద ఉద్యోగానికి, సంపాదనకి తగిన హంగులున్నాయి, వృద్ధిలోకి వస్తాడు అన్నది చూస్తాడట, ఇది తండ్రి ముందు చూపు. ఇది కూడా నిజమే ఇప్పటికీ.  బాంధవా కులమిఛ్ఛంతి, కుర్రాడి తల్లి తండ్రులు తమ కులం అనగా తమ కట్టుబాట్లలో వారేనా కాదా, రేపు ఆ ఇంటివారితో సంబంధ బాంధవ్యాలు నెరిపేసావకాశం ఉందా, ఇవి చూస్తారట, తోటివారు.  ఇది కూడా నేటికీ సత్యమే.

ఇక చివరిది మృష్టాన్నమితరే జనాః పప్పన్నమే పెడతాడా? ఇంకా ఘనంగా చెస్తాడా, పెళ్ళి? మొన్ననెవరో పెళ్ళిలో అరవైనాలుగు పదార్ధాలు పెట్టేరు, ఈయన అంతకంటే ఎక్కువ చేస్తాడా, తక్కువ చేస్తాడా అని చూస్తారట.  చిప్పలో కూడెట్టినా, తిని వచ్చి “అహా! ఏం గొప్పగా చేసేడండి పెళ్ళి” ఆంటారు. ఇది కూడా నిజమే నేటి కాలానికి కూడా. ఇంక తేడా ఎక్కడండీ అని కదా మీ ప్రశ్న.

నేటి కాలంలో అమ్మాయి తన వరుణ్ణి తనే ఎంచుకుంటున్నప్పుడు, అంటే గాంధర్వ వివాహాలే ఎక్కువగా జరుగుతున్నపుడు, అమ్మాయే తల్లి తండ్రి, ఇతర బంధువులు చేయవలసిన పనులు చేసుకుంటూ ఉంది, తన పనితో, అనగా కన్యా వరయతే రూపంతో. నిజంగా నేటి అమ్మాయి ఎంత బాధ్యత తీసుకుంటూ ఉంది చెప్పండి. ఇదంతా చెప్పిన మాట వినకపోడంగా పరిగణించుకుంటే ఎలా? నేటి అమ్మాయిలు స్వతంత్రించి నిర్ణయాలు తీసుకోడం తప్పు లేదుకాని, తప్పుడు నిర్ణయాలు తీసుకుని అవస్థలు పడుతున్నారనుకుంటా. శకుంతల తండ్రికి చెప్పక వివాహం చేసుకుని కొడుకుని కని, ఎన్ని అవస్థలుపడి భర్తను చేరుకుందీ తెలుసుగా. అవి సత్య కాలపు రోజులు, మరి ఇప్పుడో…..

(3.1.2013)

No comments:

Post a Comment