Tuesday 17 August 2021

పెళ్ళికుదిరితే …..

 పెళ్ళికుదిరితే …..

     పెళ్ళికుదిరితే పిచ్చి కుదురుతుంది,పిచ్చి కుదిరితే పెళ్ళి కుదురుతుందని ఒక సామెత. ఎంతకీ తెగని సమస్యకి అనగా సమస్యల గొలుసుకి ఇది తార్కాణం. ఒక సమస్య తేలితే మరొక సమస్య తేలుతుంది, ఇది అది ముడిపడి ఉంటాయనమాట. ఏదీ జరగదు సమస్య తేలదు. జీవితంలో ఇటువంటివి ఎదురవుతూనే ఉంటాయి, ఏమీ చేయలేక,సమస్య పరిష్కరించుకోలేక కాలానికి,దైవానికి దానిని వదిలేసి ఊరుకుంటాం. ఇదిగో ఇటువంటి సమస్యలనే ఎదుటివారు, కావలసినవారమని, రేపి బాధపడుతున్నట్టు నటిస్తూ బాధపెడుతుంటారు. ”ఏం వదినా! మీ అమ్మాయికి పెళ్ళి సంబంధం కుదురుతోందన్నావు, ఏమయిందీ?” ఇది తెలిసి కెలుకుతూ వేసిన ప్రశ్న. ఎద్దు పుండు కాకికి నొప్పా? పెళ్ళి కుదిరితే సామెత గురించి మొదలెట్టి ఇలా పోచుకోలు కబుర్లు చెప్పడం బాగుందా అంటారా? వస్తున్నా! వస్తున్నా!! 🙂 ఈ సామెత గురించి ఒక కత చెప్పుకుందాం,చిన్నదే! సరేనా! ఊ అన్నారా? 🙂

అనగనగా ఒక పల్లెటూరు, ఆ ఊళ్ళో ఒక బాగా కలిగిన కుటుంబం, ఒకడే కొడుకు, లేకలేక కలిగాడు. అల్లారు ముద్దుగా పెంచారు, తెలివితేటల మాట దేవుడెరుగుగాని కుర్రాడు మాత్రం ఎర్రగా బుర్రగా పెరిగాడు, జాంపడులా. వయసొచ్చింది, పెళ్ళి చేయాలని నిశ్చయించారు, తల్లితండ్రులు. కలిగిన కుటుంబం, జాంపడులాటి కుర్రాడేమో పెళ్ళి సంబంధాలు విరగబడి మీద పడుతున్నాయి. పెళ్ళిళ్ళ పేరయ్యలు రోజుకో సంబంధం తెస్తున్నారు. సంబంధాలు చూస్తున్నారు. అబ్బాయికి అమ్మాయి నచ్చకా, అబ్బాయికి అమ్మాయి నచ్చితే వియ్యపురాలికి లాంఛనాలు నచ్చకా, ఇవి రెండూ నచ్చితే వియ్యంకుడికి కట్నం నచ్చకా, ఇవన్నీ నచ్చుబాటైతే అమ్మాయి వంశం గౌరవం హోదా నచ్చకా సంబంధాలు తిరిగిపోతున్నాయి. ఇదెంతదాకా అంటే ఎవరేనా పెళ్ళిళ్ళ పేరయ్య వీరి సంబంధం గురించి ఆడపిల్లవాళ్ళకి చెబితే ”వారికి నచ్చదయ్యా! ఏదో ఒకటి చెప్పి కాదంటా”రనే పేరు పడిపోయేటంతగా.

కాలామాగదుగదా! నడుస్తూనే ఉంది. అబ్బాయికి ఏళ్ళొస్తూనే ఉన్నాయి. ఏమయిందో తెలీదుగాని అబ్బాయి తిక్కతిక్కగా మాటాడుతున్నాడని ఊళ్ళో వాళ్ళు చెప్పుకోడం మొదలెట్టేరు. ఇది తల్లి తండ్రులకీ అనుభవంలోకొచ్చి వైద్యుని దగ్గరకి తీసుకుపోయారు. వైద్యుడు కారణాలు విచారించి వైద్యం చేశాడు. కొంతకాలం గుట్టుగా సాగింది, గుట్టు ఎంతకాలం సాగుతుంది? అబ్బాయికి మతిభ్రమణమని అందరికీ తెలిసిపోయింది. కొంతకాలం తరవాత వైద్యుడు తేల్చినదేమంటే ”అబ్బాయికి పెళ్ళైతే ఈ మతి భ్రమణం తగ్గుతుందీ” అని. పిచ్చని తెలియడం తోనే పెళ్ళి సంబంధాలు రావడం ఆగిపోయాయి. వైద్యుడు చెప్పింది బాగానే ఉందిగాని, పెళ్ళిళ్ళ పేరయ్యలు తుపాకి దెబ్బకి కూడా కనపట్టం లేదే! పిల్లనిస్తానని వచ్చేవాడూ, చేసుకుంటాననే పిల్లా కనపట్టం లేదే! ఏం చెయ్యాలి? పెద్ద సమస్య ఐపోయింది.

పెళ్ళిళ్ళ పేరయ్యలని సంప్రదిస్తే అంతావిని, ”అలాగే చూద్దాం, నాలుగైదు సంబంధాలకి చెప్పానండీ” అని సాచేస్తున్నారుగాని ఒక్క సంబంధమూ తీసుకురావటం లేదు. పైపెచ్చు, ”ఆ రోజు చిలకలాటి అమ్మాయి,అందగత్తె,చదువుకున్నది, కుర్రాణ్ణి చూసి మోజుపడింది,అని సంబంధం చెబితే, వాళ్ళని డబ్బు లేనివాళ్ళని చులకనగా మాటాడి తిరగ్గొట్టెయ్యలేదూ! ఇప్పుడు పిచ్చాణ్ణి చేసుకోడానికే పిల్ల ముందుకొస్తుందిటా? సంబంధం చూడాలిట, సంబంధం….”అనొకడూ, ”చక్కటి సంబంధం, పిల్ల అందగత్తె,కట్నానికీ లోటు లేదు, అందరికి నచ్చింది కూడా, కాని ఏం చేసేరు, ’పెళ్ళికూతురు మేనత్త తోటికోడలు లేచిపోయిందిటా’ అని సంబంధం తిరగ్గొట్టేశారే… ఇప్పుడు సంబంధాలెక్కడినుంచి వాస్తాయిటా…. పిచ్చాడికి పిల్లనిచ్చే వాళ్ళుంటారా!” అని గొణుక్కుంటున్నారు పెళ్ళిళ్ళపేరయ్యలు. సమస్య తేల లేదు, కాలం గడుస్తోంది, పిచ్చీ తగ్గలేదు, పెళ్ళీ కుదరలేదు. మరికొంతకాలం గడిచింది. పెళ్ళికుదిరితే పిచ్చి కుదురుతుంది, పిచ్చి కుదిరితే పెళ్ళి కుదురుతుంది. ఏది ముందూ? కాలం గడుస్తుండగా వైద్యుడు మరికొంత ధనవంతుడయ్యాడు 🙂

పిచ్చి కుదిరింది రోకలి తలకి చుట్టండి

పై కథకి కొనసాగింపే ఈ సామెత కూడా దాని కతే మిగిలినదిన్నూ…

కొంతకాలం గడిచింది, బ్రహ్మచారి ముదిరిపోయాడు, తల్లితండ్రులలో, తల్లి ఉండబట్టలేక ఒక పెళ్ళిళ్ళ పేరయ్యను పట్టుకుని ”అన్నయ్యా! కుర్రాడు ముదిరిపోతున్నాడు, ఇంత ఆస్థిపాస్థులకు వారసులు లేకుండాపోతారేమోననే దిగులు పట్టుకుందయ్యా! లేనింటి పిల్లనైనా సరే! పెద్ద అందగత్తె కాకపోయినా బాధలేదు, అందం కొరుక్కుతింటాముటయ్యా! పిల్లను చూసి మూడుముళ్ళూ వేయిస్తివా,చచ్చి నీకడుపున పుడతా! నాలుగేళ్ళలో, నీ కూతురు పెళ్ళి చేయాలి నువ్వు, దానిని సకల ఖర్చులతో నిర్వహించే బాధ్యత నాది,నన్ను నమ్ము” అని బతిమాలి, బులిపించినట్టు మాటాడితే, మెత్తబడిన పేరయ్య కాలికి బలపంకట్టుకుని పెళ్ళి కూతుళ్ళ వేటలో పడ్డాడు. పెళ్ళి కూతుళ్ళ తల్లితండ్రులకి వీరి గురించి వైనవైనాలుగా కొత్తగా చెప్పేడు. ”కొంతకాలం అబ్బాయి మతిభ్రమణంతో బాధపడ్డమాట నిజమే! ఇప్పుడు బాగున్నాడు,తెలివైనవాడూ! ఒక సారి అబ్బాయిని చూడండి, నచ్చితేనే చేద్దాం, చూడ్డానికేం పోయే” అన్నాడు. దానికి తల్లితండ్రులు పిచ్చాడికి పిల్లనివ్వడానికెళుతున్నామంటారయ్యా! ఎగతాళీ చేస్తారూ” అన్నారు. ”అదా మీ అనుమానం, పిల్లనివ్వడానికెళుతున్నట్టు తెలియనివ్వద్దూ, దారేపోతూ చుట్టం చూపుగా వెళ్ళినట్టు రండి, ఆ సమయానికి నేనూ వస్తా,చూడండి, ఒక రోజుండండి,చూడండి, నచ్చితేనే” అని బలవంతం మీద ఒప్పించాడు. ఒక రోజు అమ్మాయి తల్లి తండ్రులు చూడ్డానికి ఒప్పుకుని వచ్చారు, అనుకున్నట్టే సమయానికి పేరయ్యా చేరాడు.

అబ్బాయితోనూ అబ్బాయి తల్లితండ్రులతోనూ మాటాడుతూ వచ్చారు, అమ్మాయి తల్లి తండ్రులు. చూస్తే అబ్బాయి బాగున్నవాడేనేమో, పిచ్చి లేదేమో, ఇదంతా కావాలని చేస్తున్న దుష్ప్రచారమేమో అనిపించింది, కొంత సేపటికి. సాయంత్రమవుతుండగా, అబ్బాయి తల్లితండ్రులు,అబ్బాయి,అమ్మాయి తల్లితండ్రులు, పెళ్ళిళ్ళ పేరయ్య తీరుబడిగా కూచుని లోకాభిరామాయణం చెప్పుకోడం మొదలెట్టేరు, ఇంతలో అమ్మాయి తల్లికి, లోపల ఉన్న అనుమానం తొలుస్తుండగా, అబ్బాయితో ”బాబూ! నీకేదో అనారోగ్యం చేసిందిట,ఇప్పుడెలా ఉందీ” అని ప్రశ్నించింది. దానికి అబ్బాయి ”పిచ్చి కుదిరింది రోకలి తలకి చుట్టండి” అన్నాడు. ఈ మాట విన్న అందరూ విస్తుపోయారు. అమ్మాయి తల్లి ఐతే ఒక క్షణం మూర్ఛపోయినంతై తేరుకుని మొగుడితో ”ఇంకా కూచున్నావేంటీ?” అంటూ చరచరా వెళ్ళిపోయింది…… ఇంకేముంది……

అదండి పిచ్చి కుదిరింది రోకలి తలకి చుట్టండి కత.

(2-2-2018)

No comments:

Post a Comment