Sunday, 15 August 2021

అప్ప సిరి జూసి మాచకమ్మ మడమలు తొక్కుకున్నట్టు.


స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. 



అప్ప సిరి జూసి మాచకమ్మ మడమలు తొక్కుకున్నట్టు.




ఇది ఒక నానుడి. మాచకమ్మకి వాళ్ళ అక్కకి వయసు తేడా తక్కువే. మాచకమ్మ అక్క ఈడేరింది, అందమైనది కూడా.  కులగోత్రాలకీ లోటు లేదు,పేదవారైనా. దానితో పక్కవూరి ఊరి మోతుబరి కొడుకు కోరి వరించేడు.పెళ్ళి ఘనంగానే జరింది. అప్ప అత్తారింటికీ వెళ్ళింది.అక్కడ అప్ప మహరాణీలా వున్నట్టు కబురులూ తెలుస్తున్నాయి. ఇంట్లో అత్తామామల దగ్గరనుంచి, భర్త, నౌకర్లు చాకర్లు అంతా ఎంతో ప్రేమగా చూసుకుంటున్నట్టు వార్తలు తెలుస్తున్నాయి. పెళ్ళైన సంవత్సరం తిరగ్గానే అప్ప నీళ్లోసుకుంది. ఇక అప్ప అత్తారింట్లో ఆనందానికి పట్ట పగ్గాలూ లేవు. ఈవార్తలు తెలుస్తుండడంతో పుట్టింట అందరూ ఆనందంలో ములిగి తేలుతున్నారు, మాచకమ్మతో సహా. కాలం గడచింది, అప్ప మగ బిడ్డను కన్నది. అప్ప అత్తవారు కోడలిని అడుగు కింద పెట్టనివ్వటం లేదు. రెండో ఏడు పూర్తికాకుండానే బిడ్డ తల్లీ అయింది. అప్ప భర్తకి వ్యాపారం కలిసొచ్చి కొత్తగా పొలమూ కొన్నాడు. అప్ప  జీవితం వేలేస్తే కోలు దిగబడేలా ఉంది,అత్తారింటిలో.


మాచకమ్మకి అప్పకి జరుగుతున్నదంతా మొదటిలో అంతా ఆనందంగానే గడచినా, రెండేళ్ళలో కూడా మాచకమ్మ ఈడేరలేదు సరిగదా స్త్రీ లక్షణాలే పూర్తిగా ఏర్పడ లేదు. 

చూస్తేనే మాచకమ్మ సంసారానికి పనికి రాదని తెలిసిపోతూ ఉంది. ఎవరూ మాచకమ్మ పెళ్ళి మాటే ఎత్తటంలేదు, దానితో అప్ప వైభోగం చూస్తున్న మాచకమ్మకి మొదటిలో అప్ప పట్ల అసూయ పుట్టి ఆ తరవాతది పెరిగి ఈర్ష్యగా మారింది, కాని ఏం చేయగలదు? మడమలు తొక్కుకోవడం తప్పించి. మడమలు తొక్కుకోవడం అంటే నాట్యం చెయ్యడం చేతకాక కాళ్ళు తొక్కుకోడం అంటారు.ఇలా నిరాశతో అసూయ చెంది, దానిని ఈర్ష్యగా మార్చుకుని బాధ పడడాన్నే అప్ప సిరి జూసి మాచకమ్మ మడమలు తొక్కుకున్నట్టని అంటారు. 


ఎవరి పుట్టుకవారిదే,ఎవరి అదృష్టం వారిదే, ఒకే తల్లి పిల్లలైనా. ఎవరి అందం, తెలివి,రాత, జీవితం వారివే. ఎవరి వైభొగమూ మనకు రాదు, ఎవరి దరిద్రమూ మనిని అంటదు, ఎవరి చావూ వారిదే. ఒకరిని చూసి అసూయ చెంది ఈర్ష్య పడితే జీవితం లో ఏదీ సాధించలేరు, నిరాశ తప్ప

7 comments:

  1. పరిపూర్ణం చేసుకునే అవకాశం లేని జీవితాలు. దురదృష్టకరం. అసూయ పెరిగిందంటే ఆశ్చర్యం లేదు.

    అన్నట్లు వంధ్య అంటే మాచకమ్మే కదా?

    ReplyDelete
    Replies
    1. విన్నకోటవారు,
      వంధ్య అంటే సంతానం కలగని స్త్రీ అంటారు. మాచకమ్మ అంటే స్త్రీ అవయవాలు ఏర్పడచ్చు కాని వ్యక్తురాలు కాదు, స్త్రీగా కనపడినామె మాచకమ్మ అని చెప్పేదకా కూడా తెలియకపోవచ్చు.మరికొందరు చూచీ చూడగానే స్త్రీ అవయవాలు ఏర్పడలేదనీ సంసారానికి పనికి రానిదనీ తెలిసిపోతుంది. సృష్టి చిత్రం.

      Delete
  2. వేలేస్తే కోలు దిగబడేలా
    వీలైతే వివరింపగలరు
    స్వాతంత్ర్య దిన శుభాకాంక్షలు

    ReplyDelete
    Replies
    1. మహేశుడు గారు,

      కోలు ని కత్తవ అనికూడా అంటారు.ఇది వ్యవసాయ పనిముట్టు.
      నల్లరేగడి భూముల్లో నీరున్నచోట పరిమిత స్థలంలో మట్టి తవ్వి పల్లం (బొదె లాటి చోట) చేయడానికి వాడతారు.

      ఇది ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ లా ఉంటుంది. పై భుజంనుంచి పట్టుకోడానికి కాడ ఉంటుంది. దీనిని కాడ పట్టుకుని సూదిగా ఉన్నభాగాన్ని భూమిలో గుచ్చి కాలితో తొక్కుతారు. దిగబడుతుంది, అప్పుడు కాడ పట్టుకుని మెడ్డిస్తారు. మట్టి పెళ్ళలా లేస్తుంది.

      కాలితో తొక్కే చోట వేలు వేసి కోలు దింపడం తేలిక కదా!
      ప్రయోగం ఆమె సంసారం నల్లేరు మీద నడకలా హాయిగా సాగుతోందని...

      Delete
  3. నా భారతావని జాతీయ సమైక్యతను చాటే దేశం నా భారతావని తరతరాల జ్ఞాన సంపదల గని నా భారతావని వేదాలకు పుట్టినిల్లు నా భారతావని పండుగ వేడుకల చిరునామ డెబ్భై ఐదు వసంతాల భారతీయ స్వాతంత్ర్య మహోత్సవమును పురస్కరించుకుంటు.. ఈ స్వెచ్ఛ ఎందరో మహామహుల కల.. భావి భారతావని సరికొత్త సాంకేతికతకు, భావి తరాల భవితవ్యానికి నాంది పలకాలని ఆశిస్తు. ~శ్రీధర్ భూక్య

    ఆడవారు తాము వివాహ బంధానికి మునుపు పుట్టినిల్లే సర్వస్వం, ప్రేమ ఆప్యాయత తో పాటు కన్నవాలి వాత్సల్యం కూడా ఉంటుంది వారికి.. అదే వైవాహిక బంధం ఏర్పర్చుకున్నాక తమ మెట్టినింట మెలిగే పద్ధతి, తీరు తెన్నులతో ఆ ఇంట గౌరవం పదింతలై ఆ పడతి పేరు చరితార్థం ఔతుంది. అపుడైతే కన్నవారి ప్రమేయం ఉండదా అని అడిగితే ఆచార్య.. ఎందుకుండదు.. ఉంటుంది.. కాని.. మునుపు ఉన్నంత ఉండదు.. బహుశ తన తమ్ముని భార్య మూలానో, లేక అన్న భార్య మూలానో ఆ ప్రేమ వాత్సల్యత పలుచన ఐపోతది. అంతే కదా.. శర్మాచార్య

    మీ కథ సారం.. ఎవరి అస్తిత్వం వారిదే.. ఏదేమైనా ఎవరికి వ్రాసినవి వారే అనుభవించాలి..

    ReplyDelete
    Replies
    1. శ్రీధరా!

      తమ తమ నెలవులు దప్పిన తమ మిత్రులె శత్రులగుట తథము సుమతీ కదా! స్థానం మరితే అన్నీ మారిపోతాయి కదండీ.

      టపాలో ఫోటోచూశారా!ఒకటే మొక్క నుంచి పలవకి రెండు కొమ్మలు, ఒక కొమ్మ పచ్చగా ఆకులతో పూలతో, మరో కొమ్మ ఎండినట్టుగా ఆకులు రాలి పూలు లేక ఉంది, చనిపోలేదు, ఇదే సృష్టి చిత్రం సార్!

      Delete
    2. గమనించాను శర్మాచార్య.. ఒకే కుటుంబంలో పుట్టిన వారు, అంటే ఒకే తల్లి పేగు పంచుకు పుట్టిన వారు సైతం వేరే వేరే మనస్తత్వాలు కలిగి ఉంటారు కదా.. అలానే ఒకే చెట్టు కొమ్మలు.. కాని ఓ వైపు మోడుబారి ఆకులన్ని రాలిపోతే మరో వైపు చివురించి మొగ్గతొడిగి పుష్పాలతో ఉంది.

      Delete