Saturday 21 August 2021

తనకు కాని పనికి పోరాదు.

 


తనకు కాని పనికి పోరాదు.


చిన్నకథ, పాతదే ,తెలిసినదే.  

ఒకపల్లెలో ఒక పెద్ద చింతచెట్టుకింద ఒక పెద్ద రంపంగొయ్యి.ఆ గోతి మీద పెద్ద పెద్ద దుంగలని కోస్తూ ఉండేవారు.పెద్ద దుంగలు కోసేటపుడు రంపం ఆడడానికి ఒక సీల దిగగొట్టేవారు, కోత చీలికలో, రెండు కోతభాగాలూ కొద్ది ఎడం అయి రంపం అడేందుకు వీలుగా. ఆ చింత చెట్టు మీద ఒక కోతి నివాసం ఉంటోంది. రంపంగొయ్యి అక్కడ ఉండడం కోతికి ఇబ్బంది లేదు. కోతి చెట్టు మీద ఉండడం కోత పనివారికీ ఇబ్బంది లేదు. కోతి రోజూ ఈ కోత పని చూస్తూ ఉంది.రోజూ కోత పనివారు ఉదయమే వచ్చి కోత మొదలెట్టి మధ్యాహ్నం భోజనాలకి వెళ్ళి తిరిగొచ్చి సాయంత్రం దాకా కోత కోసేవారు. ఒక రోజు పనివారంతా మధ్యాహ్న భోజనాలకి వెళ్ళేరు, కోత ఆపి. కోతి చెట్టు దిగి వచ్చి కాసేపు రంపంతోనూ గోతిలోనూ ఆడుకుంది. చివరగా కోస్తున్న దూలం చీలికలో దిగ గొట్టిన సీల పీకడానికి ప్రయత్నించింది అది రాలేదు. దానితో దానిని ఎలాగైనా పీకాలని ఒక కాలు, చీలికలో వేసి మరోకాలు బయటకు వేసి బలంగా సీల పీకింది. సీల ఊడి రావడంతోనె కోస్తున్నదూలం రెండు భాగాలూ దగ్గరకు చేరిపోయాయి. కోతి కాలు చీలికలో చిక్కుకుపోయింది. పనివారు తిరిగొచ్చేసరికి కోతి ప్రాణవాయువులు గాల్లో కలిసిపోయాయి.


కోతికి అవసరంలేని పని సీలను పీకడం, దానిని అనవసరంగా పీకి ప్రాణం పోగొట్టుకుంది. అందుకే తనకు కాని పనికి పోరాదన్నారు పెద్దలు.




10 comments:

  1. అంతేగా..
    లేని పోని విషయాలను తలకెక్కించుకుని ఆరాట పడిపోయి ఉన్న విలువను, గౌరవాన్ని పోగొట్టుకోవటం నిజంగా చాలా చాలా విచారకరమైన విషయమే.. కనుకనే.. "తనది కాని విషయాల్లో తల దూర్చ కూడద" నేదే ఆ `సమ్మెట` ఆచార్య

    ReplyDelete
    Replies
    1. శ్రీధరా!
      లెస్స బలికితిరి

      Delete
  2. // “ తనకు కాని పనికి పోరాదన్నారు పెద్దలు.” //
    అంతేగా మరి.
    ఒక యజమాని దగ్గరున్న గాడిద, కుక్క కథ కూడా అలాంటిదే. గాడిద చేసే పని గాడిద చెయ్యాలి, గుర్రం చేసే పని గుర్రం చెయ్యాలి అన్నారు కదా?

    ReplyDelete
    Replies
    1. విన్నకోట సారూ,
      ఏమనుకోవద్దూ! చిన్న సవరణ. ఈ కతలో మనకు తెలియని,అవుసరంలేని పనులలో తలదూరచారదన్నదే మాట, ఇక మీరు చెప్పిన కతలో ఇతరుల పని, అధికారం,బాధ్యతలను అయాచితంగా నెత్తిన వేసుకో కూడదని అంతే.

      Delete
  3. అలా అంటారా? అలాక్కానివ్వండి.
    ఇందులో అనుకోవడానికేముంది, సర్.

    ReplyDelete
  4. కోతికి గానిపని కలద ?
    చేతులకు దురద గలుంగ , చెయ్దములెల్లన్
    ఈ తీరుననే యుండును ,
    కోతులవలె కొంతమంది గుణములు కూడా 🙏 .

    ReplyDelete
    Replies
    1. రాజావారు,

      ఉన్నమాటన్నారు

      Delete
  5. కం. కోతి చెడె కుతూహల సహ
    జాతమ్మున జేసి యెగయు చాపల్యముచే
    నా తీరున చెడు మూర్ఖుడు
    భూతలమున తనకుగాని పోకలపోవన్

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయంవారు,
      పెద్దలమాట చద్ది మూట.

      Delete