Thursday 29 January 2015

శర్మ కాలక్షేపంకబుర్లు-ఎవరు వృద్ధులు?



చిత్రగ్రీవుడు అనే పావురాల రాజు, ఒక రోజు తన పరివారంతో ఆహారం కోసం బయలుదేరాడు. ఒక అడవి మీదుగా వెళుతుండగా ఒక చోట నూకలు కనిపించాయి. కిందకివాలి నూకలు తిందామనే మాట పుట్టింది ఒకరినుంచి. అలాగే అన్నారు మరికొందరూ అంతలో ఒక వృద్ధుడు ఇది అడవి, ఇక్కడ మానవ సంచారం తక్కువ కనక నూకలు ఉండేందుకు కారణం కనపడదు, కనక దిగవద్దు, ప్రమాదం పొంచి ఉండచ్చు, అనుమానించ తగినదే, అని హెచ్చరిస్తాడు. దీనికి ఒక యువకుడు, ఇలా చెప్పేవన్నీ అనుమానం కబుర్లు, నిరుత్సాహాన్ని కల్పించేవి. ఎదురుగా ఆహారం కనపడుతోంటే మీనమేషాలు లెక్కిస్తూ, ఇది అడవి, ఇది గ్రామం అని ఆలోచించడం తెలివి తక్కువ అని ప్రతివాదం చేస్తాడు.  అప్పుడు మరొకరు పెద్దల మాట వినడం మంచిది కదా అంటే ఎవరు వృద్ధులు? ఏండ్లు మీరినవాడా వృద్ధుడు, జ్ఞానం కలిగినవాడే వృద్ధుడని ప్రతివాదం చేసి, మొత్తానికి నూకలకోసం కిందికి దిగుతాయి. 

దిగిన వెంటనే నూకలమాట దేవుడెరుగుకాని వల మీద పడి అందులో చిక్కుకుపోయారు. సమస్యలో చిక్కుకున్నారు,ప్రాణాల మీదకే వచ్చింది. ఏం చెయ్యాలనే మాట ముందుకొచ్చింది. వృద్ధుడు సమయం దొరికింది కదా అని పాత విషయం ప్రస్తావించలేదు. పాలుపోని పరిస్థితులలో మరలా వృద్ధుణ్ణే సలహా కోరితే అందరం ఒక్క సారిగా ఎగిరి వలనే ఎత్తుకుపోదామని చెబితే అందరూ కలసి ఒక్క సారి ఎగిరి వలను ఎత్తుకుపోయారు. ఇది చూచిన వేటగాడు నిర్ఘాంతపోయాడు. ఎగిరిన తర్వాత ఏం చెయ్యాలంటే, రాజు తన స్నేహితుడైన ఎలక దగ్గర దిగాలని చెబితే అక్కడకు చేరతారు. మిత్రుణ్ణి బంధనాల్లో చూచిన ఎలుకరాజు వగచి అతని బంధనాలు కొరకడానికి సిద్ధమైతే వాయసరాజు ముందుగా తన పరివారాన్ని బంధాలనుంచి తప్పించి ఆ తరవాత తనను రక్షించమంటాడు. దానికి ఎలక రాజు నువ్వు స్నేహితుడవు కనక నీ బంధనాలు కొరుకుతా తప్పించి మిగిలినవారి సంగతి తరవాత ఆలోచిస్తానంటాడు. దానికి వాయసరాజు ఒప్పుకోక పోతే ఎలుకరాజు అతని సత్యనిష్టకి మెచ్చుకుని,తన పరివారం పట్ల అతనికున్న ప్రేమను కొనియాడి, తన పరివారంతో అందరిని బంధ విముక్తుల్ని చేస్తాడు. ఇది స్థూలంగా మిత్రలాభం లోని కథ, నా స్వంతం మాత్రం కాదు. పొరపాటుగా కొన్ని కల్పించానేమో కూడా , తప్పులు మన్నిమచండి. ఇక ఈ కథని విశ్లేషిస్తే 

1.ఏంత రాజయినా పని చేయాల్సిందే. అంటే ఎంత ఆఫీస్ కి బాస్ అయినా తనపని తను చెయ్యాలి, మరొకరి మీద రుద్దెయ్యకూడాదు.
2. ఒక పని చేద్దామనుకున్నపుడు దాని మంచి చెడ్డలు వృద్ధులు సకారణంగా చెప్పినపుడు వినాలి. యువత ఎదిరించడానికే ఎదిరింపులా ఉంటే నష్టపోతారని చెప్పడం.
3.వృద్ధులు ఆపదలో చిక్కుకున్నపుడు ఆలోచన చేసి ఈ కథలో వృద్ధుడు చేసినట్లు అపాయం లేని ఉపాయం చెప్పి ఆదుకోవాలి కాని పాత విషయాలను తవ్విపోయడం మూలంగా నష్టమే ఉంటుందనేది సూచన.
4. ఆపదలో చిక్కుకున్నపుడు చర్చలు కాదని, చెప్పిన పని చేయడమే లక్ష్యంగా ఉండాలని అందరికి సూచన,ప్రత్యేకంగా యువతకి సూచన.. ఇక్కడ ఐకమత్యంతో ఒక్క సారిగా ఎగిరి వలనే ఎత్తుకుపోయే ఆలోచన బ్రహ్మాండమైనదే కదా! యువతే బలం, అలాగే ఐకమత్యమే బలం అని గుర్తించాలి.
5.ఆపద నుంచి గట్టెక్కిన తరవాత బంధనాలు ఛేదించుకోడానికి తగిన వారిని ఎన్నుకోవడం లో రాజు చూపిన ముందు ఆలోచన మెచ్చదగినదే, రాజయినవాడి ఆలోచన అలా ఉండాలి.
6.వాయసరాజు  బంధనాలు మొదటగా తప్పిస్తానన్నపుడు ముందుగా తన పరివారాన్ని బంధముక్తుల్ని చేయమనడం రాజు చేయాల్సిన పని అని చెప్పడమే. ఎలుకరాజు అలా చెప్పడం కూడా వాయస రాజు యొక్క గుణాన్ని పరికించడమే, అతని గొప్పనూ ప్రకటించడమే.
7.కథలో యువకుడు ఎవరు వృద్ధులు? ఏండ్లు మీరినవారా వృద్ధులు? అని ప్రశ్నిస్తాడు. సమాధానం తెలుసుకోవలసిన ప్రశ్న ఇది. జ్ఞాన వృద్దులు, వయోవృద్దులు, తపో వృద్ధులని వృద్ధులు మూడు రకాలు. ఇందులో వయో వృద్ధులు ఎక్కువగానూ, జ్ఞానవృద్దులు తక్కువగానూ, తపోవృద్ధులు అరుదుగానూ కనపడతారు.

వయోవృద్ధులు తమ అనుభవాలని కథలుగా చెబుతారు, హెచ్చరికలూ ఇస్తారు, కాని మనమే వినేలా ఉండం, సొల్లు కబుర్లు చెబుతున్నారని ఈసడిస్తాం కూడా. వారుపోయిన తరవాత చేతులు కాలిన తరవాత ఆకులు పట్టుకున్నట్టు అయ్యో! ఈ సమయంలో ముసలాయనుండి ఉంటే మంచి సలహా చెప్పేవాడు కదూ అనిపిస్తుంది.

జ్ఞానవృద్ధులు కొద్దిమందే ఉంటారు.సాధారణంగా మనం అడిగితే కాని ఏదీ చెప్పరు. కొంతమంది చెప్పడానికి సాహసించినా వినేలా లేదు లోకం, వీరికి వయసుతో సంబంధం లేదు, ఇది వీరికి పెద్ద ఇబ్బంది, ఇతరులు గుర్తించలేకపోవడానికి కారణం. వీరిని గుర్తిస్తే నిజంగా అద్భుతాలు సాధించవచ్చు, కాని గుర్తించలేము. 

ఇహపోతే తపోవృద్ధులు అరుదుగాఉంటారు. వీరిని గుర్తించడం చాలా కష్టం, వీరికీ వయసుతో సంబంధంలేదు. వీరిని గుర్తించి అనుసరించగలిగితే అదో బ్రహ్మానందం. వీరికి ప్రచారాలు గిట్టవు కనక గుర్తింపూ ఉండదు.  
అందుచేత ముందుగా వయో వృద్ధుల అనుభవాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తే, చరిత్ర చదువుకుంటే యువ సుఖపడుతుంది. ప్రతి విషయానికి వాదనకు దిగితే, కయ్యానికి దిగితే జీవితం కుక్కలు చింపిన విస్తరేనన్నది యువత గుర్తించాలి.
కథ చిన్నదే కాని ఎన్ని విషయాలు దాగున్నాయో చూడండి.

10 comments:


  1. ఏమిటో ఈ పెద్దాయన ! ఇట్లా మిత్ర లాభం లాంటి కథల్ జెప్పి కన్ను గప్పుతాడు !

    అయినా ఈ కాలం లో ఇట్లా కథల్ జదివి ఇంత నేర్చుకుని ఏమి చేసేది ఈ నాటి కార్పోరేట్ వరల్డ్ లో - కత్తి కనబడ కుండా కోయాలి తప్పించి ఎదుటి వారలని !

    జేకే!

    చీర్స్
    జిలేబి

    ReplyDelete
    Replies
    1. జిలేబి గారు
      మాటకూడా మాటాడక, రక్తం కనపడకుండా కోస్ కథలూ ఉన్నాయండి, చెబితే భయపడతారని :)
      ధన్యవాదాలు.

      Delete
  2. వయసులో చిన్నవారైనా కొంతమంది వారి ఆలోచనల్లో ముదుసలి లాగా అనిపిస్తారు - బహుశా నిరాశ నిస్పృహల వల్ల కావచ్చు. వాళ్ళు ఓ రకమైన మానసిక "వృద్ధులు".

    కాకపోతే కార్పొరేట్ నీచ సంస్కృతి గురించి జిలేబీ గారు కరక్టుగా చెప్పారు. అయినా కూడా మీలాంటి పెద్దలు నాలుగు సరైన మాటలు చెప్తూనే వుండాలి, కొంతమందైనా వినకపోతారా అనే ఆశావహ దృక్పధంతో.

    అన్నట్లు మీ ఈ పోస్ట్ మీ రెండు బ్లాగుల్లోనూ కనపడుతోందండీ ఇప్పుడు. అవృ అవృ :)

    (నేను తెల్లవారుఝాము జీవిని అనుకుంటుంటాను నా గురించి. నేను చాలా సార్లు గమనించాను - మీరు బాగా తెల్లవారుఝామునే మీ బ్లాగు టపా వ్రాసేస్తారు; జిలేబీ గారు అంత తెల్లవారుఝామునే మీ పోస్ట్ చదివేస్తారు, తెల్లవారుజామునే తన వ్యాఖ్య కూడా పెట్టేస్తారు అందరికన్నా ముందే :) ఆవిడ భాషలోనే "జేకే" )

    ReplyDelete
    Replies

    1. విన్నకోట వారు,

      కష్టే ఫలే వారు, జిలేబి వీళ్ళంతా 'ఏండ్లు' మింగిన వాళ్ళు ! రాత్రులలో నిద్ర పట్టక తెల్లారి గట్రా లేచి సూర్యని కి పోటీ గా తయారయ్యే వాళ్ళు !

      ఇంత ఏండ్లు మింగినా అది యేమి వీరి తెల్లారి గట్రా నిదుర నించి లెయ్యడమో ఇంట్లో వాళ్ళని నిదుర పోనీకుండా చేయడమో తెలీకుండా పోయిందండి !!

      చీర్స్
      జిలేబి

      Delete
    2. నరసింహారావు గారు,
      మీరు చెప్పినది నిజమే!అటువంటివారే మానసిక వృద్ధులు. ఇలా చెబుతుండటం అలా ఛీ కొట్టించుకోడమూ అలవాటయిపోయాయండి.
      పల్లెటూరివాళ్ళం కదండీ ఇలా నాలుగుకే లేవడం బాగా అలవాటు. మూడేళ్ళ కితం ఒక మనవరాలు తను టపా చదువుకోడానికి అనువుగా ఉదయమే ఐదున్నరకి టపా వేయమని అడిగింది. అలా మొదలైన అలవాటు ఉండిపోయింది, మనవరాలు చదవడం మరిచిపోయి ఉండచ్చు.
      ఇహజిలేబి గారికి నేను టపా వేసే సమయానికి ఉదయం ఎనిమిది అవుతుంది. స్నాన సంధ్యలు పూర్తిచేసుకుని ఒక చేతిలో లేఫ్టాపు మరొక చేతిలో హిందూ పేపరూ పుచ్చుకుని అమ్మగారు డైనింగ్ టేబుల్ దగ్గరకి చేరతారండి. మనవరాలు కాఫీ పట్టుకొస్తే నెమ్మదిగా తాగుతీ ఒక కామెంట్ వదులుతారండి, టపా చదివి.

      టపా రెండు బ్లాగుల్లోనూ వేశానండి.
      ధన్యవాదాలు.

      Delete

    3. జిలేబిగారు,
      పుర్రెతోపుట్టిన బుద్ధి పుడకలతోకాని పోదని సామెత కదా :)
      ధన్యవాదాలు.

      Delete
  3. కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు....

    కొంతమంది ఆడవాళ్ళు పుట్టుకతో దొంగలు...

    దేముడా ఈ టపా "అది" (అవును ముందొకసారి ఎత్తుకుపోయినదే, సిగ్గులేనిది) ఎత్తుకుపోయేలా చూడూ...

    ReplyDelete
    Replies

    1. DG గారు,
      నిజమే! ఈ ఆడాళ్ళంతా దొంగలేనండీ! మనసుపట్టుకుపోయి దాచేసుకుంటారు. టపాలు చోరీ గురించి చూడటం మానేశానండి.
      ధన్యవాదాలు.

      Delete
  4. డీ జీ గారు,
    >> కొంతమంది ఆడవాళ్ళు పుట్టుకతో దొంగలు...

    కాకుంటే మరేమిటి ! హీరోలు నా హృదయాన్ని కొల్ల గొట్టే సేవే అని దేవదాసు ల కాలం నించి గెడ్డం పెంచడం చూస్తె అని సత్యప్రమాణకం కాదూ మరి !! (ఇంతకీ సత్య కూడా శ్రీ కృష్ణుల వారి హృదయాన్ని కొల్ల గొట్ట లేదా !)

    చీర్స్
    జిలేబి

    ReplyDelete
    Replies
    1. జిలేబిగారు,
      లెస్సగా బలికితిరి.
      ధన్యవాదాలు.

      Delete