Wednesday 21 January 2015

శర్మ కాలక్షేపంకబుర్లు-తోలుబొమ్మలాట.


భారతదేశం కళలకు కాణాచి, అందునా తెనుగునేలపై వివిధ కళారూపాలు పురుడుపోసుకున్నాయి. హరికథ, బుఱ్ఱకథ,జముకులకథ, ఒగ్గు కథ, ఇలా చాలా చాలా కళారూపాలున్నాయి. వీటన్నిటికి పరమార్ధం ఒకటే, ఆనంద సందర్శనం. ఈ ఆనంద సందర్శనం భగవంతుని రూపంలో పొందాలునుకోవడమే భారతీయ కళల ముఖ్యోద్దేశం.  అటువంటి వాటిలో ఒకటి, ఈ తోలుబొమ్మలాట. ఇది నేటి సినిమాకి చాలా దగ్గర రూపం. నిజానికి నేను చూసిన తోలుబొమ్మలాట అరవై సంవత్సరాల పై బడినది. బహుశః అరవై సంవత్సరాల కితం నేను చూసిన తోలుబొమ్మలాటకి, నాలుగురోడ్ల కూడలిలో ఒక వైపుగా రామాలయం దగ్గర నాలుగు గుంజలు పాతి, దాని చుట్టూ మూడు వైపులా బట్ట కట్టి, ముందు వైపు ఒక పల్చటి, తెల్లటి బట్టను తెరగా ఎత్తుగా కట్టి కింది భాగంలో దళసరిపాటి బట్టను కట్టి తోలుబొమ్మలాటకి తగిన వసతి ఏర్పాటు చేసారు. మూడు వైపులా మూయబడిన దానిలోపల రెండు కాగడాలు వెలిగించి తెరకు కొద్ది దూరంలో ఉంచుతారు, ఇరుపక్కలా. కాగడాలు ముందుకుంటే తెర అంటుకునే ప్రమాదం. దూరంగా ఉంటే తెరమీది బొమ్మ కనపడకపోవడం కాక, బొమ్మల్ని ఆడించేవారి నీడ పడుతుంది, అందుచేత సమదూరంలో కాగడాలు పెట్టాలి. చీకటిలో కూచున్న ప్రేక్షకులు తెరమీద బొమ్మలు కదలటం, వెనుకనుంచి పాట, మాట వింటారు.ఆ తరవాత కావలసిన సాధనాలు, రెండు బల్లలు, రెండు చెక్కలు, హార్మోనియం, ఫ్లూట్, మృదగం వగైరా వాద్యాలు, ఆ గదిలాటిదానిలో పెట్టుకుంటారు. ఇక ఆడించవలసిన బొమ్మలని పెద్దపెద్ద వెదురు బుట్టలలో తెస్తారు.



సరస్వతీ ప్రార్ధన


 వీటిని తాయారు చేయడం కూడా ఒక పెద్ద పని. చనిపోయిన జంతు చర్మాన్ని ఒలవాలి, బాగుచెయ్యాలి, ఎక్కువగా ఆవు చర్మమే అయి ఉంటుంది. దానిని సరియైన విధంగా కత్తిరించాలి. వాసనలేకుండా చూడాలి, అబ్బో ఇది చాలా కష్టంతో కూడుకున్నపనే. ఇలా తయారు చేసిన బొమ్మలకి రంగులద్ది ఎండబెట్టి....అప్పుడు తెరమీద వేయడానికి అనువుగా ఏర్పాట్లు చేసి కాళ్ళూ చేతులూ ఆడించడానికి తగు ఏర్పాట్లు చేసి వాటిలో చిన్న కఱ్ఱ, పొడుగైనదాన్ని దూర్చి ఆడించడానికి తయారు చేసి, తోలుబొమ్మలాట మొదలుపెడతారు, గణేశ ప్రార్ధనతో, సరస్వతీ ప్రార్ధనతో.


నిజానికి జానపదుల కళా రూపమన్న పేరేకాని పలికే ప్రతిపలుకులో సరస్వతి లాస్యం చేస్తుందంటే అతిశయోక్తి కాదు, ఆ పలుకు అచ్చ తెనుగు నుడికారమై కమ్మని ఆవునేయిలా ఘుమఘుమలాడుతూ ఉంటుంది. ప్రతి పలుకు అంత స్పష్టంగానూ, ఉఛ్ఛారణా దోషాలు కూడా లేని విధంగా కళాకారులుంటారంటే, వారి నిజజీవితంలో కూడా ఇంత నిష్ఠా కలిగి ఉంటారంటే, ఆనందమే కలుగుతుంది. వీరు రామాయణ, భారత,భాగవతాలనుంచి కొన్ని ఘట్టాలు ప్రదర్శిస్తారు. పూర్వం రోజుల్లో వీరు బళ్ళు కట్టుకుని, కుటుంబాలతో సహా ప్రయాణాలు చేసి, వారాల తరబడి ఒకే ఊళ్ళో ప్రదర్శనలూ ఇచ్చేవారు. కథ చెప్పే, పాట పాడే, వాయిద్యాలు వాయించే కళాకారులంతా ఆ కుటుంబ సభ్యులే అయి ఉండేవారు.ఇక ఈ తోలుబొమ్మలాటలో హాస్యానికి గాను కేతిగాడు, బంగారక్కల జంట, గాందోళిగాడు, జుట్టుపోలిగాడు అనే వారూ కనపడతారు. ఆట మధ్యలో వీరిని తెరపై ప్రవేశపెట్టి హాస్యం పండిస్తారు. నేనెరిగినరోజులనాటికే ఈ హాస్యం కాస్తా అపహాస్యంగానూ ద్వందార్ధాలతో కూడిన బూతులుగానూ ఉండేవి. అసలు కళా రూపమే అంతరించి పోయిందనుకున్నా. ఇన్ని ఏర్పాట్లు చేస్తే కాని తోలుబొమ్మలాట జరగదు. అందుకే దీనిని తెరవెనక భాగవతం అన్నారు. నిజంగా ఇది నేటి సినిమా స్క్రీన్ ప్లే.  హరికథ,బుఱ్ఱకథ, నాటకాలని సినిమా మింగేసింది. సినిమాను టి.వి. మింగేసింది. టి.వి. ని ఇంటర్నెట్ మింగేసింది. మరింక కొత్తదేం పుడుతుందో చూడాలి. అందుకే పురాతన జానపద కళారూపాల్ని బతికించుకోవాలి. ఇప్పుడిపుడే ఈ స్పృహ కలుగుతోంది. మళ్ళీ పల్లెలలో జానపద కళారూపాలు ఆదరింపబడాలి.


ఏ కళా రూపానికైనా ముఖ్యమైనవారు ప్రేక్షకులు. వారు చూసి ఆనందించి అభినందించినపుడే కళాకారుని తృప్తి, సంతృప్తి. తోలుబొమ్మలాట చూడడానికి ఎవరొస్తారనుకున్నా. ఎక్కువగా వచ్చినది స్త్రీలు, పిల్లలు. నిజంగానే నాకు ఆనందం వేసింది. చిన్నపిల్లలకి ఈ కళారూపాన్ని దగ్గర చేయడానికి ముఖ్యులు స్త్రీలు, ఇంకా ఈ దేశంలో సంస్కృతి, సంప్రదాయం మిగిలున్నాయంటే, అదంతా స్త్రీల చలవే సుమా.  


 ఈ కళాకారులు, ఈ కళారూపాన్ని చాలా జాగ్రత్తగా పోషించుకొస్తున్నారు. ఏ జానపద కళ ఐనా ప్రజల మన్ననా, ఆదరం, గౌరవం పొoదలేనపుడు మాత్రమే కనుమరుగైపోతుంది. ఈ కార్య క్రమాన్ని నేను పూర్తిగా చూడలేకపోయాను కాని, చాలా బాగుందని చెప్పేరు. ఆ తరవాత, ఇదే కళాకారులు కాకినాడ బీచ్ ఫెస్టివల్ లో కూడా ప్రదర్శన ఇచ్చారనీ,ప్రజల ఆదరణ బాగుందనీ పేపర్లో చూశా. ఆనందమనిపించింది. ఇంతకీ మీకు ఈ కళా రూపం మీద అభిమానానికి కారణం? ఒకప్పుడు మావూరు, నరిసిపూడి ఈ కళారూపానికి పుట్టిల్లు. గోదావరి జిల్లాలో మా ఊరి కళా కారులుకి మంచి పేరుండేది. నేడు అక్కడ ఈ కళా రూపం పేరు చెబితే గుర్తు పట్టేవారు కూడా లేరు, ఆ కళ వీరి దగ్గర బతికి బట్ట కట్టినందుకే ఆనందం.  

మా ఊళ్ళో శ్రీ శారదా సంగీత కళా సమితి అనే ఒక సంస్థ ఉంది. దాని యాజమాన్యంలో, కొంత కాలం సంగీతం మటుకు కార్యక్రమాలు త్యాగరాజ ఆరాధనోత్సవాలలో జరిపించేవారు. కాలంతో మార్పు తెచ్చి, సంగీతంతో పాటు ఇతర కళా రూపాల్ని కూడా నిర్వహించడం మొదలు పెట్టి, హరి కథ, బుఱ్ఱకథ, మొదలైనవాటిని కూడా ప్రదర్శన లిప్పించడం మొదలు పెట్టేరు. ఈ సంవత్సరం తోలుబొమ్మలాట ను పెట్టేరు. ఈ కళ చాలా కాలం గా మరుగున పడిపోయే ఉంది. 

ఈ జానపద కళ గురించి నేను చెప్పేకంటే వారిచ్చిన్ బ్రోచర్ చూడండి. 



ఈ కళని బతికించడమెలా? ప్రభుత్వం...ఆగండి ప్రభుత్వం ఎంత చేస్తుందో మనకి తెలియదా? మరెలా? మనమే ఈ కళని ప్రోత్సహించాలి. అదెలా? మన ఊరిలో సంబరాలకి,గణపతి నవరాత్రులకు, దుర్గా నవరాత్రులకు మరే ఇతర ఊరుమ్మడి కార్యక్రమానికైనా ఈ ప్రోగ్రాం పెట్టుకోవచ్చు. మరలా పాత రోజుల్లో లా పెళ్ళి చేసుకోవాలనే అనుకుంటున్నది యువత, ఆ పెళ్ళికి ఈ కార్యక్రమం పెట్టుకోవచ్చు. ఇక విదేశాలలో వారికి నేను చెప్పక్కరలేదు కదా! ఇప్పటికే వీరిని తానా వారు,ఇతర దేశాలవారూ ఆదరించారు. మరెందుకు ఆలస్యం, అవసరమైనవారు వివరాలు గుర్తుపెట్టుకోగలరు.

వీరిని పరిచయం చేస్తానని మాటిచ్చాను,స్కేన్ చేయాల్సిన కాగితం పని కాలేదు, అందుకే ఆలస్యమైపోయింది, కళాకారులు మన్నించ వేడుతున్నా. 

8 comments:

  1. చాలా చక్కని టపా.
    ఇలాంటి కళారూపాలని బతికించుకుంటే, సోఫాలకి శిలాజాల్లా అంటుకుపోయి టివి చూడవలసిన అవసరం ఉండదు.
    ప్రజలు వీటిని మళ్ళీ ఆదరిస్తారని ఆశిద్దాము.

    ReplyDelete
  2. నా చిన్నప్పుడు చూసాను తోలుబొమ్మలాటను. అది 1960లో అనుకుంటాను. అప్పుడు మేము గెద్దనాపల్లెలో ఉండేవాళ్ళం.

    ReplyDelete
  3. బోనగిరిగారు,
    సోఫాలకి అంటుకుపోకుండా మళ్ళీ పల్లెలలోనే మార్పొస్తొందండి. ఆనాడు ప్రోగ్రాం కి వచ్చినవాళ్ళలో ఎక్కువ మంది స్త్రీలు పిల్లలే.
    ధన్యవాదాలు.

    ReplyDelete
  4. శ్యామలీయం వారు,
    కళ మరుగునపడిపోయిందండి, మళ్ళీ ఇప్పుడు ప్రజలు ఆదరిస్తున్నారు.
    ధన్యవాదాలు.

    ReplyDelete
  5. కొన్ని సంవత్సరాల క్రిందట మా తమ్ముడు ఒక విషయం చెప్పాడు. ఒక బుఱ్ఱకథ ప్రోగ్రాముకు కేవలం ముగ్గురంటే ముగ్గురే వచ్చారట! ఈ సంఘటన జరిగింది కాకినాడలో అనుకుంటాను. ఇప్పుడు మళ్ళా ప్రజలు ఆదరిస్తే పాతకళారూపాల్ని సంతోషమే.

    ReplyDelete
    Replies
    1. TNN చానెల్లో ప్రతి ఆదివారం రాత్రి ఎపిసోదుకు ఒక్క కళారూపం చప్పున ప్రదర్శిస్తున్నారు. ప్రదర్శనతో పాటు కళాకారుల బతుకు వెతలు కూడా చెబుతున్నారు.

      తెలంగాణా పునర్నిర్మాణంలో సాంస్కృతిక పునరుజ్జీవనం అత్యంత కీలకం అన్న నమ్మకంతో ఎంతో పరిశోధన చేసి మరుగున పడ్డ కళారూపాలను వెలిక్కి తెచ్చే ఈ ప్రయత్నం అభినందనయోగ్యం.

      Delete
    2. శ్యామలీయంగారు,
      ఈ కళా రూపాల్ని మళ్ళీ పల్లెలలోనే ఆదరిస్తున్నారు, అందుకు మా ఊరిలో ప్రోగ్రాం సాక్ష్యం. ఇక ఆ రోజు ప్రోగ్రాం కి వచ్చినవారు ఎక్కువ మంది స్త్రీలు దగ్గరగా అరైమంది దాకా, వారి కుర్చీలన్నీ నిండిపోయాయి. పిల్లలు దగ్గరగా అంతమందీ ఉన్నారు. కింద కూచోబెట్టేరు. ఇక మగవాళ్ళ కుర్చీలే కొన్ని ఖాళీగా ఉన్నాయి, నేను వచ్చేసేటప్పటికి. ప్రదర్శన చివరదాకా చూడాలనుకున్నా,చలిగురించి నేను తొందరగా ఇంటికి చేరుకున్నా,అనారోగ్య భయంతో. మరలా ఈ కళలు జనాన్ని ఆకర్షిస్తాయనే ఆశ ఉంది.
      ధన్యవాదాలు.

      Delete
    3. Jai Gottimukkalaగారు,
      ప్రభుత్వాలా ఆదరణ గురించి చెప్పుకోనక్కరలేదండి, అందరికి తెలిసినదే. ప్రజలే ఆదరించాలి, అప్పుడే ఈ కళలు బతుకుతాయి

      ధన్యవాదాలు.

      Delete