Saturday, 24 January 2015

శర్మ కాలక్షేపంకబుర్లు-లేస్తే మనిషిని కాదు....



ఈ మాట తెనుగునాట చాలా విస్తృతంగానే వాడతాము. దీని వెనక ఒక చిన్న కథ ఉంది, అవధరించండి.

అనగనగా ఒక పల్లెటూరు. దాని పక్కనే ఒక అడవి. అడవిలో ఒక మఱ్ఱిచెట్టు, బాటపక్కన. దానికింద ఒక దొంగ కంబళి కప్పుకుని పడుకుని ఉండి, ఒక కఱ్ఱపుచ్చుకుని నేల మీద కొడుతూ దారిన పోయే ప్రయాణీకులను ’లేస్తే మనిషిని కాదు, సొమ్ములక్కడ పెట్టి కదల’మని భయపెడుతూ సొమ్ము కాజేస్తూ ఉండేవాడు. ఇలా చాలా కాలమే జరిగింది. ఆదోవన పోయేవారంతా అలా సొమ్ము సమర్పించుకుంటూనే ఉన్నారు.

కొంత కాలం జరిగింది. మీలాటి ఒక తెగువ ఉన్న యువకుడు ఆ దారిన పోతున్నాడు. దొంగ అలాగే బెదిరించాడు, ఈ యువకుడు ఆలోచించాడు. చాలా కాలంగా ఈ దొంగ ఇలా 'లేస్తే మనిషిని కాదని' బెదిరిస్తూ ఉన్నట్టే చెబుతున్నారు తప్పించి, ఎప్పుడూ ఇతను లేచిన దాఖలా కనపడటం లేదనుకుని, ఏమైతే అదే అవుతుందని 'లే, లేచి చూపించు నీ వీరత్వం' అని ఎదురు తిరిగాడు. యువకుడు మళ్ళీ మళ్ళీ ఎదిరిస్తూనే ఉన్నాడు కాని సొమ్ము ఇవ్వలేదు. దానితో విసుగొచ్చిన దొంగ తన దగ్గరున్న కఱ్ఱ విసిరేశాడు, యువకుని మీదకి. యువకుడు లాఘవంగా తప్పుకుని అదే కఱ్ఱ పుచ్చుకుని ధైర్యంగా దొంగ దగ్గరకెళ్ళి, అతని పైనున్న కంబళీ లాగేశాడు, లే లెమ్మంటూ. తన దగ్గరా మరే ఆయుధమూ లేని దొంగ ఏమీ చెయ్యలేకాపోయాడు.... కారణం రెండు కాళ్ళూ లేకపోవడం. 

అప్పుడీ యువకుడు ఆ దొంగను రాజుగారి దగ్గర ప్రవేశపెట్టేడు. రాజు విచారించి ఎందుకు లేస్తే మనిషిని కాదని అంటున్నావో చెప్పమన్నాడు. దానికి దొంగ "మహరాజా! నాకు చిన్నప్పటినుంచి రెండు కాళ్ళూ లేవు.నేను అందరిని యాచించి బతికినంత కాలం లోనూ, ఎవరూ నా పై దయ చూపలేదు. అందుకే అడవిలో మకాం పెట్టేను. కఱ్ఱపుచ్చుకుని బెదిరించాను తప్పించి ఎవరినీ గాయపరచలేదు, నేటి దాకా. మార్గస్థులను భయపెట్టి పొట్టపోసుకుంటున్నాను. నేను నిజమే చెప్పేను, లేస్తే మనిషిని కాదని, అందరూ ఆ మాటను తప్పుగా అర్ధం చేసుకుని సొమ్ములిస్తూ వచ్చారు. మహరాజా! ఇందులో నా తప్పేమీ లేద"న్నాడు. 

ఆలోచించిన రాజు తన తప్పు కూడా ఉందని గుర్తించి, ఆ దొంగకి శిక్ష విధించి, ఆ తరవాత అతనినే వికలాంగుల బాగోగులు చూసే అధికారిగా నియమించాడట, అతని సత్య వాక్యానికి. 

ఇందులో ఉన్న చిన్న మాట. తప్పు చేస్తూ సత్యం చెప్పడం

4 comments:


  1. బాగు బాగు,

    ఈ దేశ సగటు మానవుడు కూడా ఇంతే 'నమో' !!

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. జిలేబిగారు,
      సగటు భారతీయుడెప్పుడూ ఇంతే.
      ధన్యవాదాలు.

      Delete
  2. బాగుంది మీ కధ,
    సిల్లీపాయింట్-->: లేస్తే మనిషి కాకపోవడమేంటండీ? లేచినా లేవక పోయినా మనిషి మనిషేగా????

    ఏమంటారు?

    ReplyDelete
    Replies
    1. Guntur Mail గారు,
      మంచి పాయింటే. మనిషిగా ఉన్నంత కాలం లో ఎవరూ పట్టించుకోలేదు. ముసుగు కప్పుకుని లేస్తే మృగంగా మారతానని బెదిరించి దండుకున్నప్పుడు, భయపడి సమర్పించుకున్నారు. నిజం తెలిసి నివ్వెరపోయారు. మనుషుల్లా బతుకుదామనేదే ఈ కథ సారాంశం. లేస్తేనూ మనిషిగా ఉండాలనేదే.......
      ధన్యవాదాలు.

      Delete