Wednesday, 26 March 2025

నడుస్తున్న చరిత్ర.-విశ్వావసు

 నడుస్తున్న చరిత్ర.-విశ్వావసు


భద్రం నో అపివాయః మనః శాంతిః శాంతిః శాంతిః 


కొత్త సంవత్సరం విశ్వావసు ఈ నెల 30 వ తారీకున మొదలవుతోంది. అంతకు ముందురోజు శనివారం సూర్యగ్రహణం,ఎక్కడెక్కడ కనపడుతుంది? అదీ కొచ్చను. కలనైనా నీ తలపే కలవరమందైనా నీ తలపే అన్నట్టు ఆమెరిక.సం.రా ల ఉత్తరభాగంలో,కెనడా,గ్రీన్ లాండ్,యూరప్, టర్కీ మధ్య ప్రాచ్యంలో కొద్దిగా,ఆఫ్రికా పశ్చిమ భాగంలో కొద్దిగా కనపడుతుంది. మిగతా ప్రపంచానికి కనపడదుగాని దాని ప్రభావం ఇతరచోట్లా ఉంటుంది,ఎలా? 


ఇక ప్రపంచ రాజకీయ చరిత్ర ఎలా నడుస్తోందీ? అమెరికా గ్రీన్లాండును కొంటానంటోంది? ఎందుకూ అక్కడ మంచేకదా? అక్కడ రేర్ ఎర్థ్స్ దొరుకుతాయి. ఇది చాలాకాలంగా డెన్మార్క్ చేతిలో ఉండి. జనాభా చాలా తక్కువ. మాఊరంత జనాభా! మా స్వాతంత్య్రం వదులుకోమంటున్నారు. 

కెనడా లో ట్రూడి రాజీనామా చేసాకా కొత్త ప్రధాని వచ్చారు. ఆయన మళ్ళీ నెల చివరలో ఎలక్షన్లు ప్రకటించారు. ఆయనంటారు మా రాజకీయాల్లో చైనా,INDIA లు వేలు పెట్టడానికి వీలుందని. నానోట్లో నీ వేలు పెట్టు,నీకంట్లో నా వేలు పెడతా అంటే కుదురునా? ఈ ఊరికి ఆవూరెంత  దూరమో ఈ వూరికి ఆవూరూ అంతే కదా?  

ఇక యూరప్ ఉడుకుతోంది. అటుపెద్దన్నను కాదని స్వతంత్రంగా యూక్రైన్ ని చేర్చుకుని యుద్ధం  కొనసాగించలేదు, కాదనుకుని ఊరుకోలేదు. మింగలేక కక్కలేక అవస్థపడుతోంది. మిగడానికి సరిపోయినదానికంటే ఎక్కువ కొరికితే ఏమవుతుంది? అదే పరిస్థితి యూరప్ ది నేడు. ఇంక రష్యా  చర్చ లు చేస్తూనే ఉంది యుద్ధం ఆపడానికి, కాని కొలిక్కి రావటం లేదు. చాలాplan లు ఉన్నా,దేనికీ ఒప్పుదల కావటం లేదు. చివరిగా ఒక మెలికపెట్టింది. కొన్ని దేశాలు,యు.ఎన్ కూడా చర్చలో పాల్గోవాలి అంటోంది. యూక్రైన్ తో అమెరికా రేర్ ఎర్థ్స్ ఒప్పందమూ సంతకాలు కాలేదు. జలనిస్కీ ఇటూ అటూ తిరగడం తప్పించి ఉపయోగమే కనపడటం లేదు. 


ఇక టర్కీలో కొద్దికాలం కితం జరిగిన ఎన్నికల్లో ఎర్డోగన్ మళ్ళీ ఎన్నికయారు. ప్రతిపక్ష నాయకుని అరెస్టు చేయ్యడం తో దేశం అతలాకుతలం అవుతోంది. ఇక మధ్య ప్రాచ్యం నివురుగప్పిన నిప్పులా ఉంది. ఇస్రయెల్ హమాస్ల  మధ్య శాంతి ఒప్పదం కొనసాగదు. 


ఆఫ్గాన్ పాకిస్థాన్ మధ్య వైరం నడుస్తూనే ఉంది. బలూచ్ నాయకురాల్ని అరస్టు చేసింది పాకిస్థాన్.  మొన్న జరిగిన క్వెట్టా  ట్రైన్ పై దాడితో అట్టుడికి బలూచ్ అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. పాక్ కి కంటిమీద కునుకు లేదు.  ఈలోగా తను దాచిపెట్టుకున్న  తీవ్రవాదులను గుర్తు తెలియనివాళ్ళు కాల్చి చంపుతున్నారు. అందులో మనదేశం మీద 26/11 తారీకున దాడికి మూలకారకుణ్ణి ఎవరో లేపేసేరట, నిజం ఇప్పటికీ ఇంకా పాక్ ప్రకటించలేదు. 

మనదేశం ఒక ఉగ్రవాదిని పంపించెయ్యమని అమెరికాను చాలాకాలంగా కోరుతోంది. అలా పంపడానికి ఏర్పాట్లు జరుగుతోంటే ఆ తహావూర్ రాణా గారు, నన్ను భారత్ పంపితే మరి బతకను నన్ను చంపేస్తారు, నాకు సుగర్,బి.పి.కేన్సర్ ఇలా లక్ష అనా రోగ్యా లున్నయి. అంచేత పంపడానికి లేదని అక్కడ సుప్రీం కోర్టుకి మొరబెట్టుకుంటే కాదoది. ఇంకా ఆశ వదలుకోక ఛీఫ్ జస్టిస్ కి తన అపీలు రిఫర్ చేసాడు. ఇప్పుడది విచార్ణలో ఉంది. భారత్ రాక తప్పదు. ఇక్కడికొస్తే మా మిత్రులకి పండగే పండగ. కొంతమంది లాయర్లకి చెప్పేదే లేదు. రాబోయే కాలంలో మన కోర్టుల్లో ఏం జరుగుతుందో వేచి చూదాం. ఇంతకు మించి లోతుగా దేశీ వ్యవహారాలోకి పోవద్దు. హిందీ చీనీ భాయి భాయి, ట్రంప్ సుంకాల దాడి తట్టుకోవాలంటే మనం కలసి పని చెయ్యాలంటోంది,చిత్రం చూడాలి.

ఇక బర్మాలో ప్రభుత ఉందా? ఏమో తెలియనట్టే ఉంది. రఖైన్ ప్రాంత ఆర్మీ తమప్రాంతాన్ని చేతుల్లో ఉంచుకుంది. బంగ్లాదేశ్ లో చిత్రం జరుగుతోంది. ఆర్మీ నాయకుడు పై తిరుబాటన్నారు. ఆయన మాత్రం సైన్యాన్ని దేశం  లో వివిధ ప్రాంతాలకి పంపి  దేశం లో శాంతి ఉంటుందని ప్రాధానిపై తిరుగుబాటును సహించాను, కాని   శాంతి కనపడటం లేదు, చెప్పలేదంటనకపొయ్యేరు. శాంతి స్థాపించుకోండి, లేదూ శాంతి స్థాపించి మేం barocks లకి తిరిగి వెళతామంటున్నాడు. జరగనున్నది చూడాలి. 

ప్రాచ్యంలో  మరో వింత చైనా,ద.కొరియా,జపాన్ లకి ఎప్పుడూ ఉప్పూ ,నిప్పే! కాని మొన్న ఈ మూడు దేశాలూ కలుసుకున్నాయి. ట్రంప్ను   తట్టుకోవాలంటే మనం ఒకటి కావాలంటున్నాయి. చూడాలి. ఇక ఆస్ట్రేలియా,న్యూజిలాంద్ లు మాదేశం నుంచి ఉగ్రవాదాన్ని సహించం అంటున్నాయి. దీని భావమేమి తిరుమలేశా?            

Monday, 24 March 2025

దూడంత దుఃఖం

 దూడంత దుఃఖం  పాడంత సుఖం  లేదు.

ఇది పల్లెలో తరచుగా వాడుకునే మాట, ఒక నానుడి.

పాడి పశువుల్ని దూడలని అనడం పల్లెపట్టున మా అలవాటు. ఒక పాడి పశువు ఇంట్లో ఉంటే దాని ఆలనా పాలనా చూడాలి, లేకపోతే పాలు పితుక్కోడానికి తపేలా పట్టుకెల్తే ముఖొం పగిలేలా తన్నుతుంది. దూడని మన నివాసానికి కొంచం దగ్గరగానే ఆవాసం ఏర్పాటు చేయాలి. దానికి గూడు ఉండాలి. గాలి వెలుతురూ రావాలి. కట్టుగొయ్యకి దగ్గరగా కుడితిగోలెం ఉండాలి, దగ్గరగానే మేతకి పచ్చిగడ్డి ఎండుగడ్డి జనపకట్ట ఉండాలి. పగటి పూట తెలగ పిండి,పత్తి విత్తనాలూ పెడుతుండాలి వారానికి ఒక సారైనా. తిండి పెట్టినంతలో సరిపోలేదు. అక్కడ దోమలు లేకుండా చూసుకోవాలి,శుభ్రం చేయాలి. రోజూ కట్టుగొయ్యనించి విప్పి బయటకి తీసుకుపోవాలి. ఇక ఆవు ఎంత ఎండైనా సహిస్తుంది కాని వాన చినుకు మీదబడితే సహించలేదు. గేదె వాన ఎంతైనా హాయిగా సహిస్తుంది,ఎండకి ఓర్చుకో లేదు. ఇది గమనించాలి.  ఏ రాత్రిపూటో అరిస్తే లేచి చూడాలి, దాని అవసరం తీర్చి అప్పుడు పడుకోవాలి. ఇలా అన్నీ అవస్తలే. పాడి పశువును పెంచడం పురిటిలో పాను చూసుకున్నంత శ్రద్ధగా  చూసుకోవాలి. పాడి పశువును పెంచడం ఒక కళ,కల కూడా. ఇది అందరికి చేత కాదు.

పాలు తీయడానికి ఒక నియమిత సమయం ఉండాలి. పాలతపేలా శుభ్రంగా తోముకోవాలి. ఏమాత్రం శుభ్రం లేకపోయినా పాలు విరిగిపోతాయి, చింతపండేసి శుభ్రంగా తళతళా  మెరిసేలా లోపలా బయటా తోమి ఎండలో బోర్లించాలి. అన్ని చేతులతో నూ పాల తపేలా ముట్టుకోకూడదు. మంచి నీళ్ళు నింపి పాలు తీసేవారికి కివ్వాలి. పాలు తీసేవారు కాళ్ళూ చేతులూ శుభ్రంగా తోముకుని పాలు తియ్యాలి.పాలుతీసే చోటు శుభ్రంగా ఉండాలి. పశువుకు ఆహ్లాదం కలిగేలా వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి. వెనకకాళ్ళకి బంధం వేయాలి.  తపేలాలో పట్టుకువెళ్ళిన నీళ్ళతో పొదుగును కడగాలి,శుభ్రంగా. అప్పుడు దూడను వదలాలి. దూడ కుమ్మితే ఆవు పాలు వదలిపెడుతుంది. ఒక సారి కనక ఆవు పాలు చేపితే మరి ఆపుకోలేదు,వెనక్కి తీసుకోలేదు. అప్పుడు నాలుగు చేర్లనుంచీ పాలు మార్చిమార్చి పితుక్కోవాలి. పాలు పితికేవారు పశువు కాళ్ళ దగ్గర గొంతు కూచోగలగాలి. పాల తపేలాను కాళ్ళ మధ్య జాగ్రత్తగా పట్టుకోగలగాలి. పాలు తీయడం కబుర్లు చెప్పినంత తేలికేం కాదు,పాలు కమ్మహా తాగినంత తేలికా కాదు. పాలు తీయడం ఒక కళ.  మరో ముఖ్యమైన మాట రోజూ ఒకరే పాలు పితకాలి,రోజుకొకరు తయారైపోకూడదు. ఇన్ని కష్టాలున్నాయి.      

 పాడి పశువును పెoచడానికి ఇన్ని పాట్లుంటాయి మరి ఇదంతా దుఃఖమే.


ఇక పాడంత సుఖం. ఇంట్లో పాడి  ఉంతే కల్తీ లేని పాలు తాగచ్చు.  పిల్లలికి గుమ్మపాలూ పట్టించచ్చు. పిల్ల లు  బలే బలంగా పెరుగుతారు. ఆపైన ఇంట్లో వాడుకోవచ్చు,గడ్డపెరుగు పోసుకుని కమ్మగా లాగిoచచ్చు. మీగడ,వెన్న,నెయ్యి కమ్మహా తినచ్చు. ఇంకా పాలు మిగిలితే అమ్ముకోవచ్చు,లేదా కేంద్రానికి పోసి డబ్బు చేసుకోవచ్చు. మనవాళ్ళ లో గొప్పచెప్పుకోవచ్చు,ఇంటికొచ్చినవాళ్ళకి చూరు నీళ్ళ కాపీ కాక మంచి చిక్కటి కాఫీ ఇవ్వచ్చు.  పాడి ఉన్నంత సుఖం లేకుంటే ఉంటుందా? 


పళ్ళచెట్టు,అదిన్నీ మామిడి,కొత్తపల్లి కొబ్బరైతే ఎంత బాగుంటుంది. ఊరగాయెట్టుకోవచ్చు,పులుపే పులుపు,పండితే ఆబ్బ ఆ రుచే వేరు. పండు చేతిలోకి రావాలంటే ఎంత కష్టం? చెట్టుని సంరక్షించాలి. ఆకులు రాలుతుంటాయి,తుడుచోకోవాలి,రోజూ. ఇది చాలా పెద్దపని. ఆపై పూత వస్తే దాని సంరక్షణ చెయ్యాలి. పూసిన పూతంతా కాపు కాదు. చాలాపూత రాలుతుంది. కాడలు రాలతాయి. ఎప్పటికప్పుడు తుడుచుకున్నా పెద్ద తలనొప్పి రెండు నెలలు. ఆపై కాసిన కాపంతా నిలబడదు. పిందే రాలుతుంది,కాయా రాలిపోతుంది,ఎంత? గంపలకొద్దీ. ఎత్తిపోసుకోవాలి. ఆపై ప్రకృతి కరుణించాలి,వాన,గాలి లేక. ఆ తరవాత పరువు కొచ్చిన కాయను కింద పడకుండా కోయాలి. ఊరగాయి పెట్టుకోవచ్చు. పండేసుకోవచ్చు. అన్నీ పండవు,కుళ్ళిపోతాయి,వాటిని పారేయక తప్పదు. లేదూ తాండ్రపోసుకోవచ్చు. పండెయ్య డానికి గడ్డి,అనువైన ప్రదేశం కావాలి,మిద్దెలాటిది. అప్పుడు కదా పండిన పండు తినేది. ఇంత కష్టం ఉన్నది మరి.అదే దూడంత దుఃఖం  పాడంత సుఖం లేదన్న సామెత. 

సుఖస్యానంతరం దుఃఖం   
దుఃఖస్యానంతరం సుఖం. 
న నిత్యం  లభతే దుఃఖం   
న నిత్యం లభతే సుఖం 

Friday, 21 March 2025

ట్రెండు

 ట్రెండు


ఫిబ్రవరి మధ్యనుంచే సూరిబాబుగారు నలభైకి ఒకడుగు అటూ ఇటూ వేస్తూ 'తగ్గేదేలే....' అంటున్నాడు. పది పరీక్షలు మొదలవగానే ఒక స్టూడెంట్ కుర్రాడు సీకాకులంలో 'దమ్ముంటే పట్టుకోరా ఇన్విజిలేటరూ...'అని ఒక డయలాగ్ పరీక్షాకేంద్రం గోడమీద రాసాడట. ఇక జూసుకోండీ అది వీడియో వైరల్ జేసేరట,కుర్రోళ్ళు,టీచర్లు, మేధావులు. అబ్బ ఇంత గొప్ప డయలాగ్ రాయగలిగినవాణ్ణి తయారు చేయగలిగినందుకూ,అంత ధైర్యవంతుడు మా స్టూడెంట్ అని చెప్పుకోడానికీ, ఇటువంటి మేధావి రేపు ఫీల్డ్ కొస్తే కాసులు గలగలే అని మేధావులూ ఎదురు చూస్తన్నారట. శుభం. 

పొద్దుటే అంబష్టుడు తల చీదర వదల్చేడు,పొన్నకాయలా గుండు చేసి. గుండు చేస్తూ గుండు ఇప్పుడు ఫేషను తెలుసాండీ, పిలక కూడా. పట్టెడు పిలక ముడి చుట్టుకోడం నేటి ట్రెండు. గుండు చేయించుకుని గడ్డం మీసం దుబ్బులా పెంచుకుని కండలు కనపడేలా  టి షర్టులేసుకుని తిరగడమూ ట్రెండ్ అండీ అన్నాడు. అమ్మో! గుండు కెంత ట్రెండూ అనుకున్నా!    

దూడంత దుఃఖం పాడంత సుఖం లేదన్నట్టు, ఊరుకున్నంత ఉత్తమం బోడగుండత సుఖం లేదుగా

Tuesday, 18 March 2025

ఒక్క సినిమాఛావా

ఒక్క  సినిమాఛావా


ఛావా సినిమా తెలుగులో కూడా విడుదలైందిట. ఔరంగజేబ్ పరిపాలనలో జరిగిన ఒక్క సంఘటన సినిమాగా తీస్తేనే ఔరంగజేబ్ వారసులనుకునేవారికి (వీరి తాతముత్తాతలు ఈ దేశంవాళ్ళే హిందువులు కూడా, డబ్బు,పదవులు,హింస కారణాలుగా  మహమ్మదీయ మతం తీసుకున్నారు.) ఔరంగజేబ్ అభిమానులకి ( వీరు ఈ దేశం వాళ్ళమేనంటారు, సెకులర్లం,మాకన్ని మతాలూ సమానం అంటారు. కాని హిందూ మతాన్నే తిడుతుంటారు. విదేశపు పాట పాడుతుంటారు) గంగవెర్రులెత్తిపోయింది. నిజంగానే ఔరంగజేబ్ సమాధిలోంచి లేచొచ్చి నేనే హిందువుల గుడులు కూల్పించాను,మతం మారని లక్షలమందిని చంపించాను, అని చెప్పినా,  నమ్మంగాక నమ్మం, అంటారు.   వీళ్ళు జహాపనా! తమరు గోరీలో పడుకుని  మూడువందలఏళ్ళు ఐయింది కదా అందుకు తమకు మరుపొచ్చింది. తమరు తమపరిపాలనా కాలంలో పదేళ్ళ తరవాత చరిత్ర రాయద్దన్నారు కదా! ఆ తరవాత కాఫిర్లు ఈ చరిత్ర  రాయించారు మహాప్రభో! అని చెప్పి ఔరంగజేబ్ నోరు బలవంతంగా నొక్కేసి మళ్ళీ గోరీలో పడుకోబెట్టెయ్యగలరు, అంతటి మేధావులు కదా!   ఔరంగజేబ్ పరిపాలనా  చరిత్రలో ఒక్క సంఘటనకే వీళ్ళిలా ఐతే ఔరంగజేబ్ మొత్తంచరిత్రని సినిమాగా తీస్తే ఏమవుతారబ్బా!       


ఔరంగజేబ్ పరిపాలన గురించి చదువుతారా! ఈ కింద లింక్ లో కొంచం ఉంది. 

https://www.quora.com/Which-Hindu-temples-were-destroyed-by-Aurangzeb

కాదు మొత్తం చదవాలనుకుంటే ఒక రచయిత రాసిన చరిత్ర చదవండి. 

 Maasir-A-'Alamgiri is the history of the Emperor Aurangzib-'Alamgir (reign 1658-1707 A.D.) Authored by Saqi Mustaid Khan. · Written in the original Persian, 

It was composed after the death of the emperor by Saqi Musta'd Khan at the behest of Inayetullah Khan Kashmiri, the emperor's last secretary.

Friday, 14 March 2025

తప్పెవరిది?

 

'విద్యార్థులకు దండం పెట్టి గుంజీలు తీసిన: HM

AP: పిల్లలను తల్లిదండ్రులు కంట్రోల్ చేయట్లేదని స్కూల్ హెడ్మాస్టర్ గుంజీలు తీసిన ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది. 
* 'పిల్లలు చదువులో వెనుకబడ్డారని ఆవేదన వ్యక్తం చేసిన బొబ్బిలి మం. పెంట జడ్పీ స్కూల్ HM రమణ... వారి ముందు సాష్టాంగ నమస్కారం చేసి, గుంజీలు తీశారు. 

'మేము కొట్టలేము.. తిట్టలేము.. ఏమీ చేయలేము.. మీ దగ్గర చేతకాని వారిలాగా చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది' అని ఆవేదన వ్యక్తం చేశారు. 
Courtesy:Whats app

మాస్టారు ఎంత ఆవేదన చెంది ఉంటారు? సమాజం ఎటుపోతోంది? ఇoతకీ తప్పెవరిది?

Monday, 3 March 2025

మూడో ప్రపంచ యుద్ధం రాబోతోందా?

  మూడో ప్రపంచ యుద్ధం రాబోతోందా?

ఏ దేశానికైనా విదేశాంగ విధానం ఒకటే! అదే స్వార్ధం. తమ దేశపు అవసరాలు ముందు,ఇదే అన్ని దేశాలకి వర్తిస్తుంది.


అంతర్జాతీయ రాజకీయం చాలా వేగంగా మారిపోతోంది, మరో సారి ట్రంప్ ఎన్నికైనప్పటి నుంచి. రెండు యుద్ధాలు నడుస్తున్నాయి. ఒకటి యూక్రైన్ రష్యా మధ్య,మరొకటి హమాస్ ఇస్రయెల్ మధ్య. మొన్న శుక్రవారం అమెరికా ఓవల్ ఆఫీసులో జరిగిన రగడ, అదిన్నీ పాత్రికేయుల ఎదురుగా, ఒక పెద్ద చరిత్ర . జలనిస్కీ ట్రంప్ ల మధ్య జరిగిన సంభాషణ వేడి పుట్టించింది. అమెరికా అధ్యక్షుని  నోట జలనిస్కీ మూడవ ప్రపంచయుద్ధంకి తెర తీస్తున్నాడన్న మాట వినపడింది. జలనిస్కీ సంధికి ఇష్టపడటం లేదన్న సంగతీ తెలుస్తూనే ఉంది, ఇది మిత్ర దేశాలలో వేడి పుట్టించింది. ఈ సమావేశానికి ముందే ఫ్రాన్స్,బ్రిటన్, జర్మనీలు  ట్రంప్ ను కలిసాయి. రాజకీయాల్లో బ్రిటన్ అమెరికా ఎప్పుడు విభేదించవు,  కాని కొంత విరుగు చూపి, Britan యూక్రైన్ కి పెద్ద లోన్ ఇవ్వడానికి ఒప్పందం చేసేసుకుంది, దీని తరవాతే .  బ్రిటన్ సైన్యం ఒంటరిగా రష్యాను ఎదుర్కోగలదని ట్రంప్ ఎగతాలిగా మాటాడినది కూడా బయట పడింది. ప్రపంచ దేశాలు రెండుగా చీలిపోతున్నట్టుంది. ఏదో రకంగా ఆయుధాలు అమ్ముకోడమే ధ్యేయంగా ఉండే అమెరికా శాంతి అంటోంది, ఇదే ఒక చిత్రం. మొన్న జరిగిన మీటింగ్ లో  ట్రంప్, నీకు సంధి కావాల న్నపుడే వద్దువులే అని కూడా అనేసేరు,జలనిస్కీతో. జలనిస్కీ, నీ చాపకిందికి నీళ్ళొస్తున్నాయి చూసుకోమనీ ట్రంప్ కి చెప్పేసేరు. ఇంతదాకా మీ కోసం సరఫరా చేసిన ఆయుధాల ఖరీదుకుగాను నీ దేశంలోని రేర్ మెటల్స్ గురించి ఒప్పందం మీద సంతకం చేయమంటే జలనిస్కీ చేసినదీ తిరుగుబాటు.  పల్లెటూరి రచ్చబండ రాజకీయంలా వ్యవహారం సాగిపోయింది.  బ్రటన్ లోన్ ఇవ్వడం ఆయుధాలు అమ్ముకోడానికే! ఇతర నాటో దేశాలన్నీ చిన్నవి జర్మనీ, ఫ్రాన్స్ తప్పించి. అమెరికా ఇక ముందు ఆయుధాలు ఇవ్వననీ,యుద్ధం కాదు ఇప్పుడు నీకు సంధి మాత్రమే అవసరం అని చెప్పినా జలనిస్కీ వినలేదు.  బ్రటన్ ఆయుధాలతో యూక్రైన్ పోరాటం  దేశ వినాశనమే అవుతుందని సోషల్ మీడియా ఉవాచ, ఆయుధాలున్నా పోరాట యోధులు లేని చందమైపోయింది యూక్రైన్ కి.   నాటో దేశాలు   ఉమ్మడిగా యూక్రైన్ తరఫున రష్యాను ఎదుర్కొంటాయా! తెల్లారి లెస్తే పొయ్యిలో పిల్లి వెలగాలంటే నాటో దేశాలన్నీ రష్యా ఇచ్చే గేస్ మీద ఆధారపడక తప్పదు. ఒక గేస్ పైప్ లైన్ యూక్రైన్ ద్వారా వెళ్ళేదానిని పాడు చేసేరు. ఎవరిగోల వారిదే,ఎవరి అవసరమూ వారిదే.యూరప్ మంటల్లో ఉంది.  


ఇదిలా ఉండగా ట్రంప్ ఆఫ్గనిస్తాన్ లో వదిలేసిన ఆయుధాలు,అప్పుడు యుద్ధంలో మీకిచ్చిన ఆయుధాల ఖరీదు చెల్లించమని ఆఫ్గనిస్తాన్ పీకమీద కూచునేలా ఉంది.ఎందుకిప్పుడు ఇది గుర్తొచ్చింది? ఆఫ్గాన్ లో ఉన్న కొన్ని మెటల్స్ ని స్వంతం చేసుకోవాలని చైనా చూస్తోంది. వాటిని చైనాకి దక్కకుండా చేయాలని అమెరికా ప్రయత్నం.  ఇక మధ్య ప్రాశ్చంలో ఇస్రయెల్ అమెరికా మాటకి బుర్ర ఊపుతోంది,యుద్ధం కొనసాగుతోంది.   

 

మరోపక్క చైనా ఆఫ్గాన్ మీద కన్నేసి ఉంచింది. అమెరికా దిగితే తానూ దిగేందుకు సిద్ధoగానే ఉంది. ఆస్త్రేలియా,జపాన్ లు అమెరికా పాటపాడుతున్నాయి. ఇండియా తటస్తంగా ఉంది.

భారత్ కి అంతర్గత శత్రువులే! బయటి శత్రువులు తెలిసినవారే!!  అంతర్గత శత్రువులు  స్వయంప్రకటిత మేధావులు,అర్బన్ నక్సల్స్,ఆందోళన జీవులు. వీరికి జనం సుఖంగా బతకడం ఇష్టముండదు. వీరు అధికవిద్యావంతులు,శేషప్పకవి చెప్పినట్టు ఈ అధిక విద్యావంతులు అప్రజోజకులే అవుతున్నారు, ఎంగిలి మెతుకులకోసం దేశాన్ని తాకట్టు పెట్టెయడానికి కూడా వీరు వెనుకాడరు. డీప్ స్టేట్ వారి ఎంగిలి  నీళ్ళు,మెతుకులకి ఆశపడే జీవులు. వీర్నేదైనా అంటే భోరున ఏడుస్తారు, మమ్మల్ని అనేసేరు,చూశావా దేశంలో వాక్కు స్వాత్రత్ర్యం లేదు వగైరా వగైరా వాగుతారు, ఇది వీరి జన్మహక్కు.  పట్టించుకుంటే రెచ్చిపోతారు. ఎదో చెయ్యాలి ఊరుకే వదిలేస్తే లాభం లేదు. 


ఇంతకీ అమెరికా యూక్రైన్లో శాంతి వచనాలు పలకడానికి కారణం  చూస్తే,ఇంతవరకు జరిగిన యుద్ధంలో రష్యా ఆక్రమించుకున్న ప్రాంతంలో యూక్రైన్ దేశపు రేర్ మెటల్స్ లో 60 శాతం ఉన్నాయి. రష్యాని అక్కడినుంచి తొలగించి,ఆమెటల్స్ ని స్వంతం చేసుకోవాలని అమెరికా ఆరాటం. ఇక బ్రిటన్ అవసరం? మిగిలిన 40 శాతం రేర్ మెటల్స్ ప్రాంతం చిన్న దేశాలకి మిత్ర దేశాలకి చేరువగా ఉంది. దాన్నికైవసం చేసుకోవాలని బ్రిటన్ ఎత్తుగడ. రష్యా మాట ఒకటే. నాటో కూటమిలో యూక్రైన్ చేరకూడదు,ఒప్పందం ప్రకారం. క్రిమియాను వదులు కోవాలి. ఇలా యూక్రైన్ కుక్కలు చింపిన విస్తరి కాబోతోందేమో!


చివరగా ఇస్రయెల్ హమాస్ లది బతుకుపోరాటం. కలసిబతుకుదామనుకుంటె సమస్య లేదు. ఒకరినొకరు లేకుండా చేసుకోవాలని చూస్తే చివరికి మిగిలేది బూడిద. 

Saturday, 1 March 2025

ఇవి ఏమి పళ్ళు?

ఇవి ఏమి పళ్ళు?



ఇవి ఏమి పళ్ళు?




ఫోటోలో ఉన్న పళ్ళు ఈ మొక్కని కాసినవే. చిన్నగా ఉన్నాయి. పచ్చిగా ఉన్నపుడు పచ్చగా ఉన్నాయి. మొక్కనే ఎరుపు రంగుకు మారాయి. ఇది ఏమి మొక్కయో తెలియలేదు. పళ్ళు బహుపుల్లగా ఉన్నాయి.