Friday, 24 May 2024

విష్ణుమాయ

 


(సామాన్యుడు వేంకటేశ్వరునికి విన్న వించుకుంటున్న తీరు. అన్నమాచార్యల వారి పెద్ద కుమారుడు పెద తిరుమలయ్య తన కీర్తనలో వెలిబుచ్చుతున్న విధం)  



ఎక్కడి మానుషజన్మం బెత్తిన ఫలమే మున్నది
నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తం బికనూ


జీవులన్నిటిలోను మానవజన్మ గొప్పది,అది పొందేను..  మానవజన్మ ఎందుకు గొప్పది? జీవులన్నిటిలోనూ మానవునికే అన్నీ అధికం, ఈ జన్మనుంచి మాత్రమే జన్మరాహిత్యం పొందడానికి సావకాశం. మిగతా ఉపాధులలో జన్మరాహిత్యం పొందేందుకు తగిన కర్మలు చేసే సావకాశం లేదు. అటువంటి జన్మ ఎత్తినా ఫలితం కనపడటం లేదు. ఇక నిన్నే నమ్ముకున్నా! ఇది నిజం, అంటే నీవేదప్ప ఇతఃపరంబెరుగ మన్నింపన్ దగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద మన్నింపు భద్రాత్మకా! అని గజేంద్రుడు శరణాగతి చేసినట్టు చెబుతున్నా! ఇక నీ చిత్తం పాలముంచినా నీట ముంచినా నీవే దిక్కని వేడుకోలు.


మఱవను ఆహారంబును మఱవను సంసారసుఖము
మఱవను ఇంద్రియభోగము మాధవ నీ మాయా
మఱచెద  సుజ్ఞానంబును మఱచెద తత్వరహస్యము
మఱచెద నురువును దైవము మాధవ నీ మాయా


మూడు పూటలా కంచం దగ్గరకి చేరడం మరిచిపోను, రాత్రికి మంచం దగ్గరకి చేరడమూ మరచిపోను (స్త్రీ సుఖమూ మరువను)సరే! ఇంతతో సరిపెడతానా? మిగిలిన ఇంద్రియ సుఖంకోసము పరుగులు పెడతాను.( మంచి సినిమా చూసేస్తాను, దమ్మరో దమ్ సంగీత కచేరి! ముందుంటాను. మంచి అత్తరొచ్చిందిట ఇంకేం కొనేస్తాను, ఈ శరీరానికి రాసేస్తాను. ఇవేవి మరచిపోను.) మాధవా నీమాయ సుమా! మంచిమాట మరచిపోతాను. నిన్ను తెలుసుకునే రహస్యం చెప్పినది మరచిపోతాను. చిత్రం చూడు! గురువునూ మరచిపోతాను,నిన్నే మరచిపోతాను!!! ఏంటయ్యా ఈ మాయ?



విడువను బాపము పుణ్యము విడువను నా దుర్గుణములు
విడువను మిక్కిలి యాసలు విష్ణుడ నీ మాయా
విడిచెద షట్కర్మంబులు విడిచెద వైరాగ్యంబును
విడిచెద నాచారంబును విష్ణుడ నీ మాయా

పాపమంటాను, పుణ్యమనీ అంటాను కాని ఏదీ వదలిపెట్టను, పాపాలు చేస్తూనే ఉంటాను. నా దుర్గుణాలు వదలను,పేరాశ, దురాశ, అంటూ ఉంటాను కాని వదలిపెట్టను, దేనినీ. ఇదంతా నీ మాయ విష్ణుడా! షట్కర్మలు వదిలేస్తా ( ఏమిటవి? అధ్యయనం,అధ్యాపనం;యజనం,యాజనం; దానం,ప్రతిగ్రహం.(చదవడం,బోధించడం;యజ్ఞం చేయడం,చేయించడం; దానమివ్వడం,పుచ్చుకోవడం) నిన్ను చేరే చదువు వదిలేస్తా, ఆచారమా గాడిదగుడ్డేం కాదూ! వదిలేస్తా!  గుర్తే రాదు, ఇదే కదా విష్ణుమాయ. 


తగిలెద బహులంపటముల తగిలెద బహుబంధమ్ముల
తగులను మోక్షపు మార్గము తలపున యెంతైనా
అగపడి శ్రీ వేంకటేశ్వర అంతర్యామివై
నగి నగి నను నీ వేలితి నాకా యీ మాయా

అనవసర విషయాలో వేలు పెట్టేస్తా, అనవసర బంధాల్లో తగులుకుంటా!!! మోక్ష మార్గం సుంతైనా తలపుకు రానివ్వను. అంతర్యామివైన నువ్వు నవ్వుతుంటావు, నా ఏలికవై  నీవుండగా  నాకేల ఈ విష్ణుమాయ, వేంకటేశ్వరునిగా నవ్వుతూ దర్శనమీయరాదా.  



ఎక్కడి మానుషజన్మం బెత్తిన ఫలమే మున్నది
నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తం బికనూ

అన్నమయ్యను స్మరించుకుంటూ...


ధన్యవాదాలు.:-మొన్న ఒక కామెంట్ రాస్తూ ఈ కీర్తన చరణం మొదటి పాదమే రాయగలిగా మిగిలినది గుర్తుకు రాలేదు. >>>> పెట్టి వదిలేసా! మిత్రులు విన్నకోటవారు ఈ కీర్తన పట్టుకుని నాకు పంపించారు. దానినిలా సద్వినియోగం చేసుకున్నాను. విన్నకోటవారికి మరొక సారి ధన్యవాదాలు.

6 comments:

  1. 🙏
    నిన్న అన్నమయ్య జయంతి. వారిని, వారి సంతతిని స్మరించుకోవలసిందే.

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు24 May 2024 at 09:27
      అన్నమయ్య జయంతినాటికి రాయాలనుకున్నా! వేడి ఇబ్బంది పెట్టింది. చివరి పాదాలు తప్పు చెపుతున్నానేమో అని భయమూ కలిగిందండి. నిన్న ఉదయమే సింహాసనం ఎక్కి కూచుంటే :) తిరుమలయ్య పూనేడు తెల్లవారుగట్లనే! అంతే నడిచిపోయిందండి :)
      ధన్యవాదాలు.

      Delete
    2. తిరుమల సామియె పూనగ
      వరుసగ వచ్చెన్ తలపులు వ్యాఖ్యానములై
      పరుగులిడె నన్నెరుగకన్
      పరమాత్ముని చలువ యిద్ది భళిభళి వినరా

      Delete
    3. Zilebi25 May 2024 at 13:48
      నమో వేంకటేశా! నమో తిరుమలేశా!!
      మహానందమాయె!! ఓ! మహాదేవ దేవ!!!

      Delete
  2. మీ వ్యాఖ్యానం చాలా నిర్మొహమాటం గా నా మనసు లో ని మాయ ను చెప్పినట్లు ఉంది. అభినందనలు.

    ReplyDelete
    Replies
    1. Prabhakar Lakku24 May 2024 at 10:37
      పొరబడుతున్ననేమోనని భయపడ్డానండి, నచ్చినందుకు
      ధన్యవాదాలు.

      Delete