మనసు విరిగెనేని మరి అతుకగరాదు
ఇనుము విరిగెనేని
ఇనుమారు ముమ్మారు, కాచి అతుకవచ్చు కమ్మరీడు
మనసు విరిగెనేని మరి అతుకగ రాదు
విశ్వదాభిరామ వినుర వేమ!
ఇనుము విరిగితే రెండు మాడుసార్లు అతకచ్చు, వేడిచేసి. కాని మనసు విరిగితే మరి అతుక్కోదు.
తాతగారి మాట చద్దన్నం మూట.
ఇనుము చాలాగట్టి లోహం. అది విరగాలంటే చాలా పెద్ద సమ్మెటపోట్లు బలంగా తగిలితేగాని విరగదు. అలా విరిగిన ఇనుమును కూడా కమ్మరీడు కాలేసి అతకగలడు, అది కూడా రెండు మూడు సార్లే, ఆ తరవాత అదీ అతుక్కోదు. ఇక మనసు గాజుకాయలాటిది, ఎంత సున్నితమో అంత కఠినం కూడా. అటువంటి మనసు విరిగితే మరి అతకడం ఎవరివల్లా కాదంటారు, ఇంతటి మనసు ఎలా విరుగుతుంది, మాటల తూటాలకి విరుగుతుంది,అంటారు, తాతగారు.
దీనికి నిదర్శనంగా భారతంలో ఒక పద్యం ఉంది, పద్యం గుర్తు లేదు, భావం రాస్తున్నా! ఎవరేనా పద్యం గుర్తు చేస్తే సంతసం. ''పదునైన బాణం ములుకులతో ఐన గాయాలను కూడా మాన్చవచ్చు, కాని మాటలో ఐన గాయాలు, మాన్చటం ఎవరితరమూ కాదు!'' అందుచేత ముందు ఆలోచించాలి,ఆలోచించి మాటాడాలి, నోటి నుంచి బయటికి వచ్చిన మాట రామబాణ సమానం, అది తన లక్ష్యాన్ని ఛేదించి తీరుతుంది, వెనక్కి తీసుకోలేం. అందుకే నోరు సంబాళించుకో అంటారు, పెద్దవాళ్ళు.మరో మాట కూడా నోరా వీపుకి దెబ్బలు తేకే అన్నది జాతీయం. కాలు జారితే తీసుకోగలం ,నోరు జారితే తీసుకోలేము, ఇది మరో జాతీయం.
పద్యం గుర్తొచ్చింది
తనువున విరిగిన యలుగుల
ననువున బుచ్చంగవచ్చు నతి నిష్ఠురతన్
మనమున నాటిన మాటలు
విను మెన్ని యుపాయములను వెడలునె యధిపా!