Monday 13 May 2024

వోటేసేను.

 వోటేసేను.



 ఈ వేళ పొద్దుటే బూత్ దగ్గరకెళితే లైన్ లో నిలబడమన్నాడు పోలీసు, కర్చుకిచ్చేసేను, ఎనభై ఏళ్ళు దాటినవాడిని లైన్ లో నిలబడక్కరలేదు, తెలియకపోతే తెలుసుకో అంటూ, లోపలకెళ్ళిపోయా, వోటేసేను. 


మొదటిసారి వోటెప్పుడేసేనని ఆలోచిస్తే 67 లో వేసేను. 62 లోనే ఉద్యోగంలో చేరినా అప్పటికి ఇంకా 21 పూర్తికాలేదు కనక, ఒక చోట ఉండకపోవడం కారణాలు.  ఆరోజుల్లో మాకు వోటెయ్యడానికి గంట సమయం ఇచ్చేవారు, శలవు లేనే లేదు, దానికి ప్రతిఫలమూ లేదు, అందరికి శలవున్నా. ఆ తరవాత ఎన్ని సార్లు వేసేను,గుర్తులేదు. వోటెయ్యడం ఇదే ఆఖరు సారి కావచ్చు.


వోటేసిన తరవాత అబ్బాయి అక్కడ తెలిసినవారి ఇంటి దగ్గర కూచోబెట్టేడు, తను వోటేసొస్తాను, అప్పటి దాకా కూచోమని. ఈ లోగా ఒక నాలాటి ఆవిడే వచ్చింది, వేటేసేరా? అంటూ. వేలు చూపించా, ఎవరికేసేరంది, చెప్పేను, మీరెవరికేసేరన్నా? కమ్మోరమ్మాయికి రెడ్డోరబ్బాయికి ఓటేసా అంది. ఇద్దరూ  రెడ్డోరబ్బాయి లేగా అడిగా! అది సీక్రెట్టూ అని క్రాస్ వోటింగ్ జరుగుతుందని నవ్వేసింది, ఈలోగా మరోకరు మాలాటివాడే వస్తూ వోటేసేరా అని అడిగి, కరువొచ్చేలా ఉందండీ అన్నారు నర్మగర్భంగా. మొదటి కరువుకే చచ్చిపోలేదు, వచ్చే కరువులు మనల్ని ఏం చేస్తాయి లెద్దురూ, వయసైపోయినవాళ్ళం, చచ్చిపోతే గొడవేలేదందావిడ. ఈలోగా అబ్బాయొచ్చేడు, నేనొచ్చేసా!

Saturday 11 May 2024

గవళ్ళగంగమ్మగారి....




 గవళ్ళగంగమ్మగారి....


కల్లు మానండోయ్ బాబూ! కళ్ళు తెరవండని నాటిరోజుల్లో మొత్తుకున్నారు. మానినట్టెఖ్ఖడా కనపడలేదు.నేడు అది కాస్తా పెరిగి పెద్దదిపోయిందంటే అనుమానం లేదు. ఒకప్పుడు పబ్బుల్లోనూ క్లబ్బుల్లోనూ కంపెనీ సరుకే తాగుతారానుకునీ వారు.కాలం మారింది. భూమి గుండ్రంగా ఉంది. ఆడా మగా తేడా లేక నేడు కార్లు పల్లెలకి పరిగెడుతున్నాయి,ఉదయమే. తాడి చెట్టునుంచి దించిన కల్లుకుండ చెట్టు మొదటిలోనే కాళీ ఐపోతోంది. చదువుకున్న ఆడపిల్లలు వయసుతో సంబంధం  లేక కల్లు తాగుతున్నారు. కల్లు తాగుతున్న వీడియోలో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.


తాటికల్లూ సరిపోయేలా లేదు కొబ్బరికల్లు కూడా గీయచ్చు, ఇక ముందు.


గవళ్ళగంగమ్మగారి హస్తోదకం జిందాబాద్!!! 

Friday 10 May 2024

మూడు పువ్వులు....

 


మూడు పువ్వులు....


వాడికేంట్రా! వాడిపని మూడు పువ్వులూ ఆరు కాయలా ఉందీ, అంటారు, దీనర్ధం, ఏలేస్తే కోలు దిగేలా ఉందంటారు, పల్లెటూరివాళ్ళు. దీనికి ఆశ్లీలార్ధమూ చెప్పేవారున్నారు.


అబ్బాయిగారి పని మూడు పువ్వులూ ఆరుకాయల్లాగే ఉందిట. మొదట అమేటీ లో నెగ్గేరు అది సొంత సామ్రాజ్యం.   పువ్వు పిందయింది, అది ఉడుకు పిందయి రాలిపోయింది..

 అది దూరాక్రమణ పాలయిందనుకుని చింతించి,వగచి మరో పచ్చటి చోటుకి మారేరు. ఆ పూవు పిందయింది, ఇదీ ఉడుకుపిందయి రాలిపోతుందా? ఇప్పుడది ఎర్ర వారి కళ్ళ బడి దురాక్రమణ, మిత్రుల పేర వెన్నుపోటు తగిలేలా ఉంది, ఈపువ్వు పిందయ్యేనా? అనుమానమే! ఇప్పుడు మూడో పువ్వు చూసుకోక తప్పటం లేదు, అది బరేలీ. అమ్మ త్యాగమయి, తన స్వంత సీటు కొడుక్కోసం వదిలేసి రాజ్య సభకెళ్ళిపోయింది. అమ్మ ఒడి కదా భయమేల వెంటనే నామినేషన్ వేయచ్చుగా అడిగాడో సందేహి. నిజమేగాని ఇక్కడా మరే దురాక్రమణ దారు తయారవుతాడో చెప్పలేం కదా! అందుకే సస్పన్స్, దేశం ముక్త కంఠంతో పోటీ చెయ్యమనలేదూ! ఈ పూవు పిందయ్యేనా? పురిటిలోనే సంధి కొట్టేనా? కాలమే చెప్పాలి.


మూడు పువ్వులు ఆరు కాయలవుతాయా?  

Thursday 9 May 2024

ఒక రోజు పెళ్ళికి మొహమంతా కాటుక

 ఒక రోజు పెళ్ళికి మొహమంతా కాటుక


పెళ్ళి ఐదురోజులు నుంచి సమయం తగ్గి మూడు రోజులు,ఒకరోజుకు తగ్గిన కాలం. ఒక పెళ్ళి జరుగుతోంది. బ్రహ్మగారు అగ్నిహోత్రం దగ్గర దంపతుల్ని కూచో బెట్టి హోమం చేయిస్తున్నారు. పొగ కమ్ముతోంది.పెళ్ళి కూతురుకి పొగ బాధగా ఉంది. కళ్ళ నీళ్ళొస్తున్నాయి. కొంగునగాని గుడ్డతోగాని తుడుచుకోలేదు,కారణం పెళ్ళి కూతురు ఏడుస్తోంది,పెళ్ళి ఇష్టం లేదేమో అని గుసగుసలు రావచ్చు. అందుకు కళ్ళు నులుపుకోడం చేస్తూ వచ్చింది. కళ్ళకి కొంచం దండిగానే కాటుక పెట్టడం తో అదికాస్తా మొహాన అలుముకుపోయింది. అందమైన పెళ్ళికూతురు మొహం భయంకరంగా మారింది.అందం కోసం కాటుక పెట్టుకుంటే అదికాస్తా భయంకరంగా మారినట్టు. అదుగో అలాపుట్టిందీ నానుడి. 


ఇప్పుడిదెందుకూ! శంక. ఎండ మలమల మాడబెడుతోంది ఇరవైరోజుల్నించి. చల్లబడితే బాగుణ్ణు అన్నది కోరిక. మొన్న మంగళవారం మధ్యాహ్నం పన్నెండు ఎండ దంచుతోంది, అప్పుడు గాలేసింది, కరంటుపోయింది,మబ్బేసింది,చినుకులు,పెరిగాయి. వర్షం నిలిచి మూడు గంటలు కురిసింది. కరంటు రాలేదు. చల్లబడిందనుకున్నాం కాదు పరిస్థితి పెనం మీంచి పొయ్యిలో పడినట్టనిపించింది. ఇప్పటిదాకా లోపల చల్లగా బయట వేడిగా ఉందేది ఇప్పుడు బయటలోపలా కూడా వేడి,ఉక్కపోత దంచుతున్నాయి. ఇదేమని ఆలోచిస్తే చుట్టూ ఉన్న కాంక్రీట్ జంగిల్ నుంచి విడుదలైన వేడి, ఇంటి గోడలు వేడెక్కి ఉన్నవి నీరు పడటంతో వేడి లోపలికి వదలితే పొయ్యిలో ఉన్నట్టే, కుమ్ములో పెట్టన చిలకడదుంపయింది మా పని. అప్పటి నుంచీ బేటరీ మీదనే ఫేన్లు తిరుగుతూనే ఉన్నాయి. కరంటెప్పుడొస్తుందంటే ఆరు గంటల కిస్తామన్నారు. వాళ్ళేం అవస్థపడుతున్నరో అనుకుని మరి అడగ లేదు. (మొన్ననోరోజు సబ్ స్టేషన్ లో ట్రాన్స్ఫార్మర్లు వేడెక్కిపోతే, కాలిపోకుండేందుకుగాను, కరంటు గంట సేపు ఆపి, ఫైర్ ఇంజన్లతో వాటిపై వర్షం కురిపించి, మళ్ళీ కరంటిచ్చారు) మెతుకులు కతికా, బెడ్ మీద పడుకోలేను,వేడి. కింద పడుకుంటే అలవాటు లేదు. ఇలా అవస్థపడి మడతమంచమేసుకుని పడుకుని,కూచుని బాధ పడితే ఒంటిగంటకి కరంటొచ్చిపోయింది. అసలు ఊపిరొచ్చింది గనక బతికే సావకాశం ఉందని సంతసించి ఎదురుచూస్తే రెండు గంటలకి కరంటు స్థిరంగా నిలబడితే ఎ.సి వేసుకు పడుకుంటే నాలుగుకే అలవాటుగా మెలుకువ వచ్చేసింది.

వర్షం పడితే చల్లబడుతుందనుకుంటే ఒకరోజుపెళ్ళికి మొహమంతా కాటుక సామెతయింది. 


Wednesday 8 May 2024

ఎవరెక్కువ తడుస్తారు?

 

ఎవరెక్కువ తడుస్తారు?



 నిలిచి కురుస్తున్న వర్షంలో ఎవరెక్కువ తడుస్తారు?

నడుస్తున్న 

లావుపాటివారా? సన్నపాటివారా?

Monday 6 May 2024

శుభాకాంక్షలు.

 శుభాకాంక్షలు.


దేశ విదేశాల్లో ఉన్న మిత్రులూ,శత్రువులకూ,

ఎల్లరకూ


ఏప్రిల్ రెండో వారంలోనే మొదలైన

మలమాడ్చే ఎండలు (41,42,43,44,45,46,47 డిగ్రీల వేడి)

వడగాలి, ఉక్కపోత 

శుభాకాంక్షలు.


Thursday 2 May 2024

ఎండ మలమల మాడుస్తోంది.

 ఎండ మలమల మాడుస్తోంది.


వేడి పాపం పెరిగినట్టు రేసు గుఱ్ఱంలా పరిగెడుతోంది 40 నుంచి 45. ఎక్కడా బెత్తెడు నేల కనపట్టంలేదు,మొక్క లేదు. అంతా కాంక్రీటే! ఎన్ని సార్లనుకుని ఉపయోగం లేదు. ఇది ఒకరోజు పాపం కాదు తరాల పాపం. అనుభవించక తప్పదు. 


చేసుకున్న కర్మమోయ్ శంభు లింగమా! 

అనుభవింపక తప్పదోయ్ ఆత్మ లింగమా!


ఎండ వేడి నుంచి రక్షించుకోడమెలా? పాపం! విపత్తు నివారణ సంస్థ వారు రేపటి గురించి ఈ రోజో ఇంట్లో ముసలాళ్ళలా కురుపు సలిపినట్టు ఒక మెసేజి ఇస్తూనే ఉన్నారు. లెక్క చేసేవారే కనపట్టం లేనట్టుంది.


వేసవి వేడి మూలంగా వచ్చే అనారోగ్యాలనుంచి కాపాడుకోవాలంటే కొన్ని పనులు తప్పవు. బయట తిరక్క తప్పని వారు చెవులకి గుడ్డ కట్టుకోవాలి,అందుకే మనవారు తలపాగా చుట్టేవారు. జేబులో ఒక బళ్ళారి ఉల్లిపాయ ఉంచుకుంటే ప్రమాదం నుంచి రక్షించుకోవచ్చు. ఎండలో దాహంగా ఉన్నపుడు,వడ తగిలిందేమో అనుమానం కలిగినపుడు, ఈ ఉల్లిపాయను నమిలిమింగండి, ప్రాణం కాపాడుతుంది, దాహం కడుతుంది. ఇది చాలా పురాతనంగా అనాగరికంగా కనపడచ్చు, కాని ఇది నిజం.


ఇక నీడపట్టునున్నవారు, ఎ.సి ఉన్నవారు, ఎ.సి లో ఉండేవారు, ఎ.సిని 27 లో ఉంచుకుని ఉంటే బహు బాగుంటుంది. ఇక తినే ఆహారంలో నీరుల్లి ఎక్కువ వాడితే మంచిది. నీళ్ళు ఎక్కువపోసిన మజ్జిగ నిమ్మకాయతో ఆరారా తాగడం  మంచిది. కొబ్బరి నీళ్ళు నిలవవికాక దొరికితే తాగడం మంచిది. తాటిముంజలు దొరికితే మంచిదే. వేసవి అంటే పళ్ళే. అన్నిటిని తినచ్చు,మితంగా. తాగేవాటిలో సబ్జా గింజలు నానబెట్టినవి,నీళ్ళతో గాని,మజ్జిగతో గాని, ఉప్పు,పంచదారలతో లేదా బెల్లం మహ మంచిది. ఈ అనుపానాలు వాడలేనివారు సబ్జా గింజల్ని నానబెట్టి మజ్జిగతో తీసుకోవచ్చు. ఆరారగ తాగితే బహుమంచిది. ఎ.సి లో ఉంటే నీళ్ళెక్కువ తాగాలి, అప్పుడు ఈ సబ్జా గింజల మజ్జిగ బహుమంచిది. ఎట్టి పరిస్తితులలోనూ ఫ్రిజ్ ఉన్న నీళ్ళు తాగద్దు, గది వేడి దగ్గరున్నవి,రాగి బిందెగాని ఇత్తడి బిందెలో ఉన్న నీళ్ళు తాగండి. ఆరోగ్యానికి మంచిది. సబ్జా గింజలంటే మరేమో కాదు తులసి విత్తనాలే! వీటి ఉపయోగాలనేకం, ఆరోగ్యానికి గొప్ప అవసరం.   ఛీ తులసి విత్తనాలా నానబెట్టుకుని తాగుతారా? అసలొప్పం కోకాకోలా తాగుతాం ,పిజ్జ తింటాం ఈ పిచ్చి తిళ్ళేం తింటామంటారా! అస్తు. 

చెప్పడమే నా ధర్మం 

వినకపోతె నీకర్మం


Monday 29 April 2024

రాజుని చూసినకళ్ళ మొగుణ్ణి చూస్తే

 రాజుని చూసినకళ్ళ మొగుణ్ణి చూస్తే మొట్టబుద్ధి.

రాజుఎలా ఉంటాడు? ఎర్రగా బుర్రగా ఉంటాడు. చుట్టూ మంది మార్బలం, కైవారాలు , వందిమాగధులు ఇలా ఉంటాడు. ఊరేగితే ఏనుగు మీద ఎక్కి తిరుగుతాడు. అటువంటివాడిని చూసిన ఇల్లాలు, మొగుణ్ణి చూస్తే లోకువగానూ,చీదరించుకునేలా కనపడడూ? ఎందుకంటే రాజులా ఎర్రగా బుర్రగా ఉండడు,కూడా ఎవరూ ఉండరు, చెప్పినమాట వినేవాడే ఉండడు. 

ఈ దేశంలో పుట్టిపెరిగి ఇక్కడ పల్లెలో,చెరువులో పిత్తపరిగిలు పట్టుకునే  వాడికి,  తల్లితండ్రులు కడుపుకట్టుకు చదివిస్తే, దశ తిరిగి అమెరికా వెళితే,  ఇక్కడ దేశం దరిద్రంతో ఓడుతున్నట్టు కనపడదూ? ఇక్కడ జనాలంతా అనాగరికుల్లా కనపడరూ?   తల్లితండ్రులు బిచ్చగాళ్ళలా అనిపించరూ?

పేదవానికోపము పెదవికిచోటు.

పేదవాడికి కోపమొస్తుంది,ఎందుకు? తనకి అన్యాయం జరిగినపుడు. ఏం చేయగలడు? ఏమీ చేయలేడు. చేయగలది తననుతాను తిట్టుకోవడం. అదే పేదవానికోపము పెదవికి చోటు,చేటు కాదు.

అడిగేవాడికి చెప్పేవాడు లోకువ.

అడిగేవాడు తాను గొప్పవాణ్ణనుకుంటాడు.  అడుగుతూనే  ఉంటాడు. వాడికి సమాధానం చెప్పినకొద్దీ లోకువ కదా! అలా అడుగుతూనే ఉంటాడు. ఇదే లోక రీతి. వినేవాడికి చెప్పేవాడులోకువ ఇదీ మరొక లోకోక్తి.

Saturday 27 April 2024

Thursday 25 April 2024

ప్రజలను ఆకర్షించు విద్యలు.

 ప్రజలను ఆకర్షించు విద్యలు.

 ఉచ్చై రధ్యయనం, చిరంతన కథా:, స్త్రీభి: సమాలాపనమ్,

తాసా మర్భక లాలనం, పతినుతి:, తత్పాక మిథ్యాస్తవమ్
మిథ్యా దాన, మభూత పూర్వ చరితం, సాముద్రికం, జ్యోతిషం
వైద్యం, గారుడ మంత్రజాల మధికం భిక్షాటనే ద్వాదశ

గట్టిగా చదవటం,
ఎక్కడెక్కడివో గాథలు చెప్పటం,
స్త్రీలతో సక్కగా మాట్లాడటం,
వారి బిడ్డలను ముద్దుచేయడం,
పై అధికారిని పొగడడం,
వండిన వంటను మెచ్చుకోవడం,
దానం చేసినట్లు కనిపించడం,
లేని కథలు అల్లి చెప్పడం,
హస్తసాముద్రికం,
జ్యోతిషం,
వైద్యం,
పాము తేలు మంత్రం
- అనేవి ఇతరులను ఆకర్షించు విద్యలు.
Courtesy:http://sahitinandanam.blogspot.in/


నేటికీ రాజకీయులు ఉపయోగిస్తున్న ట్రిక్కులు ఇవేనేమో సుమ్మీ/సూవె/సుమా! 

Tuesday 23 April 2024

ఆడలేక....

 ఆడలేక....


మా వాళ్ళు వాట్సాప్ మీటింగేసేరు,పొద్దుటే!


బి.జె.పి కి నాలుగొందల సీట్లొస్తాయంటావా? అన్నాడు సుబ్బరాజు. రాకెక్కడికిపోతాయిలే సూరత్ లో లాగా చేస్తే అన్నాడు పొడిగింపుగా.


సుబ్బరాజూ! నాలుగొందలొస్తాయో లేదో చెప్పలేనుగాని సూరత్ లో వేసినట్టు నామినేషన్లు వేసుకుంటే ఐదొందలూ వస్తాయి.నూరేళ్ళు నిండిన పార్టీ అని జెప్పుకుంటారుగా! నామినేషన్లు కూడా సరిగా వేసుకోలేరా? దానికీ ఆళ్ళనే తిడ్తావా? జనాలు నవ్వుతారయ్యా! మనపల్లెలలో ముతక సామెత జెపుతారు, నీకూ తెలిసిందే!! ఇక్కడ జెపితే బాగోదనుకో, ఇనుకో! ఆడలేక మద్దెల ఓడన్నదట ఒక సాని. అలాగుందో! అన్నాడు సత్తిబాబు.


మనదగ్గరేటి చెప్పూ అన్నాడు సుబ్బరాజు. వద్దో!నా నోరు తిన్నగుండదు,నీకేమో బాధ కలుగుద్ది. నే పోతన్నా! ప్రచారానికిపోవాల! అని వెళ్ళిపోయాడు మా సత్తిబాబు. 

Thursday 18 April 2024

ఎండలు మండుతున్నాయి

 ఎండలు మండుతున్నాయి


వాట్సాప్ లో మీటింగెట్టేరు మావాళ్ళు.


ఎండలు మండుతున్నాయన్నాడు మా సుబ్బరాజు.


ఎండలు మండవో! మంటబెడతాయి, అన్నాడు మా సత్తిబాబు.


కోసట్టుకున్నావుగాని.ఎండలకి నీళ్ళు లేక బెంగళూరు సగం ఖాళీ అట, ఎడారి దేశంలో వరదలట.వరుణజపం చేస్తే వర్షాలు కురుస్తాయటగా? ఏంటయ్యా ఇదీ!


నీళ్ళు లేక బంగళూరు ఖాళీ అవుతోంది,ఎడారి దేశంలో వరదలూ నిజమే! నువ్వంటే నువ్వనుకుని నీళ్ళు లేకుండా చేసారు. ఎడారిదేశం వాళ్ళు టెక్నాలజీ ఉపయోగించి వర్షం కురిపించుకుంటే అదెక్కువై వరదలొచ్చేయి. మనకి టెక్నాలజీ ఉన్నా ఉపయోగించుకునేది లేదు. వరుణ జపాలమీద నమ్మకమూ లేదు. యతోభ్రష్ఠః తతో భ్రష్ఠః మనమింతేలే అనేసేడు సత్తిబాబు.


చైనాలో సింగపూర్ లో ఎండలు లేవంటగా అడిగాడు సుబ్బరాజు.


అవున్లే! భక్తులకట్టనే ఉంటదబ్బయా!


మనకీ ఎండలెక్కువగానే ఉన్నాయి 40,42,43,44,45 అంటున్నారు అన్నాడు సుబ్బరాజు.


కరువుబాబుగారు కుర్చీ ఎక్కుతాడు దానికి సూచనే ఈ ఎండలని చెప్పుకుంటన్నారులే వాళ్ళోళ్ళే. ఎల్తా! అన్నాడు సత్తిబాబు. 


ఓ! నిమిషం కూచోవో అడిగాడు సుబ్బరాజు.


నీది కడుపు నిండినబేరం. ఎండనబడి ఎవడో ఒకడి జండా భుజానవేసుకుపోకపోతే నాకు డొక్కాడదు. వస్తా అనెళ్ళేడు మా సత్తిబాబు. 


Tuesday 9 April 2024

ఉగాది శుభకామనలు

 క్రోధి నామ సంవత్సర ఉగాది శుభకామనలు

చిగురేసె మొగ్గేసే సొగసంతా పూతపూసె ఇవ్వాలని లేదా ఏమి ఓ సిరిపాపా ఎన్నాళ్ళు దాస్తావేమి అన్నాడట సినీకవి . ఈ సంవత్సరం పూతలేదు కాపు లేదు,చిగురొచ్చేసింది చెట్టునిండా, 
 కాపు మళ్ళీ సంవత్సరానికి వాయిదా వేస్తూ!!!


ఇంత చిగురులోనూ రెండు కాయలు కనపడ్డాయి,చిత్రమే బహుచిత్రమే అంటూ!!!


చైత్ర వైశాఖమాసమౌలు-వసంత ఋతువు-- చెట్లు చిగిర్చి పూలు పూయును,కాయలు కాయును.


జ్యేష్ట ఆషాఢ మాసములు- గ్రీష్మ ఋతువు--ఎండలు మెండుగా కాయును.


శ్రావణ భాద్రపద మాసములు- వర్ష ఋతువు-వానలు ఎక్కువగా కురియును,నదులు పొంగును.


ఆశ్వయుజ కార్తీక మాసములు- శరదృతువు-- వెన్నెల బాగుగా కాయును.


మార్గశిర పుష్య మాసములు-- హిమవంత ఋతువు-- మంచుకురియును. చలి ఎక్కువగా ఉండును.


మాఘ ఫాల్గుణ మాసములు శిశిర ఋతువు-- చెట్లు ఆకు రాల్చును.


ఇవన్నీ పాతకాలం మాటలు. అంతా మార్పే! ఇప్పుడు వసంత ఋతువు రాకుండానే  గ్రీష్మ ఋతువు కనపడుతోంది, అందునా రోహిణీ కార్తె ఎండలు కాస్తున్నాయి. వేడి శివరాత్రికే 34 నుంచి రేసు గుఱ్ఱంలా ఈ రోజుకు, నలభై ఐదు రోజుల్లో 43  కి చేరిపోయింది, వేడి. 

ఇక ముందెలా ఉంటుందో చెప్పలేం. ఉన్నవి మూడు ఋతువుల్లాగా ఉంది.వసంత ఋతువు గ్రీష్మ ఋతువుతో కలిసిపోయి గ్రీష్మ ఋతువే కనపడుతోంది. అలాగే శిశిరం హేమంతంలో కలిసిపోయింది. 


 కారణాలు మీరంటే మీరంటున్నారు. అభివృద్ధి చెందిన దేశాలు అభివృద్ది చెందుతున్న దేశాలని తప్పుపడుతున్నాయి. మొన్ననో సారి గుయానా అద్యక్షునితో బి.బి.సి విలేకరి ఇలా తప్పుపట్టినట్టు మాటాడితే నోరెత్తనివ్వకుండా జవాబిచ్చారు. అలా జవాబిచ్చినపుడే ఆ దేశాలకి తెలుస్తుంది, తమ తప్పేంటో! 


Thursday 4 April 2024

రుద్ర పంచముఖధ్యానం-ఊర్ధ్వముఖం

 రుద్ర పంచముఖధ్యానం-ఊర్ధ్వముఖం


ఓం యం!! ఈశానసర్వవిద్యానా మీశ్వరస్సర్వ భూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిబ్రహ్మా శివోమే అస్తు సదా శివోమ్.


వ్యక్తావ్యక్త గుణేతరం పరతరం షట్త్రింశతత్త్వాత్మకం

తస్మాదుత్తమ తత్త్వమక్షరమిదం ధ్యేయం సదాయోగిభిః

ఓం కారాది సమస్త మన్త్రజనకం సూక్ష్మాతిసూక్షం పరం

శాంతం పంచమ మీశ్వరస్యవదనం ఖంవ్యాపి తేజోమయమ్.


ఓం నమోభగవతే రుద్రాయ. యం ఓం ఊర్ధ్వముఖాయనమః

-------------------------------------------------------

తాత్పర్యము: వ్యక్తము, అవ్యక్తము (స్పష్ట రూపము కలది, స్పష్ట రూపము లేనిది) అను రెండు రెండు లక్షణముల కంటెను ఇతరమగు లక్షణము కలదియు, ముప్ఫై ఆరు తత్వముల రూపమున పరిణమించు నదియు,  సకల తత్వముల కంటెను ఉన్నతమైనదియు అగు అనుత్తరము అను అక్షర (అకార) తత్వమును ఎల్లప్పుడును యోగులచే ధ్యానించబడ దగినదియు,  తమో గుణ రహితంను, మూడు కన్నులు కలదియు, సూక్ష్మాతిసూక్ష్మమగు దాని కంటే గోప్పదియు,  శాంతమునును, ఆకాశము నందంటను వ్యాపించు తేజమే తన రూపముగా కలదియు అగు ఈశ్వరుని ముఖమును నమస్కరింతును (గుణాతీత బ్రహ్మ తత్వమును ఇక్కడ స్తుతించబడినది)

-------------------------------------------------------------------------

పూర్వే పశుపతిఃపాతు దక్షిణేపాతు శంకరః

పశ్చిమేపాతు విశ్వేశో నీలంకంఠస్తదోత్తరే.


ఐశాన్యం పాతుమేశర్వో హాగ్నేయాం పార్వతీ పతిః

నైరృత్యాం పాతుమే రుద్రో వాయువ్యాం నీలలోహితః


ఊర్ధ్వే త్రిలోచనః పాతు అధరాయాం మహేశ్వరః

ఏతాభ్యో దశదిగ్భ్యస్తు సర్వతః పాతుశంకరః

---------------------------------------------------------------------

ఊర్ధ్వముఖ దర్శనం ముక్తిదాయకం.

Wednesday 3 April 2024

రుద్ర పంచముఖధ్యానం-ఉత్తర ముఖం

 రుద్ర పంచముఖధ్యానం-ఉత్తర ముఖం 


ఓం వాం!!  వామదేవాయ నమో జ్యేష్ఠాయనమశ్రేష్ఠాయ నమోరుద్రాయ నమః   కాలాయనమః   కలవికరణాయనమో బలవికరణాయనమో బలాయనమో బలప్రమథనాథాయనమ సర్వభూతదమనాయ నమో మనోన్మనాయనమః


గౌరంకుంకుమపంకిలం సుతిలకం వ్యాపాండు గండస్థలం

భ్రూవిక్షేప కటాక్షవీక్షణ లసత్సంక కర్ణోత్పలమ్

స్నిగ్ధబింబఫలాధరం ప్రహసితం నీలాలకాలంకృతం

వందేపూర్ణశశాజ్ఞ్క మణ్డలనిభం వక్త్రంహరస్యోత్తరమ్


ఓ నమో భగవతే రుద్రాయ! వాం ఓం ఉత్తరముఖాయ నమః

-------------------------------------------------------------------------------------------------

తాత్పర్యము:  గౌర (ఎరుపుతో కలిపిన తెలుపు) వర్ణము కలదియు, కుంకుమ పూ పూతతో   నిండినదియు, అందమగు తిలకము కలదియు, విశేషముగా తెల్లదనముకల చెక్కిళ్ళు కలదియు, కనుబొమ్మల కదలికతో ఒప్పుచుండు కడగంటి చూపుతో ప్రకాశించుటతో పాటు, చెవికి అలంకారముగా నున్న తెల్ల కలువ పూవు కలదియు, నున్నని దొండపండు పోలు ఎర్రని క్రింద పెదవి పై పెదవి స్పష్టమగు నవ్వు కలదియు, నల్లని   ముంగురులచే  అలంకరించబడిన, నిండు చంద్రుని మండలమును పోలుచు ప్రకాశించునదియు అగు శివుని ఉత్తరాముఖమును నమస్కరించు చున్నాను. (గుణ త్రయ మిశ్రమమగు ఈశ్వర తత్త్వము ఇక్కడ స్తుతించ బడినది)


------------------------------------------------------------------------------

ఈ ముఖాన్ని వామదేవమని అంటారు, వాసుదేవమనీ పెద్దలమాట. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే!

ఉత్తర ముఖ శివ దర్శనం వలన ఆరోగ్య ఐశ్వర్యాలు సంరక్షింపబడతాయి,సక్రమ వృద్ధి చెందుతాయి,అనుభవింపబడతాయి.

Tuesday 2 April 2024

రుద్ర పంచముఖధ్యానం-పశ్చిమ ముఖం

 రుద్ర పంచముఖధ్యానం-పశ్చిమ ముఖం


ఓం శిం. సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయవై నమో నమః. భవే భవేనాతిభవే భవస్త్వమాం భవోద్భవాయ నమః


ప్రాలేయాచల మిందుకుంద ధవళం గోక్షీర ఫేనప్రభం

భస్మాభ్యక్త మనంగ దేహదహన జాలావళీ లోచనమ్

బ్రహ్మేన్ద్రాది మరుద్గణై స్స్తుతి పదైరభ్యర్చితం యోగిభిః

వందేహం సకలం కళంక రహితం స్థాణోర్ముఖం పశ్చిమమ్.


ఓం నమో భగవతే రుద్రాయ. శిం ఓం పశ్చిమ ముఖాయ నమః

--------------------------------


హిమవత్పర్వతం,చంద్రుడు,మొల్లపువ్వు వీటివలె తెల్లనిది పాలనురుగువలె తెల్లని కాంతికలది విభూతిపూయబడినదీ,మన్మధుని శరీరాన్ని దహించు జ్వాలలపంక్తితో నిండిన కన్ను కలది స్తోత్రము చేయుచున్న బ్రాహ్మ,ఇంద్రాది దేవతలు,మరుత్తులచేత ,యోగులచేత స్తుతింపబడుచున్నదైన,నిర్మలమైన నిండువదనముతో నున్నదైన శివుని పశ్చిమ ముఖమునకు నమస్కరించు చున్నాను. 

--------------------------------------------

పశ్చిమంగా ముఖమున్న శివుని సద్యోజాతాయ నమః అని నమస్కరించాలి. సద్యొజాత శివుడు కోరికల్ని సత్వరం నెరవేరుస్తూ ఉంటాడు. ఇది అనుభవం కూడా! ఇటువంటి శివాలయం దొరకడం అదృష్టమే! ఈ పంచముఖ శ్లోకాలు చదవడమే కష్టంగా ఉంది పలకడం మరెంత కష్టం అనిపిస్తుంది. కాని చాలా తేలిక. వర్ణక్రమం తెలిసుండాలి. వర్ణక్రమమేమని అడ్గద్దు, దాన్నే ఇంగ్లీషులో స్పెల్లింగ్ అంటారు. ఒక్క సారి విని స్పెల్లింగ్ చదవగలిగితే! ఆనందమే,ఆనందం!! అర్ధంకూడా బాగా తెలుస్తుంది.

Monday 1 April 2024

రుద్ర పంచముఖధ్యానం- దక్షిణముఖం

 రుద్ర పంచముఖధ్యానం- దక్షిణముఖం


ఓం మం. అఘోరేభ్యోఽథఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః. సర్వేభ్యస్సర్వ శర్వేభ్యో నమస్తే అస్తు రుద్ర రూపేభ్యః.


కాలాభ్రభ్ర మరాంజన ద్యుతినిభం వ్యావృత్త పింగేక్షణం

కర్ణోద్భాసిత భోగిమస్తక మణిప్రోద్గీర్ణ  దంష్ట్రాంకురమ్  

సర్పప్రోతకపాలశుక్తిశకల వ్యాకీర్ణసచ్చేఖరం

వందే దక్షణమీశ్వరస్య కుటిల భ్రూభంగ రౌద్రం ముఖమ్


ఓం నమో భగవతే రుద్రాయ. మం ఓం. దక్షిణ ముఖాయనమః

(శ్రీ మార్తి వేంకట్రామ శర్మ గారి యాజుషస్మార్తగ్రన్థః నుండి)

---------------------------------------------------------

తాత్పర్యము: నల్లని మేఘములు, తుమ్మెదల కాటుక - వీటి కాంతిని పోలిన కాంతితో ప్రకాశించునదియు, మిక్కిలి మిట్టగా తిరుగుచుండు పింగా వర్ణపు కన్నులు కలదియు, చెవుల యందు మిక్కిలి ప్రకాశించుచుండు సర్ప శిరోరత్నములతో బాగా కలిసిపోవుచున్న కోరల మొలకలు కలదియు, సర్పములతో పాటు (హారముగా) కూర్చబడిన కపాలములతో, ముత్యపు చిప్పల ముక్కలతోను, ఎగుడు దిగుదగుచున్న నడకను పొందినదియు, వంకరలుగా నున్న కను బొమ్మల ముడులతో భయంకరముగా నున్న ఈశ్వరుని దక్షిణ ముఖమును నమస్కరించు చున్నాను. (తమో గుణ ప్రధాన లయ కర్త తత్వము ఇక్కడ స్తుతి చేయబడింది)

Courtesy:telugu one.com

------------------------------------------------------

దక్షిణముఖ ఈశ్వరుణ్ణి దక్షిణమూర్తి అని కూడా పిలుస్తారు. ఈ ముఖ ఈశ్వరుడు దర్శనం, ఆరోగ్యాన్ని,విద్యను ప్రసాదిస్తుందని పెద్దలు చెబుతారు

Sunday 31 March 2024

రుద్ర పంచముఖధ్యానం- పూర్వ ముఖం.


రుద్ర పంచముఖధ్యానం- పూర్వ ముఖం.


ఓం నం. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి, తన్నోరుద్ర ప్రచోదయాత్.


సంవర్తాగ్నితటిత్ప్రదీప్తకనకప్రస్పర్ధి తేజోమయం

గమ్భీరధ్వని సామవేదజనకం తామ్రాధరం సుందరం.


అర్ధేన్దుద్యుతిలోలపిజ్ఞ్గళ జటాధర ప్రబద్ధోరగం

వన్దే సిద్ధసురాసురేన్ద్రనమితం పూర్వం ముఖం శూలినః


ఓం నమో భగవతే రుద్రాయ,

 నం ఓం పూర్వముఖాయ నమః


(శ్రీ మార్తి వేంకట్రామ శర్మ గారి యాజుషస్మార్తగ్రన్థః నుండి)

-----------------------------------------------------

తాత్పర్యము: ప్రళయ కాలము నందలి అగ్ని తేజము తోనూ, మెరపుల తేజముతోను, బాగా కరిగిన బంగారు కాంతితోను పోటీ పడే తేజములే తన రూపముగా కలది, గంభీరధ్వనితో మిశ్రితమగుతో పాటు భయంకరమైన అగ్ని వలె ప్రకాశించు ఎర్రని పెదవి కలదియు, చంద్ర ఖండ కాంతితో చక చక మెరయు పింగళ వర్ణపు జడల గుంపును, దాని చుట్టూ గట్టిగా చుట్టిన సర్పములు కలదియు, సిద్ధులు, సురాసురుల చేత నమస్కరించబడుతున్న, శూలికి  తూర్పున ఉన్న ముఖమున 

కు నమస్కరించుచున్నాను. (రజో గుణ ప్రధానమైన సృష్టి తత్వమును ఈ శ్లోకములో స్తుతి చేయబడినది)

Courtesy:https://www.teluguone.com/devotional/amp/content/dhyana-slokas-943-24685.html

-----------------------------------------------------------

నామాట: తూర్పు ముఖ శూలికి రజోగుణప్రధానంగా చెబుతారు, అంతేకాదు, ఈ ముఖంశివుని దర్శిస్తే, పదే,పదే మాయలో పడేస్తూ ఉంటడంటారు. మనకి తూర్పు ముఖంగా ఉన్న శివాలయాలే హెచ్చు.

-----------------------------


నాసొద: నందుగారి ద్వారా ఇది శివాజ్ఞగా భావించడం జరిగింది. తప్పులు లేకుండా టైప్ చేయాలని కోరిక. అందుకు కొంచం సమయం తీసుకుంటుంది. ఎక్కువసేపు కూచోలేని ఇబ్బంది, అందుకుగాను ఒక్కో ముఖాని గురించి ఒకసారే చెబుతున్నాను, అసౌకర్యానికి మన్నించాలి.

Friday 29 March 2024

నే నమ్మను.

నే నమ్మను. 






నే నమ్మను.

అవే అక్షరాలు! ఎన్ని అర్ధాలు?

Wednesday 20 March 2024

అప్ప ఆర్భాటమేగాని.....

 అప్ప ఆర్భాటమేగాని బావ బతికేదిలేదు.


నన్ను ఒక వాట్సాప్ గ్రూప్లో చేర్చుకున్నామని చెప్పేడు మా సుబ్బరాజు.

 నేనెందుకయ్యా? అంటే 

మీరు నాన్ స్ట్రైకింగ్ ప్లేయర్ లెండి అనేసేడు. 

ఎలా వున్నారు అడిగేరు, మా సత్తిబాబు, సుబ్బరాజు జమిలిగా! 

బండి కుంటుతో నడుస్తోందంటే, ఆగేదాకా నడిపించాలి,అదేగదా మనం చెయ్యగలదనేసేడు సత్తిబాబు.

ఎప్పుడు ఓపెన్ చేసేరంటే నిన్న దశమి మంగళవారం మంచిదని అన్నాడు, సుబ్బరాజు.

దశమి మంగళవారం దగ్ధయోగమయ్యా! అంటే

 మనకి దగ్ధయోగమేంటి లెద్దురూ, అన్నాడు సత్తిబాబు.


అది సరేగాని తెనుగు రాజకీయాలగురించి చెప్పూ అడిగాడు సుబ్బరాజు.

అప్ప ఆర్భాటమేగాని బావ బతికేది లేదన్న నానుడిగా ఉంది తెనుగు రాజకీయం అన్నాడు సత్తిబాబు.

అదేంటో వివరంగా చెప్పరాదా అడిగాడు సుబ్బరాజు.

అర్ధం చేసుకోరూ! అంటూ వెళ్ళేడు సత్తిబాబు.

మీకేమైనా అర్ధమయిందా?

Friday 8 March 2024

ఉత్తర ముఖంగా ఉన్న శివాలయంలో ప్రదక్షిణం ఎలా చేయాలి?

 ఉత్తర ముఖంగా ఉన్న శివాలయంలో ప్రదక్షిణం ఎలా చేయాలి?


సాధారణంగా ఆలయాలన్నీ తూర్పువైపు ముఖంగా ఉంటాయి.మరే వైపు ముఖంగా ఉన్నా ఇబ్బందులూ లేవనుకుంటాను. కాని శివాలయానికో చిన్న చిక్కుంది. శివునికి రూపులేదు లింగాకారుడు. కాని ఈ లింగం పానవట్టం మీద ఉంటుంది. సోమ సూత్రం ఎప్పుడూ ఉత్తరం వైపే ఉంటుంది. తూర్పు,దక్షిణ,పశ్చిమ ముఖ ఆలాయాలకు సోమసూత్రం ఉత్తరంగానే ఉంటుంది, మరి ఉత్తర ముఖంగా ఉన్న శివాలయానికి సోమసూత్రం ఎటు ఉంటుంది? 


శివాలయ ప్రదక్షిణ చేయాలంటే సోమసూత్రం దాటకుండా చేయాలి, అక్కడుండే చండీశ్వరుని దర్శనం ముందు చేసుకుని వెనక్కొచ్చి,  ఇలా ప్రదక్షణo చేయాలి. ఇది ఏ దిక్కుకి ముఖం ఉన్నదానిని బట్టి ప్రదక్షిణం తీరు ఆధారపడిఉంటుందికదా!   ఎటైనా చండీశ్వరుణ్ణి దాటకుండా ప్రదక్షిణం చేయ్యాలి.


సాధారణంగా మనతెనుగునాట చండీశ్వరుడే కనపడటం లేదు. 

కార్తీక మాసంలో మాకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళేను, పుట్టినరోజు.   ఆలయం చాలాచిన్నది కాని, గొప్పదని తెలుసుకోడమే ఆలస్యమయింది. సాధారణంగా ఆలయాలన్నీ తూర్పు ముఖంగా ఉంటాయి, ఈ ఆలయం పశ్చిమ ముఖంగా ఉంది. విశేషం పరిశీలిస్తే పశ్చిమ ముఖంగా ఉన్న ఈశ్వరుని సద్యోజాత ముఖాయైనమః అని నమస్కరించాలి, ఈముఖంగా ఉన్న ఈశ్వరుడు కోరికలను శీఘ్రంగా అనుగ్రహిస్తాడని అనూచానంగా చెప్పుకునేమాట. ఈశ్వరునికి ఐదు ముఖాలు ఐదు ముఖాలకీ పేర్లున్నాయి.

 ఓం సద్యోజాతా నమః

ప్రాలేయాచల చంద్రకుంద ధవళం గోక్షీరఫేన ప్రభం

భస్మాభ్యక్తమనంగదేహ దహన జ్వాలావళీ లోచనం

బ్రహ్మేంద్రాది మరుద్గుణై స్తుతిపరై రభ్యర్చితమ్ యోగిభి

వందేహం సకలం కళంకరహితమ్ స్థాణోర్ముఖం పశ్చిమం


హిమవత్పర్వతం,చంద్రుడు,మొల్లపువ్వు వీటివలె తెల్లనిది పాలనురుగువలె తెల్లని కాంతికలది విభూతిపూయబడినదీ,మన్మధుని శరీరాన్ని దహించు జ్వాలలపంక్తితో నిండిన కన్ను కలది స్తోత్రము చేయుచున్న బ్రాహ్మ,ఇంద్రాది దేవతలు,మరుత్తులచేత ,యోగులచేత స్తుతింపబడుచున్నదైన,నిర్మలమైన నిండువదనముతో నున్నదైన శివుని పశ్చిమ ముఖమునకు నమస్కరించు చున్నాను. 


ఇంకేమి? ఈ ఆలయం పొందికగా ఉంది, గణపతి,సుబ్రహ్మణ్యుడు,  అమ్మవారు,  అంతేకాదు సోమసూత్రం దగ్గర చండుడు, అంతా లెక్కప్రకారంగా ఉండటంతో బాగా నచ్చేసింది. దానికితోడు ఆలయం నడక ట్రేక్ ఎంత దూరమో, అంత దూరంలోనే ఉంది. దీనితో పుణ్యం పురుషార్ధం అన్నారుకదా! ట్రేక్, చుట్టూ  అప్రదక్షణాలకంటే  గుడి దగ్గర మేలుకదా అని గుడికే రాకపోకలు సాగిస్తున్నా, ఉదయమే!  ప్రదక్షిణాలు శివాలయం లో చేయవలసినట్టు చేస్తున్నా! ఇదొక అదనపు మాట. దీంతో భక్తి పెరిగింది మరి చాదస్తమూ పెరిగింది,చెప్పిందే మళ్ళీమళ్ళీ చెబుతున్నా!  


'దరిద్రుడు తలగడిగితే వడగళ్ళవాన ఎదురైనట్టు', అన్న సామెతగా, పెద్దపండగ దాటేకా ఇదీ చెట్టెక్కేసింది, కారణాలనేకం. ఈ అనుమానం మాత్రం ఉండిపోయింది.  ఈ రోజు దర్శనానికి వెళ్ళాలి,స్వామి దయతో!

Tuesday 5 March 2024

తనకి లేదని ఏడిస్తే

తనకి లేదనిఏడిస్తే


తనకి లేదనిఏడిస్తే ఒక కన్ను ఎదుటివాడికి ఉందనిఏడిస్తే రెండో కన్ను పోయాయి.   ఇదొక నానుడి.


ఎలక్టరల్ బాండ్లు లో సొమ్ములిచ్చేవారెవరో తెలియాలి,తెలియకపోవడం సరికాదు అని సుప్రీం కోర్టుకుపోయారు, కొందరు. కోర్టు విచారించి,బాండ్లు చెల్లవు,సొమ్ములు వెనక్కిచ్చేయాలని తీర్పిచ్చింది. అంతా సంతోషం వెలిబుచ్చారు.


రాహుల్ జీ మాటాడుతూ క్రవుడ్ ఫండింగ్ చేస్తామన్నారు, మంచిమాటే! ఏమయిందో తెలీదు,దాని ఊసేలేదు మళ్ళీ. ఎన్నికలు తరుముకొస్తున్నాయి. నిన్న మోడీజీ భాజపా కి పార్టీ ఫండ్ గా రెండు వేలిస్తూ నిధికోసం పిలుపిచ్చారు. ఇచ్చే సొమ్ము నమో ఆప్ ద్వారా ఇవ్వచ్చనీ చెప్పేరు. పార్టీ వివరాలిస్తూ ఐదు రూపాయలనుంచి సొమ్మివ్వచ్చుననీ బహుమతులూ ప్రకటించింది. సామాన్యుడు కూడా ఇప్పుడు నిధికి సొమ్మిచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రతి పక్షాలకి, ఇది ముల్లుతీసి కొఱ్ఱు కొట్టుకున్న చందమయిందా? ఏమో కాలమే చెప్పాలి.


అన్ని పార్టీలకి చేతిదాకా వచ్చిన సొమ్ములు వెనక్కిపోయాయి. ఇప్పుడన్నీ ఏం చేయాలో దిక్కుతోచకున్నట్టే ఉంది. 


దీనిపైన కూడా కోర్టుకుపోతారేమో! చూడాల్సిందే!!!


తనకు లేదని ఏడిస్తే ఒకకన్ను ఎదుటివాడికి ఉందని ఏడిస్తే మరో కన్నుపోయినచందమైపోయిందా? అనుకుంటున్నారు ప్రజలు.

https://www.hindustantimes.com/india-news/pm-modi-contributes-rs-2-000-to-bjp-urges-donations-for-nationbuilding-101709458181903.html


Sunday 3 March 2024

కమ్మటి రోగాలు తీయటి మందులు ఉండవు.

 కమ్మటి రోగాలు తీయటి మందులు ఉండవు.


ఇదొక నానుడి. రోగం చమ్మగా,కమ్మగా సుఖాన్నివ్వదని, వచ్చే రోగాలకి వేసుకునే మందులు తియ్యగా ఉండవు,చేదుగానే ఉంటాయి, కష్టాలే పడాలని సూచన!!!!



ఈ నానుడి అర్ధం కాలేదు చాలాకాలంగా, ఒక అనుభవంతో అర్ధమయిందా? ఏమో!

   

    పదిహేను రోజులకితం డాక్టర్ గారి దగ్గరికిపోయా. డాక్టర్ గారు బి.పి చూసి ''డబల్ సెంచరీ తగ్గనంటోందే, కిందది సెంచరీ తగ్గనంటోంది ఉప్పు తింటున్నారా''? అడిగారు. ''మీ పేస్టులో ఉప్పుందా? ప్రకటన గుర్తొచ్చి, దానిపై డాక్టర్ల జోక్ గుర్తొచ్చి నవ్వుకున్నా''!  ''అయ్యో! ఉప్పు,తీపి మరిచిపోయి ఏళ్ళయిందండీ అన్నా''! ''తగ్గిస్తాగా!! అని మందులు మార్చారు, వేసుకుంటున్నా, పదిరోజులుగా.      నిన్న డాక్టర్ గారి దగ్గరకెళ్ళా! మళ్ళీ!! "నెలకాకుండానే వచ్చారేం మళ్ళీ?'' అన్నట్టు చూసి, బి.పి  చూస్తే, అది కాస్త తగ్గి మూడర్ధ సెంచరీల దగ్గరాగింది, కిందదో పది తగ్గింది.  చూసి డాక్టర్ గారు నవ్వుకుని "ఏమిటి సమస్య?" అన్నట్టు చూసారు. ''అదివరకు మరో తెగులుకు రాత్రి వేసుకుంటున్నమందు, మధ్యాహ్నం దాకా మత్తు వదలటం లేదు. ఇప్పుడు ఉదయం వేసుకుంటున్న బి.పి మందుతో, ఆ కొద్ది సేపుకూడా కిక్  లేకపోవడం లేదు, ఇప్పుడు ఇరవైనాలగు గంటలూ మత్తే'' అని వాపోయా!  ''ఎప్పుడూ మత్తుగానే ఉంటోందండీ,బద్ధకం,నిద్ర,'' అని డాక్టర్ గారికి చెప్పుకున్నా! ఆయన నవ్వి, ''అంతా కిక్ కావాలి,కిక్ కావాలంటుంటే మీరేంటీ? రోజంత కిక్ ఉంటే''? అని, ''మీరు వేసుకునేమందులన్నీ సాధారణంగా, నెల,రెండు నెలలకి అలవాటై మత్తు కనపడదు, అందరికీ  . మీరు స్పెషల్ కదా! అందుకు ఇలా వుంటోంది. మీరు హైపర్ సెన్సిటివ్, అలవాటు పడండి,  ఈ మందులు తప్పవు, మరో కంపెనీది మార్చినా అదీ అంతే'', అని చెప్పి పంపేరు.  

మొన్న రథసప్తమి నాడే చురుక్కుమన్నాడు, భాస్కరుడు. ఆవేళ మొదలు కదా వెచ్చగా ఉన్నాడని సంబరపడ్డా. నిన్న బయటికే రాలేకపోయాను. ఏంటబ్బా! అని చూస్తే వేడి 39 కి చేరిపోయిందిట, నాలుగు రోజుల్లో వేడి 40 కి చేరబోతోందని, సూచనలందుతున్నాయి. పదిహేనురోజులకే ఇంత మార్పా అనుకున్నా! నేను నడవటం లేదని ఆయన నడవటం మానెయ్యలేదుగా, నడుస్తూనే ఉన్నాడు అనంతకాలంలో, నా లాటి భాస్కరులనెంతమందిని చూసుంటాడు, నేనాయనఒక్కణ్ణే చూసాను తప్పించి. :) అలవాటు పడాలయ్యా! అలవాటు పడాలని చెప్పుకున్నా!! నవ్వుకుంటూ. 

  కమ్మటి రోగాలు తీయటి మందులు ఉండవు, 

అంటే అర్ధమయినట్టుందా?

Thursday 29 February 2024

ఫిబ్రవరి ౩౦.

  ఫిబ్రవరి ౩౦


ఒకప్పుడొక ఉద్యోగికి స్పెషల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ రాయాలిసొచ్చింది. నేను స్పెషల్ సి.ఆర్ రాస్తే ప్రమోషన్ తప్పదని అనుకునేవారంతా! అదో చిత్రం :)

ఆ ఉద్యోగికి, నా పై ఆధికారి ఇచ్చిన రిపోర్ట్ ప్రోఫార్మా పుచ్చుకుని  రాయడానికి   మొదలెట్టి చూస్తునుగదా! అతని పుట్టిన తారీకు ఫిబ్రవరి ౩౦గా కనపడింది,దానిమీద. అతన్ని అడిగా ఇదేమని. అతను చెప్పుకొచ్చేడిలా! 


''నేను ఇంటిదగ్గర అల్లరి చేస్తున్నానని మా  నాన్న  నన్నుబళ్ళో వేసేడు.బళ్ళో వేసినపుడు మాస్టారు వీడి పుట్టినరోజేంటి? అని మా నాన్ననడిగితే, శివరాత్రి పదిరోజులుందనగా పుట్టేడని చెప్పేడుట. దానిమీద మాస్టారో తారీకు నిర్ణయించి వేసేరు,అదే ఇదిట. మా   నాన్న చదువుకోలేదు,వ్యవసాయదారుడు,పల్లెటూరివాడు. నా చదువుకి ఎప్పుడూ ఎక్కడా భంగం రాలేదు. హైస్కూల్లో,కాలేజిలో. ఎవరూ నన్ను పుట్టినరోజెంత అని అడగలేదు. కాలేజిలో ఉండగా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసాను. అప్పుడూ నన్నెవరూ అడగలేదు. నన్ను పెరమనెంటు చేసేముందు, ఓరోజు ఓ కాయితమిచ్చింది డిపార్టుమెంటు. అందులో నీ పుట్టినరోజు ఫిబ్రవరి ౩౦గా నమోదయి ఉంది, నీ అసలు పుట్టినరోజు ఆధారాలతో సమర్పించవలసినదని. దానికి నేను ఇదివరలో ఇచ్చినకాగితాలలో పుట్టినరోజు   ఫిబ్రవరి ౩౦గా ఉన్నది. అదే నా పుట్టినరోజుగా భావించాను, మరి వేరుకాగితాలు లేవని చెప్పుకున్నా! అప్పుడు, ఫిబ్రవరికి 29 రోజులుండచ్చేమోగాని ౩౦ఉండవు. నీ పుట్టినరోజు మార్పు చేసుకుని, మార్పు ఆధారాలతో సమర్పించూ! అని. శలవు పెట్టేను. చిన్నప్పుడు చదువుకున్న బడికెళితే అక్కడ  ఫిబ్రవరి౩౦గానే ఉన్నది. ఇప్పుడు దాన్ని మార్చలేమన్నారు,అక్కడివారు. అదే సమాధానం,హైస్కూలు,కాలేజిల్లో కూడా ఎదురయింది.    కరణం,మునసబ్లు,తాసీల్దారు ని అడిగా అక్కడా పని కాలేదు. ఎమ్.ఎల్.ఎ దగ్గరకెళ్ళా,ఎం.పి దగ్గరకెళ్ళా. ఎక్కడకెళ్ళినా పనికాలేదు. చాలాప్రయత్నాలు చాలా రకాలుగా చేసేను. అబ్బే ఎవరూ పుట్టినరోజు మార్పు చెయ్యలేదు, సరిగదా, మార్పు చెయ్యలేమని చెప్పెసేరు. ఇది చెప్పినంత సులువుగా జరగలేదు. కొంతసొమ్ము ఖర్చయింది, ఒక సంవత్సరం పట్టింది.    ఎప్పటికప్పుడు జరుగుతున్నది డిపార్టుమెంటుకు చెప్పుకుంటూ వచ్చా!  నా పుట్టినరోజును మీరెలా నిర్ణయిస్తే అదే నాకు ఆమోదమని కూడా తెలిపాను.   ఉద్యోగం చేసుకుంటున్నా! తంటసం మాత్రం ఉండిపోయింది. ఒకపెద్దాయన తో ఇదంతా చెప్పుకుంటే ,''కోర్టుకిపో'' అన్నారు. కోర్టుకి వెళ్ళేను ఒక లాయర్ని పట్టుకుని, అక్కడ కేస్ నడుస్తుండగా  ఇక్కడ డిపార్ట్మెంటు నాకో ఛార్జిషీట్ ఇచ్చింది. దాని పర్యవసానంగా ఉద్యోగం నుంచికూడా పంపేయచ్చు. 


 మళ్ళీ పాతపాటే పాడేను,  సమాధానంగా. మళ్ళీ పాతపాటపాడుతున్నా వంటే అయ్యా! నాదగ్గర కొత్తగా చెప్పడానికేం లేదు,కనక పాతమాటే చెబుతున్నా, అని చెప్పేను. ఇది పనిగాదని మీలాటాయన దగ్గరకిపోయాను. విషయం చెప్పుకున్నా! కాయితాలన్నీ చూసి, రాసి ఉంచుతా తరవాత రా, అని చెప్పిపంపేరు. కొన్నిరోజుల తరవాత వెళితే ఆయనో డ్రాఫ్ట్ రాసారు. అది సమర్పించా డిపార్టుమెంటుకి. అందులో ఆయన, నా పుట్టిన రోజు ఫిబ్రవరి ౩౦గా నమోదయింది, బడిలో. అప్పటికి నేను చాలా చిన్నవాడిని, నాపుట్టినరోజేదో నాకే తెలియని వయసు,మేజర్ని కాను. నా తండ్రి చదువుకోనివాడు, ప్రస్తుతం ఆయన లేడు,చనిపోయాడు, తల్లీ లేదు,చనిపోయింది. నన్ను స్కూల్ లో జాయిన్ చేసుకున్న మాస్టారు చనిపోయారు. మాస్టారు చదువుకున్నవారే కదా! నా పుట్టినరోజు ఫిబ్రవరి ౩౦గా ఎలా వేసేరో ఎలా చెప్పగలను?. ఆ తరవాత చాలామంది నా పుట్టినరోజు చూసి ఉంటారు,చాలా సమయాల్లో,వారెవ్వరూ మార్చలేదు, ఇదేమని  అడగ లేదు.   అంతెందుకు నన్ను డిపార్టుమెంటులోకి తీసుకున్నప్పుడు నా పుట్టినరోజు తారీకు సమర్పించాను,అప్పుడూ ఎవరూ నన్ను ప్రశ్నించలేదు. నేను చేయని ప్రయత్నం లేదు,ఎవరూ నా పుట్టినరోజు తారీకు మార్చలేదు. కడకు కోర్టుకుపోయాను. కోర్టు ఏమీ తేల్చలేదు. కోర్టు తేల్చిన తరవాత మీకు ఫలితం సమర్పిస్తానని. దానిమీద డిపార్టుమెంటు జోరు తగ్గింది. కేస్ తేలలేదు. చివరికి కోర్టు నా పుట్టినరోజు ఫిబ్రవరి ౩౦గానే ఉంచుతూ, అన్ని ఇతరవిషయాలకి దానిని ఫిబ్రవరి 28గా పరిగణించాలనీ, ఈ కోర్టు ఆర్డర్ కాపీ కావలసిన ప్రతిచోటా ఉంచాలనీ, తీర్పిచ్చింది. అదే   department కూ సమర్పించా! కాని ఎవరూ కేస్ తేల్చలేదు. ఆఫీసర్లు వస్తున్నారు,మారుతున్నారు, ఈ కేస్ అలాగే ఉండిపోయింది. ఒకాఫీసరు, మీలాటాయన, ఇందులో ఉద్యోగి తప్పేమీ లేదు, ఎవరో చేసిన తప్పుకు ఉద్యోగిని శిక్షించడం తగదు, కనుక కోర్టు ఉత్తరువును ధృవపరుస్తూ ఇతని పుట్టినరోజు ఫిబ్రవరి 28గా నిర్ణయిస్తున్నా అని తీర్పిచ్చి కేసు మూసేసేరు.    అదీ  నా  ఫిబ్రవరి ౩౦ పుట్టినతారీకు చరిత్ర అని ముగించాడు.


అప్పుడు నాకు నవ్వొచ్చింది,నా పేరు, దత్తత ప్రకారంగా వేంకట దీక్షితులు గా మార్చుకోడానికి చేసిన ప్రయత్నాలూ     నేను పడ్డతిప్పలూ, ఆ రోజుల్లో పేరు  మార్చడం కుదరదని, ఇలాగా చాలా తిప్పలుపడ్డాకా చెప్పిన సంగతీ గుర్తొచ్చాయి.స్పెషల్ రిపోర్టు రాసాను,అతనికి ప్రమోషనూ   వచ్చింది.      


ఆ తరవాత కొంతకాలానికి ఒక పైఅధికారితో రెస్ట్ హవుస్ లోపిచ్చాపాటి మాటాడుతూ ఉండగా, కాలక్షేపానికి ఈ కేస్ చెప్పి ఎందుకిలా జరుగుతుందంటే, డ్యూ ప్రాసెస్ జరగాలయ్యా! అనేసారు, అదీ ప్రభుత్వమంటే  


Tuesday 27 February 2024

లెక్కల మాస్టారికో చిక్కుప్రశ్న.

లెక్కల మాస్టారికో చిక్కుప్రశ్న.


 ఇంతకీ ఫోన్ నెంబరెంతబ్బా!

Sunday 25 February 2024

లింకులు

 Length Measurement       

12 inches= 1 Foot

3 Feet= 1 Yard

22 yards= 1 Chain

220 Yards or 10 chains = 1 Furlong.

8 Furlongs= 1 Mile.

Length Measurement in Links.

7.92 inches= 1 Link

100 Links= 1 Chain=100 X 7.92 inches=792 inches=66 Feet=22 Yards.

Area Measurement in Sq.Links and Acres.

1,000 Sq. links= 1 Cent

10,000 Sq. links = 10 Cents

1,00,000 Sq. links = one Acre.

10 Cents= ఒక కుంచం.

10 కుంచాలు= one acre.
100 Cents= 1 Acre.=4840 Square Yards.

1 Sq. chain= 484 Sq. Yards.=10 Cents.

10 Sq. chains= 4840 Sq. yards= 1 Acre.

100 Sq. Chains=  10 Acres.

 80 X 80 Chains =6400 Sq. Chains = 640 Acres=one square mile.


 ********


ఇప్పుడెందుకివన్నీ? కొచ్చను. సంవత్సరం కితం పంచాయతీవారు ఇళ్ళకొలతలేసుకెళ్ళేరు, భవనం ధర మదింపు, పన్ను విధింపు కోసం. ''వారం కితం మీ భవనం మరియు అది ఉన్న స్థలం కొలతలు కింద ఇస్తున్నాం, మా సర్వేయర్ సమర్పించిన కొలతల ప్రకారం. వీటిలో తేడాపాడాలుంటే రికార్డుతో వచ్చి కలవండి'' అని  ఇచ్చారో నోటీసు. ఇంటికొలతలు మీటర్లలో తీసుకున్నారు, సరిగానే ఉన్నాయికాని. స్థలం మాత్రం ఉన్నదానికంటే మూడు రెట్లు ఎక్కువకనపడింది,  అడుగుల్లో కొలతలు తీసుకుని మీటర్లలో నమోదు చేసుకుని ఉండచ్చనుకున్నా. అలాగా సరిపోలేదు ఏమై ఉండచ్చు,పాలుపోలేదు. . ఆహా! ముఫై ఏళ్ళ పైబడి నేను కొనలేకపోయిన స్థలం పంచాయితీవారు నాపరం చేసినట్టున్నారే అని క్షణం సంతోషించి, వెంటనే ఉలికిపడ్డాను. మూడు రెట్లు స్థలముందని రికార్డయితే నా బతుకు బస్టాండే, ఆ తరవాత, పన్నేసేటప్పుడని భయపడి, కాగితాలు బయటకి తీసి చూస్తే, అందులో కొలతలు లింకుల్లో కనపడ్డాయి.వాటిని చదరపుగజాలు,చదరపు మీటర్లలోకి మార్చడానికి పడ్డ తిప్పలు. చిన్నప్పుడు లెక్కల మాస్టారు మానం రాకపోతే అవమానంరా అనేవారు. అందుకీ మానాలన్నీ ఒక సారి గుర్తుచేసుకుని, లింకుల్ని చదరపు గజాల్లోకి మార్చి,చదరపుమీటర్లుగా మార్చి, ఎక్కడో  అడుగుల్ని చదరపు మీటర్లలోకి మారడం లో పొరపాటు జరిగుంటుందని చెప్పి,ఒప్పించి, లెక్కలేసి చూపి,కాగితాలు చూపి, సరిజేయించుకొచ్చాను. అప్పుడు గుర్తు చేసుకున్న సంబరం.

Friday 23 February 2024

అశుద్ధం మీద రాయేస్తే ......

 అశుద్ధం మీద రాయేస్తే

నోరు మంచిదైతే ఊరు మంచిదే.

అశుద్ధం మీద రాయేస్తే ముఖాన చిందుతుంది.

గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు.

చెబితే తప్పు చెప్పకపోతే ముప్పు.


Wednesday 21 February 2024

అనానిమస్సు

 అనానిమస్సు



అనానిమస్సులు ఒక్క సోషల్ మీడియానే కాదు,రాజకీయరంగాన్ని కూడా పట్టికుదుపుతున్నారు. ఎలక్టరల్ బాండ్లు కొని, అనానిమస్సుగా రాజకీయపక్షాలకి డొనేషన్ ఇవ్వచ్చని, ప్రభుత్వం ఎలక్ట్రల్ బాండ్ల పథకం తెచ్చింది. 2017-22 దాకా మొత్తం పదహారు వేలకోట్లు రూపాయల  

బాండ్లు అమ్మితే అందులో పదివేల కోట్లు బి.జె.పి కి పదహారు వందలకోట్లు కాంగ్రెస్ కి, మిగిలినది మిగిలిన పార్టీలకి చేరిందిట. ఈ బాండ్లు కేష్ చేసుకోలేదు, వాటిని కోర్ట్ ఆపింది.    రాకీయపక్షాలకిచ్చే డొనేషన్లన్నీ ఆనానిమస్సులనుంచే అందుతున్నాయి,ఏ కొద్ది మొత్తమో ఇతరులనుంచొస్తున్నాయేమో! ఈ డొనేషన్లిచ్చేవారెవరో తెలియాల్సిన అవసరముందని ఒక పి.ఐ.ఎల్ వేస్తే, సుప్రీం కోర్టు  అనానిమస్సుల ముసుగు తొలగించి వారెవరో చెప్పాల్సిందే, అని రూలింగ్ ఇచ్చింది, ఎలక్టరల్ బాండ్లు చెల్లవంది. బాండ్ల సొమ్ము కొన్నవారికి తిరిగిచ్చేయాలంది.  ఏది అమలు జరుగుతుందో చూడాలి,  రాజకీయ పక్షాలకి అనానిమస్సుగా సొమ్మిద్దామనుకునేవాడు తన స్వంతపేరున బాండ్లు కొంటాడా? అనుమానమే!  ఎంతమంది అనానిమస్సులు సొమ్ము వెనక్కి తీసుకుంటారో చూడాలి.  

సోషల్ మీడియాలో  అనానిమస్సులు కామెంట్లు వెనక్కి తీసుకోలేనట్టు, వీళ్ళూ సొమ్ము వెనక్కి తీసుకోలేకపోవచ్చు.  

ప్రతిపక్ష రాజకీయులు సుప్రీం కోర్ట్ అలా అన్నతరవాత అవును వారెవరో తెలియాల్సిందే అంటున్నాయి. బి.జె.పి కి సొమ్ము రాకుండా పోయిందని చంకలు గుద్దుకుంటే   ప్రతిపక్ష రాజకీయులవారికొచ్చే సొమ్ము కూడా పోయింది.


 అనానిమస్సూ ఏమైనా నువ్వు గొప్పవాడివోయ్! నీతో ఏదైనా సాధ్యమే సుమా!!   అన్నాడు మా గిరీశం.


కొసమెరుపు:- శ్రీ కపిల్ సిబాల్ గారు చేపట్టిన ప్రతి కేసు ఓడిపోవడమే జరుగుతోంది, ఈ కేసు నెగ్గేరు,  జన్మకో శివరాత్రన్నట్టు.

 

అప్పుడే రెండు రోజులనుంచి సూరీడు చురుక్కుమంటున్నాడు, రాత్రి చలి పగలు 37/38 c degrees వేడి. సూరీడు అనానిమస్సు కాదే!!!

Monday 19 February 2024

కాళ్ళగజ్జి కంకాళమ్మ

కాళ్ళగజ్జి కంకాళమ్మ 


కాళ్ళగజ్జి కంకాళమ్మ

వేగు చుక్క వెలగ మొగ్గ

మొగ్గకాదు మోదుగ నీరు

నీరుకాదు   నిమ్మలవాయ

వాయకాదు వావింటి కూర

కూరకాదు కుంకుమ బొట్టు

కాలుతీసి కడగ బెట్టు.


ఇది చిన్న పిల్లల పాటగా ప్రసిద్ధిలో ఉంది, కాని దీనిలో ఒక వ్యాధికి నివారణోపాయాలున్నాయని అంటారు. నిజమెంతో తెలియదు. తెలిస్తే చెప్పండి.   ఈ పాట చాలా రూపాల్లో కనపడుతోంది.


నాకు తెలిసి మొండి గజ్జి అనగా మాదకి ఒక మందు అని అనుకుంటున్నా! ఇందులో కంకాళం అనేది మానవ పుఱ్ఱె. శ్మశానంనుంచి మానవ పుఱ్ఱెను తెచ్చి మరల కాల్చితే తెల్లని భస్మం తయారవుతుంది. ఇది మందు,మొండి గజ్జిలాటి చప్పి,మాదలకి మందు. ఈ భస్మాన్ని ఆముదంలో కలిపి రాయాలంటారు. ఒకప్పుడు ఇది వాడుకలో ఉండేదని చెప్పగా విన్న గుర్తు.


ఇక ఇందులో చెప్పిన కూరలపేర్లు వెలగమొగ్గ తెల్లగా ఉంటుంది. వేగు చుక్కంటే మార్నింగ్ స్టార్ గా చెప్పబడే శుక్రుడు.మోదుగ చెట్టు తెలిసినదే! నిమ్మలవాయ అన్నది ఒక ఆకు కావచ్చా అని అనుమానం లేదా నిమ్మకాయకావచ్చా? వావింటి కూర అనేది ఆవాలజాతిలో వామింటి అనే కూర ఉన్నది. కుంకుమ పసుపుతో తయారైనది కూడా మందే. ఈ పాట చెప్పినవారేం చెప్పదలుచుకున్నారు. కాలంలో ప్రజలనోట మాటల్లో మార్పులేమైనా వచ్చి ఉండచ్చు కూడా!!!

Saturday 17 February 2024

ఎలక్ట్రల్ బాండ్లు -- కొబ్బరిచెట్టుకు మడిబట్ట కట్టినట్టు...

ఎలక్ట్రల్ బాండ్లు  --  కొబ్బరిచెట్టుకు మడిబట్ట కట్టినట్టు...


  కొబ్బరిచెట్టుకు మడిబట్ట  కట్టినంతలో కొబ్బరికాయల దొంగతనం ఆగుతుందా? అంటుంటారు మా జిల్లాలలో.

అనగనగా ఒక పేద బ్రాహ్మడికి  పెరట్లో నాలుగు కొబ్బరిచెట్లున్నాయి. చెట్టు గెలవేసి కాయ దింపుకొచ్చే సమయానికి ఎవరో దొంగ, కాయలు చడీ,చప్పుడూ కాకుండా దింపుకుపోతున్నాడు.   దొంగని పట్టుకోడానికి,కాయలు దొంగతనం జరగకుండా ఉండడానికి, ఎన్నో ప్రయత్నాలు చేస్తూవచ్చాడు, కాని దొంగతనం ఆగటం లేదు. ఈ సంగతివిని మరొకరు, కొబ్బరి చెట్లకి మడిబట్ట కట్టు, ఎలా కాయలెత్తుకెళతాడో చూద్దామని, పేదవాడిని ఎగసనతోసాడు. నిజమేననుకుని పేదవాడు మడిబట్టలు కట్టేడు, నాలుగు చెట్లకీ.  దొంగ మామూలుగానే చెట్లకాయలూ, చెట్లకి కట్టిన మడిబట్టలూ కూడా ఎత్తుకుపోయాడు. మర్నాడు ఉదయం కాయలు,బట్టలూ కూడా పోవడం చూసి పేదవాడు గొల్లుమన్నాడు. అన్నవస్త్రాలకోసం పోతే ఉన్నవస్త్రాలు పోయినట్టు బట్టలుకూడా పోయినందుకు ఏడ్చేడు.


 మన సుప్రీం కోర్ట్ వారు ఎలక్ట్రల్ బాండ్లు చెల్లవని తీర్పిచ్చారు. భేష్! మన దేశంలో ఎన్నికలలో డబ్బు ఖర్చు పెట్టడం కొత్తకాదు. స్వతంత్రం వచ్చింది మొదలు అన్ని పార్టీలు డబ్బు కర్చుపెడుతూనే ఉన్నాయి. అన్ని దేశాల్లోనూ ఎలక్షన్లకి సొమ్ములు కర్చుచేయడం కొత్తకాదు. ఈ చట్టం చెల్లకపోతే, మరో చట్టం రావచ్చు. లేదా మరో పద్ధతిలో రాజకీయపార్టీలు సొమ్ములు వసూలు చేసుకుంటాయిగాని మానవు. చిత్రమేమంటే ఎలక్టరల్ బాండ్లు ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించిన పార్టీ కనపడ్డ దాఖలాలు ఉన్నట్టు లేదు. చాలా తేలిక విధానం, క్రౌడ్ ఫండింగ్, చాలా తేలిక.   ఎంతమందిచ్చారు? తెలీదు.  ఎవరిచ్చారు? తెలీదు. ఎంతిచ్చారు? తెలీదు.ఎక్కడిచ్చారు? తెలీదు. ఎవరు చెప్పలేరు. ఏ బహిరంగ సభలో ఎంతిచ్చారు? చెప్పలేరు. శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు. 

విరాళాల విషయంలో మాత్రం రాజకీయ పార్టీలు నువ్వంటే నువ్వనుకోవు,అదీ చిత్రం. అన్నీ ఆ తానులో ముక్కలే! ప్రపంచంలో రాజకీయపార్టీలకి, ప్రజలు,కార్పొరేట్లు సొమ్ములెందుకిస్తాయి? వాళ్ళు అధికారంలో కొస్తే తమకి లాభం చేకూరుస్తారనేగా!డబ్బుతో సంబంధంలేని ఎన్నికలొస్తాయా? సాధ్యమా? డబ్బున్నవాళ్ళు గాని, డబ్బున్నవాళ్ళు వెనకున్నవాళ్ళుగాని ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు, నెగ్గుతున్నారు. డబ్బులేనివాళ్ళంతా డబ్బున్నవాళ్ళని పాలకులుగా ఎన్నుకుంటున్నారు, అదికదా చిత్రం. ఇదింతే

Friday 16 February 2024

భాస్కర జయంతి

 భాస్కర జయంతి (రథసప్తమి)


నమస్సవిత్రే జగదేకచక్షుసే

జగత్ప్రసూతి స్థితి నాశహేతవే

త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే

విరించి నారాయణ శంకరాత్మనే


జగత్తుకి కన్ను,సృష్టి, స్థితి, లయ లకు కారణము, సర్వము త్రిగుణాత్మకమైన,బ్రహ్మ,విష్ణు,మహేశ్వర రూపమైన భాస్కరునికి నమస్కారము.


భారతదేశంలో సూర్యోపాసన అనాదిగా ఉన్నదే!సనాతన ధర్మంలో సూర్యోపాసన ప్రముఖమైనదే. భాస్కరుణ్ణి ప్రత్యక్షనారాయణుడిగా (ప్రత్యక్ష దైవం) ఆరాధిస్తారు. మాఘశుక్ల సప్తమి రోజు కృత్తికా నక్షత్రంలో సూర్యజననం అంటారు. ఉదయమే తలకు కొద్దిగా నూనెపెట్టుకుని జిల్లేడాకు మీద ఒక రేగుపండు ఉంచుకుని తలపై ఉంచుకుని శిరఃస్నానం చేయడం ఆచారం. సూర్యునికి పరమాన్నం ప్రీతికరమైనది. గోమయంతో చేసిన పిడకలపై ఆవుపాలతో కొత్తబెల్లంతో బియ్యపు పరమాన్నం సూర్యుని వెలుగులో వండి భాస్కరునికి   నైవేద్యం చేసి ప్రసాదంగా తీసుకోవడం ఆచారం. ఇలా తయారు చేసిన పరమాన్నం నిజంగానే అమృతం లా ఉంటుంది.

Wednesday 14 February 2024

పలుకులతల్లి పండగ

 పలుకులతల్లి పండగ

మాఘ శుద్ధ పంచమి


సరస్వతీ నమఃస్తుభ్యం

వరదే కామరూపిణీ

విద్యారంభం కరిష్యామి

సిద్ధిర్భవతు మే సదా


అమ్మా! కామరూపాల్లో ఉండగల సరస్వతీదేవికి నమస్కారం. నన్ను కటాక్షించు. విద్యను పారంభిస్తున్నాను,ఎల్లప్పుడూ సిద్ధించు.


ఇది నిత్యమూ చెప్పుకోవలసినమాట. అమ్మ ఎప్పుడూ సిద్ధించాలి,కరుణించాలి,కటాక్షించాలి,కాపుకాయాలి.


అమ్మ భండపుత్ర వధోద్యుక్త,భండసైన్య వధోద్యుక్త, బద్ధకాన్ని చంపేతల్లి.

,సర్వజ్ఞ,వాగ్వాదిని,సద్యఃప్రసాదిని,విద్యావిద్యా స్వరూపిణి,ఇఛ్ఛా శక్తి,జ్ఞానశక్తి,క్రియాశక్తి స్వరూపిణి,సరస్వతి అలాటి తల్లికి నమస్కారం, అనేక రూపాల్లో ఉండగలతల్లి. నాకెప్పుడూ సర్వకాలసర్వాస్థలలోనూ సిద్ధించు, నాకింతకంటే మాటలు రావటం లేదు,నీవు నేర్పినపలుకులే పలుకుతున్నా!తప్పులున్న మన్నించు. తల్లీ! నీకు నమస్కారం. 

Wednesday 7 February 2024

రాజకీయం- ధీరత్వముచితజ్ఞతా

రాజకీయం- ధీరత్వముచితజ్ఞతా 


మా సత్తిబాబు, సుబ్బరాజు వచ్చారో సాయంత్రం. 'అమ్మా! కాఫీ' అనరిచేలోగానే కాఫీ తెచ్చేసింది కోడలమ్మాయి. 'అమ్మా! చిన్నదానివి ఎక్కువగా పొగడకూడదు గాని ఒక మాట చెబుతా!

దాతృత్వం ప్రియవక్తృత్వం ధీరత్వ ముచితజ్ఞతా

అభ్యాసేన న లభతే చత్వార సహజా గుణాః

దాతృత్వం,ధీరత్వం,సమయానికి తగినట్టుమాటాడటం,ప్రియంగా మాటాడటం అన్నవి నేర్చుకుంటే రావు పుట్టుకతో రావాలంటారు ఆచార్య చణకులు.  ఇవి  నీలో పుష్కలంగా ఉన్నాయి.  జీవితంలో అభివృద్ధిలోకొస్తావు, దీర్ఘసుమంగళీభవ' అన్నాడు. దానికి సుబ్బరాజు 'మీ అమ్మాయిగా పొగుడుకో ఎవరూ కాదనరులే!' అన్నాడు. దానికి  సత్తిబాబు 'నీదంతా యతికుతం' అని నవ్వేసేడు.  మాటలు చివరికి రాజకీయం దగ్గరాగాయి.


''ఏంటో! మమతమ్మ కాంగ్రెస్ కి దేశం మొత్తం మీద నలభై సీట్లు కూడా రావంటదే! ఏటీ చోద్యం'' అడిగాడు, సుబ్బరాజు.  సత్తిబాబు మాటాడలేదు,నేనూ మాటాడలేదు. సుబ్బరాజే ఒక మెట్టు దిగి 'సత్తిబాబు!, ఇదేంటో చెప్పవా?' అడిగాడు. 'సరిలే   చెబుతా, చెప్పేకా ఇల్లా అన్నావు అల్లా అన్నావు  అని కోపగించుకోకు,నా మాట నేను చెబుతాను, నువ్వు చెప్పేది నువ్వు చెప్పు. వద్దన్నవారు లేరంటే,'   'చెప్పు సత్తిబాబూ అన్నా!' మరీ అన్యాయంగా ఊరుకుంటే సుబ్బరాజు చిన్నబుచ్చుకుంటాడని.సత్తిబాబు మొదలెట్టేడిలా..


ఎవరేమన్నా,అనుకున్నా కాంగ్రెస్ రాజకీయాలు రాహుల్ బాబు మాట మీద నడుస్తున్నాయన్నది సత్యం. భారత్ జోడో యాత్ర చెయ్యాలనుకున్నాడు రాహుల్ బాబు. మొదలయింది, చెప్పుకుంటే చాలా ఉందిగాని, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు,బి.జె.పి పాలిత రాష్ట్రాలగుండా యాత్ర నడచి శ్రీనగర్ చేరింది, తల్లీ బిడ్డా న్యాయంగా విమర్శలు ప్రతి విమర్శలతో. ఫలితంగా ఆ తరవాత జరిగిన ఎన్నికల్లో రాజస్తాన్,చత్తీస్ గడ్ లలో అధికారం పోగొట్టుకుని, తెలంగాణాలో నెగ్గి, చావుతప్పి కన్నులొట్టబోయినట్టు పరువు కాస్త దక్కించుకున్నాడు. దక్షణాది నుంచి ఉత్తరాదికి నడచిన ఊపుతో తూర్పునుంచి పడమరకి నడిచెయ్యాలనుకున్నాడు. ఈ లోగా పరువునష్టం కేసు, చాలా గందరగోళం తరవాత పదవి నిలబెట్టుకున్నాడు. ఆ తరవాత రాబోయే ఎన్నికల గురించి దేశం మొత్తం మీద ప్రతిపక్షాలని ఏకం చెయ్యాలని INDI అలయన్స్ చేసి,సీట్లు పంచుకోవాలనుకున్నారు, ఎవరెక్కడ పోటీ చేయాలో తేల్చుకోవాలనుకున్నారు.. ఇంత దాకా బాగానే జరిగింది. ఎవరికితోచిందో మరి రాహుల్ బాబా తూర్పునుంచి పడమటి నడక ఎన్నికలు రెండు నెలలుండగా మొదలెట్టేడు, అదిన్నీ మణిపూర్ నుంచి, అక్కడ జరిగిన గొడవల్ని ఆధారంగా చేసుకుని గద్దెనెక్కెయ్యాలని.  తప్పు కాదనుకో! 


నడకమొదలయింది. అసోం చేరేతలికి విమర్శలు ప్రతి విమర్శలు సరే!, కుర్రగాళ్ళు మోడీ! మోడీ!! అనరచినారని కోపగిస్తే ఎట్టా? ఈ లోగా అయోధ్యలో ప్రాణప్రతిష్టకి పిలుపొచ్చింది. రామని చెప్పేసేరు.   కుక్కజట్టీలకి సమయమా చెప్పు! దేశమంతా రాముని చుట్టూ తిరుగుతోంది, రాహుల్ బాబు కాదన్నాడు. ఆయనిష్టమనుకో! బెంగాల్ దగ్గరకొచ్చేటప్పటికి మమతమ్మ పర్మిషన్లు ఇవ్వలేదు,నడకకీ,మీటింగులకీ. నా ఇలాకాలో నడుస్తూ నాకు చెప్పాలనే ఇంగితజ్ఞానంలేదా? అడిగింది మమతమ్మ.  అక్కడ పర్మిసన్ల కోసం రెండు రోజులు  ఖాళీగా కూచుని సమయం  వృధా చేసేడు. ఇది ఖాళీగా కూచునీ సమయమా? చెప్పు! మరురోజు నీకు రెండు సీట్లిస్తా అన్నది. ఇండీఅలయన్స్ లో ఉన్నోళ్ళంతా సీట్లు మాటడుకుందామంటే పలకలేదు. ఆ మర్నాడు మార్క్సిస్టుల్ని వదిలేసిరా! సీట్లు మాటాడుకుందామంది. పలుకు లేదు.ఆ తర్వాత రోజు నీకొక్క సీటూ ఇవ్వను అనిజెప్పేసింది. ఈలోగా బీహార్ లో నితీష్  INDI అలయన్స్ లో సీట్ల గురించి కాంగ్రెస్ మాటాడదు, నేను బయటికి పోతన్నా, అని పోయి బి.జి.పి తో చేరేడు. సీట్ల గురించి మాటాడకపోడంతో అఖిలేష్ నీకు11 సీట్లిస్తా,పోటీ చెయ్యి అని తనపని తను చేసుకోడం మొదలెట్టేడు. ముందుకెల్తే కేజ్రీవాల్ డిల్లీ పంజాబుల్లో తనపని చేసుకుంటావున్నాడు. మహారాష్ట్రలో కాంగ్రెస్ కుడి భుజం మురళీ దేవరా పార్టీ వదిలేసిపోయాడు,కాంగ్రెస్లో పట్టించుకునేవారు లేరంటూ. ఇదంతా చూసిన మమతమ్మ నీకు దేశం మొత్తం మీద నలభై సీట్లు కూడా రావని దీవించింది.  కాంగ్రెస్  నుంచి జనాలు  బయటికిపోతన్నారు ఏమని?  అడిగాడొక విలేకరి. నితీష్,దేవరా ఇలా ఎంతమంది బయటికిపోయినా లెక్క చేసేది లేదన్నట్టు  చెప్పడం అందంగా ఉందా? , ఈ సమయంలో   అలామాటాడటం మనుషుల్ని కూడదీసుకునీ లక్షణమా చెప్పు? చిలిపి కయ్యాలకి సమయమా? ఓపక్క ఎన్నికలు తరుముకొస్తుంటే, చెప్పు!


 రాజకీయాల్లోనైనా జీవితంలో నైనా ఎప్పుడు ఏపని చెయ్యాలో అదేచెయ్యాలి. ఎక్కడ,ఎప్పుడు ఎలా, మాటాడాలో అలాగే మాటాడాలి. ఇది తెలిసినవాళ్ళే రాణిస్తారు.  ఇరవై, పాతికిల్లో పెళ్ళి చేసుకోవాలి, సంపాదన మొదలెట్టాలి. పాతిక ముఫైల్లొ బిడ్డల్ని కనాలి. ఆ తరవాత బిడ్డల్ని పెంచాలి. వాళ్ళని ప్రయోజకుల్ని చెయ్యాలి.
 అలాగే ఈ టైములో రాహుల్ బాబా ఒక చోటకూచుని INDI అలయన్సులో, కూడా ఉన్నవాళ్ళతో మాటాడుకుంటూ సీట్లు సద్దుబాటు చేసుకుంటూ రాజకీయం నడపాలిగాని ఇప్పుడు నడుస్తానంటే ఎలా? మమతమ్మ అలా అన్నదంటే ''ఆతడనేక యుద్దముల నారియుతేరిన  వృద్ధమూర్తి'' అన్న మాటలా లేదా? మమతమ్మ మార్సిస్టులతో గొండాడి కదా పవర్లోకొచ్చింది. ఎంత అనుభవం ఉంటదీ. అందుకే అలా ఆశీర్వదించింది, తప్పేంటి చెప్పు! అని ముగించాడు మా సత్తిబాబు.