సామాన్యుడి సణుగుడు
ఎన్నికల్లో చిత్రాలు.
ఎన్నికల యజ్ఞం,ఫలితాల రాకా, పూర్తయింది. చూసే కన్ను, మనసు ఉంటే చిత్ర విచిత్రాలే ఉన్నాయి. ఎన్నికల్లో సామాన్యుడు చేసిన చిత్రం చూద్దాం.
మొన్నటిదాకా ఇ.వి.ఎమ్ లమీద అనుమానాలతో చెలరేగిపోయిన వారు ఫలితాల తరవాత నోరు మెదిపిన పాపాన పోలేదేమో!
ఇక ఎన్నికల కమిషన్ని, కమిషనర్లని, ప్రభుత్వoలో ఉన్న పార్టీకి కట్టుబానిసలని, తిట్టిన నోళ్ళు, తెరుచు కోలేదు,ఫలితాల తరవాత.
కొంతమంది మేధావులు ఎన్నికల కమిషన్ కు,సుప్రీం కోర్టుకు ఉమ్మడి ఉత్తరం రాసేసి, ప్రభుత్వం పైన తమకడుపులో కుళ్ళు వెళ్ళగక్కు కున్నారు.
ఎన్నికల తరవాత మోడీ మరో దేశం పారిపోతాడు అని నోరు పారేసుకున్న లాలూ ఎక్కడా? అరడజను సీట్లైనా గెల్చుకున్నాడా? లేదు 4 సీట్ల దగ్గరాపేసేరు.
మోడీ మళ్ళీ ప్రధానైతే గుండు గీయించుకుంటానన్నాడో రాష్ట్ర మంత్రి,(తనకి నెత్తిమీద వెంట్రుకలు కూడా లేవు) ఏమయ్యాడో?
భారతీయ పౌరులలో ఎక్కువమంది, చదువులేనివాళ్ళే కావచ్చు, మేధావులు కాకపోవచ్చు, పేదవాళ్ళే కావచ్చు, డబ్బుకి వోట్లు వేసేవాళ్ళు కావచ్చు, ఉచితాలకి ఎగబడేవాళ్ళే కావచ్చు కాని అవసరం వచ్చినపుడు, మండుటెండలో నిలిచి ఓటేసి, కొఱ్ఱు కాల్చి వాత పెట్టడం లో నిపుణులన్న సంగతి ఎన్నికలని చూస్తే తెలుస్తుంది. ఒక్కొకటే చూదాం!
నన్ను చూసి మోడీ భయపడుతున్నాడు, అని సొల్లు కొట్టిన కేజ్రివాల్, పంజాబ్ లో మూడు సీట్లు గెల్చుకుని, డిల్లీలో, సోదిలోకి రాకుండా పోయాడు. ఉచితాలకి ఓట్లు రాలవన్న మొదటి మాట.
ఉడుకెత్తించే ఉపన్యాసాలకి ఓట్లు రాలవని కూడా కన్నయ్యకి కాల్చి వాతేట్టేరు,డిల్లీలో!
బీహార్ లో లాలూకి,కాంగ్రెస్ కీ తమ స్థానమేంటో చెప్పింది సామాన్యులే!
బెంగాల్లో కాంగ్రెస్ కీ, పూర్తిగా ఉద్వాసన చెప్పేసింది దీదీ! ఒకే ఒక్కడుగా పోరాడిన యోధుడు Adhir ranjan chowdary కూడా మమత దెబ్బకి నేలకొరిగాడు. బెంగాల్లో కాంగ్రెస్ నీ వారి మిత్రులు కమ్యూనిస్టులని మమత కర్చు రాస్సినట్టే! ఒంటరి వీరుడు అధీర్ రంజన్ చౌదరీ ఆర్తనాదాలు కాంగ్రెస్ వారి చెవులబడుతున్నట్టు లేదు. నాకు మరో పని చెయ్యడం చేత కాదు,సంపాదనా మార్గమూ లేదు, కూతురు చదువుకుంటోంది. నేడో రేపో ఢిల్లీ వెళ్ళి క్వార్టరు కాళీ చేసి రావాలన్న ఆకలి కేకలు కూడా, నిన్నటివరకు లోక్ సభలో ప్రతిపక్ష నాయకునిగా వ్యవహరించిన కాంగ్రెస్ నేత, ఆర్తనాదాలు కాంగ్రెస్ కోటలోకి చేరుతున్నట్టు లేదు. కావాలంటే నన్నేమైనా చేసుకో కాని కార్యకర్తలని ఏమీ చెయ్యకని, మమతని ఫలితాల తరవాత జరిగే హింసనుంచి కాపాడమని, చేతులు జోడించి వేడుకున్నదైనా చెవులబడుతోందో లేదో,విన వలసిన వారికి, తెలియదు.
ఇక బెంగాల్ అంటే ఒకప్పుడు ఎఱ్ఱవారి కంచుకోటని పేరు, పాపం సోదిలోకి కూడా రాకుండా పోయారేమో! సామాన్యుడు చేసిన చిత్రం సుమా!!
ఒడిషా ది మరో చిత్రం. ఒడిషా అంటే పట్నాయక్ అని మారుపేరు, పాతికేళ్ళగా మచ్చ లేని ముఖ్యమంత్రి, కాని బయటికి పంపేసేరు, రాష్ట్ర ఎన్నికల్లో, ఇక పార్లమెంటుకి ఒక్క సీటిచ్చెరు,BJP కి పందొమ్మిది సీట్లిచ్చేరు.కారణం, తను మెచ్చిన ఒక తమిళ ఐ.ఎ.ఎస్ ఆఫీసర్ ని పూర్తిగా చంకనెత్తుకోవడం,చివరికి అతన్ని ఉద్యోగం మాన్పించి పార్టీ లో చేర్చి పెత్తనమప్పగించడం, సహించ లేదు. ప్రతిపక్షంలో కూచో బెట్టేరు.సామాన్యుడు చేసిన చిత్రం సుమా!!
ఉత్తరప్రదేశ్ యోగి బాబా పరిపాలన, కాని అక్కడ సమాజవాది పార్టీకి 37 సీట్లిచ్చేరు, కూడా ఉన్న కాంగ్రెస్ కి ఆరిచ్చేరు. కాంగ్రెస్ తమగొప్పే అని చంకలు గుద్దేసుకుంటోంది. గొప్ప సమాజ్ వాది పార్టీ దనుకోడం లేదు.దూకుడు తగ్గించమని యోగిబాబాకి చిన్న చురక.
తెలంగాణాలో, సర్వమూ నేనే అని చెప్పిన బి.ఆర్.ఎస్ కి లోక్ సభలో స్థానమే లేకుండా చేసేరు. ఎంత చిత్రం.
ఇక ఆంధ్రా గురించి చెప్పక్కరనే లేదు. జగన్ 11 MLA సీట్లు గెల్చుకుంటే గొప్పయి పోయింది. 4 ఎమ్.పి లతో సరిపెట్టుకోవలసివచ్చింది. ఉచితాలనేకం ఇచ్చానే! అయ్యో! ఇంత అన్యాయమా? అని ఆక్రోసించి ఉపయోగం లేదు. ఉచితాలు గండం గడుపుతాయన్న వారికి పెద్ద పాఠమే! ఉచితాలు మేమడగలేదు, మీరిచ్చారు,పుచ్చుకున్నాం. ఉచితాలిస్తే ఓట్లేస్తామని మీరనుకోడం పొరబాటు. చురకేసి చెప్పినట్టు కాలేదా? కేజ్రి తరవాత రెండో వారికి పాఠం చెప్పిన సామాన్యుడు. ఏదో జరిగింది ఆధారాలు లేవని ఆక్రోశం ఉపయోగం లేనిది.
ఎక్కడైనా కాలు పెట్టేరేమోగాని తమిల్ నాడులోకి బి.జె.పి ని రానివ్వకుండా చేసిన ఘనత స్టాలిన్ మరియు పుత్ర రత్నానిదే! అదే మరి ప్రజాస్వామ్యమంటే! కారే రాజులు రాజ్యముల్ గల్గవే గర్వోన్నతిన్ బొందరే
వారేరీ సిరి మూటగట్టుకుని పోవన్ జాలిరే! చివరికి భూమిమీద పేరైనా ఉందా? లేదే! ఇటువంటివారు కాలగతిలో ఎందరు చేరిపోలేదు? హిందూ సంస్కృతి డెంగూ, వగైరా అంటూ నేడు పేలుతున్నవారికి రోజు రావాలి! వస్తుంది!! అప్పటిదాకా ఇంతే!! దోస్తులకి ఇది వినపడుతోందా?
ఎ.ఐ.డి.ఎమ్.కె కనపడకుండా పోయింది, బి.ఆర్.ఎస్ లాగా!
చిట్ట చివరికి కేరళాలో సురేష్ గోపి, చిత్ర నటుడు రూపంలో బి.జె.పి కాలు పెట్టింది. ఇదొక రికార్డే! సామాన్యుని చిత్రం. కాంగ్రెస్ కి పద్నాలుగు సీట్లిచ్చి గెలిపించారు.సి.పి.ఎమ్ కి ఒక్క సీటిచ్చారు. రాష్ట్రం లో అధికారంలో ఉన్న కమ్యూనిస్టులకి పెద్ద చురక. దేశం మొత్తం మీద ఒకే ఒక కమ్యూనిస్ట్ ఎమ్.పి అనుకుంటా! సామాన్యుడు వేసిన పెద్ద చురక.
M.Pలో వృద్ధ కాంగ్రెస్ వాదులందరిని తుడిచి పెట్టేసి, మొత్తం సీట్లు బి.జె.పి కే ఇచ్చేసేరు. రాహుల్, ఈ వృద్ధ కాంగ్రెస్ వాదుల్ని వదిలించుకో లేకపోయాడు. ఆ పని బి.జె.పి చేసి పెట్టింది. కాంగ్రెస్ కి పెద్ద లాభం
కర్ణాటకా లో ఉచితాలు ఉచితాలే, కేంద్ర ఎన్నికలు ఎన్నికలే అని తొమ్మిదే సీట్లిచ్చారు కాంగ్రెస్ కి, రాష్ట్రంలో అధికారంలో ఉన్నా! కాంగ్రెస్ కి వోటెయ్యకపోతే ఉచితాలివ్వం అని బెదిరించినా BJP కి 17 సీట్లిచ్చారు కాంగ్రెస్ కి వోటెయ్యకపోతే ఉచితాలివ్వం అని బెదిరించినా ! సామాన్యుడు వేసిన పెద్ద చురక,కాంగ్రెస్ కి!
BJP:-మీరు దేశ భద్రత,రక్షణ,విదేశీ వ్యవహారాల్లో చూపిన నిపుణతకి జే జేలు చెప్పేం! ఐతే దేశపు అంతర్గత వ్యవహారాలలో కొంత పట్టు విడుపు అవసరం,దాన్ని విస్మరించి, ఒంటెత్తు పోకడ పోయినందుకు, మిమ్మల్నిప్రతిపక్షంలో కూచోబెట్టలేదుగాని మీకుగా స్వతంత్రంగా 272 సీట్లు ఇవ్వటం లేదు, మరో నలుగుర్ని తోడిస్తున్నాం! వారితో కలిసి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి! అని చెప్పి నాలుగు పార్టీలతో కలిపి 293 సీట్లిచ్చినది పెద్ద హెచ్చరిక! BJP కి, మీతో ఇప్పుడు. తీసుకున్న నిర్ణయం కచ్చితoగా అమలు చేసే మోడీ అంటే చాలామందికి కడుపుమంట, దేశంలోనూ విదేశాల్లోనూ కూడా! BJP పార్టీకి పెద్ద హెచ్చరిక!ఇది సామాన్యుని హెచ్చరిక
Congress:- పార్టీని మా తాత,తండ్రులు నిర్మించుకున్నది, నేటికి ఒక కుటుంబానికి చెందిపోయింది. మీ నుంచి తెలుసుకోవలసిన విషయాలు చాలానే ఉన్నాయి, అందులో ఒక్కటి మచ్చుకి. మీ పార్టీ చైనా కమ్యూనిస్ట్ పార్టీ తో చేసుకున్న ఒప్పందం వివరాలు దేశానికి చెప్పేరా? ఏమిటవి? ఇప్పుడు మీకిచ్చిన 99 సీట్లు మీ ప్రతిభకి మెచ్చి ఇచ్చినవి కావు. బి.జె.పికి, ఒక చిన్న చురక అంటించడానికి చేసిన కసరత్తు.పదేళ్ళు పరిపాలన చేసినవాళ్ళని ప్రతిపక్షంలో కూచోబెడ్తారు,ఆ పని చెయ్యలేదు. ఈ 99 సీట్లు, మీప్రతిభే అనుకుంటే పొరబాటు, మరోమాట కూడా! ప్రభుత్వాన్ని పడకొట్టేస్తాం! రంకెలేస్తున్నారు, అస్తు! మరచిపోకండి! ఆ తరవాత మీరు నిర్మించే ప్రభుత్వం ను, మీరు ఆరు నెలలు నిర్వహించలేరు. ఇప్పుడే మీ దోస్తు మమత నిన్నటిదాకా మీ పల్లకీ మోసిన బోయీ అధీర్ రంజన్ చౌదరిని నానాగడ్డీ కరిపించేస్తోంది. నేడు మీతో ఉన్నవాళ్ళెవరూ మీ మిత్రులు కారు, ఇంతటి గొప్ప దోస్తుతో మీ ప్రభుత్వం ఎంత గొప్పగా ఉండబోతోంది? మీ యోధుడినే రక్షించలేని మీరు దేశాన్నేం రక్షిస్తారు? దేశo కుక్కలు చింపిన విస్తరైపోయి, మళ్ళీ మోడీకే ఈ సారి 400 సీట్లిచ్చి పట్టం కడతారు. ఆ తరవాత మీ అడ్రసులు గల్లంతు, జాగ్రత్త! చూసుకుని అడుగేయండి. పశ్చిమ దేశాలన్నీ తమ స్వార్ధం చూసుకుంటాయి. అంతేకాదు భారత్ ఎప్పుడూ వాటికి అణిగిమణిగి ఉండాలనీ,వాటిమీద ఆధారపడి బతకాలనీ అనుకుంటాయి. అది తెలుసుకు మసలండి. మీ స్వంతంగా 272 స్థానాలూ వచ్చేదాకా ప్రభుత్వాన్ని పడగొడతామని ప్రయత్నాలు చేస్తే ఫలితాలు విపరీతంగా ఉంటాయి. ఇది ఒక హెచ్చరిక,చురక, సామాన్యుడి నుంచి.