Saturday, 31 May 2025

అశుద్ధం మీద

 అశుద్ధం మీద 


అశుద్ధం మీద రాయి వేస్తే ముఖాన చిందుతుందని ఒక నానుడి. అశుద్ధం అని తెలిసి, రాయి వేస్తే చిందుతుందని తెలిసి, రాయి వెయ్యకూడదు. దూరంగా ఉండాలి.


బురద లో పొర్లిన పంది రోజుకుంటూ ఎదురొస్తే మనమే తప్పుకోవాలి. లేకపోతే ఒంటినిండా బురద విదిలించి పోతుంది, దీనికి జ్ఞానం ఉండదు, జ్ఞానం కల మనమే దూరంగాఉండాలి.


చేరి మూర్ఖుల మనసు రంజింప రాదు అన్నది పెద్దలమాట. మూర్ఖుడు అని తెలిసి వారితో వాద,సంవాద,ప్రతివాదాలు చేయడమే మూర్ఖత్వం. అందుచేత మూర్ఖునికి దూరంగా ఉండాలి. 



చదువది యెంత గల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా

చదువు నిరర్థకంబు గుణసంయుతులు మెచ్చ రెచ్చటం

బదునుగ మంచికూర నలపాకము చేసిననైన నందు నిం

పొదవెడు నుప్పు లేక రుచిపుట్టగ నేర్చునటయ్య భాస్కరా!

Friday, 30 May 2025

పుణ్యానికి పోతే

 పుణ్యానికి పోతే


పుణ్యానికి పోతే పులెత్తుకుపోయిందని సామెత! అలాగా శశి థరూర్,అసదుద్దిన్,కనిమొళి,ఇలా పార్లమెంటు సభ్యులు ఏడు బృందాలుగా ప్రపంచం మీద పర్యటిస్తూ పాక్ దుశ్చర్యలను ఎండగడుతూ మన దేశపు ఇబ్బందులను, ఎట్టి పరిస్థితులలో లక్ష్మణ రేఖను దాట వలసి వచ్చిందో వివరిస్తున్నారు.


ఈ బృందాల్లో శశిథరూర్,అసదుద్దీన్ ముఖ్యంగా మెరిసారు. శశి థరూర్ కాంగ్రెస్ వాడయి ఉన్నా, పార్లమెంటు లో విదేశీ వ్యవహారాల సబ్ కమిటీ   అద్యక్షుడు, దేశం ముందు తరవాతే కుటుంబమని విషయాల్ని చెబుతోంటే వారి పార్టీ వారే  తిట్టిపోస్తున్నారు. నిన్ను బి.జె.పి, విదేశీ వ్యవహారాల మంత్రిగా చేసుకుంటుందనీ వైన వైనాలుగా దుమ్మెత్తి పోస్తున్నారు. ఇక సదుద్దీన్ ఏ పార్టీ వాడైనా మెచ్చుకోవలసిందే.    


జయహో! విదేశాల్లో పర్యటిస్తున్న బృందాలకి, ముఖ్యంగా శశి థరూర్,అసదుద్దిన్ లకు జయ! జయహో!! 


శశి థరూర్,అసదుద్దీన్ లకే నావోటు వారే పార్టీలో ఉన్నా! కారణం దేశద్రోహం చెయ్యలేరు,అదిచాలు.  

Tuesday, 27 May 2025

నెహ్రూ పండితుడు కాలం చేసిన రోజు

 నెహ్రూ పండితుడు కాలం చేసిన రోజు. 


అప్పటి ఉద్యోగంలో చేరి మూడేళ్ళు. వేసిన వత్తికి పోసిన చమురుకి హాని హానిగా నడుస్తున్న రోజులు. ఈ బతుకింతే రేడియో కూడా లేదనుకుని బాధ పడుతున్నరోజులు. ట్రాన్సిస్టర్ లు బహు ఖరీదు మాట. సంసారంలో ఏం లేవు. అయ్యవార్లంగారి నట్టిల్లు. ఒ రేడియో షాపతను రేడియో ఇన్స్టల్మెంట్ లో అమ్మేవాడు,అదిన్నీ వాల్వు రేడియో, నాలుగొందలు. నెలకి ఇరవై చొప్పున తీర్చేందుకు ఒప్పుదల. ఇంటి మాస్టారు హామీ. ఆ మాస్టారికీ రేడియో లేదు, అంచేత,ఇంట్లో ఒక రేడియో ఉంటుందిలే అనుకున్నట్టున్నారు. ఓ చిన్న మాట కూడా తగిలించారు, రేడియో కరంటుకి రూపాయి అదనం, నెలకి అని చెబుతూ.  ఆ రోజుల్లో వార్త తెలియాలంటే రేడియో నే గతి.  ఇంట్లో రేడియో పెడితే అసలు గది కాళీ ఉండేదికాదు. ఇంటిల్ల పాదీ రేడియో దగ్గరే ఉండేవారు. ఎవరిని ఏం అనగలం, అందరూ ఇంటివారు,వారి పిల్లలు, మేము అక్కడే ఎక్కడో బిక్కు బిక్కుమని కాలక్షేపం చేసేవాళ్ళం.రేడియో కొనుక్కున కొత్త రోజులు. ఒక రోజు మధ్యాహ్నం అప్పుడే డ్యూటి నుంచి వచ్చి రెండు మెతుకులు తిని తలుపులేసుకుని రేడియో పెట్టి,గచ్చు మీద చల్లదనానికి పడుకున్నా. రేడియో పెట్టగానే విషాద సంగీతం వస్తోంది, ఏవరో బాల్చీ తన్నేసేరు, ఎవరబ్బా అనుకుంటూ లేచి కూచున్నా! ఈలోగా రెండయింది, ఇంగ్లీష్ వార్తలు మొదలయ్యాయి. నెహ్రూ గారి మరణవార్త వినిపించింది.హతవిధీ బారత్ కి దిక్కెవరు చర్చలు మొదలయ్యాయి.......  

Monday, 26 May 2025

జయహో భారత్

 జయహో భారత్

ఆపరేషన్ సిందూర్ తరవాత భారత్ నుంచి 7MP బృందాలు ప్రపంచం మొత్తమ్మీద పర్యటిస్తున్నాయి,భారత్ కి గత ఏడు దశాబ్దాలుగా టెర్రర్ తో జరుగు తున్న అన్యాయం చెప్పడానికి,ఆపరేషన్ సిందూర్ ని వివరించడానికిన్నీ. ఆ బృందాల్లో హేమాహేమీలున్నారు.అమెరికాలో పర్యటిస్తున్న బృందం లీడర్ శశి థరూర్ మాటాడుతూ నేను మా ప్రభుత్వం మాటాడిస్తున్నది చెప్పటం లేదు, మా దేశానికి జరుగుతున్న అన్యాయం గురించి మాటాడుతున్నానని నిప్పులు కక్కారు. అలాగే అసదుద్దీన్,కనిమొళి,సుప్రియ ఇలా అందరూ పాక్ మాలో మాకు మతపరమైన విభేదాలు కల్పించి టెర్రర్ ను కాపాడుకుంటూ మమ్మల్ని పాక్ ఇబ్బంది పెడుతోంది. మా దేశం  టెర్రరిస్టులపై దాడి చేసింది తప్పించి పాక్ మీద కాదు. కాని పాక్ అది గుర్తించలేదు సరి కదా, టెర్రరిస్టులను వెనకేసుకొస్తూ మా మిలిటరీ మీద దాడి జరిపితే మేం తిప్పికొట్టేం తప్పించి మేము దాడి చేయలేదు. వారు మా పై కాల్పులు జరిపితే మేం జరిపేం. వారికి నష్టం ఎక్కువ జరిగి కాల్పుల విరమణకి జండా ఎత్తి మేం కాల్పుల విరమణకి అడిగినట్టు ప్రచారం చేసుకుంటోంది. ఇది గుర్తించండని చెప్పుకొచ్చేరనమాట. జయహో భారత్!


పాక్ సెనేటర్ సభలో మాటాడుతూ మనమీద నీటి బాంబు పడింది, దీనిని జాగర్త్తగా సరిచేసుకోకపోతే దేశంలో నూటికి తొంభై మంది ఆకలికి చావాలి అని సున్నితంగానే మందలించారు వారి ప్రబుత్వాన్ని. మరో చిత్రం మనదేశం పార్లమెంటు సభ్యుల బృందాల్ని విదేశాలకు పంపుతున్నట్టు తమరు కూడా ప్రయత్నం చేస్తున్నారు,ఇదీ కాపీయే. అన్నీ కాపీ,పేస్టు సరుకులే,స్వంత ఆలోచన  ఉన్నట్టు లేనిదే!!   

ఈ సందర్భం లో పాక్ ని సమర్ధిస్తూ ఆయుదాలు ఇచ్చిన చైనా,టర్కీ, అజర్ బైజాన్ లు టెర్రరిస్టులను సమర్ధించే నైజం  వెళ్ళగక్కేయి, బోర్లపడ్డాయి. 
దేశంలో ఈ బృందాలని పంపడంలో రాజకీయాలు నడిపిన రాహుల్ గాంధి,మమత బెనర్జీలు అపహాస్యం పాలయ్యారు. 

Friday, 23 May 2025

Notification

 Notification


మళ్ళీ కోవిడ్?


మళ్ళీ కోవిడ్?

Health first everything next.

ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపిన కరోనా మరోసారి పురి విప్పిందట. సింగపూర్ లో రోజుకి 12500 మందికి సోకిందని వార్త. మాస్కులు,దూరాలు,చేతులు కడగటం,మూతుల ముచ్చట్లు బంద్! లాక్ డవున్ తప్పదా? మళ్ళీ హాస్పిటల్,బెడ్లు షరా మామూలే! ఈ సారి సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే కర్చు రాసేసినట్టే! 


మనకి సింగపూర్ ఎంత దూరం? రెండు గంటలేగా! అసలే మనకి సింగపూర్ వాళ్ళంటే చచ్చేటంత ప్రేమాయె! ఎగిరొచ్చేస్తుంది, తస్మాత్ జాగ్రత.



Sunday, 4 May 2025

ఆణి ముత్యాలు.

 ఆణి ముత్యాలు.


మాయలు గల్గుదుష్టులకు మాయపుభంగులె మందు గాక ని

ర్మాయత నులసిల్లెడుపరాక్రమలీలలు గొల్చు నెట్లు దై

తేయులు దొల్లి మాయల నతిప్రబలాత్మకు లైన  దద్వధో

పాయములన్ జయింపరె నృపాలక విష్ణుడు నింద్రుడున్ దగన్. 

" శ్రీకృష్ణుడు. " 

ఆంధ్ర మహాభారతం.శల్యపర్వం.ద్వి.ఆ.52


మాయలు గల్గిన ప్రబలమైన దుష్టులను మాయలతోనే జయించాలి.



ప్రపంచం మొత్తం ఛీకొడితే మీ తాటతీస్తామమని భారత్ అంటే పాక్ మంత్రులనోట వెలువడుతున్న నిజపు ఆణిముత్యాలు.  


టెర్రరిసం అనే పాకీ పని (డర్టీ జాబ్) అమెరికా బ్రిటన్,పశ్చిమదేశాలకోసం,వాటి పనుపున గత మూడు దశాబ్దాలుగా చేస్తూనే ఉన్నాం, అని పాక్ విదేశాంగ మంత్రి మాట. 


మరోమంత్రి బిలావల్ భుట్టో, జుల్ఫికార్ ఆలీ భుట్టో గుర్తున్నాడా? ఆయన మనవడే,కూతురు కొడుకు. ఈయన తల్లిని టెర్రరిస్టులే చంపేరు. తాత  ఉరితీయబడ్డాడు. వారు శలవిచ్చిన మాట. టెర్రరిస్టులని మేము పెంచి,పోషిస్తున్న మాట్ జగద్విదితం, ఈవేళ కొత్తమాట కాదు..