Friday, 4 July 2025
1920 లో ప్రభుత్వ తెనుగు ఉత్తరువు
Thursday, 3 July 2025
మగాడు
మగాడు
తాతా! ఒంటరిగా అడవిలోకి పోతున్నా అందో మనవరాలు ఓ రోజు పొద్దుటే ఛాట్ లో.
ఏమైందబ్బా అని సోచాయించి,బంగారం ఒంటరిగా అడవిలోకి పోకు(జనారణ్యం లోకైనా) పెద్దపులులెత్తుకుపోతాయి. బంగారాన్ని పులెత్తుకుపోతుంటే చూస్తూ ఊరుకోనా! ఓ పని చెయ్యి. ఎక్కడిదక్కడ వదిలేసి నా దగ్గరకొచ్చెయ్యి. నీకు కోపమనిపిస్తేతిట్టు,నాకు వినపడదుగా బాధలేదు(పిచ్చి నవ్వు నవ్వుతూ ఉంటా) కొట్టాలనిపిస్తే కొట్టు పంచ్ బేగ్ లా,అనేసాను.
ఎవరి మీద కోపమొచ్చి ఉంటుందబ్బా! అని ఆలోచిస్తే,ముత్యం లాటి మొగుడు,చెప్పినమాట వింటాడు. రత్నంలాటి కొడుకు చదువుకుంటున్నాడు. రేపో,నేడో రెక్కలు కట్టుకుని ఎగిరిపోడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంక మావ కాపరానికి వెళ్ళకముందే కాటికిపోయాడు. అత్త ఎక్కడో దూరాన ఉంది. తెలుసుకుందామని ఎవరి మీదా కోపం అడిగేసా.
ఎంజాయ్ చేసే వయసులో పని,పని అని విసుక్కుంది. ఆ! బిజీగానే ఉండు,ఖాళీగా కూచోకు,అంటే జీవితం ఎంజాయ్ చెయ్యకుండా పనులు తగిలించుకున్నదెవరు? నువ్వు కాదా! తగ్గించుకో!! ఎంజాయ్ చెయ్యి, వచ్చెయ్యి,వచ్చెయ్యి అన్నా. వస్తా! మా ఆయనతో చెప్పి, అని కట్ చేసింది.
-------------
కట్ చేస్తే
పడిపోయాను అని ఏడుస్తూ అమ్మకి చెబితే ఆడపిల్లలా ఏడుపేంట్రా మగాడివికాదూ! అంది.
సూతోవాచా !
పరిక్ష పోయింది నాన్నా అంటే నాలుగుతికేడు, ఏడుస్తుంటే, ఎందుకాఏడుపు ఆడదానిలా అని మరో రెండు ఉతికాడు.
మాస్టారు తిట్టారు,ఆఫీసర్ తిట్టాడు అని కొలీగ్ కి చెప్పుకుంటే ఏడవకు మగాళ్ళం కదూ అనేసాడు.
దేనికి ఏడుపొచ్చినా ఏడవకూడదనీ,అది ఆడవారి స్వామ్యం అనీ, చిన్నప్పటినుంచి ఎగో పెంచిపోషించేసేరు. పెళ్ళాం తిట్టినా,కొట్టినా ఏడవలేదు. పనెక్కువైనా,ఆరోగ్యం బాగోకపోయినా,కొడుకు కోడలూ వినకపోయినా,మనవలు,మనవరాళ్ళూ తిట్టుకున్నా ఏడవలేడు. మగాడు కదూ! కుటుంబం కోసం గాడిదలా చాకిరీ చెయ్యడం,ఎద్దులా సంపాదించడమే గాని మనసారా,కరువుతీరా ఏడవనుకూడా ఏడవలేడుగా! అదీ మగాడు.
Wednesday, 2 July 2025
ఆరు నూరైనా
ఆరు నూరైనా
ఆరు నూరైనా,నూరు ఆరైనా! ఆ సూర్యుడిటు పొడిచినా, ఈ సూర్యుడటు పొడిచినా ...
ఇదొక వ్యవహారికం.
ఆరేమిటి,నూరేమిటి? అర్ధం కాలేదు. ఆరు రుచులు (షడ్రుచులు), ఇవి ఎప్పటీ నూరు కావు. నూరు రుచులు లేవు. కనక ఇవి కాదు.
ఆరు గుణాలు (షడ్గుణాలు). అవి కామ,క్రోధ,మోహ,లోభ,మద,మాత్సర్యాలు. ఇవి వెర్రితలలేస్తే నూరు పైనే కావచ్చు. కాని నూరు ఐన ఆగుణాలు ఆరు మాత్రం కావు,ఎన్నటికిన్నీ! అందుచేత ఇవీ కావు.
షడంగాలు, ఇవి చాలా రకాలున్నాయి, అందు చేత అవీ కావు.
ఆరు రూపాయలు నూరు రూపాయలూ అవుతాయి,నూరు రూపాయలు ఆరు రూపాయలూ అవుతాయి. నేటి కాలంలో ఇవే చెప్పుకోవాలి. ఆరు నూరెలా అవుతాయి? కష్టపడి పని చేస్తే ఆరు నూరవుతాయి.తిని కూచుంటే నూరు ఆరు కావడం పెద్ద కష్టం కాదు. ఆరు నూరైనా,నూరు ఆరైనా; ఆసూర్యుడిటు పొడిచినా,ఈ సూర్యుడటు పొడిచినా పని కావాల్సిందే! అంటే సవ్యమైన పద్ధతులలోగాని అపసవ్య పద్ధతులలో గాని పని కావలసిందేనని భావం.
Tuesday, 1 July 2025
ఏది శాశ్వతం?
ఏది శాశ్వతం?
(రవీంద్రనాథ్ ఠాగూర్ అద్భుతమైన కవిత)
"నేనిక లేనని తెలిశాక
విషాదాశ్రులను వర్షిస్తాయి నీ కళ్ళు..
కానీ మిత్రమా! అదంతా నా కంట పడదు!
ఆ విలాపమేదో ఇపుడే నా సమక్షంలోనే కానిస్తే పోలా!
నీవు పంపించే పుష్పగుచ్ఛాలను
నా పార్ధివదేహం ఎలా చూడగలదు?
అందుకే... అవేవో ఇప్పుడే పంపరాదా!
నా గురించి నాలుగు మంచి మాటలు పలుకుతావ్ అప్పుడు కానీ అవి నా చెవిన పడవు..
అందుకే ఆ మెచ్చేదేదో ఇప్పుడే మెచ్చుకో !
నేనంటూ మిగలని నాడు
నా తప్పులు క్షమిస్తావు నువ్వు !
కానీ నాకా సంగతి తెలీదు..
అదేదో ఇపుడే క్షమించేయలేవా?!
నన్ను కోల్పోయిన లోటు నీకు కష్టంగా తోస్తుంది
కానీ అది నాకెలా తెలుస్తుంది?
అందుకని ఇప్పుడే కలిసి కూర్చుందాం కాసేపైనా !
నాతో మరింత సమయం గడిపి ఉండాల్సిందని నీకనిపిస్తుంది
అదేదో ఇప్పుడే గడపవచ్చుగా మనసారా!
సానుభూతి తెలపడానికి
నా ఇంటి వైపు అడుగులు వేస్తావ్..
నా మరణ వార్త విన్నాక!
సంవత్సరాలుగా మనం ఏం మాట్లాడుకున్నామని?
ఇప్పుడే నావైపు చూడు, నాతో మాట్లాడు,
బదులు పలుకుతాను, కాసేపైనా గడుపుతాను
హాయిగా నీతో మెలుగుతాను!"
------------------------------------------------
- ఇదే విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన అద్భుతమైన కవిత. అందుకే బ్రతికుండగానే ఆప్యాయంగా పలకరించుకుందాం! కష్టసుఖాలు పంచుకొందాం! ఒకరికొకరమై మెలుగుదాం! ఉన్నన్నాళ్ళూ కలిసిమెలసి బతుకుదాం!!*
ఈరోజు కలిసిన, మాట్లాడిన వ్యక్తి
మళ్ళీ కలుస్తాడో లేదో?
మాట్లాడతాడో లేదో?
ఏది శాశ్వతం?
ఎవరు నిశ్చలం?🌹🌹🙏...శ్రీ 🦋
----------------------------------------------------------
Coutesy:Whats app
విశ్వకవికి శతాధిక వందనాలు.
జీవిత సత్యం తెలుపుతూ టాగూర్ రాసిన ఇంత అద్భుతమైన కవిత ఉన్నదని నాకు నేటివరకు తెలియదు.
దీనిని వాట్సాప్ లో పంచుకున్న విన్నకోటవారికి
వందనాలు.
కావలసినవారో పైవారో అందరిని పలకరించండి,తడిసిపోయిన నులక మంచంలా బిగుసుకుపోకండి. అంతర్ముఖులు కాకండి.
ఒక వయసొస్తేగాని ఈ కవితలో అందం ఒంటబట్టదేమో 🤣