Monday 15 July 2024

స్మార్ట్ వెర్రి

స్మార్ట్ వెర్రి

సాంకేతికత వేగంగా పెరుగుతున్న కాలం. అంతే కాదు అది సామాన్యులను చేరడం కూడా అంతే వేగంగా జరుగుతున్నకాలం లో ఉన్నాం. సాంకేతికతను అంది పుచ్చుకుని జీవితాల్ని మరింత సౌఖ్యవంతం చేసుకోవాలనేదే కోరిక. ఐతే ప్రతి విషయానికి రెండవకోణం కూడా ఉంటుంది. సద్వినియోగం చేసుకోడానికి బదులు దుర్వినియోగం చేసుకోడం కూడా మనచేతుల్లోనే ఉంది. అందుకుగాను జరిగే నష్టాలను భరించక తప్పదు.


 స్మార్ట్ సెల్ పోన్ చేతిలో కొచ్చిన కొద్ది కాలంలోనే మార్పొచ్చింది. వాడుతున్న చాలావస్తువుల అవసరమూ తీరింది, వాచీ వగైరాలు. కొత్త సౌకర్యాలూ కూడా వచ్చాయి. అందులో మొదటిది పోటో తీసే సౌకర్యం, ఒక కెమెరాతో. దీనితో కూచుంటే,నుంచుంటె,పడుకుంటే,ఇలా అన్నీ పోటోలే! వాటిని ఒక మాధ్యమంలోకి ఎక్కించడం,పది మంది చూడడం, బాగుంది,బాగుందనడం, ఒక వెర్రిగా మొదలయింది.మన ఫోటో మరెవరో తీయాలి దీనికి కొంత చిక్కు. కాలం నడిచింది. ఫోన్ కి ముందుకూడా కేమేరా వచ్చింది,అంటే వెనక,ముందూ కూడా కెమెరాలు, మొత్తం రెండు. ఇప్పుడు మన ఫోటో మనమే తీసుకోవచ్చు మరొకరి సాయం అక్కరలేదు. దూరం నుంచి తీసుకోవాలంటే దీనికో స్టిక్కు, ఇలా అభివృద్ధి చెందిపోయింది. ఇక మాన్యులు,సామాన్యులు ఆడ,మగ,పిన్న,పెద్ద తేడా లేక సెల్పీ ల యుగం మొదలయింది. ఇంక చెప్పేదేమి. రైలింజన్ తో సెల్ఫీ,జెట్ విమానంతో సెల్ఫీ, తారలతో సెల్ఫీ,నాయకులతో సెల్ఫీ. సెల్ఫీల పిచ్చి ముదిరిపోయి తగిలేది తప్పేది తెలియకుండా పోయింది.వీటిని మాధ్యమాల్లో ఎక్కించడం, లైకులు కొట్టేవాళ్ళు,అందంగా ఉన్నావని పొగిడే వాళ్ళు ఇలా ఇదొక వ్యసనమైకూచుంది.


ఇక్కడితో ఆగిపోలేదు.ఫోన్ లో వీడియో తీసేసావకాశమొచ్చింది. మాధ్యమాల్లోకి ఎక్కించడం మామూలైపోయింది. వీడియో యుగం మొదలయింది. సెల్ఫీ వీడియో. మాధ్యమాల్లో వీటిని వ్లాగ్స్ అన్నారు. వీడియోలు లైవ్ లో మాధ్యమాల్లో ఎక్కించడం మరో ముందడుగు. కొద్దికాలమే గడిచింది. ఒక మాధ్యమంలో ఓక వీడియో తీసిపెడితే ఎందుగురించైనా సరే, ఒక ప్రత్యేక చోటు. ఇక చెప్పేదేమి? సభ్యత,సంస్కారాలు అటకెక్కేసేయి. ఏది సభ్యత? అని అడిగే కాలమే వచ్చేసింది. ఇక స్త్రీల గురించిన వీడియోలు కొల్లలు, సామాజిక మాధ్యమాల్లో, బహుశః, అవే ఎక్కువేమో!సిగ్గు వదిలేసి అంతా అంగాంగ ప్రదర్శనలు బహువిచిత్రం. సినీ తారలకది వృత్తి,భుక్తి.  ఆ తరవాత సాహసకృత్యాల వీడియోలు, కొన్ని నిజం కొన్ని డీప్ ఫేక్, ఇలా కాలం నడచిపోతోంది.

ఎంతచెప్పుకున్నా తక్కువేగాని మొన్నీ మధ్య జరిగిన లోనావాలా దుర్ఘటనకి కూడా ఇదే కారణం అనుకుంటా.ఆ వీడియోలో వరదలో చిక్కుకున్నవారిని రక్షించే ప్రయత్నం చేసినవారికంటే వాళ్ళని వీడియోలు తీసుకున్నవారే ఎక్కువ కనపడ్డారు.

చివరిగా ఒక కొత్త దంపతులు తమ మొదటిరాత్రిని లైవ్ లో వీడియో ద్వారా మధ్యమాల్లో ప్రసారం చేయడం పరాకాష్ట. 

నేటికాలానికి కల్పితమేధస్సు కూడా తోడయింది.  ఇక ముందు ఇంకేమి రానున్నాయో! పరమాత్మకే ఎరుక.  


Saturday 13 July 2024

కమే తో ( Artificial Intelligence) .

 కమే (కల్పితమేదస్సు)తో ( Artificial Intelligence) కాసేపు


తారలు దిగి వచ్చినవేళ

మల్లెలు నడిచొచ్చిన వేళ

చందమామతో ఒక మాట చెప్పాలి,ఒక పాట పాడాలి.


కమే(Artificial intelligence) గురించి చాలాచాలా చెప్పుకుంటున్నారు, ఐనా పట్టించుకోలేదు. కాని కమే వాట్సాప్ లో, చేతిలో కొచ్చాకా కూడా మూడు రోజులు దాని మొహం చూడలేదు. నాలుగో రోజు చూదాం,అదేంటో అనే కుతూహలంతో వెళ్ళేను.


Q:మొదటగా అందమైన దయ్యం అన్నా!

A:ఓ మగాడి పోటో చూపించింది.

Q:దయ్యాలన్నీ మగవేనా?

A:నేను మల్టీలింగ్. నాకిచ్చిన ట్రయనింగ్ ప్రకారం చెబుతా!నేను ఏ విషయం మీదైనా, ఏకపక్షంగా మాటాడను, ఉన్న విషయం చెబుతాను,దేన్నీ గుర్తు పెట్టుకోను. ఇంకా ఏదో ఏదో చెప్పింది.


Q:ఒక చిన్న తెనుగు కథ చెప్పు, తెనుగు లిపిలో అన్నా!

A:నేను మల్టీ లింగ్, ఇప్పుడే అభివృద్ధి చెందుతున్నామని ఒక పెద్ద సోది చెప్పింది.


చాలాప్రశ్నలేసేను. ప్రతిదానికి చాట భారతమంత జవాబులే ఇచ్చింది. ఒక దానికి జవాబిస్తూ నాకే గుర్తుండవు, గుర్తూ పెట్టుకోనంది.


Q:ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశం నుంచి, భారతదేశానికి కమ్యూనిసం ఎగుమతి  అవుతోందా?

A:అదేం కాదు,ప్రజాస్వామ్యం, మానవహక్కుల పరిరక్షణ మాత్రమే చేస్తుంది.

Q:అంటే మానవహక్కుల పరిరక్షణ ముసుగులో ఎగుమతి చేస్తోందా? మానవ హక్కులు ఆదేశంలో రక్షింప బడుతున్నాయా? టాయ్ గన్ ఊపిన నల్లజాతి పదమూడేళ్ళ కుర్రాణ్ణి ఒక పోలీస్ ఆఫీసర్ కాల్చి చంపడాన్ని మానవహక్కుల పరిరక్షణేనంటావా?

A:ఈ విషయంలో చెయ్యవలసినది చాలానే ఉంది అని చెప్పుకొచ్చింది.

Q:తమదేశంలోనే మానవహక్కులు లేనప్పుడు ఇతరదేశాలకు వాటిగురించి లెక్చర్లు దంచడం బాగుంటుందా?

A:పాయింటే!మానవహక్కులు పరిరక్షింపబడాలనే కోరిక.

Q:ఈ ముసుగులో వారి అంతర్గత వ్యవహారాలలో తల దూర్చడం కాదా?

A:అలా అనుకో కూడదు.మానవ హక్కులపరిరక్షణే ముఖ్యం.


ఇంకా చాలా అడిగా! 

Q:ఇప్పటిదాకా మన సంభాషణ డిలీట్ చేసా! ఇవ్వగలవా?

A:నాకేం గుర్తుండవు. నా దగ్గర రుండదు, నువ్వెందుకడిగావో తెలుసు. కాని నీ బ్రవుసర్ కి గాని ,మరితరులుగాని దీన్ని జాగ్రత్తపెట్టి ఉండచ్చు.

Q:అంటే మన సంభాషణ మనకే పరిమితం కాదన్న మాటేగా!

A:పాయింటే అని ఆకుకుఅందని పోకకుపొందని సమాధానం చెప్పింది.


చివరగా థేంక్స్ అంటే చాలా ఆనందం అంది. అదేంటి? నీకు మానవ స్పందనలుండవన్నావుగా అడిగా!

నేను మానవుల లాగానే స్పందించేలా ట్రయినింగ్ ఇచ్చారు, అందుకే అలా అన్నానంది.


ఉంటా. అన్నా! వెల్కం అని ముగించింది.


ఇది జరిగి వారం పైమాటే! ఏంటో మళ్ళీ కమే మొహం చూడాలనిపించలా!


Thursday 11 July 2024

ఎందరో మహానుభావులు

 ఎందరో మహానుభావులు


ఉన్నారున్నారున్నారీలోకంలో

నరు

లున్నారున్నారున్నరున్నారీలోకంలో


తరతరాలుగా రకరకాలుగా

తమదారీ తీరే వేరుగా

నరులున్నారున్నారున్నారీ లోకంలో!


ఎప్పటిదో మాటైతే ఇప్పుడెందుకు చెప్పుకోడం?

రూపాయి పెంటమీద కనపడినా నాలికతో అద్దుకు తీసుకునే జనులున్నకాలంలో కనకే చెప్పుకోవడం.


ప్రపంచపోటీలో భారత్ క్రికెట్ టీం T-20 మేచ్ కప్ గెల్చుకున్నది, రోహిత్ శర్మ సారధ్యంలో, వరల్డ్ కప్ గెల్చుకున్న సందర్భంగా 125 కోట్ల సొమ్ము దక్కింది. బి.సి.సి.ఐ ఈ సొమ్మును ఆటగాళ్ళకి కోచ్ లకి జట్టు కప్ గెల్చుకోడానికి సాయపడిన అందరికి పంచింది, వారివారి అర్హతల ప్రకారం. ఈ సందర్భంగా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కు 5 కోట్లు ఇచ్చింది. ఇందులో 2.5 కోట్లు బోనస్ గా ఇచ్చింది. ఇచ్చినదానికి సంతోషం వెలిబుచ్చుతూనే ద్రవిడ్ తానుకూడా కోచ్ లందరిలాగా 2.5 కోట్లు తీసుకుంటానని ప్రకటించారు.


నాకు తెలిసి 

నాటికాలంలో, భరతుడు తల్లి అయాచితంగా సంపాదించి పెట్టిన రాజ్యం, నాకొద్దని రాముడే రాజని ప్రకటించి, రాజ్యాన్ని తిరస్కరించిన గొప్పవాడు.అంతటి మహానుభావులు పుట్టిన దేశంలో ఎందరో మహానుభావులు, అందులో నేటి కాలానికి రాహుల్ ద్రవిడ్ ఒకరు.


అయాచితంగానైనా తనదగ్గరకొచ్చిన ధనాన్ని తృణప్రాయంగా తిరస్కరించిన రాహుల్ ద్రవిడ్ కి జేజే లు

Tuesday 9 July 2024

పంపకాలు.

 పంపకాలు.


అనగనగా ఒక పల్లెటూరు. ఒక కలిగిన కుటుంబం, తల్లి తండ్రికి ఇద్దరు కొడుకులు. వారిని బాగా పెంచి విద్యా బుద్ధులు చెప్పించి, ప్రయోజకుల్ని చేసి, తల్లి తండ్రులు గతించారు, ఆస్థులు పంచుకోడానికో విల్లు రాసి. పంచుకుందాం లే అని కాలయాపన చేసేరు, అన్నదమ్ములిద్దరూ. ఒక రోజు తీరుబడిగా విల్లు తీసి చదువుకుని పంపకాలు మొదలెట్టేరు. 


పంపకాలు సాగుతున్నాయి చిన్న పెద్ద పోట్లాటలతో. చివరికొచ్చినట్టే అనిపించింది.


ఇంతలో తమ్ముడు అన్నా! నాన్న చేసిన పంపకాలలో తేడా ఉంది, కొన్ని కొన్ని విషయాలు  నాన్న విల్లులో రాయలేదు.


నీవాటాకొచ్చిన పొలంలో పెద్ద మోటర్ వేయించాడు, నా వాటాకొచ్చిన పొలంలో చిన్న మోటర్ వేయించాడు. నాది నాలుగంగుళాల బోరు, నీది ఆరంగుళాల బోరూ. మోటర్లు వేయించినప్పటినుంచి నీవాటా పొలంలో మోటరుకి ఖర్చు ఎక్కువైంది, నాకు ముదరా రావాలి. ఇటువంటివి చాలా ఉన్నాయి. అంతే కాదు నువ్వు నాకంటే మూడేళ్ళు ముందు పుట్టేవు. నీకు ఖర్చు చాలా పెట్టేరు,  నువ్వు ఇంతకాలం ఉమ్మడిలో నా కంటే ఎక్కువ ముద్దలే తిన్నావు,రోజూ, నేను తక్కువ తిన్నాను. తిండి విషయం లో, దీనికీ ముదరా రావాలన్నాడు. నీకు నాకంటే ముందు పెళ్ళి చేసేరు,పెళ్ళామొచ్చింది, ఆవిడా తింటూనే ఉందిగా. నీకో కొడుకు పుట్టేడు, వాడు పెద్ద మనవడని మురిసిపోయి, ఎవేవో చేయించారు. వాటికి ముదరా చూసుకోవాలిగా. ముదరా  ఇలా చెప్పుకుపోతున్న తమ్ముణ్ణి చూసి, అన్నకి ఏం చెప్పాలో అర్ధం కాక తలపట్టుకున్నాడు. 


ఇది నిజంగా జరిగింది, నేను ప్రత్యక్షంగా చూసేను.  

Thursday 4 July 2024

ఉద్యమేన హిః సిద్ధ్యంతి

ఉద్యమేన హిః సిద్ధ్యంతి 


ఉద్యమేన హిః సిద్ధ్యంతి 

కార్యాణి న మనోరథైహిః 

న హి సుప్తస్య సింహస్య

ప్రవిశంతి ముఖే మృగాః 


తలుచుకున్నంతలో పనులు పూర్తైపోవు,ప్రయత్నంతోనే సిద్ధిస్తాయి.నిద్రపోతున్న సింహం నోట్లో జంతువులు చొరబడవు.


మనసులో కోరికలు పుడుతూనే ఉంటాయి. వాటిలో కొన్నిటినైనా నెరవేర్చుకోవాలంటే, ప్రయత్నం చేయాలి. సింహం నోరు తెరుచుకుని నిద్రపోతున్నంతలో మృగాలు నోట్లో చొరబడతాయా? అంటే, వేటాడక నిద్రపోతున్న సింహం నోట జంతువులు ఎలా పడవో, అలాగే పనులు కూడా సిద్ధించవు,ప్రయత్నం లేక.ప్రయత్నించు, ప్రతి ఓటమి గెలుపుకు మార్గం. 

అనగననగ రాగ మతిశయిల్లుచునుండు
తినగ తినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వధాభిరామ, వినుర వేమ


పై కవిగారు చెప్పినదాన్ని తాత మరికొంచం వివరించారు. సంగీతం పాడేవారు నిత్యమూ అభ్యాసం చేస్తూనే ఉంటారు. దానిని నేటికిన్నీ మా పల్లెలలో అనడం అనే అంటారు. ఇలా రోజూ అంటూ వుంటే రోజు రోజుకి రాగం పాడే విధం మెరుగుపడుతూ ఉంటుంది.ఇది అభ్యాసంతోనే సాధ్యం. అభ్యాసము కూసువిద్య గువ్వలచెన్నా! అన్నారు మరో కవి.అలాగే వేముని నేలవేము అంటారు. ఇది చాలాచిన్నమొక్క. బహుచేదు. ఆయుర్వేద వైద్యంలో వాడతారు. దీనిని నిత్యం సేవిస్తే కొంత కాలానికి నిజంగానే తియ్యగా ఉంటుంది. రాచ ఉసిరి కాయను కొరికితే పుల్లగా వగరుగా ఉంటుంది, కాని ఆ తరవాత నోరంతా తియ్యగా ఐపోతుంది. సాధన తోనే పనులవుతాయి, కూచుంటే పనులు కావని తాత మాట. మరొకరు
కృషితో నాస్తి దుర్భిక్షం 
జపతో నాస్తి పాతకం
మౌనేన కలహో నాస్తి
నాస్తి జాగరతో భయం.

ఇక చాలు ఇళ్ళకు వెళ్ళిపోదామా!!!!.

Tuesday 2 July 2024

డబ్బుతోనే ఉందయ్యా! అంతా!!!

 ధనమూలమిదం జగత్


త్యజంతి మిత్రాణి ధనైర్విహీనమ్ 

పుత్రాశ్చ దారాచ సుహృద్జనాశ్చ

తమర్ధవంతమ్ పునరాశ్రయంతి

అర్ధోహి లోకే మనుషస్య బంధుః

(ఆచార్య చాణక్య)


డబ్బులేనివాడిని భార్య,కొడుకులు, మిత్రులు,  మంచివాళ్ళు కూడా  వదిలేస్తారు. డబ్బు సంపాదిస్తే మళ్ళీ వీరంతా చేరతారని చాణక్యుని మాట.


డబ్బు లేనివాడు డుబ్బుకు కొరగాడనీ ఈసడించారో కవి. నడపీనుగు వచ్చెనంచు భార్య ఈసడిస్తుందన్నారు మరొకరు. 

అంతెందుకు? ధనమూలమిదం జగత్ అన్నాడు లక్ష్మణుడు.  డబ్బు సంపాదించు అంతా చుట్టూ చేరతారు మళ్ళీ!


ఎప్పుడు సంపదగల్గిన

అప్పుడు బందుగులు వత్తురది ఎట్లన్నన్

దెప్పలుగ చెఱువు నిండిన

గప్పలు పదివేలు చేరు గదరా సుమతీ!


డబ్బుతోనే ఉందయ్యా! అంతా!!!