Thursday, 31 December 2020

2021 కొత్త సంవత్సరం రాక ఆనందం-అనుభవించు రాజా-అనుభవించు.


Courtesy:Whats app 
2021  కొత్త సంవత్సరం రాక ఆనందం-అనుభవించు రాజా-అనుభవించు.

Wednesday, 30 December 2020

పీత్వామోహమయీం ప్రమాదమదిరా

 పీత్వామోహమయీం ప్రమాదమదిరా


ఆదిత్యస్యగతాగతై రహరహ స్సంక్షీయతే జీవితం

వ్యాపారై ర్బహుకార్యభారగురుభిః కాలో న విజ్ఞాయతే

దృష్ట్వా జన్మజరావిపత్తిమరణం త్రాస శ్చనోత్పద్యతే

పీత్వామోహమయీం ప్రమాదమదిరా మున్మత్తభూతం జగత్.


సూర్యుని ఉదయాస్తమాలతో ఆయువు తరిగిపోతోంది. ఎడతెగని పనులలో మునిగితేలు జనులు అది గుర్తించకున్నారు.పుడుతున్నవారిని, చనిపోతున్నవారిని, ముసలివాళ్ళవుతున్నవాళ్ళని,కష్టాలు పడుతున్నవాళ్ళని చూస్తూ కూడా జనులు భయపడటం లేదు. కల్లుతాగి పిచ్చెక్కినట్టు అజ్ఞానం లో పడి ఉంది, జగత్తులో జనసమూహం. అనగా తెలుసుకోవలసినదానిని తెలుసుకునే ప్రయత్నం చేయటం లేదు.


తెల్లవారుతోంది పొద్దుగూకుతోంది, రోజులు,వారాలు,నెలలు, సంవత్సరం 

గడచిపోతోంది.   కొత్త సంవత్సరం   వచ్చేస్తోంది, పండగ చేసుకుంటున్నాం, ఎలా?సంవత్సరం ఆఖరిరోజు, అర్ధరాత్రి దాకా మేలుకుంటున్నాం. ఆడా మగా తేడా లేక గుమిగూడుతున్నాం, మన దీపాలు మనమే ఆర్పుకుంటున్నాం. పన్నెండుకి చీకట్లో కొత్త సంవత్సరం వచ్చిందని అరుస్తున్నాం, దీపాలు వెలిగించుకుంటూ తాగుతున్నాం, వాగుతున్నాం, ఊగుతున్నాం. ఆ తరవాత ఒళ్ళు తెలియని స్థితిలో ఆడా మగా తేడా లేక మోటర్ సైకిళ్ళెక్కి హేపీ న్యూ ఇయర్ అని అరుస్తూ ఊరు తిరుగుతున్నాం. ఇదేమిరా అని అడిగినవారిని ఈసడిస్తున్నాం. సంస్కారం లేనివాళ్ళు అంటున్నాం. మన పయనమెటు?

  ఇదంతా ఎందుకో తెలీదు, అదో ఆనందం, తుత్తి. కాని ఒక సంవత్సరం ఆయుస్సు గడచిపోయిందనుకోటం లేదు. గడచిన సంవత్సరం ఎలా గడచిందీ? రోగం,భయం, పుట్టేవాళ్ళు పుడుతున్నారు, పుట్టినరోజు పండగలూ చేస్తున్నాం, పెరిగేవాళ్ళు పెరుగుతున్నారు, కష్టపడేవాళ్ళు     పడుతున్నారు, ముసలాళ్ళవుతున్నారు ఛస్తున్నారు, వాళ్ళని పంపించేసి వస్తున్నాం. ఇంత మన కళ్ళ ఎదుట జరుగుతున్నా, పనుల్లో పడిపోయి తిరిగుతున్నాం. రేపు మనకూ ఇదేగతి పడుతుందనే భయమే కనపడటం లేదు. మూము గుడ్డలు కట్టుకోవలసివచ్చినా, తిరిగేస్తున్నాం లేకపోయినా. కొత్త దయ్యమొచ్చింది, భయమేలేదు. అయ్యో కాలం ఇలా జరిగిపోతూ ఉంది, ఈ పుట్టుక చావుల అంతరార్ధం ఏమిటీ? ఈమధ్య కాలంలో కల్లుతాగినపిచ్చెక్కిన కోతిలా, మోహంతో డబ్బు వెనక ఎందుకు పడిపోతున్నాం, దీనికి కారణం అన్వేషించటం లేదు. అసూయ, ద్వేషాలతో కొట్టుకుంటున్నాం, ఇదే సుఖం అనుకుంటున్నాం,ఇంతేనా ఈ కతంతేనా?  

 అనుదినమున్ నశించు బరమాయువు సూర్యునిరాకపోకలన్

ఘనబహుకార్యభారముల గాలము పోవుట గానరాదు సం

జననజరామయంబులును జావునుజూచి భయంబు లేదు, దు

ర్జనభువనంబు మోహమదిరారస విహ్వల మయ్యె నయ్యయో...లక్ష్మణ కవి

స్వస్తి


Monday, 28 December 2020

బుఱ్ఱలో గుంజుంటే బూడిదమ్ముకు బతకొచ్చు.

 బుఱ్ఱలో గుంజుంటే బూడిదమ్ముకు బతకొచ్చు.

''కుర్రోడితో యేపారం బెట్టిద్దామనుకుంటన్నాను, ఏం యేపారం పెట్టించమంటావూ?'' అడిగాడు మా సుబ్బారాజు.

''బుఱ్ఱలో గుంజుండాలిగాని బూడిదమ్ముకు బతకొచ్చు'' చెప్పేడు సత్తిబాబు.

 నువ్వన్నీ ఇలాగే చెబుతావు. అన్నీ యతి కుతం మాటలే 

విసుగు చూపాడు మా సుబ్బరాజు.

 ''ఎవడూ మొదటిరోజే అంబానీ ఐపోడయ్యా 

నీకు తెలుసా అంబానీ పెట్రోల్ బంకులో డెలివరీ బాయ్ గా పనిజేసేడు. కష్ట పడటానికి ఇష్టపడాలి. పనిజేయాలె. ఫలితమూ వస్తది.మంత్రసానితనం ఒప్పుకున్నాకా బిడ్డొచ్చినా పట్టాలె గొద్దొచ్చినా పట్టాలె.ఇదో సావెతలే అన్నా!''

''సరెలేవో సంగతేదో చెప్పరాదె!'' అరిసిండు సుబ్బరాజు. 

''తెల్లోడైనా నల్లోడైనా ఎవుడైనా వండుకోవాలె, తినాలె. వండుకున్న అంట గిన్నెలూ తోముకోవాలె''. 

''నీకన్నీ యాలాకోలమేనయ్యా'' అన్నాడు సుబ్బరాజు.

''నిజం జెపితే అలాగే ఉంటదిలే

నిన్నటి దాకా అంట గిన్నెలు తోముకోడానికి డిటర్జంట్లు, సబ్బులు  వాడేరు, ఇప్పుడో ఆర్గానిక్ బూడిద అరకేజి నాలుగొందలట. మంచేపారం. పిడకలు కొనిపించు, బూడిద చేయించు, దాన్ని పేక్ చేయించు అరకేజి మూడొంద ఏభై అను, బయో బూడిద అని యాడ్లేయించు, అరకేజి కొన్నోళ్ళకి స్పూన్ బహుమతను. ఐదు కేజిలు కొన్నోడికి మూడు వేలను, టీ కాసుకునే బొచ్చి గిఫ్ట్ పెట్టు. యాపారమే యాపారం.నిన్నటిదాకా బూడితతో అంట గిన్నెలు తోముకోడం అనాగరికమన్నారు. అందుకే సబ్బులు వచ్చాయి, కొన్నాం కాదా. ఇప్పుడు సబ్బులు వదలటం లేదు పూర్తిగా కడిగినా, అంచేత అనారోగ్యాలు కేన్సర్లు వస్తన్నాయంటన్నారు. మళ్ళీ ఆర్గానిక్ బూడిద ట్రెండవుతోంది. నువ్వు కొత్త ట్రెండ్ మొదలెట్టు. ఆర్గానిక్ బూడిడైతే పర్యావరణానికి నష్టం అందుకు బయో బూడిద వాడండి అని పిడకల బూడిదమ్ము. ఎలా ఉంది ఐడియా?'' అగాడు సత్తి బాబు. 

''అదిగాదుగాని మరోమాట చెప్పు'' అడిగాడు సుబ్బరాజు. 


''నీకేటి నేన్జెప్పింది బోదపడలా! ఏటిజేస్తాం. ఒక జరిగిన సంగతి చెప్తా ఇనుకో. మొన్నో పాలి కిరానా దుకానానికెల్లా, అదేలే స్టోరో ఎదోనట గందా? నీ కాడ ఎండు పళ్ళేటున్నాయన్నా? ఆడేటి తెల్లమొకమేసినాడు. అదెరా బాబూ డ్రై ఫ్రూట్స్ ఏటున్నాయన్నా? కిస్మిస్,డేట్స్ అంటా చెప్పుకొచ్చినాడు.ద్రాక్ష తీసుకున్నా, మరేదో కావాలన్నా లేవన్నాడు, తెచ్చినా అమ్మకం కావన్నాడు. 'మనూళ్ళో డ్రై ఫ్రూట్స్ షాప్ పెట్టినోడు లేకపోయె' అని గొణుక్కుంటా వచ్చేసినా.'' 

''ఐడియా. నేను గొణుక్కున మాట షాపోడు ఇన్నాడు. వారం కితం ఓ కుర్రోడో పేకటొట్టుకొచ్చి నమస్కారమెట్టి నిలబడినాడు. ఏటో ఒవుళు నువ్వు? అడిగినా. నేను స్టోరతని కొడుకునని మొన్న మీరన్న డ్రై ఫ్రూట్ షాప్ పెట్టేను. మీరడిగిన వెరైటీ ఇది. ఉంచండి'' అన్నాడు. ''ఎంత అంటే పేకట్ నూట ఏబై అండి, మీకిది బహుమతి'' అన్నాడు. ''అదేటి మొదటి సారిగదా'' అంటే

''మీ ఇడియా సార్. ఆశీర్వదించండి. నా shop కి రండి'' అని ఆహ్వానిం చాడు

''యాపారం ఎలా ఉందన్నా?"

''పర్లేదు సార్! మీలాఐడియా ఇచ్చే వాళ్ళుంటే దున్నేస్తా'' అన్జెప్పేడు.

''పర్లేదురా అబ్బాయి, పైకొస్తావన్నా!'' వెళుతూ, ''నా షాపులో ఎప్పుడూ మీకు స్పెషల్ రేటు సార్'' అని చెప్పెళ్ళేడు.

''సంఝే!!! నువ్వేటి యాపారం సెయ్యనేవు, కొర్రోణ్ణి ఒగ్గీ ఆడే జూసుకుంటాడు. సలాలు ఊరికే చెప్పీరు, కరుసవుద్ది.నీల్లలో పారీస్తేనే ఈతొస్తది''. అన్జెప్పి తుండుగుడ్డ బుజానేసుకుని ఎలబారిపోనాడు మా సత్తి బాబు.


Saturday, 26 December 2020

శకారః

 శకారః

అకారాంతః పుల్లింగో రామశబ్దః రాముడు. 

ఇదేంటి? శకారుడన్నారు, వ్యాకరణం చెబుతారేంటి?

 ఆ కారాంతః స్త్రీలింగో సీతా శబ్దః, సీతడు. 

యస్యజ్ఞాన దయా సింధో 

గోడదూకితే అదే సందో

సీతడు కాదూ సీతా అనాలి సీత కాదు. లలిత అనకూడదు లలితా అనాలి.

మీకేదో అయిందీవేళ. 

ఆగండి సావీ :)

ఈ శకారుడు అనే కాణేలీ పుత్రుడు మృఛ్ఛకటికం అనే సంస్కృత నాటికలో ఒక పాత్ర. మృఛ్ఛకటికం అంటే మట్టిబండి. అనగా మట్టితో చేసిన ఆటబండి. 

ఒక పాత్రకే అంత గొప్ప పేరా? 

జేంస్ బాండ్ కి అంత పేరు రాలేదేంటీ? ఈయన విశేషం చెబుదురూ....

ఈ శకారుడు ఒక రాజుగారి రాణీ గారి తమ్ముడు. అదేంటి రాజుగారి బావమరదని చెప్పచ్చుగా? అలా చెప్పేస్తే గొప్పేంటీ? ఈ రాణీ గారి తమ్ముడు బలే వింత వింత అపభ్రంశం పనులు చేస్తాడు, నాటి కాలానికి నవ్వొచ్చేటట్లు వింతగానూ మాటాడతాడు. చేసేవన్నీ...వద్దులెండి అభిమానులకి కోపమొస్తుంది. వీరికి నేటికీ అభిమానులున్నారు మరి. 

ఈ శకారుడు వసంత సేన అనే భోగప్పిల్ల వెనక పడ్డాడు. అదేమో ఛీ కొట్టింది, అంతతో ఊరుకుందా? మరో అందగాడిని ప్రేమించింది. ఇక అక్కడినుంచి మొదలవుతాయి, ఈ శకారుని వన్నెలు చిన్నెలూ! అసలే రాణీగారి తమ్ముడు,రాజుగారి బావమరదాయె, ఇతనిలో రాజ్యాంగేతర శక్తి కూడా బయటపడుతుంది.  శూద్రక మహాకవిరాసిన ఈ నాటకాన్ని తిరుపతి వేంకట కవులు తెనిగించారు.శకారుని కొన్ని పలుకులు........


1.ఏల పోయెదు పాఱిపోయెదవు తొట్రు

పాటుతో, దయయుంచు చంపము లతాంగి

బొగ్గు నిప్పులలోబడ్డ పొలుసువలెనె

కాల్చుచున్నాడు నామది కంజశరుడు.


2.ప్రక్కపై నిద్రయైనను బట్టకుండ

నాకు మదను ననంగు మన్మధుని వృద్ధి

పఱచి,దశకధరునకు లోబడిన కుంతి

పగిది నెట కేగెదే తొట్రుపడుచు పడుచ.


3.నాణెంబులు హరించు నలినాస్త్రు వేత్రంబు 

నంజుడు తినులంజ, నాట్యమాడు.

వెలది,చప్పిడి ముక్కు గలనాతి, వంశంబు 

లడగించు కామిని,యవశురాలు,

పూవింటివాని సొమ్ములపెట్టె, విలువైన

భూషణములుదాల్చు పువ్వుబోడి

డబ్బిచ్చి చొరగనాటకంబుగల్గని

మేడగాపురమున్న వాడ వెలది


పడపుమగువల కెల్లర కొడయురాలు

నంచు బది మంచిపేర్లు కల్పించినాడ.



.4.గల్లురని నగల్ మ్రోయగ వెళ్ళెదేల

రామునకు జంకి పరువెత్తు ద్రౌపదివలె

హనుమ, విశ్వావసు చెల్లెలగు సుభద్ర

పగిది,నిను బల్మి హరియించువాడ జూవె


5.అడవిలో వేటకుక్కల కాడునక్క

యడలుగతి బల్మి మాచేత నభిసరింప

బడుచు బరువెత్తె దేటికే వడిగ వేగ

మూలముట్టుగ నా డెందము హరించి.


6.ఏను సుశ్శాసనువలె నిపుడు నీదు

కొప్పుదొరకొందు, జమదగ్ని కొడుకు భీము

సేను డేతెంచి యాపునో చాన కుంతి

కాత్మజుండగు న్దశకంఠు డాపగలడొ?


7.ఉత్తరింతువొ యీవాడికత్తి నీదు

కుత్తుకను బళ్ళుమన దలగొట్టి నిన్ను

జంపుదునో చావుమూడిన జనుడు బతుక

డెందు, నీవేల పాఱిపోయెదవు గోల 


8.కటికచీకటిలోగన్ను గానకుండ

బోవుతఱి బూవుదండల తావివలన

నట్టెగుర్తించి కీల్జడ పట్టుకొంటి

యాజ్ఞసేనిని చాణుక్యుడట్లు నేను.


ఇలా ఈ శకారుని పద్దేలు తిరుపతికవులు రాశారు.చాలా ఉన్నాయి కొన్నే నేను ఇక్కడ ఇవ్వగలిగేను. ఇక ఇతనో రాజ్యాంగేతర శక్తి, కాణేలీ పుత్రా అని పిలిచేవారితనిని.ఇక ఇతను రాష్ట్ర శ్యాలకుణ్ణి చెప్పుకునేవాడు. ఇంతటి ఘనుడు బోగం పిల్ల ఛీ కొడితే పీక నులిపేడు, చచ్చిందని కంగారు పడ్డాడు, హత్య చేసేననుకుని హత్యను బోగంపిల్ల ప్రియుడి మీద నెట్టేసేడు. ఇదీ ఈ శకారుని వృత్తాంతం, కొద్దిగా. ఇంతకీ ఏమిటితని గొప్పా? రాజుగారి రాణిగారి తమ్ముడు. ఇతనేం రాజు కాదు మంత్రి కాదు, సేనాపతికాదు, చివరికి భటుడు కూడా కాదు, దర్పం, అధికారం వెళ్ళబోశాడు. ఇటువంటివాడే మరొకరు....ఇంతకంటే ముందువాడే అతనే దుర్యోధనుడు.


దుర్యోధనుడు రాజు కాదు, రాజు ధృతరాష్రుడు, యువరాజా కాదు యువరాజు ధర్మరాజు, మంత్రా? కాదు, సేనాపతా? కాదు చివరికి భటుడు కూడా కాదు. ఇంతకీ ఇతనెవరు రాజుగారి పెద్దకుమారుడు. ఏ అధికారమూ లేదు కాని అధికారం వెళ్ళబెట్టి చివరికి యుద్ధానికి కారకుడై తొడలు విరిగి చచ్చాడు. నేటి కాలానికి ఇటువంటి రాజ్యాంగేతర శక్తులు ఉన్నాయా? ఎవరేనా గుర్తొచ్చారా? అస్తు.



 





Thursday, 24 December 2020

ధైర్యం చెడుతుంది.

 ధైర్యం చెడుతుంది.


ధైర్యం చెడుతుంది, ఎప్పుడూ? 

ధర్మం చెడినపుడు. 


ధర్మం ఎప్పుడు చెడుతుంది?

మనుషుల్లో సత్యం చెడినపుడు. 


సత్యం ఎప్పుడు చెడుతుంది?

మనుషుల్లో కామ,క్రోధ, లోభ,మద,మత్సరాలు హద్దులు లేక పెరిగిపోయినపుడు,వీటినే అరిషడ్వర్గాలంటారు.


అరిషడ్వర్గాలెప్పుడు పెరుతాయి?

మనిషిలో దురాశ పెరిగినపుడు, 


దురాశ ఎప్పుడు పెరుగుతుందీ? 

స్వార్ధం అలవిగాక పెరిగినపుడు. 


స్వార్ధం ఎప్పుడు పెరుగుతుందీ?

కాంతాకనకాలమీద మోజు పెరిగినపుడు. 


కాంతా కనకాలమీద మోజులేనివారున్నారా?

ఇద్దరున్నారు!


ఎవరు వారు?

ఒకరు పుట్టనివాళ్ళు, మరొకరు చచ్చినవాళ్ళూ!


 అందరికి కాంతా కనకాల మీద మోజు ఉంటుంది! అది సహజమైనదిగా ఉండాలంటారు పెద్దలు.....


సహజసిద్ధంగా ఉండవలసినవేంటీ?


ఆపదలందు ధైర్యగుణ మంచితసంపదలందు దాల్మియున్

భూప సభాంతరాళముల బుష్కల వాక్చతురత్వమాజి బా

హాపటు శక్తియున్ యశమునందనురక్తియువిద్యయందు వాం

ఛాపరివృద్ధియున్ బ్రకృతి సిద్ధగుణంబులు  సజ్జనాళికిన్..... లక్ష్మణ కవి


ఆపదల్లో ధైర్యం కావాలి, సంపదల్లో ఓర్పు కావాలి.ఆపద మొక్కులూ సంపద మరుపులూ అనేది ఒక నానుడి.సభలలో వాక్చాతుర్యం కావాలి, ఇది మంది మంచికై ఉండాలి.యుద్ధంలో వీరత్వం కావాలి, కీర్తి మీద కోరిక ఉండాలి,నిత్య విద్యార్ధి ఐ ఉండాలి. ఇవే ప్రకృతి సిద్ధంగా వచ్చే గుణాలు.

విపది ధైర్య మధాభ్యుదయే క్షమా

సదసి వాక్పటుతా,యుధి విక్రమః

యశసి చాభిరతిర్వ్యసనం శ్రుతౌ

ప్రకృతిసిద్ధ మిదం హి మహాత్మనామ్


Tuesday, 22 December 2020

మూడు తెనుగు ముక్కలున్న పద్యం./మూడు తెనుగు ముక్కలున్న తెనుగు పద్యం

 అటజని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ

పటల ముహుర్ముహుర్ లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన
స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్
గటక చరత్కరేణు కర కంపిత సాలము శీతశైలమున్

ఈ పద్యం మనుచరిత్రలో రెండవ ఆశ్వాసం లోది. మను చరిత్ర తెలియని తెనుగువారుంటారనుకోను. చిత్రమేమంటే ఈ పై పద్యంలో మొదటి మూడు మాటలు తప్పించి తెనుగు లేదు. ఆ మాటలు అట జని కాంచి అన్నవే! మిగిలిన పద్యమంతా సంస్కృతం అంటే నమ్మలేం. నిజానికి మనం మాటాడే తెనుగులో చాలా సంస్కృత పదాలే ఉంటాయి, ఉన్నాయి. నేడు ప్రపంచం  సంస్కృతం వెనక పరిగెడుతోంది, ముఖ్యంగా జర్మనీ, అంటే నమ్మేలా లేదు కదూ, కాని ఇది నిజం.మనం మాత్రం సంస్కృతం అంటే మృత భాష అనేస్తున్నాం. చిత్రం మృత అన్నది కూడా సంస్కృత శబ్దమే.  కంపూటర్ కి అనువైన భాష సంస్కృతం అంటే నమ్మలేరు. మరో సంగతి కూడా సంస్కృతం ఇంగ్లీష్ కీ బోర్డ్ మీద టైప్ చేయడం సులువు. 



ఈ పై పద్యంలో మాటలు తెలిసినంత వరకు విడదీయండి. అట, జని,కాంచె, ఇవి తెలుగనుకున్నాం కదూ. ఇక సంస్కృతం మాటలు చూడండి. అంబర, చుంబి, శిరః, పటల, ముహుర్ ముహుర్, తరంగ,మృదంగ,నిస్వన,, పరిఫుల్ల, కలాప, కలాపి, చరత్, కరేణు, కర,కంపిత, సాలము, శీత, శైలము.ఈ మాటలన్ని తెనుగు నిఘంటువులో అర్ధాలు దొరుకుతాయి. :) కొన్ని పదాలకి నిఘంటువు కూడా చూడక్కరలేదు కదూ
ఇది తెనుగు పద్యమా? సంస్కృత పద్యమా?

అట జని కాంచె అన్నవి రెండు గణాలుగా విడదీస్తే అటజ మూడు లఘువులు నగణం జకాంచె లఘు,గురువు,లఘువు మధ్య గురువు జగణం. అంటే పద్యం నడక నజభజజజర అనేగణాలతో నడుస్తుందని తెలిసిపోతోంది. దీనికో పేరు పెట్టేరు అదే చంపకమాలా వృత్తం. 

లఘువు ఒక మాత్ర, గురువు రెండు మాత్రలు సమయం పట్టేది. ఈ లఘు గురువులకు బైనరీ తో సంబంధం చెప్పచ్చు, అలాగే నేటి డిజిటలైజేషన్ కి ఇదే మూలం అంటే కూడా నమ్మకం కలగకపోవచ్చు. మాటల్ని గణాలుగా విభజించడం పద్యంగా చేయడం పెద్ద కష్టం కాదు. కాని అందమైన, అర్ధవంతమైన, కాలానికి నిలిచే పద్యం రాయడమే కష్టం.

ఈ సారి తెనుగు మాటలతో పద్యం రాయండి.  
 ప్రేరణ:విన్నకోటవారు. ధన్యవాదాలు.

Sunday, 20 December 2020

అదృష్టవంతుని చెరిపేవాడు

అదృష్టవంతుని చెరిపేవాడు

 రాతిరి మూషికంబు వివరం బొనరించి కరండబద్ధమై

భీతిలి చిక్కి యాస చెడి వెద్దయు డస్సినపామువాత

సం పాతము జెందె దానిదిని పాము దొలంగె బిలంబుత్రోవనే

యేతఱి హానివృద్ధులకు నెక్కటి దైవము కారణం బగున్.


ఒకడు, ఒక తాచును పట్టుకుని బుట్టలో పెట్టి ఇంటవుంచాడు. పాము ఆకలితో నకనకలాడుతూ ఉంది. ఏమీ చేయలేక అసహాయoగా పడి ఉంది,ఆశ వదులుకుంది.ఆకలికి తోడు రేపేం జరుగుతుందో తెలీదు. ఇంతలో ఒక ఎలుక ఆహారం కోసం వెతుకుతూ, బుట్టకి కన్నం చేసి లోపలికి ప్రవేసించింది, ఆకలితో ఉన్న పాము ఎలుకను మింగి, ఆ ఎలుక చేసిన కన్నంలోంచి పారిపోయింది. ఇది దైవ వశాత్తు జరిగింది. అంటే అదృష్టవంతుని చెరిపేవాడు, దురదృష్టవంతుని బాగు చేయగలవారు లేరు, ఒక్క దైవం తప్పించి.అదృష్టవంతునికి అవకాశాలు కలసివస్తాయి.అననుకూల పరిస్థితులలో వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని ఆపద నుంచి బయట పడటం దైవయోగమే!దైవయోగం లేకనే ఎలుక బలైపోయింది, అన్న వస్త్రాలకి పోతే ఉన్నవస్త్రాలే పోయాయి, ప్రాణమే పోయింది. తనపై విసిరిన ఇటుకలతోనే కోట కట్టుకున్నవాడు అదృష్టవంతుడు.నేటి కాలానికి ఉదాహరణ చెప్పగలరా? 


భగ్నాశస్య కరణ్డ పిణ్డితతనో ర్ల్మానేనిన్ద్రియస్య క్షుదా

కృత్వాఖు ర్వివరం స్వయం నిపతితీ నక్తం ముఖే భోగినః

తృప్తస్త త్పిశితేన సత్వర మసౌ తేనైన యాతః పధా

స్వస్థా స్తిష్ఠత దైవమేవ హి పరం వృద్దౌ క్షయే కారణమ్...

Friday, 18 December 2020

ధనం-పరిశేషన్యాయం

 ధనం-పరిశేషన్యాయం


దానం భోగో నాశ స్తిప్రో గతయో భవంతి విత్తస్య

యన్న దదాతి న భుజ్త్కే తస్య తృతీయా గతి ర్భవతి


ధనమునకు దానము, భోగము, నాశము అనే మూడు గతులు చెప్పబడుచున్నవి. మొదటి రెండునూ లేని ధనము మూడవ గతినే పొందును.


దానము, ఈ పేరు చెబుతేనే చేతులు మోరలు దిగిపోయి వెనక్కి పోతాయి. చూస్తూ చూస్తూ ఒక్క రూపాయి దానం చెయ్యలేము. ఎండలో చెమటలు కక్కుకుంటూ మనల్ని ఎండ తగలకుండా తీసుకొచ్చిన రిక్షావానికి నాలుగు రూపాయలకి గీచి బేరమాడి, చిల్లరలేకపోతే దానికోసం పంపి రూపాయి మిగుల్చుకునే వాళ్ళం.ఇదే ఒక్కరినో ఉద్దేసించక్కరలేదు. నేడు అందరం ఇలాగే ఉన్నాం, ఎక్కడో ధర్మాత్ములు కొందరున్నారు, వారి గురించిన మాట కాదిది. దానం చేయగలిగి చేయకపోవడమెంత తప్పో దానం చేయడానికి తాహతు లేక దానం చేయడమూ పొరబాటే. అన్నిదానములకన్న అన్నదానము మిన్న, కాదననుగాని విద్యాదానం మరింత మంచిది. ఇలా వ్యయమైన సొమ్ము సద్గతి పొందినదే.


ఇక రెండవది భోగం. అనుభవమే భోగం, ఎంత తగినంత. అంటే సౌకర్యమైన ఇల్లు, భోజనము, ఇతర సౌకర్యాలకి తగినంత, ఆడంబరాలు కాదు. తనకు తనవారి కొరకు ఖర్చు పెట్టని సంపాదన వ్యర్ధం. మొన్ననీ మధ్య ఒకరితో మాటాడుతుంటే, ధనం సంపాదనకే సమయం పూర్తిగా వెచ్చిస్తే అనుభవానికి సమయం ఉండదంటే! సంపాదించలేక, సంపాదించే వారిని చూసి అసూయ కొద్దీ అంటున్న మాటన్నారు. ఏమో! నాకైతే అనుభవించలేని ధనం ఎందుకు? అంకెలలో చూసుకోడానికా? బంగారం,వెండిలలో చూసుకోడానికా? ఇళ్ళు పొలాలలో చూసుకోడానికో తెలీదు. ధనం, పాడె కొమ్ములకి కట్టరు, కూడా రాదు,తీసుకెళ్ళలేం. గోరెడు మట్టి కూడా రాదు, అలా ఒక్కొకరు తీసుకెళ్ళగలిగితే ఈ భూమండలం ఉండేది కాదు. ఒకప్పుడు శవం మీద పువ్వులు రూపాయలు జల్లేవారు, తీసుకెళ్ళేటపుడు. శవయాత్రకి ముందు మంగళవాద్యాలు కూడా ఉండేవి, నేటి వారు నమ్మలేరు, కాని ఇది నిజం..ఇప్పుడదీ మానేశారు.ఇలా ఖర్చైన ధనమూ సద్వినియోగమే..



మూడు రకాలు చెప్పి మొదటి రెండూ కాదంటే మూడవదనే అర్ధం. దీనే పరిశేషన్యాయం అంటారు. 

పై రెండు విధాలా ఖర్చుకాని ధనం చివరికి దొంగలకిత్తురో దొరలకవునో... ఎవరికి తెలుసు?కడుపున పుట్టిన బిడ్డలే, తల్లి తండ్రులను, హింసించినా,పరిహసించినా,అవమానించినా, వారికే తమ సొమ్మును ఇచ్చి పోయేవారి ధనం కూడా మూడో కోవకే చెందుతుందేమో! కలిగినంతలో దానం, అనుభవం ఆనందాన్ని కలగజేస్తాయి.

ఇది తెలియనివారెవరు? కాని సమయానికి మాయ తెర కప్పేస్తుంది.


దానము భొగము నాశము

పూనికతో మూడు గతులు భువి ధనమునకున్

దానము భోగము నెఱుగని

దీనుని ధనమునకు గతి దృతీయమె పొసగున్.....లక్ష్మణకవి  

Wednesday, 16 December 2020

నిద్ర

 నిద్ర

ఆహార నిద్రా భయ మైధునాలు సర్వ జీవులకు సమానం అన్నారు, పెద్దలు.ఇవి ఎవరివి వారే అనుభవించాలి, మరొకరిని అనుభవించమనడం కుదరదు. ఆహారం ఎంత అవసరమో నిద్ర కూడా అంతే అవసరం.నిద్ర గురించి చాలా కతలున్నాయి,భారతంలో,రామాయణంలో పాత చింతకాయ పచ్చడి చెప్పను.నేటి సినీ కవి మాట.

జీవితమున సగభాగం నిద్దురకే సరిపోవు

మిగిలిన ఆ సగ భాగం చిత్తశుద్ధి లేకపోవు

కర్తవ్యము నీవంతు కాపాడుట నావంతు

చెప్పడమే నాధర్మం వినకపోతె నీ ఖర్మం

నేటి కాలంలో నిద్ర లేనివారు,నిద్ర లేని రాత్రులే ఎక్కువవుతున్నాయి. కారణాలు చూస్తే,

ఇరవైనాలుగు గంటలలోనూ ఎక్కువ భాగం బ్లూ స్క్రీన్ చూడ్డం.అవసరం ఉన్నది లేనిది అనక అన్ని విషయాలనూ బుర్రలో కుక్కెయ్యడం.దాంతో పీతబుర్ర కాస్తా పిగిలిపోతోంది, పగిలిపోతోంది.పరిస్థితి ఎలా తయారయిందంటే ఈగ ఇల్లలుకుతూ పేరు మరచిన చందమయింది.నీ పేరేంటీ? అంటే ఆగు గూగుల్ ని అడిగి చెబుతా అంటున్నట్టు ఉంది.ఇక మరొకటి తినకూడనివి తినకూడని సమయాల్లో తినడం.దీనికి విరుగుడు లేదా? పాము విషానికే విరుగుడుందే!

నిద్దర పట్టటం లేదా? ఇది దీర్ఘరోగానికి సంకేతం కావచ్చు సుమా. ఈకింది విధం గా చేసి చూడండి, అవసరాన్ని బట్టి డాక్టర్ ని కలవండి.

చేతుల బొటన వేళ్ళు ముడవండి, ఆపై మిగినవేళ్ళు ముడవండి. ఇది అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి మనం అందరం ఉపాసన చేసినదే. అందుకే దీనిని ఆదిముద్ర అంటారు. ఇలా ముడిచిన చేతులతో ఎడమవైపుకు తిరిగి పడుకోండి, ఎడమచేయి తలకింద పెట్టండి, కుడి చేయి కూడా అదే పోస్ లో పెట్టి పడుకోండి.ఊపిరి నెమ్మదిగా పీల్చి వదలండి. ఊపిరి తిత్తులు ఖాళీ చేయండి, నెమ్మదిగా నాలుగంకెలు లెక్కిస్తూ ఊపిరి పీల్చండి. ఏడంకెలు లెక్కించేదాకా ఊపిరి బిగబట్టండి, ఆ తరవాత ఎనిమిది అంకెలు లెక్కెట్టే టైమ్ దాకా ఊపిరి వదలండి. దీనిని నాలుగైదు సార్లు చేయండి. కళ్ళ మీదకి నిద్ర వస్తుంది. బుర్రలోంచి ఆలోచనలు తుడి చేయండి. అది మీవల్ల కాదు లెండి. ప్రయత్నించండి.నిద్రకి ఉపక్రమించండి. ఇది సింపుల్. 

అబ్బే మేం ముదిరిపోయాం ఇలా కుదరదంటారా?

వెల్లకిలా పడుకోండి. ఆది ముద్రపట్టండి రెండు చేతులా, ఈ చేతుల్ని బొడ్డు కింద ఉంచండి, ఒక దాని గుప్పెళ్ళు మరొక దానికి తగిలేలా. చివర వేళ్ళు రెండు చేతులవీ వదలండి. ఒక చేతి రెండు వేళ్ళని రెండవ చేతి వేళ్ళ దగ్గరగా ఉంచండి. నెమ్మదిగా ఊపిరి పీల్చి వదులుతూ ఉండండి.దీన్ని శక్తి ముద్ర,మాతంగి ముద్ర అంటారు. కళ్ళు మూసుకోండి, ఊపిరి ఎక్సర్సైజ్ చేయండి, ఆలోచన తుడి చెయ్యండి. నెమ్మదిగా నిద్ర వస్తుంది. 

అబ్బే మేమింకా ముదురు అంటారా? చారెడు జీలకర్ర తీసుకోండి, చిన్న స్పూన్ చక్కెర తీసుకోంది. రెండిని కలిపి నమలండి, పై చెప్పినవి చేయండి, నిద్ర వస్తుంది. అబ్బే మేము మరీ ముదురు

ఐతే పై చెప్పినవి ఆచరిస్తూ పడుక్కోడనికి ఒక గంట ముందు, వేడిగా పాలు తాగండి. పైవి చేయండి కమ్మటి నిద్ర మీ సొంతం. ఇవన్నీ ఎప్పుడో అమలు పరచేసేం, ఏం పని చేయలేదంటారా? మీకు మాత్రలేగతి డాక్టర్ని చూడండి...ఇక చెప్పను.

ఒక్కటి గుర్తుంచుకోండి,రోజులో,కనీసం రెండు గంటల పాటైనా మీ శరీరానికి సూర్య రశ్మి తగలాలి, ఎప్పుడూ ఏ.సి లో కూచుని ఉంటే ఇంతే సంగతులు. రాత్రి తీసుకున్న ఆహారం జీర్ణమై ఉండాలి,అప్పుడే మీ శరీరం విశ్రాంతిని కోరుతుంది. తిన్న వెంటనే పడుకుంటే రోగమొస్తుంది. అంటే తిన్న తరవాత కనీసం రెండు గంటలదాకా నిద్రకి ఉపక్రమించద్దు.  ఆ పై మీ ఇష్టం శరీరం మీది కదా! 

నీలాల కన్నుల్లో 

నిదురా రావమ్మా

రావే నెమ్మదిగా రావే

నీలాల కన్నుల్లో 

నిదురా రావమ్మా

రావే నిండారా రావే


నిద్ర జీవులకు నిత్య ప్రళయం


Monday, 14 December 2020

తాడిచెట్టు నీడా కాదు

 తాడిచెట్టు నీడా కాదు


ధర ఖర్వాటు డొకండు సూర్యకర సంతప్త ప్రధనాంగుడై

త్వరతోడవ బరువెత్తి చేరి నిలిచెవ దాళద్రుమఛ్ఛాయ ద

చ్చిరముం దత్ఫలపాతవేగమున విచ్చెవ శబ్దయోగంబుగా

బొరి దైపోపహతుండు వోవుకడకుం బోవుంగదా యాపదల్.....లక్ష్మణకవి


అసలే బట్టతల ఆ పై మధ్యాహ్న ఎండకి తల  మాడుతుండగా నీడకోసం తాడిచెట్టు మొదలుకి చేరాడు.. 

 అప్పుడే తాటి పండు ఒకటి రాలి, బట్టతలపై పడింది. తల పగిలింది.    ”తాడిచెట్టు నీడా కాదు,ఉంచుకున్నోడు మొగుడూ కాదని ” సామెత. తాడి చెట్టు నీడెంత? చాలా తొందరగా నీడ జరిగిపోతుంది.అటువంటి నీడ కోసం పోతే తాటి పండు రాలి తలపగిలింది, దీన్నే ”దరిద్రుడు తలగడిగితే వడగళ్ళవాన ఎదురొచ్చిందని” సామెత చెబుతారు. అలాగే ”దరిద్రుడు ఏ రేవు కెళ్ళినా ముళ్ళపరిగే పడిందన్నదీ” సామెత. దైవబలం చాలకపోతే అన్నీ బాధలే,చుట్టు ముడతాయి."అన్న వస్త్రాలకోసం పోతే ఉన్న వస్త్రాలు పోయినట్టు"సామెత.  నేటి కాలానికి  సరిపోయే పోలిక చెప్పండి.

మానవ ప్రయత్నం ఒకటే సరిపోదు దైవబలం లేనపుడు ఆపదలు చుట్టు ముడతాయి


ఖర్వాటో దివసేశ్వరస్య సంతాపితే మస్తకే

వాఞ్చన్దేశ మనాతపం విధివశా త్తాలస్య మూలంగతే

తత్రవ్యస్య మహాఫలేన పతతా భగ్నం సశబ్దం శిరః

ప్రాయోగఛ్ఛతి యత్ర దైవహతకస్త త్రైవ యా న్త్యాపదః

Saturday, 12 December 2020

ఆరో వేలు.

 ఆరో వేలు.


భగవంతుని సృష్టి విచిత్రం. సాధారణంగా మనం అంతా చేతులకి కాళ్ళకి ఐదేసి వేళ్ళు కలిగి ఉంటాం. కాని కొంతమందికి ఒక్కో చేతికి ఆరేసి వేళ్ళుంటాయి. అదో చిత్రం. చేతి ఐదు వేళ్ళూ ముడిస్తే గుప్పెట,మరి ఆరో వేలెందుకూ? అలంకారమా? కాదు కాని ఉంది.ఇది చాలా వాటికి వర్తిస్తుంది.అజాగళ స్తనం తెలుసు కదా! అదే మేక మెడ చన్ను. అది మేకపోతుకి ఎందుకు ఉపయోగం? అటువంటిదే మనిషికి ఆరో వేలు.ఇలాగే కొంతమంది అజాగళస్తనాలూ ఉంటారు.


నాకో మిత్రుడు రెండు చేతులకి ఆరేసి వేళ్ళుండేవి, ఇతనిని ఆరేళ్ళ ఆచారిగారనే వాళ్ళం. ఆయన్నో సారడిగా ఆరో వేలు ఇబ్బంది కాదా అని, దానికాయన పుట్టినప్పటి నుంచి ఉన్నాయి. అరచేతి ఎడమ పక్క వేలాడుతూ ఉంటాయి. నాకా ఉపయోగం అనిపించలేదు, అలాగనిఇబ్బందీ అనిపించలేదన్నారు. ఇదే సృష్టి చిత్రం.  సమాజం లో ఆరో వేలు లాటి మనుషులూ ఉంటారు.

Thursday, 10 December 2020

నాకూడా రాకురా!

 నాకూడా రాకురా!                                                                                                       కత


”ఆరున్నర దాటింది లేవచ్చు, ఏంటో మరీ బద్ధకం పెరిగిపోతోంది,మీకు” అరిచింది సతి, కిచెన్ లోంచి 

”రిటయిర్ అయి వచ్చిన తరవాత కూడా ఈ నసేంటీ?”..పతి వాపోయాడు,  దుప్పటిలో ముణగ దీసుకుంటూ .

”చూడరాదూ! పక్కింటి ముసలాయన, మీ కంటే పెద్దాడు కదా, ఆరయేటప్పటికి టంచనుగా కర్ర పుచ్చుకుని నడకకి వెళిపోతాడు రోజూ” సాగదీసింది, జాయ.

”ఒకరితో మనకి పోలికేంటోయ్, చలేస్తోంది కాసేపు పడుకోనిద్దూ”గొణిగాడు  పతి 

”అవును లెండి మనకి మంచిపోలికలెలా వస్తాయీ..లేవడమే ఆలస్యం, ఇంక నడకెప్పుడూ”....విసుక్కుంది జాయ.

”లేస్తాను లేవే పొద్దుటే చలీ”...అంటూ మంచందిగాడు, పతి.

”మీరు పొద్దుటే లేచి, నాలుగడుగులేసి ఆరోగ్యం సాధించుకుని మమ్మల్ని ఉద్ధరిస్తారనీ,ఈ గోల. రేపు ఏకాశి సోమవారం, మంచిది నడక మొదలెట్టండి,” సూచన చేసింది.... జాయ.

”రేపు ఏకాశి సోమవారమా? ఐతే దగ్ధయోగం, రేపొద్దుగాని ఎల్లుండి నుంచి మొదలెడతాలే”..వాయిదా వేసేడు పతి.

నడవడానికి ఒప్పుకున్నాడు, అంతే చాలు అని సంబరపడింది.ఇలా ఊరుకుంటే మానేస్తాడు,రేపు రేపు అని జరిపేస్తాడు. ఏం చేయడం అని ఆలోచించి, 'పక్క ముసలాయన ఉదయమే నడుస్తున్నాడు కదా, ఆయన కప్పజెపితే' ఆలోచన చేసింది. 'ఆ( మంచి ఐడియా' అని నడకకెళ్ళిన ముసలాయన తిరిగిరావడాన్ని వేచి చూస్తూ, కన్ను వీధి వైపు వేసుంచింది. ఇంతలో ముసలాయన కర్ర బోటుతో వస్తూ కనపడ్డాడు. చేతిలో పనొదిలేసి చేతులు తుడుచుకుంటూ వీధిలోకి పరుగెట్టింది.

ముసలాయన్ని పలకరిస్తూ 

”నమస్తే బాబాయ్!” అని నిలిచింది.

”కులాసానా అమ్మా!” అంటూ పలకరించాడు ముసలాయన. 

”మంచి అలవాటు బాబాయ్! ఉదయమే నడకకి వెళతారు,ఇంత వయసులో కూడా క్రమం తప్పకుండా, ఈయనకితగని బద్ధకం, లేపితే లేవరు,మీరు నడకకి వెళ్ళేప్పుడు ఒక్క కేక వేస్తే, రోజూ ఈయనా నడకకి వస్తారు”, విషయం చెప్పేసింది.

”అలాగేనమ్మా! నువ్వేం మడులు, మాన్యాలూ అడిగావా, నేనేమన్నా రాళ్ళూ గుళ్ళూ ఎత్తుకోవాలా? అతని నడక అతను నడుస్తాడు, అలాగే, రేపు ఉదయం పిలుస్తా” అన్నాడు.

”కాదు బాబాయ్, రేపు ఈయనకేదో పనుందిట, ఎల్లుండి నుంచీ” అని నాన్చేసింది.

''అలాగేనమ్మా'' ఆని ముందుకు సాగిపోయాడు, ముసలాయన. 

అమ్మయ్య, ఒక ఆధారం దొరికిందనుకుంటూ లోపలికొచ్చిన ఆమెకు పతి బాత్ రూం నుంచి వస్తూ కనపడ్డాడు.ముసలాయనతో మాటాడిన సంగతి చెప్పి 'ఎల్లుండి నుంచి నడవండని' పతికి హుకుం జారీ చేసింది జాయ.


ఎల్లుండి రానే వచ్చింది, ఉదయమే ముసలాయన కర్రతో నడకకి వచ్చేసేటప్పటికి,వాకిట్లో పతికి బూట్లు తొడుగుతూ, ”ఐపోయింది బాబాయ్ వచ్చేస్తున్నారూ” అంటూ పతిని బయటికి పంపించింది. ముసలాయన, పతి ఇద్దరూ నమస్కార ప్రతి నమస్కారాలు చేసుకుంటుండగా తాను నిష్క్రమించింది. కొత్త మిత్రు లిద్దరూ కబుర్లలో పడి, నడక సారించారు. 


కబుర్లలో ఇద్దరికీ శంఖ చక్రాలున్నట్టు తేలింది, నడక అవసరమేననీ తేలింది.నడక కొనసాగిస్తుండగా, రోజూ వరు ముందు బయలుదేరితే, వారు రెండవవారిని పిలవాలని ఒక ఒప్పందం. సరే! ఏరోజూ పతి ముసలాయన్ని పిలిచిన పాపాన పోలేదు. ప్రతిరోజూ ముసలాయన వచ్చే సమయానికి పతికి నడక బూట్లు తొడుగుతూ ఉంటుంది జాయ. మధ్యలో ఆదివారమొస్తే శలవు ప్రకటించాడు, పతి. ''ఆదివారమని ఏపని చేయడం మానేస్తున్నావు మగడా, నడకకి శలవెందుకూ?" పోరింది సతి.

''నువ్వేమన్నా ఆదివారం నడకకి శలవే భీష్మించాడు'' పతి.అదేదో తేల్చుకోండని వెళ్ళాడు ముసలాయన.ఇలా తంపులతో నడక నడుస్తూ ఉంది. 


ఇంతలో వచ్చింది కరోనా, బయటకి కాలు కదపడానికి లేదంటే ఇద్దరూ ఇళ్ళలో బందీ ఐ పోయారు. ముసలాయన తన పెరటిలోనూ పతి తన డాబా మీదా నడుస్తూ వచ్చారు, కాని ఇద్దరికీ శంఖ,చక్రాలు పెరిగినట్టే అనిపించింది, ఆరు నెలలయేటప్పటికి. ఇద్దరూ ఒకే డాక్టర్ ని చూస్తే ఇద్దరికి ఉండవలసిన దానికంటే చక్కెర ఉత్పత్తి రెట్టింపే ఉన్నట్టు తేలింది. నడక తప్పని సరీ అయింది, మళ్ళీ ఒప్పందమూ అమలులోకొచ్చి, నడక మొదలెట్టేరు.ము.మూ గుడ్డలు కట్టుకుని దూరం పాటిస్తూ నడక కొనసాగించారు. నెలపాటు నడక సాగినట్టే సాగింది, 


ఇంతలో ఒక రోజు ఉదయమే, పతి ముసలయ్య ఇంటికొచ్చి ''బయటికి రావద్దు ఊళ్ళో బాగో లేదు,మన మిత్రుడు డాక్టర్ పెద్దరెడ్డి గారు కాలం చేసేడు, పెరటిలోనే నడక''  అన్నాడు. దానికి ముసలయ్య ''దూరం పాటిస్తున్నాం, ముమూ గుడ్డలు కట్టుకుంటున్నాం కదా! ప్రభుత్వమూ బయటి రావడానికి నిషేధమూ ప్రకటించలేదు, మరెందుకు నడక మానేయాలని'' ఆరాతీశాడు. ''వద్దూ బయటికి రావద్దూ, ఇంట్లోనే ఉండండీ'' అనేసి మాటకి దొరక్కుండా పోయాడు పతి. ముసలయ్య ఇంట్లో వాళ్ళు కూడా ఆయన్ని నడకకై బయటికి వెళ్ళడానికి ఒప్పుకోలేదు. ఏం చేయాలో తోచని ముసలయ్య ఇంట్లో చిక్కుకుపోయాడు. నడకా ఆరోగ్యమూ కొద్దిగా దారిలో పడుతున్న ముసలయ్యకి ఇది బాధే అనిపించింది. 


మళ్ళీ మొదలు కొచ్చేసినట్టుందే నడక వ్యవహారం అనుకుంటూ ఉండిపోయాడు,ఇంట్లో. వారం తరవాత కాళ్ళు గుదులెక్కిపోతే నడుద్దామని బయలుదేరి, అలవాటుగానే పతి కోసం ఇంటి కెళ్ళేడు. ఎంత పిలచినా పతి ఇంటినుంచి జవాబు రాలేదు. ఇంటికా తాళం లేదు, బయటికెళ్ళేరేమో, ఏమయి ఉంటుందీ అని అనుకుంటూ ముందుకు సాగిపోయాడు ముసలయ్య.  పతి ఆ రోజు  ముసలయ్యకి అందుబాటులోకి రాలేదు. మర్నాడు ఉదయమే వెళితే పతి కనపడలేదుగాని అతని భార్య,  తాము కట్టించుకుంటున్న అపార్ట్మెంట్ దగ్గరకెళ్ళేడని చెప్పింది. కాని, ఎదురుగా ఉన్న చెప్పుల స్టాండ్ లో పతి నడక బూట్ల తో సహా మిగిలిన చెప్పులూ కనపడుతూనే ఉన్నాయి. పతి ఇంట్లోనే ఉన్నాడని అర్ధమైపోయింది, ముసలయ్యకి.అంటే పతి ఇంట్లోనే ఉండి ముసలయ్యతో మాటాడటానికే ఇష్టపడటం లేదని అర్ధమయింది. సాలోచనగా ముసలయ్య చూసేటప్పటికి సిగ్గు పడింది, జాయ, తను అబద్ధం చెప్పాల్సి వచ్చినందుకు. తన అసౌకర్య పరిస్థితి నుంచి తప్పించుకోడానికి మాట పొడిగిస్తూ, సతి

” బాబాయ్!  డాక్టర్ పెద్దరెడ్డి గారు కాలం చేసేరు తెలిసిందా? ఆయన మీ స్నేహితుడట కదా!”  వాకబు చేసింది.  ”అవునమ్మా! ఆయనకి ఎనిమిది పదులు నిండేయి, నాకంటే వారం పది రోజులు పెద్దవాడు, నేనీ వూరు వచ్చిన రోజునుంచి స్నేహితుడు,గుండె జబ్బు కి ఆపరేషనయింది, డయాబెటీస్ ఉన్నవాడు, ఎలాపోయాడో”? అడిగాడు ముసలయ్య. 

”అదేం కాదు బాబాయ్! కొత్తమ్మోరే ఎత్తుకుపోయిందంది”,  కరోనా పేరు చెప్పకుండా.

 ”అయ్యో” నిట్టూర్చాడు, ముసలయ్య. 

బాబాయ్! నడక్కి వెళ్ళద్దు,ఈయన బయటకి రావడానికి భయపడుతున్నారు, తప్పక అపార్ట్మెంట్ దగ్గరకెళ్ళేరు. నిన్నూ నడకకి వెళ్ళద్దన్నారు. అదీగాక నిన్ను తను కూడా నడక్కి తిప్పుతుంటే ఏం మాట పడిపోతానోనని మధన పడిపోతున్నారు, నీకా మాట చెప్పలేకపోతున్నారు, ఏమీ జరగదనుకో,  ఏదీ మన చేతులో లేదు కదా! ఇలా అన్నానని ఏమనుకోకు బాబాయ్! ఇంటికెళిపో” అంది చివరగా.  తనకూడా నడకకి రావద్దని చెప్పలేక భార్యతో చెప్పించాడనమాట.  తను నా కూడా నడకలో ఉంటుంటే, నాకేమైనా ఐతే తను మాట పడిపోతానేమోననుకుంటున్నాడనమాట, అనుకుంటూ  ముసలయ్య నడకకి సాగిపోయాడు.

”నాకూడా రాకురా అంటే నన్నెత్తుకోరా” అని వెనకపడినట్టు, పతి వెనక పడటం తెలివి తక్కువేమో అనుకున్నాడు, ముసలయ్య. ఉదయమే మంచు,దానికి తోడు చలి, మంచులో సూర్యుడు కనపడ్డు. ఇన్ని కష్టాలతో ఉదయం నడకెందుకని సాయంత్రానికి మార్చుకున్నాడు, ముసలయ్య.

''కానున్నది కాక మానదుగదా! ఒకప్పుడు పతి నా కూడాపడి నడకకి వచ్చినవాడు, ఇప్పుడు తన కూడా నడకకి రావద్దంటున్నాడు.చూడరాదూ చిత్రం'',అనుకున్నాడు ముసలయ్య .

లోకం ఎంత చిత్రమైనదీ



Wednesday, 9 December 2020

మూర్ఖుని మనసు రంజింపరాదు

లిఖేత సుఖతాసు తైలమపి యత్నతఃపీడయన్
పిబేఛ్ఛ మృగతృష్ణికాసు సలిలం పిపాసార్ధితః
కదాచిదపి పర్యటన్ శశివిషాణమాసాదయే
న్నతు ప్రతినివిష్టమూర్ఖజనచిత్తమారాదయేత్….భర్తృహరి
తివిరి ఇసుమునతైలంబు దీయవచ్చు
దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు
తిరిగి కుందేటికొమ్ము సాధింపవచ్చు
జేరి మూర్ఖుని మనసు రంజింపరాదు……..లక్ష్మణ కవి.
కష్టం మీదనయినా ఇసుకనుంచి నూనెను పిండచ్చు,ఎండమావిలో నీళ్ళు తాగచ్చు, వెతికి వెతికి కుందేటి కొమ్మునూ తెచ్చుకోవచ్చు కాని మూర్ఖుని మనసును రంజింపచేయలేము అన్నారు కవి.

ఇసుకనుంచి నూనె తీయడం,ఎండమావిలో నీళ్ళు తాగడం,కుందేటికి కొమ్ము మొలిపించడం అసాధ్యాలని కవిగారి మాట. వారిదే చివరిమాట మూర్ఖుని రంజింప చేయడానికి ప్రయత్నం చేయద్దన్నారు. ఇది అర్ధం చేసుకోడం కష్టమే.  
మన దవడ మీద దోమ వాలి కుడుతోంది, అసంకల్పితంగానే మన చేత్తో మనమే మన దవడ మీద ఛెళ్ళుమని చరుచుకుంటాం. దోమ చావచ్చు లేదా ఎగిరీ పోవచ్చు కాని మన చెంప మనమే ఛెళ్ళూమనిపించుకోవడం మాత్రం ఖాయం కదా!
అలాగే మూర్ఖునితో వాదం,సంవాదం, ప్రతివాదం ఏది చేసినా మన చెంపని మనమే ఛెళ్ళుమనిపించుకోడంతో సమానం అన్నారొక మిత్రులు. ఇంతటి గొప్ప ఉపమానం చెప్పిన మిత్రులకు వందనం.

Tuesday, 8 December 2020

సొడ్డిస్తూ అల్లుడు అడ్డెడూ చెల్లించాడు.

   సొడ్డిస్తూ అల్లుడు అడ్డెడూ చెల్లించాడు.


సొడ్డిస్తూ అల్లుడు అడ్డెడూ చెల్లించాడనిగాని సొడ్డిస్తూ బావగారు అడ్డెడూ చెల్లించాడనిగాని అంటుంటారు.


సొడ్డు అంటే చాలా చాలా అర్ధాలిచ్చింది ఆంధ్ర భారతి, లేవిడీ కొట్టడం, పేర్లు పెట్టడం, ఏదో తక్కువైందనడం,తప్పుపట్టడం అని చెప్పుకోవచ్చు, మరి కతేంటో చూదాం :) 


ఒక అల్లుడు అత్తింటికొచ్చాడు, సాయంత్రానికి, మరునాడు గారెలు వండుదామని అనుకుంటూ ''శేరు పప్పు పోయానా?'' అడిగింది అత్త పక్కనే ఉన్న కోడలిని.

''కాదత్తా మూడు తవ్వలుపోయండి మనం అల్లుడుతో కలిపి ఆరుగురం కదా! ఇంట్లో పనివాళ్ళు పాలేళ్ళు, వీళ్ళందరికి పెట్టాలిగా'' అంది కోడలు.

అక్కడేఉన్న ఆడపడుచు ''అమ్మా అడ్డెడూ పోసెయ్యవే,సరిపోదేమో, లేకపోతే ''అంది. 

ఇదివిన్న తల్లి అడ్డెడు పప్పూ నానబోస్తూ ''అమ్మాయీ మీ ఆయన గారెలు ఎలా ఐతే బాగ తింటాడే'' అడిగింది.

దానికా ఇంటి ఆడపడుచు ''అమ్మా! నీ అల్లుడుకి, నేతిగారెలంటే మక్కువ,  పాకం గారెలంటే ఇష్టం, ఆవడలు, మామూలు గారెలు, చిట్టి గారెలు, కారపు గారెలు, తోటకూర గారెలు అంటే బాగా ఇష్టం'' అంది.అల్లుడు కొద్ది తిండి పుష్టి వున్నవాడని తెలిసిన అత్త అడ్డెడూ పప్పూ నానబోసింది, రాత్రికి. 


 ఉదయం లేవడంతోనే ఆ ఇంటికోడలు నానబోసిన పొట్టు మినపపప్పుని కడగడానికి పట్టుకుపోయింది, నూతి దగ్గరకి. పొట్టు మినప్పప్పు కడగడానికి నడుములు పడిపోతాయి. ఎన్ని నీళ్ళు పడతాయో చెప్పలేం. నీళ్ళు తోడాలి, పప్పుగాలించాలి,పొట్టు తీయాలి. ఇంటికోడలుకదా, తప్పదు. మొత్తం పప్పుని నాలు భాగాలు చేసి ఒక భాగం కడిగి, రుబ్బురోల్లో వేసి రుబ్బడం ప్రారంభించింది, ఈ లోగా అత్త పొయ్యి వెలిగించి, నెయ్యి ఎసరు పెట్టి అరటాకు ముక్క కోసి తెచ్చుకుని కోడలు రుబ్బి ఇచ్చిన పిండితో గారెలు వెయ్యడం మొదలెట్టింది. ఈ లోగా ఇంటాడపడుచు రెండో వాయి పప్పు కడిగి వదినగారికిస్తే అదీ రుబ్బి అత్తకిచ్చింది. ఈ రెండు వాయిల్లోనూ ఉప్పెయ్య పోవడంతో గారెలేసి బెల్లంపాకంలో కొన్ని,పోపు పెట్టిన పెరుగులో కొన్ని వేసింది, ఆవడలుగా.ఆ తరవాత రుబ్బిచ్చిన పిండితో చిట్టి గారెలు, మామూలు గారెలు వేసింది. పొయ్యి దగ్గర కూచుని గారెలు వేసే ఆమెకూ నడుం లాగుతోంది. ఇంటికోడలు చెప్పే పనిలేదు తోట కూర కాడలా వేలాడిపోయింది. సరే ఇంటాడపడుచుకి తప్పదు భర్త కోసం కదా! పుట్టింట గౌరవం.  పాపం ఆ కోడలు నడుం పడిపోతున్నా మూడో వాయి కూడా రుబ్బిచ్చింది, ఆడపడుచు పప్పు కడిగివ్వగా. ఈ వాయ మామూలుగారెలుగానూ, చిట్టిగారెలు గానూ వేసింది ఆ ఇంటి ఇల్లాలు.  


ఇంటికోడలు ''నాలుగో వాయి ఇంక రుబ్బలేనత్తా నావల్ల కాదూ'' అనేసింది. దానికి అత్త ''అమ్మ కదూ కచ్చా పచ్చాగా రుబ్బి ఇచ్చెయ్యి చాలు, మెత్తగా రుబ్బక్కర లేదు, కారపుగారెలు, వడలుగా వేస్తాను, ఆ చేత్తోనే కొంచం పచ్చి మిరపకాయలు రుబ్బి ఇచ్చెయ్యి'' అని పురమాయించింది. కోడలు కాదనలేకపోయింది. మొత్తనికి అడ్డెడు పప్పూ గారెలయ్యాయి, పాకం గారెలుగా,ఆవడలుగా, గారెలుగా, వడలుగా, కారపు గారెలుగా. వీటిని వేరువేరుగా నిలవచేసింది.అల్లుడిని భోజనానికి లేవమని ఆహ్వానించారు. 


భోజనానికి కూచున్నాడు అల్లుడు. వడ్డిస్తున్న అత్తగారు, పాకం గారెలు వడ్డించింది, ''ఎలా ఉన్నాయల్లుడు గారూ'' అని అడిగింది, ''అత్తా గారెలు బాగున్నాయిగాని పాకం లేత పాకం ఐనట్టుం''దన్నాడు, మళ్ళీ వడ్డిస్తే మాటాడక తిన్నాడు. ఇక ఆవడలు వడ్డిస్తే మెత్తమెత్తగా తింటూ ''పెరుగు చిక్కగా లేదత్తా, గారెలు కొంచం గట్టిగా ఉన్నాయని'' అంటూనే మొత్తం పుచ్చుకున్నాడు. మామూలుగారెలు తింటు ''మెత్తగా లేవు మరికొంచం రుబ్బాలిసింది'' అని తిన్నాడు. మిగిలిన వడలు, కారపు గారెలు తింటూ ''కొంచం కారం వెయ్యాలిసిందని'' మొత్తం తినేసేడు. ఇలా వండిన వాటికి ఏదో ఒక వంక చెబుతూనే మొత్తం వేసిన గారెలన్నీ అల్లుడు చెల్లించాడు. ఇది చూసిన ఆ ఇంటి కోడలు కొయ్యబారిపోయింది,ఇంటి ఇల్లాలు అల్లుడు చర్యకి ఆశ్చర్యపడింది, ఇంటాడపడుచు మాటాడలేకపోయింది. ఎవరికి ఒక్క గారె కూడా మిగల్చకుండా తిన్న అల్లుని తిండి పుష్టికి అత్త ఆనందపడింది. మనకి ఈ నానుడి మిగిలిపోయింది...



Monday, 7 December 2020

మొహమాటం లేదు.

 కశ్చిచ్చండ కోపానా మాత్మీయో నామ భూభుజామ్

హో తారమపి జుహ్వానం,స్పష్టో దహతి పావకః


మనుజులలో నెవ్వడు దగ

దనవాడనువాడు దుష్టధరణీశునకున్?

దనకయి వ్రేలిమి వ్రేల్చెడు

జనునితనువు గాల్చు వాయు సఖు డదయుండై...లక్ష్మణ కవి


దుష్టుడైన రాజుకు తనవాడనే వాడు ఎవడూ ఉండడు. అలాగే తనని అర్చిస్తున్న వానిని కూడా, పొరబాటుగా ముట్టుకున్నా అగ్ని మొహమాటం కూడా లేక కాలుస్తాడు.


రాజుకి అనగా పరిపాలకునకు తనవాడు పెరవాడనే భేదం లేక న్యాయం చేయాలి, కాని దుష్టుడైన రాజుతనవాడినైనా చంపిస్తాడు, కోపంతో. ఇదెలాగంటే నిత్యమూ  కొలిచేవానిని సహితం అగ్ని పొరబాటుగా ముట్టుకున్నా కాల్చేస్తాడు.   రాజకీయ పార్టీలు,రాజకీయనాయకులు, నటులు,నటీమణులు,ఆటగాళ్ళ అభిమానులుగా  ఎన్ని సంవత్సరాలు వీధుల్లోబడి కొట్టుకున్నా, ఎన్ని సంవత్సరాలు నిద్ర హారాలు మానుకుని కీ బోర్డ్ మీద పోరాడినా, కీ బోర్డ్ వారియర్లు గా మారినా, పరస్పరం తిట్టిపోసుకున్నా, ఎవరిగురించి ఇంత బాధపడ్డారో, వారు కనుపించినపుడు  రాజకీయ నాయకుడు, తన అభిమానులు, కీ బోర్డ్ వారియర్లను,కనీసం కన్నెత్తి చూడడు, పన్నెత్తి పలకరించడు . సరికదా! సెక్యూరిటీ వాళ్ళు ఈడ్చి పారేస్తారు,గింజుకుంటే పోలీస్ పట్టుకుపోతుంది. 

  ఇంటి దీపమేకదానని ముద్దు పెట్టుకున్నా మీసాలు కాలతాయి/మూతి కాలుతుంది  సామెత


Sunday, 6 December 2020

ధైర్యగుణం

 కవర్ధిత స్యాపి హి ధైర్యవృత్తే

ర్న శక్యతేధైర్యగుణఃప్రమార్షుమ్

అధోముఖ స్యాపి కృతస్యవహ్నే

ర్నాధః శిఖా యాతి కదాచి దేవ


నియతిచేత గదర్దితుం యిన ధైర్య

వరుని ధైర్యగుణంబు మాన్పదరమె?

క్రింది సేయంగబడినట్టి కృప్మపధుని

కీల యెందైన మీదుగా గెరలుగాదె!


ధైర్యవంతునికి ఎట్టి దుఃఖము సాంభవించినను అతని ధైర్యము పోగొట్టుట సాధ్యము. అగ్నిని తలకిందులు చేసినను అగ్ని జ్వాల ఊర్ద్వముగానే ప్రసరించును కాని అధో ముఖముగా ప్రసరించదు. 


ధైర్యవంతుని ఎన్ని కష్టాలు వచ్చినా, తెచ్చి పెట్టినా ధైర్యము చెడగొట్టలేరు. తను చేయదలచుకున్న పనిని చేసి తీరుతాడు.కష్టాలు నీటి అలలలాటివి వచ్చిపోతుంటాయి. కష్టాలు కలకాలం కాపురం ఉండవని సామెత, అలాగే సుఖాలూ కాపురం ఉండవని తెలుసుకోవాలి.అగ్ని జ్వాల ఎప్పుడూ పైకే ఉంటుంది, అగ్నిని తలకిందుకుచేసినా ఏం చేసినా జ్వాల పైకే ఉన్నట్టు ధైరవంతుని ధైర్యం కూడా ఎప్పుడూ నిలచి ఉంటుంది, ఎప్పుడూ ఎవరూ చెడగొట్టలేరు. 

Tuesday, 1 December 2020

మూర్ఖత్వానికి మందు లేదు.

 


జగత్సర్వం శివమయం


నిన్న సాయంత్రం నడకకు వెళుతుంటే ఒక ఇంట కనిపించిన దృశ్యం. నమశ్శివాయ.


శక్యోవారయితుం జలేన హుతభుక్చత్రేణ సూర్యాతపో

నాగేన్ద్రో నిశితాజ్క శేన సమదో దణ్ణేన గార్ధభః

వ్యాధి ర్భేషజనజ్గ్రహైశ్చ  వివిధైర్మన్త్ర ప్రయోగైర్విషం

సర్వస్యౌషధమస్తి శాస్త్రవిహితం మూర్ఖస్య నాస్త్యౌషధమ్


జలముల నగ్ని ఛత్రమున జండమయూఖుని దండతాడనం

బుల వృషగర్ధభంబులును బొల్పగుమత్తకరీంద్రమున్ సృణిం

జెలగెడురోగ మౌషధముచే విషముం దగుమంత్రయుక్తి ని

మ్ముల దగ జక్కజేయనగు మూర్ఖుని మూర్ఖతమాన్పవచ్చునే......లక్ష్మణ కవి


అగ్నికి నీరు,ఎండకు గొడుగు, మదగజమునకు అంకుశము, ఎద్దు గాడిద మొదలగు జంతువులకు కఱ్ఱ, రోగమునకు మందులు, సర్వవిషంబులకును పలు విధములగు మంత్రములు నివారకములుగా చెప్పబడుచున్నవి కాని మూర్ఖుని మూర్ఖత్వమును  పోగొట్టే మందు ఎక్కడా చెప్పబడలేదు.

 

”నేను పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్ళు”.  మరీ మూర్ఖంగా ఉందా? కొంచం సున్నితమైనది చెప్పుకుందాం "తా వలచింది రంభ, తా మునిగింది గంగ" ''నైజగుణానికి లొట్టకంటికి మందు లేదని'' సామెత,అలాగే మూర్ఖతను తొలగించే మందు లేదు