Friday 30 December 2022

వ్యత్యస్త పాదారవింద.

 వ్యత్యస్త పాదారవింద.


వ్యత్యస్త పాదారవింద ఇందిరా హృదయానంద.

ఎప్పుడేనా విన్నారా? ఇది భజనపాళీ లో పాడేది, అన్నటు నేడు వేల్పుల 

భజనలు లేవుగా తెరవేల్పుల భజనలే తప్పించి. :)

వ్యత్యస్తం అంటే అపసవ్యంగా ఉండడం, అపసవ్య పదారవిందాలున్నవాడు.అంటే ఎడమపాదం కుడివైపు వేసుకుని ఒకపాదం మీద నిలబడి రెవండవకాలి బొటనవేలు భూమిమీద ఆనించి నిలవడడం. అబ్బే ఎంత చెప్పినా అర్ధం చెయ్యలేనేమో. కృష్ణుని బొమ్మ చూశారా? చూసేవుంటారు. నిలబడి ఉన్న కృష్ణుడు వ్యత్యస్తపాదాలతో, చేత మురళితో, వెనక గోవుతో,పొన్నచెట్టు నీడ నిలబడినట్టు ఉంటాయి. ఏమిటి దీని తిరకాసు?అసలు కృష్ణుడు అలాగే ఎందుకు నిలబడతాడు చెప్పండి? కొచ్చను.

Courtesy:Google
ఎడమకాలు ఎత్తి కుడికాలి మీంచి కుడి కాలి కుడి వైపు వేసి నిలబడగలరా? ప్రయత్నించద్దు, పడిపోతారు. ఇలా అడుగులేసి నిలబడటమే వ్యత్యస్త పాదాలు.ఇలా నిలబడటం చాలా కష్టం. యోగాలో దీనిని గరుడాసనం అంటారు.ఇలా నిలబడి రెండు చేతులూ పైకెత్తి మోచేతులనుంచి మెలిక వేసి రెండు అరచేతులూ నమస్కార ముద్ర పట్టడమే గరుడాసనం. ఎందుకిది పనిలేక అనికదా కొచ్చను. ఇలా నిలబడగలిగితే మనిషికి స్థిరత్వం కలుగుతుంది.మనిషి ఆలోచన కూడా సవ్యమైన దిశలో నడుస్తుంది. అబ్బే నమ్మం, చిత్తం తమకి నచ్చదని తెలుసు. :)


మొన్నీ మధ్య నాసా అనుకుంటా ఒక అంతరిక్ష నౌకని పంపింది, అందులో ఒక అంతరిక్షిణి వెళ్ళింది. ఆ అంతరిక్షిణి తన ఖాళీ సమయంలో ఈ గరుడాసనం వేస్తూనిలబడిన ఫోటోలను నెట్ లో వైరల్ చేసేరు. ఆవిడకేం పనిలేక ఈ గరుడాసనం వేసిందా? కాదు అంతరిక్షంలో కూడా స్థిరంగా నిలవాలంటే ఈ గరుడాసనం ఉపయోగిస్తుందిష. 


ఇక వృక్షాసనం అని ఒకటుంది, ఇందులో ఒకకాలిపై నిలచి రెండవకాలు మొదటికాలి మోకాలి దగ్గర ఉంచి నిలవాలి, చేతులు పైకి చాచి నమస్కార ముద్ర పట్టాలి.. ప్రయత్నించద్దూ! పడిపోతారు. నాకే పూచీలేదు. ఇదీ నెట్ లో వైరల్. ఎందుకుషా? ఈ ఆసనం పదిసెకండ్లు వేసి నిలవలేనివారు పదేళ్ళలో పోతారూ, అని చెబుతున్నారు. మనవారేంచెబుతున్నారూ! సాధనమున పనులు సమకూరు ధరలోన, ప్రయత్నం చెయ్యండి, ఎంత సేపైనా నిలవగలరు, హాయిగా జీవించగలరు. ఇలా నిలిచి తపస్సు చేసిన మహానుభావులు ఎంతమందో, ఎంతకాలం తపస్సుచేసేరో ఎవరికెరుక? ఏది పాసిటివ్ తింకింగ్ బాబూ! పదేళ్ళలో చస్తావన్నదా???  


Wednesday 28 December 2022

ఊపిరి నిలబడితే

 



ఊపిరి నిలబడితే

ఊపిరి నిలబడిన తరవాతేమవుతుంది? అది నీకనవసరం.నువ్వుండవు కదా! ఏంజరిగేది నీకు తెలీదు. నీ శరీరాన్ని ఏడు కట్ల సవారిమీద పెట్టి తడపలతో గట్టిగా బిగించినా నీకు తెలీదు.  ఆతరవాత తగలెయ్యడమో, పూడ్చిపెట్టడమో చేస్తార్లే. అదీ నీకు తెలీదు. అప్పటిదాకా ఇంజక్షన్ సూది గుచ్చితే అబ్బా అన్నవాడివి, పలకవు.

ఐనా తెలుసుకో!

మొదటిరోజు ఏడుపులు,పెడబొబ్బలు.

రెండోరోజు శవానికి అంత్యక్రియలు, అదే నువ్వు 'నేన'నుకున్న నీ శరీరానికి .

మూడో రోజు ఎత్తిపోతలు, కొడుకులు,కోడళ్ళు;కూతుళ్ళు,అల్లుళ్ళు నీ అస్థులకోసం సిగపట్లు ప్రారంభం. చివర మూడురోజులు అనగా పదోరోజు నీ బంధువులు మిత్రులు ఒక సారి నీ పేరు జెప్పుకుని గోదాట్లో ములిగి మూడుదోసిళ్ళ నీళ్ళు పోస్తారు అదే ధర్మోదకం, చాలు, అంతతో మిత్రులు,బంధువులకి సరి.

పదకొండో రోజు పెద్దల్లో కలిపేస్తారు. సగోత్రీకులకి సరి.

పన్నెండో రోజు స్వర్గపాధేయం, నువ్వు సర్గానికి పోవాలని ఆకాంక్షతో కొడుకులు కోడళ్ళు చేసేది. అంతే ఐపోయింది.  కోడుకులు కోడళ్ళకి సరి. ఆ తరవాత నిన్ను తలుచుకునేవారే లేరు.  

 ఒక్కడే  కొడుకు, 

అబ్బా! పన్నెండు రోజులు లీవ్ వేస్ట్. ఏముందిక్కడ, ఈ పెద్ద కొంప తప్పించి.ఇదెందుకూ పనికిరాదు,  మంచిల్లు టవున్ లో కొనిచావలేదు. ఏమైనా అంటే, ''తాతలు కట్టిన ఇల్లురా, ఈ జీవి ఇక్కడే పోవాలి'', అని కదిలిరాలేదు. ఇక కోడలు ''తల స్నానాలతో తలనొప్పి పట్టుకుంది, ముసలాయన ఉండి ఉండి చలికాలంలో చచ్చేడు, మా కర్మకొద్దీ!''

కొడుకులూ, కూతుళ్ళుంటే

"ఏమే అమ్మాయ్! ముసలాయన చాలా షేర్లు కొన్నాట్ట, కోటి రూపాయల ఖరీదుంటాయట, అల్లుడేమన్నా కనుక్కున్నాడా? లేకపోతే నీతోటికోడలు, మరిది కైంకర్యం చేసెయ్యగలరు.నీ తోటికోడలు తండ్రున్నాడు చూడు దేవాంతకుడు.అసలు విల్లేమన్నారాసాడటా? ఆస్థులు ఎక్కడేమున్నాయో మీ ఆయనకి తెలుసా! లేకపోతే కాళ్ళొచ్చి నడిచిపోతాయి. " ఫోన్ లో, పెద్దకోడలు తల్లి వాకబు, హెచ్చరిక, సలహా!!!!

"అడిగేరట తమ్ముణ్ణి,విల్లేదో రాసి చచ్చేడట, ఇంకా వివరాలేం తెలియవు. ముసలాయన చెప్పి చావలేదు.ఏం మిగులుతాయో ఏంపోతాయో!నా మొగుడో బుద్ధావతారం ఏంచెయ్యను చెప్పు.అటువంటివాణ్ణి కట్టబెట్టేరు."

"సరెలే ఆ సంగతిప్పుడెందుకుగాని, పనిచూడు.ముసలాయన దేవాంతకుడు". 

"ఏరా తమ్ముడూ/అన్నయ్యా! ఆస్థులన్నీ నాన్న స్వార్జితంట కదా! మన మామయ్య చెప్పేడు. మాకేమైనా రాసేడా? విల్లులో! అంతా మీరే రాయించేసుకున్నారా?"

"ఏమోనే ఇంకా విల్లు చూడలేదు, లాయర్ దగ్గరుందిట, తెచ్చుకోవాలి, అప్పుడుగాని తెలీదు, ముసలాయనేం చేసేడో!!"

"అమ్మ నగలూ అలాగే కొట్టేసేరు, మాకు అమ్మ విల్లులో ఏమీ రాయలేదని, కొద్దిగా బంగారం మా చేతులో పెట్టి తూతూ మంత్రం చేసేసేరు.ఈ ముసలాయనేo చేసేడో!"

ఇలా చచ్చిన తరవాత కూడా తిట్టించుకోవాలా? ఆస్థులు సంపాదించి.

నీ పేరు స్థిరంగా నిలబడే పని చేసిపో! నీవల్లకాదూ, అంత తాహతులేదు!అతిగా కూడబెట్టకు, అనుభవించు, ఉన్నంతలో దానం చేసెయ్యి. 

నీకొడుకులు తెలివైనవాళ్ళైతే నీ సంపాదన వాళ్ళకి అక్కర లేదు. వాళ్ళే సంపాదించుకోగలరు.

నీ కోడుకులు తెలివి తక్కువవాళైతే నువ్వు బంగారపు కొండలు సంపాదించి ఇచ్చినా నిలబెట్టుకోలేరు, పైగా ప్రాణహాని కూడా.

అందుచేత తగుమాత్రంగా సంపాదించు, అనుభవించు, నువ్వు కట్టుకున్నవాళ్ళు, కన్నవాళ్ళు, నిన్ను నమ్ముకున్నవాళ్ళు అనుభవిస్తే చూసి ఆనందించు. 


Monday 26 December 2022

పడుచుకాపురం చితుకులమంట.

 పడుచుకాపురం చితుకులమంట.


చితుకులు

పడుచువాళ్ళకాపురం చితుకులమంట లాటిదీ అంటుందీ నానుడి, ఏంటీ దీని భావం. పడుచువాళ్ళకి ఏదో చేసెయ్యాలనే ఆవేశం, కోరిక బలంగా ఉంటాయి, సహజమే కాని దానికి తగిన అనుభవం ఉండదు, చిక్కుల్లో పడిపోతుంటారు, దీనికి చితుకులమంటకి ఏమి అనుబంధం అని కదా కొచ్చను? చితుకులంటే చిన్నచిన్న పుల్లముక్కలుగాని,వండ్రంగి పని చేసినప్పుడు మిగిలినరద్దు, అనగా చిత్రిక వగైరాలు. వీటిని మంటపెడితే వేడి ఉంటుందిగాని ఎక్కువసేపు నిలిచి ఉండదు,గుప్పున మండి తగ్గిపోతుంది. అందుకు పడుచుల ఆవేశాన్ని చితుకులమంటతో పోల్చారు. 


ఓలి తక్కువని గుడ్డిదాన్ని పెళ్ళిచేసుకుంటే రోజూ కుండలు బద్దలు కొట్టింది.

ఓలి అంటే కన్యాశుల్కం. ఇదిచ్చి కన్యను తెచ్చుకుని వివాహం చేసుకునేవారు. ఇదో దురాచారం. ఆబ్బో దీనిమీద ఒక నాటిక దానికి నేటికీ ఆదరణ, ఆచారం ఎప్పుడో చచ్చిపోయినా! అదీ సంగతి. దీని తరవాత దురాచారం వరకట్నం. దీనికీ ఒక నాటికుంది. దానికంత ప్రచారం లేదు. అంతకాదు అసలు లేదు. ఇదికదా చిత్రం. అందులో కాళింది పాత్ర అజరామరం, కాని నేటి ఆడకూతుళ్ళా  పాత్రని తలుచుకుంటే ఒట్టు. నేటి కాలంలో ఎవీ లేవుగాని అసలు పెళ్ళేవద్దు, కోలివింగ్ ముద్దు. ఇదీ జరుగుతున్నది. మోజు తీరేకా ఎవరిదారి వారిదే! అప్పటిదాకా కోలివింగ్ లో ఉన్నవాడు చంఫేయ్యకుంటే!

ఓలి ఇచ్చి పెళ్ళి చేసుకునే రోజుల్లో ఒక పేదవాడు ఓలి తక్కువని ఒక గుడ్డిదాన్ని పెళ్ళి చేసుకున్నాడు. పాపం ఆమె ఎం చేయగలదు. రోజూ కుండలు పగలగొట్టేసేది, పని చేస్తూ. రోజూ కుండలు కొనుక్కోడం ఓలికంటే ఎక్కువైంది. దాంతో ఒయ్యో! తెలివి తక్కువపని చేసానే అని వాపోయాడు.

బెల్లముంటేనే చీమలు చేరతాయి
 విచిత్రం ఏంటి? అసలు సంగతి వేరే! అధికారం ఉన్నదగ్గరకే మనుషులు చేరతారు.డబ్బున్నదగ్గరకే మనుషులు చేరతారు.  మురికున్నదగ్గరకే పందులు,దోమలు చేరతాయి.పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు తగులుతాయి.అందం ఆర్భాటం ఉన్నదగ్గరకే మనుషులు చేరతారు.తెరియమా? 

 

Saturday 24 December 2022

అయినవల్లి-క్షణ ముక్తీశ్వరం

అయినవల్లి-క్షణ ముక్తీశ్వరం


 యినవల్లి-క్షణ ముక్తీశ్వరం, రెండూ కోనసీమలో ప్రసిద్ధి చెందిన క్షేత్రాలు.దగ్గర్లోనే పుట్టి పెరిగి జీవించినా, ఎప్పుడూ దర్శనం చేసుకోలేదు. ఏప్పటికెయ్యది తథ్యమో ఎవరికెరుక? స్వామికి నేటికి కరుణకలిగింది దర్శనం ఇవ్వాలని అంతే! 


కోనసీమ ముఖద్వారం. 


వృద్ధగౌతమి పై రెండు వంతెనలు. 
మొదటి వంతెనచుట్టూ ఎన్ని జ్ఞాపకాలో 

ముక్తికాంతా క్షణముక్తీశ్వరస్వామి స్థలపురాణం


సజీవంగా ఉన్నట్టు కనపడ్డ బసవయ్య

ముక్తికాంతా క్షణముక్తీశ్వరస్వామి

రాజరాజేశ్వరీ సహిత ముక్తికాంతా క్షణముక్తీశ్వరస్వామి

మనవరాలు అయినవల్లి వెళదామంటే బయలుదేరాం! తను కాలేజివారు తీసుకెళితే, పదోతరగతి పరిక్షలముందు దర్శనం చేసింది. మళ్ళీ దర్శనం చేయాలని, నా చేత దర్శనం వేయించాలనుకుని బయలుదేరదీసింది.తొమ్మిదికి అయినవిల్లి చేరాం. ప్రదక్షిణాలు చేసి స్వామిని దర్శించాం. చిన్న విగ్రహం, ఆనందమయింది. గుడి తిరిగాం. ఇక్కడ నిత్య అన్నదానం ఉన్నదని తెలిసింది. ముక్తీశ్వరం ఎంత దూరం వాకబు చేశా! ఎంతోనా ఒక కిలోమీటరే అన్నారు. ఓహ్! బ్రహ్మానందమయింది. బయలుదేరి క్షణముక్తీశ్వరం చేరాం. ఆలయానికి వెళ్ళాం. ప్రదక్షిణాలు చేశాం. అప్పుడు గుర్తొచ్చింది. శివాలయంలో ప్రదక్షిణాలు ఇలా కాదుగా చేయడమని. అప్పుడు మళ్ళీ అందరికి శివాలయంలో ప్రదక్షణ ఇలాకాదని దగ్గరుండి. సోమసూత్రం దాటకుండా ప్రదక్షణలు చేయించేను.మాలో ఒకమ్మాయి కేరళాలో కొన్నేళ్ళు ఉన్నది, ఆమె చెప్పింది. అక్కడ శివాలయంలో సోమసూత్రం దగ్గర అడ్డు కట్టేస్తారూ, అని. అప్పుడు మిత్రులు విన్నకోటవారు చెప్పినమాట గుర్తొచ్చింది. గుడిలోకి దర్శనానికెళ్ళేం. అభిషేకం జరుగుతూంది.అంతరాలయంలోకి వెళ్ళిన తరవాత ఆశ్చర్యం ఆలోచనలన్నీ శూనయమైపోయాయి. ఒక్కటే ఆలోచన, స్వామికి సాష్టాంగ నమస్కారం చేయాలని. అంతే మూడు సార్లు సాగిలబడ్డా. మరో ఆలోచనేలేదు. అంతప్రశాంతత అనుభవించలేదు ఇదివరలో! దర్శనం తదుపరి బయటికొస్తేగాని మళ్ళీ ఆలోచనే కలగలేదు! గుడికెదురగా మరో గుడి అదీ క్షణముక్తీశ్వరస్వామిదే! ఇలా ఎందుకు రెండు ఆలాయాలున్నాయి? తెలియలేదు, చెప్పగలవారు దొరకలేదు. ఆ ఆలయానికెళ్ళేం అది తాళం వేయబడి ఉంది. అర్చకస్వామి బయాటికెళ్ళేరేమో తెలీదు. ఇలా కటాలలోంచి ఫోటో తీసుకుని బయటనుంచే దర్శించుకుని వచ్చేశాం.  

తిరిగి అయినవిల్లి ఆలయానికి చేరి అన్నప్రాసాదానికెళ్ళేం. చాలా శుభ్రంగా ఉంది. అన్నప్రసాదంలో ఆరోజు మామిడికాయపప్పు, బంగాళాదుంప,టమేటా కూర,కొబ్బరికాయపచ్చడీ,సాంబారు, మజ్జిగ. స్వామి ప్రసాదం పూర్తిగా తినేశా. సుగర్ పెరుగుతుందిలే అనుకుంటూ. మెతుకు వదిలితే ఒట్టు. పదార్ధాలు అంత రుచిగా ఉండిఉన్నాయి.ఇంటికొచ్చిన తరవాత సుగర్ చూసుకుంటే ఉన్నది 111, ఏమని చెప్పను!
పునర్దర్శనానికి వెళ్ళాలి, స్వామి అనుగ్రహంతో!

Thursday 22 December 2022

ఈసారొస్తే! ఇంతే సంగతులా?

 


ఈసారొస్తే! ఇంతే సంగతులా?

ఒమిక్రాన్ ప్రపంచాన్ని వదిలేసినా చైనాని వదల్లేదు, పుట్టింటి ప్రేమకదా!ప్రజలు ఈ లాక్డవున్ జైలు జీవితంకంటే చావుమేలు వదిలెయ్యండని గోల చేస్తే వదిలేసింది చైనా, వారo, కితమే. వారంలో భరతదేశాని కొచ్చిందంటున్నారు.ఇది మోడీ చేతకాన్తనం అనలేదెవరూ ఇప్పటిదాకా! ఇకముందంటారేమో చూడాలి. ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోండి, మళ్ళీ మాస్కులేసుకోండి, దూరంపాటించండి అంటోంది. కొంతమంది ఈ వేరియంట్ సోకితే లక్షణాలు కనపడవు, ఒక్కసారిగా న్యుమోనియా చుట్టుముడుతుంది అంటున్నారు.  చలికాలం, జాగర్త్తలు అవసరమే! ఈ సారొస్తే ఇంతే సంగతులా? అని అనుమానం. కాని ఆధార్ పూనావాలా అంటారూ, దేశంలో చలామందికి వేక్సీన్ ఇచ్చాముగనక భయం లేదంటున్నారు. చైనాలో మాత్రం కరోనా రోగులు పడుకోడానికి మంచాలు లేక కటికనేలమీద పడుకోబెడుతున్నారుట. ఇక శవాలు  వరసలోనే ఉంటున్నాయట, అంత్యక్రియలకి. ఎవరు చేసిన కర్మ వారనుభవించకా ఏరికైనా తప్పదన్నా! ఏనాటి ఏతీరు ఎవరు చెప్పాగలరు, అనుభవింపక తప్పదన్నా!అనుభవించుట తథ్యమన్నా!! 

  కొత్తవేరియంట్ కోనసీమకి చేరినట్టువార్త


హరి సంకీర్తన 

మార్గశిరమాసం జొరబడి పదేనురోజులు కావస్తోంది, నెలపట్టి ఈరోజుకి ఎనిమిది రోజులు. ఈనెల హరి సంకీర్తనం ముఖ్యం. జనం చలికి జడిసి ఉదయం ఏడైనా తలుపులు తీసుకు బయటకే రావటం లేదు, ఈ హరిదాసులు ఇంకా పాతకాలపు సంప్రదాయం వదలలేక  హరిసంకీర్తన కి బయలుదేరేరిలా! వందనం అభినందనం!!వందనం హరి కొరకై వందనం. వ్యత్యస్త పాదారవింద, ఇందిరాహృదయానంద!

1729   కత చెప్పిన రామానుజన్.




ఈ రోజు శ్రీనివాస రామనుజన్ పుట్టిన రోజు. మహానుభావులు అరుదుగానే పుడతారు. గొప్ప లెక్కల్లోని లెక్కల మనిషి. మనం ఎవరిని బతికుండగా లెక్కచేయం.విదేశీయులు గుర్తిస్తే మనం మనవాడే అని కీర్తిస్తాం.  చచ్చిపోయాకా జన్మదినాలు చేస్తాం. మనం భారతీయులం కదా! ఇదింతే!! పాణిని సూత్రాలలో ఒక సూత్రాన్ని ఎవరూ వివరించలేకపోయారిప్పటిదాకా! మొన్న ఒక వారం కిందటే ఒక భారతీయుడే దానిని వివరించాడు. ఎవరు గుర్తించారు?మనం మారం!!!


Monday 19 December 2022

ఊపిరి..

 ఊపిరి..


ఊపిరి చొరబడితే పుట్టేడంటారు.

ఊపిరి నిలబడితే పోయేడంటారు అన్నారో సినీకవి, నిజం కదా!

ఊపిరినిలబడితే ఎంతసుఖం .


ఆకలి దప్పికలు లేవు.

జర (ముసలితనం)రుజ (రోగం) లేవు.

శోకం, మోహం లేవు.

భయం సంశయం లేవు.

ఊపిరున్నవరకు భయం

రేపేం జరుగుతుందో!

దీనినుంచి ముక్తి పొందగలిగితే!!! సాధ్యం కాదే !!!

అదే పొందగలిగితే

స్వర్గం

ఎక్కడో లేదు, 

ఇక్కడే,ఇక్కడే,ఇక్కడే 

ఉంది.

Friday 16 December 2022

గడ్డం

  గడ్డం

గడ్డమా? గెడ్డమా? ఏది సాధువు? కొచ్చను. సాధువుకే గడ్డం ఉంటుంది, అసాధువుకి ఉండదన్నాడు మా సత్తిబాబు. ఏదైతేనేంగాని, గడ్డానికో చరిత్రే ఉండి ఉంది..గడ్డానికి చరిత్రేటి అడిగాడు మా సుబ్బరాజు. పెళ్ళిలో బెల్లమ్ముక్కటుక్జొచ్చి గెడ్డం కిందెట్టి బతిమాలేడు బామ్మర్ది, బెల్లం ముక్కలాటి నా చెల్లి/అప్పతో సంసారం చెయ్యవోయ్,సుకపడిపో, అని. దానికి పడిపోయి బెల్లమ్ముక్కలాటి వాడి చెల్లి/అప్పని కట్టుకుంటే, బెల్లం తిని తిని సుగర్ తెచ్చుకున్నట్టయింది. అక్కడితో అయిందా? కళ్ళుపోయాయి, కాళ్ళుపోయాయి. తింటే ఆయాసం తినకపోతే నీరసం,. ఇది జరుగుతున్నది. పోనీ బెల్లం ముక్క మిగిలిందా? లేదు తనుకరిగిపోయి వెళ్ళిపోయింది, తిరిగిరాని లోకాలికి,ఇంకేం మిగిలింది, మిగిలింది చింతేలే అని పాడుకోమంది. చెలియలేదు,చెలిమిలేదు, వెలుతురే లేదు. ఉన్నదంతా చీకటైతే ఉందీ నీవేలే మిగిలింది నీవేలే అనుకోడానికేం లేదు. గతము తలచి వగచేకన్న సౌఖ్యమేలేదు అన్నాడో సినీ కవి. మరచిపోలేను అని వగచాడు మరో కవి. గడ్డం ఎక్కడికి తీసుకుపోయింది?


గడ్డం పెంచడం ఇప్పుడు కొత్త ఫేషను. రాహుల్ గడ్డం అడవిలా పెరిగిపోయింది, బూచాడులా ఉన్నడన్నడో రాజకీయుడు, మరొకడు ఉండగా ఉండగా గాంధీ ఫేసు సద్దాంలా టుర్నింగ్ ఇచ్చుకుంటోందే అని జోకేడు. ఇది జోక్ కాదురా అని గోకేరు కొంతమంది. రాహుల్ కి మద్దతుగా గడ్డం పెంచడం మొదలెట్టా. మావాళ్ళంతా బలవంతం చేసి గీయించేసేరు, ఈ నిరవాకానికి గెడ్డమొకటా, అని.ఇంతోటి అందానికి వీసేబులం పసుపా అని నానుడి. అదేంటొ అందరూ మద్దతుగా నడుస్తున్నారు కాని గడ్డం ఒకడూ పెంచటంలేదు.ఇంతకీ మా రాహుల్ బాబు గడ్డం పెంచుతున్నాడుగాని ప్రధాని అవుతాడా, మిలియన్డాలర్ కొచ్చను.

మాయలపకీరు ప్రాణం చిలకలో ఉంటే, మంత్రాలు గెడ్డంలో ఉన్నాయట. సాహసం శాయరా ఢింభకా! రాజకుమారి లభిస్తుందిరా! అని పదే పదే చెప్పిన పకీరుకి,  సరసానికి  గడ్డమెందుకు అడ్డం అనడంతో రాజకుమారి వరిస్తుందని గడ్డం గోక్కుంటే, చిలకలో ప్రాణం గుటుక్కు మనిపించాడు. 


మోడి గడ్డం పెంచితే, పెరిగిపోయిన గడ్డం మీద జోకులేసేరు.మొక్కేడేమో అన్నారు.ఇది కరోనా కాలం మాట.  ముంబై నుంచి ఒక అంబష్టుడు ( మంగలి అనకూడదట)వందరూపాయలు మనీ ఆర్డర్ చేసేడు, గడ్డం ట్రిం చేయించుకోడానికి. అంటే గడ్డం ట్రిం చేయించుకునే ఖర్చు వందా అని నిర్ణయం చేస్సేడు. 


పాతకాలం గడ్డం పెచితే ఏం? మీ ఆవిడ కడుపుతో ఉందా? అడిగేవారు. లేకపోతే తిరపతి ఎంకన్నబాబు మొక్కా? అనేవారు.ఇప్పుడు పెళ్ళాం కడుపుతో ఉండడంతో గడ్డం పెంచుకునేవాళ్ళున్నారా?ఏమో! ఇంతకీ ఇది గడ్డమా? గెడ్డమా? ఏది సాధువో తెల్వదు.

Tuesday 13 December 2022

నాలాగ రాసేవాళ్ళు ---రావణ కాష్టం

ఎవరిలాగ వాళ్ళే రాసుకుంటారు, ఒకరిలాగ మరొకరు రాయరు, ఇది లోక రీతి, కాని సోషల్ మీడియా రీతి అది కాదుట. నా లాగ రాసేవారు దొరికారండోయ్! 


 Posted on డిసెంబర్ 26, 2016

శర్మ కాలక్షేపంకబుర్లు-రావణ కాష్ఠం

రావణకాష్ఠం

రావణ కాష్ఠం అంటారు కదా దీని సంగతేంటో చూడాలని రామాయణం తిరగేశా.  అందులో వాల్మీకి ఇలా చెప్పేరు. శ్లోకాలు పెట్టాలనుకున్నాగాని, టైప్ చెయ్యలేక మానేశాను, అర్ధం మాత్రమే రాస్తున్నా!

”రావణ కాష్ఠానికి గాను చందనపు కఱ్ఱలు, పద్మకములు, పేర్చారు, వట్టివేళ్ళు, సుగంధాన్నిచ్చేవాటిని పేర్చారు, వాటిపై. దానిపై జింక చర్మం పరచారు. దానిపై రావణుని శరీరాన్ని ఉంచారు. చితికి ఆగ్నేయంగా ఒక వేదిక నిర్మించారు. దానిపై పశ్చిమంగా గార్హపత్యాగ్ని, తూర్పున ఆహవనీయాగ్ని, దక్షణాన దక్షణాగ్ని ఉంచారు. సృక్కు,సృవాలతో పెరుగు,నెయ్యి కలిపినది చితిపై ఉంచారు. కాళ్ళ వైపు సోమలత తెచ్చిన బండిని ఉంచారు, తొడల మధ్య సోమలతను దంచిన కఱ్ఱరోలుంచారు. ఇక సృక్కు,సృవాలు,అరణులు,చెక్క పాత్రలు,ముసలము అనగా రోకలి ఇతర యజ్ఞ సంబంధ వస్తువులు కఱ్ఱవాటిని వాటికి తగిన ప్రదేశాల్లో ఉంచారు. మంత్రపూరితంగా మేకను బలి ఇచ్చారు. ఆ పైన నేతితో తడిపిన దర్భలుంచారు. ఆ తరవాత రావణ శరీరంపై పూలమాలలు, వస్త్రాలు ఉంచారు. ఇప్పుడు విభీషణుడు రావణకాష్ఠా  నికి నిప్పు పెట్టేడు” అన్నారు.

దీనిలో చిత్రం ఏముందని కదా! రావణుడు బ్రహ్మగారి మనుమడు, అనేక యజ్ఞాలు చేసిన వాడు. ఒక యజ్ఞంలో సోమలత తేవడానికి బండి కావాలి,దానిని తయారు చేస్తారు, కొత్తది. సోమలతను దంచడానికి రోళ్ళు తయారు చేస్తారు, సృక్కులు,సృవాలు ఉంటాయి నేతిని అగ్నిలో ఆహుతి చేసేందుకు. సోమలతను దంచే రోకళ్ళుంటాయి, చెక్కపాత్రలుంటాయి, అగ్నిని మథించే అరణులుంటాయి, ఇలా యజ్ఞానికి కావలసిన సకలమూ కఱ్ఱరూపంలోనే ఉంటుంది. వీటిని తయారుచేస్తారు. ఒక యజ్ఞానికి వాడిన వాటిని మరొక యజ్ఞానికి వాడకూడదు. రావణుడెన్ని యజ్ఞాలు చేశాడో తెలియదు. యజ్ఞం చేసినవారు, వారు యజ్ఞంలో ఉపయోగించిన సామగ్రి మొత్తం దాచుకోవాలి, దానిని వారి అనంతరం వారి శరీరంతో కాష్టం మీద వేసి తగలేస్తారు, రావణుడెన్ని యజ్ఞాలు చేశాడో అంత సామగ్రి చితి మీద వేశారనమాట.  ఇవేకాక రావణుడు నిత్య కర్మలో ఉపయోగించినవాటినీ ఇందులో చేరుస్తారు. మనవాళ్ళో మాటంటారు, ఎవరేనా వస్తువులు ఇలా దాచుకుంటుంటే ”చచ్చాకా మీదేసి తగలేస్తారా?” అని. అదొగో అదేఇది. అలాగే మరోమాట ”నీకు నల్లమేకపోతును బలేస్తారురా” అనీ తిడతారు,కోపంలో అది కూడా ఇందునుంచి వచ్చినదేనని నా ఊహ. యజ్ఞం చేసిన ఒకరు కాలం చేస్తే, ఈ ప్రక్రియకి కొంత సాయం చేశా, అందుకు ఇదంతా గుర్తొచ్చింది. ఇలా రావణకాష్ఠం మామూలుకు అనేక రెట్లు పెరిగిపోయి, చాలా ఎక్కువ సేపు తగలబడిందన మాట. ఇలా ఎక్కువ సేపు ఉండిపోయే తగవును రావణ కాష్ఠంతో పోలుస్తారు.

4 THOUGHTS ON “శర్మ కాలక్షేపంకబుర్లు-రావణ కాష్ఠం

  1. 0
    0
    Rate This

    బౌద్ధ,జైన,ప్రభావాల వలన అహింసను అవలంబించారు కాని,పూర్వకాలంలో
    యజ్ఞాలలోను,ఇతర సందర్భాలలోను జంతువధ,మాంసాహారము బ్రాహ్మణులతోసహాహిందువులందరూ
    చేసేవారని పురాణాల ద్వారా తెలుస్తున్నది.

    2016-12-26 5:33 GMT+05:30 కష్టేఫలే :

    > kastephale posted: “రావణకాష్ఠం రావణ కాష్ఠం అంటారు కదా దీని సంగతేంటో
    > చూడాలని రామాయణం తిరగేశా. అందులో వాల్మీకి ఇలా చెప్పేరు. శ్లోకాలు
    > పెట్టాలనుకున్నాగాని, టైప్ చెయ్యలేక మానేశాను, అర్ధం మాత్రమే రాస్తున్నా!
    > ”రావణ కాష్ఠానికి గాను చందనపు కఱ్ఱలు, పద్మకములు, పేర్చారు, వట్టివేళ్”
    >

    • 0
      0
      Rate This

      విన్నకోట నరసింహారావుగారు,

      మేకను బలిచ్చారన్నారు వాల్మీకి.

      ఇప్పటికిన్నీ మగళ,శుక్రవారాల్లో చనిపోతే పాడెకు ఒక కోడిని కట్టడం ఆచారం పల్లెలలో ఉంది. మాంసాహారులు కానివారు పిండి బొమ్మను చేసి శవంతో పాటు దహించడమూ ఉంది. ఈ ఆచారం కొనసాగుతూనే ఉందండి.
      ధన్యవాదాలు.

స్పందించండి

 just Clicik on  
జాస్మిన్ ( మల్లి )
 and scroll down

 · 
అనుసరించండి

రావణకాష్ఠం అంటే..

చితిపై సుగంధ చందన కట్టెలు, పద్మకములు, వట్టివేళ్లు పేర్చి, దానిపై జింకచర్మం పరిచి రావణుడి పార్థివదేహాన్నుంచారు.

పెరుగు, నెయ్యి కలిపిన పాత్ర పెట్టారు. సోమలతను తెచ్చిన బండిని కాళ్ల వైపు, తొడల మధ్య సోమలతను దంచిన కర్రరోలు ఉంచారు. ఇక అరణులు, చెక్క పాత్రలు, రోకలి తదితర యజ్ఞ సంబంధ వస్తువులను సముచిత ప్రదేశాల్లో ఉంచి మంత్రపూరితంగా మేకను బలి ఇచ్చారు. ఆపైన నేతితో తడిపిన దర్భలుంచారు. శరీరంపై పుష్ప మాలలు, వస్త్రాలుంచిన తర్వాత విభీషణుడు చితికి నిప్పు అంటించాడు. ఇవన్నీ ఎందుకంటే.. రావణుడు బ్రహ్మ మనవడు, అనేక యజ్ఞాలు చేసినవాడు.

సోమలత తేవడానికి కొత్తబండిని, దాన్ని దంచడానికి రోళ్లు తయారుచేస్తారు. నేతిని అగ్నిలో ఆహుతి చేసేందుకు సృక్కులు, సృవాలు ఉంటాయి. అగ్నిని మథించే అరణులుంటాయి. ఇలా యజ్ఞానికి వలసినవన్నీ కర్ర రూపంలో ఉండేవే. ఒకసారి వాడినవి మరో యజ్ఞానికి వాడకూడదు. యజ్ఞం చేసినవారు, గతంలో ఉపయోగించిన సామగ్రినంతా భద్రపరచాలి. అలా దాచినవన్నీ మరణానంతరం పార్థివ శరీరంతోపాటు కాష్ఠం మీద వేసి తగలేస్తారు. అందుకే రావణుడి యజ్ఞ సామాగ్రి అంతా చితి మీద పేర్చారు.

నిత్యకర్మలో ఉపయోగించివాటినీ అంతే. ఎవరైనా వస్తువులను దాచుకుంటే 'వాటిని నీ మీదేసి తగలేస్తారా?' అని, కోపమొస్తే 'నీకు నల్ల మేకపోతును బలిస్తారా?' తరహాలో పరుషంగా అనడం తెలిసిందే.

కేవలం కట్టెలు కాకుండా అన్నన్ని వస్తువులున్నందున రావణకాష్ఠం చాలా ఎక్కువ కాలం తగలబడింది. అందుకే ఎంతకూ తెగని తగవులను, దీర్ఘకాలం సాగే కోర్టుకేసులను రావణకాష్ఠంతో పోలుస్తారు.

ఇప్పుడు చెప్పండి నాలాగు రాసేవారున్నారా? ఇప్పుడు చెప్పండి నాలాగు రాసేవారున్నారా? ఇప్పుడు చెప్పండి నాలాగు రాసేవారున్నారా? 
సందేశాలు
పవన్ సంతోష్ సూరంపూడి
29, సెప్టెం 2021