Continuation of
https://kasthephali.blogspot.com/2022/09/2024-1.html
విపక్షం నుంచి ఏ ఒక్క పార్టీ బిజెపిని ఒంటరిగా దేశం మొత్తం మీద ఎదుర్కోగల స్థాయిలో లేదు. ఆర్జెడి నేత "కాంగ్రెస్ బలంగా ఉన్న చోట మీరుపోటీ చేయండి, స్థానిక పార్టీలు బలంగా ఉన్నచోట వాటిని బలపరచండి" అని సూచించారు, దానికి కాంగ్రెస్ వారిచ్చిన సమాధానం " మేమింకా బలహిన పడదలుచుకోలేదని" పురిటిలోనే సంధికొడుతుంటే పొత్తులెక్కడా? అనేదే సందేహం.
ప్రధాని పదవికి పోటీ పడాలని అనుకునేవారు ఈ కిందివారని ప్రజలమాట, మీడియా మాట.
రాహుల్ గాంధి: వీరి పార్టీకి స్థానిక పార్టీలకి చుక్కెదురు, అన్ని రాష్ట్రాలలోనూ. పాలనానుభవం శూన్యం, కనీసం పంచాయతి ప్రెశిడెంట్ గా కూడా పని చేసిన అనుభవం లేదు. పైనుండి చెప్పడం వేరు, పని చేయడం వేరు. ఇది వీరికి పెద్ద మైనస్ పాయింటే. ఎత్తుచేతివారి బిడ్డ గనక పాలనానుభవం పుట్టుకతోనే వచ్చేస్తుందనేవారూ లేకపోలేదు. ఇతనికి సమయం సందర్భం తెలిసిమాటాడే అలవాటు పూజ్యం అని అంటారు. విపక్షంలో కాకలు తీరిన యోధులున్నారు, పాలనానుభం కొల్లలుగా ఉన్నవారున్నారు. ఇతనిని ప్రధానిగా ఒప్పుకోగలరా అన్నది, పెద్ద ప్రశ్న.మరొకరిని వీరి పార్టీ నుంచి ఎన్నుకునే సావకాశం చెప్పలేనిదే!వీరికి రాగల సీట్లు 50. శత్రువులెక్కువ.
మమత: వీరు బెంగాల్ లో మూడో సారి ముఖ్యమంత్రిగా ఉన్నారు. వీరికి బెంగాల్లో తప్పించి మరో రాష్ట్రంలో పలుకుబడి లేదు. బెంగాల్ దాటి వీరి ప్రభ లేదు,సామాన్యులెవరికి తెలియనివారే! తృణమూల్ పార్టీకి, కాంగ్రెస్ కి, సి.పి.ఎమ్ లు రాష్ట్రంలో ప్రత్యర్థులు. బెంగాల్లో ఎక్కువలో ఎక్కువ వీరికి 20 సీట్లకంటే వచ్చే సావకాశం లేదు. మరొక పార్టీకి అదే తమిల్నాడులో డి.ఎమ్.కె కి మాత్రం వీరితో సమానంగా సీట్లు వచ్చే సావకాశం.మమత తాము,అఖిలేష్, ఝర్ఖండ్ వారు ఒక జట్టని ప్రకటించారు. వీరికి రాబోయే సీట్లు 20.
నితీష్: వీరు బీహార్ ముఖ్యమంత్రిగా చాలాకాలం నుంచే ఉన్నారు. పాలనానుభవం దండిగా ఉన్నవారే!ఇప్పటికే చాలా సార్లు తమపార్టీని కాంగ్రెస్ నుంచి, బి.జె.పి కి మరల ఇటునుంచి అటు కప్పగంతులు వేసి అధికారం నిలబెట్టుకున్నారనే అపప్రథ ఉన్నది. ఇప్పుడైతే ఎన్నికల తరవాత మళ్ళీ బి.జె.పి లోకి గెంతరనే నమ్మకం ఎక్కువమందికి లేదు.అంతేగాక వీరు బి.జె.పి తరఫున పనిచేస్తూ కాంగ్రెస్ వైపుకొచ్చారు, గూఢచారిగా అనే మాట కూడా వినపడుతోంది. వీరికి బీహార్లో తప్పించి మరో రాష్ట్రంలో పట్టులేదు. నితీష్ ఉ.ప్రదేశ్ నుంచి పోటీ చేస్తారని నేటి వార్త. వీరికి ఉ.ప్ర లో పట్టులేదు, కాని వీరికి ఉ.ప్ర మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ తన సీటు ఫూల్పూర్ వీరి పోటికి త్యాగం చేయబోతున్నట్టు వార్త.నితీష్, బాబోయ్! నేనసలు విపక్షాల తరఫున ప్రధాని అభ్యర్థిగా పోటీ లో ఉన్నానని చెప్పలేదు మొర్రో! అని మీడియా ముందు గోల. వీరికి అందరూ మిత్రులే అలాగే అందరూ శత్రువులే!!! వీరికి రాబోయే సీట్లు 6.
శరద్ పవార్: వయసు మీద బడింది,ఆరోగ్యమూ సరిలేదు, వీరు కేంద్ర మంత్రిగానూ ఉన్నారు, మరాఠా చాణుక్యుడంటారు. వీరికి మహరాష్ట్రలో ఓ చెంపనే బలముంది,మరే రాష్ట్రంలోనూ చెప్పుకోతగ్గ బలం లేదు. వీరికి రాబోయే సీట్లు 6 కి పెరగవు. వీరికి కొత్త మిత్రులు పాత శత్రువులు ఒకటే! ఎవరితోనైనా కలసిపోతారు, తమ పని ముఖ్యం,అంతే.
అఖిలేష్ యాదవ్ : ఉ.ప్ర. కి ఉన్న సీట్లు 80. వీరికి ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం ఉంది.హిందీ రాష్ట్రాలలో కూడా వీరికి పట్టులేదు, తమ రాష్ట్రం తప్పించి. వీరికి బి.ఎస్.పి కి కుదరదు. వీరికి రాగల సీట్లు ఇరవైలోపే.ప్రధాని కావాలనే కోరిక ఎక్కడా వెలిబుచ్చినట్లు లేదు.
కేజ్రివాల్: వీరినంతా క్రేజివాల్ అంటారు,అదేమో మరి. వీరు ఢిల్లీ లోనూ పంజాబ్ లోనూ అధికారంలో ఉన్నారు. రేపు హిమాచల్ లోనూ గుజరాత్ లోనూ ప్రభుత్వం ఏర్పాటు చేసేస్తామంటున్నారు. వీరికి కాంగ్రెస్ అంటే చుక్కెదురు. మేము అప్పుడే బి.జె.పి వ్యతిరేక ఫ్రంటులో చేరమని ప్రకటించారు. అంటే తటస్థంగా ఉండి, ఎక్కువ లాభం పొందాలని ఆశ, దురాశ కాకుంటే మంచిదేనేమో!.
ఇక దక్షణాది కొస్తే, ఇక్కడ్నుంచి ప్రధాని అయ్యే సావకాశాలే తక్కువ.మొత్తం దక్షణాది రాష్ట్రాలలో సీట్లు అన్నీ కలిపి ఆంధ్ర25+తెలంగాణా17+తమిల్నాడు39+కేరళా20+కర్నాటక28=129.ఇక్కడినుంచి ప్రధాని కావాలని ఉవ్విళ్ళూరుతూ మోడీ ని దించేస్తాం, ఆ తరవాత మాదే ప్రభుత్వం అంటున్న కె.సి.ఆర్ అనే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనబడే తెలంగాణా ముఖ్యమంత్రి, ప్రథములు.పోనీ ఈ దక్షణాదివారంతా ఒక మాట మీదుంటారా అంటే సాధ్యం కానిదే! వీరికి కాంగ్రెస్ కీ కుదరదు. వారున్నచోట వీరుండరు. కాంగ్రెసేతర,బిజెపియేతర ప్రతిపక్షపార్టీలకూటమా? ఇదివరలో చాలా ప్రయత్నాలే జరిగాయి, కాని ఏదీ బతికి బట్టకట్టలేదు.కొత్త పార్టీ స్థాపనా? ఎమో చూడాలి.ఒక రాష్ట్రంలో కొత్తపార్టీ పెట్టి తొమ్మిది నెలల్లో నెగ్గుకురాగలగినవారు ఎన్.టి.ఆర్ మాత్రమే! దేశం మొత్తం మీద కొత్త పార్టీ పెట్టి ఆశయాలు చెప్పి అన్ని రాష్ట్రాలలో ఒప్పించగల కార్యకర్తలు, మంది, మార్బలం సమకూర్చుకోవడం తేలికా, రెండేళ్ళలో సాధ్యమా? అభిమానులు జరుగుతుందంటే విని ఆనందించచ్చు.కాని ఇది నిజానికి దూరమేమో! అన్ని పార్టీలు ఎక్కడివారక్కడ పోటీ చేసి ఎన్నికలయ్యాక పొత్తులు కుదుర్చుకుంటాం అంటే ప్రజలు నమ్ముతారా?
కెసిఆర్: వీరి పార్టీ తెలంగాణా లో పదేళ్ళుగా పాలనలో ఉంది. తెలంగాణాలో పట్టున్నది. కాని రాష్ట్రం దాటి వీరి మాట వినేవారెవరనేది పెద్ద ప్రశ్న.కొత్త పార్టి పెడుతున్నా! ఖబడ్దార్ అని గర్జిస్తున్న మాట నిజం. వీరి రాష్ట్రం లో మొత్తం సీట్లు 17 కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. కాని ఆ స్థానాన్ని బి.జె.పి ఆక్రమిస్తున్నందుకే వీరి గర్జనలని విజ్ఞుల మాట. వీరికి మహా ఐతే 10 సీట్లు రావచ్చు. వీరికి కాంగ్రెస్ కి పొత్తు లేదు. వారి నీడ కూడా పడటానికి ఇష్టపడని వీరు కాంగ్రెస్ లేక కేంద్రంలో బిజెపి కి వ్యతిరేకంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలరా?వీరి మీద మరో అపప్రధ కూడా ఉంది,కొడుకుని రాష్ట్రంలో ముఖ్యమంత్రిని చేసి తాను కేంద్రంలో చక్రం తిప్పాలనుకుంటున్నారంటారు.
చంద్రబాబునాయుడు: తెలుగుదేశం పార్టి బిజెపితో అంటకాగి YSR CP వేసిన ఎత్తుకు చిత్తయి,బిజెపితో కటీఫ్ చేసుకున్నారు,ప్రభుత్వం నుంచీ బయటికొచ్చారు. దీనికీ ఎవరూ తప్పుపట్టాలేదు. కాని, బద్ధ వ్యతిరేకి ఐన కాంగ్రెస్ తో 2019 లో పొత్తు పెట్టుకోడానికి ప్రయత్నంతో ప్రజలు తిరస్కరించారు. అప్పటినుంచి,ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ అధికారానికి దూరమై ఉన్నవారు.నలభై ఏళ్ళ పాలనానుభవం, రాజకీయానుభవం పనిచేయలేదు.వీరికి రాష్ట్రంలో పది సీట్లురావచ్చు.మరో రాష్ట్రంలో పట్టులేదు.పట్టుందని ప్రయత్నించిన కర్ణాటకలో ఎదురు దెబ్బే తగిలింది. వీరి మీద మరో అపప్రధ కూడా ఉంది,కొడుకుని రాష్ట్రంలో ముఖ్యమంత్రిని చేసి తాను కేంద్రంలో చక్రం తిప్పాలనుకుంటున్నారంటారు.
కమ్యూనిస్టులు:అంతర్జాతీయ పార్టీ మాదని చెప్పుకునే వీరు దేశంలో కొన్ని చోట్ల మాత్రమే ఉన్నారు. బెంగాల్ లో తృణమూల్ దెబ్బకి మట్టికరిచి మరి తేరుకోలేకపోయారు. ఇక వీరికి పట్టున్న మరోచోటు కేరళా, కాని ఇది కూడా కుటుంబ పార్టీ ఐపోతోందంటున్నారు. చారిత్రిక తప్పిదాలు చేయడం వీరి అలవాటు. మరెక్కడా ఉనికి ఉన్నట్టు లేదు. కేరళాలోనే వీరికి రాగల సీట్లు 10.
1962 లో మొదటి సారి ఓటేసిన వాడిని, నాటినుంచి ఎన్నికలు చూస్తున్నవాడిని,రాజకీయనాయకులతో,
రాజకీయపార్టీలతో సన్నిహితంగా ఒక ఇరవై సంవత్సరాలు గడిపినవాడిని. ఆరోజుల్లో కూడా కాంగ్రెస్ నీ గద్దె దించేస్తామన్న వారే అందరూ, కాని ఆ పార్టీ చిత్తు కావడానికి దగ్గరగా ఏభై ఏళ్ళు పట్టింది. అది కూడా ఆ పార్టీ చేసుకున్న స్వయంకృతాపరాధం మూలంగానే!స్వాతంత్ర్యం తరవాత పాలూ తేనెలు ఈ పార్టీ దేశంలో ప్రవహించేస్తుందని నమ్మి మా తాతలు ఆస్థులు తెగనమ్మి ఈ పార్టీని బతికించారు, మమ్మల్ని వీధులపాలూ చేశారు.
అంతర్గత ప్రజాస్వామ్యం తో దేశప్రజల ఆకాంక్షలు తీర్చగల మరో పార్టీ ఉండటం మంచిదే! అటువంటి పార్టీని నిర్మాణం చేస్తే ఆనందమే.స్వార్ధమే, పరమావధిగానూ, ద్వేషమే ఊపిరితో బతికే పార్టీలు ఏమి చేయగలవన్నదే ప్రశ్న.
పై చెప్పినవారే కాక వెలుగులోకి రాని వారు చాలామందే ఉన్నారు, అందరూ పల్లకీ ఎక్కేవారే మోసేవారెవరన్నదే ప్రశ్న.
అనుకున్నట్టే కాక ఇంకా ఎక్కువ సీట్లే వస్తాయని ఊహిస్తూ అంచనా
CON60+TMC 25+DMK25+NCP10+AAP10+SP 20+RJD 20+TDP10+TRS10 +CPM10 Total 200 small parties say 30.Now the total is 230 along with congress, 170 without congress. It is difficult to understand how a governemt can be formed at centre.
ఇందులోనే, ఒకరినీడ మరొకరిపై పడినా సహించలేరు.ఒకరిపై ఒకరికి నమ్మకమూ లేదు వీరికి పొత్తెలా? ప్రజలని ఎలా నమ్మిస్తారు?అటువంటి కూటమికి విదేశీ విధానం ఏమిటి? చాలా ప్రశ్నలకి సమాధానం లేదు.కొన్ని పార్టీలు ఎప్పుడూ అధికారంలో ఉన్నవారితో అంటకాగుతాయి, అది సహజం కూడా. ఎన్నికల తరవాత ఎంతమంది ఈ కూటమిలో ఉంటారో! ఎవరు జారుకుంటారో ఎవరు చెప్పగలరు?
బలవంతంగా వీరంతా కలిసినా అదెంతకాలం? అలా కలపగల వారెవరు? సామాన్యునికి అన్నీ సమాధానం లేని ప్రశ్నలే!