Wednesday, 7 September 2022

ఉదయ ప్రార్ధన శ్లోకాలు-అర్ధాలు/పరమార్ధాలు.





ఉదయ ప్రార్ధన శ్లోకాలు-అర్ధాలు/పరమార్ధాలు.


 బాల భాస్కరుడు




ఉదయమే నిద్ర లేచి మంచం దిగే ముందు పడకమీదనుంచే సెల్ ఫోన్ మొహం చూసిగాని మంచందిగటం లేదెవరూ! నేటి కాలంలో, కాని, కొంతమంది ఇంకా ఈ శ్లోకాలు పఠించి చివరి శ్లోకంతో మంచం దిగుతూ భూమికి నమస్కరించే వారున్నారు, అరుదుగా! 
అసలీ శ్లోకాలేంటి? వాటి అర్ధ పరమార్ధాలేంటీ?


గురు బ్రహ్మ గురు విష్ణుః
గురుదేవో మహేశ్వరః
గురు సాక్షాత్పర బ్రహ్మ
తస్మై శ్రీ గురవేనమః

గురువు బ్రహ్మ,విష్ణు, మహేశ్వరుడు, సాక్షాత్తు దేవుడు, అటువంటి గురువుకు నమస్కారం.

ఆపదామపహర్తారం
దాతరం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం
భూయో భూయో నమామ్యహం

ఆపదలనుంచి కాచేవాడు, సంపదలిచ్చేవాడు,ఎల్లరచే కొనియాడబడేవాడైన రామునకు మరల, మరల నమస్కారం.

కరాగ్రే వసతే లక్ష్మీ
కరమధ్యే సరస్వతీ
కరమూలే స్థితా గౌరీ
ప్రభాతే కరదర్శనం

చేతి చివర లక్ష్మి,మధ్య సరస్వతి, చెయి మొదట గోవిందుడు ఆవాసం చేస్తున్న చేతిని చూస్తున్నానని,అంటూ కనులు తెరచి,అరచేతుల్ని చూచి కనులకద్దుకుంటాం.

సముద్రే వసనే దేవీ
పర్వతే స్తనమండలే
విష్ణుపత్నీనమస్తుభ్యం
పాదస్పర్శం క్షమస్వ మే

సముద్రంలో తేలియాడుతున్న దేవత, పర్వతాలే స్తనమండలాలుగా ఉన్న విష్ణుపత్నియైన భూదేవికి నమస్కారం, కాలితో తొక్కుతున్నాను క్షమించు.
అంటూ కాలు భూమి మీద పెడతాం. 


జన్మనిచ్చిన తల్లి మొదటి గురువు బ్రహ్మ స్వరూపం, చిటికినవేలు పట్టి నడిస్తే లోకాన్ని చూపించిన గురువు తండ్రి విష్ణు స్వరూపం, అజ్ఞానాంధకారాన్ని జ్ఞానమనే వెలుతురుతో పాలద్రోలిన గురువు మహేశ్వర స్వరూపం. ఆ తదుపరి గురువే దైవ స్వరూపం అని నొక్కి వక్కాణించారు,అనగా తల్లి,తండ్రి, గురువులే దైవ స్వరూపాలని చెప్పేరు, గురు సాక్షత్ పరబ్రహ్మ అంటూ.అటువంటి గురువులైన తల్లి,తండ్రులకు, గురువుకు దైవానికి నమస్కారం. 
ఆతదుపరి

రామో విగ్రహవాన్ ధర్మః ఇది మారీచునిమాట, రాముడు మూర్తీభవించిన ధర్మం. ధర్మో రక్షతిః రక్షితః, ధర్మాన్ని ఆచరిస్తే ధర్మం రక్షిస్తుంది. అటువంటి ధర్మానికి మరల,మరల నమస్కారం,అంటే ధర్మాన్ని ఆచరిస్తానని ప్రతిన, ధర్మం రక్షిస్తుందని నమ్మకం. ధర్మానికి నమస్కారం.



చేతిలో లక్ష్మి, సరస్వతి, పార్వతి నివసిస్తారు. గోవిందా అంటే నారాయణి,  నారాయణి,నారాయణులకు అభేధం, అక్కడ గోవిందా అంటే పార్వతి, లలితాదేవి స్వరూపం. లలితా దేవికి మరో పేరు ఇఛ్ఛాశక్తి,జ్ఞానశక్తి,క్రియాశక్తి స్వరూపిణీ అంటారు. ఈ మూడు రూపాలూ బ్రహ్మ,విష్ణు, మహేశ్వరుల శక్తి రూపాలు. సర్వమూ నా చేతిలో ఉంది, నా ప్రయత్నంతో సర్వమూ సమకూడుతుందనే నమ్మిక,ప్రతిన. నా ప్రయత్నానికి దైవ శక్తి తోడవాలి,తోడవుతుందని కనులు తెరచి అరచేతులను చూచి కళ్ళకద్దుకుంటాం, ఇది స్వశక్తి మీద నమ్మకం కలగజేసుకోవడం.

సముద్రంలో నివసించే దేవీ, పర్వతాలే స్తనాలుగా కలిగిన, విష్ణుశక్తి స్వరూపిణి భూదేవికి నమస్కారం, కాలితో తొక్కుతున్నాను,క్షమించమని వేడటం. 

సముద్రంలో భూమి ఉందా,భూమి మీద సముద్రం ఉందా? వికట ప్రశ్న. పంచభూతాల సృష్టి క్రమం చూస్తే ముందు పుట్టినది, ఆకాశం, దానినుంచి పుట్టినది వాయువు, వాయువునుంచి అగ్ని పుట్టింది, అగ్ని నుంచి నీరు పుట్టింది,నీటి నుంచి భూమి పుట్టింది. ఇప్పుడు చెప్పండి నీటిలో భూమి ఉందా? భూమి మీద నీరు ఉందా? అదే సముద్రే వసనే దేవీ, పర్వతే స్తన మండలే, భూమిపైనున్న పర్వతాలని స్తనాలతో పోల్చారు. ఎందుకు? బిడ్డ పుట్టినప్పటినుంచి తల్లి ఆహారం పాల ద్వారా స్తనాలనుంచే ఇస్తుంది. అలాగే భూమి పైనున్న పర్వతాలు స్తనాలలా నీటిని నదులద్వారా ప్రజలకందజేసి, ఆకలి తీరుస్తూ ఉంది.విష్ణుపత్ని, విశ్వం విష్ణు సహస్రనామాలలో మొదటి రెండు నామాలు. సృష్టి సమస్తం విష్ణుమయం, "సర్వం విష్ణుమయం జగత్", విష్ణువు శక్తి స్వరూపమే సృష్టి. మనకు కావలసిన ఆహారం నుంచి సర్వమూ భూమి నుంచి వచ్చేవే. భూమినుంచి పుట్టి భూమిలో కలసిపోతాం. అటువంటి భూమికి కృతజ్ఞతతో కూడిన నమస్కారం.  



3 comments:

  1. దినారంభానికి శ్లోకాలు బాగున్నాయి శర్మ గారు 🙏.

    “కరాగ్రే వసతే లక్ష్మీ ……. “ శ్లోకంలో రకాలు ఉన్నాయేమిటండి? నాకు నేర్పించబడినది అయితే ఇది 👇 :

    కరాగ్రే వసతే లక్ష్మీ: కరమధ్యే సరస్వతీ |
    కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనమ్ ||

    ReplyDelete
    Replies
    1. విన్నకోటవారు,
      ఇవి చిన్నప్పుడు నేర్చుకున్నవి, నేర్చుకోడంలో పొరబాటో, మరుపో ఇలా మారిపోయాయి. ఇక మీరు చెప్పినది కూడా బాగున్నట్టు ఉంది. చిన్నపొరబాట్లని మిత్రులు శ్యామలరావు గారు సరిజేశారు. మార్పు చేశాను తిలకించండి

      Delete
    2. 🙏🙏
      శ్యామలరావు గారు సరిజేసారంటే ఇక చెప్పేదేముంది.

      Delete