ఏడిచేవాళ్ళ ఎడం పక్క కుట్టేవాళ్ళ కుడిపక్క కూచోకూడదు,ఇదొక నానుడి. ఏం ఎందుకు కూచో కూడదూ? కూచుంటే ఏమవుతుంది? ఇది జిజ్ఞాసువుల ప్రశ్న. ఏమవుతుందా?
నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళేవస్తాయన్నారు సినీకవి, ఇది నిజమేకాని ఏడిస్తే మాత్రం కన్నీళ్ళతో పాటు ముక్కులో కూడా నీళ్ళొస్తాయి, ఇది నిజమే... ప్రయత్నించకండి.... :). ఈ ఏడుపుంది చూశారూ, దీని దుంప తెగ దీనికీ ఆడ మగ తేడా ఉందిటండి. ఆడవారి నెత్తిన నీటికుండ సిద్ధంగా ఉంటుందనీ అంటారు. పాపం అలాగయినా వారు తమ గుండె బరువు దించుకుంటారు, మరొకరికి ఆ బరువు ఎక్కించేస్తారు లెండి. ఇక ఏడ్చేవారి ఎడంపక్క కదా అసలు సంగతి,ఏడిస్తే కన్నీళ్ళతో పాటు ముక్కులో కూడా నీళ్ళొస్తాయి కదండీ, వాటిని, కొండొకచో, అవి గట్టిపడి పచ్చని ముద్దగా కూడా తయారవుతాయి. వాటిని సుతారంగా ఎడమ చేతి వేళ్ళ మీదకి చీది, అలా చీదిన పదార్ధాన్ని, అదేలెండి దాని పేరే చీమిడి, దీన్ని నేల మీద విసిరి కొట్టి పక్కన ఏం ఉంటే దానికి చెయ్యి రాసేస్తారు. అమ్మయ్య ఇప్పుడు తెలిసిందా ఎడమ పక్క ఎందుకుకూచో కూడదో! మనం కూచుంటే మనమీదే చీదెయ్యచ్చు లేదా ఆ చెయ్యి రాసెయ్యచ్చు. మరి కుట్టేవాళ్ళకి కుడి పక ఏమని కదా! ఇప్పుడంటే సూదితోనూ, దబ్బనం తోనూ అసలు కుట్టటమేలేదు. చేతికుట్టు లేనే లేదు, అందుచేత తెలియదు కదా. కుట్టేవారు ఎడమ చేత్తో బట్టని పట్టుకుని కుడి చేత్తో సూది పట్టుకుని బట్టని కుడతారు. అలా కుట్టిన సూదిని దారం ఉన్నంత పొడుగునా పైకి లాగుతారు. అలా పైకిలాగబడిన సూది కుడి పక్క కూచుంటే మనకి గుచ్చుకోడం ఖాయం కదా! అందుచేత కుట్టేవారి కుడిపక్క కూచోవద్దన్నారు.
ఏం ఏడం చేతిలోకే చీదుతారా? కుడి చేతితోనే కుడతారా అని అనుమానం రావచ్చు, తప్పు కాదు లెండి. మానవ మెదడు రెండు అర్ధభాగాలుగా ఉంటుంది. అవి ఎడమవైపు అర్థభాగం , కుడివైపు అర్థభాగం. మన శరీరం లో కుడివైపు అవయవాలను మెదడులోని ఎడమవైపు అర్థభాగమూ, ఎడమవైపు అవయవాలను మెదడులోని కుడి వైపు అర్థభాగమూ నియంత్రిస్తుంటాయి. ఎడమవైపు పక్షవాతమొస్తే కుడివైపు మెదడు దెబ్బతిన్నట్టుట. సామాన్య మానవుల మెదడులో ఎడమ వైపు అర్థభాగం, కంటే కుడివైపు దానికంటే చురుగ్గా ఉంటుంది. అందుకే అందరూ సాధారణంగా కుడి చేయి వాటమై ఉంటారు. మరి ఎడం చేతివాటం వాళ్ళు దీనికి వ్యతిరేకంగా కుడివైపు అర్థభాగం చురుగ్గా ఉంటుందట. ఇలా ఎడం చేతివాటంగాళ్ళు, (చేతివాటం గాళ్ళు కాదులెండి,) గొప్పవారై ఉంటారట. కొంతమంది కుడి ఎడమ చేతులతో ఒకేలా పని చేయగలరు, వీరు సవ్యసాచులు, అంటే వీరి మెదడులో రెండు అర్థభాగాలూ సమానంగా పని చేసాయన్నమాట. ఇంత తిరకాసున్న మెదడు స్త్రీ పురుషులలో సమానంగా ఉంటుందా? తెలియదు కాని ఆడవారు మగవారికంటే అన్నిటిలోనూ ఎక్కువేనట, శాస్త్రకారుని మాటే ఇది. ఇదిగో చూడండి.
స్త్రీణా ద్విగుణమాహారం బుద్ధిశ్చాపి చతుర్గుణమ్
సాహసం షడ్గుణంచైవ కామోష్ట్య గుణిముచ్యతే
పురుషునితో పోలిస్తే స్త్రీ ఆహారం రెండు రెట్లు తీసుకుంటుంది, తెలివిలో నాలుగు రెట్లు హెచ్చు. సాహసంలో ఆరు రెట్లు, కామం, కోరికలో ఎనిమిది రెట్లూ ఉంటుందిష. అదేంటో కాని ఇన్ని చెప్పినాయన ఏడుపులో చెప్పేరు కాదు కాని, అమ్మో వీరి ఏడుపు మరొకరినిఏడిపిస్తుందండీ.
నేటి కాలానికి మరొక మాటా చెప్పేరటండి ఆధునికులు. రాజకీయనాయకుడికి ముందూ గాడిదకి వెనకాలా నుంచోవద్దనీ, ఎందుకో తెలిస్తే చెప్పరూ :)