అమ్మయ్య! బతికి బయటికొచ్చేరు.
సిల్క్ యారా దగ్గర నిర్మాణం లో ఉన్న సొరంగంలో ప్రమాదవశాత్తు 41 మంది శ్రామికులు చిక్కుకుపోయారు, 17 రోజులుగా. నిన్న అర్ధరాత్రి బయటికొచ్చేరు,క్షేమంగా
ప్రమాదం జరిగినప్పటినుంచి చిక్కుకుపోయినవారిని బయటకు తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అనేక సంస్థలు రాత్రిపవలు తేడా లేక ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నాయి. బయటనుంచి చిక్కుకుపోయినవారి దగ్గరికి ఒక ఒక మార్గం ఏర్పాటు చేయడం ఒక ప్రయత్నం. దీనికోసం పెద్దపెద్ద యంత్రాలని హుటాహుటిన తరలించడం జరిగింది. ఒక యంత్రం కొంత పనిచేసి పాడయింది.ఆ తరవాత మరొక పెద్దయంత్రం ఆ పని కొనసాగించి రిపేరుకి సాధ్యం కానంతగా పాడయింది. ఏర్పాటు చేస్తున్నదారి, చిక్కుకున్నవారి నుంచి పన్నెండు మీటర్ల దూరాన ఆగిపోయింది. అప్పుడు సనాతనమైన ఎలుక బొరియ విధానమే అక్కరకొచ్చి చివరి పన్నెండు మీటర్లు పద్దెనిమిది గంటలలోపున నిపుణులు పూర్తిచేసేరు. దానిలోకి స్టీల్ పైపుని అమర్చారు, మనిషిపట్టి తప్పించుకోను వీలున్నదానిని. దాని ద్వారా లోపల చిక్కుకున్న శ్రామిక సోదరలంతా క్షేమంగా బయటకొచ్చేరు. శ్రామికుల్ని బయటకు తీసుకొచ్చేందుకు పని చేసిన సంస్థలకి,ఆందుకోసం పని చేసిన వారందరికి జేజేలు! ఇక చిక్కుని ఉండిపోయిన శ్రామికులు నమ్మకం కోల్పోక ఉండి జయప్రదంగా బయటకు వచ్చినందులకు అభినందనలు. ప్రయత్నం సఫలం చేసిన భగవానునునికి నమస్కారాలు.
ఎలుకబొరియ విధాన తవ్వకం భారతదేశం లో నిషేధింపబడింది, కాని అదేవిధానం నేడు అక్కరకొచ్చింది..
పాతంతా రోతకాదు! కొత్త వింతాకాదు!! పాతకొత్త విధానాల మేళవింపు అద్భుతఫలితాలిస్తుంది.