ఫిబ్రవరి ౩౦
ఒకప్పుడొక ఉద్యోగికి స్పెషల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ రాయాలిసొచ్చింది. నేను స్పెషల్ సి.ఆర్ రాస్తే ప్రమోషన్ తప్పదని అనుకునేవారంతా! అదో చిత్రం :)
ఆ ఉద్యోగికి, నా పై ఆధికారి ఇచ్చిన రిపోర్ట్ ప్రోఫార్మా పుచ్చుకుని రాయడానికి మొదలెట్టి చూస్తునుగదా! అతని పుట్టిన తారీకు ఫిబ్రవరి ౩౦గా కనపడింది,దానిమీద. అతన్ని అడిగా ఇదేమని. అతను చెప్పుకొచ్చేడిలా!
''నేను ఇంటిదగ్గర అల్లరి చేస్తున్నానని మా నాన్న నన్నుబళ్ళో వేసేడు.బళ్ళో వేసినపుడు మాస్టారు వీడి పుట్టినరోజేంటి? అని మా నాన్ననడిగితే, శివరాత్రి పదిరోజులుందనగా పుట్టేడని చెప్పేడుట. దానిమీద మాస్టారో తారీకు నిర్ణయించి వేసేరు,అదే ఇదిట. మా నాన్న చదువుకోలేదు,వ్యవసాయదారుడు,పల్లెటూరివాడు. నా చదువుకి ఎప్పుడూ ఎక్కడా భంగం రాలేదు. హైస్కూల్లో,కాలేజిలో. ఎవరూ నన్ను పుట్టినరోజెంత అని అడగలేదు. కాలేజిలో ఉండగా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసాను. అప్పుడూ నన్నెవరూ అడగలేదు. నన్ను పెరమనెంటు చేసేముందు, ఓరోజు ఓ కాయితమిచ్చింది డిపార్టుమెంటు. అందులో నీ పుట్టినరోజు ఫిబ్రవరి ౩౦గా నమోదయి ఉంది, నీ అసలు పుట్టినరోజు ఆధారాలతో సమర్పించవలసినదని. దానికి నేను ఇదివరలో ఇచ్చినకాగితాలలో పుట్టినరోజు ఫిబ్రవరి ౩౦గా ఉన్నది. అదే నా పుట్టినరోజుగా భావించాను, మరి వేరుకాగితాలు లేవని చెప్పుకున్నా! అప్పుడు, ఫిబ్రవరికి 29 రోజులుండచ్చేమోగాని ౩౦ఉండవు. నీ పుట్టినరోజు మార్పు చేసుకుని, మార్పు ఆధారాలతో సమర్పించూ! అని. శలవు పెట్టేను. చిన్నప్పుడు చదువుకున్న బడికెళితే అక్కడ ఫిబ్రవరి౩౦గానే ఉన్నది. ఇప్పుడు దాన్ని మార్చలేమన్నారు,అక్కడివారు. అదే సమాధానం,హైస్కూలు,కాలేజిల్లో కూడా ఎదురయింది. కరణం,మునసబ్లు,తాసీల్దారు ని అడిగా అక్కడా పని కాలేదు. ఎమ్.ఎల్.ఎ దగ్గరకెళ్ళా,ఎం.పి దగ్గరకెళ్ళా. ఎక్కడకెళ్ళినా పనికాలేదు. చాలాప్రయత్నాలు చాలా రకాలుగా చేసేను. అబ్బే ఎవరూ పుట్టినరోజు మార్పు చెయ్యలేదు, సరిగదా, మార్పు చెయ్యలేమని చెప్పెసేరు. ఇది చెప్పినంత సులువుగా జరగలేదు. కొంతసొమ్ము ఖర్చయింది, ఒక సంవత్సరం పట్టింది. ఎప్పటికప్పుడు జరుగుతున్నది డిపార్టుమెంటుకు చెప్పుకుంటూ వచ్చా! నా పుట్టినరోజును మీరెలా నిర్ణయిస్తే అదే నాకు ఆమోదమని కూడా తెలిపాను. ఉద్యోగం చేసుకుంటున్నా! తంటసం మాత్రం ఉండిపోయింది. ఒకపెద్దాయన తో ఇదంతా చెప్పుకుంటే ,''కోర్టుకిపో'' అన్నారు. కోర్టుకి వెళ్ళేను ఒక లాయర్ని పట్టుకుని, అక్కడ కేస్ నడుస్తుండగా ఇక్కడ డిపార్ట్మెంటు నాకో ఛార్జిషీట్ ఇచ్చింది. దాని పర్యవసానంగా ఉద్యోగం నుంచికూడా పంపేయచ్చు.
మళ్ళీ పాతపాటే పాడేను, సమాధానంగా. మళ్ళీ పాతపాటపాడుతున్నా వంటే అయ్యా! నాదగ్గర కొత్తగా చెప్పడానికేం లేదు,కనక పాతమాటే చెబుతున్నా, అని చెప్పేను. ఇది పనిగాదని మీలాటాయన దగ్గరకిపోయాను. విషయం చెప్పుకున్నా! కాయితాలన్నీ చూసి, రాసి ఉంచుతా తరవాత రా, అని చెప్పిపంపేరు. కొన్నిరోజుల తరవాత వెళితే ఆయనో డ్రాఫ్ట్ రాసారు. అది సమర్పించా డిపార్టుమెంటుకి. అందులో ఆయన, నా పుట్టిన రోజు ఫిబ్రవరి ౩౦గా నమోదయింది, బడిలో. అప్పటికి నేను చాలా చిన్నవాడిని, నాపుట్టినరోజేదో నాకే తెలియని వయసు,మేజర్ని కాను. నా తండ్రి చదువుకోనివాడు, ప్రస్తుతం ఆయన లేడు,చనిపోయాడు, తల్లీ లేదు,చనిపోయింది. నన్ను స్కూల్ లో జాయిన్ చేసుకున్న మాస్టారు చనిపోయారు. మాస్టారు చదువుకున్నవారే కదా! నా పుట్టినరోజు ఫిబ్రవరి ౩౦గా ఎలా వేసేరో ఎలా చెప్పగలను?. ఆ తరవాత చాలామంది నా పుట్టినరోజు చూసి ఉంటారు,చాలా సమయాల్లో,వారెవ్వరూ మార్చలేదు, ఇదేమని అడగ లేదు. అంతెందుకు నన్ను డిపార్టుమెంటులోకి తీసుకున్నప్పుడు నా పుట్టినరోజు తారీకు సమర్పించాను,అప్పుడూ ఎవరూ నన్ను ప్రశ్నించలేదు. నేను చేయని ప్రయత్నం లేదు,ఎవరూ నా పుట్టినరోజు తారీకు మార్చలేదు. కడకు కోర్టుకుపోయాను. కోర్టు ఏమీ తేల్చలేదు. కోర్టు తేల్చిన తరవాత మీకు ఫలితం సమర్పిస్తానని. దానిమీద డిపార్టుమెంటు జోరు తగ్గింది. కేస్ తేలలేదు. చివరికి కోర్టు నా పుట్టినరోజు ఫిబ్రవరి ౩౦గానే ఉంచుతూ, అన్ని ఇతరవిషయాలకి దానిని ఫిబ్రవరి 28గా పరిగణించాలనీ, ఈ కోర్టు ఆర్డర్ కాపీ కావలసిన ప్రతిచోటా ఉంచాలనీ, తీర్పిచ్చింది. అదే department కూ సమర్పించా! కాని ఎవరూ కేస్ తేల్చలేదు. ఆఫీసర్లు వస్తున్నారు,మారుతున్నారు, ఈ కేస్ అలాగే ఉండిపోయింది. ఒకాఫీసరు, మీలాటాయన, ఇందులో ఉద్యోగి తప్పేమీ లేదు, ఎవరో చేసిన తప్పుకు ఉద్యోగిని శిక్షించడం తగదు, కనుక కోర్టు ఉత్తరువును ధృవపరుస్తూ ఇతని పుట్టినరోజు ఫిబ్రవరి 28గా నిర్ణయిస్తున్నా అని తీర్పిచ్చి కేసు మూసేసేరు. అదీ నా ఫిబ్రవరి ౩౦ పుట్టినతారీకు చరిత్ర అని ముగించాడు.
అప్పుడు నాకు నవ్వొచ్చింది,నా పేరు, దత్తత ప్రకారంగా వేంకట దీక్షితులు గా మార్చుకోడానికి చేసిన ప్రయత్నాలూ నేను పడ్డతిప్పలూ, ఆ రోజుల్లో పేరు మార్చడం కుదరదని, ఇలాగా చాలా తిప్పలుపడ్డాకా చెప్పిన సంగతీ గుర్తొచ్చాయి.స్పెషల్ రిపోర్టు రాసాను,అతనికి ప్రమోషనూ వచ్చింది.
ఆ తరవాత కొంతకాలానికి ఒక పైఅధికారితో రెస్ట్ హవుస్ లోపిచ్చాపాటి మాటాడుతూ ఉండగా, కాలక్షేపానికి ఈ కేస్ చెప్పి ఎందుకిలా జరుగుతుందంటే, డ్యూ ప్రాసెస్ జరగాలయ్యా! అనేసారు, అదీ ప్రభుత్వమంటే