Saturday, 19 October 2024

1840 నాటి లాకర్

 1840 నాటి లాకర్


నాటికి,నేటికి టెక్నాలజీ పెరిగిందా? 

Friday, 18 October 2024

😊ఊహల ఊయలలో 😊

😊 ఊహల ఊయలలో 😊



ఆడామగా తేడాలేదు,పిన్నా,పెద్దా భేదంలేదు,ముసలి ముతక మాటేకాదు. అంతా ఊహా ప్రపంచంలో తేలియాడుతున్నట్టుంది. నిజ ప్రపంచాన్నెదురుకోలేక జనాలు ఊహా ప్రపంచంలో తేలియాడుతున్నారా?  ఇల్లు,ఒళ్ళు తెలియటం లేదు. ఆనందం ఎక్కడెక్కడో వెతుక్కుంటున్నారు,పక్కవారిని పట్టించుకునేదే లేదు, అసలు తమ ఒంటి మీద తమకే స్పృహ ఉంటున్నట్టు లేదు. పల్లె,పట్నం తేడా లేదు, పేద,సాదా మాటే కాదు. సెల్ ఫోన్ లో ములిగి పోయారు. అంతా ఇలా ఐపోయారు,  సమాజానికేమయింది?

Thursday, 17 October 2024

పూర్ణశుంఠలు

 

పూర్ణశుంఠలు సభా పూజ్యులైరి.



శ్రీ క్రోధినామవంత్సర ఆశ్వయుజ శుక్ల పూర్ణిమ

అధిక విద్యావంతు లప్రయోజకులైరి
పూర్ణ శుంఠలు సభాపూజ్యులైరి
సత్యవంతుల మాట జన విరోధంబయ్యె
వదరుబోతుల మాట వాసికెక్కె
ధర్మవాసన పరుల్ దారిద్ర్య మొందిరి
పరమలోభులు ధనప్రాప్తులైరి
పుణ్యవంతులు రోగభూత పీడితులైరి
దుష్ట మానవులు వర్ధిష్ణు లైరి
పక్షివాహన మా వంటి భిక్షుకులకు శక్తి లేదాయె, నిఁక నీవె చాటు మాకు
భూషణవికాస శ్రీ ధర్మపుర నివాస దుష్టసంహార నరసింహ దురితదూర !! (52)

ఓ నారసింహా ! ఈ లోకమదేమిటో కాని అతి విచిత్రంగా మారుతోంది. బాగా చదువుకున్న వాళ్ళు ఎందుకు పనికి రాకుండా పోతున్నారు. ఏమాత్రం చదువు రాని శుంఠలు సభాపూజ్యులై సన్మానాలు పొందుతున్నారు. నిజం చెప్పేవారి మాట లోకవిరోధమౌతోంది. అబద్దాలాడేవారికి సమాజం లో అధిక ప్రాధాన్యత లభిస్తోంది. ధర్మబుద్ధిగలవారు దారిద్య్రాన్ని అనుభవిస్తుంటే పిసినారులు ధనవంతులై కులుకు తున్నారు.పుణ్యాత్ములు రోగగ్రస్థులై పీడించబడుతుంటే పాపాత్ములు పల్లకీలలో ఊరేగుతున్నారు. ఓ గరుడవాహనా ! మావంటి యాచకులకు ఎటువంటి పోషణలేదు నీవే మాకు దిక్కు.

Courtesy: Owner


నృసింహ శతకంలో పద్యం చదువుకుంటున్నాం కదూ! మొన్న మొదటి పాదం చదివేంగా. ఇప్పుడు రెండో పాదం, అవధరించండి. 




మొదటిపాదంలో అధిక విద్యావంతులు అప్రయోజకులౌతున్నారన్నారు. అప్రయోజకులంటే పనికిరానివారని అర్ధం. ఈ శుంఠ శబ్దానికి అదే అర్ధం చెబుతోంది ఆంధ్రభారతి. తేడా ఏంటీ? 


పండిత పుత్ర పరమ శుంఠ అన్నది పెద్దలమాట.ఈ మాటలోని పరమ శుంఠ పదాన్ని కవిగారు పూర్ణ  శుంఠ అన్నారనుకుంటా! పైవాళ్ళు అర్ధ శుంఠలైతే వీరు పూర్ణశుంఠలట. పూర్ణశుంఠ అనడం లో అవసరమూ ఉన్నది సుమా! పై పాదంలో పనికిరానివారు అన్నవారు పూర్ణశుంఠలు కారు. కొంత సానబడితే వారు పనికిరావచ్చు గాని ఈ పూర్ణశుంఠలు మాత్రం పుటమేసినా పనికిరారని చెప్పడానికే పూర్ణశుంఠ అన్నారనుకుంటా. 


పండిత పుత్రులు పరమశుంఠలు ఎలా అవుతారు? అలా పరమ శుంఠలైనవారు సభాపూజ్యులెలా అవుతారు అన్నదే అనుమానం.పండితునికి తన పాండిత్యం ద్వారా కలిగే వ్యవహారాలమీద తప్పించి సంతానం ఎలా ఉన్నదో పట్టించుకునే తీరిక ఉండదు. మరి వీరిని చూసేవారెటువంటివారుంటారు? వీరు సమయం గడుపుకోవాలనే స్వార్ధపరులై ఉంటారు.ఇతరులను పొగడ్తలలో ముంచి పబ్బం గడుపుకునేవారవుతారు. వీరు ఆ పండితుని పొగిడి అవసరం గడుపుకునేవారు కావడంతో పిల్లలికి చెడ్డ బుద్ధులే అబ్బుతాయి, వీరి చదివు సంధ్యలు వెనకబడతాయి. వీరిని సరి దిద్దేవారుండరు, ఎత్తుచేతివారి బిడ్డలు కదా!.పిల్లలను కూడా పండితుని కంటే గొప్పవారని పొడ్తలలో ముంచి పబ్బం గడుపుకుంటూ, పండితుని పిల్లలను పరమ శుంఠలుగా తయారు చేస్తారు.    పూర్ణశుంఠలు నిండుచంద్రుడిలా కనపడతారు.   పూర్ణశుంఠలు నిండుచంద్రుడిలా కనపడతారు. పొట్టకోస్తే అక్షరం ముక్కరాదు,తెలివీ  లోకజ్ఞానమూ అంతే! ఆ తరవాత వారు కూడా ఈ పండితుని గౌరవంలో కాలం గడిపేస్తారు. పిచ్చి ప్రజలు పండితుని ప్రజ్ఞ పాటవాలు వీరిలో కూడా ఉన్నాయనుకుంటారు. చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకోవడమైపోతుంది. కాలం గడుస్తుంది, చెట్టు చెడే కాలానికి కుక్కమూతి పిందెలు పుడతాయి. అప్పటి దాకా ఈ పరమ శుంఠలు సభాపూజితం పొందుతూనే ఉంటారు. 
(4.8.2019) స్వల్ప మార్పులతో పునః ప్రచురణ.

Wednesday, 16 October 2024

కొత్తకారు,కొత్తపెళ్ళాం 😁

 కొత్తకారు,కొత్తపెళ్ళాం😁


"కొత్తకారు,కొత్తపెళ్ళాం కొత్తలో ఇబ్బంది పెడతాయి తమ్ముడూ! నెట్టు,నెట్టూ" అన్నాడు మా ఎన్టీవోడు, గుండమ్మకతలోనేమో!!.


కొత్తకారా! బలేటోరే!! జీవితంలో కారెక్కిందే ఏ రెండు మూడు సార్లో,"సేవలందుటెకాని సేవించుటెరుగని" జీవితం కాదు, "సేవించుటేగాని సేవలందుటెరుగని" జీవితం, ఇలా కానిద్దురూ! ఆముచ్చటెందుకులేండి,ఇప్పుడు. 


కొత్తపెళ్ళాం ముచ్చటా! అప్పడాలూ లేదు, వడియాలూ లేదు. అప్పడాలు ఏభైయారేళ్ళు నేనుగనక నీతో కాపరంజేసేను, మరొకతైతే మూడో నిద్దరరోజే,  నెత్తిన చేటగొట్టి

  వదిలేసి పోయేదనుకుందో  ఏమోగాని,ఆరేళ్ళకితం దేవుడిదగ్గరకెళ్ళిపోయింది.  వడియాలా బలే! బలే!! ఒకప్పుడు సైన్యంలో పనిచేసేవారికి పిల్లనిచ్చేవారు కాదు. ఆతరవాతది పూజారులకూ, పురోహితలకూ పాకింది, నేడు టెకీలకీ పిల్లనిచ్చేవాడు కనపట్టం లేదు, నాకెక్కడబాబూ! ఐనా వడియాలుతో వేగే ఓపికలేదండోయ్! ఎవరూ కష్టపడి సంబంధం చూడద్దు సుమా!!!!


మరి ఈ ముచ్చట, ఇప్పుడెందుకనికదా కొచ్చను?

ఇరవైఏళ్ళకితం తప్పిపోతానని ఒక పంపురాయి జేబులో పడేసేరు, అలామొదలయింది,నాఫోన్ జీవితం. దాంతో ఒక ఐదేళ్ళు నడిపేను. ఓ రోజు పుట్టినరోజని మరో కొత్తఫోన్ చేతిలోపెట్టేరు, పదేళ్ళకితం, చిన్నబ్బాయి,కోడలు, దాంతో గడుస్తోంది కాలం. మొన్న విజయదశమి రోజు మరో కొత్తఫోన్ తెచ్చి పుట్టినరోజు బహుమతని, చిన్నకోడలూ,అబ్బాయి ఫోన్ చేతిలో పెట్టి పాతది తీసేసేరు,  ఇది స్లో ఐపోయింది, కొత్తదిబాగుంటుందని.   ఎప్పుడో మరచిపోయిన రెండో పుట్టినరోజును గుర్తుచేస్తూ!


  మూడునిద్దరలయినా కొత్తగానే ఉంది,కొత్తఫోన్ తో. సంసారంలో ఏదెక్కడందో కొత్తే,ప్రతిసారి వెతుక్కోడమే!  ప్రతిసారి పిల్లలని అడిగితే చిరాకు పడతారేమోనని భయం. ఏది నొక్కితే ఏమవుతుందోననీ భయమే! అంతేకాదు, ఇబ్బందుంటే పిల్లలకి చెబితే ఏమంటారో? మరో భయం. చెప్పింది గుర్తుండి చావటం లేదు, ఎలా? నాటిరోజులకి సెల్ ఫోన్ వాడుకలోకి రాలేదు గనక మా ఎన్టీవోడు దాన్ని చెప్పుండడు, లేకపోతే దీన్నీ చెప్పీవోడేనేమో. కొత్తఫోన్ కు అలవాటు పడ్డానికి సమయం పట్టుద్దా!లొంగుబాటుకొస్తదా? కొచ్చను? 


సెల్ తోనే వేగలేకుంటే డెస్క్ టాప్ మార్చేసేరు, విండోస్ ఎప్పటిదో ఉంది అంటూ, ఎలాబాబూ అలవాటు పడ్డం. ఇదీ కొచ్చనే? అంతా కొత్తబాబూ, కొత్త,కొత్త,కొత్త......... 

Tuesday, 15 October 2024

అధిక విద్యావంతు.......

 

అధిక విద్యావంతు 

అధిక విద్యావంతు లప్రయోజకులైరి
పూర్ణ శుంఠలు సభాపూజ్యులైరి
సత్యవంతుల మాట జన విరోధంబయ్యె
వదరుబోతుల మాట వాసికెక్కె
ధర్మవాసన పరుల్ దారిద్ర్య మొందిరి
పరమలోభులు ధనప్రాప్తులైరి
పుణ్యవంతులు రోగభూత పీడితులైరి
దుష్ట మానవులు వర్ధిష్ణు లైరి
పక్షివాహన మా వంటి భిక్షుకులకు శక్తి లేదాయె, నిఁక నీవె చాటు మాకు
భూషణవికాస శ్రీ ధర్మపుర నివాస దుష్టసంహార నరసింహ దురితదూర !! (52)

ఓ నారసింహా ! ఈ లోకమదేమిటో కాని అతి విచిత్రంగా మారుతోంది. బాగా చదువుకున్న వాళ్ళు ఎందుకు పనికి రాకుండా పోతున్నారు. ఏమాత్రం చదువు రాని శుంఠలు సభాపూజ్యులై సన్మానాలు పొందుతున్నారు. నిజం చెప్పేవారి మాట లోకవిరోధమౌతోంది. అబద్దాలాడేవారికి సమాజం లో అధిక ప్రాధాన్యత లభిస్తోంది. ధర్మబుద్ధిగలవారు దారిద్య్రాన్ని అనుభవిస్తుంటే పిసినారులు ధనవంతులై కులుకు తున్నారు.పుణ్యాత్ములు రోగగ్రస్థులై పీడించబడుతుంటే పాపాత్ములు పల్లకీలలో ఊరేగుతున్నారు. ఓ గరుడవాహనా ! మావంటి యాచకులకు ఎటువంటి పోషణలేదు నీవే మాకు దిక్కు.
Courtesy: Owner

నృసింహ శతకకర్త కాకుత్స్థం శేషప్ప కవి. పద్దెనిమిదవ శతాబ్దం వాడన్నారు. కవిగారి ఊరు ప్రస్తుతం తెలంగాణాలో ఉన్న ధర్మపురి దగ్గర అని తెలుస్తోంది. తెలుగు కవుల స్థల కాలాల మీద చాలా చర్చ జరుగుతోంది, అప్పుడప్పుడు. నిజం మాత్రం తెలియటంలేదు. అప్ప,అయ్య,అన్న, అమ్మ,అక్క నామాంత్యాలుగా తెలుగునాట పేర్లున్నమాట నిజం, ఇప్పుడవి లోపించడమూ నిజం. ఏమైనా ఈ శతకాన్ని వారే రాశారన్నదాని మీద విచాదం మాత్రం లేదు, నాకు తెలిసి, ధన్యుడను. 



చిన్నప్పుడు నాలుగు శతకాలు బట్టీ వేయించేవారు. అవి సుమతీ శతకం,వేమన శతకం, భాస్కర శతకం, నృసింహ శతకం. కొద్ది వయసొచ్చాకా మరి కొన్ని శతకాలూ చదువుకున్న రోజులు.  ఈ కోవలోనివే భర్తృహరి శతకాలు. ఇవి సంస్కృతంలో ఉండడంతో ఏనుగు లక్ష్మణ కవిగారు తెలుగు చేసిన పద్యాలే సంస్కృతం వాటికంటే అందంగా ఉంటాయి నాకు. భాగవతం వ్యాసుడు సంస్కృతంలో రాసినా నాకు పోతరాజుగారు రాసిన తెలుగు భాగవతమే అసలైనదనిపిస్తుంది, నచ్చుతుంది కూడా. 

పలికెడిది భాగవతమట

పలికించెడువాడు రామభద్రుండట నే
పలికిన భవహరమగునట
పలికెద వేరొండు గాథ పలుకగనేలా! 

భాగవతం చెబుతున్నా! పలికిస్తున్నవాడు శ్రీరామచంద్రుడు,భాగవతం చెబితే ముక్తి లభిస్తుందిట, మరెందుకు మరొకటి చెబుతానూ! మరొకగాధ చెప్పను, భాగవతమే చెబుతానన్నది అర్ధం. 



దీనికేంగాని నృసింహ శతకంలో కవిగారు కాచి వడబోసిన జీవిత సత్యాలు చెప్పేరు, అవి సార్వజనీనం, అంతే కాక ఏకాలానికైనా సరిపోయేవే! ఈ పద్యంలో కవిగారు చెప్పినది నేటి కాలానికి అతికినట్టు సరిపోతుంది చూడండి. 

”అధిక విద్యావంతులప్రయోజకులైరి” దీనితో మొదలు పెట్టేరు, పద్యం. ఏ దేశంలోనైనా ఎక్కువ చదువుకున్నవారు విజ్ఞానులనీ ఆత్మాభ్యుదం తరవాత, దేశాభ్యుదయం కోసం పని చేస్తారనీ, చెయ్యాలనీ సామాన్యులు కోరుకుంటారు. అసలీ అధిక విద్యావంతులెక్కడుంటారు? ప్రభుత దగ్గర, విశ్వవిద్యాలయాల్లోనూ కదా! నిజంగానే వీరిలో కొందరు నేడు మనదేశంలో అప్రయోజకులుగానే ఉన్నారు. వీరిలో ఆడ మగ తేడా కనపడటం లేదు. 

విశ్వవిద్యాలయాలలో ఉన్నవారు సొమ్ముకు సర్టిఫికట్లు అమ్ముకునే వ్యాపారంలో ఉన్నారు. లేదూ స్త్రీ లోలత్వానికి లోబడిపోయారు. ఇక వీరు స్త్రీలైతే చదువుకోడానికొచ్చినవారిని వ్యభిచారం రొంపిలో దింపి సొమ్ము చేసుకుంటున్నారు. మరికొందరు ఆయుధాలు పట్టుకుని ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయమని యువతని ప్రేరేపిస్తున్నారు. వీరి పిల్లలు మాత్రం విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మీరు చెప్పేదాన్ని మీరెందుకు అమలు చేయరంటే, నేను సిద్ధంత కర్తను మాత్రమే, నా భార్య పిల్లలికి కూడా చెప్పేను, వారు వినిపించుకోలేదు. వ్యక్తి స్వాతంత్ర్యం ఉన్నదికదా,వారినెలా బలవంత పెట్టగలను అంటున్నారు. విశ్వవిద్యాలయాల్లో ఉన్న మేధావులు ఇలా ఉన్నారు, అందరూ అనను సుమా!

ఇక ప్రభుతలో ఉన్న మేధావులెలా ఉన్నారయ్యా అంటే, దేశం ఏమైనా బాధలేదు, ఎవరేమనుకున్నా ఇబ్బందీ లేదు,ధన సంపాదనే ధ్యేయమన్నవారున్నారు.  దేశ వనరులపై కొంతమందికి మాత్రమే ప్రథమహక్కుందన్నవారూ ఉన్నారు.  ఇలా అధిక విద్యావంతులలో కొంతమంది కవిగారు చెప్పినట్టే ఉన్నారు కదా!


ఇప్పటికే టపా చాలా పెద్దదయింది, మిగిలినవి తరవాత
(1.8.2019)

Wednesday, 9 October 2024

అతి చేస్తే గతి చెడుతుంది.

 అతి చేస్తే గతి చెడుతుంది.

హర్యానా ఎన్నిక ఫలితాలు.

తేదీ 08.10.2024

ఉ.08.30:--  నెగ్గేస్తున్నాం. మెజారిటీ మనదే కాంగ్రెస్ వర్గాల ఆనందం.తీపి జిలేబి పంపకం.


ఉ:-11.30 ఎన్నికల సంఘం చేసిన మోసం వోటరు లిస్టులు తప్పుల తడక.  పులుపెక్కిన జిలేబి.


మ:- 02.30 ఎన్నికల సంఘం మోడీ గుప్పెట్లో ఉంది. ఫలితాలు తారుమారు చేస్తున్నారు. ఉప్పెక్కిన జిలేబి.


సా:-05.30 దేశంలోని అన్ని రాజ్యాంగ వ్యవస్థలు మోడీ గుప్పెట్లో ఉన్నాయి. దేశంలో ప్రజాస్వామ్యం లేదు.


రాత్రి:- ప్రజాస్వామ్యం ఎప్పుడో మరణించింది, మనదేశంలో. ఎన్నికల ఫలితాల నుంచి అన్నీ తారుమారే. చేదేక్కిన జిలేబి


09.10.2024 ఉదయం హర్యానాలో కాంగ్రెస్ ఓటమికి కారణం జిలేబి.

నిషేధించండి జిలేబి.

ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. 


Don't count the chicken before they are hatched.

Monday, 7 October 2024

కొండొండోరీ సెరువుల కిందా........కొత్త వ్యాఖ్య.

కొండొండోరీ సెరువుల కిందా........కొత్త వ్యాఖ్య.

కొండొండోరి సెరువులకింద..... ఈ గేయానికి అర్ధం నామటుకు నేను పూర్తిగా చెప్పుకోలేకపోయాను. ఎవరెవరో చెప్పినవాటిని కూడా పూర్తిగా ఆమోదించలేకపోయాను. కాని తెలుసుకోవాలనే ఉత్సుకత పోలేదు. ఇప్పటికి నాకు నచ్చిన వ్యాఖ్య కనపడింది. అందుకే పంచుకుంటున్నాను.రచయిత్రి నీరజ హరి ప్రభలగారికి నా అభినందన మందారమాల. 

Courtesy:-

 https://www.manatelugukathalu.com/post/kondondori-seruvula-kinda-telugu-article-3670


'Kondondori Seruvula Kinda- New Telugu Article Written By Neeraja Hari Prabhala

Published In manatelugukathalu.com On 01/10/2024

'కొండొండోరీ సెరువుల కిందా' తెలుగు వ్యాసం

రచన: నీరజ హరి ప్రభల 

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)


కొండొండోరీ సెరువుల కిందా........


నాకు చాలా చాలా ఇష్టమైన తత్వము. దీనిని అడవి బాపిరాజు గారు వ్రాశారు. ఇది చాలా భావయుక్తమైనది, అర్ధవంతమైనది. ఈ తత్వానికి చాలా లోతైన భావముంది. 


మన జీవిత వాస్తవాన్ని తెలుపుతూ మనలో నిగూఢంగా నిక్షిప్తమైన సత్వము,రజస్సు, తమస్సు గుణాలను, వాటిస్వభావాన్ని తెలుపుతూ, వాటికనుగుణంగా మన మనస్సు ఏవిధంగా మెలిగేదీ తెలుపుతుంది. ఈ తత్వానికి అర్ధం వివరించ ప్రయత్నిస్తున్నాను.


1.కొండొండోరీ సెరువుల కిందా సేసిరి ముగ్గురు ఎగసాయం… అంటే ఈ అనంతకోటి బ్రహ్మాండాలలో త్రిమూర్తులు ముగ్గురు స్రృష్టి వ్యవసాయం చేయ మొదలు పెట్టారు. ఒకడికి కాడీ లేదు, రెండు దూడా లేదు అంటే వ్యవసాయానికి కావలసిన కాడిగానీ, దూడ గానీ వాళ్ళవద్ద లేవు. 

కాడీ దూడ లేనెగసాయం పండెను మూడు పంటలు. అంటే ఆ పంటలు సత్వము,రజస్సు, తమస్సు అనే గుణాలు.మరి ఆ పంటలకు వడ్లు, గడ్డి ఉండాలి కదా! కానీ సత్వరజస్తమోగుణాలు అనే పంటలకు వడ్లు, గడ్డి రెండూ లేవు.


2.ఆ పంటలను తీసికెళ్ళి ఇశాక పట్నం సంత (ఇశాఖ అంటే ఔన్నత్యం శాఖలు లేని సంసారం)లో పెట్టారు. జీవులు వాటిలో లీనమై మాయా ప్రపంచాన్ని చూసి అది నిజమని భ్రమపడి సంసార జీవితంలో పడి ఆ వ్యామోహంతో వాస్తవ ప్రపంచాన్ని మరిచిపోయారు. ఐహిక సుఖాలు- కోరికల వ్యామోహానికి దాసులయ్యారు.


3. జనం లేని సంతలోకి వచ్చిరి ముగ్గురు షరాబులు…అంటే షరాబులు అంటే కంసాలులు. వాళ్ళు అగ్ని, వాయువు, సూర్యుడు. వాళ్ళకు కాళ్లు లేవు, రెండు చేతులు లేవు.వాళ్ళకు మనలాగా రూపములు ఉండవు కదా!.


4.కాళ్లు, సేతులు లేని షరాబులు తెచ్చిరి మూడు కాసులు…అంటే అవి త్రిదండాలు. అవి 1.వాక్ దండము(మౌనము) 2.మనోదండము (ఆశ లేకుండుట) 3.కాయదండము(స్వధర్మాచరణము).

అవి వొల్లావొల్లాదు, రెండూ సెల్లా సెల్లావు అంటే త్రిదండాలకు ఈ లోకంలో చెల్లుబాటు లేదని భావము.అంటే. ఆ మూడింటినీ మనం ఆచరించము కదా!


5.వొల్లా సెల్లని కాసులు తీసుకు ఇజయనగరం ఊరికి పోతే ఒట్టి ఊరే కానీ ఊళ్ళో జనం లేరు …అంటే (విజయ అంటే మిక్కిలి గెలుపు ). సహస్రార చక్ర ఛేదనము ఆనే ఊరు. ఈ లోకంలో చాలా మంది దృష్టిలో పనికిరాని ఆ త్రిదండాలను ఆచరించి ఉత్తమ యోగా భ్యాసంతో ఆ సహస్రార చక్రఛేదనము అనే ఊరు వెళదామని చూస్తే ఆఊరు చేరినవారెవరూ లేరు. అంటే ఉత్తమ యోగులు లేరు అని భావం.


6.జనంలేని ఊళ్ళోను ఉండిరి ముగ్గురు కుమ్మర్లు...అంటే వాళ్ళు త్రికాలాలు. అవి భూత, భవిష్యత్.వర్తమాన కాలాలు. ఒకటికి తలా లేదు, రెండు మొలా లేదు అంటే ఉత్తమ యోగాభ్యాసం చేసే వాళ్లు లేకపోయినా తలా-మొలా లేని(ఆకారం లేని త్రికాలాల ) కుమ్మర్లు వస్తూనే ఉంటారు. కాలాలు అతీతమైనవి కదా!


 7.తలా-మొలా లేని కుమ్మర్లు సేసిరి మూడు భాండాలు….అంటే అవి భూలోకం, పాతాళ లోకం, స్వర్గలోకం. ఒకటికి అంచు లేదు రెంటికి అడుగూ లేదు.(కాలం సృష్టించే లోకాలకు అంచు-అడుగు లేదుఆది-అంతం ఉండదు.) అది నిరంతరం ఉంటుంది.


8.అంచూ-అడుగు లేని భాండాలలో ఉంచిరి మూడు గింజలు…అంటే అవి శ్లేష్మం, వాతం, పిత్తం అనే త్రిదోషాలు.అవి ఉడకా ఉడకదు, రెండు మిడకా మిడకావు. అంటే ఈ లోకంలో జీవులు ఆడుకునేందుకు వాత, పిత్త, శ్లేష్మం అనే 3 గింజలను ప్రతి జీవిలోను ఉంచాడు భగవంతుడు.


9.ఉడకా-మిడకని మెతుకులు తినుటకు వచ్చిరి ముగ్గురు సుట్టాలు…అంటే ఆ చుట్టాలు ముగ్గురు మనస్సు, వాక్కు, కర్మ అనే త్రికరణాలు. 

ఒకటికి అంగుళ్ళేదు, రెండు మింగుళ్ళేదు. అంటే శ్లేష్మం, వాత, పిత్తం అనే త్రికరణాలను జీవులు అనుభవిస్తున్నారు. వాటితో ఎప్పుడూ ఏదో ఒక విధంగా బాధ పడుతూనే ఉంటాడు ప్రతి జీవి.


10.అంగుడు-మింగుడు.(లోకుత్తుక) లేని సుట్టాలు తెచ్చిరి మూడు సెల్లాలు….అంటే అవి ధర్మ, అర్థ, కామము అనే త్రిగుణాలు. వాటికి సుట్టూ లేదు, రెండు మద్దే లేదు. సెల్లా లు అంటే అంచులు లేని బట్టలు. ధర్మార్థకామమనే త్రిగుణాలు సెల్లాలు. వాటిని త్రికరణాలు తెచ్చారు. అంటే వీటికి చుట్టాలు లేరు. పరిమితము అనేది లేదు.
 https://www.manatelugukathalu.com/ వారికి,నీరజహరి,ప్రభల గారికి ధన్యవాదాలు తెలుపుతూ టపాను ఇక్కడ పంచుకుంటున్నా!