పూర్ణశుంఠలు సభా పూజ్యులైరి.
శ్రీ క్రోధినామవంత్సర ఆశ్వయుజ శుక్ల పూర్ణిమ
అధిక విద్యావంతు లప్రయోజకులైరి
పూర్ణ శుంఠలు సభాపూజ్యులైరి
సత్యవంతుల మాట జన విరోధంబయ్యె
వదరుబోతుల మాట వాసికెక్కె
ధర్మవాసన పరుల్ దారిద్ర్య మొందిరి
పరమలోభులు ధనప్రాప్తులైరి
పుణ్యవంతులు రోగభూత పీడితులైరి
దుష్ట మానవులు వర్ధిష్ణు లైరి
పక్షివాహన మా వంటి భిక్షుకులకు శక్తి లేదాయె, నిఁక నీవె చాటు మాకు
భూషణవికాస శ్రీ ధర్మపుర నివాస దుష్టసంహార నరసింహ దురితదూర !! (52)
పూర్ణ శుంఠలు సభాపూజ్యులైరి
సత్యవంతుల మాట జన విరోధంబయ్యె
వదరుబోతుల మాట వాసికెక్కె
ధర్మవాసన పరుల్ దారిద్ర్య మొందిరి
పరమలోభులు ధనప్రాప్తులైరి
పుణ్యవంతులు రోగభూత పీడితులైరి
దుష్ట మానవులు వర్ధిష్ణు లైరి
పక్షివాహన మా వంటి భిక్షుకులకు శక్తి లేదాయె, నిఁక నీవె చాటు మాకు
భూషణవికాస శ్రీ ధర్మపుర నివాస దుష్టసంహార నరసింహ దురితదూర !! (52)
ఓ నారసింహా ! ఈ లోకమదేమిటో కాని అతి విచిత్రంగా మారుతోంది. బాగా చదువుకున్న వాళ్ళు ఎందుకు పనికి రాకుండా పోతున్నారు. ఏమాత్రం చదువు రాని శుంఠలు సభాపూజ్యులై సన్మానాలు పొందుతున్నారు. నిజం చెప్పేవారి మాట లోకవిరోధమౌతోంది. అబద్దాలాడేవారికి సమాజం లో అధిక ప్రాధాన్యత లభిస్తోంది. ధర్మబుద్ధిగలవారు దారిద్య్రాన్ని అనుభవిస్తుంటే పిసినారులు ధనవంతులై కులుకు తున్నారు.పుణ్యాత్ములు రోగగ్రస్థులై పీడించబడుతుంటే పాపాత్ములు పల్లకీలలో ఊరేగుతున్నారు. ఓ గరుడవాహనా ! మావంటి యాచకులకు ఎటువంటి పోషణలేదు నీవే మాకు దిక్కు.
Courtesy: Owner
నృసింహ శతకంలో పద్యం చదువుకుంటున్నాం కదూ! మొన్న మొదటి పాదం చదివేంగా. ఇప్పుడు రెండో పాదం, అవధరించండి.
మొదటిపాదంలో అధిక విద్యావంతులు అప్రయోజకులౌతున్నారన్నారు. అప్రయోజకులంటే పనికిరానివారని అర్ధం. ఈ శుంఠ శబ్దానికి అదే అర్ధం చెబుతోంది ఆంధ్రభారతి. తేడా ఏంటీ?
పండిత పుత్ర పరమ శుంఠ అన్నది పెద్దలమాట.ఈ మాటలోని పరమ శుంఠ పదాన్ని కవిగారు పూర్ణ శుంఠ అన్నారనుకుంటా! పైవాళ్ళు అర్ధ శుంఠలైతే వీరు పూర్ణశుంఠలట. పూర్ణశుంఠ అనడం లో అవసరమూ ఉన్నది సుమా! పై పాదంలో పనికిరానివారు అన్నవారు పూర్ణశుంఠలు కారు. కొంత సానబడితే వారు పనికిరావచ్చు గాని ఈ పూర్ణశుంఠలు మాత్రం పుటమేసినా పనికిరారని చెప్పడానికే పూర్ణశుంఠ అన్నారనుకుంటా.
పండిత పుత్రులు పరమశుంఠలు ఎలా అవుతారు? అలా పరమ శుంఠలైనవారు సభాపూజ్యులెలా అవుతారు అన్నదే అనుమానం.పండితునికి తన పాండిత్యం ద్వారా కలిగే వ్యవహారాలమీద తప్పించి సంతానం ఎలా ఉన్నదో పట్టించుకునే తీరిక ఉండదు. మరి వీరిని చూసేవారెటువంటివారుంటారు? వీరు సమయం గడుపుకోవాలనే స్వార్ధపరులై ఉంటారు.ఇతరులను పొగడ్తలలో ముంచి పబ్బం గడుపుకునేవారవుతారు. వీరు ఆ పండితుని పొగిడి అవసరం గడుపుకునేవారు కావడంతో పిల్లలికి చెడ్డ బుద్ధులే అబ్బుతాయి, వీరి చదివు సంధ్యలు వెనకబడతాయి. వీరిని సరి దిద్దేవారుండరు, ఎత్తుచేతివారి బిడ్డలు కదా!.పిల్లలను కూడా పండితుని కంటే గొప్పవారని పొగడ్తలలో ముంచి పబ్బం గడుపుకుంటూ, పండితుని పిల్లలను పరమ శుంఠలుగా తయారు చేస్తారు. పూర్ణశుంఠలు నిండుచంద్రుడిలా కనపడతారు. పూర్ణశుంఠలు నిండుచంద్రుడిలా కనపడతారు. పొట్టకోస్తే అక్షరం ముక్కరాదు,తెలివీ లోకజ్ఞానమూ అంతే! ఆ తరవాత వారు కూడా ఈ పండితుని గౌరవంలో కాలం గడిపేస్తారు. పిచ్చి ప్రజలు పండితుని ప్రజ్ఞ పాటవాలు వీరిలో కూడా ఉన్నాయనుకుంటారు. చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకోవడమైపోతుంది. కాలం గడుస్తుంది, చెట్టు చెడే కాలానికి కుక్కమూతి పిందెలు పుడతాయి. అప్పటి దాకా ఈ పరమ శుంఠలు సభాపూజితం పొందుతూనే ఉంటారు.
(4.8.2019) స్వల్ప మార్పులతో పునః ప్రచురణ.
No comments:
Post a Comment