Friday 30 July 2021

పరుగెట్టి పాలు తాగేకంటే

 పరుగెట్టి పాలు తాగేకంటే నిలబడి నీళ్ళు తాగడం మంచిది.....కాదు.


సాధారణంగా పరుగెత్తి పాలు తాగేకంటే నిలబడి నీళ్ళు తాగడం మంచిది అని చెబుతారు, కాని దీనిని పరుగెట్టి పాలు తాగేకంటే నిలబడి నీళ్ళు తాగడం మంచిది కాదు అని కూడా చెప్పచ్చు.


పరుగెత్తి పాలు తాగేకంటే నిలబడి నీళ్ళు తాగడం మంచిది.

దీనితో పాటు ఈ నానుడులు కూడా చెప్పుకోవచ్చు. మబ్బుల్లో నీరుచూసి ముంత ఒలకబోసుకున్నట్టు అని,ఒక ఆంగ్ల సామెత A bird in hand is better than two in bush

ఒక ఉదాహరణ: ఊళ్ళో ఉద్యోగం, స్వంతీంటిలో కాపరం, కడుపులో చల్ల కదలకుండా రోజు నడుస్తోంది,ఎలా కర్చు పెట్టుకున్నా పాతిక మిగులుతోంది, నెలకి.  విదేశీ సావకాశం వచ్చింది, అక్కడికెళితే, వచ్చేది, ''వేసిన వత్తికి పోసిన చమురు హాని హానిగా సరిపోతుందన్నట్టు'' ఉంటుంది.అంత దానికి విదేశం పోవడం మేలా? అప్పుడు ఈ నానుడి చెప్పచ్చు. ఆతృతతో నిర్ణయం తీసుకోకు,

 ఆనందంలో మాటివ్వకు, కోపంలో మాటాడకు. ఇచ్చిన మాట తిరిగిపోకు అన్నది ఇదేనేమో!




పరుగెట్టి పాలు తాగేకంటే నిలబడి నీళ్ళు తాగడం మంచిది.....కాదు.

పరుగెత్తిన తరవాత ఏమీ తాగడం మంచిది కాదని ఆరోగ్య శాస్త్రం చెబుతోంది. అలాగే నిలబడి నీళ్ళు తాగడమూ మంచిది కాదంటోంది, ఆయుర్వేదం. అలా నీళ్ళు తాగితే అనారోగ్యం చేస్తుందిట. పరుగెత్తి పాలు తాగడమూ మంచిది కాదు నిలబడి నీళ్ళు తాగడమూ మంచిది కాదు. అదేం కాదంటున్నారు అలోపతీ వైద్యులు, శిఖపట్ల గోత్రం నడుస్తున్నట్టుంది.


Monday 26 July 2021

ఆకు కూరల్లో కల్తీ


 courtesy:what's app

ఒక ఆకు కూర పేరు చెప్పి మరొకటి అమ్మెయ్యడమూ, కాయ పెరగడానికి ఇంజక్షన్లు చెయ్యడమూ,నిలవ ఉండడానికి మందులు కొట్టడమూ, ముగ్గించడానికి బేటరీ పెట్టడమూ ఎరుగుదుం, అరటిగెల వేగంగా పెరగడానికి పువ్వు కోసిన తరవాత గుప్పెడు యూరియా ఒక పోలిథిన్ కవర్లో పోసి పువ్వు కోసిన చోట కట్టేస్తే గెల వేగంగా పెరుగుతుంది, ఇటువంటివి ఎరుగుదుంకాని,  ఆకు కూర తాజాగా కనపడ్డానికి ఇలా చేయడం తెలీదు.వినాశకాలే విపరీత బుద్ధిః 

Saturday 24 July 2021

అంబలి తాగేవానికి మీసాలెత్తేవాడు మరొకడు.

 అంబలి తాగేవానికి మీసాలెత్తేవాడు మరొకడు.


ఇదొక నానుడి. గంజి,కలి,అంబలి,తరవాణి,లచ్చించారు ఇవన్నీ గంజి నుంచి వచ్చినవో దాని అనుబంధాలో. గత నూట ఏభై సంవత్సరాల కితం వరకు జనులు వరి అన్నం తిన్నది తక్కువ, గోజిలలో కూడా. కలిగినవారే వరి అన్నం తినే వారు. సామాన్యులు జొన్నలు,రాగులు ,చామలు,కొర్రలు ఇలా చిరు ధాన్యాలే తినేవారు. వరి అన్నం తిన్న రోజు పండగే. దరిద్రులకి గంజే గతి. దీనికో నానుడీ ఉంది. కలిగినవారి బట్టకీ లేని వారి పొట్టకీ గంజే దిక్కు. కలో గంజో తాగి బతుకుతాం లేదా కలో అంబలో తాగి బతుకుతాం అనే మాటలు జనం వాడేవే. వరి అన్నం తిన్నవారు మహరాజులే.కుక్కర్లోచ్చే దాకా గంజి వార్చేవారు. ఆ తరవాత అన్నం వండటం మరచినట్టే, అంచేత గంజి గురించి తెలిసినవారే తక్కువనుకుంటా. నేడు అమెరికన్ ఫుడ్ సొసైటీ 

వారో మరెవరో ఇవన్నీ బలవర్ధక ఆహారాలనీ, రోగ నిరోధక శక్తి కలిగిస్తాయనీ చెబుతున్నారు, ఆ మాటైనా చెవినేసుకునే రోజు కనపడటం లేదు. 


నాటి రోజుల్లో అంబలి,కలి,తరవాణి వగైరాలను నీచంగానే చూశారు. దానికి శ్రీనాథుడే సాక్షి, చల్లా అంబలి తావితిన్, వెల్లుల్లిన్ దిలపిష్టమున్ మెసవితిన్ అని తన దరిద్ర స్థితిని వెళ్ళబోసుకునాడు.


గంజి అంబలి తాగేవారంటే దరిద్రులనే మాట నాడు స్థిరపడిపోయింది.నాటి కాలంలో దరిద్రులైనా మీసాలకి లోటుండేది కాదు, మీసాలంటే నేటిలాగా కత్తెర మీసాలు,సీతాకోక చిలుక మీసాలు కాదు బొద్దు మీసాలేకాదు, బారు మీసాలే ఉండేవి. మరి అంబలి,గంజి తాగినపుడు ఈ మీసాలు అడ్డు పడేవి, తడిసేవి. ఎవరి మీసాలు వారే సవరించుకుని అంబలి తాగే రోజులనమాట. ఈ అంబలి తాగే దరిద్రుని మీసాలు సవరించడానికి మరొకరా? అనేది ఎద్దేవా. అనగా వాడే ఒకరికి తొత్తు ఆ తొత్తుకింద మరొకతొత్తా అదే బడితొత్తు అన్నమాట.


తత్తు కొడక అని తిడతారు తప్పు అది తొత్తు కొడక, తిట్టుకూడా తిన్నగా తెనుగులో చెప్పలేని రోజులైపోయాయి.    




Saturday 17 July 2021

Thursday 8 July 2021

దండం దశగుణం భవేత్.

 విశ్వామిత్రాహి పశుషు - కర్దమేషు జలేషుచ

అంధే తమసి వార్థక్యే - దండం దశగుణం భవేత్.
 
 
పక్షి, కుక్క, శత్రు, పాము, పశులఁ ద్రోల,
చేతి కర్ర మిగుల చేవఁ జూపు.
బురద, నీరు, రేయి, ముసలి, గ్రుడ్డియుఁ గల్గ
చేతికర్ర దాటఁ జేయు మనల?
  
 భావము:-పక్షులు, కుక్కలు, అమిత్రులు, పాములు, పశువులు, వీటిని పారద్రోలుటకున్ను, బురదలో, నీళ్ళలో, చీకటిలో, గ్రుడ్డితనంలో, ముసలితనంలో అవలంబనంగానున్ను, చేతి కర్ర పనికివస్తుంది. అందుచేతనే దండం దశ గుణం భవేత్ అంటారు.

Courtesy: andhraamrutham.blogspot.com/.../blog-post_08.html


దండం అంటే కఱ్ఱ అని అర్ధమట. తెనుగులో దీనిని నమస్కారంగా వాడేస్తాం. కఱ్ఱ ఎందుకు పనికొస్తుందిటా? దండం దశగుణం భవేత్ అంటే  కఱ్ఱ పది రకాలుగా ఉపయోగపడుతుందన్నది మాట.


పక్షులు కుక్కల్ని తోలుకోడానికి,పాములు పశువులనుంచి రక్షించుకోడానికి, అమిత్రులను ఎదుర్కోడానికి, బురద,నీరు ఉన్నచోట చూసుకుని నడవడానికి, చివరగా గుడ్డివారికి ముసలివారికి పనికొస్తుందీ అన్నారు, పెద్దలు. 


 నేటి కాలంలో కఱ్ఱ ఉపయోగించేవారే కనపడటం లేదు. ఇక పశువులు, పక్షులు,పాములు,కుక్కలు చూద్దామన్నా కనపడటంలేదు. కొన్ని చోట్ల మాత్రం వీధి కుక్కలు విచ్చలవిడిగా చిన్న పిల్లల మీద కూడా దాడి చేస్తున్నాయి. వీటిని పడతాం, వాటికి సంతానం కలగకుండా చేస్తాం అంటారు, చేస్తూనే ఉంటారు కాని ఈ కుక్కల జనాభా ఎందుకు పెరుగుతోందో తెలీదు. వీటిని పట్టుకుంటే బ్లూ క్రాస్ వారొస్తారు, అదో పెద్ద కత. ఇప్పుడు పెటా వారు అముల్ మీద దాడి చేస్తున్నట్టు.


అన్ ఫ్రెండ్ అన్నమాట ఫేస్ బుక్కువాడు పుట్టించినదనుకున్నా ఇంతకాలం కాదని ఇప్పుడే తెలిసింది. అమిత్ర పదాన్ని అన్ ఫ్రెండ్ గా తర్జుమా చేసుకున్నారనమాట. అస్తు...అమిత్రుడు అంటే శత్రువే అనుమానం లేదు. 

 నేటి కాలంలో అమిత్రులనుంచి కఱ్ఱతో రక్షించుకోలేం. దీనికి మరి ఇతర సాధనాలే కావాలి. 


ఇక బురద నీరు ఉన్నచోట లోతు చూసుకోడానికి వాడచ్చు అంటారు. వర్షా కాలమొస్తే హైదరాబాదు ముంబాయిల్లో కఱ్ఱ పట్టుకుని నడచిపోవడం మంచిదన్నారు మా మిత్రులొకరు. ఎందుకంటే నదుల్లా ఉన్న రోడ్లమీద 

ఎక్కద తెరిచి ఉన్న మేన్ హోల్ ఉన్నదీ తెలియాలంటే కఱ్ఱ అవసరమే. లేకపోతే మోటార్ సైకిల్ తో సహా తీసి ఉన్న మేన్ హోల్ లో పడి చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. 


నిజం చెప్పాలంటే నేటి రోజుల్లో కఱ్ఱ ఒక్క గుడ్డివారు మాత్రమే వాడుతున్నారు. ఇచ్చిన ఆర్డర్ లో విషయం వివరంగా క్లారిఫికేషన్ కి వ్రాశాం వచ్చేకా అమలు చేసాతమనేవారికీ కఱ్ఱ అవసరమేమో! అధికారం రాగానే కళ్ళు చీకట్లు కమ్ముతాయనుకుంటా!


  ఇక ముసలివారు కఱ్ఱ వాడటం నేటి కాలంలో చిత్రమే. నడుస్తూ డిపోవడం పెద్ద వయసులో సహజం.పడిపోకుండా రక్షణకి కఱ్ఱ వాడాలి. నేను కఱ్ఱ వాడుతాను అదికూడా చిన్న వాకింక్ స్టిక్ కాదు, పెద్ద కఱ్ఱే.నన్ను చూచి నవ్వుతారు,ఎగతాళిగా.  పోనీలే వాళ్ళ పళ్ళే బయటపడ్డాయనుకుంటా.   


   చతుర్విధ ఉపాయాలన్నారు. అవి సామ,దాన,భేధ,దండో పాయాలు. సామం, మంచిమాట చెప్పి పని చేయించుకోడం. దానం పని చేయించుకోడానికి మూల్యం చెల్లించడం. కాని దీనికి పెడర్ధం తీసి ఆమ్యామ్యా ఇచ్చి పని  చేయించుకోడంగా చెబుతున్నారు. భేదం అన్నది శత్రుదేశం పట్ల ఉపయోగించవలసినది. శత్రువులపట్ల ఉపయోగిస్తున్నారు. అంటే మన శత్రువుతో ఉన్న వారి మిత్రుల మధ్య భేదో పాయం ఉపయోగించడం. ఇదంత తేలికైన విద్య కాదు. ఇక ఏవీ పని చెయ్యనప్పుడు తప్పక ఉపయోగించవలసినదే దండో పాయం.ఇది నేటికి చాలా రకాలు, కంప్లయింటు నుంచి మొదలు.......కేస్ ఎప్పటికి తేలేను? అది కోర్ట్ కెళితే తేలేటప్పటికి బతికుంటామా అనుమానమే. అందుకే తక్షణ న్యాయం....దండోపాయం. 


Monday 5 July 2021

అనుమానం పెను భూతం

      అనుమానం పెను భూతం పెద్ద సంకటం


ఏ కఱ్ఱని నిప్పుంటే ఆ కఱ్ఱే కాలుతుంది.


నిజం నిలకడమీద గాని తెలియదు.


తనకోపమె తన శత్రువు 

తన శాంతమె తనకు రక్ష 

దయ చుట్టంబౌ


ఆత్మ స్తుతి పరనింద ఆత్మహత్యా సదృశాలు.


అకారణ వైరం అకారణ ద్వేషం ఆత్మ వినాశకాలు.


శత్రువు కూడా క్షేమంగా ఉండాలి.


ఊరుకున్నంత ఉత్తమం బోడి గుండంత సుఖం లేదు.


ఐనవారికి ఆకుల్లోనూ కాని వారికి కంచాల్లోనూ.......లోక తీరు.


అసత్యం రుచించినంతగా సత్యం రుచించదు.


సంతోషము సగము బలము.


ఎంత చెట్టుకు అంత గాలి.

 

చేరి మూర్ఖుల మనసు రంజింప రాదు.