విశ్వామిత్రాహి పశుషు - కర్దమేషు జలేషుచ
Courtesy: andhraamrutham.blogspot.com/.../blog-post_08.html
దండం అంటే కఱ్ఱ అని అర్ధమట. తెనుగులో దీనిని నమస్కారంగా వాడేస్తాం. కఱ్ఱ ఎందుకు పనికొస్తుందిటా? దండం దశగుణం భవేత్ అంటే కఱ్ఱ పది రకాలుగా ఉపయోగపడుతుందన్నది మాట.
పక్షులు కుక్కల్ని తోలుకోడానికి,పాములు పశువులనుంచి రక్షించుకోడానికి, అమిత్రులను ఎదుర్కోడానికి, బురద,నీరు ఉన్నచోట చూసుకుని నడవడానికి, చివరగా గుడ్డివారికి ముసలివారికి పనికొస్తుందీ అన్నారు, పెద్దలు.
నేటి కాలంలో కఱ్ఱ ఉపయోగించేవారే కనపడటం లేదు. ఇక పశువులు, పక్షులు,పాములు,కుక్కలు చూద్దామన్నా కనపడటంలేదు. కొన్ని చోట్ల మాత్రం వీధి కుక్కలు విచ్చలవిడిగా చిన్న పిల్లల మీద కూడా దాడి చేస్తున్నాయి. వీటిని పడతాం, వాటికి సంతానం కలగకుండా చేస్తాం అంటారు, చేస్తూనే ఉంటారు కాని ఈ కుక్కల జనాభా ఎందుకు పెరుగుతోందో తెలీదు. వీటిని పట్టుకుంటే బ్లూ క్రాస్ వారొస్తారు, అదో పెద్ద కత. ఇప్పుడు పెటా వారు అముల్ మీద దాడి చేస్తున్నట్టు.
అన్ ఫ్రెండ్ అన్నమాట ఫేస్ బుక్కువాడు పుట్టించినదనుకున్నా ఇంతకాలం కాదని ఇప్పుడే తెలిసింది. అమిత్ర పదాన్ని అన్ ఫ్రెండ్ గా తర్జుమా చేసుకున్నారనమాట. అస్తు...అమిత్రుడు అంటే శత్రువే అనుమానం లేదు.
నేటి కాలంలో అమిత్రులనుంచి కఱ్ఱతో రక్షించుకోలేం. దీనికి మరి ఇతర సాధనాలే కావాలి.
ఇక బురద నీరు ఉన్నచోట లోతు చూసుకోడానికి వాడచ్చు అంటారు. వర్షా కాలమొస్తే హైదరాబాదు ముంబాయిల్లో కఱ్ఱ పట్టుకుని నడచిపోవడం మంచిదన్నారు మా మిత్రులొకరు. ఎందుకంటే నదుల్లా ఉన్న రోడ్లమీద
ఎక్కద తెరిచి ఉన్న మేన్ హోల్ ఉన్నదీ తెలియాలంటే కఱ్ఱ అవసరమే. లేకపోతే మోటార్ సైకిల్ తో సహా తీసి ఉన్న మేన్ హోల్ లో పడి చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.
నిజం చెప్పాలంటే నేటి రోజుల్లో కఱ్ఱ ఒక్క గుడ్డివారు మాత్రమే వాడుతున్నారు. ఇచ్చిన ఆర్డర్ లో విషయం వివరంగా క్లారిఫికేషన్ కి వ్రాశాం వచ్చేకా అమలు చేసాతమనేవారికీ కఱ్ఱ అవసరమేమో! అధికారం రాగానే కళ్ళు చీకట్లు కమ్ముతాయనుకుంటా!
ఇక ముసలివారు కఱ్ఱ వాడటం నేటి కాలంలో చిత్రమే. నడుస్తూ పడిపోవడం పెద్ద వయసులో సహజం.పడిపోకుండా రక్షణకి కఱ్ఱ వాడాలి. నేను కఱ్ఱ వాడుతాను అదికూడా చిన్న వాకింక్ స్టిక్ కాదు, పెద్ద కఱ్ఱే.నన్ను చూచి నవ్వుతారు,ఎగతాళిగా. పోనీలే వాళ్ళ పళ్ళే బయటపడ్డాయనుకుంటా.
చతుర్విధ ఉపాయాలన్నారు. అవి సామ,దాన,భేధ,దండో పాయాలు. సామం, మంచిమాట చెప్పి పని చేయించుకోడం. దానం పని చేయించుకోడానికి మూల్యం చెల్లించడం. కాని దీనికి పెడర్ధం తీసి ఆమ్యామ్యా ఇచ్చి పని చేయించుకోడంగా చెబుతున్నారు. భేదం అన్నది శత్రుదేశం పట్ల ఉపయోగించవలసినది. శత్రువులపట్ల ఉపయోగిస్తున్నారు. అంటే మన శత్రువుతో ఉన్న వారి మిత్రుల మధ్య భేదో పాయం ఉపయోగించడం. ఇదంత తేలికైన విద్య కాదు. ఇక ఏవీ పని చెయ్యనప్పుడు తప్పక ఉపయోగించవలసినదే దండో పాయం.ఇది నేటికి చాలా రకాలు, కంప్లయింటు నుంచి మొదలు.......కేస్ ఎప్పటికి తేలేను? అది కోర్ట్ కెళితే తేలేటప్పటికి బతికుంటామా అనుమానమే. అందుకే తక్షణ న్యాయం....దండోపాయం.
“అమిత్రుడు” … 👌👏. మనవాళ్ళు చెప్పనవి తక్కువ.
ReplyDeleteదండం గురించి జనం నమ్మేది మరొకటుందండి. అదే - చేతిలో దండం (కఱ్ఱ) ఉన్నవాడిదే బర్రె - అని 🙂.
విన్నకోట వారు,
Deleteఅవునండి. కఱ్ఱ ఉన్నవానిదె బఱ్ఱె ఇదే నేటి న్యాయం. కఱ్ఱలేనివానిని గొఱ్ఱె కూడా కరచునౌ కదు సార్!
కావున దండోపాయ మనగా దండము వలన నైన యుపాయమను నర్ధము సిధ్ధముగా నున్నది. అపాయ భయ జుగుప్సా పరాజయ ప్రమాద గ్రహణ భవన త్రాణ విరా మాంతర్ధి వారణంబు లెద్దాన నగు దానికి వలన వర్ణకం బగు అని చిన్నయ సూరి చెప్పిన ఒక పెద్ద సూత్రం ఉంది. కాబట్టి ప్రమాదము సూచితమగుట చేత దండము వలన నైన యుపాయమని వ్రాయుట. ప్రమాదనివారణకు దండము నుపయోగింతుము. దండము వలన నైన యుపాయమును దండోపాయ మని చెప్పుచున్నాము. ఇటి విధముగనే దండించుట అన్న పదము కూడ పుట్టినది. దండించుట అనగా దేనిపైన గాని యెవరిపైన గాని దందము నుపయోగించుట. ఇప్పుడు సామదానమేధదండోపాయములను క్రమములో దండమును గూర్చి తెలిసినది. బాగున్నది.
ReplyDeleteశ్యామలీయం వారు,
Deleteదండో పాయం అవసరమే, అందుకే నాలుగో ఉపాయంగా చెప్పారు. ఇదే మొదట ఉపయోగించేదీ కాదు. అన్ని ప్రయత్నాలు విఫలమైనపుడు ఇది తప్పదు.
పరిత్రాణాయ సాధూనాం,
వినాశాయచ దుష్కృతాం,
ధర్మ సంస్థాపనార్ధాయ,
సంభవామి యుగే యుగే
అని పరమాత్మ మాట కదా!
దండమయా విశ్వంభర
ReplyDeleteదండమయా పుండరీక దళనేత్ర హరీ
దండమయా కరుణానిధి
దండమయా నీకు నెపుడు దండము కృష్ణా.
రాజావారు,
Deleteతెనుగు దండం తో తేల్చేశారు.
సార్ ,
Deleteతమబోటి పెద్దలకు ఎదురాడడమా ? నెవ్వర్ .
ఇక్కడకూడా దండము సంస్కృత సమమే .
దండము అంటే కఱ్ఱ అని అర్థం . కఱ్ఱ క్రింద పడేస్తే
ఎలా నేల తాకుతుందో అలా శరీరాన్ని కృష్ణపరమాత్మ
పాదాలవద్ద పడవేసి నమస్కరించడ మట . ఇదీ తమ
బోటి పెద్దలవల్ల విన్నదే .
రాజావారు,
Deleteరెండు దండాలనీ బలే సమన్వయం చేశారు కదా. నమస్కారం
🙏
Deleteజీవితం లో దెబ్బలు తగలని వారు, ఎదురు దెబ్బలు కాయని వారు, చీవాట్లు తిననివారు ఉండరు గాక ఉండరు. ఏదో ఓక సందర్భములో ఎదురు పడే ఉంటుంది. అంత మాత్రానికే మనసుని కకావికలం చేసుకోకూడదు. పోరాడాలి, నిలదొక్కుకోవాలి. అదీ సంయమనముతో.
ReplyDeleteనాకు ఆ లైన్ వేరే విధంగా బోధ పడిందాచార్య.. అంటే దండన వేస్తే పదింతలు గుర్తు పెట్టుకుంటారనే కోణంలో.. అసలర్థం ఇదైతే కాదు కాని..!
Deleteశ్రీధరా!
Deleteపడిపోవడం సర్వ సహజం. పడిపోయినందుకు సిగ్గు పడటం కూడనిది. పడిపోయి లేవకపోవడమే అసలు నేరం.
”మందుడు మృత్పిండము వలె క్రిందంబడి అణగియుండు గృపణత్వమునన్”
అన్నది భతృహరి మాట ఏనుగు లక్ష్మణ కవి నోట.