Saturday, 24 July 2021

అంబలి తాగేవానికి మీసాలెత్తేవాడు మరొకడు.

 అంబలి తాగేవానికి మీసాలెత్తేవాడు మరొకడు.


ఇదొక నానుడి. గంజి,కలి,అంబలి,తరవాణి,లచ్చించారు ఇవన్నీ గంజి నుంచి వచ్చినవో దాని అనుబంధాలో. గత నూట ఏభై సంవత్సరాల కితం వరకు జనులు వరి అన్నం తిన్నది తక్కువ, గోజిలలో కూడా. కలిగినవారే వరి అన్నం తినే వారు. సామాన్యులు జొన్నలు,రాగులు ,చామలు,కొర్రలు ఇలా చిరు ధాన్యాలే తినేవారు. వరి అన్నం తిన్న రోజు పండగే. దరిద్రులకి గంజే గతి. దీనికో నానుడీ ఉంది. కలిగినవారి బట్టకీ లేని వారి పొట్టకీ గంజే దిక్కు. కలో గంజో తాగి బతుకుతాం లేదా కలో అంబలో తాగి బతుకుతాం అనే మాటలు జనం వాడేవే. వరి అన్నం తిన్నవారు మహరాజులే.కుక్కర్లోచ్చే దాకా గంజి వార్చేవారు. ఆ తరవాత అన్నం వండటం మరచినట్టే, అంచేత గంజి గురించి తెలిసినవారే తక్కువనుకుంటా. నేడు అమెరికన్ ఫుడ్ సొసైటీ 

వారో మరెవరో ఇవన్నీ బలవర్ధక ఆహారాలనీ, రోగ నిరోధక శక్తి కలిగిస్తాయనీ చెబుతున్నారు, ఆ మాటైనా చెవినేసుకునే రోజు కనపడటం లేదు. 


నాటి రోజుల్లో అంబలి,కలి,తరవాణి వగైరాలను నీచంగానే చూశారు. దానికి శ్రీనాథుడే సాక్షి, చల్లా అంబలి తావితిన్, వెల్లుల్లిన్ దిలపిష్టమున్ మెసవితిన్ అని తన దరిద్ర స్థితిని వెళ్ళబోసుకునాడు.


గంజి అంబలి తాగేవారంటే దరిద్రులనే మాట నాడు స్థిరపడిపోయింది.నాటి కాలంలో దరిద్రులైనా మీసాలకి లోటుండేది కాదు, మీసాలంటే నేటిలాగా కత్తెర మీసాలు,సీతాకోక చిలుక మీసాలు కాదు బొద్దు మీసాలేకాదు, బారు మీసాలే ఉండేవి. మరి అంబలి,గంజి తాగినపుడు ఈ మీసాలు అడ్డు పడేవి, తడిసేవి. ఎవరి మీసాలు వారే సవరించుకుని అంబలి తాగే రోజులనమాట. ఈ అంబలి తాగే దరిద్రుని మీసాలు సవరించడానికి మరొకరా? అనేది ఎద్దేవా. అనగా వాడే ఒకరికి తొత్తు ఆ తొత్తుకింద మరొకతొత్తా అదే బడితొత్తు అన్నమాట.


తత్తు కొడక అని తిడతారు తప్పు అది తొత్తు కొడక, తిట్టుకూడా తిన్నగా తెనుగులో చెప్పలేని రోజులైపోయాయి.    




8 comments:

  1. పాత వాటిని తవ్వి తీసి వ్యాపారం చేసుకోవడం అనే రుచి బాగా మరిగారు ఈనాటి మనుషులు. అ కోవలోనివే చామలు, కొర్రలు, సజ్జలు వగైరా. ఇప్పుడు millets అంటూ వీటికి పెద్ద ప్రచారం, టీవీ వంటల కార్యక్రమాల్లో ప్రముఖ పాత్రన్నూ. తృణధాన్యాలు మంచివే గానీ వాటిని తినడం కన్నా షో చెయ్యడం ఫాషన్ అయిపోయిందని నాకెక్కడో చిన్న అనుమానం సారూ.

    గంజి వార్చడం కూడదని మా చిన్నప్పుడు స్కూల్లో మా సైన్స్ మాస్టారు చెప్పేవారండీ ఆ రోజుల్లోనే. క్లాసులో అడిగే వారు ఏరా మీ ఇంట్లో గంజి వారుస్తారా అని. వారుస్తారు మాస్టారు గారండీ అని జవాబు చెప్పిన వారితో అయితే మీరు తినే అన్నం ఉత్త గడ్డిరా, పిప్పి లాంటిదిరా, మీ అమ్మ గారికి చెప్నండిరా అనే వారు మాస్టారు పాపం. సరే, కాలానుగుణంగా వచ్చిన అనేక మార్పుల ఫలితంగా ఇప్పుడా సమస్యే లేదు, ఆలోచనా లేదు, ఆ టెక్నిక్కూ మాయమై పోయింది. ఒక రకంగా మంచిదేగా, అన్నంలో గంజి అన్నంలోనే ఉంటుంది.

    అసలు గంజి ఎందుకు వార్చే వారు అంటారు? పైగా పెళ్ళిళ్ళల్లో గంజి పారబొయ్యడానికి పెద్ద గుంట తవ్వడం ఒకటి, అటూ ఇటూ పరుగులెట్టే చిన్న పిల్లలకు ఆ వేడి గుంట వలన ప్రమాదమున్నూ. అసలెందుకు గంజిని పారబొయ్యడం, కాస్త వివరించమని మనవి.

    “తొత్తు కొడకా” అనే తిడతారండి … నోరారా 😁. “తత్తు కొడకా” అనడం నేనెప్పుడూ వినలేదు 🤔.

    ReplyDelete
    Replies
    1. అవునండీ, ఆహారం వ్యాపారం అయిపోయింది. ఎవరికి తోచిన సలహాలు, సూచనలు వాళ్ళు ఇచ్చేస్తున్నారు. మన తాతలు, తండ్రులు ఏమి తిన్నారో అదే తినడం మంచిది అని నా అభిప్రాయం.
      మరో విషయం, ఇప్పుడు కుక్కర్లు వచ్చి గంజి వార్చకపోవడం వల్లే డయాబెటిస్ ఎక్కువ అవుతోందని ఒక వాదం కూడా ఉంది.

      Delete
    2. VNR సారూ,
      పాతవి మంచివని ఒప్పేసుకోలేక కొత్తగా కనుక్కున్నామని చెప్పుకోలేక అదిసారూ,
      మీ మాస్టారికి అత్తెసరు ఇష్టమేమో :)గంజి వార్చుకునేది పారబోసుకోడానికి కాదు సార్! దాన్ని మళ్ళీ అన్నంతో తీసుకోవాలి, రాజావారు చెప్పినట్టు, అప్పుడది అమృతం.ఆత్తెసరు వేడి చేస్తుంది సార్,గంజి అందులోనే ఉండిపోడం మూలంగా.
      పెళ్ళిళ్ళలో దుబారా సహజంకదసార్!అది గొప్ప కూడా, ఆ దురాచారం నేటికీ కొనసాగిపోతోందిగా! :)
      నాకు వినపడినది తత్తు కోడకా అని :) మనసారా తొత్తుకొడకా అనే తిడతారనమాట :)

      Delete
    3. బోనగిరి గారు,
      నేడు ఉత్తమ వ్యాపారం ఆహారం. మన పెద్దలు వాడిన ఆహారాన్ని వాడుకోవడం ఉత్తమం.డయాబెటిస్ విషయంలో మీ అభిప్రాయమే నాదిన్నూ

      Delete
  2. అన్నము వార్చిన గంజే
    అన్నములో మరల చేరి అమృత మయంబౌ
    నన్నా ! భాస్కరగురు జీ !
    ఎన్నంగా ఉల్లి మిర్చి ఎంతో రుచియౌ .

    ReplyDelete
    Replies
    1. రాజావారి మాట వరహాల మూట.

      Delete
  3. ఒహప్పుడు శ్రీనాథ కవి సార్వభౌమ గంజిని పేదవారి ఆహారానికే మారుపేరు గా పరిగణించారన్నారు.. మరి నేటి కాలంలో.. ఆ పాత రుచులనే.. అదే రాగి, సజ్జ, జొన్న, అరికె, కొఱ్ఱ మొదలగు వాటినే పూటకోమారు సేవించుచుంటిరే.. అలానే.. గంజి అంటే వ్యాక్ అనే వారే.. కార్న్ స్టార్చ్, ఎగ్స్, ప్యాన్కో బ్రెడ్ క్రంబ్స్ లతో బోండాలు, కేయఫ్‌సీ లు ఆవురావురంటు లాగించేస్తున్నారు గా శర్మాచార్య

    హ్మ్.. ఔనౌను రాజారావాచార్య.. చిక్కటి గంజిలో ఇంత వేడన్నం, కూసింత ఉల్లి, పచ్చి మిర్పి ని నంజుకుంటే బావుంటుంది..

    ఒహప్పుడు తినటానికి అన్నం దొరికేదే కాదు, ఈ చిరుధాన్యాలే ఎక్కువగా ఉండేవి.. పైగా అపట్లో కుంపటి మట్టితో చేసేవే ఉండేవి. వరి అన్నాన్ని వండుతునపుడు నురగలా పైకి తన్నుకొచ్చే ఆవిరి పట్టిన గంజి నీరు తేలేది.. ఒక్కోసారి ఒలిగి కుంపటినే తడిపేసేది.. అది పగిలిపోయేది, పైపెచ్చు మంటలు ఆరిపోయేవి.. అంచేత అన్నం నుండి ఆ గంజిని ఏసరు మరిగాక తీసి అందులో కాసింత ఉప్పు, చిటికెడు కారం లేద పచ్చి మిర్పి, ఉల్లిపాయ ను నంజుకుని కలుపుకుని అదే అన్నంతో కలిపి తినేవారు.

    ఇహ ఇపుడు కుక్కల్రో మూడు విజిల్స్ కే అన్నం రెడి.. మరి గంజంటే ఆవిరిలో కలసి పటాపంచలే వియన్నారాచార్య

    ReplyDelete
    Replies
    1. శ్రీధరా!
      శ్రీనాధుడు రాజాలా బటికారు. చివరికి అలా పేదరికంలో పడిపోయి తలుచుకున్నారన్నమాట,పోల్చుకున్నారు,అంతే. ఇంత హీనస్థితికి చేరానా అని.
      మరి నేడు వాడుతున్నది ఆరోగ్యం పేరుతో అవసరం, మరోమాట కొత్తవేవో గొప్పగా తినేస్తున్నామని చెప్పుకునే డాబున్నూ :)

      Delete