Monday, 7 October 2024

కొండొండోరీ సెరువుల కిందా........కొత్త వ్యాఖ్య.

కొండొండోరీ సెరువుల కిందా........కొత్త వ్యాఖ్య.

కొండొండోరి సెరువులకింద..... ఈ గేయానికి అర్ధం నామటుకు నేను పూర్తిగా చెప్పుకోలేకపోయాను. ఎవరెవరో చెప్పినవాటిని కూడా పూర్తిగా ఆమోదించలేకపోయాను. కాని తెలుసుకోవాలనే ఉత్సుకత పోలేదు. ఇప్పటికి నాకు నచ్చిన వ్యాఖ్య కనపడింది. అందుకే పంచుకుంటున్నాను.రచయిత్రి నీరజ హరి ప్రభలగారికి నా అభినందన మందారమాల. 

Courtesy:-

 https://www.manatelugukathalu.com/post/kondondori-seruvula-kinda-telugu-article-3670


'Kondondori Seruvula Kinda- New Telugu Article Written By Neeraja Hari Prabhala

Published In manatelugukathalu.com On 01/10/2024

'కొండొండోరీ సెరువుల కిందా' తెలుగు వ్యాసం

రచన: నీరజ హరి ప్రభల 

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)


కొండొండోరీ సెరువుల కిందా........


నాకు చాలా చాలా ఇష్టమైన తత్వము. దీనిని అడవి బాపిరాజు గారు వ్రాశారు. ఇది చాలా భావయుక్తమైనది, అర్ధవంతమైనది. ఈ తత్వానికి చాలా లోతైన భావముంది. 


మన జీవిత వాస్తవాన్ని తెలుపుతూ మనలో నిగూఢంగా నిక్షిప్తమైన సత్వము,రజస్సు, తమస్సు గుణాలను, వాటిస్వభావాన్ని తెలుపుతూ, వాటికనుగుణంగా మన మనస్సు ఏవిధంగా మెలిగేదీ తెలుపుతుంది. ఈ తత్వానికి అర్ధం వివరించ ప్రయత్నిస్తున్నాను.


1.కొండొండోరీ సెరువుల కిందా సేసిరి ముగ్గురు ఎగసాయం… అంటే ఈ అనంతకోటి బ్రహ్మాండాలలో త్రిమూర్తులు ముగ్గురు స్రృష్టి వ్యవసాయం చేయ మొదలు పెట్టారు. ఒకడికి కాడీ లేదు, రెండు దూడా లేదు అంటే వ్యవసాయానికి కావలసిన కాడిగానీ, దూడ గానీ వాళ్ళవద్ద లేవు. 

కాడీ దూడ లేనెగసాయం పండెను మూడు పంటలు. అంటే ఆ పంటలు సత్వము,రజస్సు, తమస్సు అనే గుణాలు.మరి ఆ పంటలకు వడ్లు, గడ్డి ఉండాలి కదా! కానీ సత్వరజస్తమోగుణాలు అనే పంటలకు వడ్లు, గడ్డి రెండూ లేవు.


2.ఆ పంటలను తీసికెళ్ళి ఇశాక పట్నం సంత (ఇశాఖ అంటే ఔన్నత్యం శాఖలు లేని సంసారం)లో పెట్టారు. జీవులు వాటిలో లీనమై మాయా ప్రపంచాన్ని చూసి అది నిజమని భ్రమపడి సంసార జీవితంలో పడి ఆ వ్యామోహంతో వాస్తవ ప్రపంచాన్ని మరిచిపోయారు. ఐహిక సుఖాలు- కోరికల వ్యామోహానికి దాసులయ్యారు.


3. జనం లేని సంతలోకి వచ్చిరి ముగ్గురు షరాబులు…అంటే షరాబులు అంటే కంసాలులు. వాళ్ళు అగ్ని, వాయువు, సూర్యుడు. వాళ్ళకు కాళ్లు లేవు, రెండు చేతులు లేవు.వాళ్ళకు మనలాగా రూపములు ఉండవు కదా!.


4.కాళ్లు, సేతులు లేని షరాబులు తెచ్చిరి మూడు కాసులు…అంటే అవి త్రిదండాలు. అవి 1.వాక్ దండము(మౌనము) 2.మనోదండము (ఆశ లేకుండుట) 3.కాయదండము(స్వధర్మాచరణము).

అవి వొల్లావొల్లాదు, రెండూ సెల్లా సెల్లావు అంటే త్రిదండాలకు ఈ లోకంలో చెల్లుబాటు లేదని భావము.అంటే. ఆ మూడింటినీ మనం ఆచరించము కదా!


5.వొల్లా సెల్లని కాసులు తీసుకు ఇజయనగరం ఊరికి పోతే ఒట్టి ఊరే కానీ ఊళ్ళో జనం లేరు …అంటే (విజయ అంటే మిక్కిలి గెలుపు ). సహస్రార చక్ర ఛేదనము ఆనే ఊరు. ఈ లోకంలో చాలా మంది దృష్టిలో పనికిరాని ఆ త్రిదండాలను ఆచరించి ఉత్తమ యోగా భ్యాసంతో ఆ సహస్రార చక్రఛేదనము అనే ఊరు వెళదామని చూస్తే ఆఊరు చేరినవారెవరూ లేరు. అంటే ఉత్తమ యోగులు లేరు అని భావం.


6.జనంలేని ఊళ్ళోను ఉండిరి ముగ్గురు కుమ్మర్లు...అంటే వాళ్ళు త్రికాలాలు. అవి భూత, భవిష్యత్.వర్తమాన కాలాలు. ఒకటికి తలా లేదు, రెండు మొలా లేదు అంటే ఉత్తమ యోగాభ్యాసం చేసే వాళ్లు లేకపోయినా తలా-మొలా లేని(ఆకారం లేని త్రికాలాల ) కుమ్మర్లు వస్తూనే ఉంటారు. కాలాలు అతీతమైనవి కదా!


 7.తలా-మొలా లేని కుమ్మర్లు సేసిరి మూడు భాండాలు….అంటే అవి భూలోకం, పాతాళ లోకం, స్వర్గలోకం. ఒకటికి అంచు లేదు రెంటికి అడుగూ లేదు.(కాలం సృష్టించే లోకాలకు అంచు-అడుగు లేదుఆది-అంతం ఉండదు.) అది నిరంతరం ఉంటుంది.


8.అంచూ-అడుగు లేని భాండాలలో ఉంచిరి మూడు గింజలు…అంటే అవి శ్లేష్మం, వాతం, పిత్తం అనే త్రిదోషాలు.అవి ఉడకా ఉడకదు, రెండు మిడకా మిడకావు. అంటే ఈ లోకంలో జీవులు ఆడుకునేందుకు వాత, పిత్త, శ్లేష్మం అనే 3 గింజలను ప్రతి జీవిలోను ఉంచాడు భగవంతుడు.


9.ఉడకా-మిడకని మెతుకులు తినుటకు వచ్చిరి ముగ్గురు సుట్టాలు…అంటే ఆ చుట్టాలు ముగ్గురు మనస్సు, వాక్కు, కర్మ అనే త్రికరణాలు. 

ఒకటికి అంగుళ్ళేదు, రెండు మింగుళ్ళేదు. అంటే శ్లేష్మం, వాత, పిత్తం అనే త్రికరణాలను జీవులు అనుభవిస్తున్నారు. వాటితో ఎప్పుడూ ఏదో ఒక విధంగా బాధ పడుతూనే ఉంటాడు ప్రతి జీవి.


10.అంగుడు-మింగుడు.(లోకుత్తుక) లేని సుట్టాలు తెచ్చిరి మూడు సెల్లాలు….అంటే అవి ధర్మ, అర్థ, కామము అనే త్రిగుణాలు. వాటికి సుట్టూ లేదు, రెండు మద్దే లేదు. సెల్లా లు అంటే అంచులు లేని బట్టలు. ధర్మార్థకామమనే త్రిగుణాలు సెల్లాలు. వాటిని త్రికరణాలు తెచ్చారు. అంటే వీటికి చుట్టాలు లేరు. పరిమితము అనేది లేదు.
 https://www.manatelugukathalu.com/ వారికి,నీరజహరి,ప్రభల గారికి ధన్యవాదాలు తెలుపుతూ టపాను ఇక్కడ పంచుకుంటున్నా!

No comments:

Post a Comment