Thursday, 29 September 2022

చెఱపకురా చెడేవు.

 చెఱపకురా చెడేవు.


ఎవరికీ చెడ్డకోరకూడదు. అదే మనకు తిరిగొస్తుందంటారు. 

"చేసిన ర్మము చెడని పదార్ధము చేరును నీ వెంట" తత్త్వం, తెలిసి చేసినా తెలియక చేసినా, నిప్పులో చెయ్యి పెడితే కాలి తీరుతుంది కదా! అంతే మరి, చెడ్డ చేస్తే ఫలితమూ చెడ్డగానే ఉంటుంది. చెడు ఎలా చేస్తాం? ఎలా చేస్తామో చెబుతుందీ శ్లోకం,

కరచరణ కృతంవా
మనోవాక్కాయజం వా చ
తవాపరాధం క్షమస్వ
మహా దేవ దేవ శంభో!
కాళ్ళూ చేతులతో, మనసు,వాక్కు, కర్మలతో చేసే సర్వ అపరాధాలనీ క్షమించమని వేడుకోలు. వేడుకున్నంతలో ఫలితం ఉండదు, ప్రతిఫలమూ తప్పదు. అందుకే మనవాళ్ళు "ఎప్పుడు చేసిన కర్మో! ఇప్పుడిలా కట్టికుడుపుతోంద"ంటారు.మరో మాట కూడా చెబుతారు, "నవ్వుతూ చేస్తే ఏడుస్తూ ఫలం అనుభవిస్తావ"ని. "Karma returns" today saying.  అబ్బే! జాంతానై! గురువూ నై!! దేవుడూ నై!!!,నేటి మాట అస్తు! అస్తు!!


చెట్టు చెడే కాలానికి కుక్కమూతి పిందెలు.


చెట్టు పాడవడాన్ని "పుల్ల విరిగింద"ంటాo, మా పల్లెటూరీ భాషలో. చెట్టు కాని, పాదుకాని కాపు పూర్తయి, ఇక ముందు కాయదు అనడానికి సంకేతంగాను, ఇక ముందు చనిపోతుందని సంకేతంగా  ఇటువంటి పిందెలు దిగుతాయి. వీటిని కుక్కమూతి పిందెలంటారు. ఇలాగే మనుషుల్లో కూడా, పిదపకాలపు బుద్ధులు పుడతారంటారు. 


Sunday, 25 September 2022

ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానంది.

 ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానంది.




సాధారణంగా ఉట్టి ఎత్తుగానే కడతారు. రోజూ వాడుకునేదైతే కొంచం తక్కువ ఎత్తులో అంటే ఆ ఇంటి ఇల్లాలు నిలబడి చేతులెత్తితే అందేలా కట్టుకుంటారు. ఇందులో పాలు,పెరుగు దాచుకుంటారు, పిల్లి నుంచి రక్షించుకోడానికి.

ఇక స్వర్గమన్నది ఉందో లేదో తెలీదు, ఉంటే ఎక్కడుందంటే ఆకాశం వైపు చూపుతారు, ఎంత దూరమంటే తెలీదు.ఎగిరి వెళితే ఎంత కాలం పడుతుందంటే తెలీదు. ఇటువంటి ఏమీ తెలియని స్వర్గానికి, నిలబడి చేతులెత్తి ఉట్టి అందుకో లేని ఇల్లాలు, ఎగిరి వెళ్ళిపోతానందిట, ఆంటే హాస్యాస్పదంగా ఉందని అంటారు గిరీశం భాషలో గోతాలు కొయ్యడం. 


ఇదే మరోలా కూడా చెబుతారు, కూచుని లేవలేనమ్మ ఒంగుని తీర్థం వెళతానంది, అని. 


ఒక అత్తా ,కోడలు. అత్త ముసలిదై కూచుంటే లేవలేక లేస్తే కూచో లేక తిప్పలు పడుతోంది. నడుం ఒంగిపోవడంతో తిన్నగా నిలబడలేక, నడవలేక ఉన్నది, లేస్తే ఒంగుని నడుస్తుంది,కఱ్ఱపోటుతో.

 ఒక రోజు కోడలితో తీర్థం వెళతానంది. అత్తా! కూచుంటే లేవలేకున్నారు, ఎలా వెళ్ళగలరు తీర్థానికి? అక్కడ జన సమ్మర్దం, తోసుకుంటారు, మీకంత ఓపిక ఉందా? నడవగలరా? అడిగింది. దానికి అత్త, కూచుని లేవలేకపోవచ్చుగాని , ఒంగుని నడిచి తీర్థం వెళతానూ అందిట. విన్న కోడలు ముసి ముసి నవ్వులు నవ్వుకుందిట, పగలబడి నవ్వలేదు? ఎందుకూ?   



పంచాయతి ప్రెసిడెంట్ గా నెగ్గలేనివాడు ప్రధాన మంత్రి పదవికి పోటీ చేస్తానన్నట్టు.

ఇవి రెండూ తెనుగునాట చెప్పుకునే నానుడిలే సుమా!

Friday, 23 September 2022

విపక్షం నుంచి 2024లో ఎవరు ప్రధాని అభ్యర్థి ? -2

 విపక్షం నుంచి 2024లో  ఎవరు ప్రధాని అభ్యర్థి ? -2

Continuation of

 https://kasthephali.blogspot.com/2022/09/2024-1.html

విపక్షం నుంచి ఏ ఒక్క పార్టీ బిజెపిని ఒంటరిగా దేశం మొత్తం మీద ఎదుర్కోగల స్థాయిలో లేదు. ఆర్జెడి నేత "కాంగ్రెస్ బలంగా ఉన్న చోట మీరుపోటీ చేయండి, స్థానిక పార్టీలు బలంగా ఉన్నచోట వాటిని బలపరచండి" అని సూచించారు, దానికి కాంగ్రెస్ వారిచ్చిన సమాధానం " మేమింకా బలహిన పడదలుచుకోలేదని" పురిటిలోనే సంధికొడుతుంటే పొత్తులెక్కడా? అనేదే  సందేహం. 


ప్రధాని పదవికి పోటీ పడాలని అనుకునేవారు ఈ కిందివారని ప్రజలమాట, మీడియా మాట.

రాహుల్ గాంధి: వీరి పార్టీకి స్థానిక పార్టీలకి చుక్కెదురు, అన్ని రాష్ట్రాలలోనూ. పాలనానుభవం శూన్యం, కనీసం పంచాయతి ప్రెశిడెంట్ గా కూడా పని చేసిన అనుభవం లేదు. పైనుండి చెప్పడం వేరు, పని చేయడం వేరు. ఇది వీరికి పెద్ద మైనస్ పాయింటే. ఎత్తుచేతివారి బిడ్డ గనక పాలనానుభవం పుట్టుకతోనే వచ్చేస్తుందనేవారూ లేకపోలేదు. ఇతనికి సమయం సందర్భం తెలిసిమాటాడే అలవాటు పూజ్యం అని అంటారు. విపక్షంలో కాకలు తీరిన యోధులున్నారు, పాలనానుభం కొల్లలుగా ఉన్నవారున్నారు. ఇతనిని ప్రధానిగా ఒప్పుకోగలరా అన్నది, పెద్ద ప్రశ్న.మరొకరిని వీరి పార్టీ నుంచి ఎన్నుకునే సావకాశం చెప్పలేనిదే!వీరికి రాగల సీట్లు 50. శత్రువులెక్కువ. 


మమత: వీరు బెంగాల్ లో మూడో సారి ముఖ్యమంత్రిగా ఉన్నారు. వీరికి బెంగాల్లో తప్పించి మరో రాష్ట్రంలో పలుకుబడి లేదు. బెంగాల్ దాటి వీరి ప్రభ లేదు,సామాన్యులెవరికి తెలియనివారే! తృణమూల్ పార్టీకి, కాంగ్రెస్ కి, సి.పి.ఎమ్ లు రాష్ట్రంలో ప్రత్యర్థులు.  బెంగాల్లో ఎక్కువలో ఎక్కువ  వీరికి 20 సీట్లకంటే వచ్చే సావకాశం లేదు. మరొక పార్టీకి అదే తమిల్నాడులో డి.ఎమ్.కె కి మాత్రం వీరితో సమానంగా సీట్లు వచ్చే సావకాశం.మమత తాము,అఖిలేష్, ఝర్ఖండ్ వారు ఒక జట్టని ప్రకటించారు. వీరికి రాబోయే సీట్లు 20.


నితీష్: వీరు బీహార్ ముఖ్యమంత్రిగా చాలాకాలం నుంచే ఉన్నారు. పాలనానుభవం దండిగా ఉన్నవారే!ఇప్పటికే చాలా సార్లు తమపార్టీని కాంగ్రెస్ నుంచి, బి.జె.పి కి మరల ఇటునుంచి అటు కప్పగంతులు వేసి అధికారం నిలబెట్టుకున్నారనే అపప్రథ ఉన్నది. ఇప్పుడైతే ఎన్నికల తరవాత మళ్ళీ బి.జె.పి లోకి గెంతరనే నమ్మకం ఎక్కువమందికి లేదు.అంతేగాక వీరు బి.జె.పి తరఫున పనిచేస్తూ కాంగ్రెస్ వైపుకొచ్చారు, గూఢచారిగా అనే మాట కూడా వినపడుతోంది. వీరికి బీహార్లో తప్పించి మరో రాష్ట్రంలో పట్టులేదు.  నితీష్ ఉ.ప్రదేశ్ నుంచి పోటీ చేస్తారని నేటి వార్త. వీరికి ఉ.ప్ర లో పట్టులేదు, కాని వీరికి ఉ.ప్ర మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ తన సీటు ఫూల్పూర్ వీరి పోటికి త్యాగం చేయబోతున్నట్టు వార్త.నితీష్, బాబోయ్! నేనసలు విపక్షాల తరఫున ప్రధాని అభ్యర్థిగా పోటీ లో ఉన్నానని చెప్పలేదు మొర్రో! అని మీడియా ముందు గోల. వీరికి అందరూ మిత్రులే అలాగే అందరూ శత్రువులే!!! వీరికి రాబోయే సీట్లు 6.


శరద్ పవార్: వయసు మీద బడింది,ఆరోగ్యమూ సరిలేదు, వీరు కేంద్ర మంత్రిగానూ ఉన్నారు, మరాఠా చాణుక్యుడంటారు. వీరికి మహరాష్ట్రలో ఓ చెంపనే బలముంది,మరే రాష్ట్రంలోనూ చెప్పుకోతగ్గ బలం లేదు.  వీరికి రాబోయే సీట్లు 6 కి పెరగవు.  వీరికి కొత్త మిత్రులు పాత శత్రువులు ఒకటే! ఎవరితోనైనా కలసిపోతారు, తమ పని ముఖ్యం,అంతే.


 అఖిలేష్ యాదవ్ : ఉ.ప్ర. కి ఉన్న సీట్లు 80. వీరికి ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం ఉంది.హిందీ రాష్ట్రాలలో కూడా వీరికి పట్టులేదు, తమ రాష్ట్రం తప్పించి. వీరికి బి.ఎస్.పి కి కుదరదు.  వీరికి రాగల సీట్లు ఇరవైలోపే.ప్రధాని కావాలనే కోరిక ఎక్కడా వెలిబుచ్చినట్లు లేదు.


కేజ్రివాల్: వీరినంతా క్రేజివాల్ అంటారు,అదేమో మరి. వీరు ఢిల్లీ లోనూ పంజాబ్ లోనూ అధికారంలో ఉన్నారు. రేపు హిమాచల్ లోనూ గుజరాత్ లోనూ ప్రభుత్వం ఏర్పాటు చేసేస్తామంటున్నారు. వీరికి కాంగ్రెస్ అంటే చుక్కెదురు. మేము అప్పుడే బి.జె.పి వ్యతిరేక ఫ్రంటులో చేరమని ప్రకటించారు. అంటే  తటస్థంగా ఉండి, ఎక్కువ లాభం పొందాలని ఆశ, దురాశ కాకుంటే మంచిదేనేమో!. 


ఇక దక్షణాది కొస్తే, ఇక్కడ్నుంచి ప్రధాని అయ్యే సావకాశాలే తక్కువ.మొత్తం దక్షణాది రాష్ట్రాలలో సీట్లు అన్నీ కలిపి ఆంధ్ర25+తెలంగాణా17+తమిల్నాడు39+కేరళా20+కర్నాటక28=129.ఇక్కడినుంచి ప్రధాని కావాలని ఉవ్విళ్ళూరుతూ మోడీ ని దించేస్తాం, ఆ తరవాత మాదే ప్రభుత్వం అంటున్న కె.సి.ఆర్ అనే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనబడే తెలంగాణా ముఖ్యమంత్రి, ప్రథములు.పోనీ ఈ దక్షణాదివారంతా ఒక మాట మీదుంటారా అంటే సాధ్యం కానిదే! వీరికి కాంగ్రెస్ కీ కుదరదు. వారున్నచోట వీరుండరు. కాంగ్రెసేతర,బిజెపియేతర ప్రతిపక్షపార్టీలకూటమా? ఇదివరలో చాలా ప్రయత్నాలే జరిగాయి, కాని ఏదీ బతికి బట్టకట్టలేదు.కొత్త పార్టీ స్థాపనా? ఎమో చూడాలి.ఒక రాష్ట్రంలో కొత్తపార్టీ పెట్టి తొమ్మిది నెలల్లో నెగ్గుకురాగలగినవారు ఎన్.టి.ఆర్ మాత్రమే! దేశం మొత్తం మీద కొత్త పార్టీ పెట్టి ఆశయాలు చెప్పి అన్ని రాష్ట్రాలలో ఒప్పించగల కార్యకర్తలు, మంది, మార్బలం సమకూర్చుకోవడం తేలికా, రెండేళ్ళలో సాధ్యమా? అభిమానులు జరుగుతుందంటే విని ఆనందించచ్చు.కాని ఇది నిజానికి దూరమేమో! అన్ని పార్టీలు ఎక్కడివారక్కడ పోటీ చేసి ఎన్నికలయ్యాక పొత్తులు కుదుర్చుకుంటాం అంటే ప్రజలు నమ్ముతారా? 


కెసిఆర్: వీరి పార్టీ తెలంగాణా లో పదేళ్ళుగా పాలనలో ఉంది. తెలంగాణాలో పట్టున్నది. కాని రాష్ట్రం దాటి వీరి మాట వినేవారెవరనేది పెద్ద ప్రశ్న.కొత్త పార్టి పెడుతున్నా! ఖబడ్దార్ అని గర్జిస్తున్న మాట నిజం. వీరి రాష్ట్రం లో మొత్తం సీట్లు 17 కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. కాని ఆ స్థానాన్ని బి.జె.పి ఆక్రమిస్తున్నందుకే వీరి గర్జనలని విజ్ఞుల మాట. వీరికి మహా ఐతే 10 సీట్లు రావచ్చు. వీరికి కాంగ్రెస్ కి పొత్తు లేదు. వారి నీడ కూడా పడటానికి ఇష్టపడని వీరు కాంగ్రెస్ లేక కేంద్రంలో బిజెపి కి వ్యతిరేకంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలరా?వీరి మీద మరో అపప్రధ కూడా ఉంది,కొడుకుని రాష్ట్రంలో ముఖ్యమంత్రిని చేసి తాను కేంద్రంలో చక్రం తిప్పాలనుకుంటున్నారంటారు. 

చంద్రబాబునాయుడు: తెలుగుదేశం పార్టి బిజెపితో అంటకాగి YSR CP వేసిన ఎత్తుకు చిత్తయి,బిజెపితో కటీఫ్ చేసుకున్నారు,ప్రభుత్వం నుంచీ బయటికొచ్చారు. దీనికీ ఎవరూ తప్పుపట్టాలేదు. కాని, బద్ధ వ్యతిరేకి ఐన కాంగ్రెస్ తో 2019 లో పొత్తు పెట్టుకోడానికి ప్రయత్నంతో ప్రజలు తిరస్కరించారు. అప్పటినుంచి,ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ అధికారానికి దూరమై ఉన్నవారు.నలభై ఏళ్ళ పాలనానుభవం, రాజకీయానుభవం పనిచేయలేదు.వీరికి రాష్ట్రంలో పది సీట్లురావచ్చు.మరో రాష్ట్రంలో పట్టులేదు.పట్టుందని ప్రయత్నించిన కర్ణాటకలో ఎదురు దెబ్బే తగిలింది. వీరి మీద మరో అపప్రధ కూడా ఉంది,కొడుకుని రాష్ట్రంలో ముఖ్యమంత్రిని చేసి తాను కేంద్రంలో చక్రం తిప్పాలనుకుంటున్నారంటారు. 


కమ్యూనిస్టులు:అంతర్జాతీయ పార్టీ మాదని చెప్పుకునే వీరు దేశంలో కొన్ని చోట్ల మాత్రమే ఉన్నారు. బెంగాల్ లో తృణమూల్ దెబ్బకి మట్టికరిచి మరి తేరుకోలేకపోయారు. ఇక వీరికి పట్టున్న మరోచోటు కేరళా, కాని ఇది కూడా కుటుంబ పార్టీ ఐపోతోందంటున్నారు. చారిత్రిక తప్పిదాలు చేయడం వీరి అలవాటు. మరెక్కడా ఉనికి ఉన్నట్టు లేదు. కేరళాలోనే వీరికి రాగల సీట్లు 10.


1962 లో మొదటి సారి ఓటేసిన వాడిని, నాటినుంచి ఎన్నికలు చూస్తున్నవాడిని,రాజకీయనాయకులతో,

రాజకీయపార్టీలతో సన్నిహితంగా ఒక ఇరవై సంవత్సరాలు గడిపినవాడిని. ఆరోజుల్లో కూడా కాంగ్రెస్ నీ గద్దె దించేస్తామన్న వారే అందరూ, కాని ఆ పార్టీ చిత్తు కావడానికి దగ్గరగా ఏభై ఏళ్ళు పట్టింది. అది కూడా ఆ పార్టీ చేసుకున్న స్వయంకృతాపరాధం మూలంగానే!స్వాతంత్ర్యం తరవాత పాలూ తేనెలు ఈ పార్టీ దేశంలో ప్రవహించేస్తుందని నమ్మి మా తాతలు ఆస్థులు తెగనమ్మి ఈ పార్టీని బతికించారు, మమ్మల్ని వీధులపాలూ చేశారు. 

అంతర్గత ప్రజాస్వామ్యం తో దేశప్రజల ఆకాంక్షలు తీర్చగల మరో పార్టీ ఉండటం మంచిదే! అటువంటి పార్టీని నిర్మాణం చేస్తే ఆనందమే.స్వార్ధమే, పరమావధిగానూ, ద్వేషమే ఊపిరితో బతికే పార్టీలు ఏమి చేయగలవన్నదే ప్రశ్న.

పై చెప్పినవారే కాక వెలుగులోకి రాని వారు చాలామందే ఉన్నారు, అందరూ పల్లకీ ఎక్కేవారే మోసేవారెవరన్నదే ప్రశ్న.

  అనుకున్నట్టే కాక ఇంకా ఎక్కువ సీట్లే వస్తాయని ఊహిస్తూ అంచనా

CON60+TMC 25+DMK25+NCP10+AAP10+SP 20+RJD 20+TDP10+TRS10 +CPM10 Total 200 small parties say 30.Now the total is 230 along with congress, 170 without congress. It is difficult to understand how a governemt can be formed at centre. 

ఇందులోనే, ఒకరినీడ మరొకరిపై పడినా సహించలేరు.ఒకరిపై ఒకరికి నమ్మకమూ లేదు వీరికి పొత్తెలా? ప్రజలని ఎలా నమ్మిస్తారు?అటువంటి కూటమికి విదేశీ విధానం ఏమిటి? చాలా ప్రశ్నలకి సమాధానం లేదు.కొన్ని పార్టీలు ఎప్పుడూ అధికారంలో ఉన్నవారితో అంటకాగుతాయి, అది సహజం కూడా. ఎన్నికల తరవాత ఎంతమంది ఈ కూటమిలో ఉంటారో! ఎవరు జారుకుంటారో ఎవరు చెప్పగలరు?

బలవంతంగా వీరంతా కలిసినా అదెంతకాలం? అలా కలపగల వారెవరు? సామాన్యునికి అన్నీ సమాధానం లేని ప్రశ్నలే!


Wednesday, 21 September 2022

ఎద్దు పుండు కాకికి నొప్పా?

 ఎద్దు పుండు కాకికి నొప్పా?

స్వంతవైద్యం చేసుకోకూడదు. అలాగే ఇంట్లో వారెవరూ వైద్యమూ చేయకూడదు,ఎంత గొప్ప వైద్యులైనా. ఎందుకు? ఇదిగదా మన ప్రశ్న :) సందేహజీవులం కదా!


మొన్న నిమ్స్ డిరెక్టర్ అపోలో లో చేరితే నిమ్స్ లో వైద్యం బూటకం వగైరా అనేశారు. కాని ఆయన అపోలో లో చేరి మంచిపని చేశారు. నిమ్స్ లోనే కనక చేరితే అక్కడ ఆయన రోగిగా గుర్తించబడి వైద్యం జరగదు. ఆయన డైరెక్టర్ గానే గుర్తిస్తారు, అందరూ. ఇది ఎంత చెప్పినా వైద్యులు మిగతా సిబ్బంది మీద ఉంటుంది. ప్రమాద సమయాల్లో నిర్ణయం తీసుకోడానికి వైద్యులు జంకుతారు. అందుకు స్వంతవైద్యమూ పనికిరాదు, స్వంత ఇంటిలో వైద్యుడే ఉన్నా, ఎంత గొప్పవాడైనా, కావలసినవారికి వైద్యం చేయకూడదు. తెలిసిన వైద్యులెవరూ అలా చేయరు. పెరటిలో మనం చెట్టు వేస్తేనే పెరుగుతుంది, దానికి ఎంతో కొంత దోహదం చేస్తాం, అది సహజవాతావరణం పెరిగినదై ఉండదు,దానిలో కొన్ని సహజ గుణాలు లోపిస్తాయి. అందుకే పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు.


సందేహజీవులం కదా మరో సందేహం ప్రాథమిక చికిత్స చేయవచ్చా? ప్రాథమిక చికిత్స ఎప్పుడు చేస్తారు? ప్రమాదం జరిగినపుడు కదా! ప్రమాదం జరిగితే ప్రథమ చికిత్స అత్యవసరం, అది ఎవరైన, ఎవరికైనా చేయచ్చు, ఆ తరవాత అవసరాన్ని బట్టి వైద్యుల దగ్గరకు తీసుకుపోవాలి. 


పెరటి చెట్టు మందుకు పనికిరాదు


యజమాని ఎద్దును కాడి మెడమీద వేసి బండికి, నాగలికి కడతాడు. ఐతే పని చేసేటపుడు ఎద్దు మెడమీద అధికభారం మోపితే పుండు పడుతుంది. యజమాని పుండు పడినా పనికి మలుపుతూనే ఉంటాడు, ఎద్దు ఎత్తుబడిపోయేదాకా! . ఎద్దు మెడ మీదపడ్డ పుండు మీదనే కాకివాలుతుంది, మాంసం పొడుచుకుతినడానికి. ఎద్దు కాకిని తోలుకో లేదు. తోక మెడదాకా అందదు, చెవులాడించినా, అవీ మెడమీద కాకిని బయటికి తోలలేవు, ఎద్దు మెడ ఆడించినా కాకి ఎగిరి మళ్ళీ అక్కడే వాలుతుంది. పాపం ఎద్దు అసహాయం గా కాకితో హింసింపబడుతూ ఉంటుంది. కాకికి బాధేంటి ఎద్దుకుగాని? 


సమాజంలో కాకిలాటి వారుంటారు, ఎద్దులా అసహాయంగా బాధ అనుభవిస్తున్నవారూ ఉంటారు. తస్మాత్ జాగ్రత!!! 


ఎద్దు పుండు కాకికి నొప్పా?

Monday, 19 September 2022

విపక్షం నుంచి 2024లో ఎవరు ప్రధాని అభ్యర్థి ? -1

విపక్షం నుంచి 2024లో  ఎవరు ప్రధాని అభ్యర్థి ? -1


ఈ ప్రశ్న విపక్షాలని తీవ్రంగా కలవరపెడుతోంది. నితీష్ కాంగ్రెస్ పక్కకి చేరడంతో చర్చ ఊపందుకుంది.చిత్రం ఏమంటే, బి.జె.పి నుంచి,తదుపరి ప్రధాని అభ్యర్ధి  మోడీ యేనని ప్రతిపక్షాలన్నీ ఏకగ్రీవంగా తీర్మానించేశాయి.


కాంగ్రెస్ దేశంలోని ఐదు పెద్ద రాష్ట్రాలలో తుడిచిపెట్టుకుపోయింది. అవి ఆ.ప్ర 25,ఉ.ప్ర80,బెంగాల్ 42,తమిల్నాడు 39,తెలంగాణా 17, మొత్తం సీట్లు 203. కాంగ్రెస్  కి ఇక్కడ పోటీకి మనుషులు కూడా దొరికేసావకాశాలు సన్నగిల్లేయంటారు.


ఇక కొన్ని రాష్ట్రాలలో అధికారంలోఉంది.  అవి రాజస్థాన్,చత్తీశ్ ఘర్, ఇక ఈ మధ్యనే మహారాష్ట్రలో,పంజాబ్ లో అధికారం కోల్పోయి బీహార్ లో అధికారం పంచుకుంటోంది. ఈ రాష్ట్రాలలో కూడా చెప్పుకోతగ్గ జనం పార్టీ వెంట ఉన్నట్టులేదు. 


ఇక మధ్యప్రదేశ్,గుజరాత్,పంజాబ్, కేరళా,గుజరాత్ లలో విపక్షంగా ఉంది. ఈశాన్య రాష్ట్రాలలో ఈ పార్టీ అడుగంటిపోయింది.      


దేశం మొత్తం మీద పార్టీ పలుకుబడి సన్నగిల్లిపోయింది, భారత్ జోడోయాత్ర  తో బలం పుంజుకుంటుందేమో చూడాలి. ”భారత్ జోడోయాత్ర” ”కాంగ్రెస్ ఛోడో” యాత్ర కాకుంటే చాలని అభిమానుల ఆవేదన. ఎలా చూసినా పెద్ద రాష్ట్రాలలో పట్టులేక అధికారం సంపాదించడం తేలిక కాదు.కాంగ్రెస్ కి ఇప్పుడున్నట్టుగానే ఏబై సీట్లు దాకా రావచ్చు,అంతకు మించి పెరిగేసూచనలేం కానరావటం లేదు.ఇక మిత్రులు చూదామంటే ప్రతి రాష్ట్రంలోనూ స్థానిక పార్టీలన్నీ విరోధులే. మిత్రులుగా  ఉన్నది ఒక్క తమిల్నాడులో డి.ఎమ్.కె మాత్రమే. ఈ పార్టీ కూడా కాంగ్రెస్ నుంచే అధికారం గుంజుకుంది.

ఈ పార్టీ నుంచి ముఖ్యనాయకులందరూ వరసకట్టి బయటకుపోతున్నారు. ఇటువంటి వారిలో ముఖ్యమైనవారు గులాం నబీ ఆజాద్,రేపో,నేడో  పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కూడా బి.జె.పి లో చేరుతున్నట్టు వార్త.  ఈ పార్టీ అధ్యక్షుని ఎన్నుకోడానికి తిప్పలుపడుతోంది. రాహుల్ గాంధీ యే మరలా అధ్యక్ష పదవి తీసుకోవాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి తీర్మానించినట్టు వార్త. ఏమైనా రాహుల్ గాంధీ తప్పించి మరొకరు ఈ పార్టీ నుంచి ప్రధాని అభ్యర్థి అయే సావకాశాలే లేవు. ఐతే ఎందరు విపక్షంనుంచి రాహుల్ ని ప్రధాని అభ్యర్థిగా ఒప్పుకుంటారన్నది మిలియన్ డాలర్ ప్రశ్న.


ఒకప్పుడు స్వాతంత్ర్యం సంపాదించడానికి కారణభూతమయ్యామని చెప్పుకునే పార్టీ, నేడు ఎందుకు ఇంత దిగజారిపోయింది?స్వయంకృతాపరాథం అని ఒక్కమాటలో చెప్పెయ్యచ్చు. ఈ పార్టీ నాయకుల ఆస్థులు స్వాతంత్ర్యం ముందు ఎంత? నేడు ఎంత ఉన్నాయి, వారేం చేసి ఇప్పుడున్న ఆస్థులు సంపాదించారన్నది విచారిస్తే నిజం బయటపడుతుంది. అధికార దాహం, కుహనా గాంధీ కుటుంబ పరిపాలనే దీనికి కారణమని వారి పార్టీ నుంచి బయటికొచ్చిన వారు ఎలుగెత్తి చెబుతున్నమాట. కర్ణుని చావుకి కారణాల్లా ఈ పార్టీ అంతరించిపోయే దశలో కారణాలు చాలానే కనపడుతున్నాయి. గొడ్డు గోతిలో పడితే తలో బెడ్డా వేసేరన్న నానుడికి సరిపోతుంది.


ఇతర పార్టీలనుంచి, చాలా మంది నాయకులు ప్రధాని కావాలని ఆశ పడుతున్నారు, ఒక్కొకరిని చూదాం! పార్టీల బలాబలాల నుంచి వారి శక్తి యుక్తుల దాకా!

(సశేషం)   


Sunday, 18 September 2022

తా వలచింది రంభ తా మునిగింది గంగ

తా వలచింది రంభ తా మునిగింది గంగ



1.సొమ్ములున్నవాడికి పార్టీ టిక్కట్టు ఇచ్చి, సొమ్ములకి పార్టీ టిక్కట్లు అమ్ముకుని, గెలిచిన వాడు ఎదుటిపార్టీ వాళ్ళకి అమ్ముడు పోయాడని అనుకోడం

మన బంగారం మంచిదయితే కంసాలిని ఆడిపోసుకోడం ఎందుకూ? 


2.విపక్ష ఎమ్.ఎల్.ఎ లని తన పక్షంలోకి తాము చేర్చుకుంటే అభివృద్ధిని చూసి మా పార్టీలో చేరేరంటాం, అదే పని మరొకరు చేస్తే హోల్ సేల్ గా కోనేసేరంటాం :)

మనం చేస్తే శృంగారం అదే ఎదుటివారు చేస్తే వ్యభిచారం.



3.తల్లీతండ్రీ బూతులు మాటాడుతోంటే కొడుకు కూతురు నీతులు మాటాడతారా?

ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?



4.తనకి నచ్చిన పార్టీ దొంగలగుంపైనా ప్రజస్వామ్యం ఉన్నపార్టీ అదే మరో పార్టీ ఐతే నిక్కచ్చి కుటుంబ పార్టీ అంటాం.

తా వలచింది రంభ తా మునిగింది గంగ


మాటకి మాట తెగులు నీటికి నాచు తెగులు

ఇదే రాజకీయం.


ఒక రాజకీయనాయకుడు తమ పార్టీ గురించి వెలిబుచ్చిన సత్యం.

మా పార్టీలోకి రావడం తేలిక, బయటికి పోవడమూ తేలికే, కాని పార్టీని అంటి పెట్టుకుని ఉండటం కష్టం.

పచ్చి నిజం :)

Friday, 16 September 2022

పిల్లి మెళ్ళో గంట కట్టాలె

  పిల్లి మెళ్ళో గంట కట్టాలె


బహు కుటుంబీకుడైన ఒకరి ఇల్లు. ఆ ఇంట్లో ధాన్యం,బియ్యం దాచుకునే ఒక గది, పశువులకి అవసరమైన చిట్టూ,తవుడూ దాచుకునే మరోగది, చల్లగది,వంటగది, భోజనాలశాల,సరుకులు దాచుకునేగది,అదే కొట్టుగది , ఆహారపదార్ధాలు దాచుకునేగది, పడకగదులు, ఇలా చాలా గదులతో శోభాయమానంగా ఉంటుంది. ఈ ఇంట్లో పందికొక్కులు, ఎలకలున్నాయి. పందికొక్కులు, ఎలకలు అన్నిటిని తిన్నంత తిని, మిగిలినది పాడు చేస్తున్నాయని,కొంప తవ్విపోస్తున్నాయని,  యజమాని సాయంత్రానికి అన్ని గదుల తలుపులు మూయిస్తూ వచ్చాడు, కాని ఎలకలు మాత్రం చూరుల వెంబడి కదులుతూ,తలుపులు చిల్లుపెట్టి, ఒక గదినుంచి మరోగదికి నేలలో పందికొక్కులు  బొరియలుచేసి యధేచ్చగా అన్నిటిని పాడు చేస్తూనే ఉన్నాయి. పడకగదులుల్లో కూడా ఎలకలు బీభత్సం సృష్టిస్తున్నాయి.  యజమాని బాధపడుతూనే ఉన్నాడు.  ఆ ఇంట్లో ఒక పిల్లి కూడా ఉంది. కాని తలుపులు మూసి ఉండటంతో ఎలుకలు చిక్కడం కష్టమయింది,పిల్లికి.  యజమాని, కుటుంబ సభ్యులు విసిగిపోయారు, రాత్రులు తలుపులు మూయడం మానేశారు, దాంతో పిల్లికి వీలు చిక్కి దొరికిన పందికొక్కును, ఎలుకను దొరికినట్టు స్వాహా చేస్తూ వచ్చింది. చూసిన యజమానికి చేసిన పని బాగున్నట్టనిపించింది. ఎలుకలకి కొంత స్వేఛ్ఛ తగ్గింది, దీనితో ఎలుకలన్నీ కటకట పడ్డాయి. ముసలి ఎలుకలు, ముసలి పందికొక్కు అధ్యక్షతన  ఒక సభ చేయాలని, పిల్లి నుంచి ఎలుకలకు కలిగే నష్టాన్ని లేకుండా చేసుకోవాలని  తీర్మానించుకున్నాయి. ఆ సభకు ముసలి పందికొక్కును అధ్యక్షునిగా చేసుకుని సభ తీర్చి ఏమి చేయాలనేది ఆలోచించాలని, అనుకున్నాయి. 

 నేడు,రేపు అంటూనే సభ వాయిదా పడుతూ వచ్చింది. చివరికో రోజు సభ తీరాయి. ముసలిపందికొక్కు అధ్యక్షతన. అధ్యక్షులవారు స్వాగతోపన్యాసం ఇస్తూ జరుగుతున్నది చాలా అన్యాయం, దీన్ని ఎదుర్కోవలసిందే! అని శలవిచ్చి,పందికొక్కులు త్యాగాలు చేసినవని, అన్యాయాలను ఎదుర్కొని పోరాడినవని, మాది త్యాగధనుల వంశమని పొగుడుకుని, మిగతావారికి సావకాశం ఇచ్చారు.  యువ ఎలుకలు,  ఆవేశంగా ఉపన్యాసాలిచ్చాయి. యువ ఎలుకలు పందికొక్కులే త్యాగధనులు కాదు, మా వంశాలలలోనూ త్యాగధనులున్నారు, పోరాడుతూ ప్రాణాలూ పోగొట్టుకున్నవారున్నారు, ఇలా విడతీసి మాట్లాడటం అధ్యక్షులవారికి తగనిపని అన్నాయి. దానికి పందికొక్కులు ఉన్నమాట చెప్పేరు అధ్యక్షులవారు,వారి వంశం త్యాగధనుల వంశం అని వంత పాడేయి. దీనికి ఎలుకలు కినిశాయి. మమ్మల్ని కించపరచడానికే సభ చేసినట్టుందని పందికొక్కులు బయటకి పోతామని బెదిరించాయి. ఇంతలో ఒక ముసలి ఎలుక సమస్య చర్చించాలిగాని ఇలా పక్కదోవ పట్టించకండని సుతి మెత్తగా అందరిని మందలిస్తే ఆవేశాలు చల్లారాయి. 


 పిల్లిని కట్టడి చేయాలి, మన వంశాలు నాశనం కాకుండా చూడాలని ఏకగ్రీవ తీర్మానం చేశాయి. ఈ లోగా పిల్లి సడి పసికట్టిందో ఎలక, పక్కదానిని హెచ్చరించింది, అది మరోదాన్ని హెచ్చరించడంతో ఎలకలన్నీ సభ వదలి పారిపోయాయి. మళ్ళీ సభ చేయాలని అనుకున్నాయి. ఆవేశంగా ఉపన్యాసాలివ్వడం కాదు ఏమి చేయాలన్నిది సూచనలు చేయాలని అనుకున్నాయి. వాయిదా పడుతూ పడుతూ సభ జరిగింది మరోరోజు. ముసలి పందికొక్కును అధ్యక్షత వహించమన్నాయి, ఎలుకలు, దానికి ము.ప నాకా వయసు చెల్లింది, నా స్థానంలో నా వంశం వారిని అధ్యక్షులుగా చేసుకుని సభ చేయమని సలహా చెప్పింది. దానికి కొన్ని ఎలుకలు వ్యతిరేకించాయి, మరికొన్ని మద్దతు పలికాయి. ఇంతలో ఒక ముసలి ఎలుక ఇదంతా వ్యర్థం, అది పిల్లి, దొరికితే నోట కరుచుకుపోతుంది, సభ చాలించి ప్రాణ రక్షణ చూసుకోండని, సలహా ఇచ్చింది. దానికో పందికొక్కు,ఇది పిల్లి పక్షం మాటాడుతోంది, పిల్లి దీనికేమైనా ఎర చూపిందేమో అన్నాయి పందికొక్కులు. దానికి ఎలకలు ఉన్నమాట చెప్పినదానికి అంత ఉలుకెందుకని నిలదీశాయి. ముసలి ఎలక మాటాడుతూ అది పిల్లి, ఎవరినైనా నోట కరుచుకుపోతుంది, ఉన్నమాట చెప్పి చెడ్డయ్యాను,   నాకెందుకొచ్చిన గోలంటూ, సభ వదలిపోయింది.   ఒక యువ ఎలుక పిల్లి చప్పుడు చేయక వచ్చి మనమీద దాడి చేస్తోంది కనక, పిల్లి వస్తున్నట్టు తెలియాలంటే మెడలో గంట కడితే సరికదా అని సలహా ఇచ్చింది. దీనికి సభలో వారంతా భేష్! భేషని చంకలు గుద్దుకున్నారు. ఇంతలో పిల్లి వస్తున్న సడి వినపడింది, ఎలకలు,పందికొక్కులు పరిగెట్టేయి. 

( సశేషం )


Thursday, 15 September 2022

గాడిద మాలక్ష్మికీ జై

గాడిద మాలక్ష్మికీ జై   

వ్యాధి నిరోధక శక్తి అనేది బజారులో కొనుక్కుంటే దొరికేది కాదు. దీనికోసం మనవారు చాలా ప్రయత్నాలే చేశారు, అందులో కొన్ని, దొండాకుపసరు తాగించడం, వసపోయడం, తిప్పతీగనుంచి తిప్పసత్తు తయారు చేసుకువాడటం, గాడిదపాలు తాగటం, ఒంటెపాలు తాగటం ఇలా చాలా ఉన్నాయి. ఈ సందర్భంగా ఒక టపారాస్తూ గాడిద పాల వ్యాపారం లాభసాటి అన్నాను.అది నిజమని నిరూపించబడింది. చూడండి. 

https://kastephale.wordpress.com/2016/02/27/


శర్మ కాలక్షేపంకబుర్లు-చిన్నప్పుడు తాగిన దొండాకు పసరుతో…..

”చిన్నప్పుడు తాగిన దొండాకు పసరుతో….

ఏంటీ! తెగనీలుగుతున్నావ్!! చిన్నప్పుడు తాగిన దొండాకు పసరుతో సహా కక్కిస్తానేంటనుకుంటున్నావో!!!” ఇలా తిట్టడం  తెనుగునాట బాగా అలవాటు.

చిన్నప్పుడు దొండాకు పసరు ఎందుకు తాగిస్తారు?. దొండ రెండు రకాలు. తియ్యదొండ,చేదుదొండ లేదా కాకిదొండ, లేదా పిచ్చిదొండ అంటారు. ఈ పిచ్చి దొండపాదులు పల్లెలలో బాగా పెరుగుతాయి, ఎక్కడపడితే అక్కడ. చిన్నపిల్లలికి మూడు నెలలుదాటి సంవత్సరం లోపులో వస పోస్తారు, మాటలుబాగా వస్తాయట, ఎక్కువగా మాటాడేవాళ్ళని వసపిట్టలని అంటారు, వసెక్కువ పోసినట్టున్నారంటారు. అలాగే ఈ పిచ్చిదొండ ఆకులు తెచ్చి మెత్తగా నలగకొట్టి రసం తీసి, రోజుకి రెండు పూటలా మూడు రోజులు పట్టిస్తారు. ఇలా చేయడం వలన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందట. ఇప్పటివారికి పోయటం లేదుగాని, మా చిన్నప్పుడు అందరూ దొండాకు పసరు తాగినవాళ్ళే. మరోమాట ఈ పిచ్చి దొండపాదుల్ని కాయలు బాగా కాస్తాయి, తెలివైనవాళ్ళు వాటిని తెచ్చుకుని చక్రాల్లా తరుక్కుని ఎండబెట్టి వరుగులు చేసుకుంటారు. వీటిని ఆ తరవాత వేయించుకుని తింటారు, కొంచం చేదుగా ఉన్నా ఆరోగ్యానికి మంచిదిట. మరో సంగతి పిచ్చి దొండాకుల్ని మెత్తగా నలిపి రక్తపుగడ్డ మీద వేస్తే మూడో రోజుకి ఫట్, ఆ తరవాత అదే ఆకులముద్ద వేస్తే పుండు మానుతుంది, ఇది ఆంటీ బయోటిక్ ట.

మరచాను మరోమాటా! తెనుగు నాట దొండాకు పసరే కాకుండా గాడిదపాలు పోయడమూ, దేశంలో కొన్ని చోట్ల ఒంటె పాలు పోయడమూ అలవాటే. ఇలా గాడిద పాలు మూడు రోజులు తాగిస్తే కూడా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందటా! ఇప్పుడు తెనుగునాట గాడిదపాల వ్యాపారం మూడు గాడిదలూ రోజుకి ఆరువేల రూపాయల సంపాదనా లా నడిచిపోతోందట. ఇంటికి గాడిదనుతోలుకొచ్చి వంద ఎమ్.ఎల్ పాలు పితికి రెండువందల ఏభై రూపాయలు పట్టుకుపోతున్నారట. గాడిద మహాలక్ష్మి రాకకై ఎదురు చూస్తున్నారట. దానికీ సమయం కేటాయించేస్తున్నారట (కాల్ షీట్ బుక్ చేసుకొంటున్నారట) గాడిదలు కాసేవారు. పిల్లలకే కాదు పెద్దవారూ గాడిద పాలు తాగుతున్నారట.

చిన్నప్పుడు మా మాస్టారు చదువుకోక గాడిదల్ని కాస్తావా అనేవారు. నిజంగా గాడిదల్ని కాస్తేనే బాగున్నట్టుంది, రోజుకి ఆరువేలు నెలకి రెండు లక్షలు, ఆపైన లెక్కొద్దుబాబూ! టాక్స్ లేని ఆదాయం!

కోటీశ్వరులు కావాలనుకుంటున్నారా? గాడిదలు కాయండి!

ఒక కేజి గాడిద వెన్న తయారు చెయ్యడానికి డెభ్భై లీటర్ల గాడిద పాలు కావాలిట. ఒక కేజి గాడిద వెన్న ఖరీదు అక్షరాలా రెండు లక్షలు, గాడిద వెన్న చాలా సున్నితంగా మెత్తగా ఉంటుందిటా! సౌందర్య సాధనాల్లో,  మొహానికి రాసుకునేవాటిలో వాడతారటా!

ఆడగాడిదలని పెంచండి, కోటీశ్వరులు కండి.

గాడిద మహాలక్ష్మికీ జై!!!


Monday, 12 September 2022

రాజెవరు?(దుర్యోధన ఉవాచ)

రాజెవరు?(దుర్యోధన ఉవాచ)


కుమారాస్త్ర విద్యా ప్రదర్శనలో,కృపాచార్యునితో, దుర్యోధనుడు, కర్ణుని గురించి మాటాడుతూ చెప్పిన మాట. 


కులము గలవాడు శౌర్యము గలవాడును నధికసేన గలవాడును భూ

తలమున రాజనునామము విలసిల్లగదాల్చు మూడు విధముల పేర్మిన్

ఆంధ్ర మహాభారతం,ఆది పర్వం షష్ఠాశ్వాసం, 46


కులములో పుట్టినవాడు, శౌర్యం ఉన్నవాడు, అధికమైన సేన కలవాడు, ప్రపంచంలో రాజని పిలవబడతాడు.


 మారాజా! మా మంచిమాట సెలవిచ్చావయ్యా!! నాటి కాలం మాట దేవుడెరుగుగాని, నేటి కాలానికి తమరు చెప్పిన మాట అచ్చరాలా నిజం బాబయ్యా! 


కులంలో పుట్టినవాణ్ణి ఎలాగా రాజనే పిలుస్తారు, కాని రాజకుమారుడే రాజవుతాడు. శౌర్యముకలవాడు అంటే, రక్షకుడు, ధైర్యవంతుడు,వీరుడు అని అర్ధాలు చెప్పటం లేదు దొరా! నాటికాలానికి పెక్కుమందిని రక్షించగలవాడినే వీరుడు,శౌర్యవంతుడనేవారు. నేటి కాలానికి ఎంత ఎక్కువ మందిని భయపెట్ట గలవాడినే రాజు కాదుగాని నాయకుడని అనేస్తున్నారు. తమరు చెప్పినట్టు ఇక్కడ కులంతో పనిలేదు దొరా! భయపెట్టడం అంటే మామూలుగా కాదు దొరా! చంపడం దగ్గర నుంచి, చంపుతానని, నీ కూతుర్ని ఎత్తుకుపోతానని, లేదా నీ పెళ్ళాన్నే ఎత్తుకుపోతానని, లేదూ నీ ఎదురుగానే నీ కూతురునీ,పెళ్ళాన్నీ మానభంగం చేస్తానని, మాదక ద్రవ్యాల వ్యాపారం చేస్తున్నావని పట్టిస్తానని, ఇలా రకరకాలుగా భయపెట్టి, చేయగలవాడినే మేము నాయకుడని పిలుస్తున్నాం దొరా!! వాడు ఎవరికి చెబితే వాడికే ఓటు వేస్తున్నాం, ఇదేగా మరి జరుగుతున్నది దొరా!!!


అధిక సేనగలవాడు రాజంటారన్నారు తమరు. దేవరా!! సేన ఊరికే వస్తుందా? సొమ్ము లేనిది సేనెక్కడినుంచి వస్తుంది దేవరా!! నిజం దొరా! నేడు ప్రపంచంలో ఎక్కువ సేన, గొప్పగొప్ప, కొత్తకొత్త,మారణాయుధాలు ఎక్కువ ఉన్నదేశనాయుకుడే నేడు ప్రపంచ పోలీసు దొరా!!! ఆ దేశం పేరు చెప్పి  నాయకుడు ఏదైనా చేస్తాడు దేవరా!! 

 మాది ప్రజాస్వామ్యం, మాకు రాజులుండరు అన్న దేశాలవారి నాయకులు, ఇతరదేశాలవారిని అనేకరకాలుగా అణచేస్తున్నారు దొరా! 

ఇక ప్రజాస్వామ్యం కాదు, మాది సోషలిజం అంటున్న దేశాలూ అదే పని చేస్తున్నాయి దొరా! 

మరికొన్ని ప్రజాస్వామ్యం ముసుగులో రాచరికం వెళ్ళబోస్తున్నాయి. ప్రపంచంలో మంచి,మంచివన్నీ ఎత్తుకొచ్చి, తెచ్చినవన్నీ బహిరంగంగా సిగ్గులేక ప్రదర్శిస్తూనూ ఉన్నాయి. ఈ పెద్ద దేశాలని చెప్పుకుంటున్నవారొక సంస్థను ఏర్పాటు చేసి, వారు చెప్పినదే వేదమని, నిరంకుశత్వం చేస్తూ దాన్ని ప్రజాస్వామ్యం అని నమ్మమంటున్నాయి దొరా! ఇటువంటి దేశాల వారే రాజులుగా చెలామణీ అవుతున్నారు దేవరా!! తమమాట నిలబెట్టేరు దొరా!!!


ఇంతకీ సొమ్మున్నవాడే రాజంటారు, అంతేగా దేవరా!!!


Saturday, 10 September 2022

తమ మిత్రులె శత్రులగుట తథ్యము సుమతీ!!!

  తమ మిత్రులె శత్రులగుట తథ్యము సుమతీ!!!



పార్టీ అధికారంలో ఉన్నపుడు-నాయకులు


ఎప్పుడు సంపద గల్గిన

యప్పుడు బందుగులు వత్తురది ఎట్లన్నన్

దెప్పలుగ చెరువు నిండిన

గప్పలు పది వేలు చేరు గదరా సుమతీ!

సంపదలు కలిగినప్పుడు అందరూ బంధువులే, ఎక్కడెక్కడినించీ పుట్టుకొచ్చేస్తారు, ఎలా? చెఱువు నిండితే,నీటితో, కప్పలు పదివేలు చేరాతాయన్నట్టు.


పార్టీ వదిలేసిన నాయకులు 


కమలములు నీటబాసిన

కమలాక్షుని రశ్మిసోకి కమలిన భంగిన్

 మతమ నెలవులు దప్పిన

తమమిత్రులె శత్రులగుట  తథ్యము  సుమతీ

కమలం నీటిలో ఉన్నంతకాలం నవనవలాడుతూ ఉంటుంది. అదే కమలాన్ని నీటిలోంచి తీసేసి బయట పడేస్తే వాడిపోతుంది, ఎందుకు? కమలాక్షుని రస్మిసోకి, అంటే సూర్యుని కాంతికి వాడిపోతుంది. అలాగే ఎవరి స్థానాలలో వారున్నంత కాలం సవ్యంగానే ఉంటుందంతా, కాని తమతమ నెలవులు దప్పిన మిత్రులే శత్రువులైపోతారోయ్! 


అధిష్టానం-పార్టీ వదిలేసిన నాయకులు


కూరిమిగలదినములలో

నేరములెన్నడుడును గలుగ నేరవు మరి యా

 కూరిమి విరసంబైనను

నేరములే దోచుచుండు నిక్కము సుమతీ!

స్నేహం కలిగినన్నాళ్ళు తప్పులేం కనపడవు,కాని ఈ స్నేహం కనక చెడితే అన్నీ తప్పులే కనపడుతూ ఉంటాయ్! జాగర్తా!!! 


గొడ్డు గోతిలో తలో బెడ్డా వేసేరని.


గొడ్డు చాలా బలమైనది, అవసరం లేకపోయినా ఒక నమస్కారం పెట్టి తప్పుకున్నారు, అది బయట ఉన్నకాలంలో తప్పుకు తిరిగేరు. కాని అది కాలవశాన గోతిలో పడింది, ఇక అందరూ వీరులే,అందరూ తలో బెడ్డా విసిరేవారే!!! 


లోకంబాబూ!!! లోకం!!!


Wednesday, 7 September 2022

ఉదయ ప్రార్ధన శ్లోకాలు-అర్ధాలు/పరమార్ధాలు.





ఉదయ ప్రార్ధన శ్లోకాలు-అర్ధాలు/పరమార్ధాలు.


 బాల భాస్కరుడు




ఉదయమే నిద్ర లేచి మంచం దిగే ముందు పడకమీదనుంచే సెల్ ఫోన్ మొహం చూసిగాని మంచందిగటం లేదెవరూ! నేటి కాలంలో, కాని, కొంతమంది ఇంకా ఈ శ్లోకాలు పఠించి చివరి శ్లోకంతో మంచం దిగుతూ భూమికి నమస్కరించే వారున్నారు, అరుదుగా! 
అసలీ శ్లోకాలేంటి? వాటి అర్ధ పరమార్ధాలేంటీ?


గురు బ్రహ్మ గురు విష్ణుః
గురుదేవో మహేశ్వరః
గురు సాక్షాత్పర బ్రహ్మ
తస్మై శ్రీ గురవేనమః

గురువు బ్రహ్మ,విష్ణు, మహేశ్వరుడు, సాక్షాత్తు దేవుడు, అటువంటి గురువుకు నమస్కారం.

ఆపదామపహర్తారం
దాతరం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం
భూయో భూయో నమామ్యహం

ఆపదలనుంచి కాచేవాడు, సంపదలిచ్చేవాడు,ఎల్లరచే కొనియాడబడేవాడైన రామునకు మరల, మరల నమస్కారం.

కరాగ్రే వసతే లక్ష్మీ
కరమధ్యే సరస్వతీ
కరమూలే స్థితా గౌరీ
ప్రభాతే కరదర్శనం

చేతి చివర లక్ష్మి,మధ్య సరస్వతి, చెయి మొదట గోవిందుడు ఆవాసం చేస్తున్న చేతిని చూస్తున్నానని,అంటూ కనులు తెరచి,అరచేతుల్ని చూచి కనులకద్దుకుంటాం.

సముద్రే వసనే దేవీ
పర్వతే స్తనమండలే
విష్ణుపత్నీనమస్తుభ్యం
పాదస్పర్శం క్షమస్వ మే

సముద్రంలో తేలియాడుతున్న దేవత, పర్వతాలే స్తనమండలాలుగా ఉన్న విష్ణుపత్నియైన భూదేవికి నమస్కారం, కాలితో తొక్కుతున్నాను క్షమించు.
అంటూ కాలు భూమి మీద పెడతాం. 


జన్మనిచ్చిన తల్లి మొదటి గురువు బ్రహ్మ స్వరూపం, చిటికినవేలు పట్టి నడిస్తే లోకాన్ని చూపించిన గురువు తండ్రి విష్ణు స్వరూపం, అజ్ఞానాంధకారాన్ని జ్ఞానమనే వెలుతురుతో పాలద్రోలిన గురువు మహేశ్వర స్వరూపం. ఆ తదుపరి గురువే దైవ స్వరూపం అని నొక్కి వక్కాణించారు,అనగా తల్లి,తండ్రి, గురువులే దైవ స్వరూపాలని చెప్పేరు, గురు సాక్షత్ పరబ్రహ్మ అంటూ.అటువంటి గురువులైన తల్లి,తండ్రులకు, గురువుకు దైవానికి నమస్కారం. 
ఆతదుపరి

రామో విగ్రహవాన్ ధర్మః ఇది మారీచునిమాట, రాముడు మూర్తీభవించిన ధర్మం. ధర్మో రక్షతిః రక్షితః, ధర్మాన్ని ఆచరిస్తే ధర్మం రక్షిస్తుంది. అటువంటి ధర్మానికి మరల,మరల నమస్కారం,అంటే ధర్మాన్ని ఆచరిస్తానని ప్రతిన, ధర్మం రక్షిస్తుందని నమ్మకం. ధర్మానికి నమస్కారం.



చేతిలో లక్ష్మి, సరస్వతి, పార్వతి నివసిస్తారు. గోవిందా అంటే నారాయణి,  నారాయణి,నారాయణులకు అభేధం, అక్కడ గోవిందా అంటే పార్వతి, లలితాదేవి స్వరూపం. లలితా దేవికి మరో పేరు ఇఛ్ఛాశక్తి,జ్ఞానశక్తి,క్రియాశక్తి స్వరూపిణీ అంటారు. ఈ మూడు రూపాలూ బ్రహ్మ,విష్ణు, మహేశ్వరుల శక్తి రూపాలు. సర్వమూ నా చేతిలో ఉంది, నా ప్రయత్నంతో సర్వమూ సమకూడుతుందనే నమ్మిక,ప్రతిన. నా ప్రయత్నానికి దైవ శక్తి తోడవాలి,తోడవుతుందని కనులు తెరచి అరచేతులను చూచి కళ్ళకద్దుకుంటాం, ఇది స్వశక్తి మీద నమ్మకం కలగజేసుకోవడం.

సముద్రంలో నివసించే దేవీ, పర్వతాలే స్తనాలుగా కలిగిన, విష్ణుశక్తి స్వరూపిణి భూదేవికి నమస్కారం, కాలితో తొక్కుతున్నాను,క్షమించమని వేడటం. 

సముద్రంలో భూమి ఉందా,భూమి మీద సముద్రం ఉందా? వికట ప్రశ్న. పంచభూతాల సృష్టి క్రమం చూస్తే ముందు పుట్టినది, ఆకాశం, దానినుంచి పుట్టినది వాయువు, వాయువునుంచి అగ్ని పుట్టింది, అగ్ని నుంచి నీరు పుట్టింది,నీటి నుంచి భూమి పుట్టింది. ఇప్పుడు చెప్పండి నీటిలో భూమి ఉందా? భూమి మీద నీరు ఉందా? అదే సముద్రే వసనే దేవీ, పర్వతే స్తన మండలే, భూమిపైనున్న పర్వతాలని స్తనాలతో పోల్చారు. ఎందుకు? బిడ్డ పుట్టినప్పటినుంచి తల్లి ఆహారం పాల ద్వారా స్తనాలనుంచే ఇస్తుంది. అలాగే భూమి పైనున్న పర్వతాలు స్తనాలలా నీటిని నదులద్వారా ప్రజలకందజేసి, ఆకలి తీరుస్తూ ఉంది.విష్ణుపత్ని, విశ్వం విష్ణు సహస్రనామాలలో మొదటి రెండు నామాలు. సృష్టి సమస్తం విష్ణుమయం, "సర్వం విష్ణుమయం జగత్", విష్ణువు శక్తి స్వరూపమే సృష్టి. మనకు కావలసిన ఆహారం నుంచి సర్వమూ భూమి నుంచి వచ్చేవే. భూమినుంచి పుట్టి భూమిలో కలసిపోతాం. అటువంటి భూమికి కృతజ్ఞతతో కూడిన నమస్కారం.  



Thursday, 1 September 2022

ధృతరాష్ట్రుడు, ద్రౌపదికి వరాలెందుకిచ్చాడు?(జవాబు)

ధృతరాష్ట్రుడు, ద్రౌపదికి వరాలెందుకిచ్చాడు?(జవాబు)


భయపడి వరాలిచ్చాడు.

ఎవరికి భయపడ్డాడు?

ముగ్గురు, ఆ ఇంటికోడళ్ళకి.

ఎవరువారు?

1.గాంధారి.2.ద్రౌపది.3.కుంతి.

ఎందుకుభయపడ్డాడు

గాంధారి:- ఈమె ఒక ఉడుకుతున్న అగ్నిపర్వతం. తన ఎదురుగా, కొడుకు వదినగారిని కొప్పు పట్టి లాక్కుపోతుంటే మాటాడలేక అసహాయంగా ఉండిపోయినది.ఆమె మనసు కుతకుతలాడింది, జరుగుతున్న అన్యాయానికి.జూదం మాటెలావున్నా ఇంటికోడలికి జరుగుతున్న అన్యాయాన్ని సహించలేకపోయింది. అందుకే తనకొడుకులు నీచప్రవర్తన మరెంతకు దిగజారిపోతుందో, కర్ణుని సావాసంలోనని, బయలుదేరి విదురునితో కలిసి ధృతరాష్ట్రునికి సభలో జరుగుతున్నది చెప్పింది. ఆమెకు పుత్ర ప్రేమలేకపోలేదు కాని ధర్మం మీద కూడా ప్రేమ ఉంది. 

తార్కాణం:- యుద్ధానికి వెళుతూ తల్లిదగ్గరకొచ్చి నమస్కారం చేశాడు దుర్యోధనుడు, అపుడామె ’జయోస్తు’ ని దీవించలేదు, ’యతో ధర్మస్తతో జయః’ ఎటు ధర్మం ఉంటే అటు జయం కలుగుతుందని దీవించింది. అంటే దుర్యోధనుని పక్క ధర్మం లేదనేగా! తన కొడుకు పక్క ధర్మం ఉండి ఉంటే జయోస్తు అనే దీవించేది. మరో మాట కూడా. యుద్ధం అయిపోయింది యుద్ధరంగంలో చనిపోయిన వారిని చూస్తూ, దుర్యోధనుని శవాన్ని చూసి మళ్ళీ తన దీవెన గుర్తుచేసుకుని, నాడు సభలో చేసిన అకృత్యానికి ఫలితం అనుభవిచావా కొడకా అని ఏడ్చింది. 

ఈ అగ్నిపర్వతాన్ని చలార్చకపోతే మొదలుకే మోసం రావచ్చని భయపడ్డాడు. 


గాంధారి సభలో జరిగినది చెప్పిన తరవాత ప్రమాదాన్ని పసికట్టిన ధృతరాష్ట్రుడు కి జ్ఞాననాడి కదిలి నష్ట నివారణ చర్యలు మొదలెట్టేడు.   


ద్రౌపది:- ఈమె ప్రత్యక్షంగా అవమానానికి గురైనది, బద్దలైన అగ్నిపర్వతం, ఏ క్షణాన ఐనా లావా వెదజల్లచ్చు, అప్పుడు బాధపడి లాభం లేదు. ఆమె పట్ల కొడుకులు తప్పుజేసేరు. సభలో నేను దాసినా? అని అరిచింది తప్ప మరోమాట మాటాడలేదు.భార్య మానాన్ని కాపాడలేని నువ్వు మగాడివా? అని ఒక్క ప్రశ్న భీముని కనక వేసి ఉంటే!.... ఆమెగనక భీముని రెచ్చగొట్టి ఉంటే, ఆనాడు ఆ సభలో పీనుగులే ఉండేవి. ఈ అగ్ని పర్వతాన్ని ముందుగా చల్లబరచాలి, అనుకున్నాడు, భయపడ్డాడు

కుంతి:- ఈమె నివురుగప్పిన నిప్పు. గాలి ఊదితే చాలు మండిపోతుంది. ఈమె ఒక్క మాట కనక అంటే, ధర్మరాజుకు కబురంపితే, కోడలికి అన్యాయం జరుగుతుంటే చోద్యం చూస్తున్నారా? అని ఒక్క మాటంటే, అక్కడే కురుక్షేత్రం జరిగిపోయేది, అందుకు భయపడ్డాడు.


ఇంతేగాక ఆ రోజు సభలో కూడా ఎక్కువమంది జూదంలో జరిగినదానికంటే ద్రౌపది పరాభవానికే మండిపోయారు, అందుకు వెనక్కి జంకి నష్టనివారణ చర్యగా ద్రౌపదిని పిలిచి నువ్వు నాకోడళ్ళందరిలో ఎన్నదగినదానివని పొగిడేడు. ఆ తరవాత వరం కోరమన్నాడు, ఆమె ధర్మరాజు దాస్య విముక్తి అడిగింది, మరోవరమిస్తానన్నాడు, అప్పుడు మిగిలిన భర్తల దాస్య విముక్తి అడిగింది. ధృతరాష్ట్రుడు నిరాశపొందాడు, ఆమె రాజ్యం అడుగుతుందనుకున్నాడు,ఆమె అడగలేదు, అందుకు పాండవులందరిని పిలిచి రాజ్యం ఇచ్చి,అప్పటికి ఆ ఆపద నుంచి గట్టెక్కేడు. ఆ తరవాత జరిగిన అనుద్యూతానికి ఒప్పుకున్నాడు, కొడుకు చెప్పిన కారణాలకి.అసలు పాండవులను అడవులపాలుజేసి రాజ్యం కొడుక్కి కట్టబెట్టాలన్న ఆలోచన ధృతరాష్ట్రునిదే, దానికి తోడు దుర్యోధనుని అత్యాశ తోడయిందంతే! 

 స్వస్తి.