Monday, 12 September 2022

రాజెవరు?(దుర్యోధన ఉవాచ)

రాజెవరు?(దుర్యోధన ఉవాచ)


కుమారాస్త్ర విద్యా ప్రదర్శనలో,కృపాచార్యునితో, దుర్యోధనుడు, కర్ణుని గురించి మాటాడుతూ చెప్పిన మాట. 


కులము గలవాడు శౌర్యము గలవాడును నధికసేన గలవాడును భూ

తలమున రాజనునామము విలసిల్లగదాల్చు మూడు విధముల పేర్మిన్

ఆంధ్ర మహాభారతం,ఆది పర్వం షష్ఠాశ్వాసం, 46


కులములో పుట్టినవాడు, శౌర్యం ఉన్నవాడు, అధికమైన సేన కలవాడు, ప్రపంచంలో రాజని పిలవబడతాడు.


 మారాజా! మా మంచిమాట సెలవిచ్చావయ్యా!! నాటి కాలం మాట దేవుడెరుగుగాని, నేటి కాలానికి తమరు చెప్పిన మాట అచ్చరాలా నిజం బాబయ్యా! 


కులంలో పుట్టినవాణ్ణి ఎలాగా రాజనే పిలుస్తారు, కాని రాజకుమారుడే రాజవుతాడు. శౌర్యముకలవాడు అంటే, రక్షకుడు, ధైర్యవంతుడు,వీరుడు అని అర్ధాలు చెప్పటం లేదు దొరా! నాటికాలానికి పెక్కుమందిని రక్షించగలవాడినే వీరుడు,శౌర్యవంతుడనేవారు. నేటి కాలానికి ఎంత ఎక్కువ మందిని భయపెట్ట గలవాడినే రాజు కాదుగాని నాయకుడని అనేస్తున్నారు. తమరు చెప్పినట్టు ఇక్కడ కులంతో పనిలేదు దొరా! భయపెట్టడం అంటే మామూలుగా కాదు దొరా! చంపడం దగ్గర నుంచి, చంపుతానని, నీ కూతుర్ని ఎత్తుకుపోతానని, లేదా నీ పెళ్ళాన్నే ఎత్తుకుపోతానని, లేదూ నీ ఎదురుగానే నీ కూతురునీ,పెళ్ళాన్నీ మానభంగం చేస్తానని, మాదక ద్రవ్యాల వ్యాపారం చేస్తున్నావని పట్టిస్తానని, ఇలా రకరకాలుగా భయపెట్టి, చేయగలవాడినే మేము నాయకుడని పిలుస్తున్నాం దొరా!! వాడు ఎవరికి చెబితే వాడికే ఓటు వేస్తున్నాం, ఇదేగా మరి జరుగుతున్నది దొరా!!!


అధిక సేనగలవాడు రాజంటారన్నారు తమరు. దేవరా!! సేన ఊరికే వస్తుందా? సొమ్ము లేనిది సేనెక్కడినుంచి వస్తుంది దేవరా!! నిజం దొరా! నేడు ప్రపంచంలో ఎక్కువ సేన, గొప్పగొప్ప, కొత్తకొత్త,మారణాయుధాలు ఎక్కువ ఉన్నదేశనాయుకుడే నేడు ప్రపంచ పోలీసు దొరా!!! ఆ దేశం పేరు చెప్పి  నాయకుడు ఏదైనా చేస్తాడు దేవరా!! 

 మాది ప్రజాస్వామ్యం, మాకు రాజులుండరు అన్న దేశాలవారి నాయకులు, ఇతరదేశాలవారిని అనేకరకాలుగా అణచేస్తున్నారు దొరా! 

ఇక ప్రజాస్వామ్యం కాదు, మాది సోషలిజం అంటున్న దేశాలూ అదే పని చేస్తున్నాయి దొరా! 

మరికొన్ని ప్రజాస్వామ్యం ముసుగులో రాచరికం వెళ్ళబోస్తున్నాయి. ప్రపంచంలో మంచి,మంచివన్నీ ఎత్తుకొచ్చి, తెచ్చినవన్నీ బహిరంగంగా సిగ్గులేక ప్రదర్శిస్తూనూ ఉన్నాయి. ఈ పెద్ద దేశాలని చెప్పుకుంటున్నవారొక సంస్థను ఏర్పాటు చేసి, వారు చెప్పినదే వేదమని, నిరంకుశత్వం చేస్తూ దాన్ని ప్రజాస్వామ్యం అని నమ్మమంటున్నాయి దొరా! ఇటువంటి దేశాల వారే రాజులుగా చెలామణీ అవుతున్నారు దేవరా!! తమమాట నిలబెట్టేరు దొరా!!!


ఇంతకీ సొమ్మున్నవాడే రాజంటారు, అంతేగా దేవరా!!!


2 comments:

  1. // “ ఇంతకీ సొమ్మున్నవాడే రాజంటారు“ //

    ఎనీ డౌట్?
    ఆధునిక కార్పొరెట్టలు అంతేగా?

    దుర్యోధనుడు చాలా గుణాలు చెప్పాడు గానీ దొడ్డబుద్ధిని చేర్చలేదు, చూశారా?

    ReplyDelete
  2. విన్నకోటవారు,
    //ఎనీ డౌట్?//
    అంతే కదండీ :)
    //దుర్యోధనుడు చాలా గుణాలు చెప్పాడు గానీ దొడ్డబుద్ధిని చేర్చలేదు, //
    ఆయన దుర్యోధనుడు కదండీ :)

    ReplyDelete