21, ఆగస్టు 2022, ఆదివారం

వాక్స్వాతంత్ర్యం

 వాక్స్వాతంత్ర్యం


ఏంటో! 

వాక్స్వాతంత్ర్యం,ఈ మాట రాయడమే ఇంత కష్టంగా ఉందే!ఈ హక్కును నిలుపుకోడం ఎంత కష్టమో కదా! 


ఈ హక్కు గురించి మాటాడేవారంతా, వారేమైనా అనచ్చు, కాని ఎదుటివారు ఏమీ అనకూడదు, ఇదీ వారి వాక్స్వాతంత్ర్యం. సుప్రీం కోర్టువారేమో, ప్రతి స్వాతంత్ర్యానికి హద్దుంటుంది, అదేముద్దు అంటారు.సుప్రీం కోర్టు లెక్కా :) సుప్రీం కోర్టు నే ఏమైనా అంటాం అంటున్నారు.   


ముఫై ఎకరాల మా కాలేజి కాంపౌండ్ రోజంతా పెళ్ళివారిల్లులాగే ఉంటుంది. ఉదయం నాలుక్కి నడిచేందుకొచ్చేవాళ్ళతో ప్రారంభం, నడిచేవాళ్ళు,యోగా చేసేవాళ్ళు, ఇండోర్ లో టెన్నిస్ అడేవాళ్ళు, ఇలా రకరకాలుగా మొత్తం దగ్గరగా రెండొందలమంది ఉంటారు,ఉదయం. 

పున్నమినాడు అస్తమిస్తున్న చంద్రుడు  


 ఇలా నడుస్తుంటారు, జట్లు,జట్లుగా  


ఉదయం నా కార్య స్థానం, అప్పటికే యోగా చేస్తున్న మిత్రుడు.  



యోగా క్లాస్  


 నాది తక్కువ అంచనా!! మాకో కల్బ్ ఉంది దానిపేరు జి.బి.ఆర్ వాకర్స్ క్లబ్, దీనికి అనుబంధంగానే మిగిలిన సబ్ క్లబ్బులన్నీ, అవే యోగా క్లబ్,టెన్నిస్ క్లబ్. ఎనిమిది దాటితే వీళ్ళెవరూ ఉండరు. పిల్లలొచ్చేస్తారు. సాయంతరం నాలుగు దాటిన తరవాత పిల్లలంతా వెళ్ళిపోతారు. ప్పుడు స్త్రీలు ఎక్కువా, పురుషులు తక్కువా, ముసలాళ్ళు ఉదయం సాయంత్రం సమానంగా ఉంటూంటారు,నడకకి.   


వీళ్ళూ మరో మూడువందల మందిదాకా ఉంటారు,అదిన్నూ రాత్రి ఎనిమిది దాకా. కేంపస్ అంతకీ లైటింగ్ ఉంటుంది,ఉదయం నాలుగునుంచి ఆరు, సాయంత్రం ఆరునుంచి ఎనిమిది.మా ఊళ్ళో మూడు వాకింగ్ ట్రేక్ లు ఉన్నాయి. మాదే మొదటిదిన్నూ! రెండోది పక్క హైస్కూల్ గ్రవుండ్లో, మూడోది రైల్ ఫైఓవర్ కి అప్రోచ్ రోడ్ కింద, ట్రేక్ అవతల. నాలుగోది రైల్వే ప్లాట్ఫారం.ఇన్ని చోట్ల చాలమంది నడుస్తూనే ఉంటారు,రోజూ, ఉదయం,సాయంత్రం.   


నేను వేసవి,వర్షకాలాలలో ఉదయమూ, శీతకాలంలో సాయంత్రమూ నడవడానికి వెళతాను. చాలామందికి నా పేరు తెలియకపోయినా నన్ను ఎరుగుదురు,పాతికేళ్ళ దగ్గర సమయంలో ఆ వాకర్స్ క్లబ్ స్థాపకుల్లో నేనూ ఒకడిని.  కవిని కూడా కదా! :) కర్ర పుచ్చుకు తిరుగుతుంటాను, అందుకు అందరికి ఎరుకే! :) నేనెవరితోనూ మాటాడగా ఎవరూ చూసి ఉండరు ఆ కేంపస్ లో! :)

మామూలు రోజుల్లో ఎక్కడవాళ్ళు అక్కడ, వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటుంటారు. వర్షం వస్తే మటుకు అందరూ చాలా పొడుగైన మా వరండాలని ఆక్రమించేస్తారు :) ఈ వరండాలో ఒక యువకుడు యోగా చేస్తాడు, రోజూ, ఎండవానలు వేటిని లెక్క చేయక, మరొకరు కూడా ఆయనతో ఉంటారు, కాని చెప్పలేం. ఇక నేను నా కోటా నడక తరవాత ఈ వరండాలో యువకుని పక్క చేరి ప్రాణాయామం చేస్తాను, ఒక అరగంటపాటు. అలుకు తీర్చుకోడానికి కొంతమంది ఈ వరండా మీద కూచుంటుంటారు, అది అలవాటు.  


ఇలా జరుగుతుండగా,నిన్న ఉదయం నా పక్క యోగాసనాలు వేస్తున్న మిత్రుడు నా దగ్గరకొచ్చి,మీరు టెలిఫోన్ లో పని చేశారు కదా! పని చేయకుండా జీతాలు తీసుకున్నారని తిడుతున్నాడని అక్కడే  అలుకు తీర్చుకోడానికి కూచున్న యువకుడిని చూపించాడు.


ఒక క్షణం విస్తుపోయా! తేరుకుని మాటాడటం మొదలెట్టా! నేనెప్పుడూ మాటాడగా చూడని చుట్టు పక్కలవారంతా కూడిపోయారు. నిన్న మొన్నలో, మనం స్వాతంత్ర్య అమృతోత్సవం జరుపుకున్నాం కదా! మనకు పెద్దలు     సంపాదించి పెట్టిన స్వాతంత్ర్య హక్కుల్లో వాక్స్వాతంత్ర్యం ఒకటి. అతనలా తిట్టుకుంటున్నాడా? కాదనే హక్కు మనకు లేదు,తిట్టుకోమను, అడ్డుపడకు. అతనికో సలహా చెప్పు అతనితో పాటుగా మనల్ని తిట్టడానికి మరో పది మందిని కూలీకి నియమించుకోమను,తిట్టడానికి, మరెక్కడో వద్దు, ఇక్కడే ఎదురుగా తిట్టించమను, మన గ్రవుండ్ లో ఉన్నవాళ్ళందరిని పిలుద్దాం! తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాలని చెప్పు. ఆ తరవాత మాట, తిట్టిన ప్రతి తిట్టుకు ఒక రూపాయి ఇమ్మను! అంత చెయ్యలేడా పోనీ మొత్తానికి ఒక రూపాయి నా చేతులో పెట్టమను, అదీ చేయలేడా సరే! ఒక నమస్కారం పెడదాం, ఏమంటావు? అని ఊరుకున్నా! 


ఇది విన్నవాళ్ళంతా ఒక్క సారి గొల్లు మన్నారు.కార్యక్రమం ఎప్పుడో చెబితే తీరుబడి చేసుకుంటా 

 టైమయింది వస్తానూ అని తువ్వాలు దులుపుకుని భుజాన వేసుకుని ఎలబారేను :)

ఇదండీ! మన వాక్స్వాతంత్ర్యం సంగతి  


19, ఆగస్టు 2022, శుక్రవారం

పిడకలగూటి కోసమే ఎందుకేడ్చింది?

 

పిండీ బియ్యం పోయినా పిడకల గూటి కోసమే ఏడిచింది.


https://kasthephali.blogspot.com/2022/08/blog-post_6.html


పిడకలగూటి కోసమే ఎందుకేడ్చింది?


ఈ కొచ్చనుకి సమాధానం ఎవరేనా చెబుతారేమోనని ఎదురు చూశా, ఇంక నేనే నాకు తోచినది చెప్పక తప్పలేదు.


అదేమో పాతకాలపుపల్లె. పూరి గుడిసెలన్నీ పడిపోయి ఉన్నాయి.నష్టం జరగని ఇల్లు కనపడలేదు. తన ఇంట విలువైనవన్నీ పాడయ్యాయి, రాత్రి ఉడకేసుకోడానికి బియ్యమూ లేవు, పిండీలేదు. పిడకలగూడు తడిసిపోయి పనికిరాకపోయింది, ఎండు కట్టెలాచూద్దామంటే ఎక్కడాలేవు ఊరు మొత్తం మీద. పడిపోయిన ఇంట వెతికితే కూడు వండుకోడానికి కుండ దొరకచ్చు.కూడు వండుకోడానికి ఎవరేనా బియ్యం సాయం చేయచ్చు. కొంప కూలింది కనక పొయ్యీ పనికిరాకపోయె. మూడు రాళ్ళు, వెతుక్కుంటే దొరుకుతాయి,పొయ్యి అవసరం తీరిపోతుంది. మరి పొయ్యి కిందకి  ఎండుకట్టెలు దొరకవు, పోనీ పిడకలంటే పిడకలగూడు పోయె, ఎవరినైనా అడుగుదామంటే, ఏమైనా ఇస్తారుగాని పిడకలు ఇవ్వరెవరూ అందునా ఇలా గాలివాన సమయంలో, కావాలంటే ఓ ముద్ద కూడు పెడతారు.  


అయ్యో! కడవలే!!కణ్ణా!!!ఎంత కష్టం తెచ్చిపెట్టేవు పిడకలగూడు తడిపేసి, అని పిడకలగూటి కోసమే ఏడ్చింది.


ఇక ఒక నామకం పొలిటికల్ సెటైరా? అనడగి అధికారంపోయె,ఆస్థులు ఇ.డి పాలా అన్నారు. దాన్ని వివరిస్తే, నిజమేనేమో అనిపించింది. పిండి, బియ్యం లాటి విలువైనది అధికారం, అది పోయె! మరి వేల కోట్ల రూపాయల ఆస్థి పిడకలగూడు లాటిది. ఇదిపోతే? అధికారం ఎప్పుడేనా, ఎలాగైనా సంపాదించుకోవచ్చు కాని సొమ్మెవరిస్తారు.ఇన్ని వేలకోట్ల రూపాయలని ఎన్నేళ్ళలో సంపాదించేం. అధికారం సంపాదించాలంటే సొమ్ములవసరం కదా!అందుకు పిడకలగూడులాటి ఆస్థికోసం ఏడవటం సహజమేనేమో :) 

17, ఆగస్టు 2022, బుధవారం

కైక రాముని వనవాసం పద్నాలుగేళ్ళే ఎందుకడిగింది?

 కైక రాముని వనవాసం పద్నాలుగేళ్ళే ఎందుకడిగింది?

ఈ ప్రశ్న ఎక్కడో చదివాను, సమాధానం చదవలేకపోయా! నాకు తోచిన సమాధానం ఇదీ!!!

ఈ ప్రశ్నలోకి వెళ్ళే ముందు ఆస్థులు,అనుభవహక్కులు,వాటి కాల దోషం గురించి కొద్దిగా ముచ్చటిద్దాం.

ప్రామిసరీనోటు కాలం మూడేళ్ళు, ఆ లోగా చెల్లు వేయడంగాని,తిరగరాయడంగాని, కొంత జమకట్టడం గాని జరగాలి. మూడేళ్ళు దాటిన మరునాడు ఆ నోటు చెల్లదు. నోటు చచ్చిపోయిందంటారు, దానినే కాలదోషం పట్టిందనడం, ఇంగ్లీష్ లో చెప్పాలంటే టైమ్ లాప్సు అయింది. ఇలాగే అస్థులగురించి కూడా!అనుభవహక్కులు,వాటి కాలపరిమితి వగైరాలు ఉన్నాయి. ఇవి ఏదో ఒకరోజులో వచ్చినవికావు. వేల సంవత్సరాలుగా కాలంతో పాటు మార్పులు చెందుతూ వచ్చినవి, నేటి కాలానికి నోటు మూడేళ్ళకి కాలదోషం, ఏదేని ఆస్థిపై హక్కు నిరూపించుకునే పన్ను కట్టడం, అద్దెతీసుకోవడం, ఇటువంటివి పన్నెండు సంవత్సరాలు కనక యజమాని చేయక ఆస్థిని వదిలేస్తే, ఆ అస్థి అనుభవిస్తున్నవారి సొత్తవుతుంది. ఇప్పటికిన్నీ స్వాధీన తణఖా సమయం పన్నెండేళ్ళని నా ఎరుక. అదేగనక ప్రభుత్వ ఆస్థిని ఇరవై సంవత్సరాలు నిరాటంగా ఆక్రమించుకుని ఉంటే అది అనుభవదారుని స్వంతం ఔతుంది. ఇలా చాలా ఉన్నాయి, నేటి కాలానికి. ఇక ఇప్పుడు ప్రశ్నలోకి వెళదాం.

కైక రెండు వరాలు దశరథుని అడిగింది. అందులో ఒకటి రాముడు పదునాలుగేళ్ళు వనవాసం చెయ్యాలి. పదునాలుగేళ్ళే ఎందుకడిగింది? ఎక్కువో తక్కువో అడగచ్చుకదా?

రామాయణం ఎప్పుడు జరిందంటే నిర్దిష్టమైన సమయం చెప్పడం కష్టం. ఆనాటికి నిలిచి ఉన్న ఆస్థి పై హక్కు కోల్పోడానికి సమయం పదునాలుగేళ్ళు. ఇది దృష్టిలో ఉంచుకునే రాముని వనవాసకాలం పదునాలుగేళ్ళుగా కైక అడిగింది. అంటే పద్నాలుగేళ్ళు వనవాసం తరవాత రాముడు మరల రాజ్యాన్ని స్వాధీనం చేసుకోలేడు, కాల దోషం పట్టింది కనక.

దశరథుడు మరణించాడు, రాముడు వనవాసంకి వెళ్ళిన తదుపరి. భరతునికి కబురంపేరు, మేనమామ ఇంట ఉంటే. వచ్చి విషయం తెలుసుకున్న భరతుడు అన్నదగ్గరకు పోయి రాజ్యం నీదే ఏలుకోమని కోరాడు. రాముడు ఒప్పుకోలేదు,పదునాలుగేళ్ళ తరవాత తిరిగివస్తానన్నాడు, ఎంత చెప్పినా. చివరికి రాముని పాదుకలు పుచ్చుకుని వచ్చి, వాటికి పట్టాభిషేకం జరిపించాడు, భరతుడు.

పదునాలుగేళ్ళ వనవాసం తరవాత వస్తాను, రాజ్యం ఏలుకుంటానని చెప్పినా. భరతుడు ఇలా ఎందుకు చేశాడు?

రాముని దగ్గరకు తిరిగి రమ్మని చెప్పడానికి కొంతమందే వెళ్ళేరు, ఇక్కడ ఏమి జరిగినదీ ప్రజలకి తెలియదు. పాదుకలు తెచ్చి వాటికి పట్టం కట్టకపోతే, పదునాలుగేళ్ళ తరవాత రాముడు కనక రాజ్యం తీసుకుంటే, రాముడు భరతుని రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడని ప్రజలనుకోవచ్చు. అందుకే పాదుకా పట్టాభిషేకం, ప్రజలకి రాజ్యం రామునిదే అని చెప్పడానికి భరతుడు చేసినది. అలా అనుకోకుండడానికే భరతుడు పాదుకలు తెచ్చి పట్టం కట్టడమే కాక అయోధ్యలో కాక నంది గ్రామంలో ఉండి రాజ్య పాలన చేశాడు. భరతుడు రామునితో నీవు గనక పదునాలుగేళ్ళు దాటిన మరునాటికి అయోధ్యకి రాకపోతే నేను సన్యసిస్తానని చెబుతాడు. అందుకే రాముడు సమయానికి రాలేక హనుమతో వస్తున్న కబురు ముందుగాపంపినది.

మరొక సంగతి కూడా చర్చకు రావచ్చు అది భారతంలో  పన్నెండేళ్ళవనవాసం, ఒక సంవత్సరం అజ్ఞాతవాసం. ఇది పందెం.ఎలాగైనా ఉండచ్చు. కాని ఇందులో కూడా పదమూడేళ్ళు అన్నది ఆ కాలంనాటి కాలదోష సమయం అనుకుంటున్నా.ఇవి వేల సంవత్సరాలలో ఆస్థి, అనుభవ హక్కుల్లో వచ్చిన తేడాలు.రామయణ కాలానికి కాలదోష సమయం పదునాలుగేళ్ళు, భారత కాలం నాటికి అది పదమూడేళ్ళయింది. నేటికి కాలదోష సమయం పన్నెండేళ్ళని చెప్పుకున్నాంగా. కాలదోష సమయం ఇలా తగ్గుతూ వచ్చింది.

14, ఆగస్టు 2022, ఆదివారం

స్వాతంత్ర్యం జన్మ హక్కు




స్వాతంత్ర్యం  జన్మ హక్కు.
 ఇది ముమ్మాటికి నిజం. 
హక్కుతోపాటే బాధ్యత కూడా ఉంటుంది, వెలుగు వెనకే నీడ ఉన్నట్టు. 
హక్కు గురించి మాటాడేటపుడు బాధ్యత మరచిపోరాదు. 
 

10, ఆగస్టు 2022, బుధవారం

కౘ్చలో నిప్పు పడ్డా, కోళ్ళగంపలో పిల్లి పడ్డా, కచేరిలో కాయితం పడ్డా నష్టం తప్పదు...



కోక అంటే స్త్రీలు కట్టుకునే వస్త్రం చీర, అనే అర్ధం స్థిరపడిపోయింది నేడు, కాని స్త్రీ,పురుషులు ఎవరైనా నడుముకిందనుంచి కట్టుకునే వస్త్రాన్ని కోక అనడమే పాతకాలపు అలవాటు. "కుళ్ళాయుంచితి కోకచుట్టితి మహాకూర్పాసమున్ దొడ్వితిన్" ఇది శ్రీనాథుని మాట. స్త్రీలు, పురుషులు కోక కట్టేటప్పుడు ముందు వైపు కుచ్చెళ్ళు పెడతారు. అవి చాలా ఒత్తుగా ఉంటాయి, చాలా మడతలుంటాయి. ఒక కొంగు రెండుకాళ్ళ మధ్యనుంచి వెనక్కి తీసి కుచ్చిళ్ళు పోసి వెనక దోపుతారు. దీన్నే కౘ్చ అంటారు, వాడుకలో గోచీ దోపడం అంటారు. ఒకప్పుడు ఎనిమిదిగజాల పంచలు,చీరలు ఉండేవి, అవి ఆ తరవాత ఆరుగజాలకు, ఆ తరవాత ఐదు గజాలకు కుంచించుకుపోయాయి. ఇక కచ్చ దోపడానికి వస్త్రమెక్కడ? కచ్చపోసి కోక కట్టిన ఆడదిగాని మగాడుగాని కనపట్టం లేదు. దీన్నే మడికట్టు అంటారు తమిళులు. ఈ కౘ్చలో నిప్పు పడితే, ఎక్కడ పడిందో వెతుకులాటకే ఎక్కువ సమయం పడుతుంది. నిలబడి దులుపుకున్నా, నిప్పురవ్వ ఆ మడతలలో నుంచి బయట పడ్టం తేలికకాదు.ఈ లోగా అది చేయాల్సిన నష్టం చేసేస్తుంది, అందుకు నష్టం తప్పదు. లేదా కోక, పంచ విప్పేసినా విప్పిన వాటిని కాల్చేస్తుంది, నిప్పు. అంచేత కచ్చలో నిప్పు కష్టం,నష్టం కలగజేస్తుంది.



కోళ్ళగంప


కోళ్ళగంపవేరు,కోళ్ళగూడు వేరూనూ. కోళ్ళగూడంటే  రెండడుగుల పొడవు వెడల్పు,ఎత్తులతో ఒక చిన్న కట్టడం.మూడు పక్కల పైన ఇటుకల కట్టుబడి, ఒక వైపు ఖాళీ దీనిలో పులి బోనులాగా ఒక కటకటాల తలుపు పైనుంచి తీసి కిందికి వదిలేలా. పగలు కోళ్ళు ఇంటిచుట్టు తిరిగినా రాత్రికి గూట్లోకి పెట్టేవారు. కోళ్ళు క్షేమంగా ఉండేవి. ఇక కోళ్ళగంప అనేది ఒక వెదురు బుట్టలాటిది. ఒక్కొకప్పుడు కోళ్ళను పిల్ల
తో దీనికింద పెట్టేసి వదిలేసేవారు, రాత్రులు కూడా,కొందరు. పిల్లి ఈ వెదురుబుట్టను పైకి లేపి పిల్లల్ని ఎత్తుకుపోయే సావకాశం. పిల్లిగనక ఈ కోళ్ళగంప మీదపడితే కనీసం ఒక కోడిపిల్లనైనా పట్టుకుపోతుంది. అంటే కోళ్ళగంపలో పిల్లి పడితే నష్టం తప్పదనమాట.


కచేరి అంటే కోర్టు. ఇందులో కాయితంపడటం అంటే, మనం ఎవరిమీదనో దావా చేయడం, లేదా మరొకరు మనమీద దావా చేయడమనమాట. కోర్టులో దావా నెగ్గినవాడు ఇంట్లోనూ, ఓడినవాడు వీధిలోనూ ఏడ్చారని నానుడి. నెగ్గినవాడెందుకు ఏడ్చాడు? నెగ్గినవాడు లాయర్లకి కోర్టు ఖర్చులకి, తిరుగుళ్ళకి, సాక్షులకి అయిన ఖర్చు తలుచుకు,ఇంటిలోనే  ఏడ్చాడు. ఓడిన వాడు వీటన్నిటితో కేసూ పోయిందని భోరున కోర్టులోనే ఏడ్చాడు. అందుకే కచేరిలో కాయితం పడితే నష్టమనమాట స్థిరపడిపోయింది.  




6, ఆగస్టు 2022, శనివారం

పిండీ బియ్యం పోయినా పిడకల గూటి కోసమే ఏడిచింది.



"పిండీ, బియ్యం పోయినా పిడకల గూటి కోసమే ఏడిచిందనేది" ఒక నానుడి. పిండి, బియ్యం అనేవి ఆహారపదార్ధాలు, పిడకలంటే ఇంధనం,పొయ్యిలో మంటకి ఉపయోగించేవి. పెద్ద లెక్కలోకి తీసుకునేవి కావు, మరి అటువంటి పిడకలకోసం ఎందుకేడిచిందీ? విలువైనవాటికోసం కాక విలువ తక్కువైన వాటి కోసం ఎందుకు ఏడ్చిందీ? అదిగదా అసలు ప్రశ్న.  కతలో కెళ్ళే ముందు కొంత చెప్పాలి. పిండి, బియ్యం అంటే తెలిసినవే! ఇక పిడకలగూడేంటనేదే తెలియవలసినది. సరే! పిడక కూడా తెలీదా?  పాతకాలంలో, అదేం లెండి నేటికిన్నీ పశువులు విసర్జించినదాన్ని పేడ అంటారు. పేడని అలాగేగాని,దీనితోపాటు, రంపంపొట్టు, బొగ్గుపొడి, ఊక ఇలా మండే స్వభావం ఉన్నవాటిని కలిపి ముద్దగా చేసి గుండ్రంగా చపాతీలా చేసి వాటిని ఎండబెడతారు. ఆ తరవాత వాటిని ఆహారం పచనం చేసుకోడానికి ఇంధనంగా వాడుతారు,కట్టెలతో పాటు, లేదా పిడకలే, నేటికీ పల్లెలలో, కొంతమంది.  ఇలా ఎండిన పిడకల్ని ఆరుబయట ఎత్తైనచోట గుండ్రంగా పేరుస్తారు. ఆతరవాత వాటిపైన వరసగా పేర్చుకుంటూ వస్తే అదొక శంకువు ఆకారంకి తేలుతుంది. దీనిపైన కొన్ని తాటాకులు కప్పుతారు, తడవకుండా, పైన ఒక రాయి ఎత్తు పెడతారు, ఆకులు ఎగిరిపోకుండా. 

కావాలనుకుంటే ఫ్లిప్ కార్ట్ లో వెతకండి, ఒక్కో పిడక ఖరీదు ఎనభైతొమ్మిది రూపాయలే.



మరో మాట,ఆవు పేడని ఎగుమతి చేస్తున్నారట, భారతదేశం నుంచి. దిగుమతి చేసుకుంటున్న దేశాలు U.A.E,U.S.A., Malaysia. నేడు,  15000 టన్నుల ఆవుపేడ U.A.Eకి ఎగుమతి అవుతోందిట, రాజస్థాన్ నుంచి, ఎందుకూ వారికిదీ? అదిగదా కొచ్చను. ఆవుపేడ ఎరువుగా వేసి పెంచిన ఖర్జూరాలు పెద్దవిగానూ, నాణ్యంగానూ ఉన్నాయని వారి సైంటిస్టులు చెబుతున్నారష. పిడకల వ్యాపారం బాగున్నట్టుందే! కంగారు పడిపోకండి, ఇప్పటికే చాలామంది ఆ వ్యాపారంలో ఉన్నారు. ఇప్పుడు కతలో కొద్దాం.


అనగనగా అదొక పల్లెటూరు, నాటి కాలం పల్లెటూరు.  ఆ పల్లెలో నాడు ఉన్నవన్నీ పూరిళ్ళే! అంటే తాటాకు ఇళ్ళుగాని, ఆవిరిగడ్డి నేసిన పూరిళ్ళుగాని. అటువంటి పల్లె ఒక వర్షాకాలంలో గాలితుఫానులో చిక్కుకుంది. చినుకు చినుకుగా మొదలైన వాన కుండపోతయింది. ఇక గాలి వెర్రెత్తినట్టు వీచింది. అసలే పూరిళ్ళు, గాలికి కొన్ని పడిపోయాయి. మరికొన్ని మట్టి ఇళ్ళు కూలిపోయాయి. మరికొన్ని ఇళ్ళకి తాటాకులెగిరిపోయాయి, మరొకొన్నిటికి నడికొప్పులెగిరిపోయాయి. ఇలాటి సమయంలో ఒక ఇల్లాలు తన తాటాకిల్లు కూలిపోతుండగా తప్పించుకుని బయట పడింది. కొంచం తడవని చోటకి చేరుకుంది. కొంత సేపటికి గాలి తగ్గింది. చిన్న చినుకు పడుతూంది, సాయంత్రమవుతూన్న సమయం. ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు కదా! కూలిపోయిన ఇంటి లో ఏమున్నాయో ఏమిపోయాయో వెతుకులాట ప్రారంభించింది, పడిపోయిన వాటిని తప్పిస్తూ,రాత్రి భోజనం తయారు చేసుకోడానికి..  

చూస్తే సర్వం నాశనం. కుండలో పోసిన బియ్యం పూర్తి నేలపాలయ్యాయి,మట్టి గొట్టుకుపోయాయి, మట్టిలో కలిసిపోయాయి. కుండ మీద ఏదో పడటం మూలంగా, కుండ బద్దలైంది. ఆ పక్కనే పెట్టిన కుండ కూడా బద్దలైంది, పోసివుంచిన పిండీ  మట్టి చేరడం తో పనిరాకుండా పోయింది. బట్టలు సర్వం తడిసిపోయాయి, కొన్ని ఎగిరిపోయాయి,పొడి బట్టలేదు. నిలవడానికి పొడి జాగా లేదు.  ఇదంతా చూసిన ఆ ఇల్లాలికి బాధ కలిగింది. . . ఆ తరవాతామె పెరటిలోకి పోయి చూస్తే చెట్టూ, చేమా అన్నీ పడిపోయాయి. అక్కడే ఎత్తుమీదున్న పిడకలగూడు చెదిరిపోయింది, పిడకలన్నీ నీటిపాలయి ముద్దయిపోయాయి. ఇప్పుడు ఆమెకు దుఃఖం తన్నుకొచ్చింది. అయ్యో! పిడకలగూడు పోయిందే అని బావురు మని ఏడ్చింది.


ఇన్ని పోయినా బావురుమని ఏడవని ఆమె పిడకలగూటికోసం ఎందుకు బావురుమని ఏడ్చింది చెప్మా!!!



3, ఆగస్టు 2022, బుధవారం

టెస్ట్ ట్యూబు-ఇంక్ పిల్లరు

 టెస్ట్ ట్యూబు-ఇంక్ పిల్లరు


అరవై ఏళ్ళ కితం అమ్మకి సుగర్,మూత్రం   టెస్ట్ కి, ఉదయమే  రోజు పక్క పట్నం సైకిల్ మీద  వెళ్ళి టెస్ట్ చేయించుకొచ్చి ఇంజక్షన్ చేసేవాడిని. నా తిరగుడు చూసిన డాక్టర్ గారు, టెస్టు చేయడం నేర్పించారు. టెస్ట్ చేయడం నేర్చుకున్నా, సరే, మరి పరీక్షనాళిక ఏదీ? డాక్టర్ గారే ఒకటిచ్చి కొద్దిగా సొల్యూషనూ ఇచ్చి ఇంటి దగ్గరే చేసుకో అన్నారు. ఇక ఇక్కడినుంచి నా తిప్పలు మొదలయ్యాయి. స్పిరిట్ లేంప్ లేదు, కుంపటి మీద నిప్పు సెగ వాడేను, టెస్ట్ ట్యూబ్ వేడెక్కుతుంది కదా చెయ్యి కాలకుండా పట్టుకోడానికి, తంటసం లేదు,గుడ్డ తో పట్టుకునేవాడిని. పొరబాటున కిందబడి పగిలిపోతే? ఈ ఆలోచనే భయపెట్టింది. 


కంపౌండర్ని అడిగా ఇవెక్కడ దొరుకుతాయీ,అని.   మెడికల్ షాప్ లో అడుగూ అన్నాడు.  ఆ ఊరికి పెద్ద షాపు కరెడ్లా మెడికల్స్,తొమ్మిదవలేదు, అప్పుడే షాపు తలుపులు తీస్తున్నాడు. టెస్ట్ ట్యూబు, సొల్యూషనూ, స్పిరిట్ లేంప్ ఉన్నాయా? అని అడిగా . కొట్టు తీస్తూనే సరుకు లేదనలేక, మళ్ళీ రండి, చెబుతానన్నాడు. చేసేది లేక కాళ్ళీడ్చుకుంటూ సైకిలెక్కి, మెడికల్ షాపుల వెంట పడ్డా. ఎవరినడిగినా కరెడ్లలో అడగమన్నవారే. ఆశ! దొరుకుతుందా? రెండు గంటల తరవాత మళ్ళీ కరెడ్లకి వెళ్ళేను. అతను నన్ను చూస్తూనే, దొరకవండి అనేశాడు, నిరాశ!. తెప్పించగలరా? చెప్పలేనండీ!. మరో నిరాశ!. మీదగ్గర దొరకచ్చని డాక్టర్ గారు చెప్పేరన్నా. పోనే ఎక్కడ దొరుకుతాయో చెప్పండి, దయచేసి, అని ప్రాధేయపడ్డా. దానికి అతను కొంచం మొహమాట పడుతూ, ఇప్పుడు బేరాల టైము, భోజనానికి కొట్టు కట్టేసే ముందు రండి. ఆశ చిగురించింది. బయటికిపోయా, ఎమీ చెయ్యాలి? ఉదయం చద్దెన్నం తిని బయలుదేరా సైకిల్ మీద,పదకొండు దాటుతోంది, కడుపులో కరకరలాడుతోంది, జేబులో డబ్బులు  నిండుకున్నాయి. అవసరం మనది కదా, అశక్త దుర్జనత్వంతో,  ఊరు పిచ్చి తిరిగుడు తిరిగి మళ్ళీ కరెడ్ల చేరాను. 


అతను నన్ను చూసి నక్షత్రకునిలా తగులు కున్నాడనుకున్నాడో ఏమో,నేను మాత్రం పట్టు వదలని విక్రమార్కునిలా నా అవసరం, వైనవైనాలుగా అతనికి జాలి పుట్టించేలా చెప్పేను. తను కుర్చీలో కూచుంటూ, కూచోండి అన్నాడు, ఆశ మొలిచింది,కూచున్నా, ఇవి అస్తమానం అవసరముండవండీ, డాక్టర్ గారు చెబుతారు, మేము రిప్ లకి చెబితే వాళ్ళు వీటిని పంపేస్తారు, అక్కడితో అది పూర్తవుతుంది, స్టాక్ పెట్టం అంటూ పాత ఫైల్ దులిపి కాగితాలు తిరగేస్తూ ఆ అడ్రస్ దొరికింది అన్నాడు. ఆశ బతికింది.  ఇవి  ఆంధ్రా సైంటిఫిక్ కంపెనీ మచిలీ పట్నం లో దొరుకుతాయి, అన్నాడు. నిరాశ!. . మరోమాట ఈ కంపెనీకి కాకినాడలో బ్రాంచ్ కాబోలు ఉంది అన్నాడు,అడ్రస్ లేదు, ఆశ చావలేదు. ఆశ నిరాశల మధ్య ఊగులాడుతూ పల్లె చేరేను రెండు దాటింది.మర్నాడు రెప్లై కార్డ్ కొన్నా, ''ఆంధ్రా సైంటిఫిక్ కంపెనీ, కాకినాడ'' కి ఓ ఉత్తరం రాసి పడేసి, టేస్ట్ ట్యుబు వి.పి.పి లో పంపమన్నా. జవాబు కోసం ఎదురు చూపు. జవాబు లేదు, అసలు  ఉత్తరం  అందిందా? అడ్రస్ రాయక కంపెనీ పేరు రాసి పడేస్తే, అనుమానం, ఏం చేయాలో తోచలేదు.  కాకినాడ నుంచి జవాబు రాకపోతే మచిలీపట్నం వివరాల కోసం ఉత్తరం రాయాలనుకుంటుండగా ఆశ నిరాశలో కొట్టుకుంటుండగా వారం దాటేకా పోస్ట్ మేన్ సూరయ్య రిప్లై కార్ద్ ఇచ్చాడు. మళ్ళీ ఆశ బతికింది. మీరడిగిన వస్తువులు మా దగ్గర దొరుకుతాయి కాని వి.పి.పి పంపం. ఒక వార్త ఆశ మరొకటి నిరాశ.ఏం చేయాలి?ధరల వివారాలిచ్చారు, అదే పదివేలనిపించింది.  


1, ఆగస్టు 2022, సోమవారం

కాలమండి బాబూ కాలం

ఎప్పటికి తరగని వైభవం


 ఉష, ఛాయా, పద్మినీ  సమేత సూర్యనారాయణుడు

గొల్లలమామిడాడ




కొనసాగుతున్న గతకాలపు వైభవం
ముంగిట ముగ్గు


 గతకాలపు వైభవ చిహ్నం
ఇంటిపై టి.వి ఏంటెన్నా

గతకాలపు వైభవ చిహ్నం

Neighour's envy

Owner's pride,.

 

now
Owners liability--neghbour's burden.

*****

 నిన్నటి టీచర్ నేటి రాష్ట్రపతి....

కాలమండి బాబూ కాలం.

*****

నిన్నటి చాయ్ వాలా నేటి ప్రధాని....

కాలమండి బాబూ కాలం.

*****

నిన్నటి ఆటోవాలా నేటి ముఖ్యమంత్రి.

కాలమండి బాబూ కాలం.

*****

నిన్నటి సన్యాసి నేటి ముఖ్యమంత్రి.

కాలమండి బాబూ కాలం.

*****

నిన్నను రాజ్యాన్ని కనుసన్నలలలో పాలించిన దేవత....

నేడు ?????????

కాలమండి బాబూ కాలం.

*****

.నిన్నటి దొంగ-నేటి దొర

కాలమండి బాబూ కాలం.

*****

నిన్నటి దొర-నేటి దొంగ

కాలమండి బాబూ కాలం.

*****

నిన్న కన్ను తిప్పుకోలేని అందం--నేడు కన్ను కనపడని చందం

కాలమండి బాబూ కాలం.

*****

రేపు రాజెవరో రెడ్డెవరో

కాలమండి బాబూ కాలం.

****


29, జులై 2022, శుక్రవారం

24, జులై 2022, ఆదివారం

కొండనాలిక్కి మందేస్తే-బుల్లి కథ

 బుల్లి కథ

కొండనాలిక్కి మందేస్తే

ఒక పల్లెటూరు దామోదరానికి అనారోగ్యం చేస్తే డాక్టర్ దగ్గరకెళ్ళేడు. డాక్టర్ పరీక్ష చేసి మందు రాసిచ్చేడు. రాత్రి పడుకోబోయే ముందు ఈ మాత్ర వేసుకో, నిద్ర బాగా పడుతుంది,కొంచం మగతగా ఉండచ్చు, అని కూడా చెప్పేడు.  దామోదరం ఇంటికొచ్చి సంగతి చెప్పి మందు వేసుకుని పడుకున్నాడు. తెల్లారింది ఏడయింది, ఎనిమిదీ అయింది లేవడే! నాలుగు గంటలకే లేచి కాఫీ అని అరిచేవాడు,ముసలాయన, లేవలేదేంటబ్బా! టపాగాని కట్టేసేడా? అని అనుమానపడి చూస్తే హంస తిరుగుతూ ఉంది. బలవంతాన లేపితే లేచి ముఖం కడిగిస్తే, కాఫీ తాగి మళ్ళీ పడుకున్నాడు. డాక్టర్ మత్తుగా ఉంటుందన్నారు కదా! అని పడుకోనిచ్చారు, ఇంట్లోవాళ్ళు. మధ్యాహ్నం పన్నెండు, ఒంటి గంట, ఎంతకీ లేవడే. పొద్దుటిలాగే బలవంతాన లేపి కూచోబెట్టి అన్నం పెడితే తిని మళ్ళీ పడుకున్నాడు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి కంగారొచ్చి డాక్టర్ దగ్గరికి పోయి చెబితే సాయంత్రాని కి లేస్తాడు, కంగారు పడకండంటే, తిరిగొచ్చారు. రాత్రికి లేచాడు దామోదరం. భోజనం చేసి మళ్ళీ పడుకున్నాడు. తనే లేచాడుగా,డాక్టర్ చెప్పినట్టిని ఊరుకున్నారు, ఇంట్లో వాళ్ళు. పడుకున్నవాడు హటాత్తుగా సగం రాత్రి లేచి కడుపులో గుడగుడమంటోదని పరుగెట్టేడు. అది మొదలు ప్రతి గంటకి ఒక విరేచనం, అదీ నీళ్ళ విరేచనం. ఇంట్లోవాళ్ళు కంగారుపడి డాక్టర్ దగ్గరికి పోదామంటే నిశరాత్రి, అని, దగ్గరున్న మాత్రేదో వేశారు. విరేచనాలు ఝాడించి కొట్టేయి. ఇంట్లో ఉన్న ఓ.ఆర్.ఎస్ (కాచి చల్లార్చిన నీళ్ళలో చిటికెడు ఉప్పు, చారెడు పంచదార కలిపి) కలిపిచ్చేరు, ఆరారగా. ఉదయానికి వాడిపోయిన తోటకూర కాడలాగా ఐపోయాడు, నోట్లోంచి మాట కూడా రావడం కష్టంగా ఉంది.

ఇంట్లోవాళ్ళు ఈ సారి నిజంగానే కంగారు పడి, డాక్టర్ దగ్గరికి మోసుకుపోయారు,తెల్లారగానే. డాక్టర్ చూసి ఒక సూది మందు పొడిచి, రెండు సెలైన్లు ఒక దాని తరవాత మరొకటి పెడితే, కొంచం తేరుకున్నాడు. భోజనం పెట్టించి, ఇంటికి తీసుకుపొమ్మన్నారు, డాక్టర్. 


సార్! ఏమయిందని అడిగితే, అనారోగ్యం అని నా దగ్గరకొచ్చాడు. ఆ అనారోగ్యానికి అందరికి రాసిచ్చే మాత్రే ఇతనికీ రాశాను. దురదృష్టం, మగత సామాన్యమేగాని, ఇంతగా నిద్ర పోతాడనుకో లేదు, ఇక నీళ్ళ విరేచనాలు కూడా ఆ మందు ప్రభావమే! ఆ మందు వేసుకుంటే దాని ప్రభావం, సైడ్ ఎఫెకట్స్, నీళ్ళవిరేచనాలు,నిద్ర మత్తు, తలనొప్పి ఉంటాయి. ఎక్కువ మందిలో ఇవి కూడా ఉండవు. లక్ష మందిలో ఒకరికి ఏదో ఒకటి రావచ్చు, కాని ఈ దామోదరంగారికి రెండూ వచ్చాయి, కొండనాలిక్కి మందేస్తే ఉన్న నాలిక ఊడినట్టయిందని, నవ్వేరు, డాక్టర్.


23, జులై 2022, శనివారం

కొండనాలిక్కి మందేస్తే

 కొండనాలిక్కి మందేస్తే ఉన్న నాలిక ఊడినట్టు. 

 

అన్నవస్త్రాలకోసం పోతే ఉన్న వస్త్రాలు ఊడినట్టు.

 

మహరాజా! అని మనవి చేసుకోబోతే మరో రెండు తగిలించమన్నట్టు 


14, మార్చి 2022, సోమవారం

జానపదం

 


Courtsy:Whats app

తల్లితండ్రులమీద దయలేని పుత్రుండు
పుట్టనేమి వాడు గిట్టనేమి?
పుట్టలోన చెదలు పుట్టవా? గిట్టవా?
విశ్వదాభిరామ వినురవేమ!

11, మార్చి 2022, శుక్రవారం

ఒమిక్రాన్--సైలెంట్ కిల్లర్.

 ఒమిక్రాన్--సైలెంట్ కిల్లర్.


యుద్ధం,ఎన్నికల హాడావుడిలో కరోనా మాట మరచిపోయారు.మాస్క్ కూడా వాడటం మానేశారు. పెద్దలు మాత్రం కరోనా మనల్ని వదలలేదు, జాగ్రత్తలు అవసరమే అని చెప్పినా వినేలా లేరు జనం.


ఒమిక్రాన్ కి సబ్ వేరియంట్లు చాలా ఉన్నాయి, ఏది సోకింది సామాన్యుడికి తెలీదు, ఒకటి రెండు రోజుల్లోనే తగ్గిపోతోంది, టెస్ట్ చేసే సమయం కూడా ఉండటం లేదు,దాంతో ఇది మామూలుగా ఋతువులో వచ్చే జ్వరం, దగ్గు, రొంప స్థాయికి జారిపోయినట్టు కనపడుతోంది.కరోనా ఎవరిని వదలకుండా అందరిని సోకింది, ఇమ్యూనిటీ ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు, వేక్సిన్ వేయించుకున్నవాళ్ళు( బూస్టర్లతో సహా )  వేయించుకోనివాళ్ళు, ఒక సారి వచ్చినవాళ్ళు అనే తేడాలే లేవు. సర్వం సమానం. ఇమ్యూనిటీ ఉన్నవాళ్ళకి బయటికి కనపడటం లేదు, అంతే తేడా.

 

ఇది సోకినా ప్రమాదం లేదనుకున్నాం కాని ఇది తప్పు అభిప్రాయం.కరోనా అంటే తగ్గుతోందిగాని దీని ఫలితాలు, నీరసం, తలనొప్పి, చిన్న దగ్గు, కొద్దిగా జలుబు, డిప్రషన్, ఇలా లక్షణాలు కొనసాగుతూనే ఉన్నాయి, నెలలు గడుస్తున్నా. వయసు మళ్ళినవాళ్ళని, ఇమ్యూనిటీలేనివాళ్ళని వేధిస్తూనే ఉన్నాయి, ఇందులో ఏదో ఒక లక్షణం. సుగర్,బి.పి లాటి దీర్ఘవ్యాధులున్నవారు చెప్పాపెట్టకుండా టపాకట్టేస్తున్నారు. కాని ఇది కరోనావల్ల అనుకోలేకపోతున్నారు. మరో విచిత్రం ఏమంటే ఒకరికి ఉన్న లక్షణాలు మరొకరికి ఉండటం లేదు. జాగ్రత్తలు కొనసాగడం మంచిది.


 నిజమెంతో తెలీదుగాని, 

కోవిడ్ లాటి వైరస్లను ఎలకలు,గబ్బిలాలు,పక్షుల ద్వారా శత్రు దేశాల్లో ప్రవేశపెట్టడానికి యూక్రైన్ లో పరిశోధనలు జరుగుతున్నాయని, వాటి తాలూకు కాగితాలు,వగైరా దొరికాయనీ, లేబరేటరీలను స్వాధీనం చేసుకున్నామని, ఈ పరిశోధనలు అమెరికా పనుపున,ఆర్ధిక సాయం తో జరుగుతున్నాయనీ, తద్వారా శత్రు దేశాల ప్రజలను నెమ్మదిగా అనారోగ్యంపాలు చేసి, ఆ దేశాన్ని ఆర్ధికంగా నిలదొక్కుకోలేకుండా చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని, రష్యా ఆరోపిస్తోంది. ఈ పెద్ద దేశాలకి ఇటువంటి ఆలోచనలఎందుకొస్తున్నాయీ? సైన్స్ వెర్రితలలేస్తోందా? కాలమే చెప్పాలి. ఎప్పుడైనా జాగరత అవసరం.  

8, మార్చి 2022, మంగళవారం

భవతి రాక్షసో వైద్యః

 


రోగార్తస్య భిషక్ దేవ

ఆర్త్యన్తే మానవో భిషక్

భవతి రాక్షసో వైద్యః

సేవామూల్య ప్రదర్శనే


రోగంతో బాధపడుతున్నపుడు వైద్యుడు దేవుడులా కనపడతాడు. అర్త్యన్తే అనగా రోగబాధ నెమ్మళించిన తరవాత, వైద్యుడు మామూలు మనిషిలా కనపడతాడు. వైద్య సేవలకి మూల్యం అడిగినపుడు మాత్రం రాక్షసునిలా కనపడతాడని భావం.


ఇది పాతకాలం నాటి మాట. నాటి రోజుల్లో అనగా నేను ఎరిగిన రోజుల్లో కూడా వైద్యుడు, రోగి ఇంటికి వచ్చి వైద్యం చేసేవాడు. మందులూ ఆయనే ఇచ్చేవాడు. పధ్యపానాలూ వివరంగా చెప్పేవాడు.అంతే కాదు, వైద్యుడు అంటే ఇంటివారిలో ఒకడనే మాట ఉండేది. చిన్నచిన్న రోగాలకి వైద్యం చేసినా డబ్బులు అడిగేవారు కాదు. సంవత్సరానికి ఒక సారి సత్యనారాయణ వ్రతం చేసుకుంటే వైద్యం చేయించుకున్నవారంతా కట్నాలని, కానుకలు చదివించేవారు. ఇవ్వలేనివారి దగ్గర అడిగేవారు కాదు.అదో సహకార జీవనం. 


కాలం మారింది, కాదు మనుషుల బుద్ధులు మారేయి ఎప్పటి సొమ్మప్పుడే చెల్లించాలి, నేడు.డాక్టర్ దగ్గరకే రోగిపోవాలి. అక్కడ ఒక కార్డ్ రాయించుకోవడంతో ఫీజు మొదలవుతుంది. ఈ కార్డ్ కి కూడా ఖరీదుంటుంది అది వందో ఆ పైమాటో, డాక్టర్ని బట్టి.నేటి డాక్టర్లు ఎక్కువ మంది తేనెటిగల్లాటివారు. కొద్దికొద్దిగా సంగ్రహిస్తారంతే, చిన్నచిన్న వైద్యాలకి, అదే పెద్దదైతే కార్పొరేటే :)


పై శ్లోకం మా వాట్సాప్ గ్రూప్ లో డాక్టర్ గారు పెట్టినది. ఇదేoటి ఆయన ఇలాటి టపా వేశారని మిత్రుణ్ణి కనుక్కుంటే తేలినదేమంటే, కరోనా మొదలుగా  డాక్టర్ గారు వాట్సాప్ లో రోగిని చూస్తూ అత్యవసర వైద్యం చేసేరు. అది గత రెండేళ్ళుగా జరిగిపోతూనే ఉంది కాని ఎక్కువమంది కన్సల్టేషన్ కూడా చెల్లించలేదని తెలిసింది. ఔరా! జనం, అనుకుంటూ ఒక సారి భుజాలు తడుముకున్నా! నా దగ్గర నుంచి డాక్టర్ గారికి ఇవ్వవలసినది ఉండిపోయిందేమోనని. సరి చూసుకున్నా! అన్నీ రాసుకుంటా కనక. 

ఇటువంటి వారు కూడా ఉన్నారా? ఉన్నారు అక్కడక్కడా!

18, ఫిబ్రవరి 2022, శుక్రవారం

మనసు విరిగెనేని మరి అతుకగ రాదు

 


 మనసు విరిగెనేని మరి అతుకగరాదు


ఇనుము విరిగెనేని 

ఇనుమారు ముమ్మారు, కాచి అతుకవచ్చు కమ్మరీడు

మనసు విరిగెనేని మరి అతుకగ రాదు

విశ్వదాభిరామ వినుర వేమ!

ఇనుము విరిగితే రెండు మాడుసార్లు అతకచ్చు, వేడిచేసి. కాని మనసు విరిగితే మరి అతుక్కోదు.


తాతగారి మాట చద్దన్నం మూట. 

ఇనుము చాలాగట్టి లోహం. అది విరగాలంటే చాలా పెద్ద సమ్మెటపోట్లు బలంగా తగిలితేగాని విరగదు. అలా విరిగిన ఇనుమును కూడా కమ్మరీడు కాలేసి అతకగలడు, అది కూడా రెండు మూడు సార్లే, ఆ తరవాత అదీ అతుక్కోదు. ఇక మనసు గాజుకాయలాటిది, ఎంత సున్నితమో అంత కఠినం కూడా. అటువంటి మనసు విరిగితే మరి అతకడం ఎవరివల్లా కాదంటారు, ఇంతటి మనసు ఎలా విరుగుతుంది, మాటల తూటాలకి విరుగుతుంది,అంటారు, తాతగారు. 


దీనికి నిదర్శనంగా భారతంలో ఒక పద్యం ఉంది, పద్యం గుర్తు లేదు, భావం రాస్తున్నా! ఎవరేనా పద్యం గుర్తు చేస్తే సంతసం. ''పదునైన బాణం ములుకులతో ఐన గాయాలను కూడా మాన్చవచ్చు, కాని మాటలో ఐన గాయాలు, మాన్చటం ఎవరితరమూ కాదు!'' అందుచేత  ముందు ఆలోచించాలి,ఆలోచించి మాటాడాలి, నోటి నుంచి బయటికి వచ్చిన మాట రామబాణ సమానం, అది తన లక్ష్యాన్ని ఛేదించి తీరుతుంది, వెనక్కి తీసుకోలేం. అందుకే నోరు సంబాళించుకో అంటారు, పెద్దవాళ్ళు.మరో మాట కూడా నోరా వీపుకి దెబ్బలు తేకే అన్నది జాతీయం. కాలు జారితే తీసుకోగలం ,నోరు జారితే తీసుకోలేము, ఇది మరో జాతీయం.


పద్యం గుర్తొచ్చింది 

తనువున విరిగిన యలుగుల

ననువున బుచ్చంగవచ్చు నతి నిష్ఠురతన్
మనమున నాటిన మాటలు
విను మెన్ని యుపాయములను వెడలునె యధిపా!

12, ఫిబ్రవరి 2022, శనివారం

మూర్ఖులకిచ్చే సలహా ప్రమాదకరం


 అనగనగా ఒక అడవి, అందులో ఒక చింతచెట్టు చివర కొమ్మని, ఒక పిచుకల జంట గూడు కట్టుకుని ఉంటోంది. అదే చెట్టు మీద కింది పలవలో ఒక కోతి ఆవాసం. ఒక రోజు రాత్రి పెద్ద గాలి,వానా కుదిపేశాయి. పిచుకల జంట భయం భయంగానే చిటారు కొమ్మన వెచ్చగా ఉన్న గూటిలో గడిపేయి. కోతి వానకి తడిసి, చలికి వణుకుతూ ఉండిపోయింది.తెల్లారింది, పిచుకల జంట బయటకి చూస్తే అడవి అల్లకల్లోలంగా ఉంది, వర్షం కొంచం తగ్గింది. కింది కొమ్మల్లో కోతి చలికి వణుకుతూ కనిపించింది.ఆ జంట కోతితో, బావా! నువ్వు బలవంతుడివి కదా! నాలుగు కొమ్మలు విరిచుకుని, గూడు వేసుకుంటే ఈ తిప్పలు తప్పేవి కదా అన్నాయి. ఇది విన్న కోతికి అరికాలు మంట నెత్తికి ఎక్కింది. చర్రున లేచి, పిచుకల గూటిపై దాడి చేసింది. గూడు చిటారు కొమ్మన ఉండిపోవడంతో వెంటనే చిక్కలేదు. సంగతి గ్రహించిన పిచుకల జంట గూడు వదలి ఎగిరిపోయింది.. కోతి ఆగ్రహం పట్టలేక గూడున్న కొమ్మ విరిచి కింద పారేసింది. చూచిన జంట చెప్పిన సలహాకి  వగచి వేరు చెట్టుకు చేరాయి. 

సందర్భ శుద్ధి లేకఇచ్చే సలహా గాని మాటగాని రాణించవు.

మూర్ఖులకి సలహా ఇవ్వకూడదు, అది ప్రమాదకరం.

9, ఫిబ్రవరి 2022, బుధవారం

ఎవరు చేసిన కర్మ వారనుభవింపక

ఎవరు చేసిన కర్మ వారనుభవింపక  


ఎవరు చేసిన కర్మ వారనుభవింపక 

ఏరికైనా తప్ప దన్నా

ఏనాటి ఏ తీరు ఎవరు చెప్పాగలరు

అనుభవింపక తప్పదన్నా!


చేసిన కర్మము చెడని పదార్ధము చేరును నీవెంట.


ఉత్కృష్టమైన పుణ్య,పాపకర్మల ఫలితాలూ ఉత్కృష్టంగానే ఉంటాయి.చేసినది వ్యక్తిగాని, సమాజంకాని దేశం కాని ఫలితాలు తప్పవు, అనుభవించాలిసిందే! అందుకే నవ్వుతూ చేస్తాం ఏడుస్తూ అనుభవిస్తామంటారు.  

ధర్మో రక్షతి రక్షితః  

5, ఫిబ్రవరి 2022, శనివారం

పుచ్చుకోవడం పూర్వీకులనుంచీ ఉంది...

 పుచ్చుకోవడం పూర్వీకులనుంచీ ఉంది...


పుచ్చుకోవడం పూర్వీకులనుంచీ ఉంది. పెట్టడం పెద్దలనాటి నుంచీ లేదన్నదే  మాట.


చెయి చిక్కని మనిషికి రా యే కాని పో లేదు..


నా ఇంటి కొస్తే నాకేం తెస్తావు, నీ ఇంటికొస్తే నాకేం పెడతావు?


లోభివానినడుగ లాభంబు లేదయా!

3, ఫిబ్రవరి 2022, గురువారం

భూయో భూయో నమామ్యహం

 ఆపదామప హర్తారం

దాతారం సర్వ సంపదాం

లోకాభిరామం శ్రీరామం

భూయో భూయో నమామ్యహం

అపదల నుంచి రక్షించేవాడు, సర్వ సంపదలిచ్చేవాడు, జన్మోహనుడైన శ్రీరామునికి మరల మరల నమస్కారం.


చిత్రం రాముడు తీరికూచుని జనులను ఆపదలనుంచి రక్షిస్తాడు, సంపదలిస్తాడు అందుకు శ్రీరామునికి మరల మరల నమస్కారం.రాముడేం చెయ్యడు! రామో విగ్రహవాన్ ధర్మ అంటే రాముడంటే రూపుకట్టిన ధర్మం. అంటే ధర్మానికి మరలమరల నమస్కారం. అంటే ధర్మో రక్షతి రక్షితః, ధర్మాన్ని ఆచరించు, ధర్మం నిన్ను రక్షిస్తుంది, అని చెప్పడమే!ధర్మాన్ని ఆచరిస్తానని మరలమరల సంకల్పం చెప్పుకోవడమే సుమా!భూయో భూయో నమామ్యహం!

28, జనవరి 2022, శుక్రవారం

రాబోయే వేరియంట్ కప్పాయా? గామాయా?

 రాబోయే వేరియంట్ కప్పాయా? గామాయా?


కరోనా మరో variant  ప్రపంచం మీదకి రాబోతోందని WHO మాట.ఇది ఇప్పటివాటికంటే చాలా తొందరనూ అందరికి సోకుతుందని వార్త.


ఇప్పటిదాకా కరోనా వచ్చి తగ్గినవారికి, ఏ వేరియంట్ ఐనా, ఇమ్యూనిటీ ఉంటుందా?


ఇప్పటికి టీకా వేసుకున్నవారు,బూస్టర్ తీసుకున్నవారికి ఇమ్యూనిటీ కొనసాగుతుందా?

 ఇప్పటికి తీసుకున్న బూస్టర్ టికా రాబోయే వేరియంట్ ని ఎదుర్కోగలదా?


కొత్తగారాబోయే వేరియంట్ తొందరగా సోకుతుంది సరే, దీని లక్షణాలేంటి?


ఎప్పటికి దీనినుంచి విముక్తి?


సమాధానం లేని రాని ప్రశ్నలు.


26, జనవరి 2022, బుధవారం

అమ్మో నొప్పి!

 అమ్మో నొప్పి!


అమ్మో! నొప్పి,ఒళ్ళంతా నొప్పులే, నోరు చేదు, పంచదార, కారం కూడా చేదుగా ఉన్నాయి. కడుపులో వికారం, లేస్తే తూలు,నిద్దర పట్టటంలేదు, ఆకలి లేదు చెప్పుకొచ్చారు, మనవరాలు, అబ్బాయి, జమిలిగా.విన్నాను, నేనెవరితో చెప్పుకోను అని మనసులో అనుకుని వీళ్ళని ఏమార్చాలని పిట్ట కత చెప్పేనిలా!


కర్ణాటక సంగీత కచేరీ చూశారుగా, అందులో గాయకుడు, అతనితో పాటు మృదగం, వయొలిన్, కంజీరా, ఘటం,మోర్సింగ్ వాయించేవాళ్ళూ ఉంటారు. సభ ప్రారంభం చేస్తూనే గాయకుడు పాడితే వయొలీన్,మృదంగం అనుసరిస్తాయి. రాగ ప్రస్తారం తరవాత గాయకుడు పాట అపుతాడు, అక్కడినుంచి వయొలిన్, ఘటం, కంజీరా, డొలక్,మోర్సింగ్ ఈ పక్క వద్యాలన్నిటికి సమయంఇస్తాడు. అందరూ పాట మొత్తాన్ని ఒకసారి పాడి వాయించి సభ ముగిస్తారు. మేం అడిగినదానికి మీరు చెప్పేదానికి అన్వయం కుదరలేదు తాతా అంది మనవరాలు. చెబుతా విను అనిమొదలెట్టా. 

గత పదిరోజులుగా ఒమిక్రాన్ అమ్మవారు మన ఇంట సభ జరిపింది కదా! ఆవిడతో పాటు జ్వరం,దగ్గు,రొంప కూడా వచ్చాయిగా, పక్క వాద్యాలలాగా. ఆవిణ్ణి శాంతింపజేయడానికి, మందులువాడేం.అవి మరికొన్ని పక్క వాద్యాలు.ఆవిడ పాట పాడి ఆపింది, ఇకపై పక్క వాద్యాలు ప్రతాపం చూపుతున్నాయి, కొన్ని రోజులు బాధలు తప్పవని ముగించాను.


25, జనవరి 2022, మంగళవారం

పెద్దమ్మ-చిన్నమ్మ.

 

పెద్దమ్మ-చిన్నమ్మ.

పెద్దమ్మ ఇంటి నుంచి బయటికి వెళుతుంటేనూ చిన్నమ్మ బయటినుంచి లోపలికొస్తుంటేనూ ఆనందం అంటారు.

వివరించండి.


24, జనవరి 2022, సోమవారం

Omicron -3



Be always positive in attitude. 

Be active even if tested positive. 

Family tested positive 😀

20, జనవరి 2022, గురువారం

ఒమిక్రాన్-2 (జరుగుతున్న కథ)

 

భయం లేదు, ఉత్సాహంగా ఉండండి.


ఒమిక్రాన్-2 (జరుగుతున్న కథ)

సార్ ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా........అంటే ఒక అనుభవం ఉన్న డాక్టర్ గారి మాట.

ఇదెవరిని వదలదండీ. మొన్నటి దాకా పల్లె చల్లగా ఉంది, పండక్కి పట్నవాసం నుంచి వలస వచ్చారు. ఎవరూ మాస్క్ లు వేసుకోడం లేదు. తిరునాళ్ళు, తీర్థాలు, కోడి పందాలు గడిపేసేరు. ఇది స్వయంకృతం.
ఎవరిని ఎందుకు వదలదో చెబుతా.

గత రెండేళ్ళుగా అందరికి ఎంతో కొంత ఇమ్యూనిటీ పెరిగింది, సాధించుకున్నారు. దానితో ఈ ఒమిక్రాన్ కి ఎక్కువ ఇబ్బందులు లేక, ఎవరు పాసిటివ్ తెలీదు.లక్షణాలు కనపడితేనే పరిక్ష జరుగుతుంది కదా! ఇలా లక్షణాలు లేనివారు దీనిని వ్యాప్తి చేస్తున్నారు, అంతే కాక ఒక రోజు జ్వరం,మరొకరి ఒకరోజు రొంప, తలనొప్పి, వీరికి కూడా సామాన్య మందులేసుకుంటే తగ్గిపోతున్నాయి కాని వీరూ పాసిటివే. టెస్ట్ జరగదు, బాధలు లేవు గనక.అందుచేత, టీకా వేసుకున్నవారు, వేసుకోని వారు,బూస్టర్ డోస్ తీసుకున్నవారికి రావచ్చు.ఇంతకు ముందు వచ్చి తగ్గినవారిలో నూ రావచ్చు. 

.  
మరో మాట, ఇప్పుడు ఒమిక్రాన్ వచ్చిన వాళ్ళంతా అదృష్ట వంతులే, ఎందుకంటే వీరిలో ఇమ్యూనిటీ సహజంగా ఏర్పడింది, టి సెల్స్ కూడా పెరుగుతాయి, అలాగని అశ్రద్ధ వద్దు,జాగ్రత్తలు మానద్దు, వస్తే అనుభవించక తప్పదు,ఇప్పుడు వేరియంట్ కి ప్రమాదం కలిగించే లక్షణాలు లేవు, భయపడద్దు అని ముగించారు

https://timesofindia.indiatimes.com/life-style/health-fitness/health-news/coronavirus-14-omicron-symptoms-ranked-from-most-to-least-prevalent/photostory/88973282.cms


పై లింక్ లో వార్త నెట్ లో రెండు గంటలు మాత్రమే ఉంది. ఏం? ఇది సంచలనం కలిగించేది కాదు, అక్కడ వంద, ఇక్కడ వెయ్యిమందికి వచ్చిందని భయపెట్టేది కాదు, అందుకీ వార్త నిలబడలేదు. ఇటువంటి ధైర్యం కలిగించేవార్తలని ఎందుకు ఉంచుతారూ?

ఒమిక్రాన్-1(ఇది జరుగుతున్న కథ.)



 ఒమిక్రాన్-1

బాబాయ్! వారం కితం రాజస్థాన్ వెళ్ళాను, ఆఫీస్ పని మీద, అక్కడ పెద్దాఫీసర్లనే కలిసేను, చాలా చోట్లు తిరిగాను. తిరిగి ఫ్లయిట్ లో వస్తుంటే, ఇబ్బంది అనిపించింది. ఇంటి కొచ్చేటప్పటికి నూట రెండు డిగ్రీల జ్వరం, కొద్దిగా తలనొప్పి.మాత్ర ఒకటి వేసుకుని పడుకున్నా! తెల్లారి డాక్టర్ దగ్గర కెళ్ళా. ఆయన చూసి, సాంపుల్ టెస్ట్ కి పంపుతూ, మందులిచ్చి, ఇంటి దగ్గరే ”హోం ఐసొలేషన్” లొ ఉండండని కాంటాక్ట్ నంబరిచ్చి, వెళ్ళమన్నారు. ఇంటికొచ్చాను.సాయంత్రానికి జ్వరం తగ్గిపోయింది, కొంచం తలనొప్పి ఉంది. మర్నాడు ఉదయం డాక్టర్ ఫోన్ చేసి కోవిడ్ సోకింది,”హోం ఐసోలేషన్” లో ఉండండి. ఏం భయం లేదు, మధ్యాహ్నానికి కిట్ పంపుతాను, దాని ప్రకారం మందులేసుకోండి అన్నారు. ఒక్కసారి కంగారు పడ్డా, తమాయించుకున్నా! వారమూ గడిచింది, మందులూ ఐపోయాయి, రెండో రోజునుంచే బాధలేం లేవు. వారం తరవాత మళ్ళీ టెస్ట్ కి వెళ్ళా!డాక్టర్ చెక్ అప్ చేశారు,సాంపిల్ తీసుసుకున్నారు.. మర్నాడు చెబుతామన్నారు, రిజల్ట్. మరునాడు ఫోన్ చేసి ఇంకా పాసిటివ్ ”హోం ఐసోలేషన్”కొనసాగించమన్నారు.పని పాటూ లేక తిని కూచోడం చికాగ్గా ఉంది బాబాయ్ అని ముగించాడు.

మూడో రోజు నాకీ కబురు చెప్పగానే డీలా పడిపోయా, కంగారు పడ్డా కూడా! తమాయించుకున్నా! కంగారు పడకు, భయం లేదు,మాస్క్ వాడు, బయట తిరగద్దు, మందులేసుకో, చెప్పినట్టు, తుష్టుగా భోజనం చెయ్యి. నిద్రపో!, అర్ధ రాత్రి దాకా మేలుకోకు. అని జాగరతలు చెప్పా!
ఇది నా మాటల్లో ఒక్క సారిగా రాసేనుగాని ఇది సంఘటన క్రమం,రోజూ అనుసరిస్తూ వచ్చినది.నిద్ర పట్టటం లేదు, ఇది నేటి వారికున్న పెద్ద సమస్య, ధ్యానం చేయండి, ఊపిరి పీల్చి వదిలే వ్యాయామమ్ చేయండి, యోగా చేయండి, చివరగా డాక్టర్ సలహా మీద మాత్ర వేసుకోండి.ముందుగా బుర్రలోచి భయం తొలగించండి. ఇది జరుగుతున్న కథ.

ఇలా చెప్పా! ఒకప్పుడు గానుగెద్దు జీవితం, వారాంతపు శలవు లేదు, రోజులో ఎనిమిది గంటలు పని చేయాలి, ఎప్పుడో నిసబు లేదు. ఇలా ఉద్యోగం చేయడం చాలా బాధగా ఉండేది, ఎక్కడికి వెళ్ళడానికి లేదు, ఊరు దాటితే కబురు చెప్పి కదాలాలి, నేటి కాలం లో ఇది చెబితే నమ్మకపోవచ్చు కూడా. ఈ ఇబ్బంది నుంచి తప్పించుకోడానికి మాకున్న ఒక్కటే ఒక్క మార్గం డాక్టర్ సర్టిఫికటుతో శలవు.ఎక్కువ రోజులు శలవు పెడితే ఇలా సెకండ్ మెడికల్ ఒపీనియన్ అని పెద్ద డాక్టర్ల కమిటీకి పంపేవారు. ఒక్కొకప్పుడు అక్కడికి వెళేవాళ్ళం. డాక్టర్లు బాగున్నావుగా ఏంటి సంగతంటే నిజం చెప్పేసేవాళ్ళం. ఆప్పుడు డాక్టర్లు మరో పది రోజులు ఇతనికి శలవు కావాలని,రోగం తగ్గలేదని, రాసిచ్చేవారు. ఇది యాజమాన్యానికి ఇబ్బందిగా ఉండేది. తరవాత కాలంలో ఇలా పంపడం మానేసి, బాగుంటే వచ్చి డ్యూటీ లో చేరమని కబురంపేవారు. ఇప్పుడు ప్రభుత్వమే నీవు ఇంటి దగ్గరుండమంటే ఎందుకు ఇబ్బంది పడ్తావని చెప్పేను.




17, జనవరి 2022, సోమవారం

పండగనాటి ముగ్గు ముచ్చట

పండగనాటి ముగ్గు ముచ్చట


Photo courtesy :whats app

 పండగ రోజు
అందమైనట్టి
అంచ ముగ్గేస్తి
కరుణించవా
వరుణదేవా?

నా పని నేను చేశా! గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అని వదిలేయలేదు! నా ప్రయత్నం నేను చేశా! ఆ పై ఫలితమివ్వడం నీ వంతు. ”కర్తవ్యము నా వంతు  కాపాడుట నీ వంతు” భారతీయ తత్త్వం మాటలో, చేతలో ఎంత ఇంకింది ప్రజల్లో, ఇదీ సంస్కృతి అంటే. 
తల్లీ నీకు వందనం
శ్రీ మాత్రేనమః

13, జనవరి 2022, గురువారం

పండగ -వయసు ముచ్చట్లు

 పండగ-వయసు ముచ్చట్లు 


పెళ్ళయిన మొదటి సంవత్సరం, పెద్ద పండగకి పిలవడానికి మామగారొచ్చాడు. పండక్కి తీసుకెళ్తా రమ్మన్నాడు. మీ అమ్మాయిని తీసుకెళ్ళండి, నేను తరవాతొస్తానన్నా! ఏమనుకుందోగాని ఇల్లాలు, ఇద్దరం కలిసివస్తాం,అనిజెప్పి తండ్రిని పంపేసింది. భోగి ముందురోజు ఉదయం డ్యూటీ చేసి సాయంత్రం బయల్దేరి ఇరవై కిలో మీటర్లు దూరం కోసం రెండు గంటలు ప్రయాణం కోసం వెచ్చించి కడియం చేరేం.గుమ్మంలో చేరగానే ఎదురింటి పిన్నిగారు "ఏమే పాపా! ఇదేనా రావడం? "  అంటూ పలకరించి, అదే వరసని "అల్లుడూ బాగున్నావా?"  అడిగింది. ఆవిడ చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రిగారి రెండో కోడలు,దుర్గేశ్వర శాస్త్రి గారి భార్య, ఇంకేంఉంది ఇల్లాలు పిన్ని చేతుల్లో వాలిపోయింది, అయస్కాంతానికి అతుక్కున్న ఇనప ముక్కలా. ఎంతకీ ఇనపముక్క ఊడి బయటకు రాదు. దగ్గేను, సకిలించేను ఉపయోగం లేకపోయింది. ఇనపముక్క ఊడలేదు.ఏం చేయాలి? లోపలికెళితే ఒక్కడివే వచ్చావు మా అమ్మాయేదీ? అంటే, అలాకాక మా అమ్మాయేదీ అంటే ఏం చెప్పాలి? తోచక నిలబడిపోయా! ఈలోగా అత్తగారు బయటికొచ్చి కూతుర్ని పిన్నమ్మ చేతుల్లో చూసి, నన్ను, నువ్వు లోపలికి రావయ్యా! అదొస్తుందిలే అంది. అమ్మయ్య ఒక గండం గడిచిందని లోపలికెళ్ళా! 


ఇల్లాలు ఇంట్లోకెప్పుడొచ్చిందో! మళ్ళీ కనపళ్ళా! భోజనాల దగ్గర మెరిసింది, కంచాలెత్తుతూ.ఆ తరవాతెప్పుడో గదిలోకి చేరి నిద్దరోతున్నారా? అడిగింది. లేదన్నా పొడిగా.ఈ మాత్రానికే అంత కోపమా అంది. అబ్బే కోపమేం లేదే అన్నా!పేదవాని కోపము పెదవికి చేటు అన్నది గుర్తు చేసుకుని. నాకు తెలవదేంటీ? అని సాగదీసింది. మొత్తానికి తెల్లారింది, దోమలు కుట్టి చంపుతూంటే, నిద్దరట్టక.


ఉదయమే భోగి తలంటాలన్నారు.వదినగారు తనూ కలిసి,తోడల్లుడికి నాకూ. కాదనలేక పీటమీద కూచున్నా. తలకి వంటాముదం రాసింది, వదినగారు, తబలాలా వాయించేసింది. ఆ తరవాత ఇల్లాలు ఒంటినిండా నువ్వుల నూనె రాసి, నలుగు పిండి రాసింది. నలుగెడతామన్నారు.అమ్మో! అని పరుగెట్టేను. తోడల్లుడు చక్కహా నలుగెట్టించుకున్నాడు. ఏం? అడిగింది ఇల్లాలు. నలుగు పిండి ఎండిపోయింది. నలిస్తే రాదుగాని ఒంటినున్న వెండ్రుకల్లో చిక్కుకుందేమో, నలుగెడితే అంతకంటే నరకం ఉండదని చెబితే ఆపింది. అమ్మయ్య మరో గండం గడిచిందనుకున్నా. ఈ లోగా కుంకుడుకాయ పులుసోసి నా తలని అప్పా,చెల్లీ చెడుగుడు ఆడుకుని, విడతల మీద, మొత్తానికి తలకి రాసిన జిడ్డు వదిల్చేరు. కుంకుడు కాయ పులుసుతో సున్ని పిండి కలిపి ఒళ్ళు రుద్దుకుని స్నానం అయిందనిపించుకుని బయట పడ్డా.  


కూడా, కుట్టించుకుని తెచ్చుకున్న కొత్తబట్టలు కట్టుకున్నా. మావగారికి,  అత్తగారికి దణ్ణం పెడితే మావగారు ఒక ఇరవై రూపాయలు పండగ బహుమతి ఇచ్చాడు, వాటిని ఇల్లాలు ఊడలాకుంది. నవ్వుకున్నాము. పన్నెండయింది, భోజనాలన్నారు, కానిచ్చి లేచేం. వెళ్తానన్నా! అదేం మాట అన్నారంతా! రేపు పండగ కదా అన్నారు కూడా కోరస్ గా. నేను సమాధానం చెప్పేలోగా ఇల్లాలు, "చిన్నంటి  కెళ్ళాలి లే! లేకపోతే ఆవిడకి కోపం వస్తుందంది". ఒక్క సారి నిశ్శబ్డం అయిపోయింది.అంతే కాదు నేనేదో ఘోరం , నేరం చేసినట్టు చూశారందరూ, చాలా ఇబ్బందికరంగా ఉంది, నాకు మాత్రం. ఈలోగా ఇల్లాలే కలగజేసుకుని ''సాయంత్రం నాలుక్కి డ్యూటీ'' అని చెప్పింది. అంతా ఒక్క సారి భళ్ళున నవ్వేసేరు.ఇదేం ఉద్యోగం! పండక్కి కూడా శలవు లేదూ అని బుగ్గలు నొక్కుకున్నారు ఇరుగూ పొరుగూ! పెళ్ళికే,ఒకరోజు రాత్రి  డ్యూటీ   చేసి మరునాడు అంటే పెళ్ళి రోజు వారపు శలవు తీసుకుని, పెళ్ళైన మర్నాడు సాయంత్రం ఉద్యోగానికెళ్ళిన ఘనత కలవాడు మా అయన చెప్పింది ఇల్లాలు.   అటువంటి ఉద్యోగం కూడా ఉంటుందని తెలియని రోజులు, ఎప్పుడూ అరవై ఏళ్ళకితం   మాట.  


7, జనవరి 2022, శుక్రవారం

అభ్యాసము కూసు విద్య!

 


 అభ్యాసము కూసు విద్య



అభ్యాసము కూసు విద్య, ఎంత చెట్టుకు అంత గాలి, సంతోషము సగము బలము ఇలా ప్రతి క్లాసులో గోడలమీద రాసి ఉండేవి. అక్షరాలు కూడబలుక్కుని చదివే రోజుల్నించి బడి వదలి పోయేదాకా రోజూ బళ్ళో క్లాసులోకి రాగానే కనపడేవి, ఇవి నెమ్మదిగా ఇంకిపోయాయి మనసులో...ఇప్పుడు బడిలో ఇవి రాస్తున్నారా?..

అభ్యాసం గురించి తాత మాట, ఏంటో ఈయన్ని తాతగారంటే దూరం పెట్టినట్టు ఉంటుంది, అందుకే ఆప్యాయంగా తాతా అంటాను, చిన్న బుచ్చటం కాదు, చనువు సుమా...
అనగననగ రాగ మతిశయిల్లుచునుండు
తినగతినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినుర వేమ.
చిన్న మాటలో చెప్పేసేడు కదా!
గువ్వల చెన్నడు 
కుల విద్యకు సాటిరావు గువ్వలచెన్నా!
ఏం ఎందుకనీ? ఎందుకంటే కుల విద్యని తల్లి తండ్రులు తాత,అమ్మమ్మలు, తాత, మామ్మలు,ఆచరించగా,చూస్తూ పెరుగుతాం, ఇదీ అభ్యాసమే.

వీడియోలో అమ్మాయి అన్ని మెలికలు తిరగ్గలిగిందంటే ఎంత సాధన చేసి ఉంటుంది?

ఇలాగే యోగా చిన్నప్పుడు చేశా!పదిహేడేళ్ళ దాకా ఆ తరవాత పొట్టకూటికి సాధనలన్నీ వదిలేశా! అందునా రాత్రి పగలు నిసబు లేని ఉద్యోగం దొరికింది.పెళ్ళైన తరవాత ఇల్లాలు మీ పెద్ద పెళ్ళాం పిలుస్తోంది, వెళ్ళండి, వెళ్ళండి అనేది, ఎంతకాలం వదిలేశా? దగ్గరగా ఏభై ఏళ్ళు. మొన్న కరోనాలో మళ్ళీ గురువు దగ్గర నేర్చుకున్నా ఓనమాలు. సాధన చేస్తూ వచ్చా, రెండేళ్ళనుంచి, కాని ఇదిగో ఒక నలభై రోజుల్నించి మానేయాల్సి వచ్చింది. మళ్ళీ కొత్తైపోయింది. కాలు చెయ్యి సాగటం కష్టంగా ఉంది, సాధన చెయ్యాలి. 

యోగా చేసేవారు ప్రాణాయామం కూడా చేస్తారు సాధారణంగా, నాకు తోచిన చిన్న మాట.ఇందులో ఊపిరి తిత్తులలోకి గాలి పీల్చుకుని వదలిపెడతాం. ఎంత ఎక్కువ సేపు ఊపిరి తీసుకుంటే అంత బాగుంటుందనుకుంటాం. కాని కాదు. మామూలుగానే ఊపిరి పీల్చాలి, కాని నెమ్మదిగా ఊపిరి వదలిపెట్టాలి, దీనికి ఎక్కువకాలం తీసుకోవాలి, ఎంత ఎక్కువ సేపు ఊపిరి తిత్తులను ఖాళీ చేస్తామో అంత గాలీ మనం తీసుకుంటాం తెలియకనే. అందు చేత సాధన చేయవలసినది ఊపిరి పీల్చడం కాదు,ఎక్కువ సేపు ఊపిరి తిత్తులను ఖాళీ చేయడమని నా నమ్మకం.ఆ పై మీ ఇష్టం..



5, జనవరి 2022, బుధవారం

కాటరాక్ట్ ఆపరేషన్.

 కాటరాక్ట్ ఆపరేషన్


సర్వేంద్రియాణం నయనం ప్రధానం. ఇది పెద్దలమాట. కాని బాగా అశ్రద్ధ చేయబడేదీ కన్నే! 


నేటి రోజుల్లో ముఫై ఏళ్ళకే సుగర్ వ్యాధి కలుగుతోంది, దీని వల్ల వచ్చే అవకరాల్లో కాటరాక్ట్ ఒకటి. ఇది నెమ్మదిగా సంవత్సరాల తరబడి పెరుగుతుంది, నెమ్మదిగా దృష్టిని అడ్డుకుంటుంది. ఒకసారి కాటరాక్ట్ అని తేలితే ఆపరేషన్ తప్పదు, నేడో !రేపో!నాకు ఆరేళ్ళగా ఉన్నట్టు తెలిసింది,కాని అశ్రద్ధ చేసేను, కారణాలనేకం, అందులో భయం ముఖ్యమైనది.

నా అనుభవాలు రాస్తున్నా!

ఒకసారి ఆపరేషన్ కి నిర్ణయించుకున్న తరవాత డాక్టర్ గారితో తారీకు నిర్ణయం చేసుకున్నా! నిర్ణయమైన తారీకుకు ముందు నాలుగు రోజులు కంటిలో మందు చుక్కలు రోజూ నాలుగు సార్లు వేసుకోమన్నారు. రోజుకొక కాప్శూల్ వేసుకుని నాలుగో రోజు మూడు గంటలకి రమ్మన్నారు. అలాచేసి నాలుగో రోజు మధ్యాహ్నం మూడుకు చేరేం.ఒక రూం ఇచ్చారు. విశ్రాంతి తీసుకున్నా, ఆ తరవాత బి.పి,సుగర్,కారోనా టెస్టులయ్యాయి. వాటి ఫలితాలు చూసి కంటికి పరీక్ష చేసి అన్నీ బాగున్నాయి రేపు ఉదయం ఆరుగంటలి రండి, రోజూ వేసుకునే మందులు సమయం ప్రకారం వేసుకోండి, టిఫిన్ సమయానికి చేయండి. అని చెప్పి ఇంటి కెళ్ళి మరునాడు ఉదయమే రమ్మన్నారు.(లోకల్ కనక) ఆపరేషన్ లో ఉపయోగించే ఐ.ఒ.ఎల్ కొనమని రాసిచ్చారు, దాని ఖరీదు పదివేలు,అక్కడే పక్కన కొన్నాం.


మరునాడు ఉదయమే స్నానం అన్నీ పూర్తి చేసుకుని రోజువారీ మందులేసుని టిఫిన్ చేసి ఉదయం ఆరుకి రూంలో చేరాం.ఏడుకి కంటిలో మందు వేసింది, నర్సు.ఎనిమిది తరవాత ఆపరేషన్ చెప్పింది.కంటి రెప్పలపై ఉన్న వెంట్రుకలు తొలగించింది.ఎనిమిదికి ఆపరేషన్ థియేటర్ ఎదురుగా ఉన్న సీనియర్ సర్జన్ రూంలో కూచో బెట్టేరు. నాకు ముందు ఒకరున్నారు.ఎనిమిదికి సీనియర్ సర్జన్ మళ్ళీ టెస్ట్ చేశారు, ఒకె ముందుకెళ్ళమంటే నా ముందున్నతన్ని ఆపరేషన్ కి తీసుకెళ్ళారు.

 ఆ తరవాత పది నిమిషాల్లో నాకు పిలుపొచ్చింది. ఒక నర్స్ నన్ను డిసానిజేషన్ రూంలోంచి నడిపించి తీసుకెళ్ళింది. మరో సానిటజెడ్ వరండాలో పీట మీద కూచోమంది.నాకు రెండు మాత్రలిచ్చి వేసుకోమంది. వేసుకున్నా! ఐదు నిమిషాల్లో కొద్దిగా మత్తనిపించింది,(ముందుగానే నాకు ఆపరేషన్ భయం ఎక్కువని, ఆతృతరోగం ఉందని, వినపడదని,రాసిచ్చి విన్నవించుకున్నా,   డాక్టర్ గారికి.)

చిత్రంగా నాలో భయం,ఆలోచన ఏమీలేని శూన్యస్థితి ఏర్పడింది.కుడికాలుపెట్టి థియేటర్ లో అడుగుపెట్టా. నన్ను నర్స్ ఆపరేషన్ టేబుల్ దగ్గరకి నడిపించింది. టేబుల్ మీద పడుకోమన్నారు. టేబుల్ మీద బుట్టలా ఉన్నచోట తలపెట్టి పడుకున్నా. కంటిలో మందు చుక్కలేశారు, కళ్ళమీద గుడ్డలాటిది వేశారు, కళ్ళు కనపడుతున్నాయి.కంటి పైరెప్ప కింది రెప్పల దగ్గర నొప్పిగా అనిపించి అబ్బా అన్నా! చేతులు పక్కన పెట్టుకోండన్నారు,ఈ లోగా కంటి మీద లేజర్ ఫోకస్ చేశారు, ఒక బొమ్మ కనపడింది,(ఈ బొమ్మ కితంరోజు సాయంత్రం టెస్ట్ చేసినప్పుడు కనపడింది)మరుక్షణం లేజర్ తొలగించారు, ఏమీ కనపడలేదు, మరుక్షణం ఏదో పెట్టినట్టయింది, కన్ను కనపడింది.మందు చుక్కలేశారు. దూది ఉండ కంటి మీద పెట్టి టేప్ వేశారు నిలువుగా అడ్డంగా కదలకుండా.( దీనికి తీసుకున్న సమయం పది నిమిషాల లోపు ఉండి ఉంటుందని ఊహించా)కొంచం పైరెప్ప కింది రెప్పల దగ్గర నొప్పి ఉంది. లేవమన్నారు, నర్స్ నన్ను థియేటర్ నుంచి నడిపించి తీసుకొచ్చి మా వాళ్ళకి  అప్పజెప్పింది.

నన్ను రూం కి తీసుకెళ్ళి పడుకోమన్నారు. టైం ఎంతన్నా! తొమ్మిది దాటిందన్నారు. మరి కాసేపటిలో ఇంటికెళ్ళిపోమన్నారు, మర్నాడు ఉదయం రమ్మన్నారు.   విశ్రాంతి తీసుకోమన్నారు, రాత్రికి నిద్ర పట్టదేమో అని సంశయం చెప్పా,నిద్ర పడుతుందని చెప్పేరు.లిఫ్ట్ లో కిందకి తీసుకొచ్చారు. ఆటోలో ఇంటికొచ్చాం! పదయింది. ఆటో వాళ్ళకి అలవాటనుకుంటా ఎవరూ చెప్పకనే నెమ్మదిగా గతుకుల రోడ్ లో తీసుకొచ్చాడు.ఇంట్లో విశ్రాంతి తీసుకున్నా, మామూలుగా భోజనం చేసాను.సాయంత్రానికి కంటి నొప్పీ తగ్గింది, హాయిగా నిద్ర పట్టింది.

 మర్నాడు ఉదయం ముఖాన్ని తడి దూదితో తుడుచుకున్నా! స్నానం మామూలుగా చేసాను.హాస్పిటల్ కి చేరాం. నాలాటివారు మరో పది మంది, ఒక హాల్ లో కూచున్నాం,నర్స్ లు కంటి కట్టు తీసేశారు.కంట్లో మందు చుక్కలేశారు, కన్ను కనపడుతోంది.కళ్ళు మూసుకు కూచున్నా! ఈ లోగా నల్లకళ్ళజోడిచ్చి పెట్టుకుని చూడచ్చన్నారు. నల్ల కళ్ళజోడులోంచి లోకం అందంగా కనపడింది. 

ఆనందమానందమాయె!మరి ఆశల నందనమాయె! మాటలు చాలని చోట పాటగ మారిన మాయే! 

డాక్టర్ పరీక్ష చేశారు, బాగుందన్నారు. ఈ కింది జాగ్రత్తలూ తీసుకుంటూ నల్లకళ్ళజోడు వాడుతూ ఇరవైరోజుల తర్వాత రమ్మన్నారు.

నాకు తోచినది ముఖ్యంగా కంటికి శ్రమ వద్దు.ఇన్ఫెక్షన్ కి దూరంగాఉండాలి.ఎక్కువ వెలుగు చూడద్దు.హాస్పిటల్ నుంచి ఇంటి కొచ్చాకా మొదటిరోజు ఇంట్లో కూడా నల్ల కళ్ళజోడు పెట్టుకున్నా, మర్నాటి నుంచి బయటికెళ్ళినప్పుడు మాత్రం నల్ల కళ్ళజోడు వాడేను.మొదటి మూడు రోజులూ దూదితో కళ్ళు ముఖం శుభ్రం చేసున్నా. నాలుగో రోజునుంచి చల్లని నీళ్ళతో ముఖం కడుక్కున్నా. ఇరవైరోజుల తరవాత షాంపూతో తలంటుకున్నా! క్షవరం చేయించుకున్నా. గడ్డం మామూలుగానే చేసుకున్నా. టివి.ఫోన్ వగైరాలన్నీ ఇరవై రోజులు వదిలేశా.మొదటి పది రోజులు బాగుందిగాని తరవాత కాలం గడవడం కష్టం అనిపించింది. ధ్యానం చేయడం నేర్చుకున్నా. కాలం గడచిపోయింది, తెలియకనే.ఇక అవసరమైన మైల్స్,మెసేజిలకి రోజూ మనవరాలు సాయంత్రం ఒక గంట సాయపడేది. సమాధానాలివ్వవలసిన చోట నేను చెప్పినట్టు టైప్ చేసి పంపేది, అలా గడిపేశా.

 ఇరవైరోజుల తరవాత హాస్పిటల్ కి వెళ్ళా. రెండు కళ్ళు టెస్ట్ చేశారు. కళ్ళ జోడు రాసిచ్చారు.ఇరవై రోజుల తరవాత వెళ్ళినపుడు ఒక చుక్కల మందు రాసిచ్చారు. అది రోజు ఆపరేషన్ ఐన కంటిలో ఒక చుక్క ఉదయం సాయంత్రం వేయమన్నారు, అది వచ్చినంత కాలం,  వేసుకుంటున్నా! రేపో, మాపో ఐపోతుంది. మూడో రోజు కళ్ళ జోడుతో జీవితం గాటిలో పడింది.రెండు కళ్ళకి జోడి కుదరడానికి కొంత కాలం పడుతుంది. ఆపరేషన్ కన్ను చురుగ్గాను, అప్పటిదాక పని చేసిన కన్ను మందంగా ఉంటాయి.మొదటి మూడు రోజులు నడక మానేశా. ఆ తరవాత నడిచాను. ఆపరేషన్ ఐన రోజునుంచి యోగా మానేశాను. ఆరు వారాల తరవాత మొదలెట్టాను. 

Total cost of operation.Rs24,500.

I.O.L 10,000.

Doctor fees 10,000

Medicines 2,200

Transport 3days 300

karona test 500

Spectacles 1500


డాక్టర్ చెప్పిన జాగ్రత్తలు. 



3, జనవరి 2022, సోమవారం

మీ నాన్నగారున్నారా?

 మీ నాన్నగారున్నారా?

మీ నాన్నగారున్నారా , నీ అమ్మ మొగుడుగారున్నారా అన్నవి రెండూ తెనుగు వాక్యాలే! రెండిటి అర్ధమూ ఒకటే, కాని మొదటి వాక్యమే వాడతాం, ఏం? అదే సభ్యత, సంస్కారం అన్నారు పెద్దలు.కొంత మందికి సభ్యత సంస్కారం పుట్టుకతోనే వస్తాయి, కొంతమంది లోకం చూసి నేర్చుకుంటారు. కొందరికి నేర్పినా రావు, ఇదే లోకంఅంటే!


ఒక పల్లెలో పుట్టాను, అక్కడే చదువుకున్నా!మరో పల్లె కి దత్తత వచ్చా!నాకు ఊరు కొత్త, మనుషులూ కొత్తే!మా ఇంటికి పక్కనే ఒక హొటలు, తెల్లారుగట్ల నాలుగుకి నమో వెంకటేశా పాటతో మొదలయ్యేదా హొటలు. నాలుక్కే జనంతోకిటకిటలాడిపోయేది.లోపల కాళీ లేకపోతే పక్కనే ఉన్న మా ఇంటి అరుగు హోటల్ కి వచ్చిన వాళ్ళకి విశ్రామ స్థానం.ఉదయం ఏడుగంటలకి స్నానం పూర్తి చేసుకుని వీధరుగు మీద కూచుని పాత ఇంగ్లీషు పేపరు చూస్తూ, కొత్త పేపర్ కోసం ఎదురు చూస్తూ గడిపేవాడిని. 


ఇక ఆ అరుగు మీద జనం లోకం లో ముచ్చట్లు,రాజకీయాలు, పెళ్ళిళ్ళు, ముండ తగవులు ఇలా అన్నీ దొర్లిపోతుండేవి. వూళ్ళో విషయాలన్నీ నాకు చేరుతుండేవి. నేనే సంభాషణలోనూ పాల్గొనే వాడిని కాదు.జనాల మాటలు వింటూ, జనాలని పరిశీలిస్తూ  ఉండేవాడిని.


మాది మెయిన్ రోడ్డు మీద ఉన్న ఇల్లు, ఆ వీధి చివర ఒకాయన ఉండేవారు. ఆయన తో సైకిలు,గొడుగూ ఎప్పుడూ ఉండేవి. అవి రెండూ ఆయన ట్రేడ్ మార్కు. వారి ఇంటి పేరు చల్లా! ఆయన నోరు విప్పితే చాలు బూతులే వచ్చేవి, తల్లి,పిల్ల, పిన్న,పెద్ద,ఆడ, మగ, కూతురు,కోడలు ఇలా తేడాలేం లేవు.ఎవరితోనైనా బూతులే మాటాడేవాడు, అదీ పెద్ద గొంతుతో. ఆయన మాత్రం మా అరుగు మీద చేరితే, మరెవరూ కూచునేవారు కాదు, లేకపోతే జనంతో కిటకిటలాడుతూ ఉండేవి, మా అరుగులు. ఈయనొస్తే నేను పని ఉన్నటు లోపలికి పోయేవాడిని. ఈయన్ని అందరూ ఇంటి పేరుకి ఉకారం చేర్చి పలికేవారు.

ఒక పెద్దరైతు ఏభై ఏళ్ళవాడు, పొలం వెళ్తూ పలకరించేవాడు.ఏం బాబా అనేవాడు. ఈయన ఆడవారిని అమ్మా అనీ,పెద్దవారిని తల్లీ అనీ, మగవారిని అయ్యా అనే సంబోధించేవారు.వీరిని అందరూ పెదకాపుగారనేవారు, ఏభై ఎకరాల ఆసామీ వ్యవసాయం చేసేవారు. ఆయన కాపుకాదు, కాని ఎప్పుడూ ఎవరినీ పెదనాయుడనిగాని, పెదచౌదరనిగాని పిలవమని అనలేదు.ఒక్కో రోజు వీరితో కలసి పొలం వెళ్ళే వాడిని. ఆయన కార్యక్షేత్రంలో ఆయనను గమనించేవాడిని, మాట తీరు వ్యవహార శైలి వగైరా.ఆయనెప్పుడూ కోపంలో కూడా, సంయమనం కోల్పోయింది చూడలేదు. 


ఆ తరవాత ఒక సెట్టిగారి దగ్గర గుమాస్తాగా చేరా! ఆయన ఎవరినైనా ఏమండి అనే సంబోధించేవారు.ఆ తరవాత ఒక బ్రాకెట్ కంపెనీలో పని చేశా! ప్రతి చోట మనుషుల్ని చదవడం నేర్చుకున్నా! ఇదంతా  రెండు సంవత్సరాల వ్యవధిలో. మనుషుల్ని  చదవడం నేర్చుకోవాలి, అదంత తేలిగ్గాదు.