Monday 3 January 2022

మీ నాన్నగారున్నారా?

 మీ నాన్నగారున్నారా?

మీ నాన్నగారున్నారా , నీ అమ్మ మొగుడుగారున్నారా అన్నవి రెండూ తెనుగు వాక్యాలే! రెండిటి అర్ధమూ ఒకటే, కాని మొదటి వాక్యమే వాడతాం, ఏం? అదే సభ్యత, సంస్కారం అన్నారు పెద్దలు.కొంత మందికి సభ్యత సంస్కారం పుట్టుకతోనే వస్తాయి, కొంతమంది లోకం చూసి నేర్చుకుంటారు. కొందరికి నేర్పినా రావు, ఇదే లోకంఅంటే!


ఒక పల్లెలో పుట్టాను, అక్కడే చదువుకున్నా!మరో పల్లె కి దత్తత వచ్చా!నాకు ఊరు కొత్త, మనుషులూ కొత్తే!మా ఇంటికి పక్కనే ఒక హొటలు, తెల్లారుగట్ల నాలుగుకి నమో వెంకటేశా పాటతో మొదలయ్యేదా హొటలు. నాలుక్కే జనంతోకిటకిటలాడిపోయేది.లోపల కాళీ లేకపోతే పక్కనే ఉన్న మా ఇంటి అరుగు హోటల్ కి వచ్చిన వాళ్ళకి విశ్రామ స్థానం.ఉదయం ఏడుగంటలకి స్నానం పూర్తి చేసుకుని వీధరుగు మీద కూచుని పాత ఇంగ్లీషు పేపరు చూస్తూ, కొత్త పేపర్ కోసం ఎదురు చూస్తూ గడిపేవాడిని. 


ఇక ఆ అరుగు మీద జనం లోకం లో ముచ్చట్లు,రాజకీయాలు, పెళ్ళిళ్ళు, ముండ తగవులు ఇలా అన్నీ దొర్లిపోతుండేవి. వూళ్ళో విషయాలన్నీ నాకు చేరుతుండేవి. నేనే సంభాషణలోనూ పాల్గొనే వాడిని కాదు.జనాల మాటలు వింటూ, జనాలని పరిశీలిస్తూ  ఉండేవాడిని.


మాది మెయిన్ రోడ్డు మీద ఉన్న ఇల్లు, ఆ వీధి చివర ఒకాయన ఉండేవారు. ఆయన తో సైకిలు,గొడుగూ ఎప్పుడూ ఉండేవి. అవి రెండూ ఆయన ట్రేడ్ మార్కు. వారి ఇంటి పేరు చల్లా! ఆయన నోరు విప్పితే చాలు బూతులే వచ్చేవి, తల్లి,పిల్ల, పిన్న,పెద్ద,ఆడ, మగ, కూతురు,కోడలు ఇలా తేడాలేం లేవు.ఎవరితోనైనా బూతులే మాటాడేవాడు, అదీ పెద్ద గొంతుతో. ఆయన మాత్రం మా అరుగు మీద చేరితే, మరెవరూ కూచునేవారు కాదు, లేకపోతే జనంతో కిటకిటలాడుతూ ఉండేవి, మా అరుగులు. ఈయనొస్తే నేను పని ఉన్నటు లోపలికి పోయేవాడిని. ఈయన్ని అందరూ ఇంటి పేరుకి ఉకారం చేర్చి పలికేవారు.

ఒక పెద్దరైతు ఏభై ఏళ్ళవాడు, పొలం వెళ్తూ పలకరించేవాడు.ఏం బాబా అనేవాడు. ఈయన ఆడవారిని అమ్మా అనీ,పెద్దవారిని తల్లీ అనీ, మగవారిని అయ్యా అనే సంబోధించేవారు.వీరిని అందరూ పెదకాపుగారనేవారు, ఏభై ఎకరాల ఆసామీ వ్యవసాయం చేసేవారు. ఆయన కాపుకాదు, కాని ఎప్పుడూ ఎవరినీ పెదనాయుడనిగాని, పెదచౌదరనిగాని పిలవమని అనలేదు.ఒక్కో రోజు వీరితో కలసి పొలం వెళ్ళే వాడిని. ఆయన కార్యక్షేత్రంలో ఆయనను గమనించేవాడిని, మాట తీరు వ్యవహార శైలి వగైరా.ఆయనెప్పుడూ కోపంలో కూడా, సంయమనం కోల్పోయింది చూడలేదు. 


ఆ తరవాత ఒక సెట్టిగారి దగ్గర గుమాస్తాగా చేరా! ఆయన ఎవరినైనా ఏమండి అనే సంబోధించేవారు.ఆ తరవాత ఒక బ్రాకెట్ కంపెనీలో పని చేశా! ప్రతి చోట మనుషుల్ని చదవడం నేర్చుకున్నా! ఇదంతా  రెండు సంవత్సరాల వ్యవధిలో. మనుషుల్ని  చదవడం నేర్చుకోవాలి, అదంత తేలిగ్గాదు.



13 comments:

  1. //“అదంత తేలిగ్గాదు” // …. నిజం. కానీ మీరా రెండు సంవత్సరాల అనుభవాలతో బాగానే నేర్చుకున్నారు. 

    మీరన్నది నిజం. కొంత మందికి సంస్కారం నేర్పినా అలవడదు. సంస్కారవంతంగా ఉండడానికి చదువు. హోదా, సంపద లతో సంబంధం లేదు. రాను రాను మరీ అధ్వాన్నమయిపోతోంది - మాటలో సంస్కారం లేదు, ప్రవర్తనలో సంస్కారం లేదు, వయసులో పెద్దవారన్న మర్యాద లేదు. ఈ తరం సంస్కార రాహిత్యం అవధులు దాటుతోంది. 

    ReplyDelete

  2. విన్నకోటవారు,
    ఆనాడు పరిచయమైనవారిలో ఈ పాత్రలు కొన్ని మాత్రమే!
    అందమైన మరీచికలు చేతికి అందినట్టే అనిపించాయి, అంతకంటే అందమైన పాకుడురాళ్ళూ ఆహ్వానాలు పలికాయి.వివేకం అనే సంస్కృతి భయం రూపంలో అడ్డేసింది.

    నిజమే నేడు మాటలో, పలుకులో,నడవడిలో సంస్కారం కనపట్టం లేదు, సంస్కారమా కాకరకాయ అన్నదే నేటి స్లోగన్ సార్!మనుషుల్ని అంచనా వేయడం అంత తేలికైన పనేం కాదు కదు సార్!

    ReplyDelete
  3. శర్మగారూ మీ అనుభవంలో మనుషుల ముఖ కవళికలని బట్టి వాళ్ళ ప్రవృతిని అంచెనా వెయ్యచ్చా ? ముఖం మనస్సుకి అద్ధం అంటారే అది నిజమేనా?

    ReplyDelete
    Replies
    1. లక్కరాజుగారు,
      చాలా చిన్నదిగా కనపడే పెద్ద ప్రశ్న సంధించారు. అజ్ఞానిని, సమాధానానికి సాహసిస్తున్నా. అజ్ఞానినా మయా దోషానషేషాన్..క్షమస్యత్వం...... శేషశైల శిఖామణే...చదువుకున్నవాడిని కాదు సుమా!అంతా అనుభవమే!సమాధానం పెద్దదిగా ఉంటుంది, మన్నించండి.

      నిత్యం మనతో కూడా నీడలా ఉండే భార్యను అంచనా వేయడం సాధ్యమా?ఆమె గురించి రూపం మనకు తెలియంది ఉండదు. కాని అంచనా పూర్తిగా వేయడం సాధ్యం కాదు.రూపం అంచనాకి ఒక అంచె మాత్రమే.

      మరో ఉదాహరణ.
      కావ్యం:రామాయణం
      ఘట్టం:సీతాన్వేషణ.
      స్థలం:సముద్రపు దక్షణ ఒడ్డు.
      కాలం:సుగ్రీవుడు, రామలక్షణులు, ఇతరులు కపి సేనతో విడిసి ఉన్న కాలం,సముద్ర తరణం గురించి ఆలోచిస్తున్న కాలం.
      సంఘటన:విభీషణుడు మంత్రిగణ సహితంగా ఆకాశం లో ఉండి, తాను విభీషణ్ణనీ, రావణుని తమ్ముడిననీ,రాముని శరణు కోరుతున్నాననీ చెప్పి, ఈ మాటలు రామునికి చెప్పమన్న సంఘటన.

      విభీషణుని ఆకాశంలో చూస్తూనే సుగ్రీవుడు హడావుడిగా రాముని దగ్గరకు పరుగెత్తి, శరణు ఇవ్వద్దూ అంటూ చెబుతాడు.అలా సమావేశం మొదలవుతుంది.ఇది తక్షణం తేల్చుకునే సమస్య.సమావేశంలో అందరూ తలో మాటా చెబుతారు, వారి వారి అభిప్రాయాలు.చివరగా హనుమ శరణు ఇవ్వడమే మంచిదంటూ కారణాలు వివరిస్తారు, యుక్తి యుక్తంగా. అందులో ఒక కారణం చెబుతూ రూపం నిర్మలంగా ఉంది.దుర్మార్గపు ఆలోచన ఉన్నవాడు, మోసగించాలనుకునేవాడు నిర్మలంగా ఉండలేదంటారు.అంటే హనుమ విభీషణుని అంచనా వేస్తూ ఆకారాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నారు.రూపం కూడా ఈ అంచనాలకి దోహద పడేదేకాని వేరుగా మాత్రం కాదు.

      ఈ ఘట్టాన్ని రామాయణం నుంచి ఒక సారి చదవవలసినదిగా విజ్ఞప్తి.
      స్వస్తి

      Delete
    2. శర్మ గారూ మంచి చమత్కారంగా కావలసిన సమాచారం ఇచ్చారు. థాంక్స్.
      మన పంచేంద్రియాల నుండీ సమాచారం సంకేతాల ద్వారా మనస్సుకి వెళ్లి నప్పుడు, వాటికి జవాబుగా తిరిగి పంపే సంకేతాలు కండరాలకు. అందుకనే మనము మాట్లాడకలుగుతున్నాము ముఖంలో వాటి చిహ్నాలు కనపడుతాయని నా అభిప్రాయం కూడా.

      Delete
    3. లక్కరాజుగారు,
      మీ మాట నిజం.
      మరో ఉదాహరణ

      కావ్యం:రామాయణం
      ఘట్టం: సీతాన్వేషణ
      స్థలం:ఋష్యమూక పర్వత ప్రాంతం
      కాలం:సుగ్రీవుడు వాలి భయంతో తిరుగుతున్న కాలం, రామ,లక్ష్మణులు సీత కోసం వెదుకుతూ కిష్కింథ ప్రాంతానికి వస్తున్న కాలం.
      సంఘటన: రామ,లక్ష్మణులను చూచి భయంతో సుగ్రీవుడు పరుగు పెడుతున్న సమయంలో హనుమ సుగ్రీవుని ఆపి ఆ వచ్చేవాళ్ళు మనకోసం రావటం లేదనిపిస్తూందంటే, నువు వెళ్ళి వాళ్ళతో మాటాడి రా అన్నాడు సుగ్రీవుడు, హనుమతో. అప్పుడు ఒక మాట చెబుతాడు, నువ్వు వారితో మాటాడేటపుడు, నీ ముఖం నా వైపు ఉండేలా నిలబడి మాటాడూ అని. హనుమ అలాగే చేస్తారు. ఎందుకు?సుగ్రీవునికి భయం,హనుమ మాటడుతుంటే పెదవుల కదలికతో హనుమ మాటాడేది తెలుసుకోవాలని సుగ్రీవుని కోరిక. ఇక హనుమ మాటాడతారు. ఆ తరవాత రాముడు లక్ష్మణునితో తమ్ముడూ! ఇతను మహా పండితుడు, మాటలో వ్యర్ధపదం ఒక్కటిలేదు, ఏ పదం మీద ఎంత ఒత్తి పలకాలో అంతే వత్తి పలికేడు,మాటాడేటప్పుడు కనులు కదపలేదు, కనుబొమలు కదల లేదు, ముఖంలో ఏ భావమూ కనపడలేదు,అని. దీనిని బట్టి తెలిసేది?దూత ఐన వాడు మనసులో భావం ముఖం మీద కనపరచకూడదనీ, ముఖం మీద భావాన్ని దాచచ్చనీ కదా!
      నా మాట, ఒకరిని అంచనా వేయడానికి ముఖంలో భావమొకటే సరిపోదని, ఇది కూడా ఒక ఉపకరణమేనని.

      Delete
  4. శర్మగారూ : నటులకీ, న్యాయవాదులకీ, దూతలకీ మినహాయింపు ఇచ్చేద్దాము.

    ReplyDelete
  5. రాజకీయ నాయకులకి కూడా 😃.

    ReplyDelete
  6. విన్నకోట వారి కోరిక ప్రకారం:
    శర్మగారూ : నటులకీ, న్యాయవాదులకీ, రాజకీయ నాయాకులకీ, దూతలకీ మినహాయింపు ఇచ్చేద్దాము.

    ReplyDelete
    Replies
    1. మొదట చెప్పవాల్సినవాళ్ళని వెనకబెట్టేరని కొంచం......కొంచమేలెండి....బహుకొంచం...అదేంటి.......బా...కలిగిందండి :)

      Delete
  7. శర్మగారూ మీకు బా ---- కలిగించటం ఇష్టం లేదు. మళ్ళా సవరించాను.
    శర్మగారూ : రాజకీయ నాయాకులకీ, న్యాయవాదులకీ, నటులకీ, దూతలకీ మినహాయింపు ఇచ్చేద్దాము.

    ReplyDelete
    Replies
    1. లక్కరాజు వారూ. అందరి  కన్నా ముందు “దూతలు” ఉండాలని శర్మ గారి కవిహృదయం అయ్యుండనోపు (అని నేను అనుకుంటున్నాను) 😊. 

      Delete
    2. లక్కరాజుగారు, విన్నకోటవారు,
      ఒకప్పుడు ప్రపంచం కాంతాకనకాల చుట్టూ తిరిగేది, ఇప్పుడు రాజకీయం ( రాజకీయం+కాంత+కనకం), మందు చుట్టూ తిరుగుతోందండి. అంతటి ప్రాముఖ్యం గలవారిని ముందు చెప్పకపోవడమా అని చిన్న....బహు చిన్న, బా...... :)

      Delete