Friday 7 January 2022

అభ్యాసము కూసు విద్య!

 


 అభ్యాసము కూసు విద్య



అభ్యాసము కూసు విద్య, ఎంత చెట్టుకు అంత గాలి, సంతోషము సగము బలము ఇలా ప్రతి క్లాసులో గోడలమీద రాసి ఉండేవి. అక్షరాలు కూడబలుక్కుని చదివే రోజుల్నించి బడి వదలి పోయేదాకా రోజూ బళ్ళో క్లాసులోకి రాగానే కనపడేవి, ఇవి నెమ్మదిగా ఇంకిపోయాయి మనసులో...ఇప్పుడు బడిలో ఇవి రాస్తున్నారా?..

అభ్యాసం గురించి తాత మాట, ఏంటో ఈయన్ని తాతగారంటే దూరం పెట్టినట్టు ఉంటుంది, అందుకే ఆప్యాయంగా తాతా అంటాను, చిన్న బుచ్చటం కాదు, చనువు సుమా...
అనగననగ రాగ మతిశయిల్లుచునుండు
తినగతినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినుర వేమ.
చిన్న మాటలో చెప్పేసేడు కదా!
గువ్వల చెన్నడు 
కుల విద్యకు సాటిరావు గువ్వలచెన్నా!
ఏం ఎందుకనీ? ఎందుకంటే కుల విద్యని తల్లి తండ్రులు తాత,అమ్మమ్మలు, తాత, మామ్మలు,ఆచరించగా,చూస్తూ పెరుగుతాం, ఇదీ అభ్యాసమే.

వీడియోలో అమ్మాయి అన్ని మెలికలు తిరగ్గలిగిందంటే ఎంత సాధన చేసి ఉంటుంది?

ఇలాగే యోగా చిన్నప్పుడు చేశా!పదిహేడేళ్ళ దాకా ఆ తరవాత పొట్టకూటికి సాధనలన్నీ వదిలేశా! అందునా రాత్రి పగలు నిసబు లేని ఉద్యోగం దొరికింది.పెళ్ళైన తరవాత ఇల్లాలు మీ పెద్ద పెళ్ళాం పిలుస్తోంది, వెళ్ళండి, వెళ్ళండి అనేది, ఎంతకాలం వదిలేశా? దగ్గరగా ఏభై ఏళ్ళు. మొన్న కరోనాలో మళ్ళీ గురువు దగ్గర నేర్చుకున్నా ఓనమాలు. సాధన చేస్తూ వచ్చా, రెండేళ్ళనుంచి, కాని ఇదిగో ఒక నలభై రోజుల్నించి మానేయాల్సి వచ్చింది. మళ్ళీ కొత్తైపోయింది. కాలు చెయ్యి సాగటం కష్టంగా ఉంది, సాధన చెయ్యాలి. 

యోగా చేసేవారు ప్రాణాయామం కూడా చేస్తారు సాధారణంగా, నాకు తోచిన చిన్న మాట.ఇందులో ఊపిరి తిత్తులలోకి గాలి పీల్చుకుని వదలిపెడతాం. ఎంత ఎక్కువ సేపు ఊపిరి తీసుకుంటే అంత బాగుంటుందనుకుంటాం. కాని కాదు. మామూలుగానే ఊపిరి పీల్చాలి, కాని నెమ్మదిగా ఊపిరి వదలిపెట్టాలి, దీనికి ఎక్కువకాలం తీసుకోవాలి, ఎంత ఎక్కువ సేపు ఊపిరి తిత్తులను ఖాళీ చేస్తామో అంత గాలీ మనం తీసుకుంటాం తెలియకనే. అందు చేత సాధన చేయవలసినది ఊపిరి పీల్చడం కాదు,ఎక్కువ సేపు ఊపిరి తిత్తులను ఖాళీ చేయడమని నా నమ్మకం.ఆ పై మీ ఇష్టం..



2 comments:

  1. // “ ఇప్పుడు బడిలో ఇవి రాస్తున్నారా?..“ // … నాకు కూడా అనుమానమే, శర్మ గారు.  ఇటువంటి సూక్తులు చాలా మంది టీచర్లకే తెలియని కాలం ఇది.

    పైన వీడియోలోని పిల్ల విశేష అభ్యాసం చేసే ఉంటుంది గానీండి .. మనలో మన మాట - ఆ పిల్లకు పక్కటెముకలు లేవనీ లేదా బ్రహ్మ ఆ పిల్ల శరీరం రబ్బరుతో (అమెరికాలో వాడే "రబ్బర్" కాదు 😊) తయారు చేశాడనీ - నా గట్టి అనుమానం 😃.  

    ReplyDelete
    Replies
    1. విన్నకోటవారు,
      ఇవన్నీ సూక్తులు కదండి, మతపరమైనవి, సెక్కులర్ కాదు, అందుకు గోడలమీద తుడిచేసేరు.

      ఇక వీడియో అమ్మాయి పదేళ్ళ పిల్ల ని నా అనుమానం. ఆ వయసులో ఎముకలు చాలా మెత్తగా ఉంటాయట, ఎలా కావాలంటే అలా వంగుతాయి. ఒక వేళ విరిగినా చాలా తొందరగా అతుకుతాయంటారు. అలా చిన్న పిల్లలకి ఎముకలు విరిగితే దానిని వైద్య పరిభాషలో Green stick fracture అంటారట. :)

      Delete