Thursday 20 January 2022

ఒమిక్రాన్-1(ఇది జరుగుతున్న కథ.)



 ఒమిక్రాన్-1

బాబాయ్! వారం కితం రాజస్థాన్ వెళ్ళాను, ఆఫీస్ పని మీద, అక్కడ పెద్దాఫీసర్లనే కలిసేను, చాలా చోట్లు తిరిగాను. తిరిగి ఫ్లయిట్ లో వస్తుంటే, ఇబ్బంది అనిపించింది. ఇంటి కొచ్చేటప్పటికి నూట రెండు డిగ్రీల జ్వరం, కొద్దిగా తలనొప్పి.మాత్ర ఒకటి వేసుకుని పడుకున్నా! తెల్లారి డాక్టర్ దగ్గర కెళ్ళా. ఆయన చూసి, సాంపుల్ టెస్ట్ కి పంపుతూ, మందులిచ్చి, ఇంటి దగ్గరే ”హోం ఐసొలేషన్” లొ ఉండండని కాంటాక్ట్ నంబరిచ్చి, వెళ్ళమన్నారు. ఇంటికొచ్చాను.సాయంత్రానికి జ్వరం తగ్గిపోయింది, కొంచం తలనొప్పి ఉంది. మర్నాడు ఉదయం డాక్టర్ ఫోన్ చేసి కోవిడ్ సోకింది,”హోం ఐసోలేషన్” లో ఉండండి. ఏం భయం లేదు, మధ్యాహ్నానికి కిట్ పంపుతాను, దాని ప్రకారం మందులేసుకోండి అన్నారు. ఒక్కసారి కంగారు పడ్డా, తమాయించుకున్నా! వారమూ గడిచింది, మందులూ ఐపోయాయి, రెండో రోజునుంచే బాధలేం లేవు. వారం తరవాత మళ్ళీ టెస్ట్ కి వెళ్ళా!డాక్టర్ చెక్ అప్ చేశారు,సాంపిల్ తీసుసుకున్నారు.. మర్నాడు చెబుతామన్నారు, రిజల్ట్. మరునాడు ఫోన్ చేసి ఇంకా పాసిటివ్ ”హోం ఐసోలేషన్”కొనసాగించమన్నారు.పని పాటూ లేక తిని కూచోడం చికాగ్గా ఉంది బాబాయ్ అని ముగించాడు.

మూడో రోజు నాకీ కబురు చెప్పగానే డీలా పడిపోయా, కంగారు పడ్డా కూడా! తమాయించుకున్నా! కంగారు పడకు, భయం లేదు,మాస్క్ వాడు, బయట తిరగద్దు, మందులేసుకో, చెప్పినట్టు, తుష్టుగా భోజనం చెయ్యి. నిద్రపో!, అర్ధ రాత్రి దాకా మేలుకోకు. అని జాగరతలు చెప్పా!
ఇది నా మాటల్లో ఒక్క సారిగా రాసేనుగాని ఇది సంఘటన క్రమం,రోజూ అనుసరిస్తూ వచ్చినది.నిద్ర పట్టటం లేదు, ఇది నేటి వారికున్న పెద్ద సమస్య, ధ్యానం చేయండి, ఊపిరి పీల్చి వదిలే వ్యాయామమ్ చేయండి, యోగా చేయండి, చివరగా డాక్టర్ సలహా మీద మాత్ర వేసుకోండి.ముందుగా బుర్రలోచి భయం తొలగించండి. ఇది జరుగుతున్న కథ.

ఇలా చెప్పా! ఒకప్పుడు గానుగెద్దు జీవితం, వారాంతపు శలవు లేదు, రోజులో ఎనిమిది గంటలు పని చేయాలి, ఎప్పుడో నిసబు లేదు. ఇలా ఉద్యోగం చేయడం చాలా బాధగా ఉండేది, ఎక్కడికి వెళ్ళడానికి లేదు, ఊరు దాటితే కబురు చెప్పి కదాలాలి, నేటి కాలం లో ఇది చెబితే నమ్మకపోవచ్చు కూడా. ఈ ఇబ్బంది నుంచి తప్పించుకోడానికి మాకున్న ఒక్కటే ఒక్క మార్గం డాక్టర్ సర్టిఫికటుతో శలవు.ఎక్కువ రోజులు శలవు పెడితే ఇలా సెకండ్ మెడికల్ ఒపీనియన్ అని పెద్ద డాక్టర్ల కమిటీకి పంపేవారు. ఒక్కొకప్పుడు అక్కడికి వెళేవాళ్ళం. డాక్టర్లు బాగున్నావుగా ఏంటి సంగతంటే నిజం చెప్పేసేవాళ్ళం. ఆప్పుడు డాక్టర్లు మరో పది రోజులు ఇతనికి శలవు కావాలని,రోగం తగ్గలేదని, రాసిచ్చేవారు. ఇది యాజమాన్యానికి ఇబ్బందిగా ఉండేది. తరవాత కాలంలో ఇలా పంపడం మానేసి, బాగుంటే వచ్చి డ్యూటీ లో చేరమని కబురంపేవారు. ఇప్పుడు ప్రభుత్వమే నీవు ఇంటి దగ్గరుండమంటే ఎందుకు ఇబ్బంది పడ్తావని చెప్పేను.




No comments:

Post a Comment