చెత్త బ్లాగులు-వాసన లేని పువ్వు
వాసన లేని పువ్వు
వాసన లేని పువ్వు, బుధ వర్గము లేని పురంబు, భక్తి వి
శ్వాసము లేని భార్య, గుణవంతుడు గాని కుమారుడున్,సద
భ్యాసము లేని విద్య, పరిహాసము లేని వచః ప్రసంగముల్,
గ్రాసము లేని కొల్వు, కొఱగానివి పెమ్మయ సింగధీమణీ!
వాసనలేని పువ్వు నాకు తెలిసి మొల్ల,తెల్లగా ఉంటుంది,వాసనుండదు.బుధవర్గము లేని పురంబు,తెలివైనవారు లేని పట్టణం.నేటి కాలంలో అన్ని పట్టణాల్లోనూ మేధావులే ఉన్నారు కదా! భక్తి విశ్వాసములేని భార్య, పెళ్ళి తగులాటం ఎందుకు? ఉద్రేకం కలిగిందా మగ ఆడ ఆ రాత్రికి దాన్ని చల్లర్చుకుంటే సరి,ఇటువంటి జంటలే పెరుగుతున్నకాలం. ఇక భక్తి విశ్వాసం కతలేం లేవు. గుణవంతుడు కాని కుమారుడున్,అందరూ గుణవంతులే, కాని ఆశ్రమంలో చేర్చేస్తారు,చాకిరీ చెయ్యద్దూ! నిత్యమూ మననం చేసుకోని విద్య,ఆచరణలో లేని విద్య,నిత్యం పుస్తకాలన్నీ చదువుతామా!కావలసివచ్చినప్పుడు రిఫర్ చేస్తాం ఇదీ నేటి విద్య,ఎవరిని తప్పు పడతాం.నోటి లెక్కకి కూడా కేల్కులేటర్ వాడే రోజులుగా! పరిహాసము లేని వచః ప్రసంగముల్, సంభాషణలో చిన్నపాటి హాస్యం ఉండాలిట,నేడు అది అపహాస్యమే, హాస్యం కాదు. గ్రాసములేని కొల్వు, జీతం లేని ఉద్యోగం నేడు ఎవరూ చేయటం లేదు. ఇవన్నీ కొఱగానివి, పనికిరానివన్నారు,కవిగారు. కాని నేటికాలంలో అవే ఉన్నపుడు ఏం చేయగలమన్నదే కొచ్చను????
వాసనలేని పూవు పద్యం చదివినతరవాత ఈ కింది పద్యం గుర్తొచ్చింది శ్యామలీయం వారిది,జిలేబి బ్లాగులో కామెంటుగా.
చెత్త బ్లాగులు చెత్త పోష్టులు చెత్త వ్యాఖ్యలు గుంపులే
ఎత్తి పోతలు వింత భాషల చెత్త కైతలు పోగులే
మొత్తుకోళ్ళులు నెత్తిపొడ్పులు సుత్తిమాటలు రాశులే
వత్తురా యిక పాఠకుల్ మన బ్లాగులోకపు జోలికిన్
శ్యామలీయం గారు,
వందనం. 🙏
మీరు జిలేబి మీదకు తోలినది పెద్దపులో,ఏనుగో తేల్చుకోలేకపోయాను,నా వల్ల కాలేదు. పద్దెం మాత్రం బహు సొగసుగా ఉంది. నడక అద్భుతం, పంచకళ్యాణి నడకలా ఉంది. గణవిభజన చేయలేకపోయా,మన్నించి ఏ వృత్తమో చెప్పగోర్తాను.
ఇది మీరు జిలేబి మెడలో వేసిన అభినందన మందారమాలగా తలుస్తున్నాను. 'పగున్నచోట తిడితే భక్తున్నచోట తగిలిందనీ' నానుడి.
ఇకపద్యంలో కెళితే చెత్తపోస్టులు,చెత్త వ్యాఖ్యలు గుంపులే,ముమ్మటికిన్నీ నిజం. నా బ్లాగుల్లో ఉన్నవన్నీ చెత్తపోస్టులే,నాకుతోచిన గాలిమాటలు రాసుకున్నాను. "శర్మ కాలక్షేపం కబుర్లు" అని మకుటం పెట్టి మరీ రాసుకున్నా కదుసార్! ఎవరినీ నా బ్లాగుకు రమ్మని పిలవలేదు.వచ్చినవారిని పలకరించక మానలేదు. సరే ఇక నా వ్యాఖ్యలు కూడా చెత్తవే. నిజంగానే పోస్టులు,వ్యాఖ్యలు గుంపులే కాదు రాశులే.నా మీద అభిమానం కొద్దీ గుంపులనేసేరు,అంతే! తరవాత సత్యం చెప్పేరు సార్! అవన్నీ జిలేబి ప్రత్యేకతలని చెప్పక చెప్పేరు కదు సార్! ఎంతేని జిలేబి మీద అభిమానంకదా! మీ జిలేబి శతకాలకి కృతిభర్త కూడా కదా,జిలేబి. అభిమానాన్ని ఈ రకంగా కూడా వ్యక్తం చేయచ్చన్నమాట. కొత్త సంగతి తెలుసుకున్నా సార్!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి