Tuesday, 3 February 2026

కలికి చిలకల కొలికి .......

 కలికి చిలకల కొలికి .......

                              

 చిత్రం :  సీతారామయ్యగారి మనవరాలు (1991)

సంగీతం :  కీరవాణి

గీతరచయిత :  వేటూరి

నేపధ్య గానం :  చిత్ర


కలికి చిలకల కొలికి మాకు మేనత్త

కలవారి కోడలు కనకమాలక్ష్మి


కలికి చిలకల కొలికి మాకు మేనత్త

కలవారి కోడలు కనకమాలక్ష్మి

అత్తమామల కొలుచు అందాల అతివ

పుట్టిల్లు యెరుగని పసిపంకజాక్షి


మేనాలు తేలేని మేనకోడల్ని

అడగవచ్చా మిమ్ము ఆడ కూతుర్ని

వాల్మీకినే మించు వరస తాతయ్య

మాయింటికంపించవయ్య మావయ్యా


కలికి చిలకల కొలికి మాకు మేనత్త

కలవారి కోడలు కనకమాలక్ష్మి


ఆ చేయి యీ చేయి అద్ద గోడలికి

ఆ మాట యీ మాట పెద్ద కోడలికి

నేటి అత్తమ్మా నాటి కోడలివి

తెచ్చుకో మాయమ్మ నీదు ఆ తెలివి

తలలోని నాలికై తల్లిగా చూసే

పూలల్లొ దారమై పూజలే చేసే

నీ కంటి పాపలా కాపురం చేసే

మా చంటిపాపనూ మన్నించి పంపూ


కలికి చిలకల కొలికి మాకు మేనత్త

కలవారి కోడలు కనకమాలక్ష్మి


మసకబడితే నీకు మల్లెపూదండ

తెలవారితే నీకు తేనె నీరెండ

ఏడు మల్లెలు తూగు నీకు ఇల్లాలు

ఏడు జన్మలపంట మా అత్త చాలు

పుట్టగానే పూవు పరిమళిస్తుంది

పుట్టింటికే మనసు పరుగుతీస్తుంది

తెలుసుకో తెలుసుకో తెలుసుకో

తెలుసుకో తెలుసుకో మనసున్న మామ

సయ్యోధ్యనేలేటి సాకేత రామా


కలికి చిలకల కొలికి మాకు మేనత్త

కలవారి కోడలు కనకమాలక్ష్మి

కలికి చిలకల కొలికి మాకు మేనత్త

కలవారి కోడలు కనకమాలక్ష్మి

*****


ఈ పాట వింటుంటే ఒక తెనుగు జానపదగీతం గుర్తొస్తుంది. అది ఇదే ..


Courtesy:Whatsapp

మొదటి పాటలో ఆ చేయి ఈ చేయి అద్దగోడలికి, ఆ మాట ఈ మాట పెద్దకోడలికి అనే చరణం ఉంది. దీని అర్ధమేమి అనే ఒక ప్రశ్న చూసాను.సమాధానం చూడలేకపోయా! నాకు తోచినది చెబుతున్నా!


ఆ చేయి ఈ చేయి అద్దగోడలికి.......

ఈ అద్దగోడ గురించి తెలియాలంటే ఆచారం చేసేవారి వంటిల్లు ఎలా ఉంటుందో తెలియాలి. ఈ వంటిల్లు 15/8 కొలతల్లో ఉంటుంది. ఇందులో 10అ పొడుగు తరవాత అడ్డంగా ఒక గోడ 5 అడుగులపొడుగు రెండడుగుల వెడల్పు 4 అడుగుల ఎత్తునా ఉంటుంది. ఇందులో 10 అడుగులవైపు వంటపొయ్యిలు,పాలు,పెరుగు,పప్పూ ఉప్పులు పెట్టుకునే అలమారలు. వండుకున్నవి పెట్టుకోడానికి వేరుగా అలమార,పైన దండేలు,మడిబట్టలు ఆరేసుకోడానికి,ఎండుపుల్లలు తాళ్ళు వేలాడదీసి మధ్యలో పెట్టే ఏర్పాటు, అద్దగోడలో మడి మంచినీళ్ళ బిందెలు పెట్టుకునే ఏర్పాటూ ఉంటుంది. ఇది 'మడి' పక్క ఉండేది,దీన్నే ఆచారం వైపు అనగా అచారం చెయ్యి. ఇక రెండో భాగంలో తరవాణీ కుండ,చద్దెన్నాల ఊరగాయి జాడీలు, చద్దెన్నపు కంచాలూ, ఇలా ఉంటాయి. ఇది అనాచారం చెయ్యి. (అనాచారమంటే పనికిరానిదనికాదు,కొద్ది ఆచారం తక్కువ చేసేది.) ఈ ఆచారం చేతికి అనాచారం చేతికి హద్దు ఒకగోడ. ఆ గోడ అర్ధగోడ, హద్దుగోడ, కాలంలో అర్ధగోడ ఆతరవాత అద్దగోడగా రూపాంతరం చెందిది. ఇదే ఆచేయి ఈ చేయి అద్దగోడలికి కత.     

ఇక ఆమాట ఈ మాట పెద్దకోడలికి..

పాత తరం ఉమ్మడి కుటుంబాలంటే ఇంటిపెద్ద, ఆయన భార్య, వారి సంతానం. ఒక్కో ఇంట్లో 5 నుంచి 7 మంది కొడుకులు,అదేలెక్కన కూతుళ్ళూ ఉండేవారు. అటువంటి ఉమ్మడి కుటుంబం నేడు ఊహించనుకూడా లేము.  అటువంటి ఇంట పెద్దకోడలిది ప్రత్యేక హోదా,బాధ్యత,(చెప్పబడని)అధికారం.  ఈమె పెద్దలలో చిన్నది,చిన్నవాళ్ళలో పెద్దది. ఈమె తరాల మధ్య సరిహద్దులోది. పెద్దవాళ్ళ బాధలు కష్టాలు దగ్గరగా చూసేది,అర్ధం చేసుకోగల వయసుకు దగ్గరగా ఉన్నదీ. ఇక చిన్నవాళ్ళలో పెద్దది,చిన్నవాళ్ళ ఇష్టాలు,సరదాలు, ఇబ్బందులూ తెలిసున్నది. ఈమె అటు పెద్దవాళ్ళనూ ఇటు చిన్నలనూ సముదాయించగల స్థితిలో ఉంటుంది,చెప్పి ఒప్పించేవయసులో ఉంటుంది. సంసారం ఒడుదుడుకులు లేకనడుస్తోందంటే పెద్దకోడలు చాలా బాధ్యత తీసుకున్నట్టే. అటువంటి పెద్దకోడలు ఇటు పెద్దలమాట,ఇటు చిన్నలమాటా వింటూ సందర్భాన్ని బట్టి చెప్పి ఒప్పించడం,సముదాయించడం చేసేది గనక,ఆ మాట ఈ మాట పెద్దకోడలికి అన్నారు. ఇదీ పెద్దగోడలికి,అద్దగోడకి పోలిక. అందుకే 'అద్దగోడకి,పెద్దకోడలికి పనెక్కువ'అనే నానుడి పుట్టింది.
=====

No comments:

Post a Comment