Sunday, 31 December 2023

మందున్నది మంచి విందున్నది.

2024ఆంగ్ల నూతన వత్సర ప్రారంభదిన ముoదస్తు శుభకామనలతో

మందున్నది మంచి విందున్నది.


 రారోయి బావా! మా ఇంటికి 

మందున్నది మంచి విందున్నది.

మందున్నది మంచి విందున్నది.


నువ్వు రానీకి బుల్లెట్టు బండున్నది

మనం కూచోను ఫామ్ హవుజ్ ల చోటున్నది.

రావోయ్ బావా మా ఇంటికి 

మందున్నది మంచి విందున్నది.


నువు తాగనీకి పోతుతాడి కల్లున్నది.

నంజుకోను దోర దోర చికినున్నది

రావోయి బావా మా ఇంటికి 

మందున్నది మంచి విందున్నది.


కాదు కాదంటె పాతపాత చిగురున్నది. 

అందులోకి  చీకు ముక్కున్నది.

రావోయి మా ఇంటికి బావా

మందున్నది మంచి విందున్నది.


నీకు నచ్చకుంటె కంపెనీ సరుకున్నది.

అందులోకి వర్రవర్ర కాజున్నది.

రావోయి బావా మాఇంటికి

మందున్నది మంచి విందున్నది. 


లేదు కాదంటె సీమ సరుకున్నది.

నంజుకోను సీమకోడి ఇగురున్నది.

రావోయి  బావా  మాఇంటికి

మందున్నది మంచి విందున్నది.


నీకాకలేస్తె బాస్మతి   వైట్ రైసున్నది.

అందులోకి  పొట్టేలుతల కూరున్నది.

 రావోయి బావా మాఇంటికి 

మందున్నది మంచి విందున్నది.


ఆపైన  మంచి ఉలవచారున్నది

రావోయి బావా మాఇంటికి

మందున్నది మంచి విందున్నది.


ఆపైన అసలు పాల పెరుగున్నది.

 చీక్కోను మాగాయి టెంకున్నది.

రావోయి బావా మా ఇంటికి

మందున్నది మంచి విందున్నది.


నువు పడుకోను డబల్ కాట్ల బెడ్డున్నది

దానితోడు, ఏ.సి  మిసనున్నయి. 

రావోయి బావా  మా ఇంటికి

మందున్నది మంచి విందున్నది.

(రావోయి మావా మా ఇంటికి పాట పేరడీ)


ఈపాటికి చాలామందికి ఇలా ఆహ్వానాలొచ్చే ఉంటాయి, నూతన సంవత్సరం సందర్భంగా!

ఇది ప్రమోదం అయ్యేలా లేదు. కరోనా ప్రమాదం చెప్పి చెప్పిరాదు. సింగపూర్ లో XBB వేరియంట్ బలంగా వ్యాపిస్తోందిట. మూలమైన చైనాలో గత మూడు నెలలుగా ఇది నడుస్తున్నట్టు వార్తలు. లక్షణాలు పిల్లని ఎక్కువగా సోకుతున్నట్టు, న్యూమోనియా ఆక్రమించి ప్రాణాలు తీస్తున్నట్టు వార్తలు.


ఇక మనదేశంలో ఇది ఇంకా అడుగుపెట్టలేదు గాని, JN1 అనే వేరియంటు కేరళా,మహారాష్ట్ర, గోవాలలో ఉన్నట్టు వార్త. లక్షణాలు దగ్గు,రొంప,జ్వరం,న్యూమోనియా...ఇలా నడుస్తున్నట్టు వార్తలున్నాయి. మా జిల్లాలో మూడు కేస్ లున్నట్టు, ఒకటి పండు ముసలి,మరొకటి చిన్ని పాప,మరొకటి మధ్యవయసు. ఈ వార్త ధృవీకరింపబడలేదు. మేం మాత్రం ము.మూ గుడ్డలు కట్టుకునే తిరుగుతున్నాం. పది మందిలోకి పోవటం లేదు.  ఆరోగ్యం జాగర్త! బతికియుండిన సుఖములబడయవచ్చు.



మరో బావయ్య ఇలా అంటున్నాడు చిత్తగించండి.

 వద్దురా బావయ్య!

ఈపొద్దు మందు మాటొద్దురా
అయ్యా! అయ్యా!! వద్దురా బావయ్య!

పెద్దోళ్ళింటిని తఱిచి చూచేవేళ

పసిపాలను కరోన పట్టుకెళ్ళేవేళ
వద్దురా! వద్దురా!!

ఈపొద్దు మందు మాటొద్దురా

అయ్యా! అయ్యా!! వద్దురా బావయ్య!

పూడ్చిన చిగురేమో పండని వేళాయె
చీకు
లకి  నీ చెల్లి చెల్లు  
చెప్పినవేళ

వద్దురా! వద్దురా!! బావయ్య.

ఈపొద్దు మందు మాటొద్దురా

చుట్టాలందరు గాలిగాళ్ళురా!
మనమీద కొండెములు మళ్ళీ చెప్పేరు
వద్దురా! వద్దురా బావయ్య.
ఈపొద్దు మందు మాటొద్దురా

కంపెనీ మందంటే కడు గోలరా
మొదటి రౌండ్ కే వాంతులొచ్చేను.
వద్దురా! వద్దురా! బావయ్య.
ఈపొద్దు మందు మాటొద్దురా

ఆడుకోవలనన్న పాడుకోవలెనన్న
అన్నిట, సెల్లు చాలురా
వద్దురా! వద్దురా! బావయ్య

ఈపొద్దు మందు మాటొద్దురా

వద్దురా కన్నయ్యా! పాటకి పేరడీ! బండి వారి బ్లాగులో కామెంటుగా ఆశువుగా చెప్పినది, కొన్ని కొన్ని మార్పులతో.)

Thursday, 28 December 2023

తుమ్ముకి తమ్ముడున్నాడు ఆవులింతకి అన్న లేడు.

  తుమ్ముకి తమ్ముడున్నాడు ఆవులింతకి అన్న లేడు.

ఇదొకనానుడి జనసామాన్యం చెప్పుకునీదిన్నీ! ఏమి దీని కత?


     తుమ్ము సాధారణంగా ఒంటరిగా ఉండదు. కనీసం రెండు సార్లు తుమ్ముతారు. కొంతమంది మూడు,నాలుగు,ఐదు సార్లు వరసగా తుమ్మడం అలవాటు ఉంటుంది. అందుకే తమ్ముకి తమ్ముడున్నాడంటారు, అంటే ఒక్కసారి తుమ్మడంతో కాదు, మరోసారి కూడా  తుమ్ముతారు  సుమా! అని చెప్పడమే.

ఇక ఆవులింతకి అన్నలేడు. నిజం :) అన్నలేడన్నారుగాని తమ్ముడు  లేడనలేదు. అంటే ఆవులింత కూడా వస్తే ఒక్కసారితో కాదు. వరసగా వస్తాయని చెప్పడం. కొంతమందైతే అలా అవులిస్తోనే ఉంటారు.  కొంతమంది ఆవులింతతో పెద్ద పెద్ద, వింత వింత శబ్దాలు కూడా చేస్తారు.


అసలు తుమ్మెందుకొస్తుంది? అదీ తెలుసుకోవలసింది. ముక్కులోకి ధూళి కణాలు చేరినా, ఘాటైనా వాసన పీల్చుకున్నా వాటిని అసంకల్పితంగా బయటకు పంపే చర్యనే తుమ్ము. ధూళి కణాలను అడ్డేందుకు ముక్కులో వ్యవస్థ ఉంది.వెంట్రుకలుంటాయి,  ముక్కు తడిగా ఉంటుంది.. ఇవి ఫిల్టర్ లా పనిచేస్తాయి. వాటిని అందంకోసం తొలగించేస్తున్నారు. ఆలిఫేక్టరీ నాడులకొసలు ప్రతిస్పందించి, లోపలికి ఊపిరి తిత్తులలోకి పీల్చుకున్న ఘాటైన వాసనల్ని బయటికి పంపించేస్తాయి.


ఇక ఆవులింత శరీరం అలసినపుడు నిద్ర ముంచుకొస్తున్నవేళ ఆవులింతలొస్తాయి,ఎక్కువగా.!


తుమ్ముకుని చిరంజీవ అనుకోడం.

తుమ్మినపుడు గుండె లిప్తకాలం లయతప్పి మరలా లయ అందుకుంటుందట. దానికిగాను, తుమ్మితే పెద్దలు చిరంజీవ అని  ఆశీర్వదించడం  అనూచానంగా వస్తున్న అలవాటు. గుండె లయతప్పడమన్నది మనవారికి తెలుసునా? ఏమో చెప్పలేను. కాని చిరంజీవ! అని ఆశీర్వదించడం మాత్రం అనూచానంగా జరుగున్నదే!

రాత్రులు భోజనసమయంలో తుమ్మితే నెత్తిన నీళ్ళు జల్లి చిరంజీవ అని ఆశీర్వదించడం అలవాటు. అలా పెద్దలు ఆశీర్వదించేదాకా మరోముద్దనోట పెట్టకూడదంటారు. కారణమేమై ఉండచ్చని ఆలోచిస్తే మరో తుమ్ము రావచ్చనీ అందుకుగాను కొద్ది సమయం వేచి చూడడం మంచిదని అనుకుంటా!  ఇలా తుమ్మిన తరవాత ఆశీర్వదించేవారు లేక,తమమటుకు తమరే ఆశీర్వదించుకోడాన్ని తుమ్ముకుని ఆశీర్వదించుకోవడమంటారు.


దీన్ని తర్జుమాచేసి  తప్పుచేసి (మరొకరు తప్పుపట్టేలోపు)తమనుతామే నిందించుకోవడాన్ని ఈ నానుడితో చెబుతారు.


తుమ్ముపై లోకoలో మాటలు

తుమ్మును ఎక్కువగా అపశకునంగానే భావిస్తారు.

తుమ్ముకుంటూ నిదరకి ఉపక్రమించచ్చంటారు.

తుమ్ముకుంటూ నిద్ర లేవకూడదంటారు.

తుమ్ముకుంటూ ప్రయాణానికి బయలుదేరకూడదంటారు.

ప్రయాణానికి బయలుదేరి ఒకడుగేసిన తరవాత,వెనకనుంచి తుమ్ము వినపడితే, వెనకతుమ్ము ముందుకు మంచిదంటారు. ప్రయాణం సాగిస్తారు.


Monday, 25 December 2023

యతికుతం....

 యతికుతం....


ఆతనో యతికుతం మనిషిలెద్దురూ అంటుంటారు, అన్నీ యతికుతం బుద్ధులే.... ఈ ,యతికుతం, కి అర్ధమేంటి?


పూజ చేస్తున్నారా? కొంతపూజయ్యాకా మొదలవుతుంది.....యానికానిచ పాపాని......పాహిమాన్ కృపాయా దేవ శరణాగత వత్సల,అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ..రక్ష రక్ష....

 పాపాలు చేశాను... దేవుడా దయతో మన్నించు, మరో     దిక్కులేదు,రక్షించు,రక్షించు, అంటూ....


ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి...

నీకు ప్రదక్షణ చేసి నమస్కారం చెయ్యాలని కోరిక,శక్తి లేదు, నీవు నాలో కూడా ఉన్నావని నమ్ముతూ, నా చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నా, నీకు ప్రదక్షిణం చేసినట్టు భావించు, నమస్కారం స్వీకరించు. 


ఆపైన

 కరచరణ కృతంవా

మనోవాక్కాయజంవా చ

తవాపరాధం క్షమస్వ

......................

  చేతులు, కాళ్ళతో;మనసు, వాక్కు, శరీరంలతో చేసిన తప్పులు, నీపట్ల చేసినతప్పుల్ని మన్నించు, క్షమించు,దేవా అంటూ, చెంపలు వాయగొట్టుకుంటూ...


చివరకొచ్చేసేం....

మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మయాధిప ,

'యత్కృతం' తు మయాదేవ పరిపూర్ణం....


నేను చేసిన పూజలో మంత్రాలు సరిగా చెప్పలేకపోయినా,చేసే పూజలో లోపం ఉన్నా,(పత్రి, నైవేద్యం వగైరాలు) సరిగా లేకున్నా, నీపట్ల భక్తిలేకున్నా, నేను ఎలా చేస్తే అదే సంపూర్ణంగా భావించు...

మంత్రాలు చెప్పలేకపోయావు సరే,పూజలో లోపం అదిన్నీ సరే,భక్తి కూడా లేని నిన్ను నేను రక్షించాలా? అని భగవంతుడు అడగడు...... 


ఇంతకీ 'యతికుతా'నికి దీనికి లింకేంటని కొచ్చను కదా!

మంత్రహీనం.......లో .......'యత్కృతం'.... అనివచ్చిందిగా అదే ఇది, నేను ఎలా చేస్తే అదే సంపూర్ణం అనుకో అన్నాడుగా అలాగే నేనేది చేసిన,చెప్పినా అదే సంపూర్ణం అనే మనుషులుంటారు చూడు! అని చెప్పడానికే 'యత్కృతం'....అలా అలా నలిగి 'యతికుతం' అయింది అనుకుంటా.


ఇటువంటి వాళ్ళకి ఉదాహరణలు కావాలా?......  :)


Friday, 22 December 2023

నోట్లో మెతుకు గూట్లో దీపం.

 నోట్లో మెతుకు గూట్లో దీపం.


ఇది ఒక నానుడి. నానుడి,జాతీయం,సామెత అనేవన్నీ జీవితం నుంచి పుట్టిన అనుభవాలు. వీటిని తెలుసుకుంటే పాతకాలంలో మన జీవన విధానం, స్త్రీ పురుషుల ప్రవర్తన,ఆచార వ్యవహారాలు, అలవాట్లు, ఇవీ అవీ అనేం, జీవితమంతా నానుడులలోనే ఉంది.కొత్త వింత పాతరోత అనుకునేవారినేమనగలం. చిత్రమేంటంటే కొత్తవింత పాతరోత అన్నది కూడా ఒక నానుడే :) ఈ నానుడులలో పాత జీవితమేకాదు నేటి జీవిత సత్యాలు కూడా బోధపడతాయి. మరోమాట సంస్కృతి అంటే ఏమిటి? 


ఇంతకీ నోట్లో మెతుకు గూట్లో దీపం ఏంటనికదా! పూరిల్లైనా, పెంకూటిల్లైనా,మేడైనా ఆ ఇంటి అన్ని గదులలోనూ దీపం గూడు ఉండేది. ఇంటి బయట ప్రహారీకి గమ్మానికి ఇరుపక్కలా రెండు దీపం గూళ్ళుండేవి. పాత కాలపు ఇళ్ళలో వీటిని చూడచ్చు, నేటికిన్నీ.  కిరసనాయిల్ దీపాలు లేనికాలంలో ఆముదం దీపాలు వెలిగించుకునేవారు. ఆముదం ఒక మట్టి ప్రమిదలో పోసి ఆముదంలో పగలంతా నానబెట్టిన కొత్త గుడ్డముక్కని వత్తిగా వాడేవారు. ఇది రాత్రంతా వెలిగి ఉదయానికి మలిగేది. సాయంత్రం దీపాలు వెలిగించుకోడమొక పనిగా ఉండేదంటే నమ్మలేరు. ఆ తరవాత కాలంలో కిరసనాయిలు దీపాలొచ్చినా అవీ గూళ్ళలోనే ఉండేవి. ఆ తరవాత కాలంలో హరికేన్ లాంతర్లు, చిన్న చిమ్నీ బుడ్లు,   వీటిని కోడిగుడ్డు లాంతర్లనేవారు,  వాడుకలోకొచ్చాయి.   వీటిని సీనారేకుతో చేసేవారు, ఆ తరవాత కాలంలో గాజు బుడ్లొచ్చాయి. ఇప్పటికీ ఇవి తీర్థాలలో దొరుకుతున్నట్టున్నాయి!   ఈ చిన్న దీపాల బుడ్లు రెండు గదుల్లోకి కనపడేలా ద్వారబంధానికి ఒక మేకు కొట్టి దీన్ని దానికి తగిలించేవారు. వీటికి ఇలాయి బుడ్లని పేరు.  బయట అవసరానికి హరికేన్ లాంతర్లు వాడేవారు.  కలిగినవారు పెట్రొమాక్స్ లైట్లు వెలిగించుకునేవారు. కలిగినవారింటిలో దీపాలు వెలిగించేందుకు ప్రత్యేకంగా ఒకరుండేవారంటే నమ్మలేరు. ఇది ఒక కార్యక్రమం, దగ్గరగా మూడు గంటలేనా కాలం పట్టేది.   అన్ని   గదుల్లో దీపాలూ తెచ్చుకోవాలి, ఒకచోటపెట్టాలి, దీపాలగది అని ఒకటి వేరుగా ఉండేది, అందులోనే ఈ పనంతా. అన్ని దీపాల చిమ్నీలు తీసేసి వేరుగా పెట్టి ఉంచి ఒక్కొదానినీ ముగ్గు వేసి, గుడ్డతో దీపాన్ని, చిమ్నీనిని ఉన్న మసి  తుడిచి, ఆతరవాత ఇలాయి బుడ్లలో కిరసనాయిలు పూర్తిగా నింపి, హరికేన్ లాంతర్లని కూడా అలాగే చేసి, వత్తి మలిపి పెట్టుకుని, బర్నర్తో వత్తి పైకి కిందకి కదులుతోందో లేదో చూచుకుని, చివరగా దీపం వెలిగించి, అన్నిగదుల్లోనూ పెట్టాలి, ఇదో పెద్దపనే, నాటిరోజుల్లో.    ఎర్రకిరసనాయిలు,తెల్ల కిరసనాయిలని రెండు ఉండేవి. ఎర్రకిరసనాయిలు గవర్నమెంటు ఇచ్చేది. తెల్ల కిరసనాయిలు మార్కెట్ రేటు. కిరసనాయిలు శేర్ల లెక్కని కొలిచి అమ్మేవారు. శేరు కిరసనాయిలు ధర ఒక అణా అనిగుర్తు, లీలగా.


నానుడి గురించి చెబుతానని దీపాలగురించి చెబుతావేం :) నోట్లో మెతుకు అంటే సాయంత్రం బువ్వ తినడం.సాయంత్రభోజనం దీపాలు పెట్టేకా చేసేవారు కాదు. సూర్యాస్తమయం లోగా భోజనాలయిపోవాలి.

 అసుర సంధ్యలో భోజనం చేయకూడదు. ముందుగా ముసలి  వారికి, పిల్లలకి సాయంత్ర బోజనాలు పెట్టేసి ఆ తరవాత అత్తగారు,  మామగారు,ఆలుమగలు,   ఇలా అంతాభోజనాలు కానిచ్చేసిన తరవాత దీపాలు వెలిగించేవారు. రాత్రి భోజనాలు దీపాలు వెలిగించకమునుపే అనగా సూర్యాస్తమయం లోపే చేయాలని చెప్పడానికే ఈ నానుడి, నోట్లో మెతుకు గూట్లో దీపం అనే నానుడిపుట్టింది. నేటికాలంలో ఉదయం ఫలహారం అంటే పదిగంటలకి, మధ్యాహ్న భోజనమంటే మూడు గంటలకి, రాత్రి భోజనమటే పన్నెండు తరవాత. కాలం మారిందా? కాలం   మారలేదు   , అలవాట్లు మారాయి. 


నూరు పనులున్నా భోజనం ఆలస్యం చెయ్యకు, వెయ్యి పనులున్నా స్నానం ఆలస్యం చెయ్యద్దని ఆచార్యచణకుని మాట.    


Wednesday, 20 December 2023

కాపరంచేసే కళ కాలిగోళ్ళనాడే తెలుస్తుంది.

 కాపరంచేసే కళ కాలిగోళ్ళనాడే తెలుస్తుంది.


పెళ్ళికి ముందు పెళ్ళికొడుకు కాలి,చేతులగోళ్ళు, పెళ్ళికూతురు వారింటి అబష్ఠుడు పెళ్ళికూతురు ఇంటి దగ్గర తీసి, ఒంటికంతా నూనెరాసి నలుగుపెట్టి తలంటుతాడు.  కొంతమంది ఈ ఆచారాన్నిపాటిస్తారు. 


పెళ్ళికి ముందు పెళ్ళికొడుకు, తల్లి,ఆడబడుచుతో ఆడపెళ్ళివారింటికి వస్తాడు. వచ్చిన పెళ్ళికొడుకును హారతిచ్చి ఆహ్వానిస్తారు, లోనికి. ఆ తరవాత పానకమిచ్చి, కొత్తబట్టలిచ్చి గౌరవిస్తారు. తదుపరి, పెళ్ళికొడుకు తలంటుకు సిద్దమవుతాడు. ధాన్యం కుప్పగాపోసి దానిపై కొత్త పంచెలచాపు పరచి,దానిపై పీటవేసి,దానిపై పెళ్ళికొడుకును కూచుండబెట్టి, పెళ్ళికొడుకుకు కాలిగోళ్ళతీయడం, ఒంటికి నూనెరాసి నలుగు పెట్టడం, తతిమా కార్యక్రమమంతా అంబష్ఠుడు పూర్తి చేస్తాడు. తలంటిన తరవాత పెళ్ళికొడుకు అత్తవారిచ్చిన కొత్తబట్టలు కట్టుకుంటాడు, హారతిచ్చి తిలకం దిద్దుతారు, ఇదంతా ఆడపెళ్ళివారి తరఫువారు చేస్తారు.  అంబష్టుడు ధాన్యము,దాని మీద వేసిన చాపు పట్టుకునిపోతాడు. అతనికోతాంబూలమిచ్చి సత్కరిస్తారు.  ఇదేమి ఆచారం అని కదా సంశయం? ప్రతి ఆచారం వెనక కొన్ని కారణాలుంటాయి, అవి తెలుసుకోవలసినవే!


అమ్మాయి గురించి ఎంత తెలుసుకుంటారో, అబ్బాయి గురించి కూడా అంత తెలుసుకోడానికే ఈ ఆచారం. పెళ్ళికొడుకు ఆరోగ్యపరిస్థితి ఏమిటి? అవయాలు ఎంతపొందికగా ఉన్నాయి. చర్మరోగాలున్నాయా? అతని మాటతీరు, నడవడిక ఎలా ఉంటుందీ? వీటన్నిటి పరిశీలనకే ఈ ఆచారం. కాలిగోళ్ళనాడే పీటలపై సంబంధాలు తిరిగిపోయేవెన్నో!


ఇప్పుడెందుకిదీ?

ప్రతిపక్షాల సంఘటన వారొక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అందులో తమవైపునుంచి ప్రధాని అభ్యర్థి ఎవరో తేల్చుకోడానికి, సీట్ల సర్దుబాటు గురించి మాటాడుకోడానికిన్నీ. అందులో మమతమ్మ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఖర్గే ని ప్రధాని అభ్యర్థిగా కోరింది. నితీశ్ కుమార్, లాలూ యాదవ్ దీనికి కినిసి సమావేశం నుంచి బయటకి వెళ్ళిపోయారు. జరుగుతున్నదానిని చూచిన ఖర్గే ఎన్నికలు కానివ్వవమ్మా! మనం నెగ్గిన తరవాత ప్రధాని ఎవరో చూడచ్చమ్మా! అని తప్పించారు. కాని కాంగ్రెస్ వర్గాలు రాహుల్ని ప్రధాని అభ్యర్థిగా తప్పించే పన్నాగమే అని విరుచుకుపడుతున్నాయి. ఆ సమావేశంలో నితీశ్ ఉపన్యాసం తమిళంలో కావాలని స్టాలిన్ పట్టుబట్టారు, నితీశ్ కోపించారు. ప్రతిపక్షాల ఐక్యత ఇక్కడే తెలిసిపోతోంది, పై నానుడిలో చెప్పినట్టు. 

Saturday, 16 December 2023

ఉప్పుతో తొమ్మిదీ/ పప్పుతో పది.

 ఉప్పుతో తొమ్మిదీ/ పప్పుతో పది.


ఉప్పుతో తొమ్మిదీ తెచ్చుకోవలసిందే, ఇక్కడేంలేవు, అంటుంటారు. ఏమిదీనర్ధం?     నోట్లోకి  ముద్దరావాలంటే వంటకి కావలసిన పదార్ధాలు ఈ తొమ్మిదీ, ఉప్పుతో సహా! ఏమిటవి? ఎప్పుడూ ఆలోచించలేదుకదూ! అవేంటో చూదాం...ఇదీ ఒక నానుడే!

బియ్యం,

నెయ్యి/నూనె

కూర,

పాలు/పెరుగు,

పోపు సామాన్లు,

ఉప్పు,

పులుపు,

కారం,

తీపి.

మరోమాటా చెబుతారు ఉప్పుతో తొమ్మిది, పప్పుతో పది.

వీటికి వంట పాత్రలు, వంట కట్టెలు,విస్తళ్ళు అదనం.

ఇవన్నీ ఉంటేగాని వంట కాదు. ముద్దరాదు.కొత్తగా కాపురం పెట్టుకునేవాళ్ళు మరచిపోకూడని నానుడి.


Thursday, 14 December 2023

పనికిరాని పరిజ్ఞానం

 

ఉల్లిపాయల బస్తా


ధాన్యం నుంచి, ఉప్పు,పంచదార ఇలా అన్నిటిని బస్తాలలో నింపడానిని పట్టుబడిఅంటారు. ఈ బస్తాలను వరసగా పేర్చడాన్ని నెట్టు కట్టడం అంటారు. ఈ మొత్తం చర్యని బస్తాబందీ అంటారు :) బియ్యం,ధాన్యం, పంచదార ఇలా అన్నిటిని నిలవచేసే బస్తాలని గోనెసంచులంటారు. ఇవి జనపనారతో తయారయ్యేవి.జనపనార సంచులని కూడా అంటారు. ఇవి రెండు రకాలు ఒకటి కళ్ళీ సంచి,రెండు చార సంచి.కళ్ళీ సంచి నేత చిక్కగా ఉండదు. సాధారణమైనవాటికి వాడతారు. ఎక్కువ ఇవే వాడకం. ఇక చార సంచిలో నిలువచేసేది పంచదార మాత్రమే. ఈ సంచి నేత భిన్నంగా ఉంటుంది. దీన్ని ఐమూలనేత అంటాం. నేత చిక్కగా ఉంటుంది.మామూలు కళ్ళీ సంచిలో పంచదార కారిపోతుంది :) ఈ సంచులు ఒకప్పుడు 100 కేజిలు లేదా 24 కుంచాలు పట్టేలా ఉండేవి. ఇప్పటికీ పంచదార సంచులు మాత్రం 100కేజిలకి   తయారవుతున్నాయి. మిగిలిన వాటికి  మార్పులొచ్చాయి. ఒకప్పుడు 75kg సంచులొచ్చాయి. ఆ తరవాత కాలంలో ఇవి 50 కేజిలకి తగ్గిపోయాయి. ఇప్పుడు వాడుకంతా 50 కేజిలు మాత్రమే. ఇదంతా రైతులు వాడేవి. ఇక వినియోగదారుడి దగ్గరకొచ్చే జనపనార సంచులే లేవు నేడు. అన్నీ పోలీథిన్ సంచులే. ఇవి కూడా ఇప్పుడు 50,25 కేజిల పట్టుబడికే సరిపోతాయి. బియ్యం వగైరాలన్నీ 25 కేజిలకే పట్టుబడి ఇప్పుడు. 


ఇక ఉల్లిపాయల సంచులన్ని ప్రత్యేకం. ఒకప్పుడు ఉల్లిపాయల బస్తా అంటే 30 కేజిలు. ఇప్పటికి ఉల్లిపాయ బస్తాపట్టుబడి 30 కేజిలనుకుంటున్నా. ఐతే పైన ఫోటో లో ఉన్నది 5కేజిల ఉల్లిపాయబస్తా. ఒక బస్తా ఉల్లిపాయల ఖరీదు 300, ఒకనెలకి సరిపోతాయి. ఈ ఉల్లిపాయసంచులు మాత్రం చాలా దూరం కొంత దగ్గరనేతతో ఉంటాయి, ఉల్లిపాయ బయటపడిపోకుండా. ఉల్లిపాయ సంచి మరెందుకూ పనికిరాదు.   


నరసాపురం లో ఉద్యోగం చేసినపుడు ముచ్చట. ఆఫీసులోనే క్వార్టరు మూడో అంతస్థులో ఉంది. బియ్యం 50 కేజిలు తెచ్చుకోడం అలవాటు. రిక్షాతను కిందదాకా తెచ్చి అక్కడపెట్టేసేవాడు. పై తెచ్చిపెట్టు డబ్బులు వేరేగా ఇస్తానన్నా 50కేజిల మూట మూడో అంతస్థుకి తేలేనండి మెట్లెక్కి, అని వెళిపోయేవారు. ఇద్దరం ఏచేయాలి? అంతమూట మోయగల ఓపికలేదు. అందుకు మూట విప్పేసి ఐదుకేజిల చొప్పున పైకి మోసుకుపోయేవాళ్ళం, ఇల్లాలు నేనూ! ఇన్ని కొనుక్కోడమెందుకంటే, ఇల్లాలు రోజూ బియ్యం కోసం సంచి పుచ్చుకు బయలుదేరడం  చిరాగ్గా ఉండదూ అనేది.   

నేటి కాలంలో పాతిక కేజిల బరువు మించి మోయగలవారే ఉన్నట్టు లేదు. 


Tuesday, 12 December 2023

సింహము-చిట్టెలుక

సింహము-చిట్టెలుక  


 అనగనగా ఒక అడవి. అడవిలో మృగాలు ఎన్నికలు జరుపుకున్నాయి, రాజెవరో తేల్చుకోడానికి.  సింహం,ఏనుగు పోటీ చేసాయి.  వీరవిహారంగా ప్రచారం జరిగిపోయింది. సింహాన్ని ఎన్నుకున్నాయి, రాజుగా, సాధుజంతువులన్నీ, కొద్ది మెజారిటీతో!

ఎలుకలు ప్రచారంలో పాల్గోలేదుగాని ఓట్లేసాయి.  సింహానికి, ఎలుకలు ఓట్లు తనకి వేయలేదేమోనని అనుమానం.

కాలం నడుస్తుండగా, ఒక ఎలుకపిల్ల (చిట్టెలుక) తన కలుగు దగ్గర చెట్టుకింద, నిద్రపోతున్న సింహం జూలు పట్టుకుని ఆడుకోడం మొదలెట్టింది, ఇంతలో సింహానికి మెలుకువొచ్చింది. చిట్టెలుకని పంజాలో పట్టుకుని ఒక్క సారి గర్జించింది. దాన్తో కలుగులో ఎలుకతల్లి బయటికొచ్చి, తనపిల్ల, సింహం పంజాలో ఉండటం చూసి, రాజా! మేము ఎలుకలం,బలహీనులం, తమ చేతిలో ఉన్నది చిన్నపిల్ల, అభం శుభం, లోకం పోకడ తెలియనిది. తమకే హాని తలపెట్టలేదు. తెలియక తమజూలుతో ఆడుకున్నట్టుంది. మన్నించి విడుదలచేయండి,అంతేగాదు. మా ఎలుక సంతతి అంతాకలసినా తమ పంటికిందకి, ఉదయఫలహారంగా కూడా సరిపోము. అదా! చిట్టెలుక, దయచేసి తప్పుకాసి విడుదల చేయమని వేడుకుంది.  సింహం ఆలోచనలో పడింది. తనకి వీళ్ళు ఓట్లేసినట్టులేదు, ప్రతీకారం తీర్చుకుంటేనో, ఆలోచనలో పడింది. ఈలోగా నక్క  మంత్రి,   సింహం  దగ్గరకు చేరి, మంతనాలు జరిపింది. తల్లి ఎలుక, రాజా! తమకు అత్యవసర సమయంలో నా సాయం అందించగలను, మన్నించి నా బిడ్డను విడుదలచేయమని వేడుకుంది, కాళ్ళావేళ్ళా పడి, కన్నీళ్ళతో.  


అంతట సింహం   హేళనగా నవ్వి, నువ్వో ఎలకవి, నేను సింహాన్ని, రాజును. నువ్వు నాకు సాయం చేస్తానంటావు. నేను నమ్మాలి,  అని   పరిహాసంగా గర్జించి, చిట్టెలుకను వదిలింది. ప్రాణగండం గడచిన చిట్టెలుక తల్లిని చేరింది.కాలం గడిచింది. తల్లెలుక మరణించింది, పిల్లెలుక పెద్దదయింది,  ఎలుకల నాయకుడయింది. సింహానికీ వయసొచ్చింది, వడి మళ్ళింది, చూపు ఆనడమూ తగ్గింది. 

ఒకరోజు వేటగాడొకడు వలపన్నేడు. చూపు తగ్గడం, అధికారం మత్తుతో చూసుకోక, వలలో చిక్కుకుంది, సింహం. తన్నుకుంటూంది,వదిలించుకోడానికి, తన్నుకున్నకొద్దీ బిగుసుకుంటోంది వల.  అడివిలో జంతువులన్నీ గుసగుసలు పోయాయి.ఎవరికి తోచినట్టు వారనుకున్నారు. అన్యాయం! అన్యాయం!! అని   ఆక్రోశించినవారు , మా బలే అయిందిలే అని చంకలు గుద్దుకున్న అశక్తదుర్జనులు,  చేసుకున్న కర్మ ఎక్కడికిపోతుంది, వెంటాడి వేధిస్తుందని శాపనార్ధాలు పెట్టిన వారు, ఇదంతా ఏనుగు చేసిందే! అనుమానం లేదు,ఇంతకింతా అనుభవిస్తుంది లే! అని గుసగుసలు పోయినవారు, ధర్మప్రభువుకే ఇంత కష్టమా? అడవిలో ఆటవిక న్యాయం చెల్లదా? అని కన్నీళ్ళు పెట్టుకున్నవారు, ఎంతకలికాలమైనా ఇంత చేటా? అని బుగ్గలు నొక్కుకున్నవారు. ఇలా నడచిపోతూంది, కాలం. సాధుజంతువులంతా చేసేది లేక,చేయగలదీ లేక, నిశ్చేష్టులయి చూస్తూ ఉండిపోయాయి. ఈలోగా   కౄర  జంతువుల సంచలనం కలగడంతో, సాధుజంతువులన్నీ పారిపోయాయి.   ఇలా గడచిపోతూవుంది, కాలం.

 

కౄరజంతువులన్నీ సమావేశం చేశాయి, రాజుకు ఎదురుగా. ఏంటీ కలికాలం కాకపోతే! ఎప్పుడేనా సింహరాజిలా వలలలో చిక్కుకోడాన్ని విన్నామా? ఇదంతా ఏనుగు కుట్ర తప్పమరేంకాదు.ఏనుగును వదలిపెట్టం, రాజా! మీరు నిశ్చింతగా ఉండండి, అన్నాయి. కాలం గడచిపొతోందిగాని రాజును విడుదల చేసే మార్గం గురించిన ఆలోచనగాని, చర్చగాని చేయనేలేదు.     ఈ లోగా నక్కమంత్రి పరుగు పరుగున చేరుకుంది, రాజు దగ్గరకి.  రాజా! ఇలా జరిగిందే! తమరేంటి ఇలా వలలలో చిక్కుకోడాన్ని ఊహించలేను. జరిగిందేదో జరిగింది, మిమ్మల్ని విడుదలజేసే మార్గం చెబుతా! ముందు వీళ్ళందరికి పని అప్పజెప్పి పంపించెయ్యండి.ఆపద సమయంలో, రాజుకు రాజబంధువులే ద్రోహం చేస్తారు. వీరిని అడవి సరిహద్దుల్లో కాపలాకాయమనండి, వేటగాడు రాకుండా! అని ఉపాయం చెప్పింది. సింహం అలాగే చెప్పి అందరినీ పంపించింది. రాజబంధువులు,సన్నిహితమితృలంతా వలలో చిక్కుకున్నాడని చూడ్డానికొస్తే పని అప్పజెప్పేడే! అని సణుక్కుంటూ లేచి పోయాయి,సమావేశం నుంచి.   


ఆ తరవాత, మంత్రి, రాజా! వీళ్ళంతా అవసరం గడుపుకునేవాళ్ళే! అవసరానికి అడ్డుపడేవాడొక్కడూ లేడు. ఈ ఆపద గడవాలంటే ఉపాయం చెబుతా,వినండి. 

ఒకప్పుడొక ఎలుకపిల్లకి ప్రాణదానం చేసేరు, ధర్మప్రభువులు. ఆ ఎలుకపిల్ల నేడు ఎలుకల నాయకుడయింది. వాళ్ళే ఇప్పుడు ఈ వలను కొరికి మిమ్మల్ని రక్షించగలరు. నేను వెళ్ళి వారిని తమ దర్శనానికి తీసుకొస్తా! దర్పం,గాభీర్యం ఒలకబోయకండి.   ఇప్పుడు అవసరం మనది, దీనంగానే మాటాడండి. రక్షించమని కోరండి,అని హితబోధ చేసి, ఎలుకనాయకుడి దగ్గరకెళ్ళింది, నక్క మంత్రి. 

ఎలుకనాయకా! మహారాజు వేటగాని వలలో చిక్కుకున్నారు, ఇప్పుడు మీరే రక్షించాలి, అంది. దానికి ఎలుక, మంత్రిగారూ! మేమేమో చిన్నవాళ్ళం, ఎలుకలం, మహారాజుకు మేం చేయగల సాయమేం ఉంటుంది, అంది. దానికి నక్క, అన్నన్న ఎంతమాట!,ఎంతమాట!!, ఇప్పుడు మీరు పూనుకుని వల కొరకకపోతే మహరాజును వేటగాడు బోనులో పట్టుకుపోతాడు, ఆతరవాత మన రాజుగారు చిక్కి శల్యమై,తిండికి మొహంవాచి సర్కస్ లో డాన్సు చెయ్యాల్సి వస్తుంది. ఇది మన జంతులోకానికే తీరని అవమానం. అందుచేత మీరంతా పూనుకుని, వలను కొరికి రాజును రక్షించాలి, అని చెప్పింది. గతకాలంలో ఎలుక తల్లి రాజుకిచ్చిన మాట  గుర్తు  చేసింది.  సరేనని ఎలుక సింహం దగ్గరకి చేరుకుంది.   

 ఎలుకను చూసి సింహం, ఎలుక నాయకా! ఒకప్పుడు నీకు ప్రాణదానం చేసాను, ఇప్పుడు నేను వలలో చిక్కుకున్నాను, అంటూ ఉపన్యాసం మొదలెట్టింది. అంతట నక్క వారింపుగా రాజా! సమయం గడచిపోతోంది! అని హెచ్చరించింది. సింహం తన స్థితి గుర్తుచేసుకుని, సలహా పాటిస్తూ, ఎలుకనాయకా! ఇదివరలో ఏం జరిగిందో! జరిగిపోయింది, ఇప్పుడు నేను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాను. నన్ను రక్షించండి, నీవే నా ప్రాణదాతవి, నీవు తప్ప మరెవరూ నన్ను రక్షించలేరు అని వేడుకుంది, దీనంగా. అంతట ఎలుక, రాజా! ఇది చూస్తే చాలా పెద్దవల, చాలా బలంగానూ ఉన్నది. నా ఒక్కడివల్ల కాదు.మా వాళ్ళతో ఆలోచించాలి అని చెప్పింది. దానికి సింహం, నువ్వు తలుచుకుంటే మీవాళ్ళందరిని కూడగట్టగలవు, నన్ను రక్షించనూ గలవు, నన్ను రక్షించు, రక్షించు,అని కన్నీళ్ళు పెట్టుకుంది.  ఐతే ఒక మాట రాజా! మా  వాళ్ళని ఒప్పించాలంటే మీరో మాటివ్వాలంది. అదేంటో అడుగు, అంది నక్కమంత్రి. రాజా! బిడాల సంతానం మా ఉసురుతీస్తున్నాయి. వేధింపులకి అంతే లేకపోతోంది. వారినుంచి రక్షణ ఏర్పాటు చేస్తానంటే, మా వారిని ఒప్పిస్తానంది. అలాగే అంది, సింహం. ఎలుక నాయకుడు తనచోటు చేరి తనవారందరినీ సమావేశపరచి, జరిగింది చెప్పింది. కూడా ఉన్న నక్కమంత్రి, రాజుగారు మీకు బిడాల సంతానం నుంచి జరుగుతున్న అన్యాయాలని అరికడతానని  మాటిచ్చారని చెప్పింది. ఎలుకలన్నీ కిచకిచలాడుతూ బయలుదేరాయి, వల దగ్గరకి.

 అక్కడి చేరుకున్న తరవాత, ఎలుకనాయకుడు, రాజా! మీరిచ్చిన వాగ్దానం మీ నోటిద్వారా, మావారంతా వినాలని కుతూహలపడుతున్నారని చెప్పింది. అంతట నక్క మంత్రి, రాజుగారు బిడాలసంతానం మీపట్ల వ్యవహరిస్తున్న దాని గురించి రాజుగారు, విచారం వెలిబుచ్చారు, ఇక మీదట ఈ అన్యాయాలు జరక్కుండా కట్టడి చేస్తానని   మాటిచ్చారు , అని చెప్పింది. దానికి సింహం తలూపింది. ఇంతలో ఒక చిట్టెలుక, నాయకా! ఏవిషయమూ రాజుగారి నుంచి వినాలని మా ఎలుకలన్నీ కుతూహలపడుతున్నాయని సన్నాయి నొక్కునొక్కింది. ఎలుకలన్నీ ఏకకంఠంతో రాజుగారు మా ఎలుకజాతికి బిడాలసంతానం నుంచి జరుగుతున్న వేధింపులు,హత్యలనుంచి రక్షణ ఏర్పాటు చేస్తానని చెబితే ఈక్షణమే వల కొరకడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేయి. సింహానికి చెప్పకతప్పలేదు.

గొంతు సవరించుకుని దీనంగా, మీరంతా నా ప్రాణదాతలు, మిమ్మల్ని రక్షించకూడా ఉండలేను, బిడాల సంతానం, మీ అందరిపట్ల కొనసాగిస్తున్న వేధింపులని అరికడతానని చెప్పింది. ఎలుకలు సింహరాజుకీ జై అంటూ వలమీదపడి, తెంపిపారేశాయి. తుక్కుతుక్కుగా కొరికేసాయి,వలని.  

  సింహం బయటికొచ్చింది. ఒక్కసారి జూలు విదిలించి, పెద్ద గర్జనచేసింది, దానితో అప్పటిదాకా సింహం మీద స్వారీ చేసిన ఎలుకలన్నీ ప్రాణభయంతో పారిపోయాయి,ఎలుకనాయకునితో సహా!


అప్పుడు నక్కమంత్రి రాజా!మీరు విడుదలయ్యాకా, ఎలుకల్ని సన్మానిస్తారనుకున్నా! ఒక్క సారి గర్జించే సరికి అంతా అస్తవ్యస్తమయింది, అంది. దానికి సింహం, ''మంత్రీ! వారు నా రాజ్యంలో నా పాలితులు. రాజుకి కష్టం వచ్చినప్పుడు రక్షించడం  వారి విధి. దానిని వారు చక్కగా నిర్వర్తించారు, మన పౌరులకి వారి ధర్మం తెలిసి ఆచరించినందుకు సంతసం. మరోమాట విను,ఎంతఖరీదైన చెప్పులైనా కాలికే తొడుగుతారుగాని నెత్తిన పెట్టుకోరు '' . విన్న నక్క మంత్రి, చేష్టలుడిగి రేపటి రోజూ నేనూ అంతే కదా! అని మనసులో అనుకుని, వగచింది,ఇలా అనుకుంటూ....

శా.రాజుల్మత్తులు, వారిసేవ నరకప్రాయంబు, వారిచ్చు నం
భోజాక్షీ చతురంతయాన తురగీ భూషాదు లాత్మవ్యథా
బీజంబుల్‌, తదపేక్షచాలుఁ బరితృప్తింబొందితి\న్‌ జ్ఞానల
క్ష్మీ జాగ్రత్పరిణామ మిమ్ము దయతో శ్రీకాళహస్తీశ్వరా!


కత పాతదే కొత్తహంగులతో  

Friday, 8 December 2023

తాగలేని పిల్లి బోర్ల తోసుకున్నట్టు

 తాగలేని పిల్లి బోర్ల తోసుకున్నట్టు


ఇదొక నానుడి.

 ఒకపల్లెలో ఒక ఇల్లాలు పాలు దాలి మీద పెట్టి నిద్దరోయింది. పాలు కాగిపోయాయి, దాలి దిగిపోయింది, పాలు చల్లారాయి. ఐనా ఇల్లాలు పాలు జాగ్రత్త చేసుకో లేదు. ఈ లోగా ఒకపిల్లి చూసింది. బలే ఛాన్సు లే! బలే ఛాన్సులే లలలాం లలలాం లక్కీ ఛాన్సులే!! అనుకుని దాలి దగ్గరకి చేరింది. కుండలో మూతెట్టింది. పాలందలేదు. ఒక కాలితో కుండని వంచబోయింది. కుండ ఒరిగిందిగాని పాలందలేదు. మరికొంచం వంచబోతే పాలు ఒలికాయి. ఈ చప్పుడుకి ఇల్లాలు లేచింది. పిల్లి పరుగుపెట్టక తప్పలేదు :) మెడ మరి కొంచం కుండలోకి వంచితే పాలు దొరికేవి, కాని బద్ధకం ఆవరించి కుండ వంచితే పాలు ఒలికితే వీపు చిట్లింది. 


ఇలాగే 

ఎప్పుడు సంపదగల్గిన

అప్పుడు బందుగులు వత్తురది ఎట్లన్నన్

దెప్పలుగ చెఱువు నిండిన 

గప్పలు బదివేలు చేరు గదరా సుమతీ.


ఇంకా

సిరిదా వచ్చిన వచ్చును సలలితముగ

నారికేళ సలిలము భంగిన్

సిరిదా పోయిన పోవును 

కరిమ్రింగిన వెలగపండు కరణిని సుమతీ!


సిరి చేరే టప్పుడు గజ్జెల చప్పుడుండదు. చేరిన తరవాత గజ్జెల చప్పుడు ఆగదు. సిరి చేజారేటప్పుడు గజ్జెల చప్పుడు వినపడదు. అలాగే సిరి ఉన్నంతకాలం జనం వెంటుంటారు, నీరున్నంతకాలమే కప్పలున్నట్టు. 


అధికారం చేజిక్కించుకోడం తేలికైన పనికాదు.  శిఖరాగ్రానికి చేరాలంటే కష్టపడాలి. అక్కడికి చేరేకా కిందికి చూస్తే ఇళ్ళు బొమ్మరిళ్ళులా,మనుషులు చీమల్లా కనపడతారు. ఇలా కనపడ్డం నిజమే, కాని ఇలా కనపడుతున్నది భ్రాంతి సుమా, నిజం కాదని తెల్సుకుంటే కొంతసేపు శిఖరం పై ఉండగలరు. లేకపోతే పతనం పెద్ద సమస్య కాదు. అప్పుడు తాగలేని పిల్లి బోర్ల తోసుకున్నవతు.

అధికారమూ ఇంతే!!!!

Wednesday, 6 December 2023

పనసపండు కోసి పళ్ళెంలో పెడితే

పనసపండుకోసి పళ్ళెంలో పెడితే, తినడం చేతకానివాడు 

  దిక్కు దిక్కున చూసాడు.

***

పనసపండు కోసుకు తినడం అంత తేలికైన పనేం కాదు. పనసపండు కోసుకోడం తెలియాలి. దీనికి పదునైన కత్తి కావాలి. నూనె కావాలి. వాటిని సిద్ధం చేసుకోవాలి. నూనె లేకపోతే పండులో ఉన్న జిగురు చేతులకంటుకుపోతే కోసుకోడమే కష్టం. చేతులకి నూనె రాసుకోవాలి. కత్తికి నూనె రాయాలి. పండును తకిందులుగా నిలబెట్టి వెనకనుంచి నిలువుగా కోయాలి కొంచంలోతుగా, పై తొక్క దళసరిగా ఉంటుంది, అది తెగేదాకా కోయాలి. ఆలాగే నాలుగు పక్కలా కోయాలి. అప్పుడు  ముక్కలుగా గట్టిగా విరవాలి. లోపల ఉన్న బొడ్డును నిలువుగా కోయాలి. ఇప్పుడు ముక్కలొస్తాయి. తొనలప్పుడే దొరకవు. ముక్కని మిగిలిపోయిన బొడ్డు కోయాలి. ముక్కని విరవాలి. తొనలు పీచులో ఉంటాయి. చేతికి కొద్దిగా నూనె రాసుకుని ఒక్కో తొనా పీకాలి,  తీసి బయట పెట్టుకోవాలి. ఇప్పుడు చేతులనున్న నూనె జిగట పోవాలంటే, కొంచంగా అంటిన జిగురుపోవాలంటే మరికొంచం నూనె పట్టించి చేతులు గుడ్డతో తుడుచుకుని ఆపైన సున్నిపిండితో చేతులు రుద్దుకోవాలి.


ఇంత బాధ పడక్కరలేక పనసపండు కోసి తొనలు పళ్ళెంలో పెట్టి తినమంటే దిక్కులు చూసినవాణ్ణేమంటారు? చేతకాని వాడు.

చేతకాని మొగుడికి చేష్టలెక్కువ. చెల్లని రూపాయికి గీత లెక్కువ

ఇంకొంచం మోటు సామెత చెబుతారు, వద్దు లెండి.

Monday, 4 December 2023

ఓటమికన్నీ కారణాలే!

 ఓటమికన్నీ కారణాలే!


గెలుపుకంతా చుట్టాలేనంటారు. సరేలే! నేను పోటీ చెయ్యక, నిన్ను బలపరిచేనుగనక నెగ్గేవు దగ్గరనుంచి, గల్లీ లీడర్ నుంచి  జండా మోసిన కార్యకర్తదాకా, ఓటేసిన మారాజుదాకా అంతా చుట్టాలే! 


మరి ఓటమికన్నీ కారణాలే!

మొదటిది నోటివట్టం. కనపడే కారణాలు కొన్నే!!  నిజంగా వెతుక్కుంటే,   కనపడని కారణాలెన్నో!!!


అదేంటయ్యా! నిన్నటిదాక ఇదే నోటివట్టం కదా!   పనికొచ్చింది,నచ్చింది.  ఇప్పుడేమయింది, కొత్తగా?  

 నిన్నటిదాకా నోటివట్టాన్ని జనాలు మెచ్చేరు, నేడు నొచ్చేరు, అంతే తేడా!!!!!

అదేకదా కాలం కలసి రాకపోవడమంటే! అదే   విధి అంటేనూ!


Sunday, 3 December 2023

ఇలా జరిగింది.

 ఇలా జరిగింది.

 వివిధ ఇంగ్లీషు పత్రికలలో ( ఏడుపుగొట్టు పత్రికలతో సహా)  వచ్చిన వార్తలు చదివిన మీదట ఏర్పరచుకున్న అవగాహనతో రాసినది.


సొరంగం కూలినదాని గురించి  తెలుసుకోడానికి,  కొన్ని ముందు మాటలు.సొరoగం పొడవు నాలుగు కిలో మీటర్ల పైమాట. ఎత్తు పదేను మీటర్లు. చుట్టుకొలత నలభై ఐదు మీటర్లవుతుంది. సొరంగం రెండు కిలోమీటర్ల పైగా తవ్వేసేరు. స్టీలు గర్డర్లు అమర్చుకుంటూ కాంక్రీట్ చేసుకుంటూ ముందుకు కదులుతున్నారని అవగాహన. ఈపని కొంత దూరం జరిగింది. ఈ కూలినచోటు ముఖద్వారానికి కొద్ది  దూరంలోనే జరిగినట్టు అనిపిస్తుంది. కొద్దిగా కాంక్రీటు రాలితే చర్యలు తీసుకునేలోగానే కూలిపోయింది. కూలిన డెబ్రిస్ లో మట్టి,రాళ్ళు, కాంక్రీటు, ఇనుము కూడా ఉన్నాయి. సొరంగం కూలిన దూరం అరవై మీటర్లని అంచనా! డెబ్రిస్ దూరం అరవై మీటర్లు. సొరంగం తవ్వినంత మేరా కరంటు ఏర్పాటుంది. లోపల ఒక నీటి ఊట ఉన్నది. దానినుంచి వచ్చేనీటిని బయటికి పంపేందుకు ఒక పైపు వేయబడింది.


సొరంగం కూలే సమయానికి లోపల పనివారున్నారు. వెంటనే వారిని రక్షించే చర్యలు మొదలయ్యాయి. ఎంతమందున్నారో ( వెంటనేతెలీదు ), ఎలా ఉన్నారో తెలీదు. లోపలివారికి బయటివారికి మధ్య సంభాషణకి మార్గం,మాధ్యమంలేదు. ఈ పరిస్థితులలో కూలిన డెబ్రిస్ ని తొలగించడానికి పూనుకుంటే, మరికొంత కూలడం మొదలైతే, దాన్ని అపేసేరు. ఇతర విధాలగా రక్షణ చర్యలు ప్రారంభించారు.


 ఇక  లోపలివారు,  ఉన్నవారెంతమందో, లోపలున్నవారెలా ఉన్నారో, ప్రమాదంలో గాయపడ్డారో చూసుకున్నారు, బయటపడే మార్గానికి ఎదురు చూస్తూ. లోపల నలభై ఒక్కమంది ఉన్నట్టూ అంతా బాగున్నట్టూ,లోపల కరంట్ ఉన్నట్టూ, పోలేదని వివరంగా ఒక చీటి మీదరాసి నీటి పైప్ లో వదలిపెట్టేరు. దీని బయటివారు చూసి అమ్మయ్య! అంతా బతికున్నారని సంబరపడి రక్షణ చర్యలు ముమ్మరం చేస్తూ, లోపలివారికి ఆహారం, మిగిలిన వసరాలూ కోసం ఒక ఆరంగుళాల పైప్ ని లోపలికి చొప్పించారు.   ఆరంగుళాల పైప్ లకి మరలుంటాయి, ఆ పై సైౙ్ వాటికుండవు. పైప్ పొడవు ఆరుమీటర్లుంటుంది. ఆరంగుళాల హోల్ డ్రిల్ చేసి అందులో పైప్ ని దూర్చేసేరు, కపులర్ బిగించి తరవాత పైప్ ని దూర్చచ్చు. కాని మూడడుగుల పైప్ కి అలా కుదరదు. వెల్డింగ్ చెయ్యాలి అదికూడా అన్నీ ఒక్క సారి చేసేస్తే కుదరదు. ఒక పైప్ దూర్చిన తరవాత దానిలోంచి ముందుకు డ్రిల్ చేసి ఈ కొత్త పైప్ ని లోపలున్నదానికి వెల్డ్ చేయ్యాలి, అదికూడా జాగ్రత్తగా చెయ్యాలి ఖాళీలు లేకుండా! ఇవన్నీ సమయం తీసుకునే పనులే! మరికొంతమంది వెల్డర్లని డిల్లీ నుంచి పంపేరు. ఇలా సమయం గడుస్తూంది. అంతేకాదు ఈ డ్రిల్ మిషనలకి కూడా విరామం కావలిసొచ్చేది రెండు గంటల పని తరవాత. ఇలా ఆశ నిరాశల మధ్య ఊగులాడుతూ పని కొనసాగింది, మొండికి పడిపోలేదు.    ఇదంతా నేను చెప్పినంత తేలిగా జరగలేదు. 


లోపలున్నవారి దగ్గర పెన్నూ పేపరూ ఉండటం అదృష్టం. పేపర్ మీద రాసి నీటి పైప్ లో వదలాలనే ఆలోచన రావడం అదృష్టం. ఇటువంటి గత రెండు సంఘటనల్లో చిక్కుకుని బతికి బయటపడ్డ సీనియర్, గబ్బర్ సింగ్ నేగీ లోప  చిక్కుబడటం మరో అదృష్టం. బయటివారు ఆరంగుళాల  పైప్  లోపలి చొప్పిస్తే దానికి అడ్డులేం తగలకపోవడం మరో అదృష్టం. ఇదంతా జరగడానికే రెండు రోజుల పైగా సమయం పట్టినట్టుంది. ప్రతి క్షణం ఏం జరగబోతుందో తెలీదు.  ఈ నేగి అనే ఆయన లోపల వారికి ధైర్యం చెప్పడమే కాక అందరూ ఒకరితో ఒకరు మాటాడుకునే మాట చెప్పేరు. యోగా చేసేరు,చేయించేరు. కొంతమందికి నేర్పేరు కూడా. ఇది లోపలి వారికి కలిసొచ్చిన అదృష్టం. 


అంతా ఉత్కంఠ, నిజానికి కొన్ని రోజులు వార్తలు చదువుతూ నేను కొంత ఉద్విగ్నతకులోనై నిద్రలేక ఆరోగ్యం చెడగొట్టుకున్నానన్నది నిజం. ఆరంగుళాల పైప్ లోంచి కెమేరా పంపించారు, లోపలికి. వీడియో  తీశారు. కావలసిన వన్నీ ఆహారంతో సహా పైపు లోంచి లోపలకి పంపించారు.  

లోపలివారి క్షేమసమాచారం బంధువులకి చేరేసేరు. ఆ తరవాత సెల్ ఫోన్ లు లోపలికి పంపేరు,లోపలివారు వారికి కావలసినవారితో మాటాడటానికి. ఇక  బయటికి తీసుకు రావడానికి మూడడుగుల పైప్ లోపలికి చొప్పించే పని మొదలెట్టేరు. యంత్రం హుటాహుటిన అక్కడికి చేరుకుంది.కొంత పనయింది.  పనయింపోతుంది, దీనితో అనుకునేలోగా యంత్రం చెడింది, బాగుచెయ్యడానికి సమయం పట్టింది.మళ్ళీ మొదలెట్టి కొంతపనయ్యేటప్పటికి మళ్ళీ చెడింది, మరి బాగుకాలేదు. ఈలోగా చాలా సార్లు స్టీలు అడ్డుపడటం దానిని తొలగించడానికి చర్యలు తీసుకోడం జరిగింది.   అడ్డుపడిన స్టీలు గర్డర్లని కొయ్యడానికి కట్టర్ యంత్రాలని హైదరాబాద్ నుంచి వాయుమార్గంలో పంపేరు. చాలా యంత్రాలు డిల్లీనుంచి వచ్చాయి. ఇక రెండవ అమెరికన్ డ్రిల్ యంత్రం మారుమూల ఉన్నదానిని ప్రత్యేక మార్గంలో,  రైల్వే చేరేసింది, హుటహుటిన.   ఈ యంత్రం కొంతపని పూర్తి చేసింది. దీన్ని  నిలబెట్టడానికి   కాంక్రీట్ వెయ్యల్సివచ్చింది. కొంత పనయ్యాకా కాంక్రీట్ నిమళ్ళీ పటిష్టం చేయాల్సివచ్చింది. ఈలోగా ఇటువంటి విషయాలమీద అవగాహన కలిగిన థాయ్ నిపుణులను సంప్రదించారు. ఆ తరవాత ఒక అమెరికన్ నిపుణుడు చివరిదాకా ఇక్కడే మకాం చేసేరు. ఇదొకటే రక్షణ మార్గం కాకపోవచ్చని పైనుంచి తొలిచే డ్రిల్ ఒ.ఎన్ జి.సి వారు ఏర్పాటు చేసి కొంతపని చేసేరు. కొన్ని అవసరమైన కొత్త రోడ్లు వేసేరు,హుటాహుటిన. ఇక లోపలివారి ఆరోగ్యానికి చర్యలు తీసుకున్నారు, మానసిక ఆరోగ్య నిపుణులు సలహాలిచ్చారు. పక్కనుంచి మరో సొరంగం చిన్నది తవ్వాలనుకున్నారు. ఇలా చాలా ఆలోచనలు చర్యలూ సాగాయి.అందరిది ఒకటే లక్ష్యం లోపలివారిని క్షేమంగా బయటకు తీసుకురావాలి. ఈ అమెరికన్ యంత్రం చాలా పనిచేసి చివరగా లోపలివారికి పన్నెండు మీటర్ల దూరంలో ఉండగా చెడిపోయింది. దీన్ని తొలగించడానికే సమయం పట్టింది. చిక్కుపోయిన యంత్ర భాగాలు తొలగించడం పెద్ద పనైపోయింది.ఇలా ఎప్పటికప్పుడు ఆశ నిరాశల మధ్య ఊగులాడింది.    చెప్పినంత సులువుగానేం జరగలేదు.  . ఈ పనులు హుటహుటిన జరగడానికి అన్ని శాఖలూ వెంటవెంటనే పనిజేసాయి.


ఇలా మూడదుగుల పైప్ చొప్పించే పని చివరికి చేరడానికి పన్నెండు మీటర్ల దూరంలో ఆగిపోయింది. ఇప్పుడు నిరాశ కమ్ముకుపోయింది. ఈ పరిస్థితులలో ఎలుకబొరియ విధానం అక్కరకొచ్చింది. ఏమది?


ఎలుక తనులోపలికి వెళ్ళడానికి తనుపట్టేపాటి రంధ్రం చేస్తుంది, మట్టి వెన్నకి తోస్తూ తనులోపలికి ప్రవేశిస్తుంది. ఇలా మైనింగ్ చేయడం అనాదిగా ఉన్నదే. ఈ పనికి ముగ్గురుంటారు. ఒకరు తవ్వేవారు, ఒకరు మట్టి పోగుచేసి తట్టలలో నింపేవారు, మూడో వారు దానిని బయటికి చేరేసేవారు. ఈ విద్య ఇంకా అక్కడక్కడ అవసరపడి అమలు లోనే ఉన్నది. నవయుగ అనే కంపెనీ నీటి గొట్టాల్లో పేరుకుపోయిన మట్టిని ఈ విధానంలో తొలగిస్తూ ఉంటుంది. విషయం తెలిసిన కంపెనీ ఆరుగురిని ఒక చోటనుంచి, మరో ఆరుగురుని మరో చోటనుంచి ఎంపిక చేసింది. వారిని సిల్క్ యారా పంపింది. వీరు ముగ్గురు ఒక జట్టుగా ఆరేసిగంటలు  పనిచేసేరు. మొత్త పన్నెండు మీటర్ల దూరాన్ని 22 నుంచి 26 గంటలలో తవ్వి పైప్ అమర్చేందుకు సిద్ధం చేస్తే పైప్ ని దూర్చి వెల్డ్ చేసి దారి ఏర్పాటు చేసేరు.


ఇంతజరిగిన తరవాతగాని లోపలివారిని బయటకు తీసుకురావడం సాధ్య పడలేదు. నేను కొన్ని విషయాలని ముందు వెనుకలూ చెప్పి ఉండచ్చు. మొత్తానికి ఇది ఇలా సాధ్యమయింది.    

 

 నిజానికీ టపా రాయగలిగి రాయలేదు. బోనగిరిగారి మాట "ఆ పైప్ ని ముందే వేసుకునుండచ్చుగా?" అన్న ప్రశ్న నాచే ఈ టపా రాయించింది, చాలా కష్టపడ్డాను. ఈ రోజు మొత్తం నాలుగు గంటలు పైగా కంప్యూటర్ దగ్గర కూచున్నా!. 


ఇక ఇటువంటి భారీ పనులు జరిగే చోట ప్రమాదం జరక్కుండా తీసుకోవలసిన జాగ్రత్తలేంటి? ఏవి తీసుకున్నారు? ప్రమాదం జరిగితే తప్పించుకునే మార్గాలేంటి? వాటిని తీసుకున్నారా? ప్రశ్నలుండిపోయాయి. జరగబోయే ఎంక్వైరీలో బయటకు రావచ్చేమో!    


Friday, 1 December 2023

కన్నూ మిన్నూ

 కన్నూ మిన్నూ


'నీకు కన్నూ మిన్నూ కానరావటంలేదురా!' అని తిడుతుంటారు. దీని అర్ధమేమీ?

కన్ను కానకపోవడం జరిగితే మిన్నే కాదు ఏదీ కనరాదుకదా! అంటే దీని అసలు రూపం ఇది కాదనమాట.


'మన్నూ మిన్నూ కనరావటం లేదు, నీకు' అనితిడితే ఏమన్నట్టు? మన్ను, కాళ్ళ కిందుంటుంది అదే భూమి. ఇక మిన్ను అంటే ఆకాశం నెత్తి పైనుంటుంది. అంటే నీకు కిందపైనా లేదా కిందా మీదా కనపట్టం లేదూ! అని అర్ధం. అదేమి? అంటే నీకు పెద్దా, చిన్నా తేడా కాని, ఉచ్చం, నీచమనే తేడా; ఉచితం, అనుచితమని కాని అవుపించటం లేదనర్ధం. అదీ అసలు సంగతి.

Wednesday, 29 November 2023

అమ్మయ్య! బతికి బయటికొచ్చేరు.

 

అమ్మయ్య! బతికి బయటికొచ్చేరు.


సిల్క్ యారా దగ్గర నిర్మాణం లో ఉన్న సొరంగంలో ప్రమాదవశాత్తు 41 మంది శ్రామికులు చిక్కుకుపోయారు, 17 రోజులుగా.  నిన్న అర్ధరాత్రి బయటికొచ్చేరు,క్షేమంగా


ప్రమాదం జరిగినప్పటినుంచి చిక్కుకుపోయినవారిని బయటకు తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అనేక సంస్థలు రాత్రిపవలు తేడా లేక ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నాయి. బయటనుంచి చిక్కుకుపోయినవారి దగ్గరికి ఒక ఒక మార్గం ఏర్పాటు చేయడం ఒక ప్రయత్నం. దీనికోసం పెద్దపెద్ద యంత్రాలని హుటాహుటిన తరలించడం జరిగింది. ఒక యంత్రం కొంత పనిచేసి పాడయింది.ఆ తరవాత మరొక పెద్దయంత్రం ఆ పని కొనసాగించి రిపేరుకి సాధ్యం కానంతగా పాడయింది. ఏర్పాటు చేస్తున్నదారి, చిక్కుకున్నవారి నుంచి పన్నెండు మీటర్ల దూరాన ఆగిపోయింది. అప్పుడు సనాతనమైన ఎలుక బొరియ విధానమే అక్కరకొచ్చి చివరి పన్నెండు మీటర్లు పద్దెనిమిది గంటలలోపున నిపుణులు పూర్తిచేసేరు. దానిలోకి స్టీల్ పైపుని అమర్చారు, మనిషిపట్టి   ప్పించుకోను వీలున్నదానిని. దాని ద్వారా లోపల చిక్కుకున్న శ్రామిక సోదరలంతా క్షేమంగా బయటకొచ్చేరు. శ్రామికుల్ని బయటకు తీసుకొచ్చేందుకు పని చేసిన సంస్థలకి,ఆందుకోసం పని చేసిన వారందరికి జేజేలు! ఇక చిక్కుని ఉండిపోయిన శ్రామికులు నమ్మకం కోల్పోక ఉండి జయప్రదంగా బయటకు వచ్చినందులకు అభినందనలు. ప్రయత్నం సఫలం చేసిన భగవానునునికి నమస్కారాలు.


ఎలుకబొరియ విధాన తవ్వకం భారతదేశం లో నిషేధింపబడింది, కాని అదేవిధానం నేడు అక్కరకొచ్చింది..

పాతంతా రోతకాదు! కొత్త వింతాకాదు!! పాతకొత్త విధానాల మేళవింపు  అద్భుతఫలితాలిస్తుంది.

Sunday, 26 November 2023

Friday, 24 November 2023

చిలికి చిలికి గాలివానయినట్టు.

 చిలికి చిలికి గాలివానయినట్టు.

ఇది ఒక నానుడి. చిన్నదిగా ప్రారంభమయినది ఆ తరవాత ప్రళయంగా మారడానికి వాడుతుంటారు.  నిజానికిది చినుకు చినుకు గాలివానయిందన్నది అసలు స్వరూపం అనుకుంటా. చిన్నదిగా ప్రారంభమైన ది  ఆ తరవాత చూస్తుండగా పెద్ద గాలివానైనట్టు. ఈ మాటని, చిన్న చిన్నగా, సరదా సరదాగా, ప్రారభమైన తగువు, ఆతరవాత పెద్ద కొట్లాటగాను ఆ తరవాత యుద్ధమే ఐనట్ట్లు కూడా చెబుతుంటారు

ఊరలేనిదే పేర పిలవరు

ఇదొక నానుడి. ఊళ్ళో పుట్టి పెరిగినవాణ్ణి ఆ ఊళ్ళోవాళ్ళు ఏదో పేరుతో పిలుస్తుంటారు.ముద్దు పేరైనా కావచ్చు. చిన్నబాబు,కన్నబాబు,ఎంకన్నబాబు,కొండబాబు ఇలా. ఇవి అసలు పేర్లూ కావచ్చు ముద్దుపేర్లూ కావచ్చు. ఇదే మనిషి, ఎక్కువకాలం ఊళ్ళో ఉండక ఎప్పుడేనా ఊరికి  వెళితే, ఎవరుబాబూ మీరు? అనే అడుగుతారు. ఎందుకంటే ఎక్కువకాలం ఎవరూ ఎవరినీ గుర్తు పెట్టుకోరు, గుర్తుంచుకోలేరు, కారణం రూపురేఖలు మారిపోతాయి, కాలంతో. ఇది నాకు చాలా స్వానుభవం, పుట్టి పెరిగిన ఊరిలో. అంతెందుకు నా సహాధ్యాయి, ఒరే అంటే ఒరే అనుకున్న వాళ్ళం మా ఊళ్ళో అన్నయ్య ఎదురుగా కలిసేం. అతను ఆ రోజుకు గ్రామ ప్రెశిడెంట్, ఏదో విషయం మాట్లాడడానికి వచ్చేడు, అన్నయ్యతో. నేనూ, అతనూ కూడా పలకరించుకోలేదు, గుర్తు పట్టలేదు ఇద్దరమున్నూ. అప్పుడు అన్నయ్య ఇతనెవరో తెలుసా? అడిగారు, నన్ను. తెలీదని బుర్రూపాను, అతన్ని అడిగితే అతనూ అంతే చెప్పేడు. అప్పుడు అన్నయ్య చెప్పేడు ఇద్దరికిన్ని ఇతను నీ స్నేహితుడు పాపోలు నాగరాజు అని, వీడు నా తమ్ముడు శర్మ అని చెప్పడంతో ఒక్క సారి నిర్ఘాంతపోయాం. ఆ తరవాత ఇద్దరమూ మీరు,మీరు అంటూ మాటాడుకున్నాం. చాలా సేపటికిగాని ఒరే అంటే ఒరే అనుకోలేకపోయాం. చిత్రం కదా! ఇదే ఊరలేకపోతే పేర పిలవరన్నదానికి సాక్ష్యం.


ఆ తరవాత కాలంలో దీనికి మరోలా అన్వయం కూడా చెపుతున్నారు, నిప్పు లేనిది పొగరాదుగా! ఏదో లేనిది కేసులెందుకు పెడతార్లే, ఊరలేనిది పేర పిలుస్తారేంటిలే!!! 

Wednesday, 22 November 2023

కొఱవితో తల గోక్కున్నట్టు


కొఱవితో తల గోక్కున్నట్టు

మండుతున్న కట్టెను కొఱవి అంటారు. దీనితో తలగోక్కుంటే ఏమవుతుంది? తల అంటుకుపోతుంది. కాలుతుంది. అనగా అనాలోచిత అవివేక చర్యగా చెబుతారు. తెలిసి,తెలిసి చేసేతప్పుగానూ చెబుతారు. 


సంచి లాభం చిల్లి కూడదీసినట్టు.

 సంచిని గోతం అని కూడా అంటారు. ఇప్పుడంటే 25కేజిలకి,50కెజిలకి,100కెజిలకి గోతాలున్నాయిగాని ఒకప్పుడు సంచి అంటే 100కెజిలు లేదా 24 కుంచాలు ధాన్యం పట్టే జనపనార సంచి అని వాడుక. గుడ్డ సంచిని చేతి సంచి అంటారు, ఇది చిన్నదిగా ఉంటుంది. పాతకాలంలో కొలతేగనక సంచి నిండాఅంటే 24 కుంచాలేనని వాడుక. ఈ సంచుల్ని మరలమరల వాడుతుంటే సాగిపోతాయి. 24 కుంచాలకంటే ఎక్కువ పడతాయి. ఒక వ్యాపారస్థుడు ఇలా సాగిపోయిన సంచి తీసుకుని రైతు దగ్గర ధాన్యం కొన్నాడు, ఇలా సాగిపోయిన సంచిలో నింపుకున్నాడు,ఎక్కువ ధాన్యం తెచ్చుకోవచ్చని ఆశకొద్దీ, లాభపడచ్చనుకుని. వాడకం ఎక్కువ కావడంతో అది చిల్లి పడింది, కాని ఇతను గమనించలేదు. ధాన్యాన్ని తెచ్చుకుంటున్నాడు, ఇంటికొచ్చేటప్పటికి అవి కాస్తా24 కుంచాలే ఉన్నాయి, కొల్చుకుంటే. ఎక్కువ పట్టిన వడ్లు ఏమయ్యాయి,చిల్లిలోంచి దారిపొడుగునా కారిపోయాయి. లాభం వస్తుందనుకుని ఆశకు పోయి మోసం చెయ్యబోతే జరిగేదానికి ఈ మాట చెబుతారు. ఒక్కొకప్పుడు ఇలా చేస్తే నష్టం కూడా వస్తుందనీ అంటారు. 

ఈనగాచి నక్కలపాలు.

ఇది వ్యవసాయ సంబంధమైన నానుడి. పంట వేసిన దగ్గరనుంచి జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలి, కాపలా కూడా కావలసొస్తుంది కొన్ని పంటలకి. ఇలా పంటని వేసింది మొదలు జాగ్రత్తగా కాపాడుకొచ్చి, చివరి కాలానికి అనగా పంట ఫలించే సమయానికి అశ్రద్ధ చేస్తే పాడవుతుంది, శ్రమ,సొమ్ము, సమయం వృధా అవుతాయి. ఈ నానుడి ముఖ్యంగా చెఱకు పంటకు చెబుతారు. చెఱకు సిద్ధమయ్యే కాలానికి నక్కలు పాడు చేస్తాయి.ఆ సమయం లో కాపలా కూడా పెడతారు, పంట కాపాడుకోడానికి. ఫలసాయం చేతికొచ్చే సమయానికి అశ్రద్ధ చేయడాన్ని ఈ నానుడితో చెబుతారు. 


Friday, 10 November 2023

మొలతాడు బిగిసింది.

 మొలతాడు బిగిసింది.


మొలతాడు బిగిసిందంటాం. మొలపెరిగిందనుకోం.  మొలతాడు చిక్కదు :) మనమే బలుస్తాం,ఎప్పుడో కట్టుకున్న మొలతాడిప్పుడెందుకు బిగుస్తుంది?మొల చుట్టుకొల్త పెరిగితేనేకదా!


సమస్య పట్టుకుని వదలటం లేదంటాం. సమస్యని మన మనసు పట్టుకుంది, తన చుట్టూ కట్టేసుకుంది. కాని సమస్య పట్టుకుంది వదలటం లేదంటాం.వదలవలసిందెవరు? మనమనసే. 

తననెవరో పట్టుకున్నారంటుంది, మరెవరో విడిపించాలనీ అనుకుంటుంది. చెబితే శానా ఉంది. 

అన్నిటికి మూలం మన మనసు.

ఇక చాలు.

సర్వే జనాః సుఖినోభవంతు.

.....స్వస్తి.....


Thursday, 9 November 2023

కాస్త తాళుము కృష్ణా

  కాస్త తాళుము కృష్ణా



తలుపు తీయునంతలోనె
తత్తర మదియేల నోయి?
తలుపుదీతు వీలు జూచి
తాళుము కృష్ణా!
    కొంతసేపు
తాళుము కృష్ణా!
    పతి నిద్దుర వోవలేదు
    మతి సందియ మొందె నేమొ
    పతికి కునుకు పట్టగ లో
    పలకు వత్తుగాని తాళు
    తాళుము కృష్ణా!
        కాస్తసేపు
    తాళుము కృష్ణా!
నుదుట బొట్టు దిద్దలేదు
చెదరియున్న ముంగురులను
కుదురుజేయలేదు యేల
పదెపదె పిలచెదవురా
తాళుము కృష్ణా!
    కాస్తసేపు
తాళుము కృష్ణా!
    ఏల నంత తత్తరమ్ము
    ఏల నంత భయము, సామి
    నిన్నుగాక వేరొక్కని
    నెట్లు వలవగలను కృష్ణ!
    తాళుము కృష్ణా!
        కాస్తసేపు
    తాళుము కృష్ణా!


గుత్తొంకాయ్‌ కూరోయ్‌ బావా!
కోరి వండినానోయ్‌ బావా!
కూరలోపలా నా వలపంతా
కూరిపెట్టినానోయ్‌ బావా!
    కోరికతో తినవోయ్‌ బావా!తియ్యని పాయసమోయ్‌ బావా!
తీరుగ వండానోయ్‌ బావా!
పాయసమ్ములో నా ప్రేమనియేటి
పాలుబోసినానోయ్‌ బావా!
    బాగని మెచ్చాలోయ్‌ బావా!కమ్మని పూరీలోయ్‌ బావా!
కర కర వేచానోయ్‌ బావా!
కరకర వేగిన పూరీలతో నా
కాంక్ష వేపినానోయ్‌ బావా!
    కనికరించి తినవోయ్‌ బావా!వెన్నెల యిదుగోనోయ్‌ బావా!
కన్నుల కింపౌనోయ్‌ బావా!
వెన్నెలలో నా కన్నెవలపనే
వెన్న గలిపినానోయ్‌ బావా!
    వేగముగా రావోయ్‌ బావా!పువ్వుల సెజ్జిదిగో మల్లే
పువ్వుల బరిచిందోయ్‌ బావా!
పువ్వులలో నా యవ్వనమంతా
పొదిపిపెట్టినానోయ్‌ బావా!
    పదవోయ్‌ పవళింతాం బావా!
బసవరాజు అప్పారావు గారి గేయం

Wednesday, 8 November 2023

మాట విలువ

మాట విలువ  

 రామకృష్ణులు మఠంలో ఉండగా, ఒక తల్లి తనకొడుకుని తీసుకుని వచ్చి, ఈ కుర్రవాడు చిన్నవయసులోనే చెప్పినమాట వినటం లేదు, బెల్లం ఎక్కువ తింటున్నాడు , మీరు చెబితే వింటాడని మీదగ్గరకి తీసుకొచ్చానంది.


విన్న రామకృష్ణులు రేపురమ్మని వాయిదా వేసేరు. ఆ తల్లి కొడుకుని తీసుకుని మరునాడొచ్చింది. మళ్ళీ రేపురమ్మని వాయిదావేసేరు. ఇలా వాయిదాలమీద వాయిదాలు వేస్తూనే ఉన్నారు, కాని కుర్రవానికి బెల్లం తినద్దని చెప్పటం లేదు. ఆ తల్లి పట్టువదలక తిరుగుతూనే ఉంది. చివరికి   నెలదాటిన తరవాత రామకృష్ణులు ఆ కుర్రవానితో, బెల్లం తినకు ఆరోగ్యం చెడిపోతుందని చెప్పేరు. అప్పుడు ఆ తల్లి రామకృష్ణులతో, ఈ మాట మీరు నెలకితమే చెప్పి ఉండచ్చుగా! అని అడిగింది. అంత రామకృష్ణులు తల్లీ! నెలకితందాకా నేనూ బెల్లం తింటున్నవాడినే. ఈ నెలలోనే నేను బెల్లం తినడం మానేసాను, ఆ తరవాతే చెప్పేను, అన్నారు. చిత్రంగా ఆ కుర్రవాడు ఆ   తరవాత బెల్లం మరి తినలేదు.


ఆచరించి చెప్పినమాటకంత విలువుంటుంది.

గాలివాటు మనుషుల మాటకి విలువుండదు.

Monday, 6 November 2023

గతకాలపు వైభవ చిహ్నాలు.

 



Raleigh సైకిలు


LG TV

Post-Box


కల్వం,సన్నికల్లు,రుబ్బురోలు,కుందిరోలు


వస్తువుల్ని గుర్తు పట్టండి

అవసరం తీరేకా మానవులూ ఇంతే! ఐతే కొందరు గతకాలపు వైభవ చిహ్నాలుగా మిగిలిపోతారు, మరికొందరు కాలగర్భం లో నామరూపాలు లేక మలిగిపోతారు.

Sunday, 5 November 2023

శిలాభిశ్చ ప్రహరతి

 శిలాభిశ్చ ప్రహరతి


నమోఽస్తు రామాయ స లక్ష్మణాయ

దేవ్యై చ తస్త్యె జనకాత్మ జాయై

నమోఽస్తు రుద్రేంద్ర యమా నిలేభ్యో

నమోఽస్తు చంద్రార్క మరుద్గణేభ్యః


జయత్యతి బలోరామో

లక్ష్మణస్య మహాబలః

రాజా జయతి సుగ్రీవో

రాఘవేణాభి పాలితః


దాసోఽహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః

హనూమాన్ శత్రుసైన్యానాం నిహన్తా మారుతాత్మజః


న రావణ సహస్రం మే

యుద్ధే ప్రతిబలం భవేత్

శిలాభిశ్చ ప్రహరతి

పాదపైశ్చ సహస్రసః


అర్దయిత్వా పురీం లంకా

అభివాద్య చ మైథిలీమ్

సమృద్దార్ధో గమిష్యామి

మిషతాం సర్వ రక్షసామ్


అర్థసిద్ధిం తు వైదేహ్యాః

పశ్యామ్యహముపస్థితామ్

రాక్షసేంద్రవినాశం చ

విజయం రాఘవస్య చ


**********

రామరామ జయరాజారామ్

రామరామ జయసీతారామ్

Saturday, 4 November 2023

దొంగని దొంగే పట్టాలి-1

 దొంగని దొంగే పట్టాలి...1


మొన్నీ మధ్యే ముల్లును ముల్లుతో తీయాలన్నదానికి ఒక కత చెప్పుకున్నాం. మరి దొంగని దొగే పట్టాలంటే! ఇదీ ఒక నానుడే. ఒక కత చెప్పుకుందాం.అలా ముందుకుపోదాం.


అనగనగా ఒక రాజ్యం, దానికోరాజు,ఒక మంత్రి.రాజ్యం ధనవంతమైనదే కాని పేదలే ఎక్కువ. ఆ రాజ్యంలో దొంగతనాలు పెరిగిపోయాయి.రాజుకి తాకిడి ఎక్కువయ్యింది, దొంగతనాల గురించి. మంత్రిని నిలదీశాడు,రాజు. దానికి మంత్రి ''రాజా! కలిగినప్పుడు మాత్రమే దొంగతానాలెక్కువగా ఉంటాయి. లేనివాడింటికి కన్నమేసేటంత మూర్ఖుడు ఎవడూ ఉండడు. 'లేనివాడింటికి కన్నమేస్తే పైన బుర్రలు, కింద పిర్రలు తప్పించి ఏమీ దొరకవు'. అంచేత మనదేశం ధనవంతమైనది, అందుకు సంతసించండి'', అన్నాడు మంత్రి.


రాజు,''దేశం ధనవంతమైనందుకు నిన్ను అభినందిస్తున్నాను. మన పరిపాలన  సవ్య దిశలో నడుస్తున్నట్టేగా! అది సరేగాని లేనివాడింటికి కన్నమేస్తే పైన బుర్రలు, కింద పిర్రలు తప్పించి ఏమీ దొరకవన్నావు. అదేంటో చెప్పూ'', అన్నాడు.


వినండి, రాజా! మన దేశంలో ఒక పల్లెటూరు. అందులో ఒక జాయ,పతి. వయసులోనే ఉన్నారు. రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబం. ధనానికి లోటేమోగాని సంతానానికి లోటు లేదు, ఇంటి నిండా పిల్లలే! ఆ కుటుంబ యజమాని ధనం మాటెలా ఉన్నా పిల్లల్ని మాత్రం కనేసేడు, పదిమందిని. పూర్వులు సంపాదించి ఇచ్చిన కొంప పడిపోడానికి సిద్ధంగా ఉన్నదానిలో కాపరం. ఒక రోజు ఇంటి ఇల్లాలు పిల్లలికి కలిగినదేదో పెట్టి తను గంజితాగి పడుకుంది, ఉన్న ఒకే ఒక్కదీపాన్ని మలిపేసి.పిల్లలు తనూ కింద పడుకున్నారు. నడిరాత్రి ఒక దొంగ నెమ్మదిగా ఉతకలెత్తేసి తలుపులు తీశాడు. మెలుకువొచ్చిన ఇల్లాలు పడుకునే ఉంది. దొంగ ఇల్లంతా తిరిగేడు. చీకటి, ఎక్కడ చూసినా తలకి ఆనపకాయ బుర్రలేతగులుతున్నాయి. అవీ ఖాళీగా ఉన్నవే. ఇంక కాలికి పిల్లల పిర్రలే తగులుతున్నాయి, ఎటుతిరిగినా. ఏమీ విలువైనది దొరక్కపోతే దొంగ, ''ఎరక్కపోయి ఇంటికి కన్నం వేసాను, ఎటుచూసినా పైన బుర్రలు,కింద పిర్రలు తప్పించి ఏమీ దొరకలేదని'' సణుక్కున్నాడు. విన్న ఇంటి ఇల్లాలు. 


''అన్నా!రాత్రి వేళ ఇంటికొచ్చావు. కనీసం గంజి కూడా లేదు, పోద్దామంటే! ముందు తలుపులెత్తేసేవు, దయ ఉంచి వెనక తలుపులు కూడా ఉతకలెత్తెయ్యి. వాటిని బాగుచేసుకోవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా! వాటిని ఎత్తి బయటకు తీయలేక ఊరుకున్నా!'' అంది. విన్న దొంగ నిర్ఘాంతపోయాడు. ''చెల్లీ! దీపమేనా పెట్టుకోలేదే''మని అడిగాడు. 


''అన్నా! ఉన్నది ఒక్కదీపం అది రాత్రంతా వెలిగితే మర్నాడు వెలిగించుకోడానికుండదు'' ''బావగారు!......'' వాకబు చేశాడు దొంగ. ''పొరుగూళ్ళో ఉద్యోగానికెళ్ళేరు. ఉదయానికొస్తా''రంది. దొంగ చలించిపోయాడు, ఇంత దుర్భర దారిద్యం చూసి. దీపం వెలిగించమని, ఆపై ఆమె చెప్పిన పని చేసి పెట్టి, తన దగ్గరున్న సొమ్మును ఆమెకిచ్చి, దణ్ణం పెట్టి, ఇకపై దొంగతనం చేయనని కష్టపడి బతుకుతానని ఆమెకు మాటిచ్చి వెళ్ళేడు.


కతబాగుందిగాని అసలు సంగతి చెప్పండి, అడిగాడు రాజు. రాజా! విషయం రేపు చెబుతానని వాయిదా వేసాడు మంత్రి...

ఎదురు చూడక తప్పదుగా

Wednesday, 1 November 2023

నడక నేర్చుకుంటున్నా!

 

 


నడక నేర్చుకుంటున్నా!

 ఓం సర్వవ్యాధి ప్రశమనీయైనమః


చిన్నప్పుడు నడక నేర్చుకున్నా! అమ్మ వెనకుండి నేర్పింది. మూణ్ణెల్లు మంచం మీదుంటే, నడక మరిచిపోయా! నడవడమంటే భయంగా ఉంది పడిపోతానేమోనని, మళ్ళీ ఎముక విరుగుతుందేమోనని,భయం. మళ్ళీ

ఓం దరహాసోజ్వలన్ముఖాయైనమః) అమ్మలగన్నయమ్మే నడక నేర్పిస్తోంది. మెల్లమెల్లగా అడుగులేస్తూ కఱ్ఱ బోటేసుకుని గ్రౌండు దాకా నడిచా! 


ఎందుకిన్ని తిప్పలు? హాయిగా పడుకోవచ్చుగా! నిజమే అలా మూడు నెలలు, కాలు విరిగి  బలవంతంగా పడుకుంటే, బద్ధకం ముందు పెరిగింది. ఆ పై సుగర్ పెరిగింది, బరువు పెరిగింది,BMI పెరిగింది.కనపడని బి.పి పెరిగింది.ఆకలి తగ్గింది.

సుగర్ డాక్టర్ నడిస్తేగాని సుగర్ తగ్గదు,బరువు తగ్గదు,బి.పి తగ్గదు, ఆకలిపుట్టదంటారు. ఎముకల డాక్టర్ పడుకునుంటేగాని కాలు సరిపడదంటారు. పిచ్చి కుదిరితే పెళ్ళికుదురుతుంది, పెళ్ళికుదిరితే పిచ్చి కుదురుతుంది. ఏది ముందు? బలే లింకులేసేవయ్యా సామీ!అంతేలే కారణం లేనిది కార్యం జరగదని అంటారు. తీసుకుపోయేటందుకు, నెపం నీమీదుంచుకోవనీ అంటారు.

ఇంకా కొంతకాలం తిరిగే యోగం ఉన్నట్టే ఉంది, నడుస్తున్నా, నెమ్మదిగా, ధైర్యం వచ్చింది. :) 


పైవాడు బలే లింకు లేస్తాడు, తీయాలంటే అంత తేలిగ్గానే తీసేస్తాడు. అది పైవాని వల్లే ,అవుతుందిగాని మనవల్లగాదు. కాని మనం మాత్రం సాగినంతకాలం నా అంతవాడు లేడందురు, సాగకపోతే ఊరక చతికిలబడిపోదురు, ఇదీ కత.బయట లోకం అంతా కొత్తగా ఉంది, బ్లాగ్ లోకం వింతగా ఉంది  :)