21, జనవరి 2015, బుధవారం

శర్మ కాలక్షేపంకబుర్లు-తోలుబొమ్మలాట.


భారతదేశం కళలకు కాణాచి, అందునా తెనుగునేలపై వివిధ కళారూపాలు పురుడుపోసుకున్నాయి. హరికథ, బుఱ్ఱకథ,జముకులకథ, ఒగ్గు కథ, ఇలా చాలా చాలా కళారూపాలున్నాయి. వీటన్నిటికి పరమార్ధం ఒకటే, ఆనంద సందర్శనం. ఈ ఆనంద సందర్శనం భగవంతుని రూపంలో పొందాలునుకోవడమే భారతీయ కళల ముఖ్యోద్దేశం.  అటువంటి వాటిలో ఒకటి, ఈ తోలుబొమ్మలాట. ఇది నేటి సినిమాకి చాలా దగ్గర రూపం. నిజానికి నేను చూసిన తోలుబొమ్మలాట అరవై సంవత్సరాల పై బడినది. బహుశః అరవై సంవత్సరాల కితం నేను చూసిన తోలుబొమ్మలాటకి, నాలుగురోడ్ల కూడలిలో ఒక వైపుగా రామాలయం దగ్గర నాలుగు గుంజలు పాతి, దాని చుట్టూ మూడు వైపులా బట్ట కట్టి, ముందు వైపు ఒక పల్చటి, తెల్లటి బట్టను తెరగా ఎత్తుగా కట్టి కింది భాగంలో దళసరిపాటి బట్టను కట్టి తోలుబొమ్మలాటకి తగిన వసతి ఏర్పాటు చేసారు. మూడు వైపులా మూయబడిన దానిలోపల రెండు కాగడాలు వెలిగించి తెరకు కొద్ది దూరంలో ఉంచుతారు, ఇరుపక్కలా. కాగడాలు ముందుకుంటే తెర అంటుకునే ప్రమాదం. దూరంగా ఉంటే తెరమీది బొమ్మ కనపడకపోవడం కాక, బొమ్మల్ని ఆడించేవారి నీడ పడుతుంది, అందుచేత సమదూరంలో కాగడాలు పెట్టాలి. చీకటిలో కూచున్న ప్రేక్షకులు తెరమీద బొమ్మలు కదలటం, వెనుకనుంచి పాట, మాట వింటారు.ఆ తరవాత కావలసిన సాధనాలు, రెండు బల్లలు, రెండు చెక్కలు, హార్మోనియం, ఫ్లూట్, మృదగం వగైరా వాద్యాలు, ఆ గదిలాటిదానిలో పెట్టుకుంటారు. ఇక ఆడించవలసిన బొమ్మలని పెద్దపెద్ద వెదురు బుట్టలలో తెస్తారు.



సరస్వతీ ప్రార్ధన


 వీటిని తాయారు చేయడం కూడా ఒక పెద్ద పని. చనిపోయిన జంతు చర్మాన్ని ఒలవాలి, బాగుచెయ్యాలి, ఎక్కువగా ఆవు చర్మమే అయి ఉంటుంది. దానిని సరియైన విధంగా కత్తిరించాలి. వాసనలేకుండా చూడాలి, అబ్బో ఇది చాలా కష్టంతో కూడుకున్నపనే. ఇలా తయారు చేసిన బొమ్మలకి రంగులద్ది ఎండబెట్టి....అప్పుడు తెరమీద వేయడానికి అనువుగా ఏర్పాట్లు చేసి కాళ్ళూ చేతులూ ఆడించడానికి తగు ఏర్పాట్లు చేసి వాటిలో చిన్న కఱ్ఱ, పొడుగైనదాన్ని దూర్చి ఆడించడానికి తయారు చేసి, తోలుబొమ్మలాట మొదలుపెడతారు, గణేశ ప్రార్ధనతో, సరస్వతీ ప్రార్ధనతో.


నిజానికి జానపదుల కళా రూపమన్న పేరేకాని పలికే ప్రతిపలుకులో సరస్వతి లాస్యం చేస్తుందంటే అతిశయోక్తి కాదు, ఆ పలుకు అచ్చ తెనుగు నుడికారమై కమ్మని ఆవునేయిలా ఘుమఘుమలాడుతూ ఉంటుంది. ప్రతి పలుకు అంత స్పష్టంగానూ, ఉఛ్ఛారణా దోషాలు కూడా లేని విధంగా కళాకారులుంటారంటే, వారి నిజజీవితంలో కూడా ఇంత నిష్ఠా కలిగి ఉంటారంటే, ఆనందమే కలుగుతుంది. వీరు రామాయణ, భారత,భాగవతాలనుంచి కొన్ని ఘట్టాలు ప్రదర్శిస్తారు. పూర్వం రోజుల్లో వీరు బళ్ళు కట్టుకుని, కుటుంబాలతో సహా ప్రయాణాలు చేసి, వారాల తరబడి ఒకే ఊళ్ళో ప్రదర్శనలూ ఇచ్చేవారు. కథ చెప్పే, పాట పాడే, వాయిద్యాలు వాయించే కళాకారులంతా ఆ కుటుంబ సభ్యులే అయి ఉండేవారు.ఇక ఈ తోలుబొమ్మలాటలో హాస్యానికి గాను కేతిగాడు, బంగారక్కల జంట, గాందోళిగాడు, జుట్టుపోలిగాడు అనే వారూ కనపడతారు. ఆట మధ్యలో వీరిని తెరపై ప్రవేశపెట్టి హాస్యం పండిస్తారు. నేనెరిగినరోజులనాటికే ఈ హాస్యం కాస్తా అపహాస్యంగానూ ద్వందార్ధాలతో కూడిన బూతులుగానూ ఉండేవి. అసలు కళా రూపమే అంతరించి పోయిందనుకున్నా. ఇన్ని ఏర్పాట్లు చేస్తే కాని తోలుబొమ్మలాట జరగదు. అందుకే దీనిని తెరవెనక భాగవతం అన్నారు. నిజంగా ఇది నేటి సినిమా స్క్రీన్ ప్లే.  హరికథ,బుఱ్ఱకథ, నాటకాలని సినిమా మింగేసింది. సినిమాను టి.వి. మింగేసింది. టి.వి. ని ఇంటర్నెట్ మింగేసింది. మరింక కొత్తదేం పుడుతుందో చూడాలి. అందుకే పురాతన జానపద కళారూపాల్ని బతికించుకోవాలి. ఇప్పుడిపుడే ఈ స్పృహ కలుగుతోంది. మళ్ళీ పల్లెలలో జానపద కళారూపాలు ఆదరింపబడాలి.


ఏ కళా రూపానికైనా ముఖ్యమైనవారు ప్రేక్షకులు. వారు చూసి ఆనందించి అభినందించినపుడే కళాకారుని తృప్తి, సంతృప్తి. తోలుబొమ్మలాట చూడడానికి ఎవరొస్తారనుకున్నా. ఎక్కువగా వచ్చినది స్త్రీలు, పిల్లలు. నిజంగానే నాకు ఆనందం వేసింది. చిన్నపిల్లలకి ఈ కళారూపాన్ని దగ్గర చేయడానికి ముఖ్యులు స్త్రీలు, ఇంకా ఈ దేశంలో సంస్కృతి, సంప్రదాయం మిగిలున్నాయంటే, అదంతా స్త్రీల చలవే సుమా.  


 ఈ కళాకారులు, ఈ కళారూపాన్ని చాలా జాగ్రత్తగా పోషించుకొస్తున్నారు. ఏ జానపద కళ ఐనా ప్రజల మన్ననా, ఆదరం, గౌరవం పొoదలేనపుడు మాత్రమే కనుమరుగైపోతుంది. ఈ కార్య క్రమాన్ని నేను పూర్తిగా చూడలేకపోయాను కాని, చాలా బాగుందని చెప్పేరు. ఆ తరవాత, ఇదే కళాకారులు కాకినాడ బీచ్ ఫెస్టివల్ లో కూడా ప్రదర్శన ఇచ్చారనీ,ప్రజల ఆదరణ బాగుందనీ పేపర్లో చూశా. ఆనందమనిపించింది. ఇంతకీ మీకు ఈ కళా రూపం మీద అభిమానానికి కారణం? ఒకప్పుడు మావూరు, నరిసిపూడి ఈ కళారూపానికి పుట్టిల్లు. గోదావరి జిల్లాలో మా ఊరి కళా కారులుకి మంచి పేరుండేది. నేడు అక్కడ ఈ కళా రూపం పేరు చెబితే గుర్తు పట్టేవారు కూడా లేరు, ఆ కళ వీరి దగ్గర బతికి బట్ట కట్టినందుకే ఆనందం.  

మా ఊళ్ళో శ్రీ శారదా సంగీత కళా సమితి అనే ఒక సంస్థ ఉంది. దాని యాజమాన్యంలో, కొంత కాలం సంగీతం మటుకు కార్యక్రమాలు త్యాగరాజ ఆరాధనోత్సవాలలో జరిపించేవారు. కాలంతో మార్పు తెచ్చి, సంగీతంతో పాటు ఇతర కళా రూపాల్ని కూడా నిర్వహించడం మొదలు పెట్టి, హరి కథ, బుఱ్ఱకథ, మొదలైనవాటిని కూడా ప్రదర్శన లిప్పించడం మొదలు పెట్టేరు. ఈ సంవత్సరం తోలుబొమ్మలాట ను పెట్టేరు. ఈ కళ చాలా కాలం గా మరుగున పడిపోయే ఉంది. 

ఈ జానపద కళ గురించి నేను చెప్పేకంటే వారిచ్చిన్ బ్రోచర్ చూడండి. 



ఈ కళని బతికించడమెలా? ప్రభుత్వం...ఆగండి ప్రభుత్వం ఎంత చేస్తుందో మనకి తెలియదా? మరెలా? మనమే ఈ కళని ప్రోత్సహించాలి. అదెలా? మన ఊరిలో సంబరాలకి,గణపతి నవరాత్రులకు, దుర్గా నవరాత్రులకు మరే ఇతర ఊరుమ్మడి కార్యక్రమానికైనా ఈ ప్రోగ్రాం పెట్టుకోవచ్చు. మరలా పాత రోజుల్లో లా పెళ్ళి చేసుకోవాలనే అనుకుంటున్నది యువత, ఆ పెళ్ళికి ఈ కార్యక్రమం పెట్టుకోవచ్చు. ఇక విదేశాలలో వారికి నేను చెప్పక్కరలేదు కదా! ఇప్పటికే వీరిని తానా వారు,ఇతర దేశాలవారూ ఆదరించారు. మరెందుకు ఆలస్యం, అవసరమైనవారు వివరాలు గుర్తుపెట్టుకోగలరు.

వీరిని పరిచయం చేస్తానని మాటిచ్చాను,స్కేన్ చేయాల్సిన కాగితం పని కాలేదు, అందుకే ఆలస్యమైపోయింది, కళాకారులు మన్నించ వేడుతున్నా. 

17, జనవరి 2015, శనివారం

శర్మ కాలక్షేపంకబుర్లు-కల నిజమౌనా?


ఈ వేళ తెల్లవారుగట్ల ఒక కలొచ్చింది, సాధారణంగా నాకు కలలు రావు. వచ్చినా మరచిపోతానేమో, ఇది మాత్రం గుర్తుంది.కల ఇది

" నా పై ఆఫీసర్ నా గురించి తన పై ఆఫీసర్ కి ఫిర్యాదు చేసేరట. ఏమనీ " ’ఇతను చెప్పినమాట వినటం లేదు, ప్రతిదానికి వ్యతిరేకిస్తున్నాడు, అందుచేత ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసెయ్యమని’ ’ఈ సంగతి ఒక మిత్రుడు ఫోన్ చేసి చెప్పేడట, సలహా కూడా ఇచ్చేడు, నువ్వొక సారి పెద్ద ఆఫీసర్ గారిని కలిసి నీ సంగతి చెప్పుకోమనీ"  కల చెదిరింది, కథ మారిందీ, మెలకువ  వచ్చేసింది. ఈ కథకు అర్ధమేమీ? 

నిజ జీవితంలో ఇలా చాలా సార్లే జరిగేయి, నాకిది కొత్తా కాదు. ఇప్పుడు రిటయిర్ అయి కూచున్నవాడికి ట్రాన్స్ఫర్ ఏమి? అసలు కలలెందుకొస్తాయి? తెల్లవారుగట్ల వచ్చిన కలలు నిజమౌతాయంటారు, నిజమా? 

16, జనవరి 2015, శుక్రవారం

శర్మ కాలక్షేపంకబుర్లు-స్వడబ్బా!



స్వకుచ మర్దనం, పరకుచ మర్దనం, పరస్పర కుచ మర్దనం అని ఇది మూడు రకాలూ అన్నారు, పూర్వీకులు. దీనికి తెనుగు అర్ధం చెప్పడం అశ్లీలoగా ఉంటుందనుకున్నా, అందుకుగాను దీనిని స్వడబ్బా, పరడబ్బా, పరస్పరడబ్బా అని తెనుగులో చెప్పుకోవచ్చనుకుంటా. ఇది పూర్వకాలం నుంచీ ఉందండి. ఇది చూడండి. 

రామో విగ్రహవాన్ ధర్మః

సాధుః సత్యపరాక్రమః
రాజా సర్వస్య లోకేస్య
దేవానామివ వాసవః.


దీని అర్ధం రాముడు మూర్తీభవించిన ధర్మం, సాధు పురుషుడు, సత్యవంతుడు, పరాక్రమవంతుడు, అదీకాక దేవతలకి ఇంద్రునిలాటివాడు అని చెప్పేడు! ఎవరూ? చెప్పినది? మారీచుడు. ఎవరితో? సాక్షాత్తు రావణునితో. శత్రువు గురించి,  మంత్రి తన రాజు దగ్గర చెప్పిన మాటలివి.  రావణుడేమనుకున్నాడూ మారీచుడు భయపడి రాముడి డబ్బా కొడుతున్నాడనుకున్నాడు తప్పించి, అది నిజమని నమ్మలేకపోయాడు. 


అవి సత్య కాలపు రోజులు కదా! భయపడినా నిజమే చెప్పేడు. ఇప్పుడు ఎవరి డబ్బా వారే వాయించుకోవాలి, మరొకరు ఎవరూ వాయించరు, అంత ఖాళీ ఎవరికీ లేదు. అదీగాక ఎదుటివాడి గొప్పతనం అంగీకరించడానికి మనం తెనుగువాళ్ళం కదూ! ఆత్మాభిమానం మెండు. అవసరాన్ని బట్టి పరస్పర డబ్బా ఉంటుందనుకోండీ! దీనికి ఉదాహరణలు కావాలా? నిన్నటిదాకా మన దేశాన్నేలిన పార్టీవారేమన్నారు, గుర్తు తెచ్చుకోండి, మేము తప్పించి ఈ దేశాన్ని పాలించగలవారు ఎవరూ లేరని కదా డబ్బా కొట్టుకున్నది, మరి వారికి తోడు నట్టువగాళ్ళు మరికొంత పరడబ్బా కొట్టేరు కదండీ, వీరికంటే గొప్ప పరిపాలకులు, ధర్మాత్ములు, ఉండబోరని.అసలు పరిపాలనే మరెవరు చేయబోలేరని కూడా చెప్పేరు కదా! ప్రజలా తెలివి తక్కువ వారు? చాలు బాబూ! మీపరిపాలన అని, ముసుగేసి మూల కూచోబెట్టేరు, ఇద్దరినీ. దీనితో నట్టువగాళ్ళకి ఒంటికి కారం రాచుకున్నంత సుఖంగానూ ఉంది. అందుకుగాను తెగ డబ్బా కొట్టేసుకుంటున్నారు,తెగ రెచ్చిపోయి, ఇప్పుడు. ఆఖరిమాట శత్రుదేశంవారు, ’భారతదేశం లో ఇదివరకు సున్నితంగా స్పందించే ప్రభుత్వం ఉండేది, ఇప్పుడు ప్రభుత్వం మొరటుగా ప్రవర్తిస్తోందని’. శత్రువుతో సున్నితంగా ఎలా ఉంటారు? రాజకీయమేమో! డబ్బా కొట్టుకోడం ఏ స్థాయికి చేరిందో!


ఇక ఈ విషయంలో కవులు కళాకారులదంతా అదో తరహా.ఇక వీరికి డబ్బా కొట్టడం లో పత్రికలది మరోతరహా. గొప్పనటుడు "న ’బూతో’ నభవిష్యతి" వీరు నోరు విప్పితే పలికేవన్నీ బూతులే మరి. ’నవరసభరిత నటుడు, కళ్ళతోనే భావాలు పలికించగలదిట్ట’, ఇది పత్రికలవారు, ఆ నటుడికి కొట్టే డబ్బా. చెక్కపేడు  ముఖంతో, ఆ నటుడి ముఖంలో ఏ ఒక్క భావమూ కనపడదు, చివరికి శోకం కూడా. అది మనని ఆవరిస్తే నటుడి దగ్గరెందుకుంటుంది చెప్పండి, కర్మ కాలి సినిమా చూస్తున్నందుకుగాను. మరి సినిమాలెందుకాడుతున్నాయని కదా మీ అనుమానం. అవికాగోర్ లాటి అమ్మాయిని తెచ్చి, హీరోయిన్ ని చేస్తే, ఆ నటి నటిస్తోందా? పాత్రలో జీవిస్తోందా అనిపించేలా ఉంటే సినిమా ఎందుకుపోదూ? మరి ఆ నటికి ఆ డబ్బా మాత్రం ఉండటం లేదు, కలికాలం.


ఇక కవులు, ఛస్తే మరొకరి గొప్ప ఒప్పుకోరుకదా! ఏమైనా అంటే ’ఏ గతి రచించినన్ సమకాలికులెవ్వరు మెచ్చరే కదా’ అని చామకూర వేంకన్న ఎప్పుడో చెప్పేడు, మాకు పార్వతీ దేవి శాపం ఉంది లెండి అంటారు. కాని ఒక చిత్రం గమనించేరో లేదో వీరు మాత్రం ఒకరి వీపు మరొకరు బహు పసందుగా గోక్కుంటారు. తేడాలొస్తే వీధిన కూడా అలాగే పడతారు. సవతుల కయ్యంలా ఉంటుంది. అప్పుడు బహు పసందుగా ఉంటుంది లెండి, చెప్పడం కష్టం, వినాల్సిందే, అవి బూతులు కదా.


ఇంతకీ మీ గోలేమని కదా మీ అనుమానం. నేను ’కష్టేఫలె’https://kastephale.wordpress.com/ అనే ఒక బ్లాగు మొదలు పెట్టి రాశాను. చాలాకాలమే రాశాను. అందులో 750 పైబడిన టపాలూ ఉన్నాయి. ఈ మధ్య కూడలి లో నా బ్లాగు టపాలు కనపడటం లేదు. వారికి చెబితే, ఇబ్బందులున్నాయి, సాంకేతికంగా, సరి చేయడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పేరు. ఈ ఆగ్రిగేటర్ నెమ్మదిగా పని చేసినా, టపాలు చూడటానికి చాలామంది దీనినే ఎంచుకుంటారన్నది బహిరంగ రహస్యం.


  ఇక మాలిక ఇందులో కూడా టపాలు కనపడకపోతే చెప్పేను, టపాలు కనపడేలా సరి చేసేరు,వెంటనే. మరి కామెంట్లు ఆక్సిజన్ కదా! అవి కనపడకపోయేయి. మళ్ళీ చెప్పేను, సాంకేతికలోపం సరి చేయడానికే ప్రయత్నిస్తున్నామన్నారు.ఇందులో కామెంట్లూ, టపాలూ కూడా వేగంగా కనపడతాయి. కూడలి తరవాతది ఇదే, ఎక్కువ మంది కామెంట్లనుంచి వచ్చి టపా చదువుతారు. 


ఇక మూడవదైన బ్లాగిల్లు లో టపాలూ, కామెంట్లూ కూడా కనపడుతున్నాయి, కాని ఎందుకోగాని ఈ ఆగ్రిగేటర్ నుంచి ఎక్కువమంది క్లిక్ చెయ్యరు, కారణం తెలియదు. ఈ ఆగ్రిగేటర్ కొద్ది నెమ్మది, కామెంట్ల విషయంలో. 


ఉన్నమాటనుకోవాలి, ఈ ఆగ్రిగేటర్ల వారిని మా టపా కనపడటం లేదు, మా కామెంట్ కనపడటం లేదు అని అడుగుతున్నాం కాని పని చేసిన కాలంలో వారిచ్చిన సహకారానికిగాను, సేవలకు గాను, వారి డబ్బా కొట్టవలసిన అవసరం మనమీద ఉందా లెదా? మరి మనమెందుకు ఆ పని చెయ్యటం లేదు? భాష మీది పిచ్చి ప్రేమతో వారీ పని చేస్తున్నారు తప్పించి మరొకటి కాదని మనం గుర్తించాలా వద్దా? పక్క రాష్ట్రం లో  ఆగ్రిగేటర్లు డబ్బులు వసూలు చేస్తున్నాయి, బ్లాగర్ నుంచి, డబ్బులు వసూలు చేస్తే మనలో ఎంత మంది కట్టడానికి సిద్ధంగా ఉన్నమో చెప్పండి. మనమేమో కామెంట్ కనపడలేదని ఎగురుతున్నాం కాని, వారు ఇంత చేస్తున్నందుకు వారికి ఒక సారి జే జే లు చెబుతున్నామా? వారూ మనలాటివారే కదా! మనకి ఒకరు ప్రోత్సాహం ఇస్తే సంతసిస్తున్న మనం, సేవలందించేవారికి జేజేలు పలకాలా? వద్దా?, అందరమూ, మాట కలపండి, జేజే లు చెప్పండి. ఆగ్రిగేటర్ల ఆర్ధిక పరిపుష్టికి మనం చేయగలదేమైనా ఉందా? ఆలోచించండి, ఆగ్రిగేటర్ల వారికీ ఒక మనవి, ఏడ్ లు తీసుకుంటే కొంత సౌకర్యం ఉంటుందికాదా, ఆలోచించండి.


ఈ సందర్భంగా నాకున్న రెండవ బ్లాగు ఇదే, దీనిలో రాద్దామని సంకల్పించా, అదీ తిరకాసు. ఇందులో ఫోటో లు మాత్రం పెట్టేవాడిని. ఇప్పుడు రాతలకి ఉపయోగిద్దామని ప్రయత్నం, అదనమాట సంగతి,నాలుగురోజులాగచ్చుగా? ప్రశ్న. అరవై ఏళ్ళ కితం చూసి, ఆ తరవాత కను మరుగైపోయిన ఒక కళా రూపాన్నిచూశా, దాని గురించి చెప్పెయ్యాలని, కడుపు ఉబ్బిపోతోంది, అదీ సంగతి.  మరి దీన్నేమంటారు? స్వడబా కదా!


ఇక https://kastephale.wordpress.com/,ఆ బ్లాగును ప్రైవేట్ బ్లాగ్ చేశాను, పా టపాలు చదువుకోవాలనుకుంటే అందులోకి ప్రవేశించాలి. మెయిల్లో టపా అందుకునేవారు మరల ఇక్కడ కూడా రిజిస్టర్ చేసుకోవాలి, మంచిరోజులొస్తే మళ్ళీ అందులోకి మారిపోదాం. ఇబ్బంది కలగ చేసినందులకు క్షంతవ్యుడిని.


15, జనవరి 2015, గురువారం

22, డిసెంబర్ 2014, సోమవారం

బతుకుకోసం-బదనిక(parasite)




                                                                                   బతుకుకోసం

బదనిక(parasite)

3, డిసెంబర్ 2014, బుధవారం