భారతదేశం కళలకు కాణాచి, అందునా తెనుగునేలపై వివిధ కళారూపాలు పురుడుపోసుకున్నాయి. హరికథ, బుఱ్ఱకథ,జముకులకథ, ఒగ్గు కథ, ఇలా చాలా చాలా కళారూపాలున్నాయి. వీటన్నిటికి పరమార్ధం ఒకటే, ఆనంద సందర్శనం. ఈ ఆనంద సందర్శనం భగవంతుని రూపంలో పొందాలునుకోవడమే భారతీయ కళల ముఖ్యోద్దేశం. అటువంటి వాటిలో ఒకటి, ఈ తోలుబొమ్మలాట. ఇది నేటి సినిమాకి చాలా దగ్గర రూపం. నిజానికి నేను చూసిన తోలుబొమ్మలాట అరవై సంవత్సరాల పై బడినది. బహుశః అరవై సంవత్సరాల కితం నేను చూసిన తోలుబొమ్మలాటకి, నాలుగురోడ్ల కూడలిలో ఒక వైపుగా రామాలయం దగ్గర నాలుగు గుంజలు పాతి, దాని చుట్టూ మూడు వైపులా బట్ట కట్టి, ముందు వైపు ఒక పల్చటి, తెల్లటి బట్టను తెరగా ఎత్తుగా కట్టి కింది భాగంలో దళసరిపాటి బట్టను కట్టి తోలుబొమ్మలాటకి తగిన వసతి ఏర్పాటు చేసారు. మూడు వైపులా మూయబడిన దానిలోపల రెండు కాగడాలు వెలిగించి తెరకు కొద్ది దూరంలో ఉంచుతారు, ఇరుపక్కలా. కాగడాలు ముందుకుంటే తెర అంటుకునే ప్రమాదం. దూరంగా ఉంటే తెరమీది బొమ్మ కనపడకపోవడం కాక, బొమ్మల్ని ఆడించేవారి నీడ పడుతుంది, అందుచేత సమదూరంలో కాగడాలు పెట్టాలి. చీకటిలో కూచున్న ప్రేక్షకులు తెరమీద బొమ్మలు కదలటం, వెనుకనుంచి పాట, మాట వింటారు.ఆ తరవాత కావలసిన సాధనాలు, రెండు బల్లలు, రెండు చెక్కలు, హార్మోనియం, ఫ్లూట్, మృదగం వగైరా వాద్యాలు, ఆ గదిలాటిదానిలో పెట్టుకుంటారు. ఇక ఆడించవలసిన బొమ్మలని పెద్దపెద్ద వెదురు బుట్టలలో తెస్తారు.
సరస్వతీ ప్రార్ధన
ఏ కళా రూపానికైనా ముఖ్యమైనవారు ప్రేక్షకులు. వారు చూసి ఆనందించి అభినందించినపుడే కళాకారుని తృప్తి, సంతృప్తి. తోలుబొమ్మలాట చూడడానికి ఎవరొస్తారనుకున్నా. ఎక్కువగా వచ్చినది స్త్రీలు, పిల్లలు. నిజంగానే నాకు ఆనందం వేసింది. చిన్నపిల్లలకి ఈ కళారూపాన్ని దగ్గర చేయడానికి ముఖ్యులు స్త్రీలు, ఇంకా ఈ దేశంలో సంస్కృతి, సంప్రదాయం మిగిలున్నాయంటే, అదంతా స్త్రీల చలవే సుమా.
మా ఊళ్ళో శ్రీ శారదా సంగీత కళా సమితి అనే ఒక సంస్థ ఉంది. దాని యాజమాన్యంలో, కొంత కాలం సంగీతం మటుకు కార్యక్రమాలు త్యాగరాజ ఆరాధనోత్సవాలలో జరిపించేవారు. కాలంతో మార్పు తెచ్చి, సంగీతంతో పాటు ఇతర కళా రూపాల్ని కూడా నిర్వహించడం మొదలు పెట్టి, హరి కథ, బుఱ్ఱకథ, మొదలైనవాటిని కూడా ప్రదర్శన లిప్పించడం మొదలు పెట్టేరు. ఈ సంవత్సరం తోలుబొమ్మలాట ను పెట్టేరు. ఈ కళ చాలా కాలం గా మరుగున పడిపోయే ఉంది.
ఈ జానపద కళ గురించి నేను చెప్పేకంటే వారిచ్చిన్ బ్రోచర్ చూడండి.
వీరిని పరిచయం చేస్తానని మాటిచ్చాను,స్కేన్ చేయాల్సిన కాగితం పని కాలేదు, అందుకే ఆలస్యమైపోయింది, కళాకారులు మన్నించ వేడుతున్నా.



.jpg)








