కలయో!
బాలకృష్ణుడు మన్ను తిన్న సందర్భం.
ఈ సందర్భంగా వ్యాసుని మాటేమీ?
బాలకృష్ణ, బలరాములు పిల్లలతో కలసి ఆడుకుంటున్న సమయం. బలరాముడు మిగిలినపిల్లలు, కృష్ణుడు మన్ను తిన్నాడని యశోదకి చెబుతారు. అంత, యశోద,కృష్ణుని చేయి పట్టుకుని, నీ నోరు నీ వశంలో లేదు.మన్నెందుకు తిన్నావని అడిగింది. మన్ను తిన్నావని వీళ్ళు చెబుతున్నారు.. దానికి కృష్ణుడు, అమ్మా! నేను మన్ను తినలేదు. వీరు చెప్పే నేరములు అబద్ధము, వీరంతా సత్యం చెబుతున్నారనుకుంటే, నీవే నా నోటిని చూడమన్నాడు. ఐతే వీరు చెప్పిన మాట అసత్యమైతే, నీనోరు తెరవమన్నది. కృష్ణుడు నోరు తెరిస్తే అందులో యశోదకు విశ్వరూపం కనపడింది. ఆ సందర్భంగా
కిం స్వప్న ఏతదుత దేవమాయా కిం వా మదీయో బత బుద్ధి మోహః
అధో ఆముష్యైవ మమార్భకస్య యః కశ్చనౌత్పత్తిక ఆత్మయోగః
ఏతత్-ఇది ,కిం స్వప్నః-కలయా? ఉత-లేక,దేవమాయా- శ్రీహరిమాయయా? వా-లేక, మదీయః-నాదైన, బుద్ధి మోహః కిమ్- బుద్ధియొక్క వ్యామోహమా? బత-ఆశ్చర్యము! అథో-లేక, ఆముష్య-ఈ, మమ-నా, అర్భకస్య-పిల్లవానిదే ఐన,యః కశ్చన-ఏదో ఒకానొక, ఔత్పత్తికః-సహజసిద్ధమైన, ఆత్మయోగః-తనదైన యోగ సిద్ధియా?
ఇది కలా? లేక వైష్ణవ మాయయా? లేక నాబుద్ధి వ్యామోహపడుచున్నదా? ఆశ్చర్యము! లేక, ఈ పిల్లవానికే, ఏదో ఒక, పుట్టుకతో వచ్చిన యోగ సిద్ధియా? అనుకున్నదన్నారు.
ఇక పోతనామాత్యుడు,ఈ సందర్భంగా
మన్ను తిన్నాడు కృష్ణుడని బలరాముడుగోపాలురు చెబితే, మన్నేటికి భక్షించెదు,.........మఱి పదార్ధము లేదే.. అడిగింది. దానికి మన్నుదినంగ నే శిశువునో... చిన్నపిల్లాణ్ణా,ఆకలేసిందా?వెఱ్ఱివాడినా?వీరిమాటలు నమ్మకు.వీళ్ళు, నేను మన్నుతిన్నానని చెప్పి, నిన్ను నమ్మించి, నీచేత నన్ను కొట్టించాలని వీరి పన్నాగం. అలాకాదనుకుంటే నా నోరు వాసనచూడు, నా మాటలు తప్పైతే కొట్టమ్మా! అన్నాడు. సరే! అంటే నోరు తెఱచి చూపాడు. నోటిలో విశ్వరూపం కనపడింది, యశోద ఆలోచించిందిలా అన్నారు
కలయో వైష్ణవ మాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో
తలపన్నేరక యున్నదాననొ యశోదాదేవిగానో పర
స్థలమో బాలకు డెంత యీతని ముఖస్థం బై యజాండంబు ప్ర
జ్వల మై యుండుట కేమి హేతువొ మాహాశ్చర్యంబు చింతింపగన్..భాగవతం..దశమ స్కందం..341
అనుకుని విభ్రమ చెందింది.
మరి నేటి కాలపు సినీ కవి చిన్న చిన్న మాటలతో
అమ్మా! తమ్ముడు మన్ను తినేను!
చూడమ్మా అని రామన్న తెలుపగా!
అన్నా! యని చెవి నులిమి యశోద
ఏదన్నా! నీనోరు చూపు మనగా
చూపితివట నీనోటను
బాపురె పదునాల్గు భువనభాండమ్ముల నా
రూపము గనిన యశోదకు
తాపము నశియించి జన్మ ధన్యత గాంచెన్
జయ కృష్ణా ముకుందా! మురారి
జయ గోవింద బృందా విహారీ
పై ముగ్గురిలో ఎవరూ యశోద కృష్ణుని నోట విశ్వరూపం చూసి స్పృహ కోల్పోయిందనలేదు.
మళ్ళీ పోతనగారి దగ్గరకొద్దాం.
కలయో- మానవులకి మూడు అవస్థలు. జాగృత, సుషుప్తి,స్వప్నావస్థలు. కలలో మనసు సర్వాన్ని సృష్టించుకుని వాటితో తాదాత్మ్యంచెంది, దుఃఖిస్తుంది, సుఖిస్తుంది. మెలకువవచ్చాకా నిజంకాదూ? కలా! అనుకుంటుంది. ఇక వైష్ణవమాయయో- ఇదీ కలలాటిదే కాని అనుభవంకూడా ఉంటుంది. నేటికాలపు (virtual reality) వర్త్యుయల్ రియాలిటీ! ఇతరసంకల్పార్ధమో- ఇతరులు తమ సంకల్పం నాపై ఆపాదిస్తున్నారా? అంటే నేటి hypnotism, సత్యమో- నిజమా? తలపన్నేరక యున్నదాననో- ఆలోచింపలేకపోతున్నానా? యశోదా దేవిగానో- అసలు నేను యశోదనేనా? అనుమానపడింది, పరస్థలమో- భూమి మీదకాక మరో గ్రహం మీదకాని ఉన్నానా? ఆశ్చర్యం! చిన్నకుర్రాడి నోట విశ్వరూపం కనపడ్డానికి కారణమేమై ఉంటుందని తలపోసింది.
పోతనగారు, నేటికాలంలో గొప్పగా చెప్పుకుంటున్న మానసిక స్థితులను నాడే దర్శించినవారు కదా! పోతన మహాశయులకు శతకోటివందనాలు.