కయ్యానికైనా వియ్యానికైనా సమ ఉజ్జీ కావాలి.
కయ్యానికైనా వియ్యానికైనా సమ ఉజ్జీ కావాలి, ఇదోనానుడి.అలాగే కుర్రాడితోనూ గుణం తక్కువవాడితోనూ దెబ్బలాడకు. ఏమి వీటి సంగతి? యోచించగా...చించగా.....
కుర్రాడితో దెబ్బలాడితే ఇంతవయసొచ్చింది కుర్రాడితో గొడవేంటయ్యా! అనేస్తారు, తప్పెవరిదైనా, చూసేవాళ్ళు, విషయం తెలుసుకోకనే!అంచేత కుర్రాడితో వివాద పడటం మంచిదికాదని ఉవాచ. ఇక గుణం తక్కువవాడు, ఈ మాట అనచ్చు ఇది అనకూడదు, అబద్ధం చెప్పకూడదు, ఇది ఉచితం,ఇది అనుచితం అనే ఇలాటి శషభిషలేం పెట్టుకోడు. దీనికితోడు వీడు బలవంతుడై ఉంటాడు. దాంతో ఎవరూ నిజం మాటాడరు. పోనిద్దురూ గొడవెందుకూ అనేస్తారు. ఎం?అంటే, ఒక్కమాటలో చెప్పాలంటే, భయం. రేపు నిజం మాటాడినవారి ఇంటి మీద రాళ్ళేస్తాడేమో,కాదు వేస్తాడు, తన పెళ్ళాన్ని, కూతుర్ని గొడవపెడ్తాడేమో అని భయం. అందుకు గుణం తక్కువవాడి జోలికే పోకూడదు.
అందుకే కయ్యానికైనా వియ్యనికైనా సమ ఉజ్జీ కావాలి. అదేంటో! కయ్యానికి ఉజ్జీ సరిపోవాలి, అంటే సమానంగా దెబ్బలాడగలిగి ఉండాలి. అది వాక్కలహమైతే ఒకరో మాటంటే ఎదుటివారు దాన్ని తిప్పికొట్టగలగాలి, అదిన్నీ వెంట, వెంటనే కావాలి. మరి ఈ వాక్కలహంలో చణుకులు, సామెతలు, ముచ్చట్లు, దెప్పులు, ఎగతాళీలు వరదగోదారిలా సాగిపోతాయి. ఇది కవులు రచయితల మధ్యనైతే చదువరులకు పండగే, చెళ్ళపిళ్ళవారికి, శ్రీపాదవారికి మధ్య జరిగిన వాక్కలహంలో ”ఈ ’దాక’లో అరసున్నా వేయించండి”, అన్నదో చెణుకు. నిజానికి చూసేవారికిదో గొప్ప అనుభూతి కూడా! ఇటువంటి వాక్కలహం రాతలో ఉంటే అబ్బో! అదో గొప్ప. మళ్ళీ మళ్ళీ చదువుకుంటూ ఉంటారు. ఆనందిస్తుంటారు కూడా. మరి ఈ వాక్కలహంలో సరితూగలేకపోతే, తిట్లు,శాపనార్ధాలు చోటు చేసుకుంటాయంటే, సరి తూగలేనివారు, ఉడుకుబోతుతనంతో తిట్లకి లంకించుకుంటే, త్వం..అంటే త్వం.. అనుకుంటే, అది అసహ్యంగా ఉంటుంది. ఒక వేళ సరితూగలేకపోతే ఏ సమయంలో తగ్గిపోవాలో తెలిసుండాలి. ఆ తగ్గిపోవడంలో కూడా అందముండాలి. అలా తగ్గిపోయారని ఎదుటివారు రెచ్చిపోతే... ఇక చూడు నా సామిరంగా, చూస్తూన్నవాళ్ళు అలా రెచ్చిపోయేవాళ్ళ తలంటేస్తారు. సమయం చూసుకు తగ్గిపోవడం కూడా కళే సుమా!
ఇక బాహాబాహీ కలహమైతే ఇద్దరూ సమాన బలం కలవాళ్ళైతే! అదీ వింతే, చూచేవారికి ఆనందం, రెచ్చగొట్టేవారికి... చెప్పెదేలేదు. అలా సమ ఉజ్జీలు కాకపోతే అబ్బే! చప్పగా ఉంటుంది.
వియ్యానికో! అంటే ఆడపెళ్ళివారు, మగపెళ్ళివారు, ఆర్ధికంగా, బంధుబలగంలో సరిసమాన ప్రతిపత్తులున్నవారు, వరుడు,వధువు అన్నిటా సరితూగేలా ఉంటే చూడముచ్చట.
చూతము రారండి.
శ్రీ సీతారాముల కల్యాణము చూతమురారండి.
సురలును మునులును చూడవత్తురట
చూచువారలకు చూడముచ్చటగ
పుణ్యపురుషులకు ధన్యభాగ్యమట,
భక్తి యుక్తులకు ముక్తి ప్రదమట,
చూతము రారండి,
శ్రీ సీతారాముల కల్యాణము
చూతమురారండి.
anuvu kanichota adhikulamaradu ani anduke annaru kadandi.
ReplyDeleteippudu sitharamula kalyanamentandi vachedi vinayaka chavithi kada
ReplyDeleteAnonymous12 September 2023 at 18:20
anuvu kanichota adhikulamaradu ani anduke annaru kadandi.
ippudu sitharamula kalyanamentandi vachedi vinayaka chavithi kada
/ అనువు కానిచోట అధికులమనరాదు అని అందుకే అన్నారు కదండి.
ఇప్పుడు సీతారాముల కళ్యాణమేంటండి వచ్చేది వినాయక చవితి కదా/
సత్యం చెప్పేరుగా!! సీతారాములకళ్యాణం ఎప్పటికీ నిత్య నూతనం, అంతేకాదు వియ్యానికి సమ ఉజ్జీ అంటే సీతారాముల కల్యాణమే కదండి. :)