రాముని రాజ్యం-భరతుని పట్టం-3
ఇంతకు ముందు భాగాలు లింకుల్లో చదవండి.
https://kasthephali.blogspot.com/2023/03/1.html
https://kasthephali.blogspot.com/2023/04/2.html
జరిగిన కథ సంక్షిప్తంగా .......
అయోధ్యకు రమ్మని మేనమామల ఇంట ఉన్న భరతునికి కబురు పoపినదీ,అతను తిరిగిరాగా తెలిసినవిషయాలు,ఆపై అతను తీసుకున్న చర్యలూ చూసాం. రాముని తిరిగి తీసుకురావడానికి తన ఇంటిలో వారికి ఎలా చెప్పి, తాను చెప్పినది నిజమని నమ్మించాడో చూసాం. రామునిదే రాజ్యం అని చెప్పి తనపరివారాన్ని,ప్రజలను నమ్మించినదీ చూసాం. రాముని తీసుకురావడానికి అడవులకు బయలుదేరినదీ చెప్పుకున్నాం. దీనంతనీ 'ఇంట గెలవడం'గా అనుకున్నాం కదా! ఇప్పుడు రచ్చ, అనగా బయటవారికి రామునిదేరాజ్యం అని చెప్పి ఎలా ఒప్పించాడు, అలా బయలుదేరి భరతుడు ఎవరెవరిని కలిసాడు,ఏం జరిగింది ముందు చూదాం...
అవగాహన..
అలా ససైన్యంగా,రాణివాసంతో బయలుదేరిన భరతుడు గంగానదీ తీరాన ఉన్న శృంగబేరిపురం చేరాడు. డేరాలు వేసుకుని మకాం చేసాడు.గంగ దాటడానికి, ఆపై అడవిదారుల్లో భరద్వాజాశ్రమం చేరేదారి,మిగిలిన విషయాలు చర్చించుకుంటున్నాడు. ఈ సైనక సందోహం గమనించి, దానిని దశరథుని సైన్యంగా గుర్తించిన ఆ ప్రాంత పరిపాలకుడు గుహుడు,ఇలా తలపోసాడు.
'భరతుడు, రాముని అడవులలో కూడా ఉండనిచ్చేలా లేడు. ఆయన పరివారం,మిత్రులమైన మనను చంపనూ వచ్చు', అనుకుని తనవారిని సమావేశపరచి,'మన దగ్గరున్న వీరులందరిని అస్త్ర,శస్త్రాలతో గంగ ఒడ్డున ఉండమనండి. మనదగ్గర 500 నావలున్నాయి. ఒక్కొక నావకు వందమంది చొప్పున వీరులు సిద్దoగా ఉండండి',అని చెప్పి తాను పళ్ళు,తేనెలు తీసుకుని భరతుని దర్శించడానికి బయలుదేరాడు.
దూరాన్నుంచే గుహుని గమనించిన సుమంత్రుడు భరతునితో 'ఆ వచ్చే ముసలాయన ఈ ప్రాంత పరిపాలకుడు, అంతేకాదు ప్రజ్ఞాశాలి, ఈ ప్రాంతమంతా వీరికి కొట్టిన పిండి. చాలా సైన్యం కలవాడు.రామునికి మిత్రుడు. అతనికి వెంటనే దర్శనం ఇవ్వడం మoచిది' అని సలహా చెప్పేడు. భరతుడు గుహుని వెంటనే కలిసాడు.
కుశలప్రశ్నల అనంతరం, 'తమరాక ముందు తెలిస్తే, నేనే ఎదురొచ్చి స్వాగతం చెప్పేవాడిని కదా! ఈ ఫలాలు,తేనెలు స్వీకరించమని' అంటాడు గుహుడు. ఆపై 'మా ఆతిధ్యం ససైన్యంగా స్వీకరించ'మంటాడు. దానికి భరతుడు 'నీవు అన్నరాముని కడుకూర్చుమిత్రునివి, నీవు మాకు చేయదలచిన మర్యాదల అభిలాష కడు అపూర్వం', అంటూ 'ఈ ప్రాంతం గంగా జలాలతో నిండి ఉన్నది,దీన్ని దాటే మార్గం,ఆపైన భరద్వాజ ఆశ్రమానికి చేరే సులువైన మార్గమేది?' అడిగాడు.'నేను నీ కూడా వస్తాను,మా యోధులు మనకు రక్షణగా వస్తారు. శ్రీరాముడు ఎవరికి కీడు తలపెట్టేవాడు కాదు,అటువంటివాడిని చూడ్డానికి వెళుతూ ఇంతటి మహా సైన్యంతో పనేమి?' అడిగాడు గుహుడు. దానికి భరతుడు 'అటువంటి దుష్కాలం నాకెప్పుడు రాకుండుగాక. రాముడు నా సోదరుడు,తండ్రితో సమానుడు',అంటాడు. 'నేను రాముడిని వెనక్కు తీసుకువెళదామని బయలుదేరి వెళుతున్నాను. నేను పలుకుతున్న ఈ మాట ముమ్మాటికీ సత్యం' అన్నాడు. దానికి గుహుడు ఆనందభరితుడై 'నీవు చేస్తున్నది చాలా గొప్పపని,నీ కీర్తి చిరస్థాయిగా ఉంటుంది' అన్నాడు . ఇంతలో ఇనుడస్తమించాడు. ఇక్కడికి ఆపుతాను,ఇది పెద్ద ఘట్టం. టైప్ చేయడం కోసం కూచోవడం ఇబ్బందితో చిన్నచిన్నగా చేయక తప్పలేదు,మన్నిచండి.
ఆలోచన.
దూరాన్నించి గుహుణ్ణి చూసి సుమంత్రుడు భరతునికి చెప్పినమాట తీవ్రహెచ్చరిక. పెద్ద సేనను తీసుకుని బయలుదేరిన భరతుని,సుమంత్రుడు పూర్తిగా నమ్మినట్టనిపించదు. అందుకే, ఈ పరోక్ష తీవ్ర హెచ్చరిక ఐ ఉండచ్చు. వచ్చేవాడు నీటిపైన,ప్రాంతంతెలిసినవాడుగా బలవంతుడు,మన సైన్యం ఏమీ చేయలేదు,ఇతనిని చిన్నవాడనుకుని ఉపేక్ష చేయకు అన్నది ఈ తీవ్రహెచ్చరిక. డిప్లమసీ గురించి తెలుసుకోవాలన్నా,డిప్లమసీలో మాటాడటం ఎలాఉంటుందన్నది తెలుసుకోవాలన్నా రామాయణం చదవడం కాదు, పారాయణ చేయాలి. గుహుడు భయపడ్డాడు,ఆత్మరక్షణచర్యలు తీసుకున్నా,విషయం తెలుసుకోడానికే భరతుణ్ణి కలవడానికొచ్చాడు. అవసరాన్ని బట్టి,యుద్ధానికే సిద్ద పడ్డాడు. వచ్చినవాడు మొహమాటం లేకనే రాముణ్ణి వెనక్కి తీసుకువెళ్ళడానికి ఇంత సైన్యం ఎందుకు? అన్న ప్రశ్న సూటిగానే వేసాడు. దానికి భరతుడు డిప్లమాటిగ్గా సమాధానమిచ్చాడు, పూర్తి అనుమాన నివృత్తి చేసాననుకున్నాడు. పెద్ద సైన్యాన్ని ఎందుకు వెంటబెట్టుకొచ్చాడన్న ప్రశ్న భరతుణ్ణి ఇక ముందుకూడా వేధిస్తుంది,అనుమానానికి నాంది చేస్తుంది. అంత సైన్యం ఎందుకు అన్నదానికి భరతుడు సమాధానం చెప్పినట్టు లేదు. గుహుడు భరతుణ్ణి పొగిడాడు,నీవు చేస్తున్నపని చాలా గొప్పదని,డిప్లమసీలో అవసరాన్నిబట్టి,సందర్భాన్ని,సమయాన్ని బట్టి తగుమాత్రం పొగడ్త కూడా భాగం. ఇంతలో సాయంత్రమయింది.
రాముణ్ణి వెనక్కి తీసుకువెళ్ళడానికే బయలుదేరానన్న భరతుని మాట గుహుడు నమ్మలేదు,నమ్మినట్టు నటించాడు..
సైన్యం మాటముందూ వస్తుంది గనక ఒక మాటనుకుందాం. భరతుడు యుద్ధానికి దిగితే రామలక్ష్మణులు ఏం చేసి ఉండేవారు? మెదడుకి మేత ఆలోచించి,సకారణంగా,సహేతుకంగా చెప్పండి.
అనుమానం తీరని గుహుడు తరవాత ఏమి చేసాడో తెలుసుకోవాలంటే, తరవాత టపా కోసం ఎదురు చూడాల్సిందే!
భరతుడు యుద్ధానికి దిగితే రామలక్ష్మణులు ఏం చేసి ఉండేవారు?
రిప్లయితొలగించండిచాలా మంచి ప్రశ్న
కుశాగ్ర బుద్ధికి ఒక చాలెంజ్ విసిరే ప్రశ్న
నీది కుశాగ్రబుద్ధి అనుకుంటా.జవాబు చెప్పు. రామాయణం చదువు నీకే సమాధానం తోచచ్చు,ప్రయత్నించు. కృషితో నాస్తి దుర్భిక్షం😜
తొలగించండి-
రిప్లయితొలగించండికుశాగ్ర "బడ్డి" అని మెచ్చుకున్నందులకు
తాత గారికి రెండో గిఫ్టు :)
https://varudhini.blogspot.com/2026/04/blog-post_22.html
తొలగించండిZilebi22 ఏప్రిల్, 2026 4:48 AMకి
ధన్యవాదాలు.🙏
ఆడియో వినలేని ఇబ్బంది పడ్డాను.
రామునిరాజ్యం భరతునిపట్టం పూర్తి చేయాలని చాలాకాలం నుంచి కోరిక,పూర్తికాలేదు.
చేయచ్చుగా? ప్రశ్న.
నిజమే! కొంత అశ్రద్ధ,ఆపై భాస్కరుని కరుణ లేదు,ఏరోజు 40 ఉంటూనే ఉంది. ఇక అనారోగ్యం బాధలు చెప్పేదేలేదు. రాయాలంటే మూలం చదవాలి,అవగాహన చేసుకోవాలి దానిని సంక్షిప్తంగా చెప్పాలి.ఎలా? టైప్ చేయాలి మధ్యలో సూత్రం తెగిపోతూ ఉంటుంది,మళ్ళీ చదవాలి. ఇలా అవగాహన చేసుకుంటూ రాస్తుంటే ప్రశ్నలు పుడుతుంటాయి.గుర్తుంచుకోవాలి. రాసిన అవగాహన సమగ్రంగా చదివించేదిగా ఉండాలి.
ఆ తరువాయి ఆలోచన,పుట్టిన ప్రశ్నలకి సమాధానం, అందులో ముఖ్యమైన విషయాలు క్రమంలో రాసుకుపోవాలి. ఇంతా చేసిన తరవాత, రాసినది చదవాలి,చెప్పదలుచుకున్నది,మూలంలో ఉన్నది సమగ్రంగా,సంక్షిప్తంగా చెప్పగలిగామా? ఎక్కడేనాలోపం ఉందా చూడాలి, సరి చూడాలి.అప్పుడు టపా బయటకు రావాలి.
గాలి కబుర్లు రాయడానికి దీనికి ఇంత తేడా ఉంది.😜
ఎంత శ్రమ? వయసా ఎనిమిదిపదులు దాటి తొమ్మిదోపదికిచేరేందుకు కూతవేటులో ఉంది. ఈ సీరీస్ పూర్తి చేసి బ్లాగులనుంచి తప్పుకోవాలని కోరికుంది. పూర్తి చేయలేననే భయం పట్టుకుంది. మధ్యే మార్గం గా చెప్పదలచుకున్న ఆలోచన ఒక్కటపాలో చెప్పి ఊరుకోవాలన్నదే ఊహ.
ఈ లోపుగా నిత్య వ్యవహారంలో ఎన్ని ఒడిదుడుకులు. చూదాం అమ్మదయ ఎలా ఉందో తెలియదు.
రాయాలంటే మూలం చదవాలి,అవగాహన చేసుకోవాలి దానిని సంక్షిప్తంగా చెప్పాలి
రిప్లయితొలగించండిగూగుల్ నోట్బుక్ ఎల్ ఎమ్
ని ప్రయత్నించి చూడండి :)
Zilebi22 ఏప్రిల్, 2026 11:35 AMకి
తొలగించండిమరో కొత్త ప్రయోగం,వద్దు లెండి🙏
ట్రై చేయండి తాత గారు
తొలగించండిమీరేది చదివి అవగాహన చేసుకోవాలనుకున్నారో దానిని సోర్స్ గా ఇవ్వండి
You get summary
You can create blog story ( in Telugu )/
టైపాటు తగ్గుతాయి
కొంత సమన్వయం చేసి పబ్లిష్ మాడి :)
మీ కోరికా తీరుతుంది.
Zilebi23 ఏప్రిల్, 2026 10:04 AMకి
తొలగించండి27/19 సెం.మీ సైజు పుస్తకంలో ఒక పేజిలో ఒక వైపు శ్లోకం రెండో వైపు అర్ధం ఉన్న గ్రంధంలో25/30 పేజిలలో ఉన్నదాని సారాన్ని సూత్రం చెడిపోకుండా ఒకటి రెండు పేరాలకు కుదించడం మీరు చెప్పినదానికంటే తేలిక అనుకుంటాను. ఎందుకంటే ఈ సోర్స్ కి ఇవ్వవలసినది వర్డ్ లో గాని ఇతర ఫార్మాట్లలో దొరకదు. ఇక తరవాత రాసే ఆలోచన అన్నది కామెంట్ లాటిది,పెద్ద కష్టపడక్కర లేదు.
మరోమాట టపా నేను చెప్పినట్టు రాసినప్పుడే అందులో కిక్ అనుభవంలోకొస్తుంది,అదే ఆనందం,ఎవరు మెచ్చినా నొచ్చినా! ఎవరు చదువుతున్నారు అన్నదికూడా లెక్కించే స్థితి దాటిపోయిన స్థితినాది. రాయాలి,అంతే! ఎప్పుడు ఆగిపోతే అంతే! అంతా అమ్మదయ. ఈ శష భిషలు వదిలేసి అవగాహన ఆలోచన కలిపి రాసేస్తే సరిపోదా అన్న ఆలోచనొచ్చింది. అది ప్రయత్నిస్తాను.
ధన్యవాదాలు