వండుకున్నమ్మకి.......
కష్టేఫలి
Monday, 29 September 2025
వండుకున్నమ్మకి ......
Monday, 22 September 2025
పిపీలికా చ భార్యాచ ...
పిపీలికా చ భార్యాచ ....
మశకా మత్కుణా రాత్రౌ
మక్షికా భిక్షుకా దివా
పిపీలికా చ భార్యాచ
దివారాత్రం ప్రబాధతే
రాత్రిపూట దోమలు నల్లులు బాధపెడతాయి. పగలు ఈగలు బిచ్చగాళ్ళు వేధిస్తారు. చీమలు భార్య రాత్రి పగలూ కూడా బాధిస్తారు.
కురుపు పవలూ రాత్రీ కూడా సలుపుతుంది,భార్యలాగా!
*****
దర్శనే స్పర్శనే వాఽపి
భాషణే భావనే తథాl
యత్ర ద్రవత్యన్తరఙ్గం
స స్నేహ ఇతి కథ్యతే॥
ఎవరినైతే చూసినప్పుడు గాని, స్పృశించినప్పుడు కానీ, మాట్లాడినప్పుడు కానీ, మనసులో భావించినప్పుడు మనస్సు ఆహ్లాదంతో, ఆనందంతో, ఆత్మీయతతో, ఆర్ద్రతతో ద్రవిస్తుందో దానిని స్నేహం అని అంటారు.
*****
మరో సంవత్సరం బ్లాగ్ జీవితంలో గడచిపోయింది. కాలం గడుస్తూనే ఉంటుంది,ఎవరి ప్రమేయమూ లేకనే! నేటికి బ్లాగ్ జీవితం గడచి 14 ఏళ్ళు, ఇక చాలు ఇళ్ళకు వెళ్ళిపోదామా?🤣
ఏచరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం? నరజాతి చరిత్ర సమస్థం పరపీడనపరాయణత్వం. పీడకులు (పీడి0చేవాళ్ళూ) పీడితులు,వేరువేరుగా ఉండరు. పీడితులు (పీడింపబడేవాళ్ళు) . అందరూ ఒకప్పుడు పీడితులు మరొకప్పుడు పీడకులు. ఇదే ప్రపంచ చరిత్ర, ఇందులో దేశ ద్రోహులది పెద్దపేజీ.
🙏
Saturday, 20 September 2025
వదరుబోతులమాట .......
వదరుబోతులమాట ........
పూర్ణ శుంఠలు సభాపూజ్యులైరి
సత్యవంతుల మాట జన విరోధంబయ్యె
వదరుబోతుల మాట వాసికెక్కె
ధర్మవాసన పరుల్ దారిద్ర్య మొందిరి
పుణ్యవంతులు రోగభూత పీడితులైరి
దుష్ట మానవులు వర్ధిష్ణు లైరి
పక్షివాహన మా వంటి భిక్షుకులకు శక్తి లేదాయె, నిఁక నీవె చాటు మాకు
భూషణవికాస శ్రీ ధర్మపుర నివాస దుష్టసంహార నరసింహ దురితదూర !! (52)
ఓ నారసింహా ! ఈ లోకమదేమిటో కాని అతి విచిత్రంగా మారుతోంది. బాగా చదువుకున్న వాళ్ళు ఎందుకు పనికి రాకుండా పోతున్నారు. ఏమాత్రం చదువు రాని శుంఠలు సభాపూజ్యులై సన్మానాలు పొందుతున్నారు. నిజం చెప్పేవారి మాట లోకవిరోధమౌతోంది. అబద్దాలాడేవారికి సమాజం లో అధిక ప్రాధాన్యత లభిస్తోంది. ధర్మబుద్ధిగలవారు దారిద్య్రాన్ని అనుభవిస్తుంటే పిసినారులు ధనవంతులై కులుకు తున్నారు.పుణ్యాత్ములు రోగగ్రస్థులై పీడించబడుతుంటే పాపాత్ములు పల్లకీలలో ఊరేగుతున్నారు. ఓ గరుడవాహనా ! మావంటి యాచకులకు ఎటువంటి పోషణలేదు నీవే మాకు దిక్కు.
Courtesy: Owner
శేషప్ప కవిగారి నృసింహ శతకంలో ఈ పద్యం చదువుతుంటే వచ్చారు మా సుబ్బరాజు,సత్తిబాబు. సుబ్బరాజు కూచుంటూ, కూసోవో అని సత్తిబాబు చెయ్యి పట్టుకులాగి కూచో బెట్టి,ఏదీ మళ్ళీ చదవoడి ఆ పద్యం, అన్నాడు సుబ్బరాజు,పద్యం విని,
వదరుబోతుల మాట వాసికెక్కె,ఇదేంటో చెప్పవో అన్నాడు సత్తిబాబుని. .
తిండిబోతు,తిరుగుబోతు,తాగుబోతు అంటే తెలుసు మరి ఈ వదరుబోతు ఎవరయ్యా! అడిగాడు మా సుబ్బరాజు.
తాగున్+పోతు,తిరుగున్+పోతు,వదరుబోతు అన్నది రెండు మాటల కలయిక. వదరున్+పోతు. ద్రుతము మీది సరళాలు పరుషాలవుతాయని మా తెనుగు మాస్టారు చె ప్పారు. అదే వదరున్+పోతు, కాస్తా వదరుబోతు అయింది,ఇలాగే సోమరిపోతు వగైరా అన్నాడు సత్తిబాబు.
ఇదేదో పిల్లి అంటే మార్జాలం లా చెబుతావే కసిరాడు సుబ్బరాజు.
వదరు అంటే పనికిమాలిన మాటలు మాటాడటం,నోటికొచ్చినది మాటాడటం,ఆలోచన లేకమాటాడ టం చెప్పుకోవచ్చు. ఇక పోతు అన్నది మగ,మేటి అర్ధాలు చెబుతారు. వ్యర్ధంగా మాటాడటంలో,నోటికొచ్చినది,ఆలోచనలేనిది మాటాడ్టం లో మేటి అని చెప్పుకోవచ్చు.
నేటి కాలానికి ఉదాహరణ చెప్పవో! అడిగాడు సుబ్బరాజు
ఓ! అదా, తూర్పు తెల్లారింది మొదలు భూకంపం తెప్పిస్తా, ఆటం బాంబు లేస్తా, హైడ్రోజన్ బాంబు లేస్తా అంటూంటే ప్రజలు నోరెళ్ళ బెట్టుకుని ఎదురు చూస్తున్నారు. అన్నీ నెంబుకుపోయిన దీపావళి సామానులా తుస్,తుస్ మంటూంటే జనం పిట్టల దొరలా ఉన్నాడని నవ్వుకుంటూన్నారయ్యా!
రాజ్యాంగబద్ధం గా ఎన్నికైన ప్రభుత్వాన్ని Gen-Z ఉద్యమం ద్వారా 'ఓట్ చోర్ గద్దీ ఛోడ్' ఉద్యమంద్వారా దించేయడం రాజ్యాంగబద్ధం అవుతుందా? వారి వెనక ఉండే మీరు రాజ్యాంగాన్ని ఎలా రక్షిస్తారుటా? ఎలా? నీకు దమ్ముంటే నీయమ్మ చేసినట్టు అనగా ఒక్క ఓట్ తో వాజపాయీ గారిని దించేసినట్టు మోడీని కూడా దించెయ్యి, నువ్వురా మొగోనివీ అనుకుంటాం.ఏదీ ప్రయత్నించు చూదాం.
ఇక మీవోడే ఒకప్పుడు తప్పుడు మాటలు మాటాడితే పదవిపీకి పొమ్మనారు,మీరే. మళ్ళీ మీరే ఇచ్చేరనుకో! ఆయనే శాం పిట్రోడా! మొన్నీ మధ్య, పాక్ వెళితే, స్వంతింటికి వెళ్ళినట్టుందన్నాడట. అవునుగా 75 సంవత్సరాల కితందాకా అంతా ఒక దేశం మనుషులే ఆ తరవాత మేము విడిపోతామని విడిపోయి,రక్తపుటేరులు పారించి నాటినుంచీ భారత్ మా శత్రు దేశం అని చెప్పుకుంటున్న దేశం స్వంతింట్లో ఉన్నట్టుందంటే దీన్నేమనాలి? చెప్పవోయ్!
కూడా ఉండే మీరన్నా కొంచం చెప్పండయా! అంటూ తువ్వాలు దులుపుకుని భుజమ్మీదేసుకుని ఎలబారిపోయాడు సత్తిబాబు.
మాట పలుకు లేక కొయ్యబారిపోయాడు సుబ్బరాజు.
గబగబా లోపలికి పరిగెట్టేను,నేను.
***
శేషప్పకవిగారు వందల సంవత్సరాలకితమే అప్రయోజకులు,శుంఠలు, వదరుబోతులు పుడతారని ఊహించిన,దీర్ఘదర్శి. వివరంగా చెప్పేరు. ఈ ఒక్క పద్యం, పూర్తిగా నేటికీ అర్ధం కాలేదు 🤣
Wednesday, 17 September 2025
పుట్టినరోజా? రిటయిర్మెంటా?
పుట్టినరోజా? రిటయిర్మెంటా?
భారత ప్రధాని మోడీజీ కి పుట్టినరోజు శుభాకాంక్షలు.
Monday, 15 September 2025
దయ్యం.
దయ్యం.
దయ్యమా,దెయ్యమా ఏది సాధువు? తెలీదు.
దెయ్యం ఏంటో తెలుసుకొవాలనుకున్నా. కమేని అడిగా,అందమైన దయ్యం అని,అదే మొదటి ప్రశ్న.మొగాడి ఫోటో చూపించింది. కమే మగాళ్ళే దయ్యాలనుకుంది,అదే అడిగా ఆకుకి అందని పోకకి పొందని సమాధానం చెప్పింది.
మన తెనుగు సాహిత్యం లో చూదామని బయలుదేరా! దయ్యం/దెయ్యం ప్రయోగం నాకు వెంటనే ఇక్కడ స్ఫురించింది,
బ్రతుకవచ్చు నొడల ప్రాణంబు లుండిన
బ్రతుకు గలిగెనేని భార్య గలదు
బ్రతికితీవు భార్యపట్టు దైవ/దయ్య మెరుంగు
వలదు వలదు చైద్య! వలదు వలదు.
ఇక్కడా నా అనుమానం తీరలేదు. ఆంధ్రభారతి రెండు వాడుకలో ఉన్నాయంది. హా హతవిధీ! దెయ్యానికెన్ని తిప్పలొచ్చాయనుకున్నా. దెయ్యం ఇంటర్నేషనల్, అన్ని దేశాల్లోనూ దెయ్యాలున్నాయష. దెయ్యమూ లేదు,భూతమూ లేదు, అదంతా మానసిక వికారం,కొంతమంది బతికేందుకు చేసిన సృష్టి అన్నారు, మేధావులు. ఏమోగాని దెయ్యం కొన్ని వేల కోట్ల రూపాయల వ్యాపార పెట్టుబడి అన్నారు,మరో మేధావి. ఏంటో మరింత చిక్కుబడిపోయింది.
పోనీ సినిమా లో చూదామనుకున్నా! మొదటగా దయ్యాన్ని పరిచయం చేసినది హిందీ సినిమా అనుకుంటా, ఒక సినిమాలో పేరు గుర్తులేదు, దెయ్యం ఆడది, మధుబాలంత అందంగా ఉంటుందని చెప్పేరు. అదేమో తెలీదుగాని దెయ్యానికి కూడా దేశ భేదం,భాషా భేదం,లింగ భేదం ఉంటుందన్నారు,మరికొందరు. తెనుగు సినిమా దెయ్యం మరీ వికృతంగా ఉంటుంది,దెయ్యాల్లోనూ మంచి దెయ్యాలు,చెడ్డ దెయ్యలూ ఉన్నాయట. బోల్డన్ని కతలున్నాయంట.
దయ్యాలో రకాలున్నయట. అన్ని దయాలూ కనపడవట గాని ఒక్క దయ్యం మాత్రం కనపడుద్దట, అదే కొరివి దయ్యం. మిగతా దయ్యలు ఎక్కదబడితే అక్కడే ఉంటాయటగాని కొరివిదయ్యం మాత్రం శ్మశానంలోనే ఉంటదట.
ఎంతజెప్పినా దయ్యం దయ్యమేగాని దెయ్యం కాదన్నాడు మా సుబ్బరాజు. అరధంగాలేదు.
Wednesday, 10 September 2025
నేటి అంతర్జాతీయ రాజకీయాలు.
నేటి అంతర్జాతీయ రాజకీయాలు.
(నిన్నటి తరువాయి)
ఈ నవెర్రో అనే అమెరికావాసి, ట్రంప్ గారు, అరెరె! తప్పుజేసి రెండు దేశాలని వ్యాపారంలో చైనాకి వదులుకున్నానే అనుకుంటున్నా, మెత్తబడినా, ఈయన ఇంకామాటల ఈటెలు విసురుతూనే వున్నారు. రెండు దేశాల సంబంధాలూ పూర్తిగా బెడిసికొట్టేలాగా. పాపం ఆయనకు ఇంత చిత్త విభ్రమం కలగడానికి కారణం భారత్ ఆయనతో సమానంగా వాక్కలహంలో దిగకపోవడం. ఆయన మాత్రం కలహంలో పల్లెటూరి స్త్రీలా రెచ్చిపోతూనే ఉన్నారు.
ఇక రెండో పక్క చూదాం. ముగ్గురు ఆసియావాసులు,బలమైన దేశాలు ఒకటైతే తన ఉనికికే ప్రమాదమన్నది అమెరికా బాధ,అర్ధం చేసుకోవచ్చు. కాని రష్యా,భారత్,చైనాలు ఒకమాటమీదకొస్తే చాలా ప్రమాదం, అందుకుగాను మిత్ర భేదం కొసం అమెరికా ప్రయత్నించడం సర్వ సహజం. భారత్,చైనా సంబంధాలు అంత సవ్యం లేకపోవడం కారణం. మొన్నటి బంధం, ప్రస్తుతం ఒక ఇబ్బందిని గట్టెకేందుకు చైనా,భారత్ లు తీసుకున్న నిర్ణయం. ఇది ఇతర రంగాలకు కూడా పాకి మిత్రత్వం చొరబడితే, రష్యా,చైనా,భారత్ లని మించగల శక్తి భూమి మీద లేదు.కాని ఇది సాధ్యమా అన్నదే కొచ్చను.
నేపాల్ లో ఖాట్మండూ మేయర్ ని అమెరికా రాయబారి కలసిన తరవాత,దేశంలో అవినీతి పేరిట యువత అల్లర్లు,సోషల్ మీడియా బేన్,కొద్ది సేపటికే బేన్ రద్దు,వామపక్ష ప్రధాని శర్మఓలి రాజీనామా,తదుపరి, సుప్రీం కోర్ట్,పార్లమెంటును తగలబెట్టిన యువత, ముఖ్యుల ఇళ్ళను తగలబెట్టిన యువత,మొత్తం మీద 19 మంది మరణం. అర్ధమవుతోందా! నిద్రపోకండి. అనూహ్యంగా శాంతికోసం సైన్యం విజ్ఞప్తి.
అమెరికన్ డీప్ స్టేట్ తనపని మొదలెట్టింది. తరవాత కత వెండి తెరపై చూడచ్చు. భారత్ బహు పరాక్! అందోళనలు లేవదీసేవారిని ఒకకంట కనిపెట్టండి.
చౌయన్ లై -నెహ్రూ లు కలసి హిందీ చీనీ భాయ్,భాయ్ అని హోరెత్తించి,పంచశీలని ఊదరగొట్టి, భారత్ కు వెన్నుపోటు పొడిచిన చరిత్రగలది చైనా. నేటికిన్ని సరిహద్దులు కొన్ని చోట్ల నిర్వచింపబడలేదు. పాక్ తను ఆక్రమించిన కాశ్మీర్ లో కొంత భాగం చైనా కి ధారదత్తం చేసింది, 1962 లో జరిగిన యుద్ధం లో కొంత భాగం ఆక్రమించుకుంది. నెహ్రూ గారు ఆ ప్రాంతంలో గడ్డి కూడా మొలవదని శలవిచ్చారు,నాటి పార్లమెంటులో. నిన్నమొన్న సరిహద్దులలో ఆక్రమణ దానిపై సైనిక చర్య జరిగింది.
ఆనాటి నుంచి యుద్ధం లేదంటారు గాని నిత్య కలహం తప్పలేదు.పంచ శీలలో మొదటిది, మరో దేశం ఆక్రమించకూడదు,రెండు, అంతర్గత వ్యావహారాలలో జోక్యం కూడదు. కాని ఈ రెండు శీలలే మొదట ఊడిపోయాయి. పాపం నెహ్రూగారు ఈ బెంగతోనే కాలం చేసేరు. ఇందిరా గాంధీ అధికారంలో కొచ్చిన తరవాత భారత్ లో వీరి అనుచరులు చర్యలకు పట్టపగ్గాలే లేకపోయాయి. నేటికీ సాయుధంగా ప్రభుత్వంపైన దాడి చేసేవారు కొందరు కొనసాగుతూనే ఉన్నారు. అంతేనా మరో రకం అర్బన్ నక్సల్స్ కోర్టులలో కూడా కొనసాగాలని చూస్తున్నారు,నక్సల్ అభిమానులు రాజకీయపదవులకూ ఎగబాకాలనుకుంటున్నారు. ఈ దేశంతో స్నేహం కొనసాగేనా? అనుమానమే! ఇది అవసర స్నేహం కావచ్చు. నమ్మదగిన స్నేహం కాదేమో!!
ఈ దేశం తమదేశం నుంచి కారకోరం ద్వారా రోడ్డు నిర్మించి గిల్గిట్ చేరింది. అక్కడనుంచి ఆరోడ్డును గ్వాదర్ రేవుకు చేర్చి దాని ద్వారా యూరప్,ఇతరదేశాలతో వ్యాపారం చేయాలని చైనా ఊహ,అంతేకాదు అరేబియా సముద్రం ప్రాంతాలపై ఆధిపత్యం సాగించాలని కోరిక . ఐతే ఈ రోడ్డు బలూచిస్థాన్ ద్వారా గ్వాదర్ చేరాలి. స్వతంత్ర పిపాసులైన బలూచ్ లు దానిని అడ్డుకుంటున్నారు. జరిగేలా లేదు. ఈ రోడ్డు పని చైనా ప్రస్థుతం ఆపేసింది. చైనా ఎప్పుడూ పాక్ తో కలసి భారత్ నాశనం కోరుకున్నదే,మొన్న జరిగిన దానితో సహా!ఎప్పుడూ భారత్ కు వ్యతిరేకంగా పాక్ కు సహాయం అందించినదే! ఈ దేశానికున్న మరో కోరిక చైనా నుంచి భూటాన్ ప్రాంతం ద్వారా చిన్నదైన చికెన్ నెక్ ప్రాంతాన్ని ఆక్రమించి బంగ్లాదేశ్ ద్వారా చిటకాంగ్ చేరి వ్యాపారానికి ఉపయోగించుకోవాలని కోరిక. ఇదే పాపం బంగ్లా దేశపు యూనిస్ చైనాకి చెప్పింది. ఇదే చైనా ప్లాన్,బంగ్లా ప్లాన్, ఇప్పుడు పాక్ కూడా దీనికి వంత పాడుతోంది. షర్జీల్ ఇమాం చెప్పిన పథకం ఇదే! అసోం ముఖ్యమంత్రి ఒక చికెన్ నెక్ ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తే రెండు చికెన్ నెక్ లున్నాయి,మీకు. దాంతో మీరు ఖతం,ఒళ్ళు జాగర్తపెట్టుకోండని హెచ్చరిక చేసేరు. బంగాళాఖాతం ప్రాంతాన్ని తన నౌకా బలం ద్వారా అధికారం చేయాల నీ కోరిక.
ఈ సందర్భంగా ఒక కత,భారతం నుంచి, చిన్నదిగా చెబుతున్నాను.భారతంలో ఉన్నదే ప్రపంచంలో ఉన్నది. ఈ కత నేటి రాజకీయాలకి సరిపోతుందా ఆలోచించండి.
అడవిలో ఒక చెట్టుకింద బొరియలో ఒక ఎలక నివాసం. ఆ చెట్టుపైన ఒక పిల్లి నివాసం, మరో కొమ్మన గుడ్లగూబ నివాసం. రోజులు గడుపుతుండగా ఒక రోజు వేటగాడు తన కుక్కలతో వచ్చి,పిల్లికోసం ఒక వల పన్ని పోయాడు. వేటకి వెళ్ళిన పిల్లి వస్తూ వలలో చిక్కుకుంది. చిక్కులు తొలగించుకోవాలనుకున్నకొద్దీ ఎక్కువ అవుతున్నాయి. అరుస్తోంది,సహాయం కోసం. ఈ లోగా ఎలుక బయటకుపోయినది తిరిగొస్తూ పిల్లిని వలలో చూసింది. పిల్లి ఎలుకను పిలిచి చాలాకాలంగా మనం పక్కపక్కల ఉంటున్నాం. ఇప్పుడు నేను ఆపదలో ఉన్నాను. వలకొరికి నన్ను రక్షించు, ఎప్పటికీ నిన్ను రక్షిస్తూ ఉంటానని మాటిచ్చింది. ఎలుక ఆలోచించి పిల్లిని నమ్మచ్చా! ఇప్పుడు ఆపదలో ఉంది కనక ఇలా అంటోంది,ఆపద గడిస్తే మీద పడదా! అని ఆలోచిస్తుంటే పిల్లి ఎలక ఆలోచన పసికట్టి అటువంటి అనుమానాలు పెట్టుకోకని బతిమాలుతూ ఉంది. చెట్టు మీద గుడ్లగూబ ఇది చూస్తూ వీళ్ళిద్దరూ స్నేహితులైపోతున్నారా? ఎలకని ఎప్పటికైనా మింగుదామనుకున్న నాది కలేనా,చూదాం అనుకుంటూ ఉండగా, ఎలుక వలకొరకుతాననీ చెప్పలేదు,కొరకననీ చెప్పలేదు, వలచుట్టూ తిరుగుతూ కాలక్షేపం చేస్తోంది. పిల్లికి గాభరా పెరిగిపోయింది, వేటగాడు వస్తున్నాడు, కుక్కల అరుపులు వినపడుతున్నాయి, వలకొరుకు, నన్ను రక్షించు అని తొందరపెట్టింది. వేటగాడు కనుచూపు మేర కనపడగానే ఎలుక వల కొరకడం మొదలెట్టింది. కొద్దిదూరంలో వేటగాడుండగా వల పూర్తిగా కొరికేసింది, పిల్లి బతికేను జీవుడా అనుకుంటూ చెట్టెక్కేసింది, ఎలుక బొరియలొకి పారిపోయింది. జరుగుతున్నది చూస్తున్న గూబ నిరాశపడిపోయింది.
అంటే నమ్మదగిన మిత్రుడు రష్యా,అమెరికా,చైనా ఇద్దరూ ఒకలాటివారే. ఇద్దరూ స్వార్థపరులే ఆక్రమ ణదారులే. వ్యాపారంతో ఆక్రమణ చేయాలని అమెరికా,భూభాగం ఆక్రమించాలని చైనా పన్నాగాలు. భారత్ కి ఎప్పటికీ అలీనవిధానమే మంచిది. యూరప్ తో ఫ్రీ ట్రేడ్ ఒప్పందం కుదరబోతోందని చాలామంది చంకలు గుద్దుకుంటున్నారు. ఎవరిమీదా అతిగా ఆధారపడకూడదు. అరాచక చర్యలన్నిటికీ మూలం యూరప్,ఎవరినీ నమ్మద్దు. వ్యాపారం వ్యాపారమే, వ్యవహారం వ్యవహారమే! పేకాట పేకాటే పెద్దన్న పెద్దన్నే! అదీ సంగతి
శలవు.
Tuesday, 9 September 2025
జరుగుతున్న అంతర్జాతీయ....
జరుగుతున్న అంతర్జాతీయ....
(నిన్నటి తరువాయి....)
రష్యాతో చమురు వ్యాపారం చేసి భారత్ డబ్బు సంపాదించి రష్యా యూక్రైన్ యుద్ధానికి తోడపడుతోందని అమెరికా అంటోంది. యూరప్ దేశాలూ వంత పాడుతున్నాయి. అంతేకాదు రష్యాతో వ్యాపారం చేసేవాళ్ళని శిక్షిస్తామనీ అంటున్నారు. జయశంకర్ గారు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం ఎక్కడ? రష్యానుంచి చమురు ఇతర చమురు ఉత్పత్తులూ యూరప్ కొనడం మానేయచ్చుగా! ఎందుకు మానేయటంలేదు? అమెరికా రష్యాతో వ్యాపారం మానేసిందా? ఎందుకు చేస్తోంది ఇంకా? భారత్ కొనే ఆయిల్ సొమ్ముతోనే రష్యా యుద్ధకర్చులు సరిపోతున్నాయా? ఇది చిన్నప్పుడు చదువుకున్న గొర్రెపిల్ల తోడేలు కతలా ఉంది,అదే గుర్తొస్తోంది.
అసలు రష్యా యూక్రైన్ మధ్య గొడవకి కారణం ఎవరు? యూక్రైన్ లో జలనిస్కీని గద్దెనెక్కించిందెవరు? ఆ తరవాత జలనిస్కీ నాటో లో చేరతామని మొదలు పెట్టడం ఎవరి ఆలోచన? యూక్రైన్ నాటోలో చేరడమంటే శత్రువును ముంగిటిలోకి తెచ్చుకోవడం కాదా, రష్యాకు. నాటో లో చేరను అని ఒకమాట చెప్పు యుద్ధం ఆపేస్తానంటున్నదే రష్యా! అసలు అమెరికా యూక్రైన్ లో యుద్ధం ఆగాలని ఎందుకు అనుకుంటోంది? ఇప్పటికి జరిగినయుద్ధంలో రష్యా యూక్రైన్లో తూర్పుభాగం ఆక్రమించుకుంది. యుద్ధం ఆగితే, ఆ భాగాన్ని రష్యా వదిలేస్తే, ఆ భాగంలో ఉన్న rare earths అన్నిటిని జలనిస్కీతో చేసుకున్న ఒప్పందం ప్రకారం తను వశం చేసుకోవాలని కాదా? మోడిగారు చెబితే పుతిన్ గారు విని యుద్ధం మానేస్తారని అమెరికా భ్రమ పదటం చిన్నపిల్లల మస్తత్వం కాదా? ఇదో అంతులేని కత. అమెరికన్ డీప్ స్టేట్ కి కావలసింది అశాంతి,యుద్ధం, తామనుకున్నట్టు జరగాలంటే ప్రభుత్వాలను కూలకొట్టడం కొత్త విద్య కాదు. భారత్ లో మోడీ ప్రభుత్వాన్ని కూలగొట్టాలనుకుంటే కుదరలేదు,ప్రయత్నం కొనసాగుతూనే ఉంది. భారత్ ప్రజలు హెచ్చరికతోనే ఉన్నారు. భారత్ తనకు ఏది మంచిదో నిర్ణయించుకునే హక్కు ఉంది. మాతో ఉండవలసిన భారత్ చైనా,రష్యాలతో ఉండడమే అనడం జాత్యహంకారం చూపించుకోడం కాదా? అవసరాన్ని బట్టి అందరితోనూ కలవడమే భారత్ విధానం.
సశేషం.....
Monday, 8 September 2025
అంతర్జాతీయ రాజకీయాలు
అంతర్జాతీయ రాజకీయాలు
అంతర్జాతీయ రాజకీయాలు ఇంత వేగంగా జరుగుతుండడం ఇదే మొదటి సారేమో అనిపిస్తుంది.
ట్రంపుగారు రెండో సారి గద్దెనెక్కేకా అరు నెలల్లో ప్రపంచ రాజకీయాలనే ఒక కొలిక్కి తెచ్చేసినట్టుంది. ముఖ్యంగా కనపడుతున్నది, ఆసియాలోని పెద్ద దేశాలూ బలమైన దేశాలని ఒకతాటికి తెచ్చినట్టుంది. భారత్ చైనాల మధ్య సంబంధాలు తెగిపోలేదు,చెడిపోలేదుగాని గొప్పగా మాత్రం లేవు, చైనా ప్రెసిడెంట్ గత నవంబర్ డిసెంబర్ నెలల్లో భారత్ రాష్ట్రపతికి ఒక ఉత్తరం రాయడంతో మెరుగుపడటంకి ఊపందుకుంది. భారత్ రష్యా సంబంధాలు ఒకప్పుడు కింది స్థాయికి చేరిపోయాయనుకున్నపుడు కూడా చెడ్డమాటలు వినపడలేదు. అంతే కాదు ఎప్పుడూ భారత్ రష్యాని అంతర్జాతీయంగా వెనకేసుకునే వచ్చింది. నిజానికి ఈ పని ఒకప్పుడు రష్యా భారత్ కు చేసింది. రష్యా భారత్ సంబంధాలు యూక్రైన్ రష్యాల మధ్య యుద్ధంతో మరింత మెరుగు చూపాయి. మొన్న చైనాలో జరిగిన SCO తో భారత్-చైనా, భారత్ రష్యా సంబంధాలు మెరుగునపడ్డాయి. వీటితో పాటు మరికొన్ని దేశాలూ అన గా బ్రెజిల్, S. ఆఫ్రికా పాకిస్థాన్,టర్కీ,అజర్బైజాన్, మరికొన్ని దేశాలు కలవడం అమెరికాకి వెర్రెక్కించింది. కారణం, ఈ మూడు దేశాలూ,వీరితో మరికొన్ని దేశాలూ తమ వ్యాపారాన్ని రూపాయలలో చేసుకుంటున్నాయి,డాలర్ తో కాక. ఇది డాలర్ కి పెద్ద విఘాతం కల్పించేదే! అందుకే అమెరికా భారత్ మీద విషం చిమ్ముతోంది. ఇంకా చిమ్ముతానంటోంది. టాక్సులు పెంచడమే కాక ఇతర చర్యలూ తీసుకుంటాము,మా మాట వినకపోతే అని మొహమాటం లేకుండానే చెబుతున్నారు. భారత్ దేనికీ అతిగా స్పందించకపోవడం అమెరికాకి మరింత వెర్రెక్కించింది.
సోషల్ మీడియాలో కూడా అమెరికా వ్యతిరేకంగా మాటాడినవాళ్ళకి వీసాలు ఇవ్వమనీ చెబుతున్నారు,ఇదేమో! !
ఇదే మరే దేశమైనా ఐతే మీ దేశంలో Freedom of speech లేదు అని చెబుతారు. ఇదేమీ? ఇంతేనా ఈ దేశం లో లింగ వివక్ష, వర్ణ వివక్ష లేదు, ఎవరి ఇష్టం వచ్చినట్టు వారుండచ్చంటారు, అదే నోటితో మొన్న దేశంలో బొట్టు పెట్టుకున్న స్త్రీ, దేశపౌరురాలు అటార్నీ ఐతే ఎంతంత మాటలు మాటాడేరు? వివేక్ రామసామి పోటీ చేసినప్పుడు ఏం మాటాడేరు? వాన్స్ భార్యకి , భారతీయ మూలాలుంటే ఏం మాటాడేరు? కమలాహేరిస్ కి భారత మూలాలున్నందుకు ఏం మాటాడేరు మేమంతా కళ్ళు మూసుకునిలేము,కళ్ళు మూసుకుపోయీ లేము. మొన్న నీ మధ్య పీటర్ నవార్రో మాటాడినమాటలెంత గొప్పగా ఉన్నాయి? మరొక మహానుభావుడు భారత్ టుకడే టుకడే గేంగ్ లీడర్లా మాటాడేడు కదా! మరో పెద్దమనిషి మీ ఎకానమీని పాడుచేసేస్తామని చెప్పలేదా! ట్రంప్ మహా శయులే మీది,రష్యాది చచ్చిన ఎకానమీ అనలేదూ? అమెరికా తరవాత కాలంలో భారత్ తో వ్యాపారం చేసినా వ్యవహారం చేసినా,ఇప్పుడు జరిగినవి మరచిపోతారా? ఇదివరలో కూడా భారత్ ఆపద సమయాల్లో శత్రువుతో కూడినదికాదా,ఈ అమెరికా?
ప్రపంచంలో ఏదేశంతోనూ భారత్ కి వైరం లేదు. కాని భారత్ మా శత్రుదేశమని ప్రకటించుకున్న పాక్ కి కూడా మొన్న సింధుజలాల ఒప్పందం నిలుపుదల చేసినా, వరద రాబోతోంది, నీరు కిందకి జాగ్రత్తగా వదులుతున్నాము, ఇప్పటికే మీ దేశం వరదల్లో ఉన్నదని చెప్పి, కబురు చేసింది భారత్, చెప్పవలసిన అవసరం లేకపోయినా,మానవతా దృష్టితో చెప్పింది.
ఆ దేశం ఘోషయాత్రలో దెబ్బలుతిని, ధర్మారాజుచేత విడిపింపబడి, మంచిమాటలు చెప్పించుకుని యుద్ధానికి దూరంగా పోయి గుడారం వేసుకుని ఉన్నవాడి దగ్గరకి, యుద్ధం నుంచి పారిపోయిన కర్ణుడు ఓదారుస్తూ, పాండవులు నీ దేశపౌరులు రాజు కష్టంలో ఉన్నపుడు రక్షించడం వారి విధి,ఎందు తెగ బాధ పడిపోతావంటాడు, అలా వాళ్ళు కాఫిర్లు, వాళ్ళు మేము కష్టంలో ఉంటే చెప్పాల్సిందే, లేకపోతే సింధునదిలో నీటికి బదులు భారతీయుల రక్తం పారుతుందనీ అనగలరు. అటువంటివారితో భారత్ కు వ్యతిరేకంగా ఎన్ని సార్లు అమెరికా అనుకూలంగా ప్రవర్తించలేదు. ఇలా చెప్పుకుంటూపోతే ఇదో పెద్దగాథ. ఏదీ మరచిపోము.
అన్ని దేశాలకంటే చాలా తక్కువ పన్నులతో తప్పించుకున్న సింగపూర్ ప్రధాని మాటాడుతు, ఏమన్నారు, ఇప్పుడు తప్పించుకున్నా,ఏరోజు ఏం జరుగుతుందో చెప్పలేం,కనక మనం మన ఉత్పత్తులకు వేరు,వేరు దేశాలని వెతుక్కోవడం మంచిదని కదా! అంటే పిచ్చివాడి చేతిలో రాయిలా ఉన్నది వ్యవహారం అన్న మాట కాదా? చాలా చిన్నదేశం బుర్కినాఫాసో, బహుశః చాలామందికి పేరుకూడా తెలియకపోవచ్చు,ఆ దేశ ప్రెసిదెంట్ మాట పశ్చిమదేశాలు దేనికైనా లెక్చర్లిస్తాయి,వారు మాత్రం ఆచరించరు. అందరినీ నీచంగా చూస్తారు. అదే ఆసియా దేశాలలో భారత్ వారు మాత్రం విషయాన్ని వివరిస్తారు,సమానదృష్టితో చూస్తారు,సాయం చేస్తారని చెప్పలేదూ! చాలా దేశాలు ఎదురు చెప్పలేక తలవంచుకున్నాయి, అలా మేము చెప్పిన మాట వేద వాక్యం విని తీరాలి,అన్న దానికి బ్రెజిల్ ఎదిరిస్తే 50% పన్నులెయ్యలేదా? జపానుకు 15% సుంకాలు వేసిందెందుకు? ఆ దేశపు మిగులంతా అమెరికాలో పెట్టుబడి పెట్టడమనే షరతు కదా! వచ్చిన లాభంలో కూడా వాటాకావలన్నారుగా! MAGA (make amerikaa great again) ఎలా అవుతుంది? అంటే మరొకరు చెడి అమెరికాను గొప్ప చేయాలా? ఏడూళ్ళు చెడితేగాని ఏడిద కాలేదని మా దగ్గర చిన్న నానుడి చెబుతారు.
సశేషం......
Sunday, 7 September 2025
దాయాదికి కంటిలోనూ పాముకి.......
తలనుండు విషము ఫణికిని
వెలయంగా దోకనుండు వృశ్చికమునకున్
దలదోక యనక యుండును
ఖలునకు నిలువెల్ల విషముగదరా సుమతీ!
దాయాదికి కంటిలోనూ పాముకి పంటిలోనూ విషం.
చవక కొననివ్వదు కరువు తిననివ్వదు.
నలుగురు నడిచే దారిలో గడ్డి మొలవదు.
అత్తచేతపోయినది అడుగోటి కుండ, కోడలు చేతపోయినది కొత్తకుండ.
విగ్రహపుష్టి నైవేద్య నష్టి
Saturday, 6 September 2025
నా నోట్లో నీ వేలు పెట్టు..
నా నోట్లో నీ వేలు పెట్టు..
నా నోట్లో నీ వేలు పెట్టు, నీ కంటిలో నా వేలు పెడతా!
ఇదే కొన్ని గొప్ప దేశాల మాట.
Saturday, 30 August 2025
చికిలింత చిగురు...
చిత్రం: చిరంజీవులు (1956)
గీతరచయిత: మల్లాది
నేపధ్య గానం: ఘంటసాల, పి. లీల
పల్లవి:
హాయ్...
చికిలింత చిగురు సంపంగి గుబురు
చిన దాని మనసు చినదాని మీద మనసూ
చికిలింత చిగురు సంపంగి గుబురు
చిన దాని మనసు చినదాని మీద మనసూ
మనసైన చినదానికి అందానికి...
మనసైన చినదానికి అందానికి...
కనుసైగ మీద మనసు
ఆ..ఆ..ఆ..ఆ..
చరణం 1:
అరె.. చెంపకు చేరడేసి కన్నులున్న చిన్నది
చిన్నదాని సిగలో రేకలెన్నో
గవ్వకన్ను రైక మీద చుక్కలెన్నో
ఎన్నుకో ...
ఎన్నుకో వన్నె లెన్నుకో చిన్నె లెన్నుకో
వన్నెచిన్నె లెన్నుకో ఎన్నికైన చిన్నవాడా
ఆ..
ఆ..
పైర గాలి ఘుమఘుమలో
చెంగావి చెంగు రిమ రిమలో
ఆ..ఆ..ఆ..
చరణం 2:
అరె దిరెసిన పువ్వు మీద చిలుకూ ముగ్గులు
చిన్నదాని బుగ్గ మీద చిలిపి సిగ్గులు
మల్లెల దొంతరలు మరు మల్లె దొంతరలు
మనసే ..
ఆహా..
మనసే మరుమల్లె దొంతర
మన ఊసే విరజాజి దొంతర
పాల వెన్నెలలో ..మురిపాల వెన్నెలలో..
Friday, 29 August 2025
పొరుగింటి పుల్లకూర......
పొరుగింటి పుల్లకూర......
తెనుగు భాషా దినోత్సవ శుభకామనలు.
తెనుగు భాషా దినోత్సవ శుభకామనలు అని సందేశం పంపిందో మనవరాలు తెనుగుపంతులమ్మ. మొన్ననో సారి మాటల్లో గురువుగారు అనడం మొదలెట్టింది,తాతా అనేమాట మోటనుకుందో....ఏం వరస మార్చావన్నా! పెద్ద స్థానం ఇచ్చేనంది,తెలివైనది కదూ,అందుకు.
గురు శబ్దస్యంధకారస్య,రుశబ్దతన్నిరోధకః. ఇదీ గురు శబ్దానికి అర్ధం. గురువు లెక్కడ. నేటి కాలంలో గురువులు లేరు,అంతా టీచర్లే నువ్వు ఏంచేస్తావంటే తెనుగు టీచర్ని అంటున్నారు. కలగలుపైనా పొరుగింటి పుల్లకూర కలుపుకుంటున్నారు.
మొన్న ఒకసారి లోక్ సభలో చర్చలో ఒక ప్రశ్నకు తక్షణం స్పందిoచి, శ్రీ రామ్మోహన్ నాయుడు సమాధానమిస్తూ నేను తెనుగువాడిని, తెనుగు మాటాడగలను,అరవం,మలయాలం,హిందీ మాటాడ్తా! ఏది,నువ్వు తెనుగు మాటాడగలవా? అడిగేటప్పటికి ఆ నాయకుడే కాదు,మొత్తం లోక్ సభ నిశ్శబ్దమైపోయింది. అదీ తెనుగు భాష శక్తి,తెనుగువాడి శక్తి.
నేటి కాలంలో ముద్దొస్తే కిస్స్ పెడుతున్నారు తెనుగువారు. ఇక రాసేటప్పుడు అపశబ్దాలకి లోటే లేదు. ఆపై, ఒత్తులు పొల్లులు పోయాయి,ఇది సెల్ఫోన్ సౌడభ్యం! చిన్న ఆశ తెనుగులో రాయాలనే కోరికతో చేస్తున్నపొరబాటు, ఎంత చెప్పుకుని ఏమి ఉపయోగం. ఇద్దరు తెనుగువాళ్ళు కలిస్తే ఇంగ్లీషులో మాటాడుకుంటున్నారు,మరి తెనుగెక్కడ? వాడుకభాషలో ఇంగ్లీష్ మాటలేక మాటాడలేకపోతున్నారు,తెనుగు పంతుళ్ళూ,పంతులమ్మలూ కూడా!
ఇదేమి పుల్లకూరని మొదలెట్టి ఇలా చెండాడుతున్నవనకండి. మనసులో బాధ (అదే బాద) చెప్పుకుంటున్నానంతే! పుల్లకూర అంటే గోంగూర అని కూడా కొన్ని చోట్ల వాడుక.
పొరుగింటి పుల్లకూర రుచి అనేది ఒక తెనుగు నానుడి.
నిజమే పక్కింటి కూర పుల్లగా రుచిగానే ఉంటుంది. నిత్యం దాన్నే వాడితే అనారోగ్యం చేస్తుంది. అందుచేత పక్కింటి పుల్లకూర అవసరం మటుకు వాడుకోవాలి, భాషతో సహా. కష్టం వచ్చిన ప్రతి సారి అమెరికాను నిషేధించు,చైనాను నిషేధించు అనడం కాదు. జీవితం లో దేనినీ నిషేధించకు,నిషేధించలేవు, ఇదీ సత్యం. ఎంత అవసరమో అంత వాడుకో నీదగ్గర దొరికే వస్తువులని అమ్మీజాన్ లోనూ,జొమొటో లోను ఎందుకు తెప్పించుకోవాలి? నీదైనదాన్ని వదులుకోడమేం? తనది పాలుకిచ్చి తను కూలికి వెళితే బాగోదు. బద్ధకం,కావలసినవాటిని జాబితా రాసుకుని, బజారుకి సంచీ కూడా పట్టుకుపోయి,ఒక్కొకటే కొనుక్కుని రావచ్చు, ఒక శలవురోజు. అబ్బే కాలు కదలదు,బిళ్ళలేసుకుని కూచో! అంటే ఆనందం. ఇందులోనూ మనదైన వైద్యం గచ్చాకు,పుచ్చాకు వైద్యం అంటే వెగటు. నిజం చెప్పాలంటే గచ్చ,పుచ్చ గొప్ప మందులు తెలుసా! తెలుసుకో! బిళ్ళలు చాలు అనుకుoటే మన బతుకింతే. అందుకే రక్త పోటు 120/80 ని 115/70 గా మార్చేసారు,అమెరికా వారు. ఇప్పుడందరూ రక్తపోటు బాధితులే, వేసుకోండి బిళ్ళలు. పొరుగింటి పుల్లకూర రుచి మహాత్మ్యం.
అందరినీ మారు అంటున్నవు, నువ్వు మారచ్చుగా అడగచ్చు. నిజం,మారాలనే ఉంది,మారలేను కారణం జీవిత చరమాంకానికొచ్చేసేను,నేడో,రేపో. ఇప్పుడున్న బాధలు చాలు,మారి కొత్త బాధలు తెచ్చుకోలేను.
గిడుగువారిని మొదటగా తలుచుకోకపోవడం నా తప్పే
Thursday, 28 August 2025
కీలెరిగి ......
కీలెరిగి ......
కూర్చోగలిగితే పడుకోవద్దు.
నిలబడగలిగితే కూచోవద్దు.
నడవగలిగితే నిలబడవద్దు.
పరుగు పెట్టగలిగితే నడవద్దు.
మాటడటం చేతకానప్పుడు మౌనంగా ఉండటమే మంచిది.
నిలబడితే కలబడుతుంది,కలబడితే నిలబడుతుంది లోకం.
అందుచేత ఎప్పుడూ కలబడ్డానికి సిద్ధంగా ఉండు.
ఆబోతులు దెబ్బలాడుకుంటే లేగదూడల కళ్ళు విరుగుతాయి.
యూక్రైన్ కి అనుభవం అయిందనుకుంటా.
కోడలికి బుద్ది చెప్పి అత్త తెడ్డునాకడం అందంగా ఉండదు.
కీలెరిగి వాత పెట్టాలి.
Wednesday, 27 August 2025
నీలాపనింద.
నీలాపనింద.
అందరికి వినాయక చవితి శుభకామనలు
నింద,అపనింద,నీలాపనింద.
ఈ నీలాపనింద నాటికాలంలో శ్రీకృష్ణునికే తప్పలేదు, సత్రాజితుని చంపి శ్యమంతకమణిని దొంగిలించేడని. నేడు భారత్ రష్యానుంచి ఆయిల్ కొంటూ యూక్రైన్ యుద్ధానికి ప్రోది చేస్తోందని అమెరికా ఆపాదించడం,దానికోసం తమ దేశానికి భారత్ నుంచి దిగుమతి అయ్యే సరుకులపై సుంకాలు పెంచుకున్నారు. సుంకాలు ఎవరిమీద వేస్తున్నారు? మీ ప్రజలమీదే! ఆ సుంకం ఎవరికి చేరుతుంది? మీకే! ఇదెలా ఉందంటే అత్తమీద కోపమొచ్చి కూతురు ముడ్డి కుంపట్లో పెట్టుకున్న కోడలు తరహాలో ఉంది. దీని వల్ల ఏమవుతుంది,భారత్ నుంచి దిగుమతి అయిన వస్తువుల రేట్లు పెరుగుతాయి, మీవాళ్ళే కొనడం మానేస్తారు,రేట్లు పెరిగినందుకు ఇబ్బంది పడతారు. మాకూ కొంత నష్టం, కొత్త వినియోగదారులు దొరికే దాకా ఎగుమతులు తగ్గుతాయి. మరో మాట, మనం ఎదుటివాళ్ళను కోపంలో కొడితే అవతలవాడికి ఎంత దెబ్బ తగిలిందో అంత దెబ్బ మన చేతికీ తగులుతుంది.
కోపమున బుద్ధి కొంచమై యుండును. కొనుక్కునేవాడు రూపాయ తక్కువధర ఉన్నచోట కొనుక్కుంటాడు,అమ్ముకునేవాడు రూపాయి ఎక్కువ వచ్చేచోట అమ్ముకుంటాడు, ఇది సార్వజనీన సత్యం.
పెద్దవాళ్ళం అనిపించుకోవాలంటే కోపం తగ్గించుకోవాలి. ఎవరి మీదనో నీలాపనిందవేసి,వారిని ఇబ్బంది పెడుతున్నామనుకుని ఇబ్బంది పడటం తెలివైనవారి పనికాదు.
Monday, 25 August 2025
పదియు, నైదు, నైదు, పదునైదు.....
పదియు, నైదు, నైదు, పదునైదు.....
Thursday, 21 August 2025
ఎవరు వృద్ధులు?
నేడు వృద్ధుల దినోత్సవం
శర్మ కాలక్షేపంకబుర్లు-ఎవరు వృద్ధులు?
చిత్రగ్రీవుడు అనే పావురాల రాజు, ఒక రోజు తన పరివారంతో ఆహారం కోసం బయలుదేరాడు. ఒక అడవి మీదుగా వెళుతుండగా ఒక చోట నూకలు కనిపించాయి. కిందకివాలి నూకలు తిందామనే మాట పుట్టింది ఒకరినుంచి. అలాగే అన్నారు మరికొందరూ అంతలో ఒక వృద్ధుడు ఇది అడవి, ఇక్కడ మానవ సంచారం తక్కువ కనక నూకలు ఉండేందుకు కారణం కనపడదు, కనక దిగవద్దు, ప్రమాదం పొంచి ఉండచ్చు, అనుమానించ తగినదే, అని హెచ్చరిస్తాడు. దీనికి ఒక యువకుడు, ఇలా చెప్పేవన్నీ అనుమానం కబుర్లు, నిరుత్సాహాన్ని కల్పించేవి. ఎదురుగా ఆహారం కనపడుతోంటే మీనమేషాలు లెక్కిస్తూ, ఇది అడవి, ఇది గ్రామం అని ఆలోచించడం తెలివి తక్కువ అని ప్రతివాదం చేస్తాడు. అప్పుడు మరొకరు పెద్దల మాట వినడం మంచిది కదా అంటే ఎవరు వృద్ధులు? ఏండ్లు మీరినవాడా వృద్ధుడు, జ్ఞానం కలిగినవాడే వృద్ధుడని ప్రతివాదం చేసి, మొత్తానికి నూకలకోసం కిందికి దిగుతాయి.
దిగిన వెంటనే నూకలమాట దేవుడెరుగుకాని వల మీద పడి అందులో చిక్కుకుపోయారు. సమస్యలో చిక్కుకున్నారు,ప్రాణాల మీదకే వచ్చింది. ఏం చెయ్యాలనే మాట ముందుకొచ్చింది. వృద్ధుడు సమయం దొరికింది కదా అని పాత విషయం ప్రస్తావించలేదు. పాలుపోని పరిస్థితులలో మరలా వృద్ధుణ్ణే సలహా కోరితే అందరం ఒక్క సారిగా ఎగిరి వలనే ఎత్తుకుపోదామని చెబితే అందరూ కలసి ఒక్క సారి ఎగిరి వలను ఎత్తుకుపోయారు. ఇది చూచిన వేటగాడు నిర్ఘాంతపోయాడు. ఎగిరిన తర్వాత ఏం చెయ్యాలంటే, రాజు తన స్నేహితుడైన ఎలక దగ్గర దిగాలని చెబితే అక్కడకు చేరతారు. మిత్రుణ్ణి బంధనాల్లో చూచిన ఎలుకరాజు వగచి అతని బంధనాలు కొరకడానికి సిద్ధమైతే వాయసరాజు ముందుగా తన పరివారాన్ని బంధాలనుంచి తప్పించి ఆ తరవాత తనను రక్షించమంటాడు. దానికి ఎలక రాజు నువ్వు స్నేహితుడవు కనక నీ బంధనాలు కొరుకుతా తప్పించి మిగిలినవారి సంగతి తరవాత ఆలోచిస్తానంటాడు. దానికి వాయసరాజు ఒప్పుకోక పోతే ఎలుకరాజు అతని సత్యనిష్టకి మెచ్చుకుని,తన పరివారం పట్ల అతనికున్న ప్రేమను కొనియాడి, తన పరివారంతో అందరిని బంధ విముక్తుల్ని చేస్తాడు. ఇది స్థూలంగా మిత్రలాభం లోని కథ, నా స్వంతం మాత్రం కాదు. పొరపాటుగా కొన్ని కల్పించానేమో కూడా , తప్పులు మన్నిమచండి. ఇక ఈ కథని విశ్లేషిస్తే
1.ఏంత రాజయినా పని చేయాల్సిందే. అంటే ఎంత ఆఫీస్ కి బాస్ అయినా తనపని తను చెయ్యాలి, మరొకరి మీద రుద్దెయ్యకూడాదు.
2. ఒక పని చేద్దామనుకున్నపుడు దాని మంచి చెడ్డలు వృద్ధులు సకారణంగా చెప్పినపుడు వినాలి. యువత ఎదిరించడానికే ఎదిరింపులా ఉంటే నష్టపోతారని చెప్పడం.
3.వృద్ధులు ఆపదలో చిక్కుకున్నపుడు ఆలోచన చేసి ఈ కథలో వృద్ధుడు చేసినట్లు అపాయం లేని ఉపాయం చెప్పి ఆదుకోవాలి కాని పాత విషయాలను తవ్విపోయడం మూలంగా నష్టమే ఉంటుందనేది సూచన.
4. ఆపదలో చిక్కుకున్నపుడు చర్చలు కాదని, చెప్పిన పని చేయడమే లక్ష్యంగా ఉండాలని అందరికి సూచన,ప్రత్యేకంగా యువతకి సూచన.. ఇక్కడ ఐకమత్యంతో ఒక్క సారిగా ఎగిరి వలనే ఎత్తుకుపోయే ఆలోచన బ్రహ్మాండమైనదే కదా! యువతే బలం, అలాగే ఐకమత్యమే బలం అని గుర్తించాలి.
5.ఆపద నుంచి గట్టెక్కిన తరవాత బంధనాలు ఛేదించుకోడానికి తగిన వారిని ఎన్నుకోవడం లో రాజు చూపిన ముందు ఆలోచన మెచ్చదగినదే, రాజయినవాడి ఆలోచన అలా ఉండాలి.
6.వాయసరాజు బంధనాలు మొదటగా తప్పిస్తానన్నపుడు ముందుగా తన పరివారాన్ని బంధముక్తుల్ని చేయమనడం రాజు చేయాల్సిన పని అని చెప్పడమే. ఎలుకరాజు అలా చెప్పడం కూడా వాయస రాజు యొక్క గుణాన్ని పరికించడమే, అతని గొప్పనూ ప్రకటించడమే.
7.కథలో యువకుడు ఎవరు వృద్ధులు? ఏండ్లు మీరినవారా వృద్ధులు? అని ప్రశ్నిస్తాడు. సమాధానం తెలుసుకోవలసిన ప్రశ్న ఇది. జ్ఞాన వృద్దులు, వయోవృద్దులు, తపో వృద్ధులని వృద్ధులు మూడు రకాలు. ఇందులో వయో వృద్ధులు ఎక్కువగానూ, జ్ఞానవృద్దులు తక్కువగానూ, తపోవృద్ధులు అరుదుగానూ కనపడతారు.
వయోవృద్ధులు తమ అనుభవాలని కథలుగా చెబుతారు, హెచ్చరికలూ ఇస్తారు, కాని మనమే వినేలా ఉండం, సొల్లు కబుర్లు చెబుతున్నారని ఈసడిస్తాం కూడా. వారుపోయిన తరవాత చేతులు కాలిన తరవాత ఆకులు పట్టుకున్నట్టు అయ్యో! ఈ సమయంలో ముసలాయనుండి ఉంటే మంచి సలహా చెప్పేవాడు కదూ అనిపిస్తుంది.
జ్ఞానవృద్ధులు కొద్దిమందే ఉంటారు.సాధారణంగా మనం అడిగితే కాని ఏదీ చెప్పరు. కొంతమంది చెప్పడానికి సాహసించినా వినేలా లేదు లోకం, వీరికి వయసుతో సంబంధం లేదు, ఇది వీరికి పెద్ద ఇబ్బంది, ఇతరులు గుర్తించలేకపోవడానికి కారణం. వీరిని గుర్తిస్తే నిజంగా అద్భుతాలు సాధించవచ్చు, కాని గుర్తించలేము.
ఇహపోతే తపోవృద్ధులు అరుదుగాఉంటారు. వీరిని గుర్తించడం చాలా కష్టం, వీరికీ వయసుతో సంబంధంలేదు. వీరిని గుర్తించి అనుసరించగలిగితే అదో బ్రహ్మానందం. వీరికి ప్రచారాలు గిట్టవు కనక గుర్తింపూ ఉండదు.
అందుచేత ముందుగా వయో వృద్ధుల అనుభవాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తే, చరిత్ర చదువుకుంటే యువ సుఖపడుతుంది. ప్రతి విషయానికి వాదనకు దిగితే, కయ్యానికి దిగితే జీవితం కుక్కలు చింపిన విస్తరేనన్నది యువత గుర్తించాలి.
కథ చిన్నదే కాని ఎన్ని విషయాలు దాగున్నాయో చూడండి.
పెళ్ళి భోజనాలు - వడియాలు
పెళ్ళి భోజనాలు - వడియాలు
పెళ్ళిలో భోజనాలంటే ఒక యజ్ఞం లా వుండేది, సరదాగానూ వుండేది. భోజనాలకి పిలుపుల దగ్గరనుంచి భోజనాలు కార్యక్రమం పూర్తి కావడం ఒక పెద్ద వేడుక. ఐదు రోజుల పెళ్ళిలో చెప్పేదే ముంది, పూట పూటా సంబరమే. పెద్ద పెద్ద మండువా లోగిళ్ళుండేవి. మండువా లో ఒక పక్క ఆకులేస్తే ఒక పాతిక మందికి భోజనానికి సరిపడేది. ఇలా నాలుగు పక్కల వేస్తే దగ్గరగా వొక వంద మంది ఒక సారి భోజనం చేయడానికి వీలుండేది. ఇలా వీలు లేక పోతే దొడ్డిలో ఒక పెద్ద పందిరి వేసి దానిని గదులుగా కట్టి గాలి వెలుతురు కోసం మనిషి పై ఎత్తు నుంచి ఖాళీగా వదిలేసే వారు. అలా కట్టిన వాటిలో నేల చదును చేసి కళ్ళాపు జల్లి అలికిన మట్టి ఇంటిలా తయారు చేసేవారు. భోజనాలకి కూచోడానికి ఈతాకు గాని, తాటాకు చాపలు గాని వేసేవారు. కింద కూచుని భోజనం చేసేవారు. సాధారణంగా అరటి ఆకులు వుపయోగించే వారు. అత్యవసర పరిస్థితులలో అడ్డాకులు వాడేవారు. ఇక్కడ కూడా ఒకసారి వంద మంది పైగా ఒక సారి భోజనాలు చేసేందుకు సావకాశం ఉండేది. పంక్తులుగా ఆకులేసి, అందరూ కూచున్న తరవాత వడ్డన ప్రారంభించేవారు. భోజనానికి, వడ్డనకి ఒక క్రమం ఉంది. నేటి ప్రోటోకోల్ లాగా, ముందు పప్పు, కూరలు, పచ్చళ్ళు, వూరగాయ, పిండి వంటలు అన్నీ అయిన తరవాత అన్నం పెట్టేవారు. వడ్డన ప్రారంభించిన వెంటనే పెట్టినవి తినెయ్య కూడదు. అందరూ ఒక సారి తినడం మొదలు పెట్టాలి. వడ్డన అంతా పూర్తి అయినతరవాత గోవింద నామ స్మరణతో భోజనం ప్రారభమయ్యేది. అసలు సిసలు వడ్డన ఆ తరవాత ప్రారంభ మయ్యేది, తినడం ప్రారంభించిన తరవాత. యువకులు యువతులు వడ్డన చేసేవారు. పంచ కట్టి ఆపైన తువాలు మొలకి గట్టిగా బిగించే వారు యువకులు. యువతులు పమిట పూర్తిగా వేసుకుని ఆ కొంగు మొలలో దోపుకును వడ్డనకి ఉపక్రమించే వారు. వడ్డన సామానుల పేర్లే మరిచి పోతున్నారు ఇప్పుడు. పులుసు వడ్డించడానికి వాడే పాత్రని గోకర్ణం అనేవారు. మొదటిది పప్పు, ఇది పట్టుకుని ఒకరు, నెయ్యి పట్టుకుని ఒకరూ బయలుదేరేవారు. పప్పు వేసే అతను పప్పండి, మీకండి, పప్పండి, పప్పండి, పప్పండి అని వడిగా అంటు కదిలే వాడు. వెనకాల వచ్చే నెయ్యి తెచ్చినతను నెయ్యండి, నెయ్యండి, నెయ్యండి అంటూ వేసుకుంటూ వెళ్ళేవాడు. ఈ మాటలు గబ గబా అంటే మరొక అర్ధం స్ఫురిస్తుంది. అని చూడండి. ఆ తరవాతది కూర. కూర తెచ్చినతను కూరండి, కూరండి, కూరండి అంటూ కావలసిన వాళ్ళకి వేసుకుంటూ వెళ్ళేవాడు. మధ్యలో అన్నం బుట్ట పట్టుకుని ఒకరు వచ్చేవారు. వేడి అన్నం తాటాకు బుట్టలో పెట్టుకుని, బుట్ట చేతిమీద పెట్టుకుని, కాలకుండా బుట్ట కింద అరటాకు వేసుకుని ఒక హస్తంలాటి దానితో అన్నం వడ్డించేవారు. వీరు అన్న మండి తో ప్రారంభించి, మీ కన్న మండి, మీ కన్న మండి, మీ కన్న మండి అంటూ సాగిపోయేవారు. మీకు + అన్న మండి = మీ కన్న మండి అయిపోయింది. ఈ మాటలన్నీ వడిగా అంటేనే ఆ అందం అర్ధం స్ఫురిస్తాయి. పప్పుతో పులుసు వడ్డించేవారు. ఈ పులుసుని పులుసండి నుంచి పులసండి, పులసండి అనుకుంటూ వెళ్ళేవారు. పులసండి కి అర్ధం పులవమని. ఈ మాటలని కొంతమంది యువకులు ఆట పట్టించడానికి కూడా వాడే వారు, గబగబా అంటూ. పప్పుతో కాకుండా పులుసు వేరేగా కలుపుకుని తినేవారు. అప్పుడు నంజుడుకి వుండటానికి వడియాలు, అప్పడాలు వేసేవారు. ఒక కొంటె యువకుడు పంక్తిలో ఒక తాతగారి దగ్గరకెళ్ళి తాతగారు వడియాలు కావాలా అని అడిగేవాడు. ఆయన కావాలంటే ఒక పెద్ద కేక వేసేవాడు, ఒరేయ్ సుబ్బన్నా, ఇక్కడ తాతగారికి వడియాలు కావాలి పట్రా అని. అంటే తాత గారికి పడుచు పెళ్ళాం కావాలంటు న్నాడురా అని ఎద్దేవా అన్న మాట. నిజంగా ఇందులో పైకి ఏ విచిత్రమూ లేదు కాని అసలు కొంటె తనం వుంది. తాతగారు కొద్ది ఘటికుడైతే మరొకలా సాగేది. కావాలని వడియాలు తెచ్చిన తరవాత ఇదేమిటి ఇవి తెచ్చేవూ అనేవాడు. మీరేగా వడియాలు కావలన్నారని అనేవాడు, యువకుడు. అప్పుడు తాతగారు ఒర్నీ, వడియాలంటె పడుచు పెళ్ళాన్ని తెస్తావనుకున్నారా అనేవాడు. మరోలా కూడా సాగేది. ఏమిటీ అన్నారూ అనేవాడు, ముసలాయన. వడియాలు కావాలా అని మళ్ళి అడిగేవాడు, యువకుడు. ఈ తాతగారు ఘటికుడు కనక వడియాలు నాకెందుకూ అనేవాడే కాని వద్దనేవాడు కాదు. తాతా, పెళ్ళి చేసుకుంటావా అంటే పిల్లనిచ్చేవాడెవడురా, అనే వారు కాని వద్దనేవారు కాదు. అది ఒక సరదా. వడియాలు నేనేమి చేసుకోనూ అనేవాడు. అంటే నమలడానికి పళ్ళు లేవనీ అర్ధం, పడుచు పెళ్ళాంని నేనేమి చేసుకోనూ అని కూడా అర్ధం వచ్చేది. పోనీ అప్పడాలు కావాలా అంటే, అప్పడాలు ఇప్పటిదాకా నాదగ్గరే వుండాలి, ఎక్కడుందో చూడునాయనా అనేవాడు. ఒకవేళ భార్య పక్కనుంటే అప్పడాలు పక్కనే వుందిగా అనేవాడు. ఇప్పుడు అర్ధమైనదనుకుంటాను, అప్పడాలు (అప్పటి+ ఆలు = అప్పటాలు, అప్పటియాలు, అప్పడాలు అనగా పాత భార్య) వడియాలు అనగా (వడి + ఆలు = వడియాలు వడి అనగా వేగం, విసురు అని అర్ధాలు, అనగా పడుచు భార్య). ఒక్క మంచి నీళ్ళు పోసేవారు మాత్రమే మాట్లాడకుండా ఖాళీ గ్లాసు ల్లో మంచి నీళ్ళు పోసేవారు. ఇక చివరిది పెరుగు, పెరుగు తెచ్చిన వారు పెరుగండి నుంచి పెరగండి నుంచి వడిగా అనడం లో జరగండి దాకా వెళ్ళిపోయింది. అంటే ఇక తిన్నది చాలు లేవండి అన్నట్లుగా. భోజనాల దగ్గర నుంచి అంతా ఒక సారి లేచే వారు, గోవింద నామ స్మరణ చేస్తూ. పంక్తి లో ఎవరేనా తినడంలో వెనక పడితే వారి కోసం అందరూ వారి భొజనం పూర్తి అయ్యే దాకా కూచుని వుండేవారు. ఇది వారి పట్ల చూపే గౌరవం. మన వాళ్ళు భోజనాల లో కూడా ఇలా సరదా చూపే వారు. అలా సందడి సందడి గా భోజనాలు ముగిసేవి. ఇప్పుడు ప్లేట్లు పట్టుకుని క్యూలో నుంచుని కావల్సినవి వేసుకుని, వేయించుకుని కొండొకచో ఒంటి కాలిమీద నిలబడి, ఎక్కడో ఒకచోట కూచుని భోజనం కానిచ్చేస్తున్నాం. మాధాకవళం బ్రతుకులై పోయాయని ఒక పెద్దాయన వాపోవడం విన్నాను. అందం, హాస్యం చచ్చిపోయాయి.
Courtesy: whats app 🤣
******
పదునాలుగేళ్ళ తరవాత నేను వ్రాసినది what's app లో తిరిగి నాకే వచ్చింది, 30.11.2011 నాటిది
శర్మ కాలక్షేపం కబుర్లు-పెళ్ళిభోజనాలు-వడియాలు
Wednesday, 20 August 2025
మనసున మనసై.....
మనసున మనసై.....
మనసున మనసై బతుకున బతుకై
తోడొకరుందిన అదే భాగ్యము అదే స్వర్గము
సినీకవి మాట నూటికి నూరుపాళ్లు నిజం.
మనసున మనసై దగ్గరగా అరవై ఏళ్ళు కలిసి బతికి, ఏడేళ్ల క్రితం ఇహలోక యాత్ర చాలించిన ఇల్లాలు జ్ఞాపకాలు మిగిల్చి దివి కేవినది, ఈ రోజు. నాటి నుంచి మనసు లేని రాయిలా బతికేస్తున్నాను,ఎందుకో తెలీదు.
ఏటిలోని కెరటాలు ఏరు విడిచిపోవు
ఎదలోపలి మమకారం ఎక్కడికీ పోదు
ఊరు,విడచి వాడ విడచి ఎంతదూరమేగినా
ఐనవారు అంతరాన ఉందురోయ్!
Tuesday, 19 August 2025
ఎర్ర డబ్బా
ఎర్రడబ్బ మళ్ళీ నెల 1 నుంచి కనుమరుగవుతోందని వాట్స్ అప్ మిత్రులంతా బాధపడుతున్నారు. ఉపయోగంలో లేనిది ఏదైనా నశిస్తుందని అందరికీ తెలిసిందే. మనమే పేపర్ లెస్,పేపర్ లెస్ అని వాడడం మానేశాం,ఎర్రడబ్బ చరిత్రలో కలిసిపోతుంది.
Monday, 18 August 2025
అల్లి పళ్ళు
అల్లి పళ్ళు
Sunday, 17 August 2025
వీధి కుక్కల సమస్య-ఒక పరిష్కారం.
వీధి కుక్కల సమస్య-ఒక పరిష్కారం.
మానవులు పశువులతో సహజీవనం చేయడం ఈ వేళ కొత్తమాటేం కాదు, వాటిని ప్రేమగా సాకడం కూడా కొత్తమాట కాదు.
నాకు తోచిన మటుకు సమస్యకి పరిష్కారం ఆలోచిద్దాం. కుక్కలు,డేగలు,పావురాలు,కోతులు ఇలా అన్ని జంతువులూ దేశరక్షణలో పని చేస్తాయంటే నమ్మలేరు. హక్కుల సంఘాలవారు సమస్య ప్రభుత్వం మెడకి వెయ్యాలనే తాపత్రయం తప్పించి దానిని పరిష్కరి0చాలని అనుకోవు, కారణాలనేకం. పెటా లాటి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.
దేశీ గాడిదలకి విదేశాల్లో మంచి గిరాకీ ఉంది. మనగాడిదలు జపాన్ గాడిదల తరవాత లెక్కలో కొస్తాయి. పాకిస్తాన్ గాడిదలు కూడా మన దేశగాడిదలతో పోటీ పడతాయి. గాడిదలు పెంచి ఎగుమతి చేసి డబ్బులు సంపాదించుకోవచ్చు.
కుక్కలు దేశరక్షణలో పాలు పంచుకుంటాయన్నది జగమెరిగిన సత్యం. విదేశీ కుక్కలే కాదు, మన కుక్కలు కూడా ఇందుకు తీసిపోవు. ఐతే వాటికి శిక్షణ ఇచ్చి తీర్చి దిద్దాలి. రక్షణ రంగం ఈ పని కొంత చేస్తుంది, కాని ప్రైవేట్ రంగం దీని పైన శ్రద్ధ వహిస్తే బాగుంటుంది. ప్రభుత్వం వీటి గురించి శిక్షణ సంస్థలు నెలకొల్పితే జరిగేదేంటో తెలియనిదేంకాదు. నిజమైన జంతు ప్రేమ ఉన్న సంస్థలకి ప్రోత్సాహం ఇచ్చి ఇలా కుక్కలను వినియోగించుకోవచ్చు.
గద్దలు,డేగలు ఇప్పటికే రక్షణ రంగంలో ఉన్నాయి. అంతే కాదు విమానాశ్రయాలలో పక్షుల బెడద లేకుండా చేయడానికి డేగలు,గద్దలని ఉపయోగిస్తున్నారు. పావురాలు రక్షణ రంగంలో పని చేయడం నేడు కొత్త విషయమూ కాదు. నాకు తెలిసి కోతులను కూడా రక్షణ రంగంలో వినియోగించచ్చు అనుకుంటాను. ఇలా దేశీయ వనరులను వినియోగించుకున్నపుడే మనం సమస్యలని అధిగమించగలం. పెటా లాటి సంస్థలని దేశం నుంచి తరిమెయ్యచ్చు. హక్కుల సంఘాల వారు పాపం నిరుద్యోగులైపోతారు. పేరెన్నికగన్న లాయర్ల నోటి దగ్గర కూడు పడిపోతుంది 🤣
Saturday, 16 August 2025
వీధి కుక్కలు
వీధి కుక్కలు
సుప్రీం కోర్టు ఒక్కసారి ఉలిక్కిపడి,వీధి కుక్కల్ని సురక్షిత స్థానాలకు తరలించి,ప్రజల్ని కాపాడమని ఢిల్లీ అధికారులను ఆదేశించింది. దీనిని అమలు చేసేటపుడు ఎవరైనా అడ్డుపడితే అది కోర్టు ధిక్కరణ అవుతుందని చెప్పింది. ఏం జరగబోతోంది, చూడాలి.
కుక్కలకు స్వేచ్ఛగా జీవించే హక్కులేదా? ఇలా కుక్కల్ని జైళ్ళలో వేసి చంపేస్తారా అని కుక్కల హక్కుల సంఘాలవారు సుప్రీం కోర్ట్ మీద దండయాత్ర చేసినంత పని చేసారు. దాంతో ప్రధాన న్యాయమూర్తి కలగజేసుకుని కుక్కల హక్కులు మిగతా విషయాల గురించి విచారించడానికి ముగ్గురు న్యాయ మూర్తుల బెంచీని ఏర్పాటు చేసారు. హక్కుల సంఘాలవారికి పెద్దపెద్ద లాయర్లను పెట్టుకోడానికి డబ్బులెక్కడినుంచి వస్తాయో తెలీదు. ఈ ముగ్గురు న్యాయమూర్తులు తేలుస్తారో మొత్తం ఫుల్ కోర్ట్ సమావేశం కోరతారో వేచి చూడాలి. ఫుల్ కోర్ట్ సమావేశం జరిగినా ఆశ్చర్య పడక్కరలేదు. వేచి చూదాం! కుక్క కరిస్తే ఒకడేకదా చచ్చేది దీనికింత రాద్ధాంతం అవసరమా అనే వారే కనపడుతున్నారు.
మానవులకేనా భూమి మీద బతికే సావకాశం? కుక్కలకి ఇతర జంతువులకీ సమానంగా బతికే హక్కు లేదా? కొన్ని జంతువులు అడవుల్లోనే ఎందుకుండాలి? అవీ మనతో పాటు ఉండచ్చుగా! హక్కుల సంఘాలవారు పెంచూకోనూ వచ్చు. పులలను సింహాలను అరబ్ దేశాలలో పెంచుకోడం లేదూ? మానవులదేముంది లెండి,ఈ వేళ ఉంటారు,రేపు పోతారు. మా జంతు రాజ్యం పరిపాలనకోస్తే ఎట్టుంటదో తెలుసా! అంతా సమానం ఎవరికి కావలసినది వారు వేటాడుకుని నచ్చినదాన్ని తినెయ్యచ్చు. జంతు రాజ్యం జిందాబాద్!
Friday, 15 August 2025
నాకూ సొతంత్రం వచ్చింది.
నాకూ సొతంత్రం వచ్చింది.
***
నాకూ సొతంత్రం వచ్చింది.
🤣🤣🤣🤣🤣
ఎందుకంత పడి,పడి నవ్వుతావు?
నీకు సొతంత్రమొచ్చిందా? ఎలా బాబూ!
నా చెయ్యి,నా కాలు,నా నోరు,నా చెవి, నా ముక్కు అంటున్నావుకదా! ఇవే కర్మేంద్రియాలూ,జ్ఞానేంద్రియాలూ కదూ!
అవును అనుమానమేంటీ?
నిజం కదూ! 🤣🤣🤣
అదేమిమాటా?
నీవి అనుకుంటున్నవన్నీ నీ అధీనంలో లేవు. నీ మనసు అధీనంలో ఉన్నాయి. అవునుకదా!
నీ మనసు నీ అధీనంలో లేదు. నువ్వు నీ మనసు అధీనంలో ఉన్నావు. నీకు సొతంత్ర ఎక్కడా? మనసు సంకెళ్ళనుంచి బయటపడు,అప్పుడూ నీకు సొతంత్రమొచ్చినట్టు.
మనసు బానిసత్వం నుంచి సొతంత్రం పొందు.
*****
మనసు బానిసత్వం నుంచి బయటపడిన వారందరికి సొతంత్ర దిన శుభకామనలు.
Wednesday, 30 July 2025
లా వొక్కింతయు/ లావొక్కింతయు
లా వొక్కింతయు/ లావొక్కింతయు
లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె ప్రాణంబుల్
ఠావుల్ దప్పెను మూర్ఛ వచ్చె తనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్
రావే యీశ్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా!