టైగర్ అభీబీ జిందాహై అనే తప్పనిసరి తద్దినం.
టైగర్ జిందా అని ఎలా తెలుస్తుంది? దానికి మార్గాలే కింద చెప్పినవి.
తత్+దినం= తద్దినం అనగా ఆరోజు. ఏదారోజు? అదే జీవించియున్నట్టు సమర్పించే Digital life certificate ఇచ్చే రోజు . ఇది సంవత్సరానికో సారి ఇవ్వాలి.
ఒకప్పుడు బతికున్నట్టు ఇద్దరు గజిటెడ్ ఆఫీసర్ల ధృవీకరణతో సర్టిఫికట్ సమర్పించవలసివచ్చేది. కాలంలో ఎవరిమటుకువారు జీవించియున్నట్టు డిక్లరేషన్ ఇస్తే సరిపోయేది. ఇది సమయంలో ఇవ్వలేకపోతే పెన్షన్ ఆపేసేవారు. ఆ తరవాత ఇచ్చినా చేరిందో లేదోతెలీదు,చేరినా దాన్ని చూసి ఇవ్వవలసిన పింఛను ఎప్పటికో వచ్చేదో,ఏమో. ఇలా కాలంగడచిపోతోంది. కాలం ఆగదుగా, మార్పుల్ని వేగంగా తెచ్చి, ఈ పింఛను ఇవ్వడం ఏకీకృతంచేసి పెట్టేరు.
ఈ సర్టిఫికట్ కూడా ఇవ్వడం తేలిక చేసేరు. ఇలా సర్టిఫికట్ ఇవ్వాల్సిన తేదీ గతనెలాఖరు,30.9.25. ఆ నెలలో ఇస్తే మళ్ళీ సంవత్సరానికి ముందు సంవత్సరంకూడా ఆ నెలాఖరుకే ఇవ్వాల్సివస్తుంది. ఒకనెల పొడిగిద్దాం, అని ఆగి అక్టోబర్ నెల ఒకటో తేదీని పొస్ట్ మన్ ని రమ్మన్నాను. పాపం అనుకున్నట్టే వచ్చేడు, వివరాలిచ్చేను,తీరా చూస్తే అతని సెల్ లో సాఫ్ట్ వేర్ అప్డేట్ కాలేదు, మళ్ళీ వస్తానన్నాడు. ఎప్పుడు అంటే పదిరోజులు పట్టచ్చు అన్నాడు. ఇదేమిరా? ఏం చేయాలో అర్ధం కాలేదు. SAMPPAN ఆఫీస్ నుంచి అప్పటికే మూడు సార్లు హెచ్చరికలు SMS లు వచ్చి ఉన్నాయి. రెండు గతనెలలో,ఒకటి ఈ నెలలో. మీరు సర్టిఫికట్ ఈ నెల 15 లోగా ఇవ్వలేకపోతే పింఛను ఆపుచేయక తప్పదు, అన్నది సారాంశం. ఒక మిత్రుడిని అడిగా,ఓస్ అదెంతపని చేయించేస్తాగా అన్నాడు.
మరుసటి రోజొచ్చేడు మద్యాహ్నం 12 కి. అప్పటిదాకా మబ్బుగా ఉన్నది అప్పుడే తెర తీసింది ఎండ,భాస్కరుడు నిన్ను చూసి చాలా కాలమయిందిరా అని బయటికొచ్చేడనుకుని,ముందుకు కదిలేను. మిత్రుడు ఈ సేవ దగ్గరాగేడు,ఇక్కడ పనవుతుందా అడిగా,ఓ అన్నాడు. లోపలికెళ్ళి వివరం చెబితే కూచోండని వివరాలడిగాడు,మూడే మూడు,చెప్పేను. రెండు సార్లు నా ఫోన్ కి వచ్చిన ఓటిపిలు అడిగాడు చూపించా. అంతే నా బొమ్మ తెరమీకొచ్చింది,వేలిముద్ర వేయించేడు. పనయిపోయిందని ఒక సర్టిఫికటు చేతికిచ్చేడు. పనయిందిగదా అనుకుని పేపర్ చేత్తో పుచ్చుకొచ్చేను. సాయంత్రం దాని కాపీ ఎ.ఓ గారికి మెయిలిచ్చేను.
మర్నాడు నా పోర్టల్ లో తారీకు మారిందా? చూసాను. కాలేదు. టైం పట్టచ్చులే అనుకుని మళ్ళీ పదకొండుకు చూసాను. అంతే నాDLC చేరిన రుజువుగా నా DLC ఇవ్వవలసిన తారీకు 30.9.26 గా మారిపోయింది. అమ్మయ్యా! అనుకున్నా. కాని అనుమానం పీకింది,డబ్బులొస్తాయా? నెలచివరొచ్చేసింది నాలుగురోజుల ముందే మీ పెన్షన్ మీ అక్కౌంటుకు జమచేసేమని SMS వచ్చింది. ఆ! ఎంత తేలికయింది అనుకున్నా! SAMPANN మొదలు పెట్టేటప్పుడు ఇది పని చేస్తుందా అని అనుమానం పీకింది. కాని నేడు నా పర్సనల్ పోర్టల్ లో నాకు రావలసిన సొమ్ము వివరంగా,దాని నుంచి తగ్గించినవీ మరీ వివరంగా ఉన్నాయి,లైఫ్ సర్టిఫికట్ ఇవ్వవలసిన తేదీ ఉంటుంది. ఇబ్బందులు తగ్గేయి!
టైగర్ జిందా హై అనుకుంటే సరిపోదు, టైగర్ అభీభీ జిందా హై అని తెలియాలిగా అందుకు ఈ తప్పనిసరి తద్దినం. ఎందుకింత గోల? అదీ కొచ్చను. తల్లికడుపులో పడింది మొదలు కట్టెల మీద పెట్టేందుకు,ఆ తరవాతా కూడా సొమ్ములు అవసరమే! ఇరుసున కందెన బెట్టక పరమేశుని బండియైనా బారదు సుమతీ, అంచేత ఎవరైనా సొమ్ములు కావలసిందే!!!!
డ్యూ తేదీ లోగా బిల్లు కట్టకుంటే ఖబడ్దార్ మీ ల్యాండు లైన్ ఫోన్ కట్ రోజులు గుర్తొచ్చేయా లేదాండి తాతగారు :) కర్మా రిపీట్స్ :)
ReplyDeleteZilebi4 November 2025 at 09:49
ReplyDeleteచట్టానికి రూల్ కి చుట్టాలుండరు. అమలుచేసేవాళ్ళకి,చేయవలసినవాళ్ళకే ఉంటారు 🤣 ఎప్పుడూ అమలుచేసేవాళ్ళలో ఉండాలనుకుంటావు. నేను చట్టానికి లోబడి ఉండాలనుకుంటా. అదీ తిరకాసు.